68. అరువది ఎనిమిదవ అధ్యాయము
ద్రౌపది పరాభవము.
భీమ ఉవాచ
భవంతి గేహే బంధక్యః కితవానాం యుధిష్ఠిర ।
న తాభిరుత దీవ్యంతి దయా చైవాస్తి తాస్వపి ॥ 1
భీముడిలా అన్నాడు. యుధిష్ఠిరా! జూదగాళ్ళ ఇళ్ళలో కులటలు కూడా ఉంటారు. కానీ వాళ్ళను పణంగా పెట్టి జూదమాడరు. ఆ కులటలమీద కూడా వారికి దయ ఉంటుంది. (1)
కాశ్యో యద్ ధనమాహార్షీద్ ద్రవ్యం యచ్చాన్యదుత్తమమ్ ।
తథాన్యే పృథివీపాలాః యాని రత్నాన్యుపాహరన్ ॥ 2
వాహనాని ధనం చైవ కవచాన్యాయుధాని చ ।
రాజ్యమాత్మా వయం చైవ కైతవేన హృతం పరైః ॥ 3
కాశిరాజు కానుక చేసిన ధనాన్ని, ఆయన మనకై తెచ్చిన విలువయిన ద్రవ్యాన్నీ, ఇతర నరపాలురు ఇచ్చిన రత్నాలను, వాహనాలనూ, ధనాన్ని, కవచాలను, ఆయుధాలను, రాజ్యాన్ని, నిన్ను, మమ్ము కూడా శత్రువులు జూదంలో గెలుచుకొన్నారు. (2,3)
న చ మే తత్ర కోపోఽభూత్ సర్వస్యేశో హి నో భవాన్ ।
ఇమం త్వతిక్రమం మన్యే ద్రుపదీ యత్ర పణ్యతే ॥ 4
ఆ విషయంలో నాకు కోపం రాలేదు. మా సర్వస్వానికీ నీవే అధిపతివి. కాని ద్రౌపదిని పణంగా పెట్టటాన్ని నేను హద్దుమీరటమనే భావిస్తున్నాను. (4)
ఏషా హ్యనర్హతీ బాలా పాండవాన్ ప్రాప్య కౌరవైః ।
త్వత్కృతే క్లిశ్యతే క్షుద్రైః నృశంసైరకృతాత్మభిః ॥ 5
ఈ బాల - ద్రౌపది - పాండవులకు పత్నియై క్షుద్రులు, క్రూరులు, సంయమహీనులు అయిన ఈ కౌరవుల చేత నీ కారణంగా ఇబ్బందులు పడుతోంది. దీని కీమె తగదు. (5)
అస్యాః కృతే మన్యురయం త్వయి రాజన్ నిపాత్యతె ।
బాహూ తే సంప్రధక్ష్యామి సహదేవాగ్నిమానయ ॥ 6
రాజా! ద్రౌపది ఈ దుర్దశకు నేను నీ మీదనే కోపాన్ని ప్రదర్శిస్తున్నాను. నీ చేతులను తగులబెడతాను. సహదేవా! అగ్నిని తీసికొనిరా. (6)
అర్జున ఉవాచ
న పురా భీమసేన త్వమీదృశీర్వదిటా గిరః ।
పరైస్తే నాశితం నూనం నృశంసైర్ధర్మగౌరవమ్ ॥ 7
అర్జునుడిలా అన్నాడు. భీమసేనా! ఇంతకు ముందెప్పుడూ నీవు ఇటువంటి మాటలు పలుకలేదు. క్రూరకర్ములయిన శత్రువులు నీ ధర్మగౌరవబుద్ధిని నాశనం చెసినట్టే ఉన్నది. (7)
న సకామాః పరే కార్యాః ధర్మమేవాచరోత్తమమ్ ।
భ్రాతరం ధార్మికం జ్యేష్ఠం కోఽతివర్తితుమర్హతి ॥ 8
శత్రువుల కోరికలను సఫలం చేయవద్దు. ఉత్తమధర్మాన్నే పాటించు. ధార్మికుడైన అన్నను కాదని ఎవరైనా ప్రవర్తిస్తారా? (8)
ఆహూతో హి పరై రాజా క్షాత్రం వ్రతమనుస్మరన్ ।
దీవ్యతే పర్కామేన తన్నః కీర్తికరం మహత్ ॥ 9
యుధిష్ఠిరుడు శత్రువుల ఆహ్వానాన్ని మన్నిమ్చి క్షాత్రవ్రతాన్ని అనుసరించి ఇతరుల కోరిక మేరకు జూదమాడాడు. అది మనకెంతో కీర్తిని కలిగిస్తుంది. (9)
భీమసేన ఉవాచ
ఏవమస్మిన్ కృతం విద్యాం యది నాహం ధనంజయ ।
దీప్తేఽగ్నౌ సహితౌ బాహూ నిర్దహేయం బలాదివ ॥ 10
భీమసేనుడిలా అన్నాడు. అర్జునా! ఇది క్షాత్రధర్మానుగుణమే అది నాకు తెలియకపోతే మండే అగ్నిలో యుధిష్ఠిరుని రెండు చేతులనూ కలిపి బలపూర్వకంగా తగులబెట్టి ఉండేవాడిని. (10)
వైశంపాయన ఉవాచ
తథా తాన్ దుఃఖితాన్ దృష్ట్వా పాండవాన్ ధృతరాష్ట్రజః ।
కృష్యమాణాం చ పాంచాలీం వికర్న ఇదమబ్రవీత్ ॥ 11
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ విధంగా దుఃఖిస్తున్న పాండవులనూ, లాగబడుతున్న ద్రౌపదిని చూచి ధృతరాష్ట్రుని కొడుకుయిన వికర్ణుడిలా అన్నాడు. (11)
యాజ్ఞసేన్యా యదుక్తం తద్ వాక్యం విబ్రూత పార్థివాః ।
అవివేకేన వాక్యస్య నరకః సద్య ఏవ నః ॥ 12
రాజులారా! యాజ్ఞసేని అడిగిన ప్రశ్నకు బదులివ్వండి. ప్రశ్నకు సమాధానం తెలియకపోతే మనమంతా వెంటనె నరకాన్ని పొందవలసి వస్తుంది. (12)
