58. ఏబది ఎనిమిదవ అధ్యాయము
యుధిష్ఠిరుడు హస్తినకు వచ్చుట.
వైశంపాయన ఉవాచ
తతః ప్రాయాద్ విదురోఽశ్వైరుదారైః
మహాజవైర్బలిభిః సాధుదాంతైః ।
బలాన్ని యుక్తో ధృతరాష్ట్రేణ రాజ్ఞా
మనీషిణాం పాండవానాం సకాశే ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - పిమ్మట రాజు అయిన ధృతరాష్ట్రుడు బలవంతంగా నియోగించడం చేత విదురుడు వేగవంతాలై, బలిష్ఠాలై, చక్కగా వశపడిన మంచి గుఱ్ఱాలు పూన్చిన రథాన్ని ఎక్కి బుద్ధిమంతులయిన పాండవుల వద్దకు వెళ్లాడు. (1)
సోఽభిపత్య తదధ్వానమ్ ఆసాద్య నృపతేః పురమ్ ।
ప్రవివేశ మహాబుద్ధిః పూజ్యమానో ద్విజాతిభిః ॥ 2
మహాబుద్ధిమంతుడయిన అతడు మార్గాన్ని కడచి రాజధానిని చేరాడు. అక్కడ ద్విజుల చేత పూజింపబడి నగరంలోకి ప్రవేశించాడు. (2)
స రాజగృహమాసాద్య కుబేరభవనోపమమ్ ।
అభ్యాగచ్ఛత ధర్మాత్మా ధర్మపుత్రం యుధిష్ఠిరమ్ ॥ 3
తం వై రాజా సత్యధృతిర్మహాత్మా
అజాతశత్రుర్విదురం యథావత్ ।
పుజాపూర్వం ప్రతిగృహ్యాజమీఢః
తతోఽపృచ్ఛద్ ధృతరాష్ట్రం సపుత్రమ్ ॥ 4
ధర్మాత్ముడైన విదురుడు కుబేరభవనం వంటి రాజగృహాన్ని చేరుకొని ధర్మపుత్రుడైన యుధిష్ఠిరుని కలుసుకొన్నాడు. సత్యనిష్ఠుడు, మహాత్ముడు, అజాతశత్రువు అయిన యుధిష్ఠిరమహారాజు యథావిధిగా విదురుని పూజాపూర్వకంగా స్వాగతించి పుత్రసహితంగా ధృతరాష్ట్రుని కుశలాన్ని అడిగాడు. (3,4)
యుధిష్ఠిర ఉవాచ
విజ్ఞాయతే తే మనసోఽప్రహర్షః
కచ్చిత్ క్షత్తః కుశలేనాగతోఽసి ।
కచ్చిత్ పుత్రాః స్ధవిరస్యానులోమాః
వశనుగచ్చాసి విశోఽథ కచ్చిత్ ॥ 5
యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు - విదురా! నీ మనసు సంతోషంగా లేదని తెలుస్తోంది. క్షేమంగానే వచ్చావా? వృద్ధుడైన ధృతరాష్ట్రుని కొడుకులు అతనికి అనుకూలంగా ఉన్నారా? ప్రజలందరూ అతనికి వశవర్తులై ఉన్నారా? (5)
విదుర ఉవాచ
రాజా మహాత్మా కుశలీ స పుత్రః
ఆస్తే వృతో జ్ఞాతిభిరింద్రకల్పః ।
ప్రీతో రాజన్ పుత్రగణైర్వినీతైః
విశోక ఏవాత్మరతిర్మహాత్మా ॥ 6
విదురుడు చెపుతున్నాడు - రాజా! మహాత్ముడయిన రాజు పుత్రసహితంగా కుశలంగానే ఉన్నాడు. జ్ఞాతులతో కూడి ఇంద్రునివలె ఉన్నాడు. వినీతులైన పుత్రులవలన ప్రీతిని పొందుతున్నాడు. ఆ మహాత్ముడు శోకరహితుడై తన యందు తాను అనురాగం కలిగి ఉన్నాడు. (6)
