14. పదునాల్గవ అధ్యాయము

శ్రీకృష్ణుడు సాల్వుని చంపుట.

యుధిష్ఠిర ఉవాచ
అసాన్నిధ్యం కథం కృష్ణ తవాసీద్ వృష్ణినందన ।
క్వ చాసీద్ విప్రవాసస్తే కిం చాకార్షీః ప్రవాసతః ॥ 1
యుధిష్ఠిరుడిలా అన్నాడు - వృష్ణినందనా! శ్రీకృష్ణా! జూదం సమయంలో నీవెందుకు రాలేకపోయావు? నీవు ఎక్కడ ప్రవాసంలో ఉన్నావు? ఆ ప్రవాసంలో ఏం చేశావు? (1)
వి॥సం॥ సాగరమధ్యంలో ద్వారక అంటే సంసారంలోని శరీరం. మరపు వలన ఆ శరీరంలో భగవంతుడు లేకపోయాడు = కృష్ణుడు ఆ సమయంలో ద్వారకలో లేడు. మహామోహరూపుడయిన శాల్వుడు స్వేచ్ఛగా భరిమ్చే మనోరథమనే సౌభాన్ని ఎక్కి శోకాన్ని అస్త్రాలుగా చేసి ఉపద్రవం సృష్టించాడు. ధర్మయజ్ఞాల వంటి ప్రద్యుమ్నాదులు ఎదిరించలేకపోయారు. అప్పుడు చిదాత్మరూపుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మవిద్య అనే అస్త్రంతో శాల్వుని, అతని సౌభాన్నీ = మహామోహాన్నీ, మనోరథాన్నీ సంహరించాడు. భారతం స్మృతిరూపం కాబట్టి అఖ్యాయికలోని యుద్ధ ప్రస్తావనకు ఇదే తాత్పర్యాన్ని గ్రహించాలొ. (నీల)
శ్రీకృష్ణ ఉవాచ
శాల్వస్య నగరం సౌభం గతోఽహం భరతర్షభ ।
విహంతుం కౌరవశ్రేష్ఠ తత్ర మే శృణు కారణమ్ ॥ 2
మహాతేజా మహాబాహుః యః స రాజా మహాయశాః ।
దమఘోషాత్మజో వీరః శిశుపాలో మయా హతః ।
యజ్ఞే తే భరతశ్రేష్ఠ రాజసూయేఽర్హణాం ప్రతి ।
స రోషవశమాపన్నః నామృష్యత దురాత్మవాన్ ॥ 4
శ్రుత్వా తం నిహతం శాల్వః తీవ్రరోషసమన్వితః ।
ఉపాయాద్ ద్వారకాం శూన్యామ్ ఇహస్థే మయి భారత ॥ 5
శ్రీకృష్ణుడిలా అన్నాడు - కురునందనా! నేనా సమయంలో నగరాకారంలో ఉన్న శాల్వుని సౌభమనే విమానాన్ని నాశనం చేయడానికి వెళ్ళాను. అందుకు కారణం చెపుతాను విను. భరతశ్రేష్ఠా! నీ రాజసూయయాగంలో అగ్రపూజ విషయంలో దుర్మార్గుడైన శిశుపాలుడు క్రోధవశుడై సహనాన్ని కోల్పోయాడు. మహాతేజస్వి, మహాబాహువు, మహాయశస్వి, వీరుడు, దమఘోషుని కుమారుడూ అయిన ఆ శిశుపాలుని అపుడు నేను చంపాను కదా! అతని వధను గురించి విన్న శాల్వుడు తీవ్రమైన కోపంతో నేను లేని సమయంలో ద్వారకకు వచ్చాడు. (2-5)
స తత్ర యోధితో రాజన్ కుమారైర్వృష్ణిపుంగవైః ।
ఆగతః కామగం సౌభమ్ ఆరుహ్యైవ నృశంసవత్ ॥ 6
