వన పర్వము
1. ప్రథమాధ్యాయము
(అరణ్య పర్వము)
పాండవుల వనవాసగమనము.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ ।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ॥
ముందుగా నారాయణునికి, నరోత్తముడయిన అర్జునునికి, సరస్వతీదేవికి, వ్యాసునికి నమస్కరించి, తరువాత జయమనే ఈ భారతాన్ని పఠించాలి. చెప్పాలి.
జనమేజయ ఉవాచ
ఏవం ద్యూతజితాః పార్థాః కోపితాశ్చ దురాత్మభిః ।
ధార్థరాష్ట్రైః సహామాత్యైః నికృత్యా ద్విజసత్తమ ॥ 1
శ్రావితాః పరుషా వాచః సృజద్భిర్వైరముత్తమమ్ ।
కిమకుర్వత కౌరవ్యాః మమ పూర్వపితామహాః ॥ 2
జనమేజయుడు ఇలా అన్నాడు - ద్విజోత్తమా! దుర్మార్గులైన ధార్తరాష్ట్రులు తమ మంత్రులతో కలిసి మోసంతో పాండవులను జూదంలో ఓడించి, వారికి కోపాన్ని కల్గించారు. పరుషంగా మాట్లాడి వారితో వైరాన్ని పెంచుకొన్నారు కదా! అపుడు మా పూర్వపితామహులు యుధిష్ఠిరాదులు ఏం చేశారు? (1,2)
కథం చైశ్వర్యవిభ్రష్టాః సహసా దుఃఖమీయుషః ।
వనే విజహ్రిరే పార్థాః శక్రప్రతిమతేజసః ॥ 3
హఠాత్తుగా ఐశ్వర్యభ్రష్టులై, గొప్ప దుఃఖాన్ని పొంది, ఇంద్రునితో సమానమైన తేజస్సు కల పాండవులు వనంలో ఏ విధంగా సంచరించారు? (3)
కే వై తానన్వవర్తంత ప్రాప్తాన్ వ్యసనముత్తమమ్ ।
కిమాచారాః కిమాహారాః క్వ చ మహాత్మనామ్ ॥ 4
అంతటి పెద్ద కష్టం పొందిన మహాత్ములైన ఆ పాండవులను ఎవరు అనుసరించారు? వారు అరణ్యంలో ఎటువంటి ఆచారవ్యవహారాలు పాటించారు? ఏం తిన్నారు? ఎక్కడ నివసించారు? (4)
కథం చ ద్వాదశ సమాః వనే తేషాం మహామునే ।
వ్యతీయుర్ర్బాహ్మణశ్రేష్ఠ శూరాణామరిఘాతినామ్ ॥ 5
మహర్షీ! బ్రాహ్మణశ్రేష్ఠా! శత్రుసంహారకులై శూరులైన ఆ పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో ఏ విధంగా గడిపారు? (5)
కథం చ రాజపుత్రీ సా ప్రవరా సర్వయోషితామ్ ।
పతివ్రతా మహాభాగా సతతం సత్యవాదినీ ॥ 6
వనవాసమదుఃఖార్హా దారుణం ప్రత్యపద్యత ।
ఏతదాచక్ష్వ మే సర్వం విస్తరేణ తపోధన ॥ 7
తపోధనా! స్త్రీలందరిలో సౌందర్యవతి, పతివ్రత, సత్యవాదిని, మహానుభావురాలు అయిన రాజపుత్రి ద్రౌపది, వనవాసమంతటి దారుణదుఃఖాన్ని నిజంగా అనుభవింపదగింది కాదు, అయినా ఇంతటి భయంకర దుఃఖాన్ని ఎలా సహింపగల్గింది? ఈ విషయాలన్నింటిని నాకు విస్తరంగా చెప్పు. (6,7)
