57. ఏబది ఏడవ అధ్యాయము
ధృతరాష్ట్ర విదురుల సంవాదము.
వైశంపాయన ఉవాచ
మతమాజ్ఞాయ పుత్రస్య ధృతరాష్ట్రో నరాధిపః ।
మత్వా చ దుస్తరం దైవమ్ ఏతద్ రాజంశ్చకార హ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - జనమేజయా! కొడుకు అభిప్రాయం గుర్తించి మహారాజు ధృతరాష్ట్రుడు దైవం బలీయమైనదని తలచి ఇదంతా చేశాడు. (1)
అన్యాయేన తథోక్తస్తు విదురో విదుషాం వరః ।
నాభ్యానందద్ వచో భ్రాతుః వచనం చేదమబ్రవీత్ ॥ 2
పండితులలో ఉత్తముడయిన విదురుడు అలా చెప్పిన సోదరుని యొక్క అన్యాయపూర్ణమైన మాటలను హర్షించలేక ఇలా అన్నాడు. (2)
విదుర ఉవాచ
నాభినందే నృపతే ప్రైషమేతం
మైవం కృథాః కులనాశాద్ బిభేమి ।
పుత్రైర్భిన్నైః కలహస్తే ధ్రువం స్యాత్
ఏతచ్ఛంకే ద్యూతకృతే నరేంద్ర ॥ 3
విదురుడు అంటున్నాడు - మహారాజా! మీ ఈ ఆదేశాన్ని అభినందించలేను. ఇలాంటిపని చేయకండి. వంశనాశనానికి భయపడుతున్నాను. నరేంద్రా! పుత్రుల మధ్య విభేదం నిశ్చయంగా కలహానికి కారణమవుతుంది. ద్యూతం వలన నాకు ఇలాంటి సందేహం కలుగుతోంది. (3)
ధృతరాష్ట్ర ఉవాచ
నేహ క్షత్తః కలహస్తప్స్యతే మాం
న చేద్ దైవం ప్రతిలోమం భవిష్యత్ ।
ధాత్రా తు దిష్టస్య వశే కిలేదం
సర్వం జగచ్చేష్టతి న స్వతంత్రమ్ ॥ 4
ధృతరాష్ట్రుడు అంటున్నాడు - విదురా! దైవం ప్రతికూలం కాకపోతే కలహం నన్ను ఇప్పుడు బాధించదు. విధాత నిర్మించిన ఈ జగత్తు అంతా దైవానికి లోబడినదే కాని స్వతంత్రంగా ఉండదు. (4)
తదద్య విదుర ప్రాప్య రాజానం మమ శాసనాత్
క్షిప్రమానయ దుర్ధర్షం కుంతీపుత్రం యుధిష్ఠిరమ్ ॥ 5
కాబట్టి విదురా! నా ఆజ్ఞ పాటించి దుర్ధర్షుడైన కుంతీపుత్రుని యుధిష్ఠిరుని ఇప్పుడే శీఘ్రంగా తీసుకురా. (5)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి యుధిష్ఠిరానయనే సప్తపంచాశత్తమోఽధ్యాయః ॥ 57 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిరానయనయనము అను ఏబది ఏడవ అధ్యాయము. (57)