భీష్మస్య ధృతరాష్ట్రశ్చ కురువృద్ధతమావుభౌ ।
సమ్యేత నాహతుః కించిద్ విదురశ్చ మహామతిః ॥ 13
కురువృద్ధులయిన భీష్మధృతరాష్ట్రులు అక్కడే ఉండి కూడా ఏమీ అనలేదు. మహామతి అయిన విదురుడు కూడా నోరెత్తలేదు. (13)
భారద్వాజాశ్చ సర్వేషామ్ ఆచార్యః కృప ఏవ చ ।
కుత ఏతావపి ప్రశ్నమ్ నాహతుర్ద్విజసత్తమౌ ॥ 14
అందరికీ గురువయిన ద్రోణుడు, కృపాచార్యుడు ఇద్దరూ బ్రాహ్మణోత్తములు. వారు కూడా ఈ ప్రశ్నకు సమాధానమెందుకు చెప్పరు? (14)
యే త్వన్యే పృథివీపాలాః సమేతాః సర్వతో దిశః ।
కామక్రోధౌ సముత్సృజ్య తే బ్రువంతు యథామతి ॥ 15
అన్ని దిక్కుల నుండి వచ్చిన రాజులు ఎందరో ఉన్నారు. వారైనా కామక్రోధాలకు అతీతంగా తమ బుద్ధి ననుసరించి సమాధానం చెప్పవలసి ఉన్నది. (15)
యదిదమ్ ద్రౌపదీవాక్యమ్ ఉక్తవత్యసకృచ్ఛుభా ।
విమృశ్య కస్య కః పక్షః పార్థివా వదతోత్తరమ్ ॥ 16
రాజులారా! సౌభాగ్యవతి అయిన ద్రౌపది పదే పదే వేసిన ప్రశ్నకు విచారించి సమాధానం చెప్పాలి. ఎవరు ఎవరి పక్షమో తెలియాలి. (16)
ఏవం స బహుశః సర్వాన్ ఉక్తవాంస్తాన్ సభాసదః ।
న చ తే పృథివీపాలాః తమూచుః సాధ్వసాధు వా ॥ 17
ఈ రీతిగా వికర్ణుడు ఆ సభాసదులను చాలాసార్లు అడిగాడు. కాని ఆ రాజులు మంచిచెడుల గూర్చి అతనికేమీ బదులు చెప్పలేదు. (17)
ఉక్త్వా సకృత్ తథా సర్వాన్ వికర్ణః పృథివీపతీన్ ।
పాణౌ పాణిం వినిష్పిష్య నిఃశ్వసన్నిదమబ్రవీత్ ॥ 18
వికర్ణుడు ఆ విధంగా ఆ రాజులతో మాటిమాటికి చెప్పి చేతులు అప్పళించుకొంటూ, నిట్టూర్పు విడుస్తూ ఇలా అన్నాడు. (18)
విబ్రూత పృథివీపాలాః వాక్యం మా వా కథంచన ।
మన్యే న్యాయ్యం యదత్రాహం తద్ధి వక్ష్యామి కౌరవాః ॥ 19
కౌరవులారా! నరపతులార్! ఈ ద్రౌపది ప్రశ్నకు మీరు సమాధానం చెప్పినా, చెప్పకపోయినా నేను మాత్రం ఈ విషయంలో న్యాయంగా భావించిన దానిని చెప్తాను. (19)
చత్వార్యాహుర్నరశ్రేష్ఠాః వ్యసనాని మహీక్షితామ్ ।
మృగయాం పానమక్షాంశ్చ గ్రామ్యే చైవాతిరక్తతామ్ ॥ 20
నరోత్తములారా! రాజులకు నాలుగు వ్యసనాలు చెప్పబడ్డాయి. అవి ఽఏట, మదిరాపానం, జూదం, విషయాసక్తి. (20)
ఏతేషు హి నరః సక్తః ధర్మముత్సృజ్య వర్తతే ।
యథాయుక్తేన చ కృతామ్ క్రియాం లోకో న మన్యతే ॥ 21
ఆ వ్యసనాలలో చిక్కిన నరుడు ధర్మాన్ని వీడి ప్రవర్తిస్తుంటాడు. ఈ విధంగా వ్యసనాసక్తిగలవాడు చేసిన పనిని లోకం మెచ్చదు. (21)
తదయం పాండుపుత్రేణ వ్యసనే వర్తతా భృశమ్ ।
సమాహూతేన కితవైః ఆస్థితో ద్రౌపదీపణః ॥ 22
ఆ తీరున ఈ యుధిష్ఠిరుడు తీవ్రంగా వ్యసనాసక్తుడై, ఈ జూదగాళ్ళు రెచ్చగొట్టడం వలన ద్రౌపదిని పణంగా పెట్టాడు. (22)
సాధారణీ చ సర్వేషాం పాండవానామనిందితా ।
జితేన పూర్వం చానేన పాండవేన కృతః పణః ॥ 23
ఈ సాధ్వి ద్రౌపది పాండవులకు అందరికీ భార్య. ధర్మరాజు ముందు తనను ఓడిపోయి ఆ తర్వాత ద్రౌపదిని పణంగా పెట్టాడు. (23)
ఇయం చ కీర్తితా కృష్ణా సౌబలేన పణార్థినా ।
ఏతత్ సర్ఽఅం విచార్యాహం మన్యే న విజితామిమామ్ ॥ 24
మొత్తాన్ని గెలవానుకొన్న శకునియే ద్రౌపదిని పణంగా పెట్టే విషయాన్ని ప్రస్తావించాడు. ఇదంతా విచారించి నేను ద్రౌపది గెలవబడలేదనే భావిస్తున్నాను. (24)
ఏతచ్ఛ్రుత్వా మహాన్ నాదః సభ్యానాముదతిష్ఠత ।
వికర్ణం శంసమానానాం సౌబలం చాపి నిందతామ్ ॥ 25
ఈ మాటలు విన్న సభాసదులు వికర్ణుని ప్రశంసిస్తూ, శకునిని నిందిస్తూ మాట్లాడసాగారు. సభలో పెద్దకోలాహలం ఏర్పడింది. (25)