శ్రోతుమిచ్ఛామి చరితం భూరిద్రవిణతేజసామ్ ।
కథ్యమానం త్వయా విప్ర పరం కౌతూహలం హి మే ॥ 8
విప్రవరా! మహాపరాక్రమవంతులు, తేజస్సంపన్నులూ అయిన పాండవుల చరిత్రను నీవు చెపితే వినాలని నాకు మిక్కిలి కుతూహలంగా ఉంది. (8)
వైశంపాయన ఉవాచ
ఏవం ద్యూతజితాః పార్థాః కోపితాశ్చ దురాత్మభిః ।
ధార్తరాష్ట్రైః సహామాత్యైః నిర్యయుర్గజసాహ్వయాత్ ॥ 9
వైశంపాయనుడు ఇలా అన్నాడు - ఈ విధంగా అమాత్యులతో పాటుగా దుర్మార్గులైన ధార్తరాష్ట్రులు పాండవులను జూదంలో ఓడించి వారికి కోపం కల్గించారు. పాండవులు హస్తినాపురాన్ని విడిచివెళ్లారు. (9)
వర్దమానపురద్వారాద్ అభినిష్ర్కమ్య పాండవాః ।
ఉదఙ్ముఖాః శస్త్రభృతః ప్రయయుః సహ కృష్ణయా ॥ 10
శస్త్రధారులైన పాండవులు ద్రౌపదితోపాటు వర్ధమాన పురద్వారం నుండి ఉత్తరాభిముఖులై నగరం నుండి నిష్క్రమించారు. (10)
ఇంద్రసేనాదయశ్చైవ భృత్యాః పరిచతుర్దశ ।
రథైరనుయయుః శీఘ్రైః స్త్రియ ఆదాయ సర్వశః ॥ 11
ఇంద్రసేనాది సేవకులు పదునలుగురి కంటె ఎక్కువ మంది ద్రౌపదితో వర్ధమాన పురద్వారం నుండి ఉత్తరాభిముఖులై నిష్క్రమించారు. (11)
గతానేతాన్ విదిత్వా తు పౌరాః శోకాభిపీడితాః ।
గర్హయంతోఽసకృద్ భీష్మవిదురద్రోణగౌతమాన్ ॥ 12
ఊచుర్విగతసంత్రాసాః సమాగమ్య పరస్పరమ్ ।
పాండవులు వనానికి వెళ్ళారన్న విషయం తెలిసి పౌరులు దుఃఖంతో భీష్మ, విదుర, ద్రోణ, కృపాచార్యులను పలుమార్లు నిందించారు. వారు ఒకరితో ఒకరు భయం లేకుండా ఇలా మాట్లాడుకోసాగారు. (12 1/2)
పౌరా ఊచుః
నేదమస్తి కులం సర్వం న వయం న చ నో గృహాః ॥ 13
యత్ర దుర్యోధనః పాపః సౌబలేనాభిపాలితః ।
కర్ణదుఃశాసనాభ్యాం చ రాజ్యమేతచ్చికీర్షతి ॥ 14
శకుని, కర్ణ దుఃశాసనులతో పాపాత్ముడైన దుర్యోధనుడు ఈ రాజ్యాన్ని పరిపాలిద్దామనుకొంటున్నాడు. ఇక వంశమూ లేదు, మనమూ లేము, మన గృహాలూ లేవు. (13,14)
న తత్ కులం న చాచారః న ధర్మోఽర్థః కుతః సుఖమ్ ।
యత్ర పాపసహాయోఽయం పాపో రాజ్యం చికీర్షతి ॥ 15
పాపసహాయుడై (పాపాత్ములు తోడు గల) పాపాత్ముడైన ఈ దుర్యోధనుడు రాజ్యం చేస్తుండగా, వంశమూ లేదు, ఆచారమూ లేదు. ధర్మార్థాలూ లేవు, ఇంక సుఖం ఎక్కడిది? (15)
దుర్యోధనో గురుద్వేషీ త్యక్తాచారసుహృజ్జనః ।
అర్థలుబ్ధోఽభిమానీ చ నీచః ప్రకృతినిర్ఘృణః ॥ 16
