31. ముప్పది ఒకటవ అధ్యాయము
సహదేవుని దక్షిణ దిగ్విజయము.
వైశంపాయన ఉవాచ
తథైవ సహదేవోఽపి ధర్మరాజేన పూజితః ।
మహత్యా సేనయా రాజన్ ప్రయయౌ దక్షిణాం దిశమ్ ॥ 1
వైశంపాయనుడు పలికాడు - ఆ విధంగానే సహదేవుడు ధర్మరాజుచే సమ్మానితుడై గొప్పసేనతో దక్షిణదిక్కుకు బయలుదేరాడు. (1)
స శూరసేనాన్ కార్త్స్న్యేన పూర్వమేవాజయత్ ప్రభుః ।
మత్స్యరాజం చ కౌరవ్యః వశే చక్రే బలాద్ బలీ ॥ 2
శక్తిశాలి అయిన సహదేవుడు అన్నిటికంటె ముందు శూరసేనదేశ వాసులను ఓడించి తిరిగి మత్స్యరాజు విరాటుని తన అధీనం చేసుకొన్నాడు. (2)
అధిరాజాధిపం చైవ దంతవక్ర్తం మహాబలమ్ ।
జిగాయ కరదం చైవ కృత్వా రాజ్యే న్యవేశయత్ ॥ 3
రాజాధిపతి బలసంపన్నుడు దంతవక్ర్తుని జయించి కప్పంకట్టేవిధంగా చేసి మళ్ళీరాజ్యంలో నియమించాడు. (3)
సుకుమారం వశే చక్రే సుమిత్రం చ నరాధిపమ్ ।
తథైవాపరమత్స్యాంశ్చ వ్యజయత్ స పటచ్చరాన్ ॥ 4
నిషాదభూమిం గోశృంగం పర్వతప్రవరం తథా ।
తరసైవాజయద్ ధీమాన్ శ్రేణిమంతం చ పార్థివమ్ ॥ 5
పిమ్మట సుకుమారుని, సుమిత్రుని వశం చేసుకొన్నాడు. అపరమత్స్యదేశాన్ని, పటచ్చరులనూ జయించాడు. నిషాదదేశం, పర్వతశ్రేష్ఠం, గోశృంగం జయించి సహదేవుడు శ్రేణిమంతుని వశపరచుకున్నాడు. (4,5)
నరరాష్ట్రం చ నిర్జిత్య కుంతిభోజముపాద్రవత్ ।
ప్రీతిపూర్వం చ తస్యాసౌ ప్రతిజగ్రాహ శాసనమ్ ॥ 6
నరరాష్ట్రాన్ని జయించి కుంతిభోజునిపై ఆక్రమణ చేశాడు. కుంతిభోజుడు ప్రసన్నతతో అతని ఆజ్ఞను స్వీకరించాడు. (6)
తతశ్చర్మణ్వతీకూలే జంభకస్యాత్మజం నృపమ్ ।
దదర్శ వాసుదేవేన శేషితం పూర్వవైరిణా ॥ 7
తరువాత చర్మణ్వతీ తీరంలో జంభకుని కొడుకును చూచాడు. జంభకుడు శ్రీకృష్ణుని శత్రువు. శ్రీకృష్ణుడతనిని చంపకుండా వదిలివేశాడు. (7)
చక్రే తేన స సంగ్రామం సహదేవేన భారత ।
స తమాజౌ వినిర్జిత్య దక్షిణాభిముఖో యయౌ ॥ 8
అతడు సహదేవునితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అతనిని సంగ్రామంలో అణచివేసి దక్షిణదిక్కుగా బయలుదేరాడు సహదేవుడు. (8)
సేకానపరసేకాంశ్చ వ్యజయత్ సుమహాబలః ।
కరం తేభ్య ఉపాదాయ రత్నాని వివిధాని చ ॥ 9
తతస్తేనైవ సహితః నర్మదామభితో యయౌ ।
సేక, అపరసేక దేశాలపై విజయం సాధించాడు. వారి నుంచి అనేక రత్నరాసులను కానుకలుగా పొందాడు. సేకాధిపతితో కలిసి నర్మదానదివైపు సాగాడు. (9 1/2)
విందానువిందావావంత్యే సైన్యేన మహతాఽఽవృతే ।
జిగాయ సమరే వీరౌ ఆశ్వినేయః ప్రతాపవాన్ ॥ 10
అవంతీదేశరాజులు విందానువిందులు గొప్పసైన్యం తీసికొని యుద్ధానికి ఎదురురాగా అశ్వినీదేవతల కుమారుడు, ప్రతాపవంతుడు అయిన సహదేవుడు అవలీలగా ఓడించాడు. (10)
తతో రత్నాన్యుపాదాయ పురం భోజకటం యయౌ ।
తత్ర యుద్ధమభూద్ రాజన్ దివసద్వయమచ్యుత ॥ 11
వారి నుంచి రత్నాలను స్వీకరించి భోజకటనగరం చేరాడు. రాజా! అచ్యుతా! సహదేవుడు అక్కడ రెండు రోజులు యుద్ధం చేశాడు. (11)
స విజిత్య దురాధర్షం భీష్మకం మాద్రినందనః ।
కోసలాధిపతిం చైవ తథా వేణాతటాధిపమ్ ॥ 12
కాంతారకాంశ్చ సమరే తథా ప్రాక్కోసలాన్ నృపాన్ ।
నాటకేయాంశ్చ సమరే తథా హేరంబకాన్ యుధి ॥ 13
యుద్ధాన ఎదురులేని సహదేవుడు భీష్మకుని జయిమ్చి కోసలరాజు, వేణానది ఒడ్డునున్న నేతలను, కాంతారక, పూర్వకోసలరాజులను యుద్ధంలో ఓడించాడు. పిమ్మట నాటకేయ, హేరంబకులను జయించాడు. (12,13)
మారుధం చ వినిర్జిత్య రమ్యగ్రామమథోబలాత్ ।
నాచీనానర్బుకాంశ్చైవ రాజ్ఞశ్చైవ మహాబలః ॥ 14
తాంస్తానాటవికాన్ సర్వాన్ అజయత్ పాండునందనః ।
వాతాధిపం చ నృపతిం వశే చక్రే మహాబలః ॥ 15
మారుధుని, రమ్యగ్రాముని తనబలంతో వశంలోకి తెచ్చి, నాచీనులు, అర్బుకులు, మొదలయిన వనేచరరాజులను ఓడించాడు. తరువాత బలశాలి సహదేవుడు వాతాధిపుని వశపరచుకొన్నాడు. (14,15)
పుళిందాంశ్చ రణే జిత్వా యయౌ దక్షిణతః పురః ।
యుయుధే పాండ్యరాజేన దివసం నకులానుజః ॥ 16
పుళిందులను సమరంలో గెలిచి సహదేవుడు దక్షిణంగా ముందుకు సాగాడు. పాండ్యరాజుతో ఒక రోజంతా యుద్ధం చేశాడు. (16)
తాం జిత్వా స మహాబాహుః ప్రయయా దక్షిణాపథమ్ ।
గుహామాసాదయామాస కిష్కింధాం లోకవిశ్రుతామ్ ॥ 17