రాజా! అక్కడ వృష్ణివంశశ్రేష్ఠులైన కుమారులు అతనిని ఎదిరించారు. అతడు స్వేచ్ఛాగమనం గల సౌభమనే విమానాన్ని ఎక్కి వచ్చి క్రూరునివలె యుద్ధం చేశాడు. (6)
తతో వృష్ణిప్రవీరాంస్తాన్ బాలాన్ హత్వా బహూంస్తదా ।
పురోద్యానాని సర్వాణి భేదయామాస దుర్మతిః ॥ 7
వృష్ణివంశీయులైన వీరబాలురను అనేకులను చంపి, దుర్బుద్ధితో నగరంలోని ఉద్యానవనాలను అన్నింటిని ధ్వంసమ్ చేశాడు. (7)
ఉక్తవాంశ్చ మహాబాహో క్వాసౌ వృష్ణికులాధమః ।
వాసుదేవః స మందాత్మా వసుదేవసుతో గతః ॥ 8
మహాబాహూ! ఆపై ఇలా అన్నాడు - "వృష్ణికులాధముడు, వసుదేవుని పుత్రుడూ, తెలివితక్కువవాడూ అయిన ఆ వాసుదేవుడు ఎక్కడకు వెళ్లాడు? (8)
తస్య యుద్ధార్థినో దర్పం యుద్ధే నాశయితాస్మ్యహమ్ ।
ఆనర్తాః సత్యమాఖ్యాత తత్ర గంతాస్మి యత్ర సః ॥ 9
తమ్ హత్వా వినివర్తిష్యే కంసకేశినిఘాదనమ్ ।
అహత్వా న నివర్తిష్యే సత్యేనాయుధమాలభే ॥ 10
యుద్ధకాంక్షి అయిన అతడి గర్వాన్ని యుద్ధంలోనే నేను నాశనం చేస్తాను. ఆనర్తనివాసులారా! నిజం చెప్పండి. అతడున్న చోటకే వెళ్తాను. నా ఆయుధాన్ని ధరించి నిజం పలుకుతున్నాను. ఈ రోజు కంస, కేశులను చంపిన వాసుదేవుని చంపి తిరిగి వెళ్తాను. అతణ్ణి చంపకుండా తిరిగి వెళ్ళను. (9,10)
క్వాసౌ క్వాసావితి పునః తోస్తత్ర తత్ర ప్రధావతి ।
మయా కిల రణే యోద్ధుం కాంక్షమాణః స సౌభరాట్ ॥ 11
నాతో యుద్ధం చేయాలని కోరుకుంటూ ఆ సౌభరాజు 'అతడెక్కడ? అతడెక్కడ' అంటూ మళ్ళీ మళ్ళీ అక్కడక్కడే తిరుగసాగాడు. (11)
అద్య తం పాపకర్మాణం క్షుద్రం విశ్వాసఘాతినమ్ ।
శిశుపాలవధామర్షాద్ గమయిష్యే యమక్షయమ్ ॥ 12
మమ పాపస్వభావేన భ్రాతా యేన నిపాతితః ।
శిశుపాలో మహీపాలః తం వధిష్యే మహీపతే ॥ 13
ఈ రోజు పాపకర్ముడూ విశ్వాస ఘాతకుడూ, నీచుడూ అయిన ఆ వాసుదేవుని యమలోకానికి పంపుతాను. నా సోదరుడైన శిశుపాల మహీపాలుని పాపస్వభావంతో చంపిన అతడిని నేను చంపుతాను. (12,13)
భ్రాతా బాలశ్చ రాజా చ న చ సంగ్రామమూర్ధని ।
ప్రమత్తశ్చ హతో వీరః తం హనిష్యే జనార్దనమ్ ॥ 14
నా సోదరుడు బాలుడు. రాజు. యుద్ధరంగంలో లేనివాడు. అసావధానంగా ఉండగా ఆ శిశుపాలుని చంపిన ఆ జనార్దనుని చంపుతాను". (14)
ఏవమాది మహారాజ విలప్య దివమాస్థితః ।
కామగేన స సౌభేన క్షిప్త్వా మాం కురునందన ॥ 15
