73. డెబ్బది మూడవ అధ్యాయము
యుధిష్ఠిర ధృతరాష్ట్ర సంభాషణము.
యుధిష్ఠిర ఉవాచ
రాజన్ కిం కరవామస్తే ప్రశాధ్యస్మాంస్త్వమిశ్వరః।
నిత్యం హి స్థాతుమిచ్ఛామః తవ భారత శాసనే॥ 1
యుధిష్ఠిరుడిలా అన్నాడు. రాజా! నీవే మా ప్రభువువు. మేమేం చేయాలో ఆదేశించండి. నీమాటమేరకే ఎప్పుడూ నిలవాలనుకొంటున్నాము. (1)
ధృతరాష్ట్ర ఉవాచ
అజాతశత్రో భద్రం తే అరిష్టం స్వస్తి గచ్ఛత।
అనుజ్ఞాతాః సహధనాః స్వరాజ్యమనుశాసత॥ 2
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. అజాతశత్రూ! నీకు నిర్విఘ్నంగా మేలు కలుగుతుంది. నా ఆదేశంతో మీరు ఓడిపోయిన ధనాన్నంతా తీసికొని మీ రాజ్యానికి క్షేమంగా పోయి పరిపాలించుకోండి. (2)
ఇదం చైవావబోద్ధవ్యం వృద్ధస్య మమ శాసనమ్।
మయా నిగదితం సర్వం పథ్యం నిఃశ్రేయసం పరమ్॥ 3
వృద్ధుడనైన నేను ఇదే శాసిస్తున్నాను. గ్రహించండి. నా ఈ మాటలు మీకు హితాన్ని, పరమశ్రేయస్సునూ కలిగిస్తాయి. (3)
వేత్థ త్వం తాత ధర్మానాం గతిం సూక్ష్మాం యుధిష్ఠిర।
వినీతోఽసి మహాప్రాజ్ఞ వృద్ధానాం పర్యుపాసితా॥ 4
నాయనా! యుధిష్ఠిరా! నీకు ధర్మసూక్ష్మాలు తెలుసు. మహాప్రాజ్ఞా! నీవు వినయశీలుడవు. పెద్దలను సేవించేవాడవు. (4)
యతో బుద్ధిస్తతః శాంతిః ప్రశమం గచ్ఛ భారత।
నాదారుణి పతేచ్ఛస్త్రం దారుణ్యేతన్నిపాత్యతే॥ 5
భారతా! బుద్ధి ఉన్నచోటే శాంతి ఉంటుంది. ప్రశాంతంగా ఉండు. కొయ్యమీదనే గొడ్డలివ్రేటు కాని రాళ్ళమీదనో లోహంమీదనో అది పడదు. (5)
న మైణ్యభిజానంతి గుణాన్ పశ్యంతి నాగుణాన్।
విరోధం నాధిగచ్చంతి యే త ఉత్తమపూరుషాః॥ 6
స్మరంతి సుకృతా న్యేవ న వైరాణి కృతాన్యపి।
సంతః పరార్థం కుర్వాణా నావేక్షంతే ప్రతిక్రియామ్॥ 7
ఉత్తమపురుషులు శత్రుత్వాలను మరచిపోతారు. గుణాలనే చూస్తారు. అవగుణాలను చూడరు. ఎవ్వరితోను శత్రుత్వం పెట్టుకోరు. ఇతరుల సత్కర్మలనే తలచుకొంటారు. కానీ కీడు జరిగినా తలచుకోరు. ఇతరులకు మేలే చేస్తారు. కానీ ప్రతీకారాలకు దిగరు. (6,7)
సంవాదే పరుషాణ్యాహుః యుధిష్ఠిర నరాధమః।
ప్రత్యాహుర్మధ్యమాస్త్వేతేఽనుక్తాః పరుషముత్తరమ్॥ 8
న చోక్తా నైవ చానుక్తాస్త్వహితాః పరుషా గిరః।
ప్రతిజల్పంతి వై ధీరాః సదా తూత్తమపూరుషాః॥ 9
యుధిష్ఠిరా! హీనమానవులు ప్రథమ సంభాషణలో కూడా కటువుగా మాటాడుతారు. ఇతరులు కటువుగా పలికితే కటువుగా ప్రత్యుత్తర మిచ్చేవారు మధ్యములు. అయితే ధీరులైన ఉత్తములు ఎప్పుడూ ఇతరులు కఠినంగా మాటాడినా మాటాడకపోయినా పరుషవచనాలు కానీ, అహితవచనాలు కానీ పలుకరు. (8,9)
స్మరంతి సుకృతాన్యేవ న వైరాణి కృతాన్యపి।
సంతః ప్రతివిజానంతే లబ్ధ్వా ప్రత్యయమాత్మనః॥ 10
సత్సురుషులు తమ అనుభవాన్ని బట్టి ఇతరుల మంచిచెడులను కూడా అవగాహన చేసికొని వారు చేసిన మంచిపనులనే గుర్తుంచుకొంటారు కాని చెడ్డపనులను గుర్తుచేసికొనరు. (10)