మహాబాహువయిన సహదేవుడు అతనిని జయించి, దక్షిణాపథానికి వెళ్లాడు. అక్కడ లోకప్రసిద్ధినొందిన కిష్కింధాగుహను చేరాడు. (17)
తత్ర వానరరాజ్యాభ్యాం మైందేన ద్వివిదేన చ ।
యుయుధే దివసాన్ సప్త న చ తౌ వికృతిం గతౌ ॥ 18
అక్కడ వానరరాజులు మైందద్వివిదులతో వారంరోజులు పోరుసల్పినా వారిలో కొంచెం కూడ అలసట రాలేదు. (18)
తతస్తుష్టౌ మహాత్మానౌ సహదేవాయ వానరౌ ।
ఊచతుశ్చైవ సంహృష్టౌ ప్రీతిపూర్వమిదం వచః ॥ 19
మహాత్ముడు వానరులిరువురు మిక్కిలి ప్రసన్నులై ప్రేమతో సహదేవునితో ఇలా పలికారు. (19)
గచ్ఛ పాండవశార్దూల రత్నాన్యాదాయ సర్వశః ।
అవిఘ్నమస్తు కార్యాయ ధర్మరాజాయ ధీమతే ॥ 20
పాండవశ్రేష్ఠా! మా నుంచి రత్నాలను కానుకగా పొంది వెళ్లు. బుద్ధిమంతుడైన ధర్మరాజు కార్యం విఘ్నం కాకూడదు. (20)
తతో రత్నాన్యుపాదాయ పురీం మాహిష్మతీం యయౌ ।
తత్ర నీలేన రాజ్ఞా సః చక్రే యుద్ధమ్ నరర్షభః ॥ 21
వారి నుంచి రత్నాలను స్వీకరించి సహదేవుడు మాహిష్మతీ నగరానికి చేరాడు. అక్కడ నీలుడనే రాజుతో గొప్పయుద్ధం చేశాడు. (21)
పాండవః పరవీరఘ్నః సహదేవః ప్రతాపవాన్ ।
తతోఽస్య సుమహద్ యుద్ధమ్ ఆసీద్ భీరుభయంకరమ్ ॥ 22
సైన్యక్షయకరం చైవ ప్రాణానామ్ సంశయావహమ్ ।
చక్రే తస్య హి సాహాయ్యం భగవాన్ హవ్యవాహనః ॥ 23
పరవీరులను పడగొట్టగల ప్రతాపవంతుడు సహదేవుడు నీలునితో పిరికివారికి భయం కలిగేటట్లు యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సైన్యం నశించింది. ప్రాణాలకు సందేహం కలిగింది. ఆ సమయంలో అగ్నిదేవుడు నీలునికి సహాయం చేశాడు. (22,23)
తతో రథా హయా నాగాః పురుషాః కవచాని చ ।
ప్రదీప్తాని వ్యదృశ్యంత సహదేవబలే తదా ॥ 24
సహదేవుని సైన్యంలో రథాలు, గుఱ్ఱాలు, ఏనుగులు, పురుషులు, కవచాలు కూడ అగ్నితో మండుతున్నట్లు కన్పించాయి. (24)
తతః సుసంభ్రాంతమనాః బభూవ కురునందనః ।
నోత్తరం ప్రతివక్తుం చ శక్తోఽభూజ్జనమేజయ ॥ 25
అనంతరం సహదేవుడు తొట్రుపాటుపడి ప్రతీకారం కూడ చేయలేకపోయాడు. (25)
జనమేజయ ఉవాచ
కిమిర్థం భగవాన్ వహ్నిః ప్రత్యమిత్రోఽభవద్ యుధి ।
సహదేవస్య యజ్ఞార్థం ఘటమానస్య వై ద్విజ ॥ 26
జనమేజయుడు అన్నాడు - సహదేవుడు రాజసూయయాగం కోసం జైత్రయాత్ర చేస్తున్న సమయంలో అగ్ని అతనికి విరోధి ఎందుకు అయ్యాడు? (26)
వైశంపాయన ఉవాచ
తత్ర మాహిష్మతీవాసీ భగవాన్ హవ్యవాహనః ।
శ్రూయతే హి గృహీతో వై పురస్తాత్ పారదారికః ॥ 27
వైశంపాయనుడు పలికాడు - మాహిష్మతీనగరంలో నివసించే అగ్నికి ఒకానొక సమయంలో రాజు నీలుని పుత్రిక సుదర్శనపై ఆసక్తి కలిగింది అని విన్నాను. (27)
నీలస్య రాజ్ఞో దుహితా బభూవాతీవశోభనా ।
సాగ్నిహోత్రముపాతిష్ఠద్ బోధనాయ పితుః సదా ॥ 28
నీలుని పుత్రిక చాల అందమైనది. ఆమె ఎల్లప్పుడు అగ్నిహోత్రగృహంలో అగ్నిని రాజేస్తూ ఉండేది. (28)
వ్యజనైర్ధూయమానోఽపి తావత్ ప్రజ్వలతే న సః ।
యావచ్చారుపుటౌష్ఠేన వాయునా న విధూయతే ॥ 29
వింజామరలచే వీచినా అగ్ని రాజుకొనటం లేదు. కాని ఆమె పెదవుల మీది గాలి తాకినప్పుడే ప్రజ్వలించసాగాడు. (29)
తతః స భగవానగ్నిః చకమే తాం సుదర్శనామ్ ।
నీలస్య రాజ్ఞః సర్వేషామ్ ఉపనీతశ్చ సోఽభవత్ ॥ 30
పిమ్మట అగ్ని సుదర్శనను కోరాడు. ఈ విషయాన్ని నీలుడు, ఆ రాజ్యంలోని పౌరులు తెలుసుకున్నారు. (30)
తతో బ్రాహ్మణరూపేణ రమమాణో యదృచ్ఛయా ।
చకమే తాం వరారోహాం కన్యాముత్పలలోచనామ్ ।
తం తు రాజా యథాశాస్త్రమ్ అశాసద్ ధార్మికస్తదా ॥ 31
ఒకరోజున బ్రాహ్మణరూపంలో తన ఇచ్ఛానుసారం తిరుగుతూ కలువల వంటి కళ్ళుగలిగి, సర్వాంగసుందరి అయిన సుదర్శన వద్దకు వచ్చి తన కామభావాన్ని ప్రకటించాడు. ధర్మాత్ముడైన నీలుడు శాస్త్రమర్యాదతో ఆ బ్రాహ్మణుని శాసించాడు. (31)
ప్రజజ్జ్వాల తతః కోపాద్ భగవాన్ హవ్యవాహనః ।
తం దృష్ట్వా విస్మితో రాజా జగామ శిరసావనిమ్ ॥ 32
కోపంతో అగ్ని స్వస్వరూపంలొ మండిపోసాగాడు. అది చూచి రాజు నీలుడు ఆశ్చర్యపోయాడు. తల నేలకు ఆనించి అగ్నికి నమస్కారం చేశాడు. (32)
తతః కాలేన తాం కన్యాం తథైవ హి తదా నృపః ।
ప్రదదౌ విప్రరూపాయ వహ్నయే శిరసా నతః ॥ 33
ప్రతిగృహ్య చ తాం సుభ్రూం నీలరాజ్ఞః సుతాం తదా ।
