15. పదునైదవ అధ్యాయము

ద్వారకలోని యుద్ధ రక్షణ సంసిద్ధత.

యుధిష్ఠిర ఉవాచ
వాసుదేవ మహాబాహో విస్తరేణ మహామతే ।
సౌభస్య వధమాచక్ష్య న హి తృప్యామి కథ్యతః ॥ 1
యుధిష్ఠిరుడిలా అడిగాడు - వాసుదేవా! మహాబాహూ! మహాబుద్ధిశాలీ! సౌభవధను గురించి విస్తరంగా తృప్తి కలిగేటట్లు చెప్పు. (1)
వాసుదేవ ఉవాచ
హతం శ్రుత్వా మహాబాహో మయా శ్రౌతశ్రవం నృప ।
ఉపాయాద్ భరతశ్రేష్ట శాల్వో ద్వారవతీమ్ పురీమ్ ॥ 2
అపుడు వాసుదేవుడిలా చెప్పాడు - రాజా! శ్రుతశ్రవ యొక్క పుత్రుడైన శిశుపాలుని నేను చంపిన విషయం విని శాల్వుడు ద్వారకాపురికి వచ్చాడు. (2)
వి॥ శ్రుతశ్రవ = కృష్ణునిమేనత్త. దమఘోషపత్ని
అరుంధత్తాం సుదుష్టాత్మా సర్వతః పాండునందన ।
శాల్వో వైహాయసం చాపి తత్ పురం వ్యూహ్య విష్ఠితః ॥ 3
పాండునందనా! దుర్మార్గుడైన శాల్వుడు ద్వారకాపురిని అన్నివైపుల తనసైనికులతో చుట్టుముట్టాడు. తాను స్వయంగా విమానాన్ని ఎక్కి ఆ పురం మీద వ్యూహాత్మకంగా సంచరించాడు. (4)
తత్రస్థోఽథ మహీపాలః యోధయామాస తాం పురీమ్ ।
అభిసారేణ సర్వేణ తత్ర యుద్ధమవర్తత ॥ 4
సౌభ విమానంలో ఉండి శాల్వరాజు ద్వారకలోని యోధులతో యుద్ధం చేయసాగాడు. ఆ నగరంలో అన్నివైపుల శస్త్రాస్త్రాలతో యుద్ధం జరిగింది. (4)
పురీ సమంతాద్ విహితా సపతాకా సతోరణా ।
సచక్రా సహుడా చైవ సయమ్త్రఖనకా తథా ॥ 5
ద్వారకానగరానికి అన్నివైపులా పతాకాలతో కూడిన ప్రహరీ ఉన్నది. నాలుగువైపులా ఎత్తైన తోరణాలున్నాయి. అన్ని వైపుల యుద్ధ సైనికసమూహాలు ఉన్నాయి. సైనికుల ఆత్మ రక్షణకు బురుజులున్నాయి. యుద్ధానికి అవసరమైన యంత్రాలు గల సురంగం ఉంది. (5)
సోపశల్యప్రతోలీకా సాట్టాట్టాలకగోపురా ।
సచక్రగ్రహణీ చైవ సోల్కాలాతావపోథికా ॥ 6
ప్రహరీపై విషం పూసిన లోహపు ముళ్ళు కనబడకుండా ఉంటాయి. పై అంతస్తులలో, గోపురాలలో కావలసిన ఆహారపదార్థాలుంటాయి. శత్రువుల దెబ్బలను అడ్డుకోవడానికి చక్రాకారంలో లోహమయమైన డాలులు ఉన్నాయి. శత్రువులు ప్రయోగించే అగ్నిగోళాలను, ప్రజ్వలించే లోహమయ అస్త్రాలను క్రిందకు పడగొట్టే శక్తి అనే అస్త్రాలున్నాయి. (6)
సోష్ట్రిలా భరతశ్రేష్ఠ సభేరీపణవానకా ।
సతోమరాంకుశా రాజన్ సశతఘ్నీకలాంగలా ॥ 7
సభుశుండ్యశ్మగుడకా సాయుధా సపరశ్వధా ।
లోహచర్మవతీ చాపి సాగ్నిః సగుడశృంగికా ॥ 8
