3. మూడవ అధ్యాయము
యుధిష్ఠిరుడు సూర్యుని ఉపాసించి అక్షయపాత్రను పొందుట.
వైశంపాయన ఉవాచ
శౌనకేనైవముక్తస్తు కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
పురోహితముపాగమ్య భ్రాతృమధ్యేఽబ్రవీదిదమ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! శౌనకుడు ఈ విధంగా చెప్పాక కుంతీకుమారుడైన యుధిష్ఠిరుడు పురోహితుని సమీపించి సోదరులందరిసమక్షంలో ఈ విధంగా అన్నాడు. (1)
ప్రస్థితం మానుయాంతీమే బ్రాహ్మణా వేదపారగాః ।
న చాస్మి పోషణే శక్తః బహుదుఃఖసమన్వితః ॥ 2
వేదపారంగతులైన బ్రాహ్మణులు వనంలో నాతో వస్తున్నారు. నేను వీరిని పోషించలేను. అందువల్ల మిక్కిలి దుఃఖపడుతున్నాను. (2)
పరిత్యక్తుం న శక్తోఽస్మి దానశక్తిశ్చ నాస్తి మే ।
కథమత్ర మయా కార్యం తద్ బ్రూహి భగవన్ మమ ॥ 3
పూజ్యుడా! వీరిని విడిచిపెట్టలేను. వారి కీయ గల శక్తి నాకు లేదు. ఇపుడు నేనేం చెయ్యాలి. నీవు చెప్పు. (3)
వైశంపాయన ఉవాచ
ముహూర్తమివ స ధ్యాత్వా ధర్మేణాన్విష్య తాం గతిమ్ ।
యుధిష్ఠిరమువాచేదం ధౌమ్యో ధర్మభృతాం వరః ॥ 4
వైశంపాయనుడిలా అన్నాడు - ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన ధౌమ్యుడు ముహూర్తకాలం ఏకాగ్రచిత్తంతో ధర్మపూర్వకంగా ఉపాయాన్ని ఆలోచించి యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు. (4)
ధౌమ్య ఉవాచ
పురా సృష్టాని భూతాని పీడ్యంతే క్షుధయా భృశమ్ ।
తతోఽనుకంపయా తేషాం సవితా స్వపితా యథా ॥ 5
గత్వోత్తరాయణం తేజః రసానుద్ధృత్య రశ్మిభిః ।
దక్షిణాయనమావృత్తః మహీం నివిశతే రవిః ॥ 6
ధౌమ్యుడు ఇలా అన్నాడు - పూర్వం సృష్టింపబడిన ప్రాణులన్నీ ఆకలితో మిక్కిలి బాధపడుతూండగా, వాని పట్ల దయతో సూర్యభగవానుడు తండ్రి వలె ఉత్తరాయణంలో ప్రవేశించి తన కిరణాలతో భూమియందలి జలాలను స్వీకరించి మరల దక్షిణాయనంలో భూమియందు ఆ జలాలను ప్రవేశింపజేశాడు. (5,6)
క్షేత్రభూతే తతస్తస్మిన్ ఓషధీరోషధీపతిః ।
దివస్తేజః సముద్ధృత్య జనయామాస వారిణా ॥ 7
అనంతరం క్షేత్రభూతమైన భూమిపై ఓషధీపతి అయిన చంద్రుడు అంతరిక్షంలో మేఘరూపంలో ఉన్న సూర్య తేజస్సును స్వీకరించి నీటిచేత ఓషధులను ఉత్పత్తి చేశాడు. (7)
నిషిక్తశ్చంద్రతేజోభిః స్వయోనౌ నిర్గతే రవిః ।
ఓషధ్యః షడ్రసా మేధ్యాః తదన్నం ప్రాణినాం భువి ॥ 8
చంద్రుని కిరణాల చేత అభిషిక్తుడైన సూర్యుడు బీజస్థితిని పొంది ఆరు రసాలతో కూడితే పవిత్రమైన ఓషధులు ఉత్పన్నమవుతాయి. అవియే భూమిపై ప్రాణులకు ఆహారం అవుతాయి. (8)
ఏవం భానుమయం హ్యన్నం భూతానాం ప్రాణధారణమ్ ।
పితైష సర్వభూతానాం తస్మాత్ తం శరణం వ్రజ ॥ 9
ఈ విధంగా సమస్తప్రాణులను రక్షించే అన్నం సూర్యరూపమైనదే. ఆ సూర్యుడే సర్వప్రాణులకు తండ్రి, రక్షకుడు. అందువల్ల అతనిని శరణు వేడుము. (9)
రాజానో హి మహాత్మానః యోనికర్మవిశోధితాః ।
ఉద్ధరంతి ప్రజాః సర్వాః తప ఆస్థాయ పుష్కలమ్ ॥ 10
జన్మకర్మలచే విశుద్ధులై మహాత్ములైన రాజులు పుష్కలమైన తపస్సు చేసి ప్రజలందరిని కష్టాల నుండి ఉద్ధరిస్తారు. (10)
భీమేన కార్తవీర్యేణ వైన్యేన నహుషేణ చ ।
తపోయోగసమాధిస్థైః ఉద్ధతా హ్యాపదః ప్రజాః ॥ 11
భీముడు, కార్తవీర్యుడు, వేనపుత్రుడైన పృథువు, నహుషుడు మున్నగు రాజులు తపో, యోగ, సమాధులచే ప్రజలను ఆపదల నుండి ఉద్ధరించారు. (11)
