16. పదునారవ అధ్యాయము
శాల్వుని సైన్యము యాదవులను చుట్టుముట్టుట - యుద్ధము.
వాసుదేవ ఉవాచ
తాం తూపయాతో రాజేంద్ర శాల్వః సౌభపతిస్తదా ।
ప్రభూతనరనాగేన బలేనోపవివేశ హ ॥ 1
వాసుదేవుడిలా అన్నాడు - రాజేంద్రా! సౌభపతి సాల్వుడు గజపదాతులు గల పెద్ద సైన్యంతో దండెత్తి ద్వారకానగరానికి వచ్చాడు. (1)
సమే నివిష్టా సా సేనా ప్రభూతసలిలాశయే ।
చతురంగబలోపేతా శాల్వరాజాభిపాలితా ॥ 2
శాల్వరాజు చతురంగబలం పెద్దజలాశయం ఉన్న సమతలప్రదేశంలో విడిదిచేసింది. (2)
వర్జయిత్వా శ్మశానాని దేవతాఽయతనాని చ ।
వల్మీకాంశ్చైత్యవృక్షాంశ్చ తన్నివిష్టమభూద్ బలమ్ ॥ 3
శ్మశానభూములను, దేవతామందిరాలను, పుట్టలను, వృక్షాలను విడిచి, తక్కిన ప్రదేశాలనన్నింటిని అతని సైన్యం ఆవరించింది. (3)
అనీకానాం విభాగేన పంథానః సంవృతాఽభవన్ ।
ప్రవణాయ చ నైవాసన్ శాల్వస్య శిబిరే నృప ॥ 4
రాజా! దారులన్నీ సేనల విభాగాలతో నిండిపోయాయి. శాల్వుని శిబిరంలోకి ప్రవేశించడానికి మార్గమే లేదు. (4)
సర్వాయుధసమోపేతం సర్వశస్త్రవిశారదమ్ ।
రథనాగాశ్వకలిలం పదాతిధ్వజసంకులమ్ ॥ 5
తుష్టపుష్టబలోపేతం వీరలక్షణలక్షితమ్ ।
విచిత్రధ్వజసన్నాహం విచిత్రరథకార్ముకమ్ ॥ 6
సన్నివేశ్య చ కౌరవ్య ద్వారకాయాం నరర్షభ ।
అభిసారయామాస తదా వేగేన పతగేంద్రవత్ ॥ 7
ఆ సాల్వుని శిబిరం అన్నివిధాలైన ఆయుధాలతో నిండి ఉంది. అక్కడ అన్నిరకాల శస్త్రాల్లోను నైపుణ్యం కలవారున్నారు. అశ్వబలం, గజబలం, రథబలం, పతాకాలతో నున్న పదాతిదళం అందులో ఉన్నాయి. అందులోని సైన్యమంతా సంతోషంతో పుష్టిగా ఉంది. మహావీరుల లక్షణాలు కలవా రందులో ఉన్నారు. చిత్రవిచిత్రాలైన జెండాలు కట్టబడ్డాయి. విచిత్రాలైన రథాలు, ధనుస్సులూ ఉన్నాయి. కురుశ్రేష్ఠా! గరుత్మంతునిలా ద్వారకకు సమీపంలో సైన్యాన్నంతటినీ సమావేశపరచి, వేగంగా ద్వారకవైపునకు నడిపించసాగాడు. (5-7)
తదాపతంతం సందృశ్య బలం శాల్వపతేస్తదా ।
నిర్యాయ యోధయామాసుః కుమారా వృష్ణినందనాః ॥ 8
అశాల్వరాజ సైన్యం రావటాన్ని గమనించి వృష్ణివంశీయులైన యువకులంతా నగరం నుండి బయటకి వెళ్ళి వారితో యుద్ధం చేశారు. (8)
అసహంతోఽభియానం తత్ శాల్వరాజస్య కౌరవ ।
చారుదేష్ణశ్చ సాంబశ్చ ప్రద్యుమ్నశ్చ మహారథః ॥ 9
తే రథైర్దంశితాః సర్వే విచిత్రాభరణధ్వజాః ।
సంసక్తాః శాలరాజస్య బహుభిర్యోధపుంగవైః ॥ 10
కురునందనా! ఆ శాల్వుని దురాక్రమణాన్ని సహింపలేని చారుదేష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు మున్నగు మహారథులంతా శాల్వరాజు యొక్క బహుయోధశ్రేష్ఠులను తమరథాలతో డీకొన్నారు. (9,10)
గృహీత్వా కార్ముకం సాంబః శాల్వస్య సచివం రనే ।
యోధయామాస సంహృష్టః క్షేమవృద్ధిం చమూపతిమ్ ॥ 11
సాంబుడు తన ధనుస్సును ధరించి శాల్వుని మంత్రి, సేనాపతి ఐన క్షేమవృద్ధితో యుద్ధరంగంలో ఆనందంగా యుద్ధం చేశాడు. (11)
తస్య బాణమయం వర్షం జాంబవత్యాః సుతో మహత్ ।