చక్రే ప్రసాదం భగవాన్ తస్య రాజ్ఞో విభావసుః ॥ 34
వివాహయోగ్యం అయిన సమయం రాగా రాజు నీలుడు బ్రాహ్మణరూపం ధరించిన అగ్నికి సుదర్శనను అప్పగించి అతని పాదాలపై శిరస్సు ఉంచి అభివాదం చేశాడు. సుదర్శనను గ్రహించిన అగ్ని నీలునిపై తన అనుగ్రహాన్ని ఇలా ప్రకటించాడు. (33,34)
వరేణచ్ఛందయామాస తం నృపం స్విష్టకృత్తమః ।
అభయం చ స జగ్రాహ స్వసైన్యే వై మహీపతిః ॥ 35
అగ్ని తన అభీష్టాన్ని నెరవేర్చిన నీలుని వరం కోరుకొమ్మని నిర్బంధించాడు. రాజు తనసేనకు అభయం ఇమ్మని ప్రార్థించాడు. (35)
తతః ప్రభృతి యే కేచిదజ్ఞానాత్ తాం పురీం నృపాః ।
జిగీషంతి బలాద్ రాజన్ తే దహ్యంతే స్మ వహ్నినా ॥ 36
అది మొదలు అజ్ఞానంతో ఆ నగరాన్ని గెలవాలనుకొన్న వారిని అగ్ని తన జ్వాలలతో దహించేవాడు. (36)
తస్యాం పుర్యాం తదా చైవ మాహిష్మత్యాం కురూద్వహ ।
బభూవురనతిగ్రాహ్యా యోషితశ్ఛందతః కిల ॥ 37
అలా మాహిష్మతీనగరాన స్త్రీలు స్వేచ్ఛగా గ్రహింప వీలుకాని వారు అయ్యారు. (37)
ఏవమగ్నిర్వరం ప్రాదాత్ స్త్రీణామప్రతివారణే ।
వరిణ్యస్తత్ర నార్యో హి యథేష్టం విచరంత్యుత ॥ 38
అగ్ని స్త్రీలకు ఈ విధంగా వరం ఇచ్చాడు. అగ్ని ప్రతికూలత వలన స్త్రీలకు స్వయంగా వరులనిర్భంధం లేకుండా పోయింది. అందువల్ల ఆ స్త్రీలు స్వేచ్ఛగా వరులను కోరేవారు. (38)
వర్జయంతి చ రాజానః తత్ పురం భరతర్షభ ।
భయాదగ్నేర్మహారాహ తదాప్రభృతి సర్వదా ॥ 39
అప్పటి నుండి రాజులందరు అగ్నిభయం వల్ల రాజ్యాన్ని చేరక దూరంగా ఉండిపోయారు. (39)
సహదేవస్తు ధర్మాత్మా సైన్యం దృష్ట్వా భయార్దితమ్ ।
పరీతమగ్నినా రాజన్ నాకంపత యథాచలః ।
ఉపస్పృశ్య శుచిర్భూత్వా సోఽబ్రవీత్ పావకం తతః ॥ 40
ధర్మాత్ముడైన సహదేవుడు అగ్నిచే ఆవృతం అయి భయపడుతున్న తన సైన్యాన్ని చూచి పర్వతంలా నిశ్చలుడై ఆచమనం చేసి పవిత్రుడై అగ్నిని ఇలా వేడుకొన్నాడు. (40)
సహదేవ ఉవాచ
త్వదర్థోఽయం సమారంభః కృష్ణవర్త్మన్ నమోఽస్తు తే ।
ముఖం త్వమసి దేవానాం యజ్ఞస్త్వమసి పావక ॥ 41
సహదేవుడు పలికాడు - కృష్ణవర్త్మా! నీ కొరకే ఈ నా ప్రయత్నం. నీకు నమస్కారం. నీవు దేవతలకందరికి ముఖరూపుడవు, యజ్ఞస్వరూపుడవు. (41)
పావనాత్ పావకశ్చాసి వహనాద్ధవ్యవాహనః ।
వేదాస్త్వదర్థం జాతా వై జాతవేదాస్తతో హ్యపి ॥ 42
అందర్నీ పవిత్రులను చేయటం వల్ల పావకుడవు. వహించటం వల్ల హవ్యవాహకుడవు. వేదాలు నీకొరకే పుట్టాయి. అందుచే నీవు జాతవేదుడవు. (42)
చిత్రభానుః సురేశశ్చ అనలస్త్వం విభావసో ।
స్వర్గద్వారస్పృశశ్చాసి హుతాశో జ్వలనం శిఖీ ॥ 43
అగ్నీ! నీవు చిత్రభానుడవు, సురేశుడవు, అనలుడవు. నీవు ఎల్లప్పుడు స్వర్గద్వారాలను స్పృశిస్తావు. ఆహుతులను భుజిస్తావు కనుక హుతాశుడవు. ప్రజ్వలించటం చేత జ్వలనుడవు. శిఖలుండటంచేత శిథివి అయ్యావు. (43)
వైశ్వానరస్త్వం పింగేశః ప్లవంగో భూరితేజసః ।
కుమారసూస్త్వం భగవాన్ రుద్రగర్భో హిరణ్యకృత్ ॥ 44
నీవే వైశ్వానరుడు, పింగేశుడు, ప్లవంగుడు, భూరితేజుడు అని పేర్లు ధరించావు. కుమారస్వామి జన్మకు కారణభూతుడవు, ఐశ్వర్యమివ్వడం చేత భగవంతుడవు. రుద్రవీర్యధారణచే రుద్రగర్భుడవు. బంగారాన్ని పుట్టించటం చేత హిరణ్యకృత్తువు. (44)
అగ్నిర్దదాతు మే తేజః వాయుః ప్రాణం దదాతు మే ।
పృథివీ బలమాదధ్యాత్ శివం చాపో దిశంతు మే ॥ 45
అగ్ని నాకు తేజస్సునూ, వాయువు ప్రాణశక్తినీ, భూమి బలాన్నీ, నీరు శుభాన్నీ ఇచ్చుగాక. (45)
అపాంగర్భ మహాసత్త్వ జాతవేదః సురేశ్వర ।
దేవానాం ముఖమగ్నే త్వం సత్యేన విపునీహి మామ్ ॥ 46
బలాన్ని ప్రకటించగల మహాసత్త్వా, జాతవేదా, సురేశ్వరా! అగ్నీ! నీవు దేవతల ముఖానివి. మీ సత్యప్రభావం చేత నన్ను పవిత్రుని చెయ్యి. (46)
ఋషిభిర్బ్రాహ్మణైశ్చైవ దైవతైరసురైరపి ।
నిత్యం సుహుత యజ్ఞేషు సత్యేన విపునీహి మామ్ ॥ 47
ఋషులు, బ్రాహ్మణులు, దేవతలు, అసురులు ఎల్లప్పుడు యజ్ఞసమయాన నీలో ఆహుతులు వేస్తారు. నీ సత్యప్రభావం చేత నన్ను పవిత్రం చెయ్యి. (47)
ధూమకేతుః శిఖీ చ త్వం పాపహానిలసంభవః ।
సర్వప్రాణిషు నిత్యస్థః సత్యేన విపునీహి మామ్ ॥ 48