తస్మిన్నుపరతే శబ్దే రాధేయః క్రోధమూర్ఛితః ।
ప్రగృహ్య రుచిరం బాహుమ్ ఇదం వచనమబ్రవీత్ ॥ 26
ఆ కోలాహలం అణగిపోగానే కర్ణుడు కోపంతో వివశుడై వికర్ణుని చేయిపట్టుకొని ఈ మాటలన్నాడు. (26)
కర్ణ ఉవాచ
దృశ్యంతే వై వికర్ణేహ వైకృతాని బహూన్యపి ।
తజ్జాతస్తద్వినాశాయ యథాగ్నిరరణిప్రజః ॥ 27
కర్ణుడిలా అన్నాడు. వికర్ణా! ఈ లోకంలో ఎన్నో వస్తువులు విపరీతపరిణామాలనే కల్గిస్తూ కనిపిస్తాయి. అరణిలో పుట్టిన అగ్ని దానినే దహించినట్టు ఏ వంశంలో పుట్టినవాడు ఆ వంశాన్నే నాశనం చేస్తుంటాడు. (27)
(వ్యాధిర్బలం నాశాయతే శరీరస్థోఽపి సంభృతః ।
తృణాని పశవో ఘ్నంతి స్వపక్షంచైవ కౌరవః ॥
ద్రోణో భీష్మః కృపో ద్రౌణిః విదురశ్చ మహామతిః ।
ధృతరాష్ట్రశ్చ గాంధారీ భవతః ప్రాజ్ఞవత్తరాః ॥)
శరీరంలో పుట్టినరోగం శారీరకశక్తిని నశింపజేస్తుంది. పశువులు గడ్డిమేస్తూ ఆ ప్రదేశాన్నే త్రొక్కుతుంటాయి. అలాగే కురువంశంలో పుట్టిన నీవు నీవారికే చేటు తెస్తున్నావు. ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ, విదురుడు, ధృతరాష్ట్రుడు, గాంధారీ - వీరంతా నీకన్నా తెలివయిన వారే.
ఏతే న కించిదప్యాహుః చోదితా హ్యపి కృష్ణయా ।
ధర్మేణ విజితామేతాం మన్యంతే ద్రుపదాత్మజామ్ ॥ 28
ద్రౌపది ఎంత ప్రేరణ చేసినా వారు ఏమీ మాటాడలేదు. వారంతా ద్రౌపది ధర్మవిజిత అనే భావిస్తున్నారు. (28)
త్వం తు కేవలబాల్యేన ధార్తరాష్ట్ర విదీర్యసే ।
యద్ బ్రవీషి సభామధ్యే బాలః స్థవిరభాషితమ్ ॥ 29
ధార్తరాష్ట్రా! నీ అజ్ఞానం వలన నీవు చిందులు త్రొక్కుతున్నావు. అంతే కాదు, బాలుడవయి కూడా సభామధ్యంతో పెద్దవాడిలా మాటాడుతున్నావు. (29)
న చ ధర్మం యథావత్ త్వం నేత్సి దుర్యోధనావర ।
యద్ బ్రవీషి జితాం కృష్ణాం న జితేతి సుమందధీః ॥ 30
దుర్యోధన సోదరా! ధర్మతత్త్వాన్ని నీ వెరుగవు. అందుకే మందమతివై ద్రౌపదిని మనం గెలిచికొన్నా గెలిచికొనలేదని మాటాడుతున్నావు. (30)
కథం హ్యవిజితాం కృష్ణాం మన్యసే ధృతరాష్ట్రజ ।
యదా సభాయాం సర్వస్వం న్యస్తవాన్ పాండవాగ్రజః ॥ 31
ధృతరాష్ట్ర కుమారా! ద్రుపదీ ఓడిపోలేదని నీవెలా భావిస్తావు? యుధిష్ఠిరుడు సభలో తన సర్వస్వాన్నీ పణంగా పెట్టాడు గదా! (31)
అభ్యంతరా చ సర్వస్వే ద్రుపదీ భరతర్షభ ।
ఏవం ధర్మజితాం కృష్ణాం మన్యసే న జితాం కథమ్ ॥ 32
భరతర్షభా! సర్వస్వంలో ద్రౌపది కూడా చేరినదే గదా! ఈ రీతిగా ధర్మవిజిత అయిన ద్రౌపది ధర్మవిజిత కాదని ఎలా అనుకొంటున్నావు? (32)
కీర్తితా ద్రౌపదీ వాచా అనుజ్ఞాతా చ పాండవైః ।
భవత్యవిజితా కేన హేతునైషా మతా తవ ॥ 33
ద్రౌపదిని పేరు చెప్పియే పణంగా పెట్టాడు. పాండవులు దానిని అంగీకరించారు. ఇక ఏ కారణం చేత ఆమె ధర్మవిజిత కాదని నీకనిపిస్తోంది. (33)
మన్యసే వా సభామేతామ్ ఆనీతామేకవాససమ్ ।
అధర్మేణేతి తత్రాపి శృణు మే వాక్యముత్తమమ్ ॥ 34
ఒక వేళ ఏకవస్త్ర అయిన ఈమెను సభలోనికి తీసికొని రావటం అధర్మమని నీవనుకొంటే ఆ విషయంలో కూడా ఒక మాట చెపుతాను విను. (34)
ఏకో భర్తా స్త్రియా దేవైః విహితః కురునందన ।
ఇయం త్వనేజవశగా బంధకేతి వినిశ్చితా ॥ 35
అస్యాః సభామానయం న చిత్రమితి మే మతిః ।
ఏకాంబరధరత్వం వాప్యథ వాపి వివస్త్రతా ॥ 36
కురునందనా! దేవతలు స్త్రీకి ఒక్కభర్తనే విధించారు. కానీ ఈ ద్రౌపది అనేకులకు భార్య. కాబట్టి బంధకి అని నిర్ణయింపబడుతోంది. అటువంటి ఈమెను ఏకవస్త్ర అయినా వివస్త్ర అయినా సభలోనికి ఈడ్చుకొనిరావటం విచిత్రం కాదని నా అభిప్రాయం. (36)
