72. డెబ్బది రెండవ అధ్యాయము

ధర్మరాజు భీముని శాంతింపజేయుట.

కర్ణ ఉవాచ
యా నః శ్రుతా మనుష్యేషు స్త్రియో రూపేణ సమ్మతాః ।
తాసామేతాదృశం కర్మ న కస్యాశ్చవ శుశ్రుమ ॥ 1
కర్ణుడిలా అన్నాడు. నేను మనుష్యులలో అందగత్తెలయిన స్త్రీలను గూర్చి విన్నాను. కానీ వారిలో ఎవ్వరూ ఈ విధంగా కార్యాన్ని సాధించినట్టు వినలేదు. (1)
క్రోధావిష్టేషు పార్థేషు ధార్తరాష్ట్రేషు చాప్యతి ।
ద్రౌపదీ పాండుపుత్రాణాం కృష్ణా శాంతిరిహాభవత్ ॥ 2
పాండవులు, ధార్తరాష్ట్రులూ ఒకరిపై ఒఅక్రు మండిపడేటప్పుడు ఈ ద్రౌపది పాండవులకు ప్రశాంతిని కల్గించింది. (2)
అప్లవేఽంభసి మగ్నానామ్ అప్రతిష్ఠే నిమజ్జతామ్ ।
పాంచాలీ పాండుపుత్రాణాం నౌరేషా పారగాభవత్ ॥ 3
పాండవులు నావ కానీ మరే ఆధారం కానీ లేకుండా నీటమునిగిపోతుంటే ద్రౌపదియే వారు తరించటానికి నౌక అయింది. (3)
వైశంపాయన ఉవాచ
తద్ వై శ్రుత్వా భీమసేనః కురుమధ్యేఽత్యమర్షణః ।
స్త్రీ గతిః పాండుపుత్రాణామ్ ఇత్యువాచ సుదుర్మనాః ॥ 4
వైశంపాయనుడిలా అన్నాడు - రాజా! కౌరవులమధ్యలో కర్ణుడన్న ఈ మాటలు విని భీమసేనుడు సహించలేకపోయాడు. మనస్సు కలతపడగా "పాండవులకు స్త్రీ గతి అయింది" అనుకొన్నాడు. (4)
భీమ ఉవాచ
త్రీణి జ్యోతీంషి పురుష ఇతి వై దేవలోఽబ్రవీత్ ।
అపత్యం కర్మ విద్యా చ యతః సృష్టాః ప్రజాస్తతః ॥ 5
భీముడిలా అన్నాడు. సంతానం, కర్మ, విద్య అనే మూడు జ్యోతులు పురుషునిలో ఉంటాయని దేవలుడు చెప్పాడు. వాటి ద్వారానే సర్వసృష్టి జరుగుతుంది. (5)
అమేధ్యే వై గతప్రాణే శూన్యే జ్ఞాతిభిరుజ్ఘితే ।
దేహే త్రితయమేవైతత్ పురుషస్యోపయుజ్యతే ॥ 6
శరీరం ప్రాణరహితమై, అపవిత్రమైనప్పుడు జ్ఞాతులు దానిని వదలివేస్తాడు. అప్పుడు సంతాన, కర్మ, జ్ఞానాలే పురుషునకు పరలోకంలో ఉపయోగపడతాయి. (6)
వి॥సం॥ శూన్యే = శ్మశానాదులలో (దేవ)
తన్నో జ్యోతి రభిహితం దారాణామభిమర్శనాత్ ।
ధనంజయ కథంస్విత్ స్యాత్ అపత్యమభిమృష్టజమ్ ॥ 7
ధనంజయా! దుశ్శాసనుడు ద్రౌపదిని తాకి ఆమెను అపవిత్రం చేశాడు. దానితో మన సంతానజ్యోతి నశించింది. పరపురుషుడు తాకిన స్త్రీకి పుట్టిన సంతానం దేని కుపయోగ పడుతుంది? (7)
అర్జున ఉవాచ
న చైవోక్తా న చానుక్తా హీనతః పరుషా గిరః ।
భారత ప్రతిజల్పంతి సదా తూత్తమపూరుషాః ॥ 8
అర్జునుడిలా అన్నాడు. భారతా! హీనుడు పరుషంగా మాటాడినా మాటాడకపోయినా ఉత్తమపురుషులు వాటికి సమాధానం చెప్పరు. (8)
స్మరంతి సుకృతాన్యేవ న వైరాణి కృతాన్యపి ।
సంతః ప్రతివిజానంతః లబ్ధసంభావనాః స్వయమ్ ॥ 9
ప్రతిక్రియ తెలిసినా కూడా సత్పురుషులు ఇతరుల ఉపకారాలనే స్మరిస్తారు, కానీ శత్రుత్వాన్ని కాదు. అటువంటి సజ్జనులే సమ్మానాలను పొందుతారు. (9)
వి॥సం॥ లబ్ధ్వా ప్రత్యయ మాత్మనః అని పాఠము.