ధూమమే నీ ధ్వజం. శిఖలతో నీవు ప్రకాశిస్తావు. పాపాలను పోగొడతావు. వాయుకారణంగా ప్రకటం అవుతావు. ప్రాణులందరిలో నీవు దాగి ఉన్నావు. నీ సత్యప్రభావం చేత నన్ను పవిత్రం చెయ్యి. (48)
ఏవం స్తుతోఽసి భగవన్ ప్రీతేన శుచినా మయా ।
తుష్టిం పుష్టిం శ్రుతిం చైవ ప్రీతిం చాగ్నే ప్రయచ్ఛ మే ॥ 49
నేను పవిత్రుడనై నిన్నీవిధంగా స్తోత్రం చేశాను. అగ్నిదేవా! తుష్టి, పుష్టి, శ్రవణశక్తి, శాస్త్రజ్ఞానము, ప్రీతినీ నాకు ఇమ్ము. (49)
వైశంపాయన ఉవాచ
ఇత్యేవమ్ మంత్రమాగ్నేయం పఠన్ యో జుహుయాద్ విభుమ్ ।
బుద్ధిమాన్ సతతం దాంతః సర్వపాపైః ప్రముచ్యతే ॥ 50
వైశపాయనుడు పలికాడు - ద్విజుడు పైన చెప్పిన ప్రకారం శ్లోకరూపంగా ఆగ్నేయమంత్రాలను చదువుతూ హోమం చేస్తే వాడు జితేంద్రియుడవుతాడు. వాని పాపాలు అన్నీ పోతాయి. (50)
సహదేవ ఉవాచ
యజ్ఞవిఘ్నమిమం కర్తుం నార్హస్త్వం హవ్యవాహన ।
సహదేవుడు అన్నాడు - హవ్యవాహనా! నీవు ఈ యజ్ఞానికి విఘ్నమ్ చేయ తగదు. (50 1/2)
ఏవముక్త్వా తు మాద్రేయః కుశైరాస్తీర్య మేదినీమ్ ॥ 51
విధివత్ పురుషవ్యాఘ్రః పావకం ప్రత్యుపావిశత్ ।
ప్రముఖే తస్య సైన్యస్య భీతోద్విగ్నస్య భారత ॥ 52
ఇట్లు పలికి నరశ్రేష్ఠుడైన సహదేవుడు దర్భలను భూమిపై పరచుకొని భయభీతులై, ఉద్విగ్నులైన తన సేనలముందు శాస్త్రానుసారం అగ్నిని వెలిగించుకొని ఆసీనుడయ్యాడు. (51,52)
న చైనమత్యగాద్ వహ్నిః వేలామివ మహోదధిః ।
తముపేత్య శనైర్వహ్నిః ఉవాచ కురునందనమ్ ॥ 53
సహదేవం నృణాం దేవం సాంత్వపూర్వమిదం వచః ।
ఉత్తిష్ఠోత్తిష్ఠ కౌరవ్య జిజ్ఞాసేయం కృతా మయా ।
వేద్మి సర్వమభిప్రాయం తవ ధర్మసుతస్య చ ॥ 54
సముద్రం చెలియలికట్టను అతిక్రమించలేనట్లు సహదేవుని దాటి అగ్ని అతనిసైన్యాన్ని చేరలేకపోయాడు. కురుకులానందకరుడైన సహదేవుని సమీపానికి అగ్ని మెల్లమెల్లగా చేరి అనునయిస్తూ అతనితో ఇలా అన్నాడు. 'కౌరవ్యుడా! లెమ్ము, లెమ్ము, నేను నిన్నీవిధంగా పరీక్షించాను. నీ అభిప్రాయాన్నీ, ధర్మపరుడైన నీ అన్న ధర్మజుని అభిప్రాయాన్నీ తెలుసుకొన్నాను. (53,54)
మయా తు రక్షితవ్యేయం పురీ భరతసత్తమ ।
యావద్ రాజ్ఞో హి నీలస్య కులే వంశధరా ఇతి ॥ 55
ఈప్సితం తు కరిష్యామి మనసస్తవ పాండవ ॥ 56
భరతశ్రేష్ఠా! నీలరాజసంతతి రాజులుగా ఉన్నంత వరకు నేనీ నగరాన్ని రక్షించాలి. నీ అభీష్టాన్ని నెరవేరుస్తాను. కోరుకో. (55,56)
తత ఉత్థాయ హృష్టాత్మా ప్రాంజలిః శిరసా నతః ।
పూజయామాస మాద్రేయః పావకం భరతర్షబ ॥ 57
ఇది విని సహదేవుడు ప్రసన్నచిత్తుడై లేచి శిరసువంచి నమస్కరించి అగ్నిదేవుని పూజించాడు. (57)
పావకే వినివృత్తే తు నీలో రాజాభ్యగాత్ తదా ।
పావకస్యాజ్ఞయా చైనమ్ అర్చయామాస పార్థివః ॥ 58
సత్కారేన నరవ్యాఘ్రం సహదేవం యుధాంపతిమ్ ।
అగ్ని వెనుతిరిగిన పిమ్మట రాజు నీలుడు అక్కడకు వచ్చాడు. అగ్ని ఆజ్ఞానుసారం నరశ్రేష్ఠుడైన సహదేవుడ్ని నీలుడు సత్కారపూర్వకంగా పూజించాడు. (58 1/2)
ప్రతిగృహ్య చ తాం పూజాం కరే చ వినివేశ్య చ ॥ 59
మాద్రీసుతస్తతః ప్రాయాద్ విజయీ దక్షిణాం దిశమ్ ।
నీలునిపూజను గ్రహించి కప్పం అతనికి నియమించి సహదేవుడు విజయం పొంది దక్షిణదిక్కుగా బయలుదేరాడు. (59 1/2)
త్రైపురం స వశే కృత్యా రాజానమమితౌజసమ్ ॥ 60
నిజగ్రాహ మహాబాహుః తరసా పౌరవేశ్వరమ్ ।
ఆకృతిం కౌశికాచార్యం యత్నేన మహతా తతః ॥ 61
వశే చక్రే మహాబాహుః సురాష్ట్రాధిపతిం తదా ।
త్రిపురేశుడైన అమితౌజసుని వశపరచుకొని సహదేవుడు పౌరవేశ్వరుని బందీగా చేశాడు. గొప్ప ప్రయత్నంతో సురాష్ట్రాధిపతి కైశికాచార్యుని ఆకృతిని అదుపులోకి తెచ్చాడు. (60 61 1/2)
సురాష్ట్రవిషయస్థశ్చ ప్రేషయామాస రుక్మిణే ॥ 62
రాజ్ఞే భోజకటస్థాయ మహామాత్రాయ ధీమతే ।
భీష్మకాయ స ధర్మాత్మా సాక్షాదింద్రసఖాయ వై ॥ 63
స చాస్య ప్రతిజగ్రాహ ససుతః శాసనం తదా ।
ప్రీతిపూర్వమ్ మహారాజ వాసుదేవమవేక్ష్య చ ॥ 64
తతః స రత్నాన్యాదాయ పునః ప్రాయాద్ యుధాంపతిః ।