ఇదం తు త్వాం కురురాజోఽభ్యువాచ
ఏవం పృష్ట్వా కుశలం చావ్యయం చ ।
ఇయం సభా త్వత్సభాతుల్యరూపా
భ్రాతౄణాం తే దృశ్యతామేత్య పుత్ర ॥ 7
సమాగమ్య భ్రాతృభిః పార్థ తస్యాం
సుహృద్ ద్యూతం క్రియతాం రమ్యతాం చ ।
ప్రీయమహే భవతాం సంగమేన
సమాగతాః కురవశ్చాపి సర్వే ॥ 8
మీ క్షేమాన్ని ఆరోగ్యాన్ని గురించి అడిగి, కురురాజు మీకు ఈ సందేశాన్ని ఇచ్చాడు. పుత్రా! ఈ సభ నీ సభతో సమానమైన ఆకారంతో నిర్మించబడింది. తమ్ముళ్లతో కలిసి వచ్చి నీవు దీనిని చూడాలి. పార్థా! సోదరులతో కలిసి ఆ సభలో సుహృద్ద్యూతం ఆడాలి. వినోదించాలి. మిమ్మల్ని కలుసుకోవడం వలన అక్కడకు వచ్చిన కౌరవులమందరమూ సంతోషిస్తాము. (7,8)
దురోదరా విహితా యే తు తత్ర
మహాత్మనా ధృతరాష్ట్రేణ రాజ్ఞా ।
తాన్ ద్రక్ష్యసే కితవాన్ సంనివిష్టాన్
ఇత్యాగతోఽహం నృపతే తజ్జుషస్వ ॥ 9
మహాత్ముడైన ధృతరాష్ట్రమహారాజు ఏర్పరచిన జూదశాలలను, అక్కడకు చేరి ఆసీనులయిన జూదరులను చూచుదువుగాని. రాజా! ఇందుకే నేను వచ్చాను. అది సేవించుకో. (9)
యుధిష్ఠిర ఉవాచ
ద్యూతే క్షత్తః కలహో విద్యతే నః
కో వై ద్యూతం రోచయేద్ బుధ్యమానః ।
కిం వా భవాన్ మన్యతే యుక్తరూపం
భవద్వాక్యే సర్వ ఏవ స్థితాః స్మ ॥ 10
యుధిష్ఠిరుడు అంటున్ణాడు - విదురా! ద్యూతం వలన మాకు కలహం కలుగుతుంది. బుద్ధిమంతుడెవడు దీనిని ఇష్టపడతాడు? నీవు దీనిని తగినదనే అనుకొంటున్నావా? నీ మాటమీదే మేమంతా నిలబడి ఉన్నాం. (10)
విదుర ఉవాచ
జానామ్యహం ద్యూతమనర్థమూలం
కృతశ్చ యత్నోఽస్య మయా నివారణే ।
రాజా చ మాం ప్రాహిణోత్ త్వత్సకాశం
శ్రుత్వా విద్వంచ్ఛ్రేయ ఇహాచరస్వ ॥ 11
విదురుడు చెపుతున్నాడు - జూదం అనర్థకారణమని నేను ఎరుగుదును. దీనిని వారించడానికి నేను ప్రయత్నం చేశాను. రాజు నీ దగ్గరకు నన్ను పంపాడు. విద్వాంసుడా! ఇది విని శ్రేయస్కరమైనది ఆచరించు. (11)
యుధిష్ఠిర ఉవాచ
కే తత్రాన్యే కితవా దీవ్యమానాః
వినా రాజ్ఞో ధృతరాష్ట్రస్య పుత్రైః ।
పృచ్ఛామి త్వాం విదుర బ్రూహి నస్తాన్
యైరీవ్యామః శతశః సంనిపత్య ॥ 12
యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు - "విదురా! అక్కడ ధృతరాష్ట్రుని కొడుకులు కాక జూదమాడే వేరే జూదరులెవరు? నిన్ను అడుగుతున్నాను. వారెవరో మాకు చెప్పు. వందల కొద్దీ పందేలు వేసి ఎవరితో జూదమాడాలి మేము? (12)