ముమోచ భరతశ్రేష్ఠ యథా వర్షం సహస్రదృక్ ॥ 12
తద్ బాణవర్షం తుములం విషేహే స చమూపతిః ।
క్షేమవృద్ధిర్మహారాజ హిమవానివ నిశ్చలః ॥ 13
భరతశ్రేష్ఠా! జాంబవతి కొడుకు సాంబుడు ఆ క్షేమవృద్ధిపై సహస్రాక్షుడైన ఇంద్రునిలా బాణవర్షాన్ని కురిపించాడు. భయంకరమైన ఆ బాణవర్షాన్ని సేనాపతి క్షేమ వృద్ధి సహించి హిమవత్పర్వతంలా నిశ్చలంగా నిలిచాడు. (12,13)
తతః సాంబాయ రాజేంద్ర క్షేమవృద్ధిరపి స్వయమ్ ।
ముమోచ మాయావిహితం శరజాలం మహత్తరమ్ ॥ 14
రాజేంద్రా! అటు తర్వాత క్షేమ వృద్ధి కూడా స్వయంగా మాయాజాలంతో కూడిన మహత్తరమైన శరసమూహాన్ని సాంబునిపై విడిచాడు. (14)
తతో మాయామయం జాలం మాయయైవ విదీర్య సః ।
సాంబః శరసహస్రేణ రథమస్యాభ్యవర్షత ॥ 15
అపుడు సాంబుడు ఆ మాయాశరజాలాన్ని మాయచేతనే చేధించి, అతని రథాన్ని వేలబాణాలతో ముంచెత్తాడు. (15)
తతః స విద్ధః సాంబేన క్షేమవృద్ధిశ్చమూపతిః ।
అపాయాజ్జవనైరశ్వైః సాంబబాణప్రపీడితః ॥ 16
అటుపై సాంబునిబాణాల దెబ్బల ధాటికి క్షేమవృద్ధి వేగంగా పరుగెత్తే తన గుర్రాలతో యుద్ధరంగం నుండి వెళ్ళిపోయాడు. (16)
తస్మిన్ విప్రద్రుతే క్రూరే శాప్వస్యాథ చమూపతౌ ।
వేగవాన్ నామ దైతేయః సుటం మేఽభ్యద్రవద్ బలీ ॥ 17
ఆ శాల్వుని సేనాపతి పారిపోగానే, వేగవంతుడనే బలవంతుడయిన రాక్షసుడు నాకుమారుని పైకి దండెత్తాడు. (17)
అభిపన్నస్తు రాజేంద్ర సాంబో వృష్ణికులోద్వహః ।
వేగం వేగవతో రాజన్ తస్థౌ వీరో విధారయన్ ॥ 18
రాజేంద్రా! వృష్ణి వంశభారాన్ని మోసే సాంబుడు, వేగవంతుని వేగాన్ని సహించి ధైర్యంగా అతణ్ణి నిలువరించి నిలిచాడు. (18)
స వేగవతి కౌంతేయ సాంబో వేగవతీం గదామ్ ।
చిక్షేప తరసా వీరో వ్యావిద్ధ్య సత్యవిక్రమః ॥ 19
కుంతీనందనా! సత్యవిక్రముడు, వీరుడు అయిన సాంబుడు వేగవంతమయిన (వేగవతి అనే) గదను అతనిపై విసిరాడు. (19)
తయా త్వభిహతో రాజన్ వేగవాన్ న్యపతద్ భువి ।
వాతరుగ్ణ ఇవ క్షుణ్ణః జీర్ణమూలో వనస్పతిః ॥ 20
రాజా! చివికిపోయిన మొదలు గల వృక్షం గాలివేగానికి నేల కొరిగినట్లుగా ఆ గదాఘాతానికి వేగవంతుడు నేలకొరిగాడు. (20)
తస్మిన్ వినిహతే వీరే గదానున్నే మహాసురే ।
ప్రవిశ్య మహతీం సేనాం యోధయామాస మే సుతః ॥ 21
గదయొక్క దెబ్బకి మహాసురుడూ, వీరుడూ అయిన ఆ వేగవంతుడు మరణించగానే నాకుమారుడు సాంబుడు ఆ మహాసేనలోకి ప్రవేశించి యుద్ధం చేయసాగాడు. (21)
చారుదేష్ణేన సంసక్తః వివింధ్యో నామ దానవః ।
మహారథః సమాజ్ఞాతః మహారాజ మహాధనుః ॥ 22
మహారాజా! శాల్వుని ఆజ్ఞచేత మహారథుడు, మహాధన్వి అయిన వివింధ్యుడనే రాక్షసుడు చారుదేష్ణునితో తలపడ్డాడు. (22)
తతః సుతుములం యుద్ధం చారుదేష్ణవివింధ్యయోః ।
వృత్రవాసవయో రాజన్ యథా పూర్వం తథాభవత్ ॥ 23
రాజా! ఆ తరువాత ఆ చారుదేష్ణ - వివింధ్యులకు పూర్వం వృత్రాసురదేవేంద్రులకు జరిగినట్లుగా మిక్కిలి భయంకరమైన యుద్ధం జరిగింది. (23)
అన్యోన్యస్యాభిసంక్రుద్ధౌ అన్యోన్యం జఘ్నతుః శరైః ।