పరమాత్మనః జ్ఞానమ్ అని (లక్షా)
భీమ ఉవాచ
ఇహైవైతాం స్త్వహం సర్వాన్ హన్మి శత్రూన్ సమాగతాన్ ।
అతనిష్క్రమ్య రాజేంద్ర సమూలాన్ హన్మి భారత ॥ 10
భీముడిలా అన్నాడు. రాజా! యుధిష్ఠిరా! ఇక్కడున్న శత్రువుల నందరినీ ఇక్కడే చంపివేస్తాను. ఇక్కడ నుండి లాగి సమూలంగా నాశనం చేస్తాను. (10)
కిం నో వివదితేనేహ కిముక్తేన చ భారత ।
అద్వైవైతాన్ నిహన్మీహ ప్రశాధి పృథివీమిమామ్ ॥ 11
భారతా! ఇక్కడ వివాదాలు, ఉత్తరప్రత్యుత్తరాలు అవసరం లేదు. ఈరోజే ఇక్కడే అందరినీ చంపుతాను. ఈ భూమిని నీవే పాలించు. (11)
ఇత్యుక్త్వా భీమసేనస్తు కనిష్ఠైర్భ్రాతృభిః సహ।
మృగమధ్యే యథాసింహః ముహుర్ముహురుదైక్షత॥ 12
తన తమ్ములతో కలిసి నిలిచి ఉన్న భీము డీ విధంగా పలికి మృగాలమధ్య నిలిచిన సింహంవలె పదేపదే శత్రువుల వైపు చూడసాగాడు. (12)
సాంత్వ్యమానో వీక్షమాణః పార్థేనాక్లిష్టకర్మణా।
ఖిద్యత్యేన మహాబాహుః అంతర్దాహేన వీర్యవాన్॥ 13
శత్రువులవైపే చూస్తున్న భీముని, అనాయాస కార్యసాధకుడైన అర్జునుడు శాంతింపజేస్తున్నాడు. అయితే పరాక్రమశాలి అయిన భీముడు తనలోతాను దహించుకొని పోతున్నాడు. (13)
క్రుద్ధస్య తస్య స్రోతోభ్యః కర్ణాదిభ్యో నరాధిప।
సధూమః సస్ఫులింగార్చిః పావకః సమజాయత॥ 14
కర్ణాదిరంధ్రాలనుండి రోమకూపాలనుండీ పొగ, రవ్వలతో కూడిన అగ్ని వెలువడింది. (14)
భ్రుకుటీకృతదుష్ప్రేక్ష్యమ్ అభవత్ తస్య తన్ముఖమ్।
యుగాంతకాలే సంప్రాప్తే కృతాన్తస్యేవ రూపేణః॥ 15
బొమముడిపాటుతో నున్న ఆ భీమసేనుని ముఖం చూడటంకూడా కష్టంగా ఉంది. ప్రళయకాలయమునివలె కనిపించాడు ఆ భీముడు. (15)
యుధిష్ఠిరస్తమావార్య బాహునా బాహుశాలినమ్।
మైవ మిత్యబ్రవీచ్పైనం జోషమాస్స్వేతి భారతః॥ 16
భారతా! అప్పుడు భుజశాలి అయిన భీమసేనుని ఒక చేతితో ఆపి ధర్మరాజు 'ఇది వద్దు శాంతంగా ఉండు' అని పలికాడు. (16)
నివార్య చ మహాబాహుం కోపసంరక్తలోచనమ్।
పితరం సముపాతిష్ఠద్ ధృతరాష్ట్రం కృతాంజలిః॥ 17
కోపంతో కన్నెఱ్ఱ చేసిన మహాబాహువైన భీముని ఆపి ధర్మరాజు చేతులు జోడించి పెదనాన్న అయిన ధృతరాష్ట్రుని సమీపించాడు. (17)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి భీమక్రోధే ద్విసప్తతితమోఽధ్యాయః ॥ 72 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున భీమక్రోధమను డెబ్బది రెండవ అధ్యాయము. (72)