తథా త్వమపి ధర్మాత్మన్ కర్మణా చ విశోధితః ।
తప ఆస్థాయ ధర్మేణ ద్విజాతీన్ భర భారత ॥ 12
ధర్మాత్ముడా! భరతోత్తమా! అందువల్ల కర్మవిశుద్ధుడవై(న) నీవు కూడా తపస్సుచేసి ధర్మానుసారంగా ఈ బ్రాహ్మణులను పోషించు. (12)
జనమేజయ ఉవాచ
కథం కురూణామృషభః స తు రాజా యుధిష్ఠిరః ।
విప్రార్థమారాధితవాన్ సూర్యమద్భుతదర్శనమ్ ॥ 13
జనమేజయుడిలా అన్నాడు - కురువంశశ్రేష్ఠుడైన యుధిష్ఠిరుడు బ్రాహ్మణుల కొరకై అద్భుత దర్శనుడైన సూర్యభగవానుని ఏవిధంగా ఆరాధించాడు? (13)
వైశంపాయన ఉవాచ
శృణుష్వావహితో రాజన్ శుచిర్భూత్వా సమాహితః ।
క్షణం చ కురు రాజేంద్ర సంప్రవక్ష్యామ్యశేషతః ॥ 14
వైశంపాయనుడిలా అన్నాడు - రాజేంద్రా! సావధాన చిత్తుడవై, పవిత్రుడవై విను. ఓర్పు వహించు. పూర్తిగా చెపుతాను. (14)
ధౌమ్యేన తు యథా పూర్వం పార్థాయ సుమహాత్మనే ।
నామాష్టశతమాఖ్యాతం తచ్ఛృణుష్వ మహామతే ॥ 15
మహామతీ! ధౌమ్యుడు పూర్వం యుధిష్ఠిరునికి చెప్పిన నూట ఎనిమిది సూర్యనామాలు నీకు చెప్తాను విను. (15)
ధౌమ్య ఉవాచ
సూర్యోఽర్యమా భగస్త్వష్టా పూషార్కః సవితా రవిః ।
గభస్తిమానజః కాలః మృత్యుర్ధాతా ప్రభాకరః ॥ 16
పృథివ్యాపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణమ్ ।
సోమో బృహస్పతిః శుక్రః బుధోఽంగారక ఏవ చ ॥ 17
ఇంద్రో వివస్వాన్ దీప్తాంశుః శుచిః శౌరిః శనైశ్చరః ।
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వై వరుణో యమః ॥ 18
వైద్యుతో జాఠరశ్చాగ్నిః ఐంధనస్తేజసాం పతిః ।
ధర్మధ్వజో వేదకర్తా వేదాంగో వేదవాహనః ॥ 19
కృతం త్రేతా ద్వాపరశ్చ కలిః సర్వమలాశ్రయః ।
కలా కాష్ఠా ముహూర్తాశ్చ క్షపా యామస్తథా క్షణః ॥ 20
సంవత్సరకరోఽశ్వత్థః కాలచక్రో విభావసుః ।
పురుషః శాశ్వతో యోగీ వ్యక్తావ్యక్తః సనాతనః ॥ 21
కాలాధ్యక్షః ప్రజాధ్యక్షః విశ్వకర్మా తమోనుదః ।
వరుణః సాగరోంఽశుశ్చ జీమూతో జీవనోఽరిహా ॥ 22
భూతాఽశ్రయో భూతపతిః సర్వలోకనమస్కృతః ।
స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యాదిరలోలుపః ॥ 23
అనంతః కపిలో భానుః కామదః సర్వతోముఖః ।
జయో విశాలో వరదః సర్వధాతునిషేచితా ॥ 24
మనఃసుపర్ణో భూతాదిః శీఘ్రగః ప్రాణధారకః ।
ధన్వంతరిర్ధూమకేతుః ఆదిదేవోఽదితేః సుతః ॥ 25
ద్వాదశాత్మాఽరవిందాక్షః పితా మాతా పితామహః ।
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపమ్ ॥ 26
దేహకర్తా ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః ।
చరాచరాత్మా సూక్ష్మాత్మా మైత్రేయః కరుణాన్వితః ॥ 27
ఏతద్ వై కీర్తనీయస్య సూర్యస్యామితతేజసః ।
నామాష్టశతకం చేదం ప్రోక్తమేతత్ స్వయంభువా ॥ 28
ధౌమ్యుడిలా చెప్పాడు - సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట, పూషుడు, అర్కుడు, సవిత, రవి, గభస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, ధాత, ప్రభాకరుడు, పృథివి, ఆపస్సు, తేజస్సు, ఖం, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, దీప్తాంశుడు, శుచి, శౌరి, శనైశ్చరుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, స్కందుడు, వరుణుడు, యముడు, వైద్యుతుడు, జఠరుడు, ఐంధనుడు, తేజసాంపతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగుడు, వేదవాహనుడు, కృత, త్రేత, ద్వాపరం, సర్వమలాశ్రయమై