2. రెండవ అధ్యాయము
ధర్మరాజుతో శౌనకుడు ప్రసంగించుట.
వైశంపాయన ఉవాచ
ప్రభాతాయాం తు శర్వర్యాం తేషామక్లిష్టకర్మణామ్ ।
వనం యియాసతాం విప్రాః తస్థుర్భిక్షాభుజోఽగ్రతః ॥ 1
వైశంపాయనుడు ఇలా అన్నాడు - ఆ రాత్రి గడచింది. తెల్లవారగానే అనాయాసంగా సత్కర్మాచరణం చేసే పాండవులు వనంలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో భిక్షాన్నంతో జీవించే బ్రాహ్మణులు వారితో పాటు వెళ్ళాడానికి వారి దగ్గర నిల్చున్నారు. (1)
తానువాచ తతో రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
వయం హి హృతసర్వస్వాః హృతరాజ్యా హృతశ్రియః ॥ 2
ఫలమూలాశనాహారాః వనం గచ్ఛామ దుఃఖితాః ।
వనం చ దోషబహులం బహువ్యాలసరీసృపమ్ ॥ 3
అపుడు కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు వారితో ఇలా అన్నాడు - బ్రాహ్మణులారా! మేము జూదంలో సమస్తధనం, రాజ్యం, సంపద పోగొట్టుకొన్నవాళ్ళం. ఫలమూలాలే ఆహారంగా తీసికొంటూ దుఃఖంతో వనానికి వెళుతున్నాం. అరణ్యం చాలా దోషాలకు నిలయం. సర్ప, సరీసృపాది భయంకర జంతువులతో కూడి ఉంటుంది. (2,3)
పరిక్లేశశ్చ వో మన్యే ధ్రువం తత్ర భవిష్యతి ।
బ్రాహ్మణానాం పరిక్లేశః దైవతాన్యపి సాదయేత్ ।
కిం పునర్మామితో విప్రాః నివర్తధ్వం యథేష్టతః ॥ 4
అక్కడ మీకు చాలా కష్టం కలుగుతుంది. ఇది నిశ్చయం. బ్రాహ్మణులకు కష్టం కలిగిస్తే అది దేవతలను కూడ నాశనం చేస్తుంది. ఇక నా మాట చెప్పాలా? అందువల్ల బ్రాహ్మణులారా! ఇక్కడ నుండి మీకిష్టమైన ప్రదేశానికి తిరిగివెళ్ళండి. (4)
బ్రాహ్మణా ఊచుః
గతిర్యా భవతాం రాజన్ తాం వయం గంతుముద్యతాః ।
నార్హస్యస్మాన్ పరిత్యక్తుం భక్తాన్ సద్ధర్మదర్శినః ॥ 5
బ్రాహ్మణులిలా అన్నారు - రాజా! మీరు ఎక్కడకు వెళితే అక్కడకే మేమూ రావడానికి సిద్ధంగా ఉన్నాం. నీ యొక్క భక్తులమూ, సద్ధర్మం పట్ల దృష్టీ గల మమ్ములను విడిచిపెట్టడం నీకు తగదు. (5)
అనుకంపాం హి భక్తేషు దేవతా హ్యపి కుర్వతే ।
విశేషతో బ్రాహ్మణేషు సదాచారావలంబిషు ॥ 6
భక్తుల మీద దేవతలు కూడా జాలి చూపుతారు. అందునా ప్రత్యేకించి సదాచారాన్ని అవలంబించే బ్రాహ్మణుల మీద తప్పక జాలి చూపుతారు. (6)
యుధిష్ఠిర ఉవాచ
మమాపి పరమా భక్తిః బ్రాహ్మణేషు సదా ద్విజాః ।
సహాయవిపరిభ్రంశః త్వయం సాదయతీవ మామ్ ॥ 7
ఆహరేయురిమే యేఽపి ఫలమూలమధూని చ ।
త ఇమే శోకజైర్దుఃఖైః భ్రాతరో మే విమోహితాః ॥ 8
యుధిష్ఠిరుడిలా అన్నాడు - బ్రాహ్మణులారా! నాకు కూడా బ్రాహ్మణుల యందు మిక్కిలి ఉత్కృష్టమైన భక్తి ఉంది. ఏ సహాయసాధనమూ లేని నా స్థితి నన్ను బాధిస్తోంది. ఈ నా సోదరులు ఫల, మూల, మధువులను తేగలరు. కాని వారు కూడా శోకం వల్ల కలిగిన దుఃఖంతో సమ్మోహితులై ఉన్నారు. (7,8)
ద్రౌపద్యా విప్రకర్షేణ రాజ్యాపహరణేన చ ।
దుఃఖార్దితానిమాన్ క్లేశైః నాహం యోక్తుమిహోత్సహే ॥ 9
ద్రౌపదికి జరిగిన అవమానంచేతనూ, రాజ్యాపహరణం చేతనూ నా సోదరులు మిక్కిలి దుఃఖపీడితులై ఉన్నారు. అందువల్ల వారినింకా కష్టాలపాలు చేయడం నాకిష్టం లేదు. (9)
బ్రాహ్మణా ఊచుః
అస్మత్పోషణజా చింతా మా భూత్ తే హృది పార్థివ ।
స్వయమాహృత్య చాన్నాని త్వానుయాస్యామహే వయమ్ ॥ 10