వినదంతౌ మహారావాన్ సింహావివ మహాబలౌ ॥ 24
మహాబలులైన వారిద్దరూ ఒకరిపై ఒకరు క్రుద్ధులై, ఒకరి నొకరు బాణాలతో కొట్టుకుంటూ, బిగ్గరగా (ధ్వని చేస్తూ) అరుస్తూ సింహాల వలె పోరుతున్నారు. (24)
రౌక్మిణేయస్తతో బాణమ్ అగ్న్యర్కోపమవర్చసమ్ ।
అభిమంత్ర్య మహాస్త్రేణ సందధే శత్రునాశనమ్ ॥ 25
తరువాత రుక్మిణీకుమారుడైన చారుదేష్ణుడు అగ్నివలె సూర్యుని వలె ప్రకాశిస్తున్న బాణాన్ని శత్రునాశకంగా అభిమంత్రించి మహాస్త్రంతో సంధించాడు. (25)
స వివింధ్యాయ సక్రోధః సమాహూయ మహారథః ।
చిక్షేప మే సుతో రాజన్ స గతాసురథాపతత్ ॥ 26
రాజా! తరువాత క్రుద్ధుడై మహారథుడైన నా కుమారుడు వివింధ్యునిపై ఆ బాణాన్ని ప్రయోగించాడు. అతడు ప్రాణాలు కోల్పోయి క్రిందపడ్డాడు. (26)
వివింధ్యం నిహతం దృష్ట్వా తాం చ విక్షోభితా చమూమ్ ।
కామగేన స సౌభేన శాల్వః పునరుపాగమత్ ॥ 27
వివింధ్యుని మరణం చూసి చెల్లాచెదరైన సేనను చూసి శాల్వుడు స్వేచ్ఛాగమనం గల తన సౌభవిమానంతో మళ్ళీ సమీపించాడు. (27)
తతో వ్యాకులితం సర్వం ద్వారకావాసి తద్ బలమ్ ।
షృష్ట్వా శాల్వం మహాబాహో సౌభస్థం నృపతే తదా ॥ 28
మహాబాహూ! నరేశ్వరా! ఆ సమయంలో సౌభవిమానం మీదున్న శాల్వుని చూసి ద్వారకలోనున్న సైన్యమంతా కలవరపడింది. (28)
తతో నిర్యాయ కౌరవ్య అవస్థాప్య చ తద్బలమ్ ।
ఆనర్తానాం మహారాజ ప్రద్యుమ్నో వాక్యమబ్రవీత్ ॥ 29
మహారాజ! అపుడు ప్రద్యుమ్నుడు నగరం నుండి బయటకు వెళ్ళి ఆనర్తదేశీయసైనికులను నిలిపి ఇలా చెప్పాడు. (29)
సర్వే భవంతస్తిష్ఠంతు సర్వే పశ్యంతు మాం యుధి ।
నివారయంతం సంగ్ఱామే బలాత్ సౌభం సరాజకమ్ ॥ 30
మీరంతా నిలవండి, యుద్ధరంగంలో శాల్వునితో పాటుగ సౌభవిమానాన్ని బలవంతంగా నిలువరిస్తాను నన్ను చూడండి. (30)
అహం సౌభపతేః సేనామ్ ఆయసైర్భుజగైరివ ।
ధనుర్భుజవినిర్ముక్తైః నాశయామ్యద్య యాదవాః ॥ 31
యాదవులారా! నేను సౌభపతియైన శాల్వునిసేనను లోహమయమైన సర్పాల చేత వలె ధనుర్దండం నుండి వెలువడిన బాణాలచే ఇపుడే నాశనం చేస్తాను. (31)
ఆశ్వసధ్వం న భీః కార్యా సౌభరాడద్య నశ్యతి ।
మయాభిపన్నో దుష్టాత్మా ససౌభో వినశిష్యతి ॥ 32
యాదవులారా! ధైర్యం వహించి ఊరడిల్లండి. భయం వద్దు, సౌభపతి శాల్వుడు ఇపుడే నశిస్తాడు. నాతో తలపడిన దుష్టాత్ముడైన శాల్వుడు సౌభసహితంగా నశిస్తాడు. (32)
ఏవం బ్రువతి సంహృష్టే ప్రద్యుమ్నే పాండునందన ।
విష్ఠితం తద్ బలం వీర యుయుధే చ యథాసుఖమ్ ॥ 33
పాండునందనా! ఈ విధంగా ఆనందంతో ప్రద్యుమ్నుడు చెపుతుండగా, ఆ సైన్యమంతా యుద్ధంలో స్థిరంగా నిలబడింది. ఉత్సాహంతో యుద్ధం చేసింది. (33)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అర్జునాభిగమనపర్వణి సౌభవధోపాఖ్యానే షోడశోఽధ్యాయః ॥ 16 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అర్జునాభిగమన పర్వమను ఉపపర్వమున సౌభవధోపాఖ్యానమను పదునారవ అధ్యాయము. (16)