దుర్యోధనుడు గురుద్వేషి. సదాచారాన్నీ, మంచి మనసున్నవారినీ వదిలిపెడతాడు. అతడు ధనలోభి, దురభిమాని, నీచుడు, క్రూర స్వభావం కలవాడు. (16)
నేయమస్తి మహీ కృత్స్నా యత్ర దుర్యోధనో నృపః ।
సాధు గచ్ఛామహే సర్వే యత్ర గచ్ఛంతి పాండవాః ॥ 17
దుర్యోధనుడు పరిపాలకుడిగా ఉండగా ఇక ఈ (భూమి) రాజ్యం లేనట్లే. అందువల్ల పాండవులు వెళ్లే చోటుకే మనమంతా కూడా వెళ్దాం. అదే మంచిది. (17)
సానుక్రోశా మహాత్మానో విజితేంద్రియశత్రవః ।
హ్రీమంతః కీర్తిమంతశ్చ ధర్మాచారపరాయణాః ॥ 18
పాండవులు దయాళురు, మహాత్ములు, జితేంద్రియులు, శత్రుంజయులు, లజ్జాశీలులు, యశస్వులు, ధర్మాచారపరాయణులు. (18)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వానుజగ్ముస్తే పాండవాంస్తాన్ సమేత్య చ ।
ఊచుః ప్రాంజలయః సర్వే కౌంతేయాన్ మాద్రినందనాన్ ॥ 19
వైశంపాయనుడిలా అన్నాడు - పౌరులు ఈ విధంగా మాట్లాడుకొని పాండవులను సమీపించి వారికి చేతులు జోడించి ఇలా అన్నారు. (19)
క్వ గమిష్యథ భద్రం వః త్వక్త్వాస్మాన్ దుఃఖభాగినః ।
వయమప్యనుయాస్యామః యత్ర యూయం గమిష్యథ ॥ 20
పాండవులారా! మీకు మంగళమగుగాక. దుఃఖభాగులమైన మమ్ము విడిచి మీరు ఎక్కడకు వెళ్తారు? మీరు వెళ్ళే చోటికి మేము కూడా మిమ్మల్ని అనుసరించి వస్తాము. (20)
అధర్మేణ జితాన్ శ్రుత్వా యుష్మాంస్త్యక్తఘృణైః పరైః ।
ఉద్విగ్నాః స్మో భృశం సర్వే నాస్మాన్ హాతుమిహార్హథ ॥ 21
భక్తానురక్తాన్ సుహృదః సదా ప్రియహితే రతాన్ ।
కురాజాధిష్ఠితే రాజ్యే న వినశ్యేమ సర్వశః ॥ 22
అధర్మంగా క్రూరంగా నిర్దయంగా శత్రువులైన ధార్తరాష్ట్రులు మిమ్మల్ని జయించారని విని మేమంతా చాలా బాధపడ్డాం. మీ సేవకులం, మీ పట్ల భక్తులం అనురక్తులం, ఎల్లపుడూ మీ ఇష్టాన్ని, హితాన్ని కోరుకొనేవాళ్ళం. స్నేహితులం అయిన మమ్మల్ని ఇక్కడ వదిలివెళ్లడం మీకు తగిందికాదు. దుష్టుడైనరాజు పాలించే రాజ్యంలో ఉండి అన్నివిధాలా మేము చెడిపోలేము. (21,22)
శ్రూయాతాం చాభిధాస్యామః గుణదోషాన్ నరర్షభాః ।
శుభాశుభాధివాసేన సంసర్గః కురుతే యథా ॥ 23
నరశ్రేష్ఠులైన పాండవులారా! శుభాశుభులైన వారి ఆశ్రయం పొందితే ఆ కలయిక కలిగించే గుణదోషాలను చెప్తాము. వినండి. (23)
వస్త్రమాపస్తిలాన్ భూమిం గంధో వాసయతే యథా ।