అసంభిన్నార్థమర్యాదాః సాధవః ప్రియదర్శనాః।
తథా చరితమార్యేణ త్వయాస్మిన్ సత్సమాగమే॥ 11
సజ్జనులు పెద్దల హద్దులను అతిక్రమించరు. వారి దర్శనమే అందరికీ ఆనందకారణం. కౌరవపాండవుల సమాగమంలో నీవు పెద్దమనిషివలెనే ప్రవర్తించావు. (11)
దుర్యోధనస్య పారుష్యం తత్ తాత హృది మా కృథాః।
మాతరం చైవ గాంధారీం మాం చ త్వం గుణకాంక్షయా॥ 12
ఉపస్థితం వృద్ధమంధం పితరం పశ్య భారత।
నాయనా! దుర్యోధనుడి కఠినప్రవర్తనను మనస్సులో పెట్టుకొనవద్దు. గుణగ్రాహివై మీ అమ్మ గాంధారిని, గ్రుడ్డివాడిని ముసలివాడనైన నీతండ్రిని నన్ను మనస్సులో పెట్టుకో. (12 1/2)
ప్రేక్షాపూర్వం మయా ద్యూతమ్ ఇదమాసీదుపేక్షితమ్॥ 13
మిత్రాణి ద్రష్టుకామేన పుత్రాణాం చ బలాబలమ్।
అశోచ్యా కురవో రాజన్ యేషాం త్వమనుశాసితా॥ 14
మిత్రులందరితో కలవాలనీ, నా కుమారుల బలాబలాలను చూడాలనీ తలచి నేను బాగా ఆలోచించి కూడా జూదాన్ని జరగనిచ్చాను. ఆపే ప్రయత్నం చేయలేదు. రాజా! నీవు పాలల్కుడవై సర్వశాస్త్రవేత్త, ధీమంతుడు అయిన విదురుడు మంత్రిగా ఉండగా కురువంశమెప్పుడూ శోచనీయం కాకూడదు. (13,14)
మంత్రీ చ విదురో ధీమాన్ సర్వశాష్రవిశారదః।
త్వయి ధర్మోఽర్జునే ధైర్యం భీమసేనే పరాక్రమః॥ 15
శ్రద్ధా చ గురుశుశ్రూషా యమయోః పురుషాగ్ర్యయోః।
అజాతశత్రో భద్రం తే ఖాండవప్రస్థమావిశ।
భ్రాతృభిస్తేఽస్తు సౌభ్రాత్రం ధర్మే తే ధీయతాం మనః॥ 16
అజాతశత్రూః నీలో ధర్మం, అర్జునునిలో ధైర్యం, భీమసేనునిలో పరాక్రమం, పురుషోత్తములయిన నకులసహదేవులలో శ్రద్ధ, గురుశుశ్రుషా ఉన్నాయి. నీకు మేలు జరుగుతుంది. నీవు ఖాండవప్రస్థానికి వెళ్ళు. దుర్యోధనాది సోదరులతో స్నేహంగా ఉండు. మనసును ధర్మంమీద నిలుపు. (15,16)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్తో భరతశ్రేష్ఠ ధర్మరాజో యుధిష్ఠిరః।
కృత్వాఽఽర్యసమయం సర్వం ప్రతస్థే భ్రాతృభిః సహ॥ 17
వైశంపాయనుడిలా అన్నాడు. భరతశ్రేష్ఠా! ధృతరాష్ట్రుడిలా అన్న తరువాత యుధిష్ఠిరుడైన ధర్మరాజు పెద్దల అనుమతితో సోదరులతో కలిసి నిష్క్రమించాడు. (17)
తే రథాణ్ మేఘసంకాశాన్ ఆస్థాయ సహ కృష్ణయా।
ప్రయయుర్హృష్టమనసః ఇంద్రప్రస్థం పురోత్తమమ్॥ 18
మేఘాలవలె ధ్వనించే రథాలపై ద్రౌపదితో పాటు కూర్చొని పాండవులు ప్రసన్నమనస్కులై శ్రేష్ఠనగరమైన ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. (18)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి ధృతరాష్ట్ర వరప్రదావ పూర్వక మింద్రప్రస్థం ప్రతి యుధిష్ఠిరగమనే త్రిసప్తతితమోఽధ్యాయః ॥ 73 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున ప్రదాన పూర్వకముగా యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థమునకు వెళ్లుట అను డెబ్బది మూడవ అద్యాయము. (73)