56. ఏబది ఆరవ అధ్యాయము
ధృతరాష్ట్రుడు సభానిర్మాణమునకు ఆజ్ఞాపించుట - ధర్మరాజును పిలుచుటకు విదురుని పంపుట.
శకుని రువాచ
యాం త్వమేతాం శ్రియం దృష్ట్వా పాండుపుత్రే యుధిష్ఠిరే ।
తప్యసే తాం హరిష్యామి ద్యూతేన జయతాం వర ॥ 1
శకుని అంటున్నాడు - జయశీలురలో శ్రేష్ఠుడవైన దుర్యోధనా! పాండుపుత్రుడయిన యుధిష్ఠిరుని యొక్క ఏ సంపదను చూసి నీవు బాధపడుతున్నావో దానిని జూదంలో హరిస్తాను. (1)
ఆహూయతాం పరం రాజన్ కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
అగత్వా సంశయమహమ్ అయుద్ధ్వా చ చమూముఖే ॥ 2
అక్షాన్ క్షిపన్నక్షతః సన్ విద్వానవిదుషో జయే ।
గ్లహాన్ ధనూంషి మే విద్ధి శరానక్షాంశ్చ భారత ॥ 3
రాజా! కుంతీపుత్రుడయిన యుధిష్ఠిరుని పిలువనంపు. నేను ఏ మాత్రం సందేహం లేకుండా, సేనాముఖంలో నిలిచి యుద్ధం చేయకుండా, కేవలం పాచికలు విసరుతూ ఏమాత్రం నష్టం పొందకుండా, ఇందులో విద్వాంసుడను కనుక విద్వాంసుడు కాని అతనిని జయిస్తాను. భారతా! పాచికలాటలే నా ధనుస్సులు, పాచికలే నా బాణాలు అని తెలుసుకో. (2,3)
అక్షాణామ్ హృదయం మే జ్యాం రథం విద్ధి మమాస్తరమ్ ॥ 4
పాచికలలోని రహస్యమే నావింటినారి, జూదపుబల్లయే నా రథం అని గుర్తించు. (4)
దుర్యోధన ఉవాచ
అయుముత్సహతే రాజన్ శ్రియమాహర్తుమక్షవిత్ ।
ద్యూతేన పాండుపుత్రేభ్యః తదనుజ్ఞాతుమర్హసి ॥ 5
దుర్యోధనుడు అంటున్నాడు - రాజా! అక్షవిద్యానిపుణుడు అయిన ఇతడు జూదంతో పాండుపుత్రుల నుండి సంపదను హరించడానికి ఉత్సాహమ్ చూపుతున్నాడు. కాబట్టి మీరు అనుమతించండి. (5)
ధృతరాష్ట్ర ఉవాచ
స్థితోఽస్మి శాసనే భ్రాతుః విదురస్య మహాత్మనః ।
తేన సంగమ్య వేత్స్యామి కార్యస్యాస్య వినిశ్చయమ్ ॥ 6
ధృతరాష్ట్రుడు చెపుతున్నాడు - నేను నా సోదరుడు మహాత్ముడు అయిన విదురుని శాసనంలో ఉన్నాను. అతనితో కలిసి ఈ కార్యం ఎలా నిశ్చయించాలో తెలుసుకొంటాను. (6)
దుర్యోధన ఉవాచ
వ్య్పనేష్యతి తే బుధ్ధిం విదురో ముక్తసంశయః ।
పాండవానాం హితే యుక్తః న తథా మమ కౌరవ ॥ 7
దుర్యోధనుడు అంటున్నాడు - విదురుడు ఏ మాత్రం సంశయించడు. నీబుద్ధిని మరల్చివేస్తాడు. పాండవుల యొక్క హితానికి కట్టుబడినవాడు, నా హితాన్ని కోరడు. (7)
నారభేతాన్యసామర్థ్యాత్ పురుషః కార్యమాత్మనః ।
మతిసామ్యం ద్వయోర్నాస్తి కార్యేషు కురునందన ॥ 8
మానవుడు తన పనిని ఇతరుల సామర్థ్యం మీద ఆధారపడి ప్రారంభించకూడదు. కార్యసాధనలో ఏ ఇరువురి బుద్ధి ఒకేలా ఉండదు. (8)
భయం పరిహరన్ మందః ఆత్మానం పరిపాలయన్ ।
వర్షాసు క్లిన్నకటవత్ తిష్ఠన్నేవావసీదతి ॥ 9