పుష్పాణామధివాసేన తథా సంసర్గజా గుణాః ॥ 24
పూలయొక్క సంసర్గం చేత వస్త్రమూ, నీరూ, తిలలూ, భూమీ పూలవాసనను పొందుతాయి. అలాగే ఆశ్రయసంసర్గం వల్ల కలిగిన గుణాలు వాటి ప్రభావాన్ని చూపుతాయి. (24)
మోహజాలస్య యోనిర్హి మూఢైరేవ సమాగమః ।
అహన్యహని ధర్మస్య యోనిః సాధుసమాగమః ॥ 25
మూఢులతో సమాగమం నిరంతరం మొహజాలాన్ని కలిగిస్తుంది. సత్పురుషులతో సమాగమం ప్రతిదినమూ ధర్మాన్ని కలుగజేస్తుంది. (25)
తస్మాత్ ప్రాజ్ఞైశ్చ వృద్ధైశ్చ సుస్వభావైస్తపస్విభిః ।
సద్భిశ్చ సహ సంసర్గః కార్యః శమపరాయణైః ॥ 26
అందువల్ల విద్వాంసులు, వృద్ధులు, ఉత్తమస్వభావంగల, శాంతిపరాయణులైన తపస్విజనులు, సత్పురుషులతో (సమాగమం చెయ్యాలి) కలిసి ఉండాలి. (26)
యేషాం త్రీణ్యవదాతాని విద్యా యోనిశ్చ కర్మ చ ।
తే సేవ్యాస్తైః సమాస్యా హి శాస్త్రేభ్యోఽపి గరీయసీ ॥ 27
నిరారంభా హ్యపి వయం పుణ్యశీలేషు సాధుషు ।
పుణ్యమేవాప్నుయామేహ పాపం పాపోపసేవనాత్ ॥ 28
విద్యచేత, పుట్టుకచేత, కర్మచేత నిర్మలులయిన వారిని సేవించాలి. వారితో కలిసి ఉండడం శాస్త్రాధ్యయనం కంటె గొప్పది. మనం పుణ్యకర్మలు చేయకపోయినా పుణ్యశీలులైన సత్పురుషులతో కలిసి ఉండడం వల్ల మనం కూడా పుణ్యం పొందుతాము. పాపాత్ములను సేవించడం వల్ల పాపాన్ని పొందుతాము. (27,28)
అసతాం దర్శనాత్ స్పర్శాత్ సంజల్పాచ్చ సహాసనాత్ ।
ధర్మాచారాః ప్రహీయంతే సిద్ధ్యంతి చ న మానవాః ॥ 29
దుర్మార్గుల దర్శనం వల్ల, స్పర్శవల్ల, వారితో మాట్లాడ్డం వల్ల, వారితో కూడి ఉండటం వల్ల ధార్మికాలైన ఆచారాలు క్షీణిస్తాయ్. అందువల్ల అట్టిమానవులు సిద్ధిని పొందలేరు. (29)
బుద్ధిశ్చ హీయతే పుంసాం నీచైః సహ సమాగమాత్ ।
మధ్యమైర్మధ్యతాం యాతి శ్రేష్ఠతాం యాతి చోత్తమైః ॥ 30
నీచులతో కలయిక వల్ల మానవుల బుద్ధి క్షీణిస్తుంది. మధ్యములతో కలియడం వల్ల బుద్ధి మధ్యమంగా ఉంటుంది. ఉత్తములతో కలయికవల్ల బుద్ధి శ్రేష్ఠత్వాన్ని పొందుతుంది. (30)
అనీచైర్నాప్యవిషయైః నాధర్మిష్ఠైర్విశేషతః ।
లోకాచారేషు సంభూతాః వేదోక్తాః శిష్టసమ్మతాః ॥ 31
ఉత్తములు, విషయపరాఙ్ముఖులు, ప్రత్యేకించి ధర్మపరులు లోకంలో ధర్మకామార్థసంభవాలైన గుణాలను చెప్పారు. వేదోక్తాలైన ఆ గుణాలు శిష్టసమ్మతాలై లోకాచారాల్లో కనబడుతూంటాయి. (31)