కలి, కలా కాష్ఠా ముహూర్త స్వరూపమైన కాలము. క్షప, యామము, క్షణము, సంవత్సరకరుడు, అశ్వత్థుడు, కాలచక్ర ప్రవర్తకుడైన విభావసుడు శాశ్వతుడయిన, పురుషుడు, యోగి, వ్యక్తావ్యక్తుడు, సనాతనుడు, కాలాధ్యక్షుడు, ప్రజాధ్యక్షుడు, విశ్వకర్మ, తమోనుదుడు, వరుణుడు, సాగరుడు, అంశుడు, జీమూతుడు, జీవనుడు, అరిహుడు, భూతాశ్రయుడు, భూతపతి, సర్వలోకనమస్కృతుడు, స్రష్ట, సంవర్తకుడు, వహ్ని, సర్వాది, అలోలుపుడు, అనంతుడు, కపిలుడు, భానుడు, కామదుడు, సర్వతోముఖుడు, జయుడు, విశాలుడు, వరదుడు, సర్వధాతు నిషేచితుడు, మనఃసుపర్ణుడు, భూతాది, శీఘ్రగుడు, ప్రాణధారకుడు, ధన్వంతరి, ధూమకేతుడు, ఆదిదేవుడు, అదితిసుతుడు (ఆదిత్య), ద్వాదశాత్ముడు, అరవిందాక్షుడు, పిత, మాత పితామాహుడు, స్వర్గద్వార ప్రజాద్వార రూపుడు, మోక్షద్వార రూపమయిన త్రివిష్టపుడు, దేహకర్త, ప్రశాంతాత్మ, విశ్వాత్మ, విశ్వతోముఖుడు, చరాచరాత్ముడు, సూక్ష్మాత్ముడు, మైత్రేయుడు, కరుణాన్వితుడు, ఈ నామాష్టశతం కీర్తనీయుడైన తేజోవంతుడైన సూర్యునివి. బ్రహ్మ వీనిని చెప్పాడు. (16-28)
సురగణపితృయక్షసేవితం
హ్యసురనిశాచరసిద్ధవందితమ్ ।
వరకనకహుతాశనప్రభం
ప్రణిపతితోఽస్మి హితాయ భాస్కరమ్ ॥ 29
ఈ నామములనుచ్చరించిన తర్వాత, తన హితం కోసం దేవతా, పితృ, యక్ష, గణాలచే సేవింపబడే, అసుర, నిశాచర, సిద్ధులచే నమస్కరింపబడే, శ్రేష్ఠమగు బంగారు, అగ్నికాంతులు గల్గిన సూర్యుని నమస్కరించుచున్నాను అని నమస్కరించాలి. (29)
సూర్యోధయే యః సుసమాహితః పఠేత్
స పుత్రదారాన్ ధనరత్నసంచయాన్ ।
లభేత జాతిస్మరతాం నరః సదా
ధృతిం చ మేధాం చ స విందతే పుమాన్ ॥ 30
సూర్యోదయసమయంలో సమాహితచిత్తుడై ఈ నామాలను పఠించినవాడు చక్కని భార్యాపుత్రులను, ధనరత్నరాశులను, పూర్వజన్మస్మృతిని (తనజాతివారి గుర్తింపును?), ధైర్యాన్ని, మంచిమేధను పొందుతాడు. (30)
ఇమం స్తవం దేవవరస్య యో నరః
ప్రకీర్తయేచ్ఛుచిసుమనాః సమాహితః ।
విముచ్యతే శోకదవాగ్నిసాగరాత్
లభేత కామాన్ మనసా యథేప్సితాన్ ॥ 31
దేవశ్రేష్ఠుడైన సూర్యభగవానుని ఈ స్తవాన్ని నిర్మలమైన మనస్సుతో ఏకాగ్రచిత్తంతో చదివినవాడు శోకదవాగ్ని సాగరం నుండి విముక్తుడౌతాడు. మనోభీష్టాలయిన కోరికలను పొందుతాడు. (31)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు ధౌమ్యేన తత్కాలసదృశం వచః ।
విప్రత్యాగసమాధిస్థః సంయతాత్మా దృఢవ్రతః ॥ 32
ధర్మరాజో విశుద్ధాత్మా తప ఆతిష్ఠదుత్తమమ్ ।
పుష్పోపహారైర్బలిభిః అర్చయిత్వా దివాకరమ్ ॥ 33
సోఽవగాహ్య జలం రాజా దేవస్యాభిముఖోఽభవత్ ।
యోగమాస్థాయ ధర్మాత్మా వాయుభక్షో జితేంద్రియః ॥ 34
వైశంపాయనుడిలా అన్నాడు - ఈ విధంగా ధౌమ్యుడు ఆ సమయానికి తగినమాట చెప్పగా, యుధిష్ఠిరుడు బ్రాహ్మణులకోసం సమాధిస్థితుడై, జితేంద్రియుడై దృఢవ్రతుడై, విశుద్ధాత్ముడై ఉత్తమమైన తపస్సు చేశాడు. అతడు పవిత్రజలంతో స్నానం చేసి, సూర్యునికి అభిముఖుడై పుష్పోపహారపూజలచే అర్చించి, జితేంద్రియుడై, వాయుభక్షకుడై యోగమనుష్ఠించి సేవించాడు. (32-34)
గాంగేయం వార్యుపస్పృశ్య ప్రాణాయామేన తస్థివాన్ ।
శుచిః ప్రయతవాగ్ భూత్వా స్తోత్రమారబ్ధవాంస్తతః ॥ 35
గంగాజలాన్ని ఆచమించి నిర్మలమగు వాక్కును నియంత్రించి, ప్రాణాయామం చేసి స్తుతిని ప్రారంభించాడు. (35)
యుధిష్ఠిర ఉవాచ
త్వం భానో జగతశ్చక్షుః త్వమాత్మా సర్వదేహినామ్ ।
త్వం యోనిః సర్వభూతానాం త్వమాచారః క్రియావతామ్ ॥ 36
యుధిష్ఠిరుడిట్లు స్తుతించాడు - భానూ! నీవు ఈ ప్రపంచానికి నేత్రం. సర్వప్రాణులకు నీవు ఆత్మవు. సర్వప్రాణులకు నీవు పుట్టుకస్థానం. కర్మానుష్ఠానం చేసేవారికి నీవు సదాచారం. (36)
త్వం గతిః సర్వసాంఖ్యానాం యోగినాం త్వం పరాయణమ్ ।
అనావృతార్గలద్వారం త్వం గతిస్త్వం ముముక్షతామ్ ।
అనావృతార్గలద్వారం త్వం గతిస్త్వం ముముక్షతామ్ ॥ 37
సాంఖ్యులందరికీ నీవు ప్రాప్తిస్థానం. కర్మయోగులందరికీ నీవు పరాయణుడవు. మోక్షానికి నీవు ప్రతిబంధకం లేని ద్వారం. ముముక్షువులందరికి నీవు ప్రతిబంధకం లేని ద్వారం. ముముక్షువులందరికి నీవు గతి. (ప్రాప్యస్థానము.) (37)
త్వయా సంధార్యతే లోకః త్వయా లోకః ప్రకాశ్యతే ।
త్వయా పవిత్రీక్రియతే నిర్వ్యాజం పాల్యతే త్వయా ॥ 38
నీవీ ప్రపంచాన్ని ధరిస్తున్నావు. నీచే ఈ లోకం ప్రకాశిస్తోంది. నీచే ఈ లోకం పవిత్రం చేయబడుతోంది. నిర్వ్యాజముగ ఎట్టి స్వార్థమూ లేక నీవు దీనిని పాలిస్తున్నావు. (38)
త్వాముపస్థాయ కాలే తు బ్రాహ్మణా వేదపారగాః ।
స్వశాఖావిహితైర్మంత్రైః అర్చంత్యృషిగణార్చితమ్ ॥ 39
నీవు ఋషిగణాలచే పూజింపబడుతున్నావు. వేదపారగులైన బ్రాహ్మణులు తమతమవేద శాఖలకు సంబంధించిన మంత్రాలతో తగిన సమయంలో నిన్ను స్తుతించి పూజిస్తున్నారు. (39)
తవ దివ్యం రథం యాంతమ్ అనుయాంతి వరార్థినః ।
సిద్ధచారణగంధర్వాః యక్షగుహ్యకపన్నగాః ॥ 40
నీ నుండి వరాన్ని కోరుకొంటున్న సిద్ధ, చారణ, గంధర్వ, యక్ష, గుహ్యక, పన్నగులు వెళుతూన్న నీ దివ్యరథాన్ని అనుసరిస్తున్నారు. (40)
త్రయస్త్రింశచ్చ వై దేహిః తథా వైమానిక గణాః ।
సోపేంద్రాః సమహేంద్రాశ్చ త్వామిష్ట్వా సిద్ధిమాగతాః ॥ 41
ముప్పదిమూడు దేవతలు, వైమానికులైన సిద్ధగణాలు, ఉపేంద్ర మహేంద్రులు నిన్ను ఆరాధించి సిద్ధిని పొందారు. (41)
ఉపయాంత్యర్చయిత్వా తు త్వాం వై ప్రాప్తమనోరథాః ।
దివ్యమందారమాలాభిః తూర్ణం విద్యాధరోత్తమాః ॥ 42
గుహ్యాః పితృగణాః సప్త యే దివ్యా యే చ మానుషాః ।
తే పూజయిత్వా త్వామేవ గచ్ఛంత్యాశు ప్రధానతామ్ ॥ 43
వసవో మరుతో రుద్రాః యే చ సాధ్యా మరీచిపాః ।
వాలఖిల్యాదయః సిద్ధాః శ్రేష్ఠత్వం ప్రాణినాం గతాః ॥ 44
విద్యాధర శ్రేష్ఠులు దివ్య మందారమాలలతో నిన్ను పూజించి సఫలమనోరథులవుతున్నారు.
గుహ్యకులు, ఏడు పితృగణాలు, దివ్యులైన మానవులు నిన్ను పూజించి శీఘ్రంగా ప్రధానస్థానాన్ని పొందుతున్నారు. వసు, రుద్ర, మరుద్గణాలు, సాధ్యులు, నీ కిరణాలు త్రాగే వాలఖిల్యాది సిద్ధులు నిన్ను పూజించి ప్రాణులలో శ్రేష్ఠులయ్యారు. (42-44)
సబ్రహ్మకేషు లోకేషు సప్తస్వప్యఖిలేషు చ ।
న తద్భూతమహం మన్యే యదర్కాదతిరిచ్యతే ॥ 45
సంతి చాన్యాని సత్త్వాని వీర్యవంతి మహాంతి చ ।
న తు తేషాం తథా దీప్తిః ప్రభావో వా యథా తవ ॥ 46
జ్యోతీంషి త్వయి సర్వాణి త్వం సర్వజ్యోతిషాం పతిః ।
త్వయి సత్యం చ సత్త్వం చ సర్వే భావాశ్చ సాత్త్వికాః ॥ 47
త్వత్తేజసా కృతం చక్రం సునాభం విశ్వకర్మణా ।
దేవారీణాం మదో యేన నాశితః శార్ ఙ్గధన్వనా ॥ 48
బ్రహ్మలోకంతో పాటు ఏడులోకాలలోనూ సూర్యుని మించిన ప్రాణి వేరొకటిలేదు.
తేజోవంతాలైన ఇతరప్రాణులు ఎన్ని ఉన్నా, వానికి నీవంటి ప్రకాశంగాని, ప్రభావంకాని లేదు.
జ్యోతిస్సులన్నీ నీ యందు ఉన్నాయి. నీవు సర్వజ్యోతిస్సులకు అధిపతివి. సత్త్వమూ, సత్యమూ, అన్ని సాత్త్వికభావాలూ నీయందు ఉన్నాయి.
నీ తేజస్సుచే విశ్వకర్మచేసిన సునాభమనే చక్రం చేత శార్ ఙ్గధన్వుడైన శ్రీహరి అసురుల గర్వాన్ని నాశనం చేశాడు. (45-48)
త్వమాదాయాంశుభిస్తేజః నిదాఘే సర్వదేహినామ్ ।
సర్వౌషధిరసానాం చ పునర్వర్షాసు ముంచసి ॥ 49
నీవు గ్రీష్మర్తువులో నీ కిరణాలచే సమస్తప్రాణుల యొక్క సర్వౌషధిరసాల యొక్క తేజస్సు స్వీకరించి మరల వర్షర్తువులో విడుస్తున్నావు. (49)
తపంత్యన్యే దహంత్యన్యే గర్జంత్యన్యే తథా ఘనాః ।
విద్యోతంతే ప్రవర్షంతి తవ ప్రావృషి రశ్మయః ॥ 50
వర్షర్తువునందు నీ కిరణాలు కొన్ని తపింపజేస్తాయు. మరికొన్ని కిరణాలు దహింపజేస్తాయి. మరికొన్ని కిరణాలు మేఘాలనేర్పరచి గర్జిస్తున్నాయి. మరికొన్ని కిరణాలు మేఘాలలో మెరుస్తాయి. మరికొన్ని వర్షిస్తాయి. (50)
న తథా సుఖయత్యగ్నిః న ప్రావారా న కంబలాః ।
శీతవాతార్దితం లోకం యథా తవ మరీచయః ॥ 51
చలిగాలులచే బాధపడుతున్న లోకాన్ని నీ కిరణాలు సుఖపెట్టినట్లు అగ్ని కాని, వస్త్రాలు కాని, కంబళ్లుకాని సుఖపెట్టలేవు. (51)
త్రయోదశద్వీపవతీమ్ గోభిర్భాసయసే మహీమ్ ।
త్రయాణామపి లోకానాం హితాయైకః ప్రవర్తసే ॥ 52
పదమూడు ద్వీపాలతో ఉన్న భూమిని నీవు నీ కిరణాలచే ప్రకాశింపజేస్తున్నావు. ముల్లోకాల హితం కొరకు నీవొక్కడవే ప్రవర్తిస్తున్నావు. (52)
తవ యద్యుదయో న స్యాద్ అంధం జగదిదం భవేత్ ।
న చ ధర్మార్థ కామేషు ప్రవర్తేరన్ మనీషిణః ॥ 53
నీవు ఉదయించకపోతే ఈ జగత్తంతా చీకటవుతుంది. (అంధకారమయమవుతుంది). మానవులు ధర్మార్థకామాలయందు ప్రవర్తింపలేరు. (53)
ఆధానపశుబంధేష్టిమంత్రయజ్ఞతపఃక్రియాః ।
త్వత్రసాదాదవాప్యంతే బ్రహ్మక్షత్రవిశాం గణైః ॥ 54
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యగణాలు నీ అనుగ్రహం వల్లనే ఆధానం, పశుబంధనం, ఇష్టి, మంత్రం, యజ్ఞాలు, తపస్సు మున్నగు కర్మలను చేయగలుగుతున్నారు. (54)
యదహర్ర్బహ్మణః ప్రోక్తం సహస్రయుగసమ్మితమ్ ।
తస్య త్వమాదిరంతశ్చ కాలజ్ఞైః పరికీర్తితః ॥ 55
బ్రహ్మకు వేయి యుగాలు ఒక దినంగా చెప్పబడింది. దానికి ఆద్యంతాలు నీవే అని కాలజ్ఞులు చెప్పారు. (55)
మనూనాం మనుపుత్రాణాం జగతోఽమానవస్య చ ।
మన్వంతరాణాం సర్వేషామ్ ఈశ్వరాణాం త్వమీశ్వరః ॥ 56
మనువుల యొక్క మనుపుత్రుల యొక్క, అమానుష పురుషుల యొక్క జగత్తునకు, అన్ని మన్వంతరములకు, ఈశ్వరులకు నీవే ఈశ్వరుడవు. (56)
సంహారకాలే సంప్రాప్తే తవ క్రోధవినిఃసృతః ।
సంవర్తకాగ్నిస్త్రైలోక్యం భస్మీకృత్యావట్తిష్ఠతే ॥ 57
సృష్టిసంహారకాలం ప్రలయకాలం సమీపించినపుడు నీకోపం నుండి వెలువడిన సంవర్తకాగ్ని ముల్లోకాలను భస్మంచేసి, నీ యందు వెలుగొందుతుంది. (57)
త్వద్దీధితిసముత్పన్నాః నానావర్ణా మహాఘనాః ।
సైరావతాః సాశనయః కుర్వంత్యాభూతసంప్లవమ్ ॥ 58
నీ కిరణాల నుండి ఉత్పన్నమైన అనేక వర్ణాలు గల ఐరావతాదిమహామేఘాలు, పిడుగులు సమస్త ప్రాణికోటిని సంహరిస్తాయి. (58)
కృత్వా ద్వాదశధాఽఽత్మానం ద్వాదశాదిత్యతాం గతః ।
సంహృత్యైకార్ణవం సర్వం త్వం శోషయసి రశ్మిభిః ॥ 59
నిన్ను నీవు పన్నెండు విధాలుగా విభజించుకొని ద్వాదశాదిత్యస్వరూపుడవై ముల్లోకాలను ఒకే సముద్రంగా సంగ్రహించి నీ కిరణాలతో శుష్కింపజేస్తున్నావు. (59)
త్వామింద్రమాహుస్త్వం రుద్రః త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః ।
త్వమగ్నిస్త్వం మనః సూక్ష్మం ప్రభుస్త్వం బ్రహ్మ శాశ్వతమ్ ॥ 60
నీవు ఇంద్రుడవు, రుద్రుడవు, విష్ణుడవు, ప్రజాపతివి, అగ్నివి, నివు సూక్ష్మ మనస్సువు, నివు వ్యాపకుడవు, నీవు శాశ్వతమైన బ్రహ్మవు అని చెపుతున్నారు. (60)
త్వం హంసః సవితా భానుః అంశుమాలీ వృషాకపిః ।
వివస్వాన్ మిహిరః పూషా మిత్రో ధర్మస్తథైవ చ ॥ 61
సహస్రరశ్మిరాదిత్యః తపనస్త్వం గవామృతిః ।
మార్తండోఽర్కో రవిః సూర్యః శరణ్యో దినకృత్ తథా ॥ 62
దివాకరః సప్తసప్తిః ధానుకేశీ విరోచనః ।
ఆశుగామీ తమోఘ్నశ్చ హరితాశ్వశ్చ కీర్త్యసే ॥ 63
నీవు శుద్ధబ్రహ్మమగు హంసవు. సవిత, భానుడు, అంశుమాలి, వృషాకపి, వివస్వంతుడు, మిహిరుడు, పూష, మిత్రుడు, ధర్ముడు, సహస్రరశ్మి, ఆదిత్యుడు, తపనుడు, గవాంపతి, మార్తాండుడు, అర్కుడు, రవి, - సూర్యుడు, దినకర్త, దివాకరుడు, సప్తసప్తి, ధామకేశి, విరోచనుడు, ఆశుగామి, తమోఘ్నుడు, హరితాశ్వుడు, అని కీర్తింపబడుతున్నావు. (61-63)
సప్తమ్యామథవా షష్ఠ్యాం భక్త్యా పూజాం కరోతి యః ।
అనిర్విణ్ణోఽనహంకారీ తం లక్ష్మీర్భజతే నరమ్ ॥ 64
నిర్వేదం, అహంకారం లేకుండా సప్తమినాడు కాని, షష్ఠినాడు కాని నిన్ను పూజించినవానికి సంపద (లక్ష్మి) కలుగుతుంది. (64)
న తేషామాపదః సంతి నాధయో వ్యాధయస్తథా ।
యే తవానన్యమనసః కుర్వంత్యర్చనవందనమ్ ॥ 65
అనన్యమనుస్కులై నిన్ను పూజించి నమస్కరించిన వారికి ఆపదలుకాని, ఆధులుకాని, వ్యాధులుకాని కలుగవు. (65)
సర్వరోగైర్విరహితాః సర్వపాపవివర్జితాః ।
త్వద్భావభక్తాః సుఖినః భవంతి చిరజీవినః ॥ 66
హృదయపూర్వకంగా నీ భక్తులైనవారు సమస్తరోగాల నుండి విముక్తులై, పాపాలన్నింటిని విడిచి, చిరంజీవులై సుఖంగా ఉంటారు. (66)
త్వం మమాపన్నకామస్య సర్వాతిథ్యం చికీర్షతః ।
అన్నమన్నపతే దాతుమ్ అభితః శ్రద్ధయార్హసి ॥ 67
అన్నపతీ! శ్రద్ధగా అందరికి ఆతిధ్యమివ్వాలని కోరుకుంటూ ఆపత్కాలంలో వేడుతున్న నాకు నీవు అన్నం ఇవ్వడానికి తగినవాడవు. (67)
యే చ తేఽనుచరాః సర్వే పాదోపాంతం సమాశ్రితాః ।
మాఠరారుణదండాద్యాః తాంస్తాన్ వందేఽశనిక్షుభాన్ ॥ 68
నీ పాదాలను ఆశ్రయించి మాఠర - అరుణ - దండాది అనుచరులు ఉన్నారు. విద్యుత్తును ప్రసరింపజేయగల వారికందరికీ నమస్కరిస్తున్నాను. (68)
క్షుభయా సహితా మైత్రీ యాశ్చాన్యా భూతమాతరః ।
తాశ్చ సర్వా నమస్యామి పాతుం మాం శరణాగతమ్ ॥ 69