మందబుద్ధి భయాన్ని పోగొట్టుకొమ్టూ, తన్ను తాను సంబాళించుకొంటూ ఉండగానే వర్షాలకు తడిసిన చాపలా ఉన్నవాడు ఉన్నట్లే నశించిపోతాడు. (9)
న వ్యాధయో నాపి యమః ప్రాప్తుం శ్రేయః ప్రతీక్షతే ।
యావదేవ భవేత్ కల్పః తావచ్ఛ్రేయః సమాచరేత్ ॥ 10
వ్యాధులు కాని, యముడు కాని శుభాలు కలిగేవరకు వేచి ఉండరు. ఎంతవరకు సామర్థ్యం ఉంటుందో అంత వరకు శుభాలకోసం ప్రయత్నించవలసినదే. (10)
ధృతరాష్ట్ర ఉవాచ
సర్వథా పుత్ర బలిభిః విగ్రహో మే న రోచతే ।
వైరం వికారం సృజతి తద్వై శస్త్రమనాయసమ్ ॥ 11
ధృతరాష్ట్రుడు అంటున్నాడు - నాయనా! బలవంతులతో విరోధ నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. వైరం విరూపాన్ని సృష్టిస్తుంది. అది లోహంతో చేయబడని ఆయుధం. (11)
అనర్థమర్థం మన్యసే రాజపుత్ర
సంగ్రంథనం కలహస్యాతి ఘోరమ్ ।
తద్ వై ప్రవృత్తం తు యథా కథంచిత్
సృజేదసీన్ నిశితాన్ సాయకాంశ్చ ॥ 12
రాజకుమారా! అనర్థాన్ని (ద్యూతాన్ని) అర్ఠం అనుకొంటున్నావు. జూదం అతిఘోరమైన కలహాన్ని ముడిపడేలా చేస్తుంది. ఏదో ఒక రీతిగా అది ప్రారంభింపబడితే పదునైన కత్తులను, బాణాలను కూడా సృష్టిస్తుంది. (యుద్ధానికి దారి తీస్తుందని భావం) (12)
దుర్యోధన ఉవాచ
ద్యూతే పురాణైర్వ్యవహారః ప్రణీతః
తత్రాత్యయో నాస్తి న సంప్రహారః ।
తద్ రోచతాం శకునేర్వాక్యమద్య
సభాం క్షిప్రం త్వమిహాజ్ఞాపయస్వ ॥ 13
దుర్యోధనుడు అంటున్నాడు - ప్రాచీనులు కూడా ద్యూత వ్యవహారం నడిపి ఉన్నారు. దాని వలన దోషమూ లేదు, యుద్ధమూ రాదు. కాబట్టి ఇప్పుడు శకుని మాటను అంగీకరించు. వెంటనే ఇక్కడ సభానిర్మాణానికి ఆజ్ఞాపించు. (13)
స్వర్గద్వారం దీవ్యతాం నో విశిష్టం
తద్వర్తినాం చాపి తథైవ యుక్తమ్ ।
భవేదేవం హ్యాత్మనా తుల్యమేవ
దురోదరం పాండవైస్త్వం కురుష్వ ॥ 14
అది మాకు విశిష్టమైన స్వర్గద్వారం ఇచ్చుగాక! అందులో చరించే వారికి కూడా అలాగే ఉచితంగా ఉంటుంది. ఇలా సమానంగానే అగుగాక. పాండవులతో జూదాన్ని నీవు ఏర్పాటు చేయి. (14)
ధృతరాష్ట్ర ఉవాచ
వాక్యం న మే రోచతే యత్ త్వయోక్తం
యత్ తే ప్రియం తత్ క్రియతామ్ నరేంద్ర ।
పశ్చాత్ తప్స్యసే తదుపాక్రమ్య వాక్యం
న హీదృశం భావివచో హి ధర్మ్యమ్ ॥ 15
ధృతరాష్ట్రుడు అంటున్నాడు - నీవు చెప్పినది నాకు రుచించడం లేదు. నరేంద్రా! నీకు ఇష్టమైనదే జరుగును గాక! జూదం ఆరంభిస్తే, ఆపైన నా మాటలు జ్ఞప్తికి వచ్చిఇ బాధపడతావు. ఇటువంటి మాటలు ధర్మయుక్తమైనవి కావు. (15)
దృష్టం హ్యేతద్ విదురేణైవ సర్వం
విపశ్చితా బుద్ధివిద్యానుగేన ।
తదేవైతదవశస్యాభ్యుపైతి
మహద్ భయం క్షత్రియజీవఘాతి ॥ 16