తే యుష్మాసు సమస్తాశ్చ వ్యస్తాశ్చైవేహ సద్గుణాః ।
ఇచ్ఛామో గుణవన్మధ్యే వస్తుం శ్రేయోఽభికాంక్షిణః ॥ 32
ఆ సద్గుణాలన్నీ మొత్తంగాను, విడివిడిగానూ మీలో ఉన్నాయి. శ్రేయస్సును కోరుకొంటున్న మేము గుణవంతులైన మీమధ్యలో నివసించాలని కోరుకొంటున్నాము. (32)
యుధిష్ఠిర ఉవాచ
ధన్యా వయం యదస్మాకం స్నేహకారుణ్యయంత్రితాః ।
అసతోఽపి గుణానాహుః బ్రాహ్మణప్రముఖాః ప్రజాః ॥ 33
యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు - మేము ధన్యులం. మా పట్లగల స్నేహకారుణ్యాలచే బ్రాహ్మణప్రముఖులైన జనులందరూ మాలో లేని గుణాలను కూడా ఉన్నట్లు చెపుతున్నారు. మేము ధన్యులం. (33)
తదహం భ్రాతృసహితః సర్వాన్ విజ్ఞాపయామి వః ।
నాన్యథా తద్ధి కర్తవ్యమ్ అస్మత్స్నేహానుకంపయా ॥ 34
అందువల్ల సోదరులతో కూడిన నేను మీ అందరికి విన్నవించుకొంటున్నాను. మా పట్ల గల స్నేహం చేత, దయ చేత మీరు మరొక విధంగా చేయవద్దు. (34)
భీష్మః పితామహో రాజా విదురో జననీ చ మే ।
సుహృజ్జనశ్చ ప్రాయో మే నగరే నాగసాహ్వయే ॥ 35
మా పితామహుడు భీష్ముడు, రాజయిన ధృతరాష్ట్రుడు, విదురుడు, మా తల్లి కుంతి, సుమారుగా నా స్నేహితులందరూ హస్తినాపురంలోనే ఉన్నారు. (35)
తే త్వస్మద్ధితకామార్థం పాలనీయాః ప్రయత్నతః ।
యుష్మాభిః సహితాః సర్వే శోకసంతాపవిహ్వలాః ॥ 36
శోకసంతాపలచే వ్యాకులపడుతున్న వారందరిని మా హితాన్ని కోరి మీరు ప్రయత్నపూర్వకంగా రక్షించాలి. (36)
నివర్తతాగతా దూరం సమాగమనశాపితాః ।
స్వజనే న్యాసభూతే మే కార్యా స్నేహాన్వితా మతిః ॥ 37
అందువల్ల మీరు వెనుకకు మరలండి. మీరు ఇప్పటికే చాలా దూరం వచ్చారు. నేను నిశ్చయంగా చెపుతున్నాను. మీరు మాతో కలిసి రావద్దు. మావారందరినీ మీవద్ద ఉంచిన న్యాసంగా భావించండి. మాపట్ల స్నేహభావం కలిగి ఉండండి. (37)
ఏతద్ధి మమ కార్యాణాం పరమం హృది సంస్థితమ్ ।
కృతా తేన తు తుష్టిర్మే సత్కారశ్చ భవిష్యతి ॥ 38
నా హృదయంలో ఉన్న కార్యాలన్నింటిలో ఇదే ఉత్తమమైంది. మీరీ పని చేస్తే నాకు సంతోషం కలుగుతుంది. అదే నాకు సత్కారం అవుతుంది. (38)
వైశంపాయన ఉవాచ
తథానుమంత్రితాస్తేన ధర్మరాజేన తాః ప్రజాః ।
చక్రురార్తస్వరం ఘోరం హా రాజన్నితి సంహతాః ॥ 39