క్షుభ(విద్యుత్తు) తో పాటుగ ఉన్న మైత్రీదేవి, గౌరి, పద్మ మున్నగు భూతమాతలకందరికి నమస్కరిస్తున్నాను. శరణాగతుడనైన నన్ను రక్షించండి. (69)
వైశంపాయన ఉవాచ
ఏవం స్తుతో మహారాజ భాస్కరో లోకభావనః ।
తతో దివాకరః ప్రీతః దర్శయామాస పాండవమ్ ॥ 70
వైశంపాయనుడిలా అన్నాడు - మహారాజా! ఈ విధంగా యుధిష్ఠిరుడు స్తుతిస్తే, లోకభావనుడు, భాస్కరుడు, దివాకరుడు అయిన సూర్యుడు ప్రసన్నుడై మండుతున్న అగ్నివలె ప్రకాశిస్తున్న శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. (70)
వివస్వానువాచ
యత్ తేఽభిలషితం కించిత్ తత్ త్వం సర్వమవాప్స్యసి ।
అహమన్నం ప్రదాస్యామి సప్త పంచ చ తే సమాః ॥ 71
సూర్యు(వివస్వంతు)డిలా అన్నాడు - ధర్మరాజా! నీవు కోరుకొన్న దంతటిని నీవు పొందగలవు. ఓ పన్నెండు సంవత్సరాలు నీకు అన్నం నే నిస్తాను. (71)
గృహీష్వ పిఠరం తామ్రం మయా దత్తం నరాధిప ।
యావద్ వర్త్స్యతి పాంచాలీ పాత్రేణానేన సువ్రత ॥ 72
ఫలమూలామిషం శాకం సంస్కృతం యన్మహానసే ।
చతుర్విధం తదన్నాద్యమ్ అక్షయ్యం తే భవిష్యతి ॥ 73
నరాధిపా! సువ్రతా! నేనిస్తున్న ఈ రాగిపాత్రను స్వీకరించు. ఈ పాత్రతో మీ వంటింట్లో సంస్కరించిన ఫలమూలామిషశాకాలు, అన్నం మొదలగు చతుర్విధపదార్థాలు (పాంచాలి భోజనము చేయునంత వరకు) అక్షయాలుగా ఉంటాయి. (72-73)
ఇతశ్చతుర్దశే వర్షే భూయో రాజ్యమవాప్స్యసి ।
ఇప్పటి నుండి పదునాల్గవ సంవత్సరంలో నీవు మరల రాజ్యాన్ని పొందుతావు. (73 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా తు భగవాన్ తత్రైవాంతరధీయత ॥ 74
వైశంపాయనుడిలా అన్నాడు. ఇలా చెప్పి సూర్య భగవానుడక్కడే అంతర్ధానమయ్యాడు. (74)
ఇమం స్తవం ప్రయతమనాః సమాధినా
పఠేదిహాన్యోఽపి వరం సమర్థయన్ ।
తత్ తస్య దద్యాచ్చ రవిర్మనీషితం
తదాప్నుయాద్ యద్యపి తత్ సుదుర్లభమ్ ॥ 75
ఎవరైననూ మనోనిగ్రహంతో, ఏకాగ్రచిత్తంతో ఈ సూర్యస్తవాన్ని పఠిస్తే, అతడికి దుర్లభమైన వరాన్ని కూడ సూర్యభగవానుడిస్తాడు. (75)
యశ్చేదం ధారయేన్నిత్యం శృణుయాద్ వాప్యభీక్ష్ణశః ।
పుత్రార్థీ లభతే పుత్రం ధనార్థీ లభతే ధనమ్ ।
విద్యార్థీ లభతే విద్యాం పురుషోఽప్యథవా స్త్రియః ॥ 76
నిత్యమూ ఈ స్తోత్రాన్ని పఠించిన, స్త్రీ పురుషులు విన్నవారూ పుత్రుని కోరితే పుత్రునీ, ధనాన్ని కోరితే ధనాన్నీ, విద్యను కోరితే విద్యనూ పొందుతారు. (76)
ఉభే సంధ్యే పఠేన్నిత్యం నారీ వా పురుషో యది ।
ఆపదం ప్రాప్య ముచ్యేత బద్ధో ముచ్యేత బంధనాత్ ॥ 77
స్త్రీ పురుషులెవరైనా సాయంప్రాతః సంధ్యలు రెంటి యందూ దీన్ని నిత్యం పఠిస్తే ఆపదలో ఉన్నవాడు ఆపదనుండి విముక్తుడవుతాడు. బంధనంలో ఉన్నవాడు బంధం నుండి విముక్తి పొందుతాడు. (77)
ఏతద్ బ్రహ్మా దదౌ పూర్వం శక్రాయ సుమహాత్మనే ।
శక్రాచ్చ నారదః ప్రాప్తః ధౌమ్యస్తు తదనంతరమ్ ।
ధౌమ్యాద్ యుధిష్ఠిరః ప్రాప్యా సర్వాన్ కామానవాప్తవాన్ ॥ 78
ఈ స్తుతిని పూర్వకాలంలో బ్రహ్మ మహాత్ముడైన ఇంద్రునికిచ్చాడు. ఇంద్రుని నుండి నారదుడు, అతని నుండి ధౌమ్యుడు పొందాడు. ధౌమ్యుని నుండి యుధిష్ఠిరుడు పొంది సర్వకామాలను పొందాడు. (78)
సంగ్రామే చ జయేన్నిత్యం విపులం చాప్నుయాద్ వసు ।
ముచ్యతే సర్వపాపేభ్యః సూర్యలోకం స గచ్ఛతి ॥ 79
ఈ సూర్యస్తవాన్ని నిష్ఠగా ఆచరించినవాడు యుద్ధంలో ఎల్లప్పుడూ జయాన్ని పొందుతాడు. గొప్ప సంపదను పొందుతాడు. అన్ని పాపాల నుండి ముక్తుడౌతాడు. సూర్యలోకాన్ని పొందుతాడు. (79)
వైశంపాయన ఉవాచ
లబ్ధ్వా వరం తు కౌంతేయః జలాదుత్తీర్య ధర్మవిత్ ।
జగ్రాహ పాదౌ ధౌమ్యస్య భ్రాతౄంశ్చ పరిషస్వజే ॥ 80
జనమేజయా! సూర్యుని నుండి ఈ విధంగా వరాన్ని పొంది, ధర్మవేత్త అయిన యుధిష్ఠిరుడు నీటి నుండి లేచి బయటకు వచ్చి ధౌమ్యుని పాదాలు పట్టుకొన్నాడు. సోదరులను కౌగిలించుకొన్నాడు. (80)
ద్రౌపద్యా సహ సంగమ్య వంద్యమానస్తయా ప్రభుః ।
మహానసే తదానీం తు సాధయామాస పాండవః ॥ 81
యుఢిష్ఠిరుడు ప్రేమతో ద్రౌపదిని కలుసుకొన్నాడు. ఆమె అతనికి నమస్కరించింది. ఆమెతో పాటు మహానసంలోకి (వంటగదిలోకి) వెళ్ళాడు. (81)
సంస్కృతం ప్రసవం యాతి స్వల్పమన్నం చతుర్విధమ్ ।
అక్షయ్యం వర్ధతే చాన్నం తేన భోజయతే ద్విజాన్ ॥ 82
ఆ పాత్రలో కొద్దిగా వండినా చతుర్విధాలైన భక్ష్యాలు అక్షయ్యంగా వృద్ధి చెందాయి. వాటితో ధర్మజుడు బ్రాహ్మణులకు భోజనం పెట్టాడు. (82)
భుక్తవత్సు చ విప్రేషు భోజయిత్వానుజానపి ।
శేషం విఘససంజ్ఞం తు పశ్చాద్ భుంక్తే యుధిష్ఠిరః ॥ 83
బ్రాహ్మణులు భుజించిన పిమ్మట, సోదరులకు కూడ భోజనం పెట్టి, మిగిలిన విఘసమనే భుక్తశేషమును యుధిష్ఠిరుడు భుజిస్తాడు. (83)
యుధిష్ఠిరం భోజయిత్వా శేషమశ్నాతి పార్షతీ ।
ద్రౌపద్యాం భుజ్యమానాయాం తదన్నం క్షయమేతి చ ।
ఏవం దివాకరాత్ ప్రాప్యా దివాకరసమప్రభః ॥ 84
కామాన్ మనోఽబిలషితాన్ బ్రాహ్మణేభ్యోఽదదాత్ ప్రభుః ।
పురోహితపురోగాశ్చ తిథినక్షత్రపర్వసు ।
యజ్ఞియార్థాః ప్రవర్తంతే విధిమంత్రప్రమాణతః ॥ 85
యుధిష్ఠిరుడు తిన్న తర్వాత ద్రౌపది భుజిస్తుంది. ఆమె భుజించిన పిమ్మట ఆ ప్రాతలోని అన్నం అయిపోతుంది. ఇక వృద్ధి చెందదు. సూర్యునితో సమానమైన తేజస్సు గల ధర్మరాజు సూర్యుని వల్ల ఈ విధంగా తన మనోవాంఛితాలన్నింటిని పొంది బ్రాహ్మణులకు ఇచ్చాడు. ఆయా తిథి నక్షత్ర పర్వాలలో చేయదగిన యజ్ఞసంబంధ కర్మలు పురోహితులు ముందుండగ విధిమంత్ర ప్రమాణసహితంగా జరుగుతున్నాయి. (84,85)
తతః కృతస్వస్త్యయనాః ధౌమ్యేన సహ పాండవాః ।
ద్విజసంఘైః పరివృతాః ప్రయయుః కామ్యకం వనమ్ ॥ 86
అనంతరం స్వస్తివాచనం పల్కిన బ్రాహ్మణసముదాయంతో ధౌమ్యునితో పాండవులు అక్కడ నుండి కామ్యకవనానికి వెళ్ళారు. (86)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి కామ్యకవనప్రవేశే తృతీయోఽధ్యాయః ॥ 3 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున అరణ్యపర్వమను ఉపపర్వమున కామ్యకవనప్రవేశమను మూడవ అధ్యాయము. (3)