సురాష్ట్రంలో ఉండి ధర్మాత్ముడు సహదేవుడు భోజకటకనివాసి రుక్మికి; విశాలరాజ్యాధిపతి, బుద్ధిమంతుడు, ఇంద్రసఖుడు అయిన భీష్మకుని సమీపానికి దూతను పంపాడు. భీష్మకుడు వసుదేవసుతుడైన శ్రీకృష్ణుని దృష్టిలో ఉంచుకుని కుమారులతో సహా సహదేవుని మాట మన్నించాడు. తరువాత యోధాగ్రేసరుడు సహదేవుడు అతని నుంచి రత్నాలను కానుకలుగా తీసికొని ముందుకుసాగాడు. (62- 64 1/2)
తతః శూర్పారకం చైవ తాలాకటమథాపి చ ॥ 65
వశే చక్రే మహాతేజా దండకాంశ్చ మహాబలః ।
సాగరద్వీపవాసాంశ్చ కర్ణప్రావరణానపి ।
మహాతేజస్వి, బలశలి, అయిన సహదేవుడు శూర్పారక, తారాకటదేశాలను జయించి దండకారణ్యాలను తన అధీనంలోకి తెచ్చుకొన్నాడు. సముద్రద్వీపవాసులను, మ్లేచ్ఛరాజులను, నిషాదులను కర్ణప్రావణాదులను గెలిచాడు. (65, 66 1/2)
యే చ కాలముఖా నామ నరరాక్షసయోనయః ॥ 67
కాలముఖులని ప్రసిద్ధి చెందిన మనుష్య రాక్షసుల సంయోగం చేత పుట్టిన వారిపై కూడ విజయం సాధించాడు. (67)
కృత్స్నం కోలగిరిం చైవ సురభీపత్తనం తథా ।
ద్వీపం తామ్రాహ్వయం చైవ పర్వతం రామకం తథా ॥ 68
తిమింగిలం చ స నృపం వశే కృత్వా మహామతిః ।
ఏకపాదాంశ్చ పురుషాన్ కేరళాన్ వనవాసినః ॥ 69
నగరీం సంజయంతీం చ పాఖండం కరహాటకం ।
దూతైరైవ వశే చక్రే కరం చైనానదాపయత్ ॥ 70
సమస్త కోలగిరి, సురభీపత్తనం, తామ్రద్వీపం, రామకపర్వతం, తిమింగిలరాజును, సహదేవుడు జయించాడు. ఒంటికాలిపురుషులు, కేరళులు, వనవాసులు, సంజయంతీనగరం, పాఖండం, కరహాటకం మొదలైన దేశాలను దూతల ద్వారా ఓడించి వారికి పన్ను నిర్ణయించి వదిలివేశాడు. (68-70)
పాండ్యాంశ్చ ద్రవిడాంశ్చైవ సహితాంశ్చోండ్రకేరళైః ।
ఆంధ్రాంస్తాళవనాంశ్చైవ కళింగానుష్ట్రకర్ణికాన్ ॥ 71
ఆటవీం చ పురీం రమ్యాం యవనానాం పురం తథా ।
దూతైరేవ వశే చక్రే కరం చైనానదాపయత్ ॥ 72
పాండ్య, ద్రవిడ, ఉండ్ర, కేరళ, ఆంధ్ర, తాళవన, కళింగ, ఉష్ట్రకర్ణిక, ఆటవీపురి,యవననగరం అనే ప్రదేశాలను దూతలద్వారానే లొంగదీసి వారిని కూడ కప్పం కట్టేటట్లు చేశాడు. (72)
(సముద్రతీరమాసాద్య న్యవిశత్ పాండునందనః ।
సహదేవస్తతో రాజన్ మంత్రిభిః సహ భారత ।
సంప్రధార్య మహాబాహుః సచివైర్బుద్ధిమత్తరైః ॥
సముద్రతీరానికి చేరి సహదేవుడు సేనాశిబిరాన్ని ఏర్పాటుచేశాడు. మేధావులైన మంత్రులతో కలిసి సహదేవుడు జరుగవలసిన పనులను గూర్చి చర్చించాడు.
అనుమాన్య స తాం రాజన్ సహదేవస్త్వరాన్వితః ।
చింతయామాస రాజేంద్ర భ్రాతుః పుత్రం ఘటోత్కచమ్ ॥
వారి అందరి అభిప్రాయాన్ని గౌరవించి వెంటనే తన అన్నగారి కుమారుడు ఘటోత్కచుని తలచినాడు.
తతశ్చింతితమాత్రే తు రాక్షసః ప్రత్యదృశ్యత ।
అతిదీర్ఘో మహాకాయః సర్వాభరణభూషితః ॥
తలచినంతలోనే మిక్కిలిపొడగరి, విశాలకళేబరం కలవాడు, సర్వాలంకారశోభితుడు అయిన ఘటోత్కచుడు ప్రత్యక్షం అయ్యాడు.
నీలజీమూతసంకాశః తప్తకాంచనకుండలః ।
విచిత్రహారకేయూరః కింకిణీమణిభూషితః ॥
అతని శరీరం నీలమేఘం రంగులో ఉంది. అతని చెవులకు మెరిసే బంగారు కుండలాలు ఉన్నాయి. విచిత్రాలైన హారాలు, భుజాభరణాలు కలిగి ఉన్నాడు. నడుము వద్ద చిరుగంటల మణులు కన్పించాయి.
హేమమాలీ మహాదంష్ట్ర కిరీటీ కుక్షిబంధనః ।
తామ్రకేశో హరిశ్మశ్రుః భీమాక్షః కనకాంగదః ॥
బంగారు మాలలు మెడలో మెరుస్తున్నాయి. పెద్దపెద్ద కోరలు, అందమైన కిరీటం, కుక్షిబంధనం ధరించాడు. ఎఱ్ఱటిజుత్తు, భయంకరమయిన కళ్ళు, నల్లనిగడ్డం, బంగారు భుజాభరణాలు కలిగి ఉన్నాడు.
రక్తచందనదిగ్ధాంగః సూక్ష్మాంబరధరో బలీ ।
జవేన స యయౌ తత్ర చాలయన్నివమేదినీమ్ ॥
ఎఱ్ఱచందనం పూసుకున్న శరీరంపై, సన్నటిబట్టలు ధరిమ్చి, బలవంతుడైన ఘటోత్కచుడు తన వేగంతో భూమిని కంపింపచేస్తూ అక్కడికి వచ్చాడు.
తతో దృష్ట్వా జనా రాజన్ ఆయాంతం పర్వతోపమమ్ ।
భాయాద్ధి దుద్రువుః సర్వే సింహాత్ క్షుద్రమృగా యథా ॥
పర్వతాకారంగల ఆ ఘటోత్కచుని చూచి జనులు సింహాన్ని చూసిన నీచమృగాలవలె భయంతో తలో దిక్కుకీ పరుగులు తీశారు.
ఆససాద చ మాద్రేయం పులస్త్యం రావణో యథా ।
అభివాద్య తతో రాజన్ సహదేవం ఘటోత్కచః ॥
ప్రహ్వః కృతాంజలిస్తస్థౌ కిం కార్యమితి చాబ్రవీత్ ।
రావణుడు పులస్త్యబ్రహ్మను చేరినట్లు ఘటోత్కచుడు సహదేవుని సమీపానికి చేరి పాదాలకు నమస్కరించి సహదేవుని ఎదుట వినయభావంతో ఉండి చేతులు జోడించి 'ఏం చెయ్యాలి?' అని అడిగాడు.