భరతశ్రేష్ఠా! అస్త్రాలతో నిండిన మట్టి పాత్రలు, కంచుపాత్రలు అనేకం ఉన్నాయి. నగరంలో భేరీ, నగారాలు, మృదంగాలు ధ్వనిస్తూంటాయి. తోమర, అంకుశ, శతఘ్నీ, లాంగల, భుశుండి, అశ్మగోలకాలు, అనేకాయుధాలు, లోహచర్మం గల కంచుకాలు, ప్రజ్వలించే గోళాలు, మొదలయినవి యథాస్థానాలలో ఉన్నాయి. (7,8)
శాస్త్రదృష్టేన విధినా సుయుక్తా భరతర్షభ ।
రథైరనేకైర్వివిధైః గదసాంబోద్ధవాదిభిః ॥ 9
పురుషైః కురుశార్దూల సమర్థైః ప్రతివారణే ।
అతిఖ్యాతకులైర్వీరైః దృష్టవీర్యైశ్చ సంయుగే ॥ 10
మధ్యమేన చ గుల్మేన రక్షిభిః సా సురక్షితా ।
ఉత్ క్షిప్తగుల్మైశ్చ తథా హయైశ్చ సపతాక్షిభిః ॥ 11
ఆఘోషితం చ నగరే న పాతవ్యా సురేతి వై ।
ప్రమాదం పరిరక్షద్భిః ఉగ్రసేనోద్ధవాదిభిః ॥ 12
భరతశ్రేష్ఠా! శాస్త్రంలో చెప్పబడిన విధంగా ద్వారకా పురం రక్షణోపాయాలతో సుసంపన్నం చేయబడింది. కురుశార్దూలా! శత్రువులను నివారించడానికై అనేక విధాలైన రథాలతో సమర్థులైన, గద, సాంబ, ఉద్ధవాది వీరపురుషులతో ప్రఖ్యాత వంశీయులైన యుద్ధవీరులతోను నగరం మధ్యలోనున్న దుర్గాలతోను ద్వారకాపురి సురక్షితంగా ఉంది. నగరానికి దూరంగా ఉన్న దుర్గాల చేత, పతాకాలతోకూడిన గుర్రాలచేతను ద్వారక రక్షింపబడుతోంది. నగరంలో మద్యపానం చేయరాదని ప్రకటింపబడింది. ప్రమాదం నుండి రక్షించే ఉగ్రసేన, ఉద్ధవాదులచే ద్వారక సురక్షితం చేయబడింది. (9-12)
ప్రమత్తేష్వభిఘాతం హి కుర్యాచ్ఛాల్వో నరాధిపః ।
ఇతి కృత్వాప్రమత్తాస్తే సర్వే వృష్ణ్యంధకాః స్థితాః ॥ 13
మద్యపానం చేత ఉన్మత్తులై ఉంటే శాల్వనరాధిపుడు తమను దెబ్బతీస్తాడని భావించి వృష్ణ్యంధక వీరులంతా అప్రమత్తంగా ఉన్నారు. (13)
ఆనర్తాశ్చ తథా సర్వే నటా నర్తకగాయనాః ।
బహిర్నిర్వాసితాః క్షిప్రం రక్షద్భిర్విత్తసంచయమ్ ॥ 14
ధనసంచయాన్ని రక్షించే యాదవులు ఆనర్తదేశీయులైన నట, నర్తక, గాయకు లందర్నీ నగరం నుండి బయటకు శీఘ్రంగా పంపించివేశారు. (14)
సంక్రమా భేదితాః సర్వే నావశ్చ ప్రతిషేధితాః ।
పరిఖాశ్చాపి కౌరవ్య కాలైః సునిచితాః కృతాః ॥ 15
కురునందనా! ద్వారకాపురంలోకి ప్రవేశించే మార్గాలన్నింటిని మూసివేశాం. సముద్రమార్గంలో వచ్చే నౌకలన్నింటినీ నిషేధించాం. నగరం చుట్టూ ఉండే పరిఖలను (అగడ్తలను) ముళ్ళతో నింపాం. (15)
ఉదపానాః కురుశ్రేష్ఠ తథైవాప్యంబరీషకాః ।
సమంతాత్ క్రోశమాత్రం చ కారితా విషమా చ భూః ॥ 16