బుద్ధిని విద్యను అనుసరిమ్చే పండితుడైన విదురునికి ఇదంతా ముందే తెలుసు. క్షత్రియుల జీవితాలను నాశనం చేసే ఈ మహాభయం అవశుడవైన నాకు కలుగుతోంది. (16)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా ధృతరాష్ట్రో మనీషీ
దైవం మత్వా పరమం దుస్తరం చ ।
శశాసోచ్చైః పురుషాన్ పుత్రవాక్యే
స్థితో రాజా దైవసమ్మూఢచేతాః ॥ 17
సహస్రస్తంభాం హేమవైదూర్యచిత్రాం
శతద్వారాం తోరణస్ఫాటికాఖ్యామ్ ।
సభామగ్ర్యాం క్రోశమాత్రాయతాం మే
తద్విస్తారామాశు కుర్వంతు యుక్తాః ॥ 18
వైశంపాయనుడు చెపుతున్నాడు - జనమేజయా! ఇలా అని బుద్ధిమంతుడైన ధృతరాష్ట్రుడు దైవాన్ని పరమదుస్తరమైనదానిగా తలచి, విధివశాత్తు మూఢచిత్తుడై పుత్రునిమాటపై సేవకులకు గట్టిగా ఆజ్ఞాపించాడు - "ఒక క్రోసు పొడుగు వెడల్పులు కలిగి, హేమవైడూర్యఖచితాలైన వేయిస్తంభాలతో, వంద ద్వారాలతో తోరణస్ఫాటికమనే పేరు గల ఒక అందమైన సభను వెంటనే తత్పరులై నిర్మించండి" అని (17,18)
శ్రుత్వా తస్య త్వరితా నిర్విశంకాః
ప్రాజ్ఞా దక్షాస్తాం తదా చక్రురాశు ।
సర్వద్రవ్యాణ్యుపజహ్రుః సభాయాః
సహస్రశః శిల్పినశ్చైవ యుక్తాః ॥ 19
అతని ఆజ్ఞను విని వేగవంతులై, చతురులై, బుద్ధిమంతులయిన వేలకొద్దీ శిల్పులు తత్పరులై ఆ సభను శీఘ్రంగా నిర్మించారు. సభలో అన్ని పదార్థాలు చక్కగా అమర్చారు. (19)
కాలేనాల్పేనాథ నిష్ఠాం గతాం తాం
సభాం రమ్యాం బహురత్నాం విచిత్రామ్ ।
చిత్రైర్హైమైరాసనైరభ్యుపేతాం
ఆచఖ్యుస్తే తస్య రాజ్ఞః ప్రతీతాః ॥ 20
అతిస్వల్పకాలంలోనే నిర్మించబడిన ఆసభ అనేక రత్నాలతో విచిత్రంగా, అందంగా ఉంది. చిత్రమైన బంగారు ఆసనాలను అందులో అలంకరించారు. ఈ విషయాన్ని విశ్వాసపాత్రులైన సేవకులు రాజు దగ్గరకు వెళ్లి చెప్పారు. (20)
తతో విద్వాన్ విదురం మంత్రిముఖ్యం
ఉవాచేదం ధృతరాష్ట్రో నరేంద్రః ।
యుధిష్ఠిరం రాజపుత్రం చ గత్వా
మద్వాక్యేన క్షిప్ర మిహానయస్వ ॥ 21
ఆ తరువాత విజ్ఞానియైన ధృతరాష్ట్ర నరేంద్రుడు మంత్రి అయిన విదురునితో "రాజపుత్రుడైన యుధిష్ఠిరుని వద్దకు వెళ్లి నా మాటగా అతనిని వెంటనే ఇక్కడకు తీసుకురా." (21)
సభేయం మే బహురత్నా విచిత్రా
శయ్యాసనైరుపపన్నా మహార్హైః ।
సా దృశ్యతాం భ్రాతృభిః సార్ధమేత్య
సుహృద్ ద్యూతం వర్తతామత్ర చేతి ॥ 22
'మా సభ బహురత్నాలతో విచిత్రమై, చాలా విలువైన శయ్యలతో ఆసనాలతో నిండి ఉంది. తమ్ముళ్లతో కూడి వచ్చి దీనిని చూడు. ఇక్కడ సుహృద్ధ్యూతం కూడా జరుగుతుంది' అని అతనితో చెప్పు" అన్నాడు. (22)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి దుర్యోధనయనే షట్ పంచాశత్తమోఽధ్యాయః ॥ 56 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున దుర్యోధనయనము అను ఏబది ఆరవ అధ్యాయము. (56)