తం మేరుశికరాకారమ్ ఆగతం పాండునందనః ॥
సంపరిష్వజ్య బాహుభ్యాం మూర్ధ్న్యుపాఘ్రాయ చాసకృత్ ।
పూజయిత్వా సహామాత్యః ప్రీతో వాక్యమువాచ హ ॥
ఘటోత్కచుడు మేరుపర్వతశిఖరంలా ఉన్నాడు. అతడు రాగానే రెండు చేతులు చాచి కౌగిలించుకొని శిరస్సును మాటిమాటికి ముద్దుపెట్టి స్వాగతసత్కారాలతో సమ్మానించి మంత్రులతో కూడి సహదేవుడు మిక్కిలి ప్రసన్నుడై ఇలా పలికాడు.
సహదేవ ఉవాచ
గచ్ఛ లంకాపురీం వత్స కరార్థం మమ శాసనాత్ ।
తత్ర దృష్ట్వా మహాత్మానం రాక్షసేంద్రం విభీషణమ్ ॥
రత్నాని రాజసూయార్థం వివిధాని బహూని చ ।
ఉపాదాయ చ సర్వాణి ప్రత్యాగచ్ఛ మహాబలః ॥
సహదేవుడు పలికాడు - వత్సా! లంకానగరానికి కరగ్రహణానికై నా ఆజ్ఞపై వెళ్లు. అక్కడ రాక్షసరాజు విభీషణుని కలిసి రాజసూయానికై వివిధ రత్నాలను గ్రహించి శీఘ్రంగా తిరిగిరా.
నో చేదవం వదేః పుత్ర సమర్థమిదముత్తరమ్ ।
విష్ణోర్భుజబలం వీక్ష్య రాజసూయమథారభత్ ॥
కౌంతేయో భ్రాతృభిః సార్ధం సర్వం జానీహి సాంప్రతమ్ ।
స్వస్తి తేఽస్తు గమిష్యామి సర్వం వైశ్రవణానుజ ॥
ఇత్యుక్త్వా శీఘ్రమాగచ్ఛ మాభూత్ కాలస్య పర్యయః ।
కుమారా! ఒకవేళ నీకతడు రత్నాలు ఇవ్వనిచో నీ శక్తిని ప్రదర్శిస్తూ ఇలా చెప్పు. 'కుంతీకుమారులలో జ్యేష్ఠుడు ధర్మరాజు శ్రీకృష్ణుని బాహువీర్యసహాయంతో సోదరులతో కూడి రాజసూయం చేయసంకల్పించాడు. అన్నింటిని నీవు తెలిసి నడచుకో. నీకు మంగళం అగుగాక. నేను తిరిగి వెళతాను' అని పలికి ఆలస్యం చేయకుండా వెంటనే తిరిగి రా.
వైశంపాయన ఉవాచ
పాండవేనైవ ముక్తస్తు ముదా యుక్తో ఘటోత్కచః ।
తథేత్యుక్త్వా మహారాజ ప్రతస్థే దక్షిణాం దిశమ్ ॥
యయౌ ప్రదక్షిణమ్ కృత్వా సహదేవం ఘటోత్కచః ।)
వైశంపాయనుడు పలికాడు - సహదేవుని మాటలు విని సంతసించిన ఘటోత్కచుడు 'అలాగే' అని సహదేవునికి ప్రదక్షిణం చేసి దక్షిన దిక్కునకు బయలుదేరాడు.
తతః కచ్ఛగతో ధీమాన్ దూతం మాద్రవతీసుతః ।
ప్రేషయామాస హైడింబం పౌలస్త్యాయ మహాత్మనే ।
విబీషణాయ ధర్మాత్మా ప్రీతిపూర్వమరిందమః ॥ 73
ఈ విధంగా సముద్రతీరానికి చేరి బుద్ధిమంతుడు, శత్రుతాపకుడు అయిన సహదేవుడు విభీషణుని సమీపానికి తనదూతగా ఘటోత్కచుని పంపాడు. (73)
(లంకామభిముఖో రాజన్ సముద్రమవలోకయత్ ॥
కూర్మగ్రాహఝషాకీర్ణమ్ నక్రైర్మీనైస్తథాఽకులమ్ ।
శుక్తివ్రాతైః సమాకీర్ణం శంఖానాం నిచయాకులమ్ ॥
లంకానగరానికి వెడుతూ ఘటోత్కచుడు సముద్రం వైపు చూశాడు. తాబేళ్ళు, మొసళ్ళు, పెద్దచేపలు మొదలైన జలజంతువులతోను ముత్యపుచిప్పలతోను, శంఖాలతోను నిండి ఉంది ఆ సముద్రం.
స దృష్ట్వా రామసేతుం చ చింతయన్ రామవిక్రమమ్ ।
ప్రణమ్య తమతిక్రమ్య యామ్యాం వేళామలోకయత్ ॥
శ్రీరామునిచే నిర్మింపబడిన సేతువును చూచి నమస్కరించి రామపరాక్రమాన్ని తలచుకొని, దాన్ని దాటి దక్షిణదిక్కునకు దృష్టి సారించాడు.
గత్వా పారం సముద్రస్య దక్షిణం స ఘటోత్కచః ।
దదర్శ లంకాం రాజేంద్ర నాకపృష్ఠోపమాం శుభామ్ ॥
దక్షిణపు ఒడ్డును చేరి ఘటోత్కచుడు లంకానగరాన్ని చూశాడు. అది స్వర్గంతో సమానంగా ప్రకాశిస్తూ ఉంది.
ప్రాకారేణావృతాం రమ్యాం శుభద్వారైశ్చ శోభితామ్ ।
ప్రాసాదైర్బహుసాహస్రైః శ్వేతరక్తైశ్చ సంకులామ్ ॥
నాలుగువైపుల ప్రాకారాలతో ఆవరించి ఉంది. సుందరశుభద్వారాలతో ప్రకాశిస్తోంది. వేలకొలది తెల్లని, ఎఱ్ఱని మేడలతో నిండి ఉంది.
తాపనీయగవాక్షీన ముక్తాజాలాంతరేణ చ ।
హైమరాజతజాలేన దాంతజాలైశ్చ శోభితామ్ ॥
అక్కడి కిటికీలకు బంగారం తాపడమ్ చేశారు. ముత్యాలజాలర్లు వ్రేలాడదీశారు. గవాక్షాలు బంగారం, వెండి, ఏనుగు దంతాలతో అలంకరింపబడి ప్రకాశించాయి.
హర్మ్యగోపురసంబాధామ్ రుక్మతోరణసంకులామ్ ।
దివ్యదుందుభినిర్ర్హాదామ్ ఉద్యానవనశోభితామ్ ॥
మేడలు, గోపురాలతో ఆ నగరశోభ విస్తరించి ఉంది. బంగారు తోరణద్వారాలు నిర్మించారు. దివ్యదుందుభులు గంభీరంగా మ్రోగసాగాయి. ఉద్యానవనాలు నగరశోభను పెంపొందిస్తున్నాయి.
పుష్పగంధైశ్చ సంకీర్ణాం రమణీయమహాపథామ్ ।
నానారత్నైశ్చ సంపూర్ణామ్ ఇంద్రస్యేవామరావతీమ్ ॥
నాలుగువైపుల పుష్పసుగంధం నిండి ఉంది. విశాలమైన మార్గాలు తీర్చి ఉన్నాయి. నానారత్నాలతో నిండి, ఇంద్రుని అమరావతిలా ఉంది.