కురుశ్రేష్ఠా! ద్వారకానగరానికి నాలుగువైపులా ఒక క్రోసెడు దూరం వరకు నూతులన్నింటిని నీరులేనివిగా వేపుడు మూకుళ్లుగా చేశాం. భూమిని ప్రవేశింప శక్యం కాకుండా లోహకంటకాదులతో విషమంగా తయారుచేశాం. (16)
ప్రకృత్యా విషమం దుర్గం ప్రకృత్యా చ సురక్షితమ్ ।
ప్రకృత్యా చాయుధోపేతం విశేషేణ తదానఘ ॥ 17
రాజా! ద్వారక సహజంగానే ప్రవేశింప శక్యంకానిది. సహజంగానే సురక్షితమైంది. సహజంగానే ఆయుధాలతో సుసంపన్నమైంది. అయినప్పటికీ ఇపుడు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. (17)
సురక్షితం సుగుప్తం చ సర్వాయుధసమన్వితమ్ ।
తత్ పురం భరతశ్రేష్ఠ యథేంద్రభవనం తథా ॥ 18
భరతశ్రేష్ఠా! ఇంద్రభవనంలా ద్వారకానగరం సురక్షితమూ, సుగుప్తమూ, అన్ని విధాలైన ఆయుధాలతో కూడి ఉన్నది కూడా. (18)
న చాముద్రోఽభినిర్యాతి న చాముద్రః ప్రవేశ్యతే ।
వృష్ణ్యంధకపురే రాజన్ తదా సౌభసమాగమే ॥ 19
సౌభనివాసులతో యుద్ధం జరిగే సమయంలో వృష్ణ్యంధక
వీరుల నగరంలోని ఎవరూ కూడా రాజముద్రలేనిదే బయటకు వెళ్లలేడు. రాజముద్రలేనిదే లోపలికి ప్రవేశించలేడు. (19)
అనురథ్యాసు సర్వాసు చత్వరేషు చ కౌరవ ।
బలం బభూవ రాజేంద్ర ప్రభూతగజవాజిమత్ ॥ 20
కురునందనా! రాజేంద్రా! ప్రధానమార్గాలలో అన్ని కూడళ్ళలో గజాలు, అశ్వాలు గల్గిన సైన్యం మిక్కిలిగా ఉంది. (20)
దత్తవేతనభక్తం చ దత్తాయుధపరిచ్ఛదమ్ .
కృతోపధానం చ తదా బలమాసీన్మహాభుజ ॥ 21
మహాభుజా! ఆ సమయంలో సైనికులకు ప్రత్యేక జీతబత్తెములను ఇచ్చాం. క్రొత్తక్రొత్త ఆయుధాలను కవచాలను సమకూర్చాం. విశేష బహుమానాలను ఇచ్చాం. (21)
న కుప్యవేతనీ కశ్చిద్ న చాతిక్రాంతవేతనీ ।
నానుగ్రహభృతః కశ్చిద్ న చాదృష్టపరాక్రమః ॥ 22
వేతనరూపంలో ధనమూ, బంగారమూ తప్ప మరొకటేదీ ఎవరికీ ఇవ్వలేదు. ఎవరికీ అర్హతకు మించిన వేతనం ఇవ్వలేదు. దయతో ఎవరికీ సైన్యంలో స్థానం కల్పించలేదు. పరాక్రమం చూపనివాడు ఎవడూ లేడు. (23)
ఏవం సువిహితా రాజన్ ద్వారకా భూరిదక్షిణా ।
ఆహుకేన సుగుప్తా చ రాజ్ఞా రాజీవలోచన ॥ 23
కమలనయనా! రాజా! మిక్కిలి సమర్థులైన వీరులు కల ద్వారకానగరం ఈ విధంగా సురక్షితం చేయబడింది. రాజయిన ఉగ్రసేనునిచేత బాగా రక్షింపబడింది. (23)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి సౌభవధోపాఖ్యానే పంచదశోఽధ్యాయః ॥ 15 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున సౌభవధోపాఖ్యానమను పదునైదవ అధ్యాయము. (15)