బ్రాహ్మణులిలా అన్నారు - రాజా! మా పోషణను గురించిన చింత నీకు అక్కర లేదు. మేము స్వయంగా మా అన్నాదికాలను సమకూర్చునొకి మీ వెంట వస్తాం. (10)
అనుధ్యానేన జప్యేన విధాస్యామః శివం తవ ।
కథాభిశ్చాభిరమ్యాభిః సహ రంస్యామహే వయమ్ ॥ 11
ఇష్టమైన ధ్యానంతోనూ, జపాలతోనూ నీకు శుభాన్ని కలుగజేస్తాం. అందమైన కథలతో నీతోపాటు ఆనందంగా ఉంటాం. (11)
యుధిష్ఠిర ఉవాచ
ఏవమేత్న్న సందేహః రమేఽహం సతతం ద్విజైః ।
న్యూనభావాత్ తు పశ్యామి ప్రత్యాదేశమివాత్మనః ॥ 12
యుధిష్ఠిరుడిలా అన్నాడు - మహాత్ములారా! ఇది ఇంతే. సందేహం లేదు. నేను బ్రాహ్మణులతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. కాని ధనహీనత వల్ల నాకిది అపకీర్తికరమని చూస్తున్నాను. (12)
కథం ద్రక్ష్యామి వః సర్వాన్ స్వయమాహృతభోజనాన్ ।
మద్భక్త్యా క్లిశ్యతోఽనర్హాన్ ధిక్ పాపాన్ ధృతరాష్ట్రజాన్ ॥ 13
మీరు స్వయంగా ఆహారం తెచ్చుకొని తింటూంటే నేను ఎలా చూడగలను? మీరు కష్టాలనుభవించడానికి తగినవారు కారు. కాని నాపట్ల భక్తితో కష్టాలు పడుతుంటే ఎలా చూడగలను? దీనికంతటికి పాపాత్ములైన ధార్తరాష్ట్రులు నిందింపదగినవారు. (13)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్త్వా స నృపః శోచన్ నిషసాద మహీతలే ।
తమధ్యాత్మరతో విద్వాన్ శౌనకో నామ వై ద్విజః ॥ 14
యోగే సాంఖ్యే చ కుశలః రాజానమిదమబ్రవీత్ ॥ 15
వైశంపాయనుడిలా అన్నాడు - రాజా! ఈ విధంగా చెప్పి ధర్మరాజు దుఃఖిస్తూ నేలపై చతికిలపడ్డాడు. అపుడు ఆధ్యాత్మరతుడు, విద్వాంసుడు, యోగశాస్త్రంలోనూ, సాంఖ్యశాస్త్రంలోనూ కుశలుడూ అయిన శౌనకుడనే బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు. (14,15)
శోకస్థానసహస్రాణి భయస్థానశతాని చ ।
దివసే దివసే మూఢమ్ ఆవిశంతి న పండితమ్ ॥ 16
శోకింపదగిన సందర్భాలు వేలకొద్దీ ఉంటాయి. భయపడదగిన సందర్భాలు వందలకొద్దీ ఉంటాయి. అవి నిత్యం మూఢుడైన మానవుని మాత్రమే ఆవేశిస్తాయి. పండితుని అవి ప్రభావితం చేయలేవు. (16)
న హి జ్ఞానవిరుద్ధేషు బహుదోషేషు కర్మసు ।
శ్రేయోఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః ॥ 17
జ్ఞాన విరుద్ధాలైన కర్మలలోనూ, దోషయుక్తాలై శ్రేయస్సును భంగపరిచే కర్మలలోనూ నీవంటి బుద్ధిమంతులు ఆసక్తి చూపరు. (17)
అష్టాంగాం బుద్ధిమాహుర్యాం సర్వాశ్రేయోఽభిఘాతినీమ్ ।
శ్రుతిస్మృతిసమాయుక్తాం రాజన్ సా త్వయ్యవస్థితా ॥ 18
రాజా! అన్ని అమంగళాలను నాశనం చేయగలిగి, యమనియమాదులైన అష్టాంగములుగలిగి, శ్రుతి స్మృతులచే సమర్థింపబడే ఉత్తమమైన బుద్ధి నీలో ఉన్నది. (18)
అర్థకృచ్ఛ్రేషు దుర్గేషు వ్యాపత్సు స్వజనస్య చ ।
శారీరమానసైర్దుఃఖైః న సీదంతి భవద్విధాః ॥ 19
ధననాశనం వల్ల కలిగిన కష్టాలలోను, దాటశక్యంగాని దుఃఖాలలోను, స్వజనానికి వచ్చిన ఆపదలలోనూ నీ వంటివారు శారీరక మానసిక దుఃఖాలతో కృశించరు. (19)
శ్రూయాతాం చాభిధాస్యామి జనకేన యథా పురా ।
ఆత్మవ్యవస్థానకరాః గీతాః శ్లోకా మహాత్మనా ॥ 20
పూర్వకాలంలో ఆత్మస్థైర్యాన్ని కలిగించే గీతాలను మహాత్ముడైన జనకుడు గానం చేశాడు. నేను ఆ శ్లోకాలను చెప్తాణు విను. (20)
మనోదేహసముత్థాభ్యాం దుఃఖాభ్యామర్దితం జగత్ ।
తయోర్వ్యాససమాసాభ్యాం శమోపాయమిమం శృణు ॥ 21