విదుర ఉవాచ
గాంధారరాజః శకునిర్విశాంపతె
రాజాతిదేవీ కృతహస్తో మతాక్షః ।
వివింశతిశ్చిత్రసేనశ్చ రాజా
సత్యవ్రతః పురుమిత్రో జయశ్చ ॥ 13
విదురుడు చెపుతున్నాడు - రాజా! గాంధారరాజు శకుని ఉన్నాడు. అతడు ఎక్కువగా జూదమాడుతాడు. అభిమతమైన పాచికలు కలవాడు. నేర్పరి. అతడేకాక రాజు వివింశతి, చిత్రసేనుడు, సత్యవ్రతుడు, పురుమిత్రుడు, జయుడు కూడా ఉన్నారు. (13)
యుధిష్ఠిర ఉవాచ
మహాభయాః కితవాః సంనివిష్ఠాః
మాయోపధా దేవితారోఽత్ర సంతి ।
ధాత్రా తు దిష్టస్య వశే కిలేదం
సర్వం జగత్ తిష్ఠతి న స్వతంత్రమ్ ॥ 14
యుధిష్ఠిరుడు అంటున్నాడు - మహాభయంకరులు, మోసంతో జూదమాడే జూదరులు అక్కడ చేరి ఉన్నారు. విధాత నిర్మించిన ఈ జగత్తు సర్వం విధికి లోబడి ఉంది. స్వతంత్రమైనది కాదు కదా! (14)
నాహం రాజ్ఞో ధృతరాష్ట్రస్య శాసనాత్
న గంతుమిచ్ఛామి కవే దురోదరమ్ ।
ఇష్టో హి పుత్రస్య పితా సదైవ
తదస్మి కర్తా విదురాత్థ మాం యథా ॥ 15
కవీ! విదురా! రాజు అయిన ధృతరాష్ట్రుని ఆజ్ఞను అనుసరించి జూదానికి నేను వెళ్లాలనే అనుకొంటున్నాను. పుత్రునకు తండ్రి ఎప్పుడూ ఇష్టుడే కదా! కాబట్టి నీవు ఆదేశించినట్లుగానే నేను చేస్తాను. (15)
న చాకామః శకునినా దేవితాహం
న చేన్మాం జిష్ణురాహ్వయితా సభాయామ్ ।
ఆహూతోఽహం న నివర్తే కదాచిత్
తదాహితం శాశ్వతం వై వ్రతం మే ॥ 16
జయశీలుడైన ధృతరాష్ట్రుడు సభకు రమ్మని నన్ను ఆహ్వానించకపోతే పాచికలాటలో కోరిక లేని నేను శకునితో జూదమాడను. పిలువబడి ఎన్నడూ వెనుతిరగను. ఇది నాకు శాశ్వతమైన వ్రతం. (16)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా విదురం ధర్మరాజః
ప్రాయాత్రికం సర్వమాజ్ఞాప్య తూర్ణమ్ ।
ప్రాయాచ్ఛ్వోభూతే సగణః సానుయాత్రః
సహస్త్రీభిర్ద్రౌపదీమాదికృత్వా ॥ 17
వైశంపాయనుడు చెపుతున్నాడు - విదురునితో ఇలా చెప్పి ధర్మరాజు ప్రయాణానికి వెంటనే ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించి, తెల్లవారగానే సోదరులతో, బంధువులతో, పరిచారకులతో, ద్రౌపది మొదలగు స్త్రీలతో ప్రయాణమయ్యాడు. (17)
దైవం హి ప్రజ్ఞాం ముష్ణాతి చక్షుస్తేజ ఇవాపతత్ ।
ధాతుశ్చ వశమన్వేతి పాశైరివ నరః స్థితః ॥ 18