వివేశ స పురీం లంకాం రాక్షసైశ్చ నిషేవితామ్ ।
దదర్శ రాక్షసవ్రాతాన్ శూలప్రాసధరాన్ బహూన్ ॥
ఘటోత్కచుడు రాక్షససేవితం అయిన లంకలో ప్రవేశించి శూలధారులు, భల్లధారులు అయిన రాక్షసులను చాలామందిని చూశాడు.
నానావేషధరాన్ దక్షాన్ నారీశ్చ ప్రియదర్శనాః ।
దివ్యమాల్యాంబరధరాః దివ్యాభరణభూషితాః ॥
వారందరు నానావేషాలు ధరించారు. సంగ్రామనిపుణులు, స్త్రీలు అందగత్తెలు, దివ్యమాల్యాలు, వస్త్రాలు ధరించారు. దివ్యహారాలతో, ఆభరణాలతో శోభించారు.
మదరక్తాంతనయనాః పీనశ్రోణిపయోధరాః ।
భైమసేనిం తతో దృష్ట్వా హృష్టాస్తే విస్మయం గతాః ॥
మద్యపానం చేత నేత్రప్రాంతభాగాలు ఎఱ్ఱబడ్డాయి. బలిసిన నితంబం, వక్షఃస్థలం, కలిగి ఉన్నారు. ఘటోత్కచుని చూచి వారంతా ఆనందం, ఆశ్చర్యం కూడ పొందారు.
ఆససాద గృహం రాజ్ఞః ఇంద్రస్య సదనోపమమ్ ।
స ద్వారపాలమాసాద్య వాక్యమేతదువాచ హ ॥
ఘటోత్కచుడు ఇంద్రభవనసమానమయిన విభీషణుని గృహాన్ని చేరి ద్వారపాలకునితో ఇలా అన్నాడు.
ఘటోత్కచ ఉవాచ
కురూణామృషభో రాజా పాండుర్నామ మహాబలః ।
కనీయాంస్తస్య దాయాదః సహదేవ ఇతి శ్రుతః ॥
కురుశ్రేష్ఠుడు, బలశాలి అయిన రాజు పండువు. అతని కుమారులలో చిన్నవాడు సహదేవుడు ప్రసిద్ధుడు.
కృష్ణమిత్రస్య తు గురోః రాజసూయార్థముద్యతః ।
తేనాహం ప్రేషితో దూతః కరార్థం కౌరవస్య చ ॥
అతడు కృష్ణుని మిత్రుడూ తన అన్న అయిన ధర్మరాజు రాజసూయానికై నడుంబిగించాడు. నన్ను నీవద్దకు కప్పం కోసం దూతగా పంపాడు.
ద్రష్టుమిచ్ఛామి పౌలస్త్యం త్వం క్షిప్రం మాం నివేదయ ।
విభీషణుని దర్శించాలని ఉంది. శీఘ్రంగా పోయి నివేదించు.
వైశంపాయన ఉవాచ
తస్య తద్ వచనం శ్రుత్వా ద్వారపాలో మహీపతే ।
తథేత్యుక్త్వా వివేశాథ భవనం స నివేదకః ॥
వైశంపాయనుడు పలికాడు - అతని మాటలు విని ద్వారపాలకుడు 'అలాగే' అని పలికి నివేదించటానికి విభీషణుని భవనంలో ప్రవేశించాడు.
సాంజలిః స సమాచష్ట సర్వాం దూతగిరం తదా ।
ద్వారపాలవచః శ్రుత్వా రాక్షసేంద్రో విభీషణః ॥
ఉవాచ వాక్యం ధర్మాత్మా సమీపే మే ప్రవేశ్యతామ్ ।
అంజలి ఘటించి దూతవాక్యాలను సవిస్తరంగా విభీషణునికి వినిపించాడు. అతని మాటలు విని విభీషణుడు 'ఆ దూతను నా సమీపానికి ప్రవేశపెట్టు' అని బదులుపలికాడు.
ఏవముక్తస్తు రాజేంద్ర ధర్మజ్ఞేన మహాత్మనా ।
అథ నిష్క్రమ్య సంభ్రాంతః ద్వాఃస్థో హైడంబమబ్రవీత్ ॥
ధర్మజ్ఞుడు, మహాత్ముడు అయిన విభీషణుని మాటలను విని అక్కడి నుంచి త్వరగా బయటకు వచ్చి ద్వారపాలకుడు ఘటోత్కచునితో పలికాడు.
ఏహి దూట నృపం ద్రష్టుం క్షిప్రం ప్రవిశ చ స్వయమ్ ।
ద్వారపాలవచః శ్రుత్వా ప్రవివేశ ఘటోత్కచః ॥
దూతా! రమ్ము! శీఘ్రంగా ప్రవేశించు. ద్వారపాలకుని మాటల్ని విని ఘటోత్కచుడు విభీషణమందిరంలో ప్రవేశించాడు.
స ప్రవిశ్య దదర్శాథ రాక్షసేంద్రస్య మందిరమ్ ।
తతః కైలాససంకాశం తప్తకాంచనతోరణమ్ ॥
అతడు లోనికి ప్రవేశించి రాక్షసరాజైన విభీషణుని భవనాన్ని తేరిపారచూశాడు. అది బంగారు తోరణాలు కల కైలాసపర్వతంలా ఉంది.
ప్రాకారేణ పరిక్షిప్తం గోపురైశ్చాపి శోభితమ్ ।
హర్మ్యప్రాసాదసంబాధం నానారత్నసమన్వితమ్ ॥
నాలుగువైపుల ప్రాకారాలతో, నానాగోపురాలతో, మేడలు, ప్రాసాదాలతో, అనేక రత్నాలు పొదగబడి ఉంది.
కాంచనైస్తాపనీయైశ్చ స్ఫాటికై రాజతైరపి ।
వజ్రవైడూర్యగర్భైశ్చ స్తంభైర్దృష్టిమనోహరైః ।
నానాధ్వజపతాకాభిః సువర్ణాభిశ్చ చిత్రితమ్ ।
బంగారం, వెండి, స్ఫటికాలు, వజ్రాలు, వైడూర్యాలు పొదిగిన స్తంభాలు చూపరుల దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. అనేక రకాల పతాకలు, ధ్వజాలు, బంగారు రంగులో నుండి ప్రకాశించాయి.
చిత్రమాల్యావృతం రమ్యం తప్తకాంచనవేదికమ్ ॥
తాన్ దృష్ట్వా తత్ర సర్వాన్ సః భైమసేనిర్మనోరమాన్ ।
ప్రవిశన్నేవ హైడింబః శుశ్రావ మురజస్వనమ్ ॥
చిత్రవిచిత్రాలైన మాలలు, శుద్ధిచేసిన బంగారు వేదిక, సుందరంగా కనిపిస్తోంది. ఆ సుందర విశేషాలన్నీ చూస్తూ విభీషణుని భవనంలోకి ప్రవేశిస్తుండగానే ఘటోత్కచుడు శ్రావ్యమయిన మృదంగధ్వనిని విన్నాడు.