కురునందనా! మహారాజా! ఈ విధంగా శిశుపాలుని కొరకు విలపించి, నన్ను నిందించి, కామగతిగల సౌభవిమానంపై అంతరిక్షంలో తిరగసాగాడు. (15)
తమశ్రౌషమహం గత్వా యథావృత్తః స దుర్మతిః ।
మయి కౌరవ్య దుష్టాత్మా మార్తికావతకో నృపః ॥ 16
కురునందనా! నేను మీ దగ్గర నుండి ద్వారకకు వెళ్ళిన పిదప మార్తికావతకదేశపురాజు, దుర్బుద్ధి అయిన ఆ శాల్వుడు నా విషయంలో ఎలా వ్యవహరించాడో విన్నాను. (16)
తతోఽహమపి కౌరవ్య రోషవ్యాకులమానసః ।
నిశ్చిత్య మనసా రాజన్ వధాయాస్య మనో దధే ॥ 17
కురునందనా! రోషంతో నామనసు కలత చెందింది. నేను కూడ ఒక నిశ్చయానికి వచ్చాను. అతనిని చంపాలని సంకల్పంచాను. (17)
ఆనర్తేషు విమర్దం చ క్షేపం చాత్మని కౌరవ ।
ప్రవృద్ధమవలేపం చ తస్య దుష్కృతకర్మణః ॥ 18
తతః సౌభవధాయాహం ప్రతస్థే పృథివీపతే ।
స మయా సాగరావర్తే దృష్ట ఆసీత్ పరీప్సతా ॥ 19
కురువరా! దుష్కార్యాలు చేసిన ఆ సాల్వుడు ఆనర్తదేశంలో చేసిన వినాశాన్ని, నా విషయంలో చేసిన నిందలను, అతడి గర్వాన్ని గుర్తించి అతని సౌభవిమానాన్ని, అతనినీ నాశనం చేయటానికి బయలుదేరాను. అతని కొరకు వెదకుతున్న నాకు అతడు ఒక సముద్ర ద్విపంలో కనిపించాడు. (18,19)
తతః ప్రధ్మాప్య జలజం పాంచజన్యమహం నృప ।
ఆహూయ శాల్వం సమరే యుద్ధాయ సమవస్థితః ॥ 20
రాజా! అపుడు నేను పాంచజన్యమనే శంఖాన్ని పూరించి, శాల్వుని యుద్ధానికి ఆహ్వానించి, సిద్ధంగా నిలిచాను. (20)
తన్ముహూర్తమభూత్ యుద్ధం తత్ర మే దానవైః సహ ।
వశీభూతాశ్చ మే సర్వే భూతలే చ నిపాతితాః ॥ 21
అక్కడ దానవులకూ, నాకూ ఒక ముహూర్తకాలం యుద్ధం జరిగింది. వారంతా నాకు వశులై నేలపై ఒరిగారు. (21)
ఏతత్ కార్యం మహాబాహో యేనాహం నాగమం తదా ।
శ్రుత్వైవ హాస్తినపురం ద్యూతం చావినయోత్థితమ్ ।
ద్రుతమాగతవాన్ యుష్మాన్ ద్రష్టుకామః సుదుఃఖితాన్ ॥ 22
ఈ పనివల్లనే అపుడు నేను రాలేకపోయాను. హస్తినాపురంలో దుర్యోధనుని అవినయం కారణంగా జరిగిన జూదం సంగతి విని, దుఃఖంలో ఉన్న మిమ్మల్ని చూడటం కోసం తొందరగా వచ్చాను. (22)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి సౌభవధోపాఖ్యానే చతుర్దశోఽధ్యాయః ॥ 14 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమనపర్వమను ఉపపర్వమున సౌభవధోపాఖ్యానమను పదునాల్గవ అధ్యాయము. (14)