యచ్చైషాం ద్రవిణం కంచిద్ యా చైషా యే చ పాండవాః ।
సౌబలే నేహ తత్ సర్వం ధర్మేణ విజితం వసు ॥ 37
పాండవుల ధనాన్నీ, ఈమెను, పాండవులను మొత్తం సంపదనూ శకుని ధర్మబద్ధంగానే గెలుచుకొన్నాడు. (37)
దుఃశాసన సుబాలోఽయం వికర్ణం ప్రాజ్ఞవాదికః ।
పాండవానాం చ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర ॥ 38
దుశ్శాసనా! ఈ వికర్ణుడు బాలుడు. పండితుడి వలె మాటాడుతున్నాడు. పాండవుల వస్త్రాలను, ద్రౌపది వస్త్రాలను కూడా ఊడదీయి. (38)
తచ్ఛ్రుత్వా పాండవాః సర్వే స్వాని వాసాంసి భారత ।
అవకీర్యోత్తరీయాణి సభాయాం సముపావిశన్ ॥ 39
ఆ మాట విని పాండవులంతా తమ తమ ఉత్తరీయాలను తీసి సభలో కూర్చున్నారు. (39)
తతో దుఃశాసనో రాజన్ ద్రౌపద్యా వసనం బలాత్ ।
సభామధ్యే సమాక్షిప్య వ్యపాక్రష్టుం ప్రచక్రమే ॥ 40
రాజా! ఆ తరువాత దుశ్శాసనుడు బలాత్కారంగా సభామధ్యంలో ద్రౌపదివస్త్రాలను లాగి తొలగింప నారంభించాడు. (40)
వైశంపాయన ఉవాచ
ఆ కృష్యమాణే వసనే ద్రౌపద్యాశ్చింతితో హరిః ।
వైశంపాయనుడిలా అన్నాడు. వస్త్రాలను లాగుతుంటే ద్రౌపది శ్రీకృష్ణుని స్మరించింది. (40 1/2)
(ద్రౌపద్యువాచ
జ్ఞాతం మయా వసిష్ఠేన పురా గీతం మహాత్మనా ।
మహత్యాపది సంప్రాస్తే స్మర్తవ్యో భగవాన్ హరిః ॥
ద్రౌపది ఇలా అన్నది. పెద్ద ఆపద కలిగినపుడు భగవంతుడైన శ్రీహరిని స్మరించాలని వసిష్ఠమహాత్ముడు పూర్వం పలికిన మాట నాకు బాగా తెలుసు.
వైశంపాయన ఉవాచ
గోవిందేతి సమాభాష్య కృష్ణేతి చ పునః పునః ।
మనసా చింతయామాస దేవం నారాయణం ప్రభుమ్ ॥
ఆపత్స్వభయదం కృష్ణం లోకానాం ప్రపితామహమ్ ।)
వైశంపాయనుడిలా అన్నాడు. గోవిందా! కృష్ణా! అని మాటిమాటికి పిలిస్తూ ద్రౌపది లోకప్రపితామహుడు, నారాయణుడు, ప్రభువు, ఆపదలలో అభయప్రదాత అయిన కృష్ణదేవుని మనసారా స్మరించింది.
గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీజనప్రియ ॥ 41
కౌరవైః పరిభూతాం మాం కిం న జానాసి కేశవ ।
హే నాథ హే రమానాథ వ్రజనాథార్తినాశన ।
కౌరవార్ణవమగ్నాం మామ్ ఉద్ధరస్వ జనార్దన ॥ 42
గోవిందా! ద్వారకావాసా! కృష్ణా! గోపీజనప్రియా! కేశవా! కౌరవులు పరాభవిస్తున్న నన్ను గుర్తించవా? ప్రభూ! రమావల్లభా! వ్రజనాథా! ఆర్తినాశకా! కౌరవసాగరంలో మునిగిపోతున్న నన్ను ఉద్ధరించవా? జనార్దనా! (41,42)
కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ।
ప్రపన్నాం పాహి గోవింద కురుమధ్యేఽవ సీదతమ్ ॥ 43
కృష్ణా! మహాయోగీ! విశ్మాత్మా! విశ్వభావనా! గోవిందా! కౌరవుల మధ్యలో కలతపడుతూ శరణుకోరిన నన్నురక్షించు. (43)
ఇత్యనుస్మృత్య కృష్ణం సా హరిం త్రిభువనేశ్వరమ్ ।
ప్రారుదద్ దుఃఖితా రాజన్ ముకమాచ్ఛాద్య భామినీ ॥ 44
రాజా! ఈ విధంగా త్రిభువనేశ్వరుడూ, హరి అయిన శ్రీకృష్ణుని స్మరించి ఆ ద్రౌపది ముఖాన్ని కప్పుకొని బాధతో రోదింపసాగింది. (44)
యాజ్ఞసేన్యా వచః శ్రుత్వా కృష్ణో గహర్వితోఽభవద్ ।
త్వక్త్వా శయ్యాఽఽసనం పద్భ్యాం కృపాళుః కృపయాభ్యగాత్ ॥ 45
కృష్ణమ్ చ విష్ణుం చ హరిం నరం చ
త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేనీ ।
తతస్తు ధర్మోఽంతరితో మహాత్మా
సమావృణోద్ వై వివిధైః సువస్రైః ॥ 46
యాజ్ఞసేని పిలుపు విని శ్రీకృష్ణుడు ఖిన్నుడై శయ్యను, ఆసనాన్ని విడిచి దయాళువై పరువెత్తి వచ్చాడు.