ఈ జగత్తంతా, శారీరక దుఃఖాలతోను, మానసిక దుఃఖాలతోనూ బాధపడుతూ ఉంటుంది. వాటిని శాంతింపజేసే ఉపాయాన్ని సంక్షేపంగాను, విస్తరంగాను చెపుతా విను. (21)
వ్యాధేరనిష్టసంస్పర్శాత్ శ్రమాదిష్టవివర్జనాత్ ।
దుఃఖం చతుర్భిః శారీరం కారణైః సంప్రవర్తతే ॥ 22
1) వ్యాధి 2) అనిష్టసంఘటనం 3) శ్రమ 4) ఇష్టమైన దాన్ని విడవటం అనే ఈ నాలుగు కారణాల వల్ల శారీరక దుఃఖం కలుగుతుంది. (22)
తదా తత్ర్పతికారాచ్చ సతతం చావిచింతనాత్ ।
ఆధివ్యాధిప్రశమనం క్రియాయోగద్వయేన తు ॥ 23
సకాలంలో ఈ నాలుగింటికి 1) ప్రతీకారం (విరుగుడు) చేయడం 2) వాటిని గురించి ఆలోచించకపోవటం అనే ఈ రెండు నివారణోపాయాలచేత ఆధివ్యాధులను ఉపశమింపజేయవచ్చు. (23)
మతిమంతో హ్యతో వైద్యాః ప్రాగేవ కుర్వతే ।
మానసస్య ప్రియాఖ్యానైః సంభోగోపనయైర్నృణామ్ ॥ 24
అందువలన బుద్ధిమంతులు, విద్యావంతులు అయిన మానవులు మనసునకు ప్రియమైన మాటలచేత, హితాలైన భోగాలను కూర్చటంచేత ముందుగానే మానసిక దుఃఖాలకు ఉపశమనం కలిగిస్తారు. (24)
మానసేన హి దుఃఖేన శరీరముపతప్యతే ।
అయఃపిండేన తప్తేన కుంభసంస్థమివోదకమ్ ॥ 25
కాల్చిన ఇనుపగుండును కుండలోని నీటిలో వేస్తే, ఆ నీరు కుతకుతలాడుతుంది. మానసిక దుఃఖం చేత శరీరం కూడా అలాగే తాపం చెందుతుంది. (25)
మానసం శమయేత్ తస్మాత్ జ్ఞానేనాగ్నిమివాంబునా ।
ప్రశాంతే మానసే హ్యస్య శారీరముపశామ్యతి ॥ 26
అందువలన నీటిచేత అగ్నిని ఉపశమించినట్లుగా జ్ఞానం చేత మానసిక దుఃఖాన్ని శాంతింపజేయాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటే అతని శారీరక తాపం కూడా ఉపశమిస్తుంది. (26)
మనసో దుఃఖమూలం తు స్నేహ ఇత్యుపలభ్యతే ।
స్నేహాత్ తు సజ్జతే జంతుః దుఃఖయోగముపైతి చ ॥ 27
మానసిక దుఃఖానికి మూలం స్నేహం (సంసారం పట్ల ఆసక్తి) ఈ స్నేహం వల్లనే జీవుడు ఆసక్తుడై దుఃఖాన్ని పొందుతున్నాడు. (27)
స్నేహమూలాని దుఃఖాని స్నేహజాని భయాని చ ।
శోకహర్షౌ తథాఽఽయాసః సర్వం స్నేహాత్ ప్రవర్తతే ॥ 28
స్నేహాద్ భావోఽనురాగశ్చ ప్రజజ్ఞే విషయే తథా ॥
అశ్రేయస్కావుభావేతౌ పూర్వస్తత్ర గురుః స్మృతః ॥ 29
దుఃఖాలన్నీ స్నేహం కారణంగానే ఏర్పడుతున్నాయి. భయాలూ స్నేహం వల్లే కలుగుతున్నాయి. శోకం, ఆనందం, ఆయాసం (అలసట) అన్నీ స్నేహం వల్లే కలుగుతున్నాయి. స్నేహం వల్లనే విషయసుఖం మీద మనసూ (భావం), అనురాగమూ ఏర్పడుతున్నాయి. ఈ భావానురాగాలు రెండూ అనర్థకారకాలే. అందులో మొదటిదైన భావం మిక్కిలి అనర్థకారకం. (28,29)
కోటరాగ్నిర్యథాశేషం సమూలం పాదపం దహేత్ ।
ధర్మార్థౌ తు తథాల్పోఽపి రాగదోషో వినాశయేత్ ॥ 30
చెట్టుతొర్రలోని నిప్పు చెట్టును సమూలంగా పూర్తిగా దహించినట్లు, స్వల్పమైనదైనా రాగమనే దోషం ధర్మార్థాలను రెంటినీ నాశనం చేస్తుంది. (30)
విప్రయోగే న తు త్యాగీ దోషదర్శీ సమాగమే ।
విరాగం భజతే జంతుః నిర్వైరో నిరవగ్రహః ॥ 31
విషయసుఖాలు అందుబాటులోలేక వాటిని విడిచి పెట్టేవాడు త్యాగి కాదు. విషయసుఖాలు లభించినప్పటికీ వాటియందు దోషాన్ని గుర్తించి విడిచిపెట్టేవాడే అసలైన త్యాగి. అట్టివాడే వైరాగ్యాన్ని పొందుతాడు. మనస్సులో దేనిపట్లా వైరం లేకుండా బంధవిముక్తుడౌతాడు. (31)
తస్మాత్ స్నేహం న లిప్సేత మిత్రేభ్యో ధనసంచయాత్ ।