వైశంపాయనుడిలా అన్నాడు - రాజా! ఇలా ధర్మరాజు ప్రార్థిస్తే ఆ ప్రజలందరూ కలిసి ఒక్కసారిగా 'హా!మహారాజా' అని ఘోరమైన ఆర్తనాదం చేశారు. (39)
గుణాన్ పార్థస్య సంస్కృత్య దుఃఖార్తాః పరమాతురాః ।
అకామాః సన్న్యవర్తంత సమాగమ్యాథ పాండవాన్ ॥ 40
పృథాసూనుడైన యుధిష్ఠిరుని గుణాలను సంస్మరించుకొని, దుఃఖార్తులూ, మిక్కిలి ఆపన్నులూ అయిన ఆ ప్రజలు తమ కోరిక తీరకుండానే కేవలం పాండవులను కలుసుకొని వెనుదిరిగి వెళ్లారు. (40)
నివృత్తేషు తే పౌరేషు రథానాస్థాయ పాండవాః ।
ఆజగ్ముర్జాహ్నవీతీరే ప్రమాణాఖ్యం మహావటమ్ ॥ 41
పౌరులు వెనుదిరిగి వెళ్లాక, పాండవులు రథాలనెక్కి గంగానదీతీరంలో ఉన్న ప్రమాణం అనే వటవృక్షం దగ్గరకు వచ్చారు. (41)
తే తం దివసశేషేణ వటం గత్వా తు పాండవాః ।
ఊషుస్తాం రజనీం వీరాః సంస్పృశ్య సలిలం శుచి ॥ 42
వటవృక్షానికి చేరిన ఆ పాండవులు మిగిలిన పగటిభాగంలో పవిత్రగంగాజలంతో ఆచమనాదికం చేసి, ఆ రాత్రి అక్కడ గడిపారు. (42)
ఉదకేనైవ తాం రాత్రిమ్ ఊషుస్తే దుఃఖకర్షితాః ।
అనుజగ్ముశ్చ తత్రైతాన్ స్నేహాత్ కేచిద్ ద్విజాతయః ॥ 43
దుఃఖపీడితులైన పాండవులు ఆ రాత్రి కేవలం నీరు త్రాగి గడిపారు. వారి పట్ల గల స్నేహం వల్ల కొందరు బ్రాహ్మణులు వారిని అనుసరించి వచ్చారు. (43)
సాగ్నయోఽనగ్నయశ్చైవ సశిష్యగణబాంధవాః ।
స తైః పరివృతో రాజా శుశుభే బ్రహ్మవాదిభిః ॥ 44
శిష్యగణాలతో, బాంధవులతో, సాగ్నులు నిరగ్నులు బ్రహ్మవాదులూ అయిన బ్రాహ్మణులతో కూడి ధర్మరాజు మిక్కిలి ప్రకాశించాడు. (44)
తేషాం ప్రాదుష్కృతాగ్నీనాం ముహూర్తే రమ్యదారుణే ।
బ్రహ్మఘోషపురస్కారః సంజల్పః సమజాయత ॥ 45
రాక్షస పిశాచాదులచే రమ్యమూ, భయంకరమూ అయిన ప్రదోషకాలముహూర్తంలో వేదమంత్రఘోషతో అగ్ని కార్యం చేసిన ఆ బ్రాహ్మణులు పరస్పరం సంవాదాలు చేశారు. (45)
రాజానం తు కురుశ్రేష్ఠం తే హంసమధురస్వరాః ।
ఆశ్వాసయంతో విప్రాగ్ర్యాః క్షపాం సర్వాం వ్యనోదయన్ ॥ 46
హంసధ్వనివలె మధురస్వరం గల ఆ విప్రవరులు ఆ రాత్రంతా కురుకులశ్రేష్ఠుడయిన యుధిష్ఠిరునికి ఊరట కలిగిస్తూ వినోదింపజేశారు. (46)
ఇతి శ్రీ మహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి పౌరప్రత్యాగమనే ప్రథమోఽధ్యాయః ॥1॥
శ్రీమహాభారతమున, వనపర్వమున అరణ్య పర్వమను ఉపపర్వమున
పౌరప్రత్యాగమన మను ప్రథమాధ్యాయము. (1)