59. ఏబది తొమ్మిదవ అధ్యాయము

జూదమును గురించి శకుని ధర్మరాజుల సంవాదము.

వైశంపాయన ఉవాచ
ప్రవిశ్య తాం సభాం పార్థాః యుధిష్ఠిరపురోగమాః ।
సమేత్య పార్థివాన్ సర్వాన్ పూజార్హానభిపూజ్య చ ॥ 1
యథా వయః సమేయానాః ఉపవిష్టా యథార్హతః ।
ఆసనేషు విచిత్రేషు స్పర్ధ్యాస్తరణవత్సు చ ॥ 2
వైశంపాయనుడు చెపుతున్నాడు - ఆ సభలో ప్రవేశించి యుధిష్ఠిరుడు మొదలుకొని పాండవులందరూ కలిసి గౌరవింపదగిన రాజులందరిని కలుసుకొన్నారు. వయసు ననుసరించి, అర్హతననుసరించి వారందరిని గౌరవించి తివాచీలు పరిచిన విచిత్రమైన ఆసనాల మీద పోటీకి సిద్ధమై కూర్చున్నారు. (1,2)
తేశ్హు తత్రోపవిష్టేషు సర్వేష్వథ నృపేషు చ ।
శకునిః సౌబలస్తత్ర యుధిష్ఠిరమభాషత ॥ 3
ఆ రాజులందరూ అక్కడ ఆసీనులు కాగానే సుబలసుతుడు శకుని యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు. (3)
శకుని రువాచ
ఉపస్తీర్ణా సభా రాజన్ సర్వే త్వయి కృతక్షణాః ।
అక్షానుప్త్వా దేవనస్య సమయోఽస్తు యుధిష్ఠిర ॥ 4
శకుని అంటున్నాడు - రాజా! యుధిష్ఠిరా! సభలో పాచికలాడే బల్లను పరిచారు. అందరు నీ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇక పాచికలు విసిరి జూదం ఆరంభించడానికి సమయం ఆసన్నమయింది. (4)
యుధిష్ఠిర ఉవాచ
నికృతిర్దేవనం పాపం న క్షాత్రోఽత్ర పరాక్రమః ।
న చ నీతిర్ర్ధువా రాజన్ కిం త్వం ద్యూతం ప్రశంససి ॥ 5
యుధిష్ఠిరుడు అంటున్నాడు - ఱాజా! జూదం కపటపూరితం. పాపం. ఇందులో క్షత్రియసంబంధమైన పరాక్రమానికీ చోటులేదు. నిశ్చితమైన నీతీ లేదు. నీవు జూదాన్ని ఎందుకు కొనియాడుతున్నావు? (5)
న హి మానం ప్రశంసంతి నికృతౌ కితవస్య హి ।
శకునే మైవ నో జైషీః అమార్గేన నృశంసవత్ ॥ 6
కపటంతో కూడిన జూదాన్ని గౌరవిమ్చదగినదని జూదరులు తప్ప సజ్జనులు ప్రశంసించరు. శకునీ! క్రూరుని వలె అనుచితమార్గంలో మమ్మల్ని జయించాలని అనుకోకు. (6)
శకుని రువాచ
యో వేత్తి సంఖ్యాం నికృతౌ విధిజ్ఞః
చేష్టాస్వఖిన్నః కితవోఽక్షజాసు ।
మహామతిర్యశ్చ జానాతి ద్యూతం
స వై సర్వం సహతే ప్రక్రియాసు ॥ 7
శకుని అంటున్నాడు - పాచికలు విసిరేముందే ఆ సంఖ్యను తెలుసుకొన్నవాడూ, అందులోని పద్ధతులన్నీ తెలుసుకొన్నవాడూ, పాచికలు వేయడం మొదలైన పనులన్నింటి యందు ఉత్సాహంగా ఉండేవాడూ, మిక్కిలి తెలివిగలవాడై జూదం గురించి తెలిసిన కితవుడు మాత్రమే ఆ ప్రక్రియలన్నిటి యందు ఎదురయ్యే సమస్తాన్ని సహించగలుగుతాడు. (7)
అక్షగ్లహాః సోఽభి భవేత్ పరం నః
తేనైవ దోషో భవతీహ పార్థ ।
దీవ్యామహే పార్థివ మా విశంకాం
కురుష్వ పాణం చ చిరం చ మా కృథాః ॥ 8
జూదమాడే మనలో (ఒకరిని) ఇతరుని పాచికయే ఓడిస్తుంది (విరుద్ధంగా పడడంచేత). కనుక దాని చేతనే ఇక్కడ దోషం కలుగుతోంది. (పాచికదే పాపం) పార్థా! పాచికలాడదాం. (తప్పులేదు) రాజా! సందేహించకు. పందెం వేయి. ఆలస్యం చేయకు. (8)
యుధిష్ఠిర ఉవాచ
ఏవమాహాయమసితః దేవలో మునిసత్తమః ।
ఇమాని లోకద్వారాణి యో వై భ్రామ్యతి సర్వదా ॥ 9
ఇదం వై దేవనం పాపం నికృత్యా కితవైః సహ ।
ధర్మేణ తు జయే యుద్ధౌ తత్పరం న తు దేవనమ్ ॥ 10
యుధిష్ఠిరుడు అంటున్నాడు - మునిశ్రేష్ఠుడయిన అసితదేవలుడు ఈ లోకద్వారాలన్నిటియందు సర్వదా సంచరిస్తూ ఉంటాడు. అతడు ఇలా చెప్పాడు - "జూదరులతో కలిసి మోసపూరితంగా పాచికలు ఆడడం పాపం. ధర్మబద్ధమైన విజయం యుద్ధమందే ఉంటుంది. కనుక యుద్ధతత్పరత కావాలి కాని పాచికలాట కాదు." (9,10)
నార్యా మ్లేచ్ఛంతి భాషాభిః మాయయా న చరంత్యుత ।
అజిహ్మమశఠం యుద్ధమ్ ఏతత్ సత్పురుషవ్రతమ్ ॥ 11
ఆర్యులు మాటలతో ఎవరినీ చిన్నపుచ్చరు. కపటంగా ప్రవర్తించరు. మోసంలేనిది, ధూర్తత్వం లేనిది అయిన యుద్ధమొకటే సత్పురుషులకు వ్రతం. (11)
శక్తితో బ్రాహ్మణాన్ నూనం రక్షితం ప్రయతామహే ।
తద్ వై విత్తమ్ మాతిదేవీః మాజైషీః శకునే పరాన్ ॥ 12
మేము మాధనంతో శక్తిని అనుసరించి ఉత్తములయిన బ్రాహ్మణులను రక్షించడానికే ప్రయత్నిస్తాం. ఆ ధనాన్ని నీవు జూదంలో ఒడ్డకు. శకునీ! మమ్ము ఓడించవద్దు. (12)
నికృత్యా కామయే నాహం సుఖాన్యుత ధనాని వా ।
కితవస్యేహ కృతినో వృత్తమేతన్న పూజ్యతే ॥ 13
ధూర్తత్వంతో సుఖాలను గాని, ధనాన్ని గాని నేను కోరను. సజ్జనులు జూదరి యొక్క ఈ ప్రవర్తనను గౌరవించరు. (13)
శకుని రువాచ
శ్రోత్రియః శ్రోత్రియానేతి నికృత్యైవ యుధిష్ఠిర ।
విద్వానవిదుషోఽభ్యేతి నాహుస్తాం నికృతిం జనాః ॥ 14
శకుని అంటున్నాడు - యుధిష్ఠిరా! శ్రోత్రియుడు ధూర్తత్వం చేతనే శ్రోత్రియుని చేరుకొంటాడు. (ఓడించడానికి). విద్వాంసుడు మూర్ఖులను అలాగే సమీపిస్తాడు. లోకులు దానిని నికృతి (వంచన) అనరు. (14)
అక్షైర్హి శిక్షితోఽభ్యేతి నికృత్యైవ యుధిష్ఠిర ।
విద్వానవిదుషోఽభ్యేతి నాహుస్తాం నికృతిం జనాః ॥ 15
యుధిష్ఠిరా! పాచికలతో బాగా నేర్చుకొన్నవాడు మోసంతోనే ఇతరుని సమీపిస్తాడు. విద్వాంసుడు అపండితుని అలాగే సమీపిస్తాడు. లోకులు దానిని నికృతి అనరు. (15)
అకృతాస్త్రం కృతాస్త్రశ్చ దుర్బలం బలవత్తరః ।
ఏవం కర్మసు సర్వేషు నికృత్యైవ యుధిష్ఠిర ।
విద్వానవిదుషోఽభ్యేతి నాహుస్తాం నికృతిం జనాః ॥ 16
అస్త్రవిద్యలో ఆరితేరినవాడు ఆరితేరనివానిని, మిక్కిలి బలవంతుడు బలహీనుని - ఇలాగే అన్ని కర్మల యందు నికృతియే ఉంటుంది. యుధిష్ఠిఱా! విద్వాంసుడు అపండితుని నికృతిచేతనే సమీపిస్తాడు. లోకులు దానిని నికృతి అనరు. (16)
ఏవం త్వం మామిహాభ్యేత్య నికృతిం యది మన్యసే ।
దేవనాద్ వినివర్తస్వ యది తే విద్యతే భయమ్ ॥ 17
ఇలాగే నీవు నన్ను సమీపిమ్చి ఇది నికృతి అనుకొంటే నీకు భయం ఉన్నట్లయితే జూదం నుండి తప్పుకో. (17)
యుధిష్ఠిర ఉవాచ
ఆహూతో న నివర్తేయమ్ ఇతి మే వ్రతమాహితమ్ ।
విధిశ్చ బలవాన్ రాజన్ దిష్టస్యాస్మి వశే స్థితః ॥ 18
యుధిష్ఠిరుడు అంటున్నాడు - రాజా! పిలిచిన తరువాత వెనక్కి మరలను. ఇది నా నిశ్చితమైన వ్రతం. విధి బలీయం. విధికి లోబడి ఉన్నాను. (18)
అస్మిన్ సమాగమే కేన దేవనమ్ మే భవిష్యతి ।
ప్రతిపాణశ్చ కోఽన్యోఽస్తి తతో ద్యూతం ప్రవర్తతామ్ ॥ 19
ఇక్కడ కూడిన వారందరిలో ఎవరితో నేను జూదం ఆడాలి? నాకు ఎదురు పందెం ఒడ్డేవాడు ఎవడు? ఇది నిర్ణయం అయ్యాక జూదం ప్రారంభించవచ్చు. (19)
దుర్యోధన ఉవాచ
అహం దాతాస్మి రత్నానాం ధనానామ్ చ విశాంపతే ॥ 20
మదర్థే దేవితా చాయం శకునిర్మాతులో మమ ।
దుర్యోధనుడు అంటున్నాడు - రాజా! నేను రత్నాలను, ధనాన్ని ఇచ్చేవాడిని. నా కోసం నా మామ ఈ శకుని జూదం ఆడతాడు. (20)
యుధిష్ఠిర ఉవాచ
అన్యేనాన్యస్య వై ద్యూతం విషమం ప్రతిభాతి మే ।
ఏతద్ విద్వన్నుపాదత్స్వ కామమేవం ప్రవర్తతామ్ ॥ 21
యుధిష్ఠిరుడు అంటున్నాడు - ఇతరుని కోసం ఇతరుడు జూదం ఆడడం విషమమని నాకు తోస్తోంది. విద్వాంసుడా! దీనిని తెలుసుకో. ఇచ్ఛానుసారంగా జూదం ప్రారంభమగుగాక! (21)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి యుధిష్ఠిరశకుని సంవాదే ఏకోనషష్టితమోఽధ్యాయః ॥ 59 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిర శకుని సంవాదమను ఏబది తొమ్మిదవ అధ్యాయము. (59)