81. ఎనుబది ఒకటవ అధ్యాయము

ధృతరాష్ట్ర సంజయ సంవాదము.

వైశంపాయన ఉవాచ
వనం గతేషు పార్థేషు నిర్జితేషు దురోదరే ।
ధృతరాష్ట్రం మహారాజ తదా చింతా సమావిశత్ ॥ 1
మహారాజా! జూదంలో ఓడిపోయి పాండవులు అరణ్యానికి వెళ్ళిపోయిన పిదప అప్పుడు ధృతరాష్ట్రునిలో చింత మొదలయింది. (1)
తం చింతయానమాసీనం ధృతరాష్ట్రం జనేశ్వరమ్ ।
నిఃశ్వసంతమనేకాగ్రమ్ ఇతి హోవాచ సంజయః ॥ 2
ఆ ధృతరాష్ట్రమహారాజు పరిపరివిధాలుగా ఆలోచిస్తూ, నిట్టూరుస్తూ కూర్చొని ఉండగా సంజయుడిలా అన్నాడు. (2)
సంజయ ఉవాచ
అవాప్య వసుసంపూర్ణాం వసుధాం వసుధాధిప ।
ప్రవ్రాజ్య పాండవాన్ రాజ్యాద్ రాజన్ కిమనుశోచసి ॥ 3
సంజయుడిలా అన్నాడు. రాజా! భూనాయకా! ధనాన్ని పొంది, భూమినంతా ఆక్రమించుకొని, పాండవులను రాజ్యం నుండి బయటకు పంపి ఇంకా విచారిస్తున్నావేమిటి? (3)
ధృతరాష్ట్ర ఉవాచ
అశోచ్యత్వమ్ కుతస్తేషామ్ యేషాం వైరం భవిష్యతి ।
పాండవైర్యుద్ధశౌండైర్హి బలవద్భిర్మహారథైః ॥ 4
ధృతరాష్ట్రుడిలా అన్నాడు - యుద్ధనిపుణులై, బలవంతులై, మహారాతులయిన పాండవులతో శత్రుత్వం ఏర్పడిన తర్వాత విచారించకుండా ఎవరైనా ఎలా ఉండగలరు? (4)
సంజయ ఉవాచ
తవేదం స్వకృతం రాజన్ మహద్ వైరముపస్థితమ్ ।
వినాశో యేన లోకస్య సానుబంధో భవిష్యతి ॥ 5
సంజయుడిలా అన్నాడు. రాజా! ఇది స్వయంకృతాపరాధం. మహాశత్రుత్వమే ఏర్పడింది. లోకమంతా సర్వసంబంధీకులతో పాటు నశించటమే దీని ఫలితం. (5)
వార్యమాణో హి భీష్మేణ ద్రోణేన విదురేణ చ ।
పాండవానాం ప్రియాం భార్యాం ద్రౌపదీం ధర్మచారిణీమ్ ॥ 6
ప్రాహిణోదానయేహేతి పుత్రో దుర్యోధనస్తవ ।
సూతపుత్రం సుమందాత్మా నిర్లజ్జః ప్రాతికామినమ్ ॥ 7
బుద్ధిహీనుడైన నీ కొడుకు దుర్యోధనుడు భీష్మద్రోన విదురులు వారిస్తున్నా వినకుండా పాండవుల ప్రియపత్ని, ధర్మచారిణి అయిన ద్రౌపదిని తీసికొని రమ్మని సిగ్గులేకుండా సూతపుత్రుడైన ప్రాతికామిని పంపించాడు. (6,7)
యస్మై దేవాః ప్రయచ్ఛంతి పురుషాయ పరాభవమ్ ।
బుద్ధ్యా తస్యాపకర్షంతి సోఽవాచీనాని పశ్యతి ॥ 8
బుద్ధౌ కలుషభూతాయాం వినాశే సముపస్థితే ।
అనయో నయసంకాశః హృదయాన్నాపసర్పతి ॥ 9
దేవతలు తామెవరికయినా పరాభవాన్ని కల్పించదలచుకొంటే వారి బుద్ధిని అపహరిస్తారు. దానితో ఆ బుద్ధిహీనులు అంతా తలక్రిందులుగా విపరీతంగా చూస్తారు. వినాశకాలం దాపురించినపుడు బుద్ధి కలుషితమై అవినీతి కూడా నీతిలా కనిపిస్తూ మనస్సు నుండి దూరంకాదు. (8,9)
అనర్థాశ్చార్థరూపేణ అర్థాశ్చానర్థరూపిణః ।
ఉత్తిష్ఠంతి వినాశాయ నూనం తచ్చాస్య రోచతే ॥ 10