స్వశరీరసముత్థం చ జ్ఞానేన వినివర్తయేత్ ॥ 32
అందువల్ల మిత్రులపట్ల గాని, ధనరాశుల పట్లగాని ఆసక్తి కలిగి ఉండకూడదు. తన శరీరం పట్ల కలిగిన ఆసక్తిని కూడా జ్ఞానం చేత నివారించుకోవాలి. (32)
జ్ఞానాన్వితేషు యుక్తేషు శాస్త్రజ్ఞేషు కృతాత్మసు ।
న తేషు సజ్జతే స్నేహః పద్మపత్రేష్వివోదకమ్ ॥ 33
తామరాకుమీద నీరు అంటదు. అలాగే జ్ఞానులు, యోగులు, శాస్త్రజ్ఞులు, జితేంద్రియులు - వీరి మీద ఆసక్తి అనేది తన ప్రభావాన్ని చూపలేదు. (33)
రాగాభిభూతః పురుషః కామేన పరికృష్యతే ।
ఇచ్ఛా సంజాయతే తస్య తతస్తృష్ణా వివర్ధతే ॥ 34
తృష్ణా హి సర్వపాపిష్ఠా నిత్యోద్వేగకరీ స్మృతా ।
అధర్మబహులా చైవ ఘోరా పాపానుబంధినీ ॥ 35
రాగానికి వశుడైనవాడు కామంచేత ఆకర్షింపబడతాడు. దానిచేత అతనిలో కోరిక పుడుతుంది. దానివల్ల తృష్ణ వృద్ధి చెందుతుంది. తృష్ణ అన్నింటికంటె పాప ప్రవృత్తిని కలిగిస్తుంది. అది నిత్యం మానసికోద్వేగాన్ని కలిగిస్తుంది. అధర్మంతో కూడిన ఘోరమైన పాపపరంపరలోకి నెట్టుతుంది. (34,35)
యా దుస్త్యజా దుర్మతిభిః యా న జీర్యతి జీర్యతః ।
యోఽసౌ ప్రాణాంతికో రోగః తాం తృష్ణాం త్యజతః సుఖమ్ ॥ 36
ఎంతటి బుద్ధిమంతులకైనా ఈ తృష్ణ విడువశక్యం గాదు. శరీరం నశిస్తున్నా ఈ తృష్ణమాత్రం నశించదు. ఈ తృష్ణ ప్రాణాంతకమైన రోగం. దీన్ని విడిచినవానికే సుఖం లభిస్తుంది. (36)
అనాద్యంతా తు సా తృష్ణా అంతర్దేహగతా నృణామ్ ।
వినాశయతి భూతాని అయోనిజ ఇవానలః ॥ 37
మానవుల శరీరాంతర్గతంగా ఉండే ఈ తృష్ణకు ఆద్యంతాలు లేవు. కాలిన ఇనుపగుండువలె ఇది ప్రాణులను నాశనం చేస్తుంది. (37)
యథైధః స్వసముత్థేన వహ్నినా నాశమృచ్ఛతి ।
తథాకృతాత్మా లోభేన సహజేన వినశ్యతి ॥ 38
కర్ర తన నుండి పుట్టిన నిప్పు వల్లనే నశిస్తుంది. అదే విధంగా వశం తప్పిన మనసు కల మానవుడు సహజంగా తనలో నుండి పుట్టిన లోభం చేతనే నాశనమవుతాడు. (38)
రాజతః సలిలాదగ్నేః చోరతః స్వజనాదపి ।
భయమర్థవతాం నిత్యం మృత్యోః ప్రాణభృతామివ ॥ 39
ప్రాణులందరికీ మృత్యువు వల్ల భయమున్నట్లుగా ధనవంతులందరికి రాజు వల్ల, నీటి వల్ల, నిప్పు వల్ల, దొంగ వల్ల, తనవారి వల్లనూ ఎల్లపుడూ భయం కలుగుతూనే ఉంటుంది. (39)
యథా హ్యామిషమాకాశే పక్షిభిః శ్వాపదైర్భువి ।
భక్ష్యతే సలిలే మత్స్యైః తథా సర్వత్ర విత్తవాన్ ॥ 40
మాంసం ఆకాశంలో పక్షుల చేత, భూమి మీద క్రూరమృగాలచేత (శ్వాపదాలచేత), నీటిలో చేపలచేత తినబడినట్లుగా, ధనవంతుడు అంతటా అందరిచేత తినబడతాడు. (40)
అర్థ ఏవ హి కేషాంచిద్ అనర్థం భజతే నృణామ్ ।
అర్థశ్రేయసి చాసక్తః న శ్రేయో విందతే నరః ॥ 41
మానవులకు కొందరికి ధనమే అనర్థానికి కారణమవుతుంది. డబ్బు వల్ల కలిగే సుఖాల మిద ఆసక్తి కలవాడు శాశ్వతమైన (శ్రేయస్సును) సుఖాన్ని పొందలేడు. (41)
తస్మాదర్థాగమాః సర్వే మనోమోహవివర్ధనాః ।
కార్పణ్యం దర్పమానౌ చ భయముద్వేగ ఏవ చ ॥ 42
అర్థజాని విదుః ప్రాజ్ఞాః దుఃఖాన్యేతాని దేహినామ్ ।
అర్థస్యోత్పాదనే చైవ పాలనే చ తథాక్షయే ॥ 43
సహంతి చ మహద్ దుఃఖం ఘ్నంతి చైవార్థకారణాత్ ।
అర్థా దుఃఖం పరిత్యక్తుం పాలితాశ్చైవ శత్రవః ॥ 44