తంత్రీగీతసమాకీర్ణం సమతాళమితాక్షరమ్ ।
దివ్యదుందుభినిర్ర్హాదం వాదిత్రశతసంకులమ్ ॥
తీగలపై గీతాలు ఆలపిస్తున్నారు. తాళానికి అనుగుణంగా అక్షరాలు ఉన్నాయి. వేలకొద్దీ వాద్యాలతో దివ్యదుందుభులు కలిసి మ్రోగుతున్నాయి.
స శ్రుత్వా మధురం శబ్దం ప్రీతిమానభవత్ తదా ।
తతో విగాహ్య హైడింబః బహుకక్షాం మనోరమామ్ ॥
స దదర్శ మహాత్మానం ద్వాఃస్థేన భరతర్షభ ।
తం విభీషణమాసీనం కాంచనే పరమాసనే ॥
మనోహరమయిన శబ్దాన్ని విని ఘటోత్కచుడు మిక్కిలి సంతృప్తి చెందాడు. సుందరాలైన కక్షలను దాటి ద్వారపాలకునితో కలిసి బంగారు సింహాసనంపై ఆసీనుడైన విభీషణుని చూశాడు.
దివ్యే భాస్కరసంకాశే ముక్తామణివిభూషితే ।
దివ్యాభరణ చిత్రాంగం దివ్యరూపధరం విభుమ్ ॥
అతని సింహాసనం సూర్యునితో సమానంగా భాసిస్తోంది. అతని శరీరం దివ్యాభరణాలతో నిండి దివ్యమై ప్రకాశిస్తోంది.
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధోక్షితం శుభమ్ ॥
విభ్రాజమానం వపుషా సూర్యవైశ్వానరప్రభమ్ ।
అతడు దివ్యమాలలు, వస్త్రాలు, ధరించి దివ్యగంధం పూసికొని పవిత్రశరీరుడై కనిపించాడు. శరీరకాంతి దివ్యాభరణాలతో కలిసి సూర్యాగ్నులకాంతిని మించి ఉంది.
ఉపోపవిష్టం సచివైః దేవైరివ శతక్రతుమ్ ॥
యజ్ఞైర్మహారథైర్దివ్యైః నారీభిః ప్రియదర్శనైః ॥
గీర్భిర్మంగళయుక్తాభిః పూజ్యమానం యథావిధి ॥
ఇంద్రుని సమీపంలో చాలామంది దేవతలు ఆసీనులైన విధంగా విభీషణుని సమీపాన అనేక మంత్రులు ఆసీనులు అయ్యారు. సౌందర్యవంతులు, మహారథులు అయిన యక్షులు సౌందర్యవతులైన స్త్రీలతో కలిసి తమ శుభవచనాల ద్వారా విధిగా విభీషణుని పూజిస్తున్నారు.
చామరే వ్యజనే చాగ్ర్యే హేమదండే మహాధనే ।
గృహీతే వరనారీభ్యాం ధూయమానే చ మూర్ధని ॥
ఇద్దరు అందమైన యువతులు బంగారు దండం కల విలువైన వింజామరలతో అతని తల వద్ద వీస్తూ ఉన్నారు.
అర్చిష్మంతం శ్రియా జుష్టం కుబేరవరుణోపమమ్ ।
ధర్మే చైవ స్థితం నిత్యమ్ అద్భుతం రాక్షసేశ్వరమ్ ॥
రాక్షసరాజు విభీషణుడు కుబేరవరుణుల సంపదలతో తులతూగుతూ అద్భుతంగా కన్పించాడు. అతని అవయవాల నుంచి దివ్యకాంతి వెలువడుతోంది. అతడు ఎల్లప్పుడు ధర్మపరాయణుడై ఉంటాడు.
రామమిక్ష్వాకునాథం వై స్మరంతం మనసా సదా ।
దృష్ట్వా ఘటోత్కచో రాజన్ వవందే తం కృతాంజలిః ॥
అతడు నిత్యం ఇక్ష్వాకువంశప్రభువైన రాముని తలచుకొంటూ ఉన్నాడు. అతనిని చూసి అంజలి ఘటించి ఘటోత్కచుడు నమస్కరించాడు.
ప్రహ్వస్తస్థౌ మహావీర్యః శక్రం చిత్రరథో యథా ।
తం దూతమాగతం దృష్ట్వా రాక్షసేంద్రో విభీషణః ॥
పూజయిత్వా యథాన్యాయం సాంత్వపూర్వం వచోఽబ్రవీత్ ।
మహాపరాక్రమవంతుడైన చిత్రరథుడు ఇంద్రుని ఎదుట వినమ్రుడైనట్లు ఘటోత్కచుడు విభీషణుని ఎదుట వినీతభావంతో నిలబడ్డాడు. ఆ సహదేవుని దూతను చూచి విభీషణుడు సన్మానించి స్వాగతసత్కారాలతో సాంత్వన వాక్యాలు పలికాడు.
విభీషణ ఉవాచ
కస్య వంశే తు సంజాతః కరమిచ్ఛన్ మహీపతిః ॥
తస్యానుజాన్ సమస్తాంశ్చ పురం దేశం చ తస్య వై ।
స్వాం చ కార్యం చ తత్ సర్వం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥
విస్తరేణ మమ బ్రూహి సర్వానేతాన్ పృథక్ పృథక్ ।
విభీషణుడు పలికాడు - ఘటోత్కచా! నా నుంచి కప్పాన్ని కోరేరాజు ఏ వంశానికి చెందినవాడు? అతని తమ్ములు ఎవరు? అతనిదేశం, ప్రధాన నగరాలు ఏవి? నీ విషయాన్ని పూర్తిగా చెప్పు. అంతా సవిస్తరంగా వినాలని ఉంది. నా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వేరు వేరుగా చెప్పు.
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు హైడింబః పౌలస్త్యేన మహాత్మనా ॥
కృతాంజలిరువాచాథ సాంత్వయన్ రాక్షసాధిపమ్ ।
వైశంపాయనుడు అన్నాడు - మహాత్ముడైన విభీషణుడు అలా అడిగిన పిదప అంజలి ఘటించి అతనికి ఊరట కలిగిస్తూ ఘటోత్కచుడు ఇలా చెప్పాడు.
ఘటోత్కచ ఉవాచ
సోమస్య వంశే రాజాఽఽసీత్ పాండుర్నామ మహాబలః ।
పాండోః పుత్రాశ్చ పంచాసన్ శక్రతుల్యపరాక్రమాః ॥
తేషాం జ్యేష్ఠస్తు నామ్నాభూద్ ధర్మపుత్ర ఇతి శ్రుతః ।
ఘటోత్కచుడు చెప్పాడు - చంద్రవంశానికి చెందిన మహాబలవంతుడు పాండుడు అనే మహారాజు ఉన్నాడు. అతనికి ఇంద్రునితో సమానపరాక్రమం గల ఐదుగురు కుమారులు ఉన్నారు. వారిలో జ్యేష్ఠుడు ధర్మపుత్రుడనే పేర లోకంలో కీర్తి గడించాడు.
అజాతశత్రుర్ధర్మాత్మా ధర్మో విగ్రహవానివ ॥
తతో యుధిష్ఠిరో రాజా ప్రాప్య రాజ్యమకారయత్ ।
గంగాయా దక్షిణే తీరే నగరే నాగసాహ్వయే ॥
అతని మనస్సులో ఏ వ్యక్తి మీద శత్రుత్వం లేదