22. ఇరువది రెండవ అధ్యాయము
సౌభ వధ - కృష్ణాదులు తమ నగరములకు వెడలుట.
వాసుదేవ ఉవాచ
తతోఽహం భరతశ్రేష్ఠ ప్రగృహ్య రుచిరం ధనుః ।
శరైరపాతయం సౌభాత్ శిరాంసి విబుధద్విషామ్ ॥ 1
వాసుదేవుడిలా అన్నాడు -
భరతశ్రేష్ఠా! తరువాత నేను నా శ్రేష్ఠమైన ధనువును తీసికొని, బాభాలతో రాక్షసుల తలలను సౌభం నుండి పడగొట్టాను. (1)
శరాంశ్చాశీవిషాకారాన్ ఊర్ధ్వగాంస్తిగ్మతేజసః ।
ప్రైషయం శాల్వరాజాయ శార్ ఙ్గముక్తాన్ సువాససః ॥ 2
నా శార్ ఙ్గధనువు నుండి సర్పాల వంటి ఆకారంతో పైకి వెళ్ళే సూర్యకిరణాల వంటి బాణాలను శాల్వునిపై ప్రయోగించాను. (2)
తతో నాదృశ్యత తదా సౌభం కురుకులోద్వహ ।
అంతర్హితం మాయయాభూత్ తతోఽహం విస్మితోఽభవమ్ ॥ 3
కురుకుల శ్రేష్ఠా! అపుడు సౌభవిమానం మాయచేత కప్పబడి, కనబడలేదు. నేను ఆశ్చర్యపోయాను. (3)
అథ దానవసంఘాస్తే వికృతాననమూర్ధజాః ।
ఉదక్రోశన్ మహారాజ విష్ఠితే మయి భారత ॥ 4
మహారాజా! భారతా! నేను నిశ్చలంగా ఉండగా, వికృతాలైన ముఖాలు, కేశాలు గల ఆ దానవ సంఘాలు గట్టిగా అరిచాయి. (4)
తతోఽస్త్రం శబ్దసాహం వై త్వరమాణో మహారణే ।
అయోజయం తద్వధాయ తతః శబ్ద ఉపారమత్ ॥ 5
అపుడు వారిని చంపటం కోసం ఆ మహాసంగ్రామంలో వెను వెంటనే శబ్దవేధి అయిన బాణాన్ని సంధించాను. దాన్ని చూసి వారు శబ్దం చేయక శాంతించారు. (5)
హతాస్తే దానవాః సర్వే యైః స శబ్ద ఉదీరితః ।
శరైరాదిత్యసంకాశైః జ్వలితైః శబ్దసాధనైః ॥ 6
సూర్యునిలా ప్రకాశిస్తూ, మండుతున్న, శబ్ద వేధులైన ఆ బాణాలచేత ఇంతకు ముందు శబ్దం చేసిన ఆ రాక్షసులందరూ మరణించారు. (6)
తస్మిన్నుపరతే శబ్దే పునరేవాన్యతోఽభవత్ ।
శబ్దోఽపరో మహారాజ తత్రాపి ప్రాహరం శరైః ॥ 7
మహారాజా! ఆ శబ్దం శాంతించగానే, మరల మరొక వైపున శబ్దం వచ్చింది. దానిపై మరల అటువంటి బాణాలనే ప్రయోగించాను. (7)
ఏవం దశ దిశః సర్వాః తిర్యగూర్ధ్వం చ భారత ।
నాదయామాసురసురాః తే చాపి నిహతా మయా ॥ 8
ఈ విధంగా పది దిక్కులయందు క్రింద, మీద అంతటా ఆ అసురులు శబ్దం చేశారు. వారందరినీ నేను చంపాను. (8)
తతః ప్రాగ్జ్యోతిషం గత్వా పునరేవ వ్యదృశ్యత ।
సౌభం కామగమం వీర మోహయన్మమ చక్షుషీ ॥ 9
ఆ తరువాత స్వేచ్ఛాగమనం గల ఆ సౌభవిమానం ప్రాగ్జ్యోతిషపురానికి సమీపంలో నా కళ్ళకు భ్రమను కలిగిస్తూ కనబడింది. (9)
తతో లోకాంతకరణః దానవో దారుణాకృతిః ।
శిలావర్షేణ మహతా సహసా మాం సమావృణోత్ ॥ 10
అనంతరం లోకవినాశకుడు, భయంకరమైన ఆకారం కల ఆ శాల్వుడు హఠాత్తుగా పెద్ద రాళ్లవర్షంతో నన్ను ఆక్రమించాడు. (10)
సోఽహం పర్వతవర్షేణ వధ్యమానః పునః పునః ।
వల్మీక ఇవ రాజేంద్ర పర్వతోపచితోఽభవమ్ ॥ 11
రాజేంద్ర! శిలావర్షం చేత కొట్టబడుతూ నేను పర్వతాలచేత కప్పబడిన వల్మీకం వలె ఉన్నాను. (11)
తతోఽహం పర్వతచితః సహయః సహసారథిః ।
అప్రఖ్యాతిమియాం రాజన్ సర్వతః పర్వతైశ్చితః ॥ 12
రాజా! అపుడు పర్వతాల చేత కప్పబడి గుర్రాలతో, సారథితో పాటుగా ఉన్న నేను ఎవరికీ కనబడలేదు. (12)
తతో వృష్ణిప్రవీరా యే మమాసన్ సైనికాస్తదా ।
తే భయార్తా దిశః సర్వే సహసా విప్రదుద్రువుః ॥ 13
అపుడు నావెంట ఉన్న వృష్ణివంశీయులైన వీరులు, సైనికులు భయకంపితులై కంగారుతో అన్ని దిక్కులకు పరుగులెత్తారు. (13)
తతో హాహాకృతమభూత్ సర్వం కిల విశాంపతే ।
ద్యౌశ్చ భూమిశ్చ ఖం చైవాదృశ్యమానే తథా మయి ॥ 14
నరేశా! భూమ్యాకాశాలలో, స్వర్గంలోను కూడ నేను కనబడక పోవడం వల్ల అంతటా హాహాకారాలు చెలరేగాయి. (14)
తతో విషణ్ణమనసః మమ రాజన్ సుహృజ్జనాః ।
రురుదుశ్చుక్రుశుశ్చైవ దుఃఖశోకసమన్వితాః ॥ 15
రాజా! అపుడు నా స్నేహితులంతా ఖిన్న మనస్కులై దుఃఖంతో శోకంతో రోదించారు. ఆక్రోశించారు. (15)
ద్విషతాం చ ప్రహర్షోఽభూద్ ఆర్తిశ్చాద్విషతామపి ।
ఏవం విజితవాన్ వీర పశ్చాదశ్రౌషమచ్యుత ॥ 16
అపుడు శత్రువులకు ఆనందం కలిగింది. మిత్రులకు దుఃఖం కలిగింది. వీరవరా! ఈ విధంగా శాల్వుడు నాపై విజయం పొందాడు. ఈ విషయం నేను స్పృహ కలిగాక సారథి ద్వారా విన్నాను. (16)
తతోఽహమింద్రదయితం సర్వపాషాణభేదనమ్ ।
వజ్రముద్యమ్య తాన్ సర్వాన్ పర్వతాన్ సమశాతయమ్ ॥ 17
ఆ తరువాత నేను అన్ని షాషాణాలను చీల్చగలిగిన వజ్రాయుధాన్ని గైకొని, నాపై ఉన్న పర్వతాలన్నింటిని ముక్కలు ముక్కలు చేశాను. (17)
తతః పర్వతభారార్తాః మందప్రాణవిచేష్ఠితాః ।
హయా మమ మహారాజ వేపమానా ఇవాభవన్ ॥ 18
అపుడు ఱాతిముక్కల భారానికి బాధపడిన నాగుర్రాలు ప్రాణావశిష్టాలై చేష్టలుడిగి కంపించసాగాయి. (18)
మేఘజాలమివాకాశే విదార్యాభ్యుదితం రవిమ్ ।
దృష్ట్వా మాం బాంధవాః సర్వే హర్షమాహారయన్ పునః ॥ 19
ఆకాశంలో ఆవరించిన మేఘసముదాయాన్ని చీల్చుకొని బయటపడిన సూర్యునిలా, శిలలపుట్టలో నుండి బయటపడ్డ నన్ను చూసి బంధువులంతా ఆనందించారు. (19)
తతః పర్వతభారార్తాన్ మందప్రాణవిచేష్ఠితాన్ ।
హయాన్ సందృశ్య మాం సూతః ప్రాహ తాత్కాలికం వచః ॥ 20
ఆ తరువాత పర్వతాలభారంతో బాధపడి, చేష్టలుడిగి అల్పప్రాణావశిష్టాలైన గుర్రాలను చూసి సూతుడు నాతో సమయోచితమైన మాటను చెప్పాడు. (20)
సాధు సంపశ్య వార్ ష్ణేయ శాల్వం సౌభపతిం స్థితిమ్ ।
అలం కృష్ణావమన్యైనం సాధు యత్నం సమాచర ॥ 21
"వృష్ణివంశోద్భవా! శ్రీకృష్ణా! బాగు బాగు. అలా చూడు. సౌభవతి శాల్వుడు అక్కడున్నాడు. ఇక ఉపేక్షించినది చాలు. అతణ్ణి చంపడానికి మంచి ప్రయత్నం చెయ్యి. (21)
మార్దవం సఖితాం చైవ శాల్వాదద్య వ్యపాహర ।
జహి శాల్వం మహాబాహో మైనం జీవయ కేశవ ॥ 22
మహాబాహూ! కేశవా! ఇపుడు శాల్వుని పట్ల మృదుత్వాన్ని, స్నేహభావాన్ని వదలిపెట్టు. ఇక వెంటనే శాల్వుని చంపు. అతడిని జీవించనీయకు. (22)
సర్వైః పరాక్రమైర్వీర వధ్యః శత్రురమిత్రహన్ ।
న శత్రురవమంతవ్యః దుర్బలోఽపి బలీయసా ॥ 23
వీరశ్రేష్ఠా! అన్నివిధాలైన పరాక్రమాలతో శత్రువు చంపదగినవాడు. శత్రువుదుర్బలుడైనప్పటికీ బలవంతుడు అవహేలన చేయకూడదు. (23)
యోఽపి స్యాత్ పీఠగః కశ్చిత్ కిం పునః సమరే స్థితః ।
స త్వం పురుషశార్దూల సర్వయత్నైరియం ప్రభో ॥ 24
జహి వృష్ణీకులశ్రేష్ఠ మా త్వాం కాలోఽత్యగాత్ పునః ।
నైష మార్దవసాధ్యో వై మతో నాపి సఖా తవ ॥ 25
యేన త్వం యోధితో వీర ద్వారకా చావమర్దితా ।
ఏవమాది తు కౌంతేయ శ్రుత్వాహం సారథేర్వచః ॥ 26
తత్త్వమేతదితి జ్ఞాత్వా యుద్ధే మతిమధారయమ్ ।
వధాయ శాల్వరాజస్య సౌభస్య చ నిపాతనే ॥ 27
పురుషసింహా! వృష్ణికులశ్రేష్ఠా! శత్రువు తన ఇంట్లో ఆసనం మీద కూర్చున్నవాడైనా సరే చంపదగినవాడే. ఇక యుద్ధంలో ఉంటే వేరే చెప్పాలా! కాబట్టి నీవు అన్నివిధాలైన ప్రయత్నం చేత ఇతడిని చంపు. కాలం మించిపోకూడదు. ఇతడు సున్నితంగా (సామోపాయంతో) లొంగేవాడు కాదు. నీకు మిత్రుడూ కాదు. పైగా నీ ద్వారకపై దండెత్తి నాశనం చేసినవాడు. అట్టివాడితో నీవిపుడు యుద్ధం చేస్తున్నావు, కుంతీ,నందనా! ఈ విధమైన సారథి మాటలను విని, ఇది నిజమే అని అనుకొని సౌభపతి శాల్వరాజును చంపడానికి దృఢసంకల్పం చేసికొన్నాను. (24-27)
దారుకం చాబ్రువం వీర ముహూర్తం స్తీయతామితి ।
తతోఽప్రతిమం దివ్యమ్ అభేద్యమతివీర్యవత్ ॥ 28
ఆగ్నేయమస్త్రం దయితం సర్వసాహం మహాప్రభమ్ ।
యోజయం తత్ర ధనుషా దానవాంతకరం రణే ॥ 29
సారథిదారుకునితో 'వీరా! ఒక్క ముహూర్తకాలం ఉండు' అని చెప్పాను. వెనువెంటనే ఆగ్నేయాస్త్రాన్ని నా ధనుస్సున సంధించాను. అది రణరంగంలో అడ్డులేనిది. దివ్యమైనది, ఛేదింప శక్యంగానిది, మహాశక్తిగలది. నాకిష్టమైనది, అన్నింటిని సహించగలది, గొప్పకాంతి గలది దానవుని చంపగలది. (28,29)
యక్షాణాం రాక్షసానాం చ దానవానాం చ సంయుగే ।
రాజ్ఞాం చ ప్రతిలోమానాం భస్మాంతకరణం మహత్ ॥ 30
ఆ అస్త్రం యుద్ధంలో యక్షులను, రాక్షసులను, దానవులను, శత్రు రాజులను భస్మం చేయగలిగినంత గొప్పది. (30)
క్షురాంతమమలం చక్రం కాలాంతకయమోపమమ్ ।
అనుమంత్ర్యాహమతులం ద్విషతాం వినిబర్హణమ్ ॥ 31
జహి సౌభం స్వవీర్యేణ యే చాత్ర రిపవో మమ ।
ఇత్యుక్త్వా భుజవీర్యేణ తస్మై ప్రాహిణవం రుషా ॥ 32
ఆ ఆగ్నేయాస్త్రంతో మంత్రించిన సుదర్శన చక్రం కత్తి అంచు కలిగి కాలాంతకునిలా, యమునిలా భయంకరమై ఉంది. అనుపమానమై శత్రునాశకమైన ఆ అస్త్రాన్ని అనుమంత్రించి, 'నీ శక్తిచే సౌభ విమానాన్నీ, నాశత్రువులను సంహరించు' అని పలికి కోపంతో దానిని శాల్వునిపై ప్రయోగించాను. (31,32)
రూపం సుదర్శనస్యాసీద్ ఆకాశే పతతస్తదా ।
ద్వితీయస్యేన సూర్యస్య యుగాంతే ప్రపతిష్యతః ॥ 33
ఆకాశంలో వెళుతూన్న ఆ సుదర్శన చక్రం యొక్క రూపం ప్రళయకాలంలో ప్రకాశించే రెండవ సూర్యునిలా ఉంది. (33)
తత్ సమాసాద్య నగరం సౌభం వ్యపగతత్విషమ్ ।
మధ్యేన పాటయామాస క్రకచో దార్వివోచ్ఛ్రితమ్ ॥ 34
ఆ చక్రం సౌభవిమానాన్ని సమీపించి బలమైన కర్రను నరికినట్లుగా తన పదునైన అంచులతో దాన్ని మధ్యగా చీల్చివేసింది. (34)
ద్విధా కృతం తతః సౌభం సుదర్శనబలాద్ధతమ్ ।
మహేశ్వరశరోద్ధూతం పపాత త్రిపురం యథా ॥ 35
మహేశ్వరుని శరాఘాతానికి త్రిపురాలు పడినట్లుగా సుదర్శన చక్రం యొక్క బలమైన దెబ్బకు సౌభవిమానం రెండు ముక్కలైంది. (35)
తస్మిన్ నిపతితే సౌభే చక్రమాగాత్ కరం మమ ।
పునశ్చాదాయ వేగేన శాల్వాయేత్యహమబ్రువమ్ ॥ 36
ఆ విధంగా ఆ సౌభవిమానం నేల కూలగానే, చక్రం నా చేతికి తిరిగివచ్చింది. దానిని గ్రహించి మరల వేగంగా 'శాల్వునికొరకు' అని చెప్పి ప్రయోగించాను. (36)
తతః శాల్వం గదాం గుర్వీమ్ ఆవిధ్యంతం మహాహవే ।
ద్విధా చకార సహసా ప్రజజ్వాల చ తేజసా ॥ 37
అప్పుడది గదా ప్రహారాలతో యుద్ధం చేస్తున్న శాల్వుని రెండుగా చీల్చివేసి ఉజ్జ్వలంగా ప్రకాశించింది. (37)
తస్మిన్ వినిహతే వీరే దానవాస్త్రస్తచేతసః ।
హాహాభూతా దిశో జగ్ముః అర్దితా మమ సాయకైః ॥ 38
ఆ విధంగా దానవ వీరుడు శాల్వుడు మరణించాడు, దానవులంతా భీతావహులయ్యారు. నా బాణాలచే హింసింపబడి, హాహాకారాలు చేస్తూ అన్ని దిక్కులకు పరుగెత్తారు. (38)
తతోఽహం సమవస్థాప్య రథం సౌభసమీపతః ।
శంఖం ప్రధ్మాప్య హర్షేణ సుహృదః పర్యహర్షయమ్ ॥ 39
తరువాత నేను నా రథాన్ని సౌభసమీపంలో నిలిపి, ఆనందంతో శంఖాన్ని పూరించి, మిత్రులకు ఆనందాన్ని కల్గించాను. (39)
తన్మేరుశిఖరాకారం విధ్వస్తాట్టాలగోపురమ్ ।
దహ్యమానమభిప్రేక్ష్య స్త్రియస్తాః సంప్రదుద్రువుః ॥ 40
మేరు పర్వత శిఖరాకారంలో ఉన్న, ఆ సౌభవిమానంలోని అంతస్తులు గోపురాలు తగలబడుతూంటే అందులోని స్త్రీలు ఇటు అటు పరుగులెత్తారు. (40)
ఏవం నిహత్య సమరే సౌభం శాల్వం నిపాత్య చ ।
ఆనర్తాన్ పునరాగమ్య సుహృదాం ప్రీతిమావహమ్ ॥ 41
ఈ విధంగా సౌభవిమానాన్ని నాశనం చేసి, శాల్వుని చంపి, ఆనర్తదేశానికి (ద్వారకకు) తిరిగి వచ్చి స్నేహితులందరికీ ప్రీతిని కల్గించాను. (41)
తదేతత్ కారణం రాజన్ యదహం నాగసాహ్వయమ్ ।
నాగమం పరవీరఘ్న న హి జీవేత్ సుయోధనః ॥ 42
మయ్యాగతేఽథవా వీర ద్యూతం న భవితా తథా ।
అద్యాహం కిం కరిష్యామి భిన్నసేతురివోదకమ్ ॥ 43
పరవీరఘ్నా! నేను హస్తినాపురానికి రాకపోవడానికి కారణం ఇది. నేను వచ్చి ఉంటే జూదం జరిగి ఉండేదికాదు. లేదా దుర్యోధనుడు జీవించి ఉండేవాడు కాదు. ఆనకట్ట తెగిన తర్వాత నీటిని ఆపశక్యంగానట్లే, ఇప్పుడు నేనేం చేయగలను. (42,43)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా మహాబాహుః కౌరవం పురుషోత్తమః ।
ఆమంత్ర్య ప్రయయౌ శ్రీమాన్ పాండవాన్ మధుసూదనః ॥ 44
వైశం పాయనుడిలా అన్నాడు - జనమేజయా! మహాబాహువు, పురుషోత్తముడు, మధుసూదనుడు అయిన శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పి, పాండవుల అనుమతి తీసికొని ద్వారకకు బయలుదేరాడు. (44)
అభివాద్య మహాబాహుః ధర్మరాజం యుధిష్ఠిరమ్ ।
రాజ్ఞా మూర్ధన్యుపాఘ్రాతః భీమేన చ మహాభుజః ॥ 45
మహాబాహువు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు నమస్కరించాడు. యుధిష్ఠిరుడు, భీముడు మహాభుజుడైన శ్రీకృష్ణుని శిరస్సును ప్రేమతో ఆఘ్రాణించారు. (45)
పరిష్వక్తశ్చార్జునేన యమాభ్యాం చాభివాదితః ।
సమ్మానితశ్చ ధౌమ్యేన ద్రౌపద్యా చార్చితోఽశ్రుభిః ॥ 46
అర్జునుడు శ్రీకృష్ణుని కౌగిలించుకొన్నాడు. నకుల సహదేవులు కృష్ణుడికి నమస్కరించారు. ధౌమ్యుడు గౌరవించాడు. ద్రౌపది శ్రీకృష్ణుని కన్నీటితో పూజించింది. (46)
సుభద్రామభిమన్యుం చ రథమారోప్య కాంచనమ్ ।
ఆరురోహ రథం కృష్ణః పాండవైరభిపూజితః ॥ 47
ఈ విధంగా పాండవులచే గౌరవింపబడిన శ్రీకృష్ణుడు, సుభద్రను, అభిమన్యునీ తన బంగారు రథం ఎక్కించి, తనూ ఎక్కాడు. (47)
శైబ్యసుగ్రీవయుక్తేన రథేనాదిత్యవర్చసా ।
ద్వారకాం ప్రయయౌ కృష్ణః సమాశ్వాస్య యుధిష్ఠిరమ్ ॥ 48
ఈవిధంగా యుధిష్ఠిరుని ఊరడించి శైబ్యసుగ్రీవాలనే గుర్రాలు పూన్చబడి, సూర్యునిలా ప్రకాశిస్తూన్న రథం మీద శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకొన్నాడు. (48)
తతః ప్రయాతే దాశార్హే ధృష్టద్యుమ్నోఽపి పార్షతః ।
ద్రౌపదేయానుపాదాయ ప్రయయౌ స్వపురం తదా ॥ 49
శ్రీకృష్ణుడు వెళ్ళిన తర్వాత ద్రుపదపుత్రుడు ధృష్టద్యుమ్నుడు ద్రౌపదీనందనులను తీసికొని తననగరానికి వెళ్లాడు. (49)
ధృష్టకేతుః స్వసారం చ సమాదాయాథ చేదిరాట్ ।
జగామ పాండవాన్ దృష్ట్వా రమ్యాం శుక్తిమతీం పురీమ్ ॥ 50
చేదిరాజు ధృష్టకేతువు పాండవులను చూచి, తనసోదరి, నకులుని భార్య అయిన కరేణుమతిని తీసికొని అందమైన తన శుక్తిమతీ నగరానికి వెళ్ళాడు. (50)
కేకయాశ్చాప్యనుజ్ఞాతాః కౌంతేయేనామితౌజసా ।
ఆమంత్ర్య పాండవాన్ సర్వాన్ ప్రయయుస్తేఽపి భారత ॥ 51
భారత! కేకయరాజకుమారులు కూడ అమితతేజస్వి అయిన ధర్మరాజును, తక్కిన పాండవులను ఊరడించి, వారి అనుమతి తీసికొని వెళ్ళారు. (51)
బ్రాహ్మణాశ్చ విశశ్చైవ తథా విషయవాసినః ।
విసృజ్యమానాః సుభృశం న త్యజంతి స్మ పాండవాన్ ॥ 52
యుధిష్ఠిరునితో వచ్చిన బ్రాహ్మణులు, వైశ్యులు, పలుమార్లు చెప్పినప్పటికిని పాండవులను విడిచివెళ్ళలేదు. (52)
సమవాయః స రాజేంద్ర సుమహాద్భుతదర్శనః ।
ఆసీన్మహాత్మనాం తేషాం కామ్యకే భరతర్షభ ॥ 53
రాజేంద్రా! జనమేజయా! ఆ సమయంలో కామ్యకవనంలో గొప్ప అద్భుతమైన మహాత్ముల సమ్మేళనం జరిగింది. (53)
యుధిష్ఠిరస్తు విప్రాంస్తాన్ అనుమాన్య మహామనాః ।
శశాస పురుషాన్ కాలే రథాన్ యోజయతేతి వై ॥ 54
మహామనస్కుడైన యుధిష్ఠిరుడు అక్కడి బ్రాహ్మణులందరి అనుమతి తీసికొని 'రథాలను సిద్ధం చేయండి' అని సేవకులను అజ్ఞాపించాడు. (54)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి సౌభవధోపాఖ్యానే ద్వావింశోఽధ్యాయః ॥ 22 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున సౌభవధోపాఖ్యానమను ఇరువది రెండవ అధ్యాయము. (22)