యాజ్ఞసేని రక్షణకై కృష్ణా! నారాయణా! హరీ! పురుషోత్తమా! అని ఆక్రోశిస్తోంది. అప్పుడు ధర్మస్వరూపుడయిన ఆ మహాత్ముడు అదృశ్యుడై వివిధ సుందరవస్త్రాలతో ద్రౌపదిని ఆచ్ఛాదించాడు. (45,46)
ఆకృష్యమాణే వసనే ద్రౌపద్యాస్తు విశాంపతే ।
తద్రూపమపరం వస్త్రం ప్రాదురాసీదనేకశః ॥ 47
రాజా! దుశ్శాసనుడు ద్రౌపదివస్త్రాన్ని లాగుతుంటే అటువంటివే మరెన్నో వస్త్రాలు కనిపించసాగాయి. (47)
నానారాగవిరాగాణి వసనాన్యథ వై ప్రభో ।
ప్రాదుర్భవంతి శతశః ధర్మస్య పరిపాలనాత్ ॥ 48
రాజా! ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణుని ప్రభావంతో అనేక వర్ణాలు గల వస్త్రాలు కనిపించసాగాయి. (48)
తతో హలహలాశబ్దః తత్రాసీద్ ఘోరదర్శనః ।
తదద్భుతతమం లోకే వీక్ష్య సర్వే మహీభృతః ।
శశంసుర్ద్రౌపదీం తత్ర కుత్సంతో ధృతరాష్ట్రజమ్ ॥ 49
శశాప తత్ర భీమస్తు రాజమధ్యే బృహత్స్వనః ।
క్రోధాద్ విస్ఫురమాణౌష్ఠః వినిష్పిష్య కరే కరమ్ ॥ 50
అప్పుడు సభలో భయంకరమైన కోలాహలం చెలరేగింది. లోకంలో అత్యద్భుత దృశ్యాన్ని చూచి రాజులందరూ ద్రౌపదిని అభినందిస్తూ దుశ్శాసనుని నిందించారు. అప్పుడు భీముడు కోపంతో పెదవులదరుచుండగా చేతులు పిసుకుకొంటూ ఆ రాజుల సమక్షంలో పెద్దగొంతుతో ప్రతిజ్ఞ చేశాడు. (49,50)
భీమ ఉవాచ
ఇదం మే వాక్యమాదధ్వం క్షత్రియా లోకవాసినః ।
నోక్తపూర్వం నరైరన్యైః న చాన్యో యద్ వదిష్యతి ॥ 51
భీముడిలా అన్నాడు - దిగ్దిగంతవాసులయిన క్షత్రియులారా! ఈ నామాట ఆలకించండి. ఇంతకుముందెవ్వడూ ఇటువంటి మాటలు అనలేదు. ఇక ముందెవ్వడూ ఇటువంటి మాట అనడు. (51)
యద్యేతదేవముక్త్వాహం న కుర్యాం పృథివీశ్వరాః ।
పితామహానాం పూర్వేషామ్ నాహం గతిమవాప్నుయామ్ ॥ 52
అస్య పాపస్య దుర్బుద్ధేర్భారతాపసదస్య చ ।
న పిబేయం బలాద్ వక్షః భిత్త్వా చేద్ రుధిరం యుధి ॥ 53
రాజులారా! ఈ దుశ్శాసనుడు పాపాత్ముడు, దుర్మతి, భరతవంశానికి అపకీర్తిని తెస్తున్నవాడు. యుద్ధంలో ఇతని గుండెలను చీల్చి నెత్తురు త్రాగుతాను. ఈ మాటను ఆచరించి చూపకపోతే నాకు నా పూర్వీకులు పొందిన ఉత్తమ గతులుండవు. (52,53)
వైశంపాయన ఉవాచ
తస్య తే తద్ వచః శ్రుత్వా రౌద్రం లోమప్రహర్షణమ్ ।
ప్రచక్రుర్బహుళాం పూజాం కుత్సంతో ధృతరాష్ట్రజమ్ ॥ 54
వైశంపాయనుడిలా అన్నాడు. రోమాలు నిక్కపొడిచేటట్లు భీకరంగా భీముడు పలికిన ఆ మాటను విని రాజులందరూ దుశ్శాసనుని నిందిస్తూ భీముని బాగా ప్రశంసించారు. (54)
యదా తు వాససాం రాశిః సభామధ్యే సమాచితః ।
తతో దుఃశాసనః శాంతః వ్రీడితః సముపావిశత్ ॥ 55
సభామధ్యంలో వస్త్రాల రాశి ప్రోగుపడగానే దుశ్శాసనుడు అలసిపోయి సిగ్గుతో కూర్చున్నాడు. (55)
ధిక్ఛబ్దస్తు తతస్తత్ర సమభూల్లోమహర్షణః ।
సభ్యానాం నరదేవానాం దృష్ట్వా కుంతీసుతాంస్తథా ॥ 56
పాండవుల స్థితిని చూచి సభ్యులు, రాజులూ దుశ్శాసనుని నిందిస్తూ ధిక్కారస్వరాలు చేశారు. అవి రోమాంచాన్ని కలిగిస్తున్నాయి. (56)
న విబ్రువంతి కౌరవ్యాః ప్రశ్నమేతమితి స్మ హ ।
సజనః క్రోశతి స్మాత్ర ధృతరాష్ట్రం విగర్హయన్ ॥ 57
ద్రౌపది ప్రశ్నను సరిగా ఆలోచించి కౌరవులు స్పష్టంగా సమాధానం చెప్పలేదు అని జనులు ఆక్రోశిస్తూ ధృతరాష్ట్రుని నిందించసాగారు. (57)
తతో బాహూ సముచ్ఛ్రిత్య నివార్య చ సభాసదః ।
విదురః సర్వధర్మజ్ఞ ఇదం వచనమబ్రవీత్ ॥ 58
అప్పుడు సర్వధర్మవేత్త అయిన విదురుడు చేతులు పైకెత్తి సభాసదులను నివారించి ఇలా అన్నాడు. (58)
విదుర ఉవాచ
ద్రౌపదీ ప్రశ్నముక్త్వైవం రోరవీతి హ్యనాథవత్ ।
న చ విబ్రూత తం ప్రశ్నం సభ్యా ధర్మోఽత్ర పీడ్యతే ॥ 59
విదురుడిలా అన్నాడు. సభ్యులారా! ద్రౌపది తన ప్రశ్నను మన ముందుంచి అనాథవలె రోదిస్తోంది. కాని మీరు ఆ ప్రశ్నను విచారించటం లేదు. ఇక్కడ ధర్మహాని కలుగుతోంది. (59)
సభాం ప్రపద్యతే హ్యార్తః ప్రజ్వలన్నివ హవ్యవాట్ ।
తం వై సత్యేన ధర్మేణ సభ్యాః ప్రశమయంత్యుత ॥ 60
ఆర్తుడు అగ్నివలె చింతతో జ్వలిస్తూ సభను శరణువేడుతాడు. అప్పుడు సభ్యులు సత్యధర్మాలను ఆశ్రయించి ఆర్తిని ఉపశమింపజేస్తారు. (60)
ధర్మప్రశ్నమతో బ్రూయాత్ ఆర్యః సత్యేన మానవః ।
విబ్రూయుస్తత్ర తమ్ ప్రశ్నం కామక్రోధబలాతిగాః ॥ 61
అందువలన మంచిమనిషి ధర్మానుకూలమైన ప్రశ్ననే లేవనెత్తుతాడు. సభ్యులు కామక్రోధాదులకు లోనుకాకుండా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. (61)
వికర్ణేన యథా ప్రజ్ఞమ్ ఉక్తః ప్రశ్నో నరాధిపాః ।
భవంతొఽపి హి తం ప్రశ్నం విబ్రువంతు యథామతి ॥ 62
రాజులారా! వికర్ణుడు తన ప్రజ్ఞననుసరించి ఆ ప్రశ్నను వివేచించాడు. మీరు కూడా మీమీ బుద్ధికి తగినట్లు దానిని నిశ్చయించండి. (62)
యో హి ప్రశ్నం న విబ్రూయాద్ ధర్మదర్శీ సభాం గతః ।
అనృతే యా ఫలావాప్తిస్తస్యాః సోఽర్ధం సమశ్నుతే ॥ 63
ధర్మజ్ఞుడై సభలో నిలిచి ప్రశ్నకు సమాధానమివ్వనివాడు అసత్యఫలంలోని అర్ధభాగాన్ని అనుభవించవలసివస్తుంది. (63)
యః పునర్వితథం బ్రూయాద్ ధర్మదర్శీ సభాం గతః ।
అనృతస్య ఫలం కృత్స్నం సంప్రాప్నోతీతి నిశ్చయః ॥ 64
ధర్మజ్ఞుడై సభలో నిలిచి ప్రశ్నకు తప్పుడు సమాధానం చెపితే అసత్యఫలితాన్ని పూర్తిగా తప్పక అనుభవిస్తాడు. (64)
అత్రాప్యుదాహరంతీమమ్ ఇతిహాసం పురాతనమ్ ।
ప్రహ్లాదస్య చ సంవాదం మునేరాంగిసస్య చ ॥ 65
ఈ విషయంలో ప్రాచీనమైన ప్రహ్లాదాంగిరసుల మధ్య జరిగిన సంవాదాన్ని పెద్దలు ఉదాహరిస్తుంటారు. (65)
ప్రహ్లాదో నామ దైత్యేంద్రః తస్య పుత్రో విరోచనః ।
కన్యాహేతో రాంగిరసం సుధన్వానముపాద్రవత్ ॥ 66
ప్రహ్లాదుడు రాక్షసరాజు. ఆయన కొడుకు విరోచనుడు, కన్యకొఱకై అంగిరుని కొడుకైన సుధన్వునితో పోటీపడ్డాడు. (66)
అహం జ్యాయానహం జ్యాయాన్ ఇతి కన్యేప్సయా తదా ।
తయోర్దేవనమత్రాసీత్ ప్రాణయోరితి నః శ్రుతమ్ ॥ 67
ఆ కన్యను పొందగోరుతూ "నేనే గొప్ప, నేనే గొప్ప" అని వాడులాడుకొన్నారు. వాళ్ళిద్దరూ ప్రాణాలనే పణంగా పెట్టుకొన్నారు. (67)
తయోః ప్రశ్నవివాదోఽభూత్ ప్రహ్లాదం తావపృచ్ఛతామ్ ।
జ్యాయాన్ క ఆవయోరేకః ప్రశ్నం ప్రబ్రూహి మా మృషా ॥ 68
ఆ ఇద్దరి మధ్య గొప్పతనానికి సంబంధించిన వివాదం తీవ్రమయింది. వారు "మా ఇద్దరిలో ఎవరు గొప్ప? సరిగ సమాధానం చెప్పు. అసత్యమాడవద్దు" అని ప్రహ్లాదుని అడిగారు. (68)
స వై వివదనాద్ భీతః సుధన్వానం విలోకయన్ ।
తం సుధన్వాబ్రవీత్ క్రుద్ధః బ్రహ్మదండ ఇవజ్వలన్ ॥ 69
ప్రహ్లాదుడు ఆ వివాదంతో భయపడి సుధన్వుని వైపు చూచాడు. అప్పుడు బ్రహ్మదండమ్ వలె జ్వలిస్తున్న సుధన్వుడిలా అన్నాడు. (69)
యది వై వక్ష్యసి మృషా ప్రహ్లాదాథ న వక్ష్యసి ।
శతధా తే శిరో వజ్రీ వజ్రేణ ప్రహరిష్యతి ॥ 70
ప్రహ్లాదా! నీవు అసత్యమాడినా, అసలేమీ మాటాడక ఊరుకొన్నా ఇంద్రుడు వజ్రంతో నీ శరస్సును వందల ముక్కలుగా చేస్తాడు. (70)
సుధన్వనా తథోక్తః సన్ వ్యథితోఽశ్వత్థపర్ణవత్ ।
జగామ కశ్యపం దైత్యః పరిప్రష్టుం మహౌజసమ్ ॥ 71
సుధన్వుడు అలా అనగానే రావిఆకులాగా కంపిస్తూ, బాధపడుతూ, ప్రహ్లాదుడు తేజస్వి అయిన కశ్యపుని దగ్గరకు సలహాకై వెళ్ళాడు. (71)
ప్రహ్లాద ఉవాచ
త్వం వై ధర్మస్య విజ్ఞాతా దైవస్యేహాసురస్య చ ।
బ్రాహ్మణస్య మహాభాగ ధర్మకృచ్ఛ్రమిదం శృణు ॥ 72
ప్రహ్లాదుడిలా అడిగాడు. మహాభాగా! నీవు దేవదానవ బ్రాహ్మణధర్మాలు బాగా తెలిసినవాడవు. ఈ ధర్మసంకటాన్ని విను. (72)
యో వై ప్రశ్నం న విబ్రూయాద్ వితథం చైవ నిర్దిశేత్ ।
కే వై తస్య పరే లోకాః తన్మమాచక్ష్వ పృచ్ఛతః ॥ 73
ప్రశ్నకు సమాధానం చెప్పనివానికి, అసత్యసమాధానమిచ్చినవానికి పరలోకాలలో ఏవి లభిస్తాయి? నేనడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు. (73)
కశ్యప ఉవాచ
జానన్న విబ్రువన్ ప్రశ్నాన్ కామాత్ క్రోధాద్ భయాత్ తథా ।
సహస్రం వారుణాన్ పాశాన్ ఆత్మని ప్రతిముంచతి ॥ 74
కశ్యపుడిలా అన్నాడు - తెలిసి కూడ కామక్రోధభయాల కారణంగా సమాధానం చెప్పనివాడు వేయి వరుణపాశాలను తన మీదవేసికొన్నాట్టే . (74)
సాక్షీవా విబ్రువన్ సాక్ష్యం గోకర్ణశిథిలశ్చరన్ ।
సహస్రం వారుణాన్ పాశాన్ ఆత్మని ప్రతిముంచతి ॥ 75
సాక్షి గోవు చెవుల వలె శిథిలుడై ఇరుపక్షాలతో సంబంధాన్ని కలిగి సాక్ష్యం చెప్పకపోతే వాడు కూడా వేయి వరుణపాశాలను మీదికి తెచ్చుకొన్నట్టే. (75)
తస్య సంవత్సరే పూర్ణే పాశ ఏకః ప్రముచ్యతే ।
తస్మాత్ సత్యం తు వక్తవ్యం జానతా సత్యమంజసా ॥ 76
సంవత్సరం గడిచిన తరువాత ఒక్కపాశం నుండి బయటపడతాడు. కాబట్టి సత్యం సరిగా తెలిసినవాడు సత్యాన్నే చెప్పాలి. (76)
విద్ధో ధర్మో హ్యధర్మేణ సభాం యత్రీపపద్యతే ।
న చాస్య శల్యం కృంతంతి విద్ధాస్తత్ర సభాసదః ॥ 77
ధర్మం అధర్మంచే భంగపడి సభలో నిలిచినపుడు సభాసదులు కూడా భంగపడినట్లే. వారు ఆ శల్యాన్ని తొలగించలేరు. (వారు పాప ఫలాన్ని అనుభవించవలసిందే). (77)
అర్ధం హరతి వై శ్రేష్ఠః పాదో భవతి కర్తృషు ।
పాదశ్చైవ సభాసత్సు యే న నిందంతి నిందితమ్ ॥ 78
నిందింపదగిన వానిని నిందింపనిచో ఆ పాపఫలంలో సభావతి సగాన్ని, తప్పుచేసిన వాడు నాల్గవభాగాన్ని, సభాసదులు నాల్గవభాగాన్ని అనుభవిస్తారు. (78)
అనేనా భవతి శ్రేష్ఠో ముచ్యంతే చ సభాసదః ।
ఏనో గచ్ఛతి కర్తారం నిందార్హో యత్ర నింద్యతే ॥ 79
నిందింపదగిన వానిని నిందించినపుడు సభాపతి పాపరహితుడవుతాడు. సభాసదులకు పాపమంటదు. తప్పుచేసిన వాడే మొత్తం ఫలాన్ని అనుభవిస్తాడు. (79)
వితథం తు వదేయుర్యే ధర్మం ప్రహ్లాద పృచ్ఛతే ।
ఇష్టా పూర్తం చ తే ఘ్నంతి సప్త సప్త పరవరాన్ ॥ 80
ప్రహ్లాదా! ధర్మమడిగినపుడు తప్పుడు సమాధానం చెపితే ఆ వక్తయొక్క ఇష్టాపూర్తధర్మాలు నశిస్తాయి. ముందు, వెనుకల ఏడుతరాల పుణ్యాలు కూడా నశిస్తాయి. (80)
హృతస్వస్య హి యద్ దుఃఖం హతపుత్రస్య చైవ యత్ ।
ఋణినః ప్రతి యచ్చైవ స్వార్థాద్ భ్రష్టస్య చైవ యత్ ॥ 81
స్త్రియాః పత్యా విహీనాయా రాజ్ఞా గ్రస్తస్య చైవ యత్ ।
అపుత్రాయాశ్చ యద్ దుఃఖం సాక్షిభిర్విహతస్య చ ।
ఏతాని వై సమాన్యాహుః దుఃఖాని త్రిదివేశ్వరాః ॥ 83
ధనాన్ని గోలుపోయినవాడు, కొడుకు చనిపోయినవాడు, ఋణగ్రస్తుడు, స్వప్రయోజనాన్ని పోగొట్టుకొన్నావాడు, భర్తను కోలుపోయిన స్త్రీ, రాజకోపానికి ఎర అయినవాడు, సంతానంలేని కాంత, పులి వాసన చూచినవాడు, సపత్నులు గల స్త్రీ, సాక్షులు మోసగించినవాడు వీరందరూ ఒకే విధమయిన దుఃఖాన్ని అనుభవిస్తారని దేవతల అభిభాషణ (81-83)
తాని సర్వాణి దుఃఖాని ప్రాప్నోతి వితథమ్ బ్రువన్ ।
సమక్షదర్శనాత్ సాక్షీ శ్రవణాచ్చేతి ధారణాత్ ॥ 84
తస్మాత్ సత్యం బ్రువన్ సాక్షీ ధర్మార్థాభ్యాం న హీయతే ।
అసత్యం చెపితే ఆ దుఃఖాల నన్నింటినీ అనుభవించవలసి వస్తుంది. ప్రత్యక్షంగా చూచినా, విన్నా, ధారణచేసినా అతడు సాక్షి అవుతాడు. కాబట్టి సత్యం చెప్పిన సాక్షి ధర్మార్థాలకు దూరం కాడు. (84 1/2)
కశ్యపస్య వచః శ్రుత్వా ప్రహ్లాదః పుత్రమబ్రవీత్ ॥ 85
కశ్యపుని మాటలు విని ప్రహ్లాదుడు కొడుకుతో ఇలా అన్నాడు. (85)
శ్రేయాన్ సుధన్వా త్వత్తో వై మత్తః శ్రేయాస్తథాంగిరాః ।
మాతా సుధన్వనశ్చాపి మాతృతః శ్రేయసీ తవ ।
విరోచన సుధన్వాయం ప్రాణానామీశ్వర స్తవ ॥ 86
విరోచనా! సుధన్వుడు నీకన్న గొప్పవాడు. వాని తండ్రి అంగిరుడు నాకన్న గొప్పవాడు. సుధన్వుని తల్లి నీ తల్లి కన్న గొప్పది. ఇప్పుడీ సుధన్వుడే నీ ప్రాణాలకధికారి. (86)
సుధన్వోవాచ
పుత్రస్నేహం పరిత్యజ్య యస్త్వం ధర్మే వ్యవస్థితః ।
అనుజానామి తే పుత్రం జీవత్వేష శతం సమాః ॥ 87
సుధన్వుడిలా అన్నాడు. పుత్రస్నేహాన్ని కూడా కాదని నీవు ధర్మం మీదనే నిలిచావు. అనుగ్రహిస్తున్నాను. ఈ నీ కుమారుడు నూరేండ్లు బ్రతుకుతాడు. (87)
విదుర ఉవాచ
ఏవైం వై పరమం ధర్మం శ్రుత్వా సర్వే సభాసదః ।
విదురుడిలా అన్నాడు. సభాసదులారా! ఈ పరమధర్మ ప్రసంగాన్ని మీరంతా విన్నారు గదా! ద్రౌపది ప్రశ్నను అనుసరించి ఈ విషయంలో ఏది యుక్తమని భావిస్తున్నారు? (88)
వైశంపాయన ఉవాచ
విదురస్య వచః శ్రుత్వా నోచుః కించన పార్థివాః ।
కర్ణో దుఃశాసనం త్వాహ కృష్ణాం దాసీం గృహాన్ నయ ॥ 89
వైశంపాయనుడిలా అన్నాడు. విదురుని మాట విని రాజు లెవ్వరూ ఏమీ అనలేదు. కర్ణుడు "ఈ ద్రౌపది దాడి. ఇంటికి నడిపించు" అని దుశ్శాసనునితో అన్నాడు. (89)
తాం వేపమానాం సవ్రీడాం ప్రలపంతీం స్మ పాండవాన్ ।
దుఃశాసనః సభామధ్యే విచకర్ష తపస్వినీమ్ ॥ 90
సిగ్గుపడుతూ, వణికిపోతూ, పాండవులను గూర్చి విలపిస్తున్న ఆ తపస్వినిని దుశ్శాసనుడు సభామధ్యంలోనికి ఈడ్చాడు. (90)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి ద్రౌపద్యాకర్షణేఽష్ట షష్టితమోఽధ్యాయః ॥ 68 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున ద్రౌపద్యాకర్షణమను అరువదియెనిమిదవ అధ్యాయము. (68)
(దాక్షిణాత్య అధికపాఠము 4 1/2 శ్లోకములు కలిపి మొత్తము 94 1/2 శ్లోకములు)