మిరుమిట్లు కొలిపే కాంతి పడగానే కన్నులు మూసుకుపోయినట్లుగా దైవం మానవుని ప్రజ్ఞను హరిస్తుంది. పాశాలతో కట్టబడినట్లుగా నరుడు విధాతకు వశమై ఉంటాడు. (18)
ఇత్యుక్త్వా ప్రయయౌ రాజా సహ క్షత్రా యుధిష్ఠిరః ।
అమృష్యమాణస్తస్యాథ సమాహ్వానమరిందమః ॥ 19
ఇలా చెప్పి శత్రుదమనుడైన యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని ఆహ్వానాన్ని అంగీకరించాలని లేకపోయినా విదురునితోపాటు బయలుదేరాడు. (19)
బాహ్లీకేన రథం యత్తమ్ ఆస్థాయ పరవీరహా ।
పరిచ్ఛన్నో యయౌ పార్థః భ్రాతృభిః సహ పాండవః ॥ 20
శత్రుసూదనుడైన పాండుకుమారుడు యుధిష్ఠిరుడు బాహ్లీకుడు కూర్చి ఇచ్చిన రథం ఎక్కి తమ్ములందరితో కలిసి బయలుదేరాడు. (20)
రాజశ్రియా దీప్యమానః యయౌ బ్రహ్మపురఃసరః ।
రాజ్యలక్ష్మితో దేదీప్యమానుడై బ్రాహ్మణపురస్సరుడై బయలుదేరాడు.
(సందిదేశ తతః ప్రేష్యాన్ నాగాహ్వయగతిం ప్రతి ।
తతస్తే నరశార్దూలాః చక్రుర్వై నృపశాసనమ్ ॥
తన హస్తినాపురగమనం గురించి వార్తాహరుల చేత సందేశం పంపాడు. ఆ పురుషశ్రేష్ఠులు రాజశాసనాన్ని పాటించారు.
తతో రాజా మహాతేజాః సధౌమ్యః సపరిచ్ఛదః ।
బ్రాహ్మణైః స్వస్తి వాచ్యైవ నిర్యయౌ మందిరాద్ బహిః ॥
అనంతరం మహాతేజశ్శాలి అయిన యుధిష్ఠిరమహారాజు సమస్తసామగ్రితో బ్రాహ్మణులచేత స్వస్తివాచనం చేయించి ధౌమ్యునితో సహితంగా మందిరం నుండి వెలుపలికి వచ్చాడు.
బ్రాహ్మణేభ్యో ధనం దత్త్వా గత్యర్థం స యథావిధి ।
అన్యేభ్యః స తు దత్త్వార్థం గంతుమేవోపచక్రమే ॥
సుఖప్రయణం కోసం యథావిధిగా బ్రాహ్మణులకు ధనం ఇచ్చి, ఇతరులకు కూడా అడిగినది ఇచ్చి అతడు ప్రయాణోన్ముఖుడయ్యాడు.
సర్వలక్షన సంపన్నం రాజార్హం సపరిచ్చదమ్ ।
తమారుహ్య మహారాజః గజేంద్రం షష్టిహాయనమ్ ॥
నిషసాద గజస్కంధే కాంచనే పరమాసనే ।
హారీ కిరీటీ హేమాభః సర్వాభరణభూషితః ॥
రరాజ రాజన్ పార్థో వై పరయా నృపశోభయా ।
రుక్మవేదిగతః ప్రాజ్యః జ్వలన్నివ హుతాశనః ॥
అరవై ఏళ్ల వయసు గలిగి, సర్వలక్షనసంపన్నమై, సమస్త వస్తువులతో కూడిన, రాజయోగ్యమైన, గజరాజును మహారాజు అధిష్ఠించాడు. హారాలు, కిరీటం, ధరించి సర్వాభరణభూషితుడై పసిడి ఛాయతో మెరిసిపోతున్న యుధిష్ఠిరుడు ఏనుగు మీది బంగారు అంబారీమీద ఆసీనుడయ్యాడు. రాజా! ఇనుమడించిన రాజశోభతో యుధిష్ఠిరుడు బంగారు వేదికపై ఆజ్యాహుతులతో ప్రజ్వలిస్తున్న అగ్నిదేవునివలె ప్రకాశించాడు.
