69. అరువది తొమ్మిదవ అధ్యాయము
ద్రౌపది విలాపము - భీష్మవచనము.
ద్రౌపద్యువాచ
పురస్తాత్ కరణీయం మే న కృతం కార్యముత్తరమ్ ।
విహ్వలాస్మి కృతానేన కర్షతా బలినా బలాత్ ॥ 1
ద్రౌపది ఇలా అన్నది. ముందుగా చేయవలసిన నా పని ఇప్పటికీ కాలేదు. ఇప్పుడు ఆ పని జరగాలి . బలిష్ఠుడైన ఈ దుశ్శాసనుడు బలపూర్వకంగా నన్ను ఈడ్చాడు. నేను కలత జెందాను. (1)
అభివాదం కరోమ్యేషాం కురూణాం కురుసంసది ।
న మే స్యాదపరాధోఽయం యదిదం న కృతం మయా ॥ 2
కౌరవసభలోని కురువంశస్థుల కందరకు నమస్కారం. ఇంతకు ముందే నమస్కరించకపోవటంలో నా దోషం లేదు. (2)
వైశంపాయన ఉవాచ
సా తేన చ సమాధూతా దుఃఖేన చ తపస్వినీ ।
పతితా విలలాపేదం సభాయామతథోచితా ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ ద్రౌపదిని దుశ్శాసనుడు ఈడ్చుతుండగా తపస్విని అయిన ద్రౌపది నేలబడింది. సభలో ఈ రీతిగా విలపించింది. ఆ స్థితి ఆమెకు తగినది కాదు. (3)
స్వయంవరే యాస్మి నృపైః దృష్టా రంగే సమాగతైః ।
న దృష్టపూర్వా చాన్యత్ర సాహమద్య సభాం గతా ॥ 4
స్వయంవర సమయంలో సమాగతులైన రాజులు రంగస్థలంలో నన్ను చూశారు. మరెక్కడా నేను ఇతరుల కంటపడలేదు. అటువంటి నేను నేడు సభలోనికి రావలసి వచ్చింది. (4)
యాం న వాయుర్న చాదిత్యః దృష్టవంతౌ పురా గృహే ।
సాహమద్య సభామధ్యే దృశ్యాస్మి జనసంసది ॥ 5
గతంలో రాజభవనంలో నున్న నన్ను గాలి, సూర్యుడు కూడా చూడలేదు. అటువంటి నేను నేడు సభామధ్యంలో జనసమూహంలో అందరికీ కనిపించవలసి వచ్చింది. (5)
యాం న మృష్యంతి వాతేన స్పృశ్యమానాం గృహే పురా ।
స్పృశ్యమానాం సహస్తేఽద్య పాండవాస్తాం దురాత్మనా ॥ 6
గతంలో రాజభవనంలో గాలి నన్ను తాకినా సహించలేని పాండవులు నేడు ఈ దురాత్ముడు తాకుతూ ఉంటే సహిస్తున్నారు. (6)
మృష్యంతి కురవశ్చేమే మన్యే కాలస్య పర్యయమ్ ।
స్నుషాం దుహితరం చైవ క్లిశ్యమానామనర్హతీమ్ ॥ 7
కురువంశానికి కోడలినై, పుత్రీసమానంగా ఉన్న నేను ఈవిధగా బాధపడుతున్నాను. నేను దీనికి తగను. అయినా కౌరవులు సహించి చూస్తున్నారు. ఇది కాలవైపరీత్యమే. (7)
కిం న్వతః కృపణం భూయః యదహం స్త్రీ సతీ శుభా ।
సభామధ్యం విగాహేఽద్వ క్వ ను ధర్మో మహీక్షితామ్ ॥ 8
స్త్రీ ని, పతివ్రతను, కళ్యాణిని అయిన నేను సభామధ్యంలోనికి ఈడ్చుకు రాబడ్డాను. ఇంతకన్న దయనీయమైనది మరే ముంటుంది? రాజుల ధర్మమేమయినది? (8)
ధర్మ్యాం స్త్రియ సభాం పూర్వే న నయంతీతి నః శ్రుతమ్ ।
స నష్టః కౌరవేయేషు పూర్వో ధర్మః సనాతనః ॥ 9
ధర్మ్యాం స్త్రియం సభాం పూర్వే న నయంతీతి నః శ్రుతమ్ ।
స నష్టః కౌరవేయేషు పూర్వో ధర్మః సనాతనః ॥ 9
ధర్మపరాయణ అయిన స్త్రీని పూర్వమెప్పుడూ సభలోనికి కొనివచ్చేవారు కాదని నేను విన్నాను. కౌరవులలో ఆ సనాతన ధర్మం నశించింది. (9)
కథం హి భార్యా పాండూనాం పార్షతస్య స్వసా సతీ ।
వాసుదేవస్య చ సఖీ పార్థివానాం సభామియామ్ ॥ 10
పాండవులకు భార్యనై, ధృష్టద్యుమ్నుని సోదరినై, శ్రీకృష్ణుని సఖినై ఈ రాజ సభలోనికి ఎలా వచ్చాను ? (10)
తామిమాం ధర్మరాజస్య భార్యాం సదృశవర్ణజామ్ ।
బ్రూత దాసీమదాసీం వా తత్ కరిష్యామి కౌరవాః ॥ 11
కౌరవులారా! నేను యుధిష్ఠిరుని ధర్మపత్నిని, క్షత్రియకాంతను. ఇప్పుడు చెప్పండి. నేను దాసినా? అదాసినా? మీరు చెప్పినట్టు చేస్తాను. (11)
అయం మాం సుదృఢం క్షుద్రం కౌరవాణాం యశోహరః ।
క్లిశ్నాతి నాహం తత్ సోఢుం చిరం శక్ష్యామి కౌరవాః ॥ 12
కౌరవులారా! కురువంశ కీర్తినాశకుడైన ఇతడు నన్ను చాలా బాధిస్తున్నాడు. దీన్ని ఎక్కువసేపు భరించలేను. (12)
జితాం వాప్యజితామ్ వాపి మన్యధ్వం మాం యథా నృపాః ।
తథా ప్రత్యుక్తమిచ్ఛామి తత్ కరిష్యామి కౌరవాః ॥ 13
కురువంశస్థులారా! నేను ఓడిపోయానో? ఓడిపోలేదో? రాజులందరూ ఎలా భావిస్తే అలాగే సమాధానం చెప్పాలని కోరుతున్నాను. దాని ననుసరించి నేను ప్రవర్తిస్తాను. (13)
భీష్మ ఉవాచ
ఉక్తవానస్మి కళ్యాణి ధర్మస్య పరమాగతిః ।
లోకే న శక్యతే జ్ఞాతుమ్ అపి విజ్ఞైర్మహాత్మభిః ॥ 14
భీష్ముడిలా అన్నాడు. కళ్యాణీ! నేను చెప్పాను గదా! ధర్మం యొక్క పరమగతి చాలా సూక్ష్మమైనది. లోకంలో విజ్ఞులైన మహాత్ములు కూడా దానిని తెలియలేరు. (14)
బలవాంశ్చ యథా ధర్మమ్ లోకే పశ్యతి పూరుషః ।
స ధర్మో ధర్మవేలాయాం భవత్యభిహతః పరః ॥ 15
లోకంలో బలవంతుడు అయిన మనిషి భావించిందే ధర్మసంశయసమయంలో ధర్మమవుతుంది. బలహీనుడు పలికే ధర్మం బలవంతుని ధర్మం చేతిలో దెబ్బతింటుంది. (15)
న వివేక్తుం చ తే ప్రశ్నమ్ ఇమం శక్నోమి నిశ్చయాత్ ।
సూక్ష్మత్వాద్ గహనత్వాచ్చ కార్యస్యాస్య చ గౌరవాత్ ॥ 16
నీ ప్రశ్న పరమసూక్ష్మమైనది, దురవగాహమైనది, ధర్మనిర్ణయకార్యం గురుతరమైనది. కాబట్టి నేను వివేచించి నిశ్చయించి చెప్పలేకున్నాను. (16)
నూనమంతః కులస్యాయం భవితా న చిరాదివ ।
తథా హి కురవః సర్వే లోభమోహపరాయణాః ॥ 17
త్వరలో ఈ కురువంశనాశనం తప్పదు. కౌరవులందరూ లోభమోహాలకు లోనయ్యారు. (17)
కులేషు జాతాః కళ్యాణి వ్యసనైరాహతా భృశమ్ ।
ధర్మ్యాన్మార్గాన్న చ్యవంతే యేషాం నస్త్వం వధూః స్థితా ॥ 18
కళ్యాణి! నీవు కోడలివి. పాండవధర్మపత్నివి. వారు ఉత్తమవంశసంజాతులు. తీవ్రకష్టాలు వచ్చినా ధర్మమార్గాన్ని విడువరు. (18)
ఉపపన్నం చ పాంచాలి తవేదం వృత్తమీదృశమ్ ।
యత్ కృచ్ఛ్రమపి సంప్రాప్తా ధర్మమేవాన్వవేక్షసే ॥ 19
పాంచాలీ! నీకు ఈ ప్రవర్తన యోగ్యమయినదే. మహాసంకటంలో పడి కూడా ధర్మం మీదనే దృష్టి పెడుతున్నావు. (19)
ఏతే ద్రోణాదయశ్చైవ వృద్ధా ధర్మవిదో జనాః ।
శూన్యైః శరీరైస్తిష్ఠంతి గతాసవ ఇవానతాః ॥ 20
యుధిష్ఠిరస్తు ప్రశ్నేఽస్మిన్ ప్రమాణమితి మే మతిః ।
అజితాం వా జితాం వేతి స్వయం వ్యాహర్తుమర్హతి ॥ 21
ద్రోణాచార్యులు మొదలయిన ఈ పెద్దలు ధర్మవేత్తలయి కూడా ప్రాణాలు పోయినట్లు తలలు వాల్చి శూన్యశరీరాలతో కూర్చొని ఉన్నారు. నీ ప్రశ్న విషయంలో ధర్మరాజే ప్రమాణమని నా భావం. నీవు ఓడిపోయావో లేదో చెప్పదగిన వాడు తాను మాత్రమే. (20,21)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి భీష్మవాక్యే ఏకోనసప్తతితమోఽధ్యాయః ॥ 69 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున భీష్మవాక్యమను అరువది తొమ్మిదవ అధ్యాయము. (69)