అనర్థాలు సార్థకాలు అనిపిస్తాయి. అర్థాలు అనర్థాలుగా తోస్తాయి. వినాశకాలంలో ఇది స్థితి. అటువంటి వాడికి తప్పక అదే నచ్చుతుంది. (10)
న కాలో దండముద్యమ్య శిరః కృంతతి కస్యచిత్ ।
కాలస్య బలమేతావద్ విపరీతార్థదర్శనమ్ ॥ 11
కాలం దండాన్ని ఎత్తి ఎవ్వరి తలనూ నరకదు. అర్థాన్ని మనుష్యులచే విపరీతంగా దర్శింపజేయగలగటమే దాని బలం. (11)
ఆసాదితమిదం ఘోరం తుములం లోమహర్షణమ్ ।
పాంచాలీమపకర్షద్భిః సభామధ్యే తపస్వినీమ్ ॥ 12
అయోనిజాం రూపవతీం కులే జాతాం విభావసోః ।
కో ను తాం సర్వధర్మజ్ఞాం పరిభూయ యశస్వినీమ్ ॥ 13
పర్యానయేత్ సభామధ్యే వినా దుర్ద్యూతదేవినమ్ ।
స్త్రీధర్మిణీ వరారోహా శోణితేన పరిప్లుతా ॥ 14
ఏకవస్త్రాథ పాంచాలీ పాండవానభ్యవైక్షత ।
హృతస్వాన్ హృతరాజ్యాంశ్చ హృతవస్త్రాన్ హృతశ్రియః ॥ 15
విహీనాన్ సర్వకామేభ్యః దాసభావముపాగతాన్ ।
ధర్మపాశపరిక్షిప్తాన్ అశక్తానివ విక్రమే ॥ 16
పాంచాలి తపస్విని. అయోనిజ. రూపవతి. అగ్నివంశంలో పుట్టినది. సర్వధర్మాలు తెలిసినది. కీర్తిమతి. అటువంటి ఆమెను సభామధ్యంలో ఈడ్చినప్పుడే రోమాలు నిక్కబొడిచే భయంకర యుద్ధానికి ప్రారంభం జరిగింది. దొంగ జూదమాడే దుర్యోధనుడు తప్ప మరెవ్వరూ అటువంటి పని చేయరు. ఆ ద్రౌపది రజస్వల. అందమైనది. నెత్తుటి మరకలు గలది. ఏకవస్త్ర. ఆమె సభామధ్యంలో పాండవులను చూచింది.
వారు రాజ్యాన్ని విలువయిన వస్త్రాలను, సంపదలను, తమను కూడా కోలుపోయి ఉన్నవారు. సర్వకామాలను వీడి దాసులై కూర్చున్నారు. ధర్మపాశబద్ధులై పరాక్రమప్రదర్శనలో అసమర్థుల వలె ఉన్నారు. (12-16)
క్రుద్ధాం చానర్హతీమ్ కృష్ణాం దుఃఖితాం కురుసంసది ।
దుర్యోధనశ్చ కర్ణశ్చ కటుకాన్యభ్య భాషతామ్ ॥ 17
పాండవులను ఆ స్థితిలో చూచి ఆమె కోపించింది. దుఃఖించింది. ఆ దశకు తగని ఆమెను ఆ కౌరవసభలో దుర్యోధుడు, కర్ణుడు తూలనాడారు. (17)
ఇతి సర్వమిదం రాజన్నాకులంప్రతిభాతి మే ।
రాజా! ఇదంతా ఏదో కలతకు కారణమని నాకనిపిస్తోంది. (17 1/2)
ధృతరాష్ట్ర ఉవాచ
తస్యాః కృపణచక్షుర్భ్యాం ప్రదహ్యేతాపి మేదినీ ॥ 18
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. దీనంగా ఉన్న ఆ ద్రౌపది కళ్ళు భూమిని దహించవేయగలవు. (18)
అపి శేషమ్ భవేదద్య పుత్రాణాం మమ సంజయ ।
భరతానాం స్త్రియః సర్వాః గాంధార్యా సహ సంగతాః ॥ 19
ప్రాక్రోశన్ భైరవ తత్ర దృష్ట్వా కృష్ణాం సభాగతామ్ ।
ధర్మిష్ఠాం ధర్మపత్నీం చ రూపయౌవనశాలినీమ్ ॥ 20
సంజయా! ఆమె తలచుకొని ఉంటే ఇప్పటికి నేను నాకుమారులు మిగిలి ఉండేవాళ్ళం కాదు. ధర్మిష్ఠ, రూప యౌవనవతి, పాండవుల ధర్మపత్ని అయిన ద్రుపదిని సభాభవనంలోనికి రప్పించినప్పుడు గాంధారితో సహా భరతవంశ స్త్రీలందరు పెద్దగా ఆక్రోశిస్తూ చీదరించుకొన్నారు. (19,20)
ప్రజాభిః సహ సంగమ్య హ్యనుశోచంతి నిత్యశః ।
అగ్నిహోత్రాణి సాయాహ్నే న చాహూయంత సర్వశః ॥ 21
బ్రాహ్మణాః కుపితాశ్చాసన్ ద్రౌపద్యాః పరికర్షణే ।
ఈ స్త్రీలందరు ప్రజలలోని స్త్రీలతో కలిసి పగలూ, రేయి దానిని గురించే శోకిస్తున్నారు. ద్రౌపదిని సభలో ఈడ్చిన రోజు బ్రాహ్మణులంతా కోపించి సాయంకాలమ్ మా ఇంట అగ్ని కార్యాన్ని కూడా నిర్వర్తించలేదు. (21 1/2)
ఆసీన్నిష్ఠానకో ఘోరః నిర్ఘాతశ్చ మహానభూత్ ॥ 22
దివ ఉల్కాశ్చాపతంత రాహుశ్చార్కముపాగ్రసత్ ।
అపర్వణి మహాఘోరం ప్రజానాం జనయన్ భయమ్ ॥ 23
ఆ సమయంలో పెనుతుఫాను వచ్చింది. పిడుగు పాట్లతో మహాధ్వని వినిపించింది. ఆకాశం నుండి ఉల్కలు పడ్డాయి. అమావాస్య కాకపోయినా రాహువు సూర్యుని మ్రింగాడు. ప్రజలలో తీవ్రభయం చెలరేగింది. (22,23)
తథైవ రథశాలాసు ప్రాదురాసీద్ధుతాశనః ।
ధ్వజాశ్చాపి వ్యశీర్యంత భరతానామభూతయే ॥ 24
అదేవిధంగా రథశాలలలో అగ్నిప్రమాదం జరిగింది. భరతవంశ నాశనాన్ని సూచిస్తూ రథధ్వజాలన్నీ తగులబడ్డాయి. (24)
దుర్యోధనస్యాగ్నిహోత్రే ప్రాక్రోశన్ భైరవమ్ శివాః ।
తాస్తదా ప్రత్యభాషంతీ రాసభాః సర్వతోదిశః ॥ 25
దుర్యోధనుని అగ్నిహోత్రగృహంలో నక్కలు భయంకరంగా అరిచాయి. వాటికి ప్రతిగా అన్ని దిక్కులలో గాడిదలు అరిచాయి. (25)
ప్రాతిష్ఠత తతో భీష్మః ద్రోణేన సహ సంజయ ।
కృపశ్చ సోమదత్తశ్చ బాహ్లీకశ్చ మహామనాః ॥ 26
తతోఽహమబ్రువం తత్ర విదురేణ ప్రచోదితః ।
వరం దదాని కృష్ణాయై కాంక్షితం యద్ యదిచ్ఛతి ॥ 27
సంజయా! అదంతా గమనించి భీష్మ, ద్రోన, కృప, సోమదత్తులు మహామనస్వి అయిన బాహ్లీకుడు అక్కడ నుండి వెళ్ళిపోయారు. అప్పుడు నేను విదురుడు ప్రేరేపించగా ద్రౌపది కోరిన వరాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాను. (26,27)
అవృణోత్ తత్ర పాంచాలీ పాండవానామదాసతామ్ ।
సరథాన్ సధనుష్కాంశ్చాప్యనుజ్ఞాసిషమప్యహమ్ ॥ 28
ద్రౌపది పాండవుల దాస్యవిముక్తిని కోరింది. నేను రథాలు, ధనస్సులతో సహా సమస్తసంపదలను తిరిగి తీసికొని వెళ్ళటానికి అనుమతించాను. (28)
అథాబ్రవీన్మహాప్రాజ్ఞః విదురః సర్వధర్మవిత్ ।
ఏతదంతాస్తు భరతా యద్ వః కృష్ణా సభాం గతా ॥ 29
యైషా పాంచాలరాజస్య సుతా సా శ్రీరనుత్తమా ।
పాంచాలీ పాండవానేతాన్ దైవసృష్టోపసర్పతి ॥ 30
అప్పుడు మహాప్రాజ్ఞుడు, సర్వధర్మవేత్త అయిన విదురుడిలా అన్నాడు - ద్రౌపదిని మీరు సభలోని కీడ్చారు. ఆమెయే మీ వినాశనానికి కారణమవుతుంది. ఈ పాంచాల రాజకుమారి ఉత్తమలక్ష్మి. దేవతల ఆదేశం మేరకే ఆమె పాండవులను సేవిస్తోంది. (29,30)
తస్యాః పార్థాః పరిక్లేశం న క్షంస్యంతే హ్యమర్షణాః ।
వృష్ణయో వా మహేష్వాసాః పాంచాలా వా మహారథాః ॥ 31
తేన సత్యాభిసంధేన వాసుదేవేన రక్షితాః ।
ఆగమిష్యతి బీభత్సుః పాంచాలైః పరివారితః ॥ 32
పాండవులు అసహనంతో ఉన్నారు. ద్రౌపదికి జరిగిన పరాభవాన్ని వారు సహించరు. సత్యప్రతిజ్ఞుడైన వాసుదేవుడు, ఆయన రక్షణలోని వారు, మహాధనుర్ధరులు అయిన వృష్ణివంశజులు, మహారథులయిన పాంచాల వీరులు దీనిని సహించరు. పాంచాలురతో కూడి అర్జునుడు తప్పక ఎత్తి వస్తాడు. (31,32)
తేషాం మధ్యే మహేష్వాసః భీమసేనో మహాబలః ।
ఆగమిష్యంతి ధున్వానః గదాం దండమివాంతకః ॥ 33
యముడు దండాన్ని విసిరినట్లు వారిమధ్య నిలిచి మేటి విలుకాడు, మహాబలుడు అయిన భీముడు గదను విసురుతూ వస్తాడు. (33)
తతో గాండీవనిర్ఘోషమ్ శ్రుత్వా పార్థస్య ధీమతః ।
గదావేగం చ భీమస్య నాలం సోఢుం నరాధిపాః ॥ 34
అప్పుడు ధీమంతుడైన అర్జునుని గాండీవటంకారాన్ని భీముని గదావేగాన్ని ఏ రాజులూ ఎదుర్కొనజాలరు. (34)
తత్ర మే రోచతే నిత్యం పార్థైః సామ న విగ్రహః ।
కురుభ్యో హి సదా మన్యే పాండవాన్ బలవత్తరాన్ ॥ 35
కాబట్టి పాండవులతో మైత్రినే నేనెప్పుడూ ఇష్టపడతాను కానీ యుద్ధాన్ని కాదు. పాండవులు కౌరవులకన్నా ఎప్పుడూ బలవత్తరులే అని నేను అనుకొంటాను. (35)
తథా హి బలవాన్ రాజా జరాసంధో మహాద్యుతిః ।
బాహుప్రహరణేనైవ భీమేన నిహతో యుధి ॥ 36
బలసంపన్నుడు, కాంతిమంతుడు అయిన జరాసంధుని యుద్ధంలో భీముడు ఒక్కచేతి దెబ్బతో చంపివేశాడు. కదామరి! (36)
తస్య తే శమ ఏవాస్తు పాండవైర్భరతర్షభ ।
ఉభయోః పక్షయో ర్యుక్తం క్రియతామవిశంకయా ॥ 37
కాబట్టి భరతర్షభా! పాండవులతో శాంతియే తగినది. రెండు పక్షాలకు తగిన దిదే. నిస్సందేహంగా ఆ ఉపాయాన్నే ఆచరించు. (37)
ఏవం కృతే మహారాజ పరం శ్రేయస్త్వమాప్స్యసి ।
ఏవం గావల్గణే క్షత్తా ధర్మార్థసహితం వచః ॥ 38
ఉక్తవాన్ న గృహీతం వై మయా పుత్రహితైషిణా ॥ 39
మహారాజా! ఈవిధంగా నీకెంతో శ్రేయస్సు కలుగుతుంది. సంజయా! ఈవిధంగా విదురుడు నాకు ధర్మార్థయుక్తమైన సూచన చేశాడు. కానీ పుత్రుల హితాన్ని కోరుతూ కూడా దానిని నేను స్వీకరించలేదు. (38,39)
ఇతి శ్రీమహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం సభాపర్వణి అనుద్యూతపర్వణి ధృతరాష్ట్రసంజయ సంవాదే ఏకాశీతితమ్ఽధ్యాయః ॥ 81 ॥
ఇది శ్రీమహాభారతమున వ్యాసరచిత శతసాహస్రీ సంహిత యందు సభాపర్వణి అనుద్యూతపర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్ర సంజయ సంవాదమను ఎనుమది యొకటవ అధ్యాయము. (81)
(సభాపర్వ పూర్ణశ్లోక సంఖ్య 4056 (సభా పర్వ సంపూర్ణం))