తతో జగామ రాజా సః ప్రహృష్టనరవాహనః ।
రథఘోషేణ మహతా పూరయన్ వై నభః స్థలమ్ ॥
సంస్తూయమానః స్తుతిభిః సూతమాగధవందిభిః ।
మహాసైన్యేన సంవీతః యథాఽఽదిత్యః స్వరశ్మిభిః ॥
హర్షాతిరేకులైన నరులతో వాహనాలతో కూడి రాజు ముందుకు నడిచాడు. గొప్ప రథఘోషలతో ఆకాశమంతా నిండిపోయింది. సూతులు, మాగధులు, వందులు స్తోత్రాలతో అతనిని స్తుతిస్తున్నారు. మహాసైన్యంతో కుడిన అతడు కిరణాలతో కూడిన ఆదిత్యుని వలె ఉన్నాడు.
పాండురేణాతపత్రేణ ధ్రియమాణేన మూర్ధని ।
బభౌ యుధిష్ఠిరో రాజా పౌర్ణమాస్యామివోడురాట్ ॥
తలపై శ్వేతచ్ఛత్రాన్ని ధరించిన యుధిష్ఠిరుడు పున్నమినాటి చంద్రుని వలె ప్రకాశించాడు.
చామరైర్హేమదండైశ్చ ధూయమానః సమంతతః ।
జయాశిషః ప్రహృష్టాణాం నరాణాం పథి పాండవః ॥
ప్రత్యగృహ్ణాద్ యథాన్యాయం యథావద్ భరతర్షభ ।
బంగారు కఱ్ఱలు గల చామరాలతో అతనికి అన్నివైపుల నుండి విసురుతున్నారు. భరతసత్తమా! మార్గమధ్యంలో అమితసంతోషంతో ప్రజలు అతనికి జయజయధ్వానాలు చేస్తున్నారు. అతడు యథోచితంగా శిరసు వంచి యథావిధిగా వాటిని స్వీకరిస్తున్నాడు.
అపరే కురురాజానం పథి యాంతం సమాహితాః ॥
స్తువంతి సతతం సౌఖ్యాద్ మృగపక్షిస్వనైర్నరాః ।
మార్గంలో సాగిపోతున్న కురురాజును ఇతరులు కొంత మంది దగ్గరకు చేరి మృగపక్షిధ్వనులతో నిరంతరం సుఖంగా స్తుతిస్తున్నారు.
తథైవ సైనిలా రాజన్ రాజానమనుయాంతి యే ।
తేషాం హలహలాశబ్దః దివం స్తబ్ధ్వా ప్రతిష్ఠితః ।
రాజా! రాజును అనుసరించి వస్తున్న సైనికుల యొక్క కోలాహలధ్వని ఆకాశంలో గూడుకట్టి ప్రతిధనిస్తోంది.
నృపస్యాగ్రే యయౌ భీమః గజస్కంధగతో బలీ ॥
ఉభౌ పార్శ్వగతే రాజ్ఞః సదశ్వే వై సుకల్పితౌ ।
అధిరూఢౌ యమౌ చాపి జగ్మతుర్భరతర్షభ ॥
శోభయంతౌ మహాసైన్యం తావుభౌ రూపశాలినౌ ।
రాజుకు ముందుగా ఏనుగునెక్కి బలశాలి అయిన భీముడు బయలుదేరాడు. భరతశ్రేష్ఠా! కవలలు నకులసహదేవులు చక్కగా అలంకరింపబడిన మంచి గుఱ్ఱాలను ఎక్కి రాజుకిరువైపుల నడుస్తున్నారు. ఆ రూపవంతులు ఇద్దరూ ఆ మహాసైన్యానికి శోభను చేకూరుస్తున్నారు.
పృష్ఠతోఽనుయయౌ ధీమాన్ పార్థః శస్త్రభృతాం వరః ॥
శ్వేతాశ్వో గాండివం గృహ్య అగ్నిదత్తం రథం గతః ।
తెల్లని గుఱ్ఱాలు పూన్చిన అగ్నిదత్తమైన రథాన్ని ఎక్కి ఆయుధధారులలో శ్రేష్ఠుడయిన బుద్ధిమంతుడయిన అర్జునుడు గాండీవాన్ని తీసుకొని వెనుకనే బయలుదేరాడు.
సైన్యమధ్యే యయౌ రాజన్ కురురాజో యుధిష్ఠిరః ॥
ద్రౌపదీప్రముఖా నార్యః సానుగాః సపరిచ్ఛదాః ।
ఆరుహ్య తా విచిత్రాణి శిబికానాం శతాని చ ॥
మహత్యా సేనయా రాజన్ అగ్రే రాజ్ఞో యయుస్తదా ।
రాజా! కురురాజు యుధిష్ఠిరుడు సేనామధ్యంలో ఉన్నాడు. ద్రౌపది మొదలైన స్త్రీలు కావలసిన సామగ్రితో, పరిచారికలతో విచిత్రాలైన నూర్లకొలది పల్లకీలను ఎక్కి సేనాసహితంగా రాజుగారికి ముందు నడుస్తున్నారు.
సమృద్ధనరనాగాశ్వం సపతాకరథధ్వజమ్ ॥
సమృద్ధరథనిస్త్రింశం పత్తిభిర్ఘోషితస్వనమ్ ।
ఆ కురురాజు సైన్యం కాల్బలంతో ఏనుగులతో, అశ్వాలతో సమృద్ధిగా ఉంది. రథాలు పతాకాలతో కూడిన ధ్వజాలతో, కత్తులతో సమృద్ధిగా ఉన్నాయి. కాల్బలం యొక్క కోలాహలం నలువైపుల వ్యాపించింది.
శంఖదుందుభితాళానాం వేణువీణానునాదితమ్ ॥
శుశుభే పాండవం సైన్యం ప్రయాతం తత్ తదా నృప ।
శంక, దుందుబి, తాళ, వేణు, వీణా ధ్వనులతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగుతోంది. అలా బయలుదేరి ప్రయాణిస్తున్న పాండవసైన్యం అప్పుడు ఎంతో శోభాయమానంగా ఉంది.
స సరాంసి నదీశ్చైవ వనాన్యుపవనాని చ ॥
అత్యక్రామన్మహారాజ పురీం చాభ్యవపద్యత ।
హస్తీపురసమీపే తు కురురాజో యుధిష్ఠిరః ॥
ఆ కురురాజు యుధిష్ఠిరుడు సరస్సులను, నదులను, వనాలను, ఉపవనాలను దాటుకొంటూ, హస్తినాపురసమీపంలో నగరాన్ని చేరుకున్నాడు.
చక్రే నివేశనం తత్ర తతః స సహసైనికః ।
శివే దేశే సమే చైవ న్యపసత్ పాండవస్తదా ॥
అక్కడ అతడు సైనికులతో కలిసి సుఖకరమైన సమతల ప్రదేశంలో గుడారం ఏర్పాటు చేసుకొన్నాడు.
తతో రాజన్ సమాహూయ శోకవిహ్వలయా గిరా ।
ఏతద్ వాక్యం చ సర్వస్వం దృతరాష్ట్రచికీర్షితమ్ ।
ఆచచక్షే యథావృత్తం విదురోఽథ నృపస్య హ ॥)
రాజా! పిమ్మట విదురుడు శోక విహ్వలమయిన గొంతుతో ధృతరాష్ట్రుడు చేయదలచుకొన్నది యథాతథంగా యుధిష్ఠిరునకు చెప్పాడు.
ధృతరాష్ట్రేణ చాహుతః కాలస్య సమయేన చ ॥ 21
స హాస్తినపురం గత్వా ధృతరాష్ట్ర గృహం యయౌ ।
సమియాయ చ ధర్మాత్మా ధృతరాష్ట్రేణ పాండవః ॥ 22
ధృతరాష్ట్రుడు పిలిచిన కాలనియమానుసారంగా ధర్మాత్ముడైన పాండుపుత్రుడు హస్తినాపురాన్ని చేరుకొని, ధృతరాష్ట్రుని భవనానికి వెళ్లి, అతనిని కలుసుకొన్నాడు. (21,22)
తథా భీష్మేణ ద్రోణేన కర్ణేన చ కృపేణ చ ।
సమియాయ యథాన్యాయం ద్రౌణినా చ విభుః సహ ॥ 23
అలాగే భీష్మద్రోణులను, కర్ణ కృపులను, అశ్వత్థామను కూడా యథోచితంగా ఆ రాజు కలుసుకొన్నాడు. (23)
సమేత్య చ మహాబాహుః సోమదత్తేన చైవ హ ।
దుర్యోధనేన శల్యేన సౌబలేన చ వీర్యవాన్ ॥ 24
యే చాన్యే తత్ర రాజానః పూర్వమేవ సమాగతాః ।
దుఃశాసనేన వీరేణ సర్వైర్భ్రాతృభిరేవ చ ॥ 25
జయద్రథేన చ తథా కురుభిశ్చాపి సర్వశః ।
తతః సర్వైర్మహాబాహుః భ్రాతృభిః పరివారితః ॥ 26
ప్రవివేశ గృహం రాజ్ఞః ధృతరాష్ట్రస్య ధీమతః ।
దదర్శ తత్ర గాంధారీమ్ దేవీం పతిమనువ్రతామ్ ॥ 27
స్నుషాభిః సంవృతాం శశ్వత్ తారాభిరివ రోహిణీమ్ ।
అభివాద్య స గాంధారీం తయా చ ప్రతినందితః ॥ 28
తదనంతరం పరాక్రమశాలి మహాబాహువు అయిన యుధిష్ఠిరుడు సోమదత్తుని కలుసుకొని, అంతకుముందే అక్కడకు వచ్చి ఉన్న దుర్యోధనుడు, శకుని, శల్యుడు మొదలైనవారినందరినీ కూడా కలుసుకొన్నాడు. అనంతరం దుశ్శాసనుని, అతని సోదరులందరినీ, జయద్రథుని, కౌరవులందరినీ కలుసుకొని, సోదరులతో సహితంగా మహాబాహువు అయిన యుధిష్ఠిరుడు బుద్ధిమంతుడయిన ధృతరాష్ట్రమహారాజు భవనాన్ని ప్రవేశించాడు. అక్కడ నక్షత్రాలతో పరివేష్టింపబడిన రోహిణీదేవిలా కోడళ్లతో కలిసికూర్చున్న పతివ్రత అయిన గాంధారిని చూశాడు. యుధిష్ఠిరుడు గాంధారీదేవికి నమస్కరించాడు. ఆమె కూడా అతనిని ఆశీర్వదించి ఆనందం కలిగించింది. (24-28)
దదర్శ పితరం వృద్ధం ప్రజ్ఞాచక్షుషమీశ్వరమ్ ॥ 29
అనంతరం వృద్ధుడు, గ్రుడ్డివాడు, రాజు అయిన తండ్రిని మరల దర్శించాడు. (29)
రాజ్ఞా మూర్ధన్యుపాఘ్రాతాః తే చ కౌరవనందనాః ।
చత్వారః పాండవా రాజన్ భీమసేనపురోగమాః ॥ 30
ధృతరాష్ట్రమహారాజు కురుకులానికి ఆనందం కలిగించే భీమసేనుడు మొదలుగా గల నలుగురు పాండవుల యొక్క శిరసులను ఆఘ్రాణించాడు. (30)
తతో హర్షః సమభవత్ కౌరవాణాం విశాంపతే ।
తాన్ దృష్ట్వా పురుషవ్యాఘ్రాన్ పాండవాన్ ప్రియదర్శనాన్ ॥ 31
రాజా! పురుషశ్రేష్ఠులు, ప్రియదర్శనులు అయిన ఆ పాండవులను చూచి కౌరవులకు హర్షం కలిగింది. (31)
వివిశుస్తేఽభ్యనుజ్ఞాతాః రత్నవంతి గృహాణి చ ।
దదృశుశ్చోపయాతాం స్తాన్ దుఃశలాప్రముఖాః స్త్రియః ॥ 32
యాజ్ఞసేన్యాః పరామృద్ధిం దృష్ట్వా ప్రజ్వలితామివ ।
స్నుషాస్తా ధృతరాష్ట్రస్య నాతిప్రమనసోఽభవన్ ॥ 33
వారంతా ధృతరాష్ట్రుని అనుమతిని పొంది రత్నమయగృహాలను ప్రవేశించారు. దుశ్శలమొదలైన స్త్రీలు అక్కడికి వచ్చిన వారందరినీ చూశారు. మిరుమిట్లు కొల్పుతున్నట్లున్న ద్రౌపది యొక్క ఉత్తమసమృద్ధిని చూచి ధృతరాష్ట్రుని కోడళ్లు అంతగా ఆనందించలేదు. (32,33)
తతస్తే పురుషవ్యాఘ్రాః గత్వా స్త్రీభిస్తు సంవిదమ్ ।
కృత్వా వ్యాయామపూర్వాణి కృత్యాని ప్రతికర్మ చ ॥ 34
తతః కృతాహ్నికాః సర్వే దివ్యచందనభుషితాః ।
కళ్యాణమనసశ్చైవ బ్రాహ్మణాన్ స్వస్తి వాచ్య చ ॥ 35
మనోజ్ఞమశనం భుక్త్వా వివిశుః శరణాన్యథ ।
అనంతరం ఆ పురుషశ్రేష్ఠులు ద్రౌపది మొదలైన తమ స్త్రీలతో సంప్రదించి వ్యాయామం, కేశాలంకరణ మొదలైన పనులు చేసుకొన్నారు. తరువాత నిత్యకృత్యాలు చేసి, వారంతా దివ్యచందన భూషణాలు అలంకరించుకొన్నారు. శుభచింతనలు గల పాండవులు బ్రాహ్మణులచేత స్వస్తివాచనం చేయించుకొని మనోరంజకమైన భోజనం చేసి, శయనగృహాలను ప్రవేశించారు. (34, 35 1/2)
ఉపగీయమానా నారీభిః అస్వపన్ కురుపుంగవాః ॥ 36
స్త్రీలు తమ యశస్సును గానమ్ చేస్తూంటే ఆ కురుశ్రేష్ఠులు నిద్రించారు. (36)
జగామ తేషాం సా రాత్రిః పుణ్యా రతివిహారిణామ్ ।
స్తూయమానాశ్చ విశ్రాంతాః కాలే నిద్రామథాత్యజన్ ॥ 37
ఆ శుభరాత్రి వారికి రతివిహారాలతో గడిచింది. ప్రాతః కాలంలో వందిమాగధులు స్తోత్రం చేస్తూంటే విశ్రాంతి పొందినవారు నిద్రలేచారు. (37)
సుఖోషితాస్తే రజనీం ప్రాతః సర్వే కృతాహ్నికాః ।
సభాం రమ్యాం ప్రవివిశుః కితవైరభినందితాః ॥ 38
రాత్రి సుఖంగా గడిపిన వారందరూ ప్రొద్దుటే ఆహ్నిక కర్మలు నిర్వర్తించి జూదరులందరూ అభినందిస్తూ ఉండగా రమణీయమైన సభను ప్రవేశించారు. (38)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి యుధిష్ఠిరా సభాగమనేఽష్ట పంచాశత్తమోఽధ్యాయః ॥ 58 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిరాసభాగమనము అను ఏబది ఎనిమిదవ అధ్యాయము. (58)