అందువల్ల ధనప్రాప్తికై చేసే ఉపాయాలన్నీ మనస్సులోని మొహాన్ని పెంచేవే. మానవులకు డబ్బువల్ల కార్పణ్యం, గర్వం (అభిమానం), కోపం, భయం, ఉద్వేగం అనే దుఃఖాలు కలుగుతాయని విద్వాంసులు చెప్తారు. డబ్బు సంపాదించడంలో, దాన్ని రక్షించుకోవడంలో, అది క్షీణించినపుడూ మానవులు మిక్కిలి దుఃఖాన్ని అనుభవిస్తారు. డబ్బుకారణంగా ఇతరులను చంపుతారు. డబ్బును త్యాగం చేయటం వల్ల చాలా దుఃఖం కలిగిస్తుంది. ధనాన్ని రక్షించినా, అది శత్రువువంటిదే. (42-44)
దుఃఖేన చాధిగమ్యంతే తస్మాన్నాశం న చింతయేత్ ।
అసంతోషపరా మూఢాః సంతోషం యాంతి పండితాః ॥ 45
ధనాన్ని దుఃఖంతో (కష్టంతో) సంపాదిస్తారు. అందువల్ల దాని నాశాన్ని గురించి చింతించకూడదు. మూఢులు ఎల్లప్పుడూ అసంతుష్టులుగానే ఉంటారు. పండితులు సంతుష్టులుగా ఉంటారు. (45)
అంతో నాస్తి పిపాసాయాః సంతోషః పరమం సుఖమ్ ।
తస్మాత్ సంతోషమేవేహ పరం పశ్యంతి పండితాః ॥ 46
ధనదాహానికి అంతులేదు. సంతుష్టే మిక్కిలి సుఖం. అందువల్ల పండితులు సంతోషమే గొప్పదని భావిస్తారు. (46)
అనిత్యం యౌవనం రూపం జీవితం రత్నసంచయః ।
ఐశ్వర్యం ప్రియసంవాసః గృధ్యేత్ తత్ర న పండితః ॥ 47
యౌవనం, అందం, జీవితం, రత్నాలు కూడబెట్టడం, ఐశ్వర్యం, ఇష్టులతో ఉండటం - ఇవన్నీ అనిత్యాలే. వీటి పట్ల పండితుడు లోభం చెందకూడదు. (47)
త్యజేత సంచయాంస్తస్మాత్ తజ్జాన్ క్లేశాన్ సహేత చ ।
న హి సంచయవాన్ కశ్చిద్ దృశ్యతే నిరుపద్రవః ।
అతశ్చ ధార్మికైః పుంభిః అనీహార్థః ప్రశస్యతే ॥ 48
అందువల్ల ధనాన్ని కూడబెట్టడాన్ని విడిచిపెట్టాలి. దాని వల్ల కలిగే కష్టాలను ధైర్యంగా సహించాలి. ధనాన్ని కూడబెట్టినవాడు ఎవడూ కూడా (ఉపద్రవం) కష్టపడకుండా లేడు. అందుకే ధార్మికులైన జనులు దైవేచ్ఛగా లభించిన ధనాన్నే ప్రశంసించారు. (48)
ధర్మార్థం యస్య విత్తేహా వరం తస్య నిరీహతా ।
ప్రక్షాలనాద్ధి పంకస్య శ్రేయో న స్పర్శనం నృణామ్ ॥ 49
ధర్మంకోసం ధనాన్ని కోరేవాడు కూడా ధనాన్ని కోరకుండా ఉండటమే మంచిది. బురదను తొక్కి కాలు కడుగుకొనటం కంటె, దూరంగా తాకకుండా ఉండటమే మానవులకు శ్రేయస్సు కదా! (49)
యుధిష్ఠిరైవం సర్వేషి న స్పృహాం కర్తుమర్హసి ।
ధర్మేణ యది తే కార్యం విముక్తేచ్ఛో భవార్థతః ॥ 50
యుధిష్ఠిరా! ఈ విధంగా నీవు దేవిపట్లనూ కోరిక కలిగి ఉండటం యుక్తం కాదు. నీవు ధర్మ ప్రయోజనం కోరుతుంటే అర్థం పట్ల కోరికను విడిచిపెట్టు. (50)
యుధిష్ఠిర ఉవాచ
నార్థోపభోగలిప్సార్థమ్ ఇయమర్థేప్సుతా మమ ।
భరణార్థం తు విప్రాణాం బ్రహ్మన్ కాంక్షే న లోభతః ॥ 51
ధర్మరాజు అన్నాడు - బ్రాహ్మణోత్తమా! ధనం వల్ల కలిగే భోగాల పట్ల కాంక్షతో నేను ధనాన్ని కోరడం లేదు. ఈ బ్రాహ్మణులను పోషించడం కోసం ధనాన్ని కాంక్షిస్తున్నాను కాని ధనం పట్ల లోభం వల్ల కాదు. (51)
కథం హ్యస్మద్విధో బ్రహ్మన్ వర్తమానో గృహాశ్రమే ।
భరణం పాలనం చాపి న కుర్యాదనుయాయినామ్ ॥ 52
బ్రాహ్మణోత్తమా! నా వంటివాడు గృహస్థాశ్రమంలో ఉంటూ తన్ను అనుసరించినవారి రక్షణపోషణలను చేయకుండా ఎలా ఉండగలడు? (52)
సంవిభాగో హి భూతానాం సర్వేషామేవ దృశ్యతే ।
తథైవాపచమానేభ్యః ప్రదేయం గృహమేధినా ॥ 53
గృహస్థుని భోజనంలో దేవ పితృ మనుష్యాది సమస్తప్రాణులకు భాగం కల్పింపబడింది. అదేవిధంగా తాముగా వండుకొని తినని సన్యాసి మొదలైన వారికి గృహస్థు తప్పక అన్నం పెట్టాలి. (53)
తృణాని భూమిరుదకం వాక్ చతుర్థీ చ సూనృతా ।
సతామేతాని గేహేషు నోచ్ఛిద్యంతే కదాచన ॥ 54
కూర్చోడానికి స్థానం, ఆసనానికి తృణం(కుశలు), త్రాగటానికి నీరు, తీయని సత్యవాక్కు - ఈ నాలుగు సత్పురుషుల ఇళ్ళలో ఎన్నడూ తరిగిపోవు. (54)
దేయమార్తస్య శయనం స్థితశ్రాంతస్య చాసనమ్ ।
తృషితస్య చ పానీయం క్షుధితస్య చ భోజనమ్ ॥ 55
రోగాదిపీడితునికి శయ్య, మిక్కిలి శ్రమచెందిన వానికి ఆసనం, దప్పిక గలవానికి పానీయం, ఆకలిగొన్న వానికి భోజనం ఇవ్వాలి. (55)
చక్షుర్దద్యాన్మనో దద్యాద్ వాచం దద్యాత్ సుభాషితామ్ ।
ఉత్థాయ చాసనం దద్యాద్ ఏష ధర్మః సనాతనః ॥ 56
ఇంటికి వచ్చిన వానిని ఆదరంగా చూడాలి. మనసిచ్చి మంచి మాటలు పలకాలి. లేచి ఆసనం ఇవ్వాలి. అతిథిరావడం చూడగానే లేచి ఎదురేగాలి. ఉచితంగా అతనిని గౌరవించాలి - ఇది సనాతనమైన ధర్మం. (56)
అగ్నిహోత్రమనడ్వాంశ్చ జ్ఞాతయోఽతిథిబాంధవాః ।
పుత్రా దారాశ్చ భృత్యాశ్చ నిర్దహేయురపూజితాః ॥ 57
అగ్నిహోత్రం, ఆబోతు, జ్ఞాతులు, అతిథులు, బాంధవులు, పుత్రులు, భార్య, సేవకులు - వీరిని గృహస్థు యథోచితంగా గౌరవించాలి. అలా చేయకుంటే వారి కోపాగ్నిచే గృహస్థుడు దహింపబడుతాడు. (57)
ఆత్మార్థం పాచయేన్నాన్నం న వృథా ఘాతయేత్ పశూన్ ।
న చ తత్ స్వయమశ్నీయాద్ విధివద్ యన్న నిర్వపేత్ ॥ 58
కేవలం తనకోసమే అన్నం వండుకొనకూడదు. వృథాగా పశువులను హింసింపగూడదు. విధిపూర్వకంగా దేవతాదులకు సమర్పింపని దాన్ని తాను కూడా తినరాదు. (58)
శ్వభ్యశ్చ శ్వపచేభ్యశ్చ వయోభ్యశ్చావపేద్ భువి ।
వైశ్వదేవం హి నామైతత్ సాయం ప్రాతశ్చ దీయతే ॥ 59
కుక్కలకు, శ్వపాకులయిన చండాలురకూ, పక్షులకూ నేలపై అన్నాన్ని విడిచిపెట్టాలి. ఉదయం, సాయంకాలం ఇలా ఇవ్వటాన్ని వైశ్వదేవమని అంటారు. (59)
విఘసాశీ భవేత్ తస్మాత్ నిత్యం చామృతభోజనః ।
విఘసో భుక్తశేషం తు యజ్ఞశేషం తథామృతమ్ ॥ 60
ఇంటిలో అందరికీ పెట్టగా మిగిలిన అన్నమును విఘసమంటారు. (యజ్ఞశేషమైన) వైశ్వదేవం చేశాక ఉన్న అన్నాన్ని అమృతమంటారు. అందువల్ల గృహస్థుడు నిత్యమూ విఘసాశి, అమృతభోజనుడు కావాలి. (60)
చక్షుర్దద్యాన్మనో దద్యాద్ వాచం దద్యాచ్చ సూనృతామ్ ।
అనువ్రజేదుపాసీత స యజ్ఞః పంచదక్షిణః ॥ 61
అతిథిపై దృష్టిపెట్టాలి. మనస్సు పెట్టాలి. సత్యమైన మధురభాషణం చేయాలి. వెళ్లేటప్పుడు అతనిని అనుసరించాలి. ఇంటిలో ఉన్నంతసేపూ అతనితో గడపాలి (సేవించాలి). ఇదే ఐదు దక్షిణలతో కూడిన అతిథియజ్ఞం. (61)
యో దద్యాదపరిక్లిష్టమ్ అన్నమధ్వని వర్తతే ।
శ్రాంతాయాదృష్టపూర్వాయ తస్య పుణ్యఫలం మహత్ ॥ 62
అపరిచితుడు, శ్రాంతుడూ అయిన బాటసారికి ప్రసన్నతతో అన్నం పెట్టిన గృహస్థునికి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. (62)
ఏవం యో వర్తతే వృత్తిం వర్తమానో గృహాశ్రమే ।
తస్య ధర్మం పరం ప్రాహుః కథం వా విప్ర మన్యసే ॥ 63
విప్రోత్తమా! ఈ విధంగా గృహస్థాశ్రమంలో వ్యవహరించే గృహస్థు ఉత్తమధర్మాన్ని పొందుతాడని చెపుతున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి? (63)
శౌనక ఉవాచ
అహో బత మహత్ కష్టం విపరీతమిదం జగత్ ।
యేనాపత్రపతే సాధుః అసాధుస్తేన తుష్యతి ॥ 64
శౌనకుడిలా అన్నాడు - అయ్యో! ఇది చాలా దుఃఖకరమైన మాట. ఈ లోకంలో పరస్పర విరుద్ధాలైన విషయాలు కనబడుతున్నాయి. సత్పురుషుడు దేనికి సిగ్గుపడుతున్నాడో, దుష్టుడు దానిచేతనే సంతోషిస్తున్నాడు. (64)
శిశ్నోదరకృతేఽప్రాజ్ఞః కరోతి విఘసం బహు ।
మోహరాగవశాక్రాంతః ఇంద్రియార్థవశానుగః ॥ 65
మూర్ఖుడు (అజ్ఞాని) తన అశన, శిశ్నతృప్తికై (ఉదర పోషణకు, జననేంద్రియతృప్తికి) ఇంద్రియార్థాలైన విషయసుఖాలకు వశుడై మోహరాగాలకు అధీనుడై విషయసామగ్రినే విఘసంగా భావించి, వాటిని సంపాదిస్తాడు. (65)
హ్రియతే బుధ్యమానోఽపి నరో హారిభిరింద్రియైః ।
విమూఢసంజ్ఞో దుష్టాశ్వైః ఉద్భ్రాంతైరివ సారథిః ॥ 66
తెలిసినవాడైనా మానవుడు ఆకర్షించే స్వభావం కల ఇంద్రియాలచేత విషయాల వైపుకు లాగబడతాడు. అట్టివాడు విచారణశక్తిని కోల్పోయి అదుపులోలేని గుర్రాల చేత సారథి పొందే అవస్థ పొందుతాడు. (66)
షడింద్రియాణి విషయం సమాగచ్ఛంతి వై యదా ।
తదా ప్రాదుర్భవత్యేషాం పూర్వసంకల్పజం మనః ॥ 67
మనస్సుతోపాటు పంచేంద్రియాలు వాటి వాటి విషయాల పట్ల ప్రవర్తించినపుడు, ప్రాణుల పూర్వ సంకల్పానికి అనుగుణంగా మనస్సు చలిస్తుంది. (67)
మనో యస్యేంద్రియ స్యేహ విషయాన్ యాతి సేవితుమ్ ।
తస్యౌత్సుక్యం సంభవతి ప్రవృత్తిశ్చోపజాయతే ॥ 68
మనస్సు ఏ ఇంద్రియ సంబంధమయిన విషయాలను సేవింపగోరుతుందో ఆ విషయాల మీద ఆసక్తి కల్గుతుంది. వాటి అనుభవమందు మనసుకు ప్రవృత్తి కలుగుతుంది. (68)
తతః సంకల్పబీజేన కామేన విషయేషుభిః ।
విద్ధః పతతి లోభాగ్నౌ జ్యోతిర్లోభాత్ పతంగవత్ ॥ 69
అనంతరం మానవుడు సంకల్పమనే బీజం గల కాముని యొక్క్ విషయాలనే బాణాలచే కొట్టబడతాడు. అగ్నిపట్ల లోభంతో పురుగు అగ్నిలో పడిపోతుంది. అలాగే మానవుడు లోభాగ్నిలో పడతాడు. (69)
తతో విహారైరాహారైః మోహితశ్చ యథేప్సయా ।
మహామోహే సుఖే మగ్నః నాత్మానమవబుధ్యతే ॥ 70
అటుపై యథేచ్ఛగా ఆహారవిహారాలచే మోహితుడై మహామోహమయమైన విషయసుఖంలో మునిగిపోతాడు. తన్ను తాను తెలిసికోలేడు. (70)
ఏవం పతతి సంసారే తాసు తాస్విహ యోనిషు ।
అవిద్యాకర్మతృష్ణాభిః భ్రామ్యమాణో ఽథ చక్రవత్ ॥ 71
ఈ విధంగా అవిద్య, కర్మ, తృష్ణలచే చక్రం వలె సంసారంలో తిరుగుతూ వివిధ యోనుల యందు పడుతున్నాడు (జన్మలెత్తుతున్నాడు). (71)
బ్రహ్మాదిషు తృణాంతేషు భూతేషు పరివర్తతే ।
జలే భువి తథాఽఽకాశే జాయమానః పునః పునః ॥ 72
బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచవరకు కల అన్నిప్రాణులలోను ఆకాశంలో, జలంలో, భూమి మీద మరల మరల పుట్టుతున్నాడు. (72)
అబుధానాం గతిస్త్వేషా బుధానామపి మే శృణు ।
యే ధర్మే శ్రేయసి రతాః విమోక్షరతయో జనాః ॥ 73
అజ్ఞానులైన మానవుల గతి ఈ విధంగా ఉంటుంది. ఇక ధర్మమునందు, శ్రేయస్సునంది తత్పరులై, మోక్షాసక్తి గల వివేకుల గతిని గురించి చెప్తాను విను. (73)
తదిదం వేదవచనం కురు కర్మ త్యజేతి చ ।
తస్మాద్ ధర్మానిమాన్ సర్వాన్ నాభిమానాత్ సమాచరేత్ ॥ 74
కర్మను చెయ్యి, విడిచిపెట్టు అని వేదవచనం. అందువల్ల ఈ ధర్మాలన్నింటిని అభిమానంతో "నేను చేస్తున్నాను" అనే భావంతో చేయరాదు. (74)
ఇజ్యాధ్యయనదానాని తపః సత్యం క్షమా దమః ।
అలోభ ఇతి మార్గోఽయం ధర్మస్యాష్టవిధః స్మృతః ॥ 75
యజ్ఞం, అధ్యయనం, దానం, తపస్సు, సత్యం, క్షమ, ఇంద్రియనిగ్రహం, లోభం లేకుండుట - ఈ ఎనిమిది ధర్మమార్గాలు. (75)
అత్ర పూర్వశ్చతుర్వర్గః పితృయానపథే స్థితః ।
కర్తవ్యమితి యత్ కార్యం నాభిమానాత్ సమాచరేత్ ॥ 76
ఇందలి మొదటి నాలుగు యజ్ఞాధ్యయనదానతపస్సులు పితృయాన మార్గంలో ఉంటాయి. అనగా వీటిని సకామంగా ఆచరిస్తే పితృయాన మార్గంలో తీసికొని వెళ్తాయి. అగ్నిహోత్రాది కర్మలు అవశ్యకరణీయాలు. అభిమానాన్ని విడిచి కర్తవ్యబుద్ధితో చెయ్యాలి. (76)
ఉత్తరో దేవయానస్తు సద్భిరాచరితః సదా ।
అష్టాంగేనైవ మార్గేణ విశుద్ధాత్మా సమాచరేత్ ॥ 77
తరువాత చెప్పిన నాలుగు సత్యం, క్షమ, ఇంద్రియ నిగ్రహం, అలోభం - అనేవి దేవయానమందున్నవి. సత్పురుషులు ఈ మార్గాన్ని ఆచరిస్తారు. అష్టాంగమార్గం ద్వారా విశుద్ధాత్ముడై వీటిని ఆచరించాలి. (77)
సమ్యక్సంకల్పసంబంధాత్ సమ్యక్ చేంద్రియనిగ్రహాత్ ।
సమ్యగ్ర్వతవిశేషాచ్చ సమ్యక్ చ గురుసేవనాత్ ॥ 78
సమ్యగాహారయోగాచ్చ సమ్యక్ చాధ్యయనాగమాత్ ।
సమ్యక్కర్మోపసన్న్యాసాత్ సమ్యక్చిత్తనిరోధనాత్ ॥ 79
సంపూర్ణంగా సంకల్ప సంబంధం వల్ల, బాగుగా అంతర్బాహ్యేంద్రియాలను నిగ్రహించడం వల్ల, చక్కగా అహింసాది వ్రతాలను ఆచరించడం వల్ల, చక్కగా గురువును సేవించడం వల్ల, యోగసాధనోచితమైన ఆహారం తీసికొనవడం వల్ల, బాగుగా వేదాధ్యయనం వల్ల, సంపూర్ణ కర్మసంన్యాసం వల్ల, మనోవృత్తుల సంపూర్ణ నిగ్రహం వల్ల మానవుడు పరమకళ్యాణస్థితిని పొందుతాడు. (78,79)
ఏవం కర్మాణి కుర్వంతి సంసారవిజిగోషవః ।
రాగద్వేషవినిర్ముక్తాః ఐశ్వర్యం దేవతా గతాః ॥ 80
సంసారాన్ని జయించాలనే కోరిక కల మానవులు రాగద్వేష వినిర్ముక్తులై ఈ విధంగా కర్మలను ఆచరిస్తారు. ఇటువంటి నియమాలు పాటించి దేవతలు ఐశ్వర్యాన్ని పొందారు. (80)
రుద్రాః సాధ్యాస్తథాఽఽదిత్యాః వసవోఽథ తథాశ్వినౌ ।
యోగైశ్వర్యేణ సంయుక్తాః ధారయంతి ప్రజా ఇమాః ॥ 81
రుద్రులు, సాధ్యులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినులు యోగైశ్వర్యంతో కూడి ఈ జనులనందరిని రక్షించి పోషిస్తున్నారు. (81)
తథా త్వమపి కౌంతేయ శమమాస్థాయ పుష్కలమ్ ।
తపసా సిద్ధిమన్విచ్ఛ యోగసిద్ధిం చ భారత ॥ 82
కౌంతేయా! అదే విధంగా నీవు కూడ పూర్తిగా ఇంద్రియ నిగ్రహం వహించి, తపస్సు చేత సిద్ధిని, యోగసిద్ధిని పొందు. (82)
పితృమాతృమయీ సిద్ధిః ప్రాప్తా కర్మమయీ చ తే ।
తపసా సిద్ధిమన్విచ్ఛ ద్విజానాం భరణాయా వై ॥ 83
యజ్ఞ యద్ధాది కర్మల్చే పితృమాతృమయి అయిన సిద్ధి కలుగుతుంది. దానిని ఇప్పటికే నీవు పొందావు. ఇపుడు తపస్సు ద్వారా యోగసిద్ధిని సాధించు. దానిచేతనే బ్రాహ్మణుల ధారణ పోషణాలు జరుగుతాయి. (83)
సిద్ధా హి యద్ యదిచ్ఛంతి కుర్వతే తదనుగ్రహాత్ ।
తస్మాత్తపః సమాస్థాయ కురుష్వాత్మమనోరథమ్ ॥ 84
సిద్ధులు హి యద్ యదిచ్ఛంతి కుర్వతే తదనుగ్రహాత్ ।
తస్మాత్తపః సమాస్థాయ కురుష్వాత్మమనోరథమ్ ॥ 84
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి పాండవానాం ప్రవ్రజనే ద్వితీయోఽధ్యాయః ॥ 2 ॥
ఇదు శ్రీమహాభారతమున వనపర్వమున అరణ్యపర్వమను ఉపపర్వమున పాండవులవనగమన మను రెండవ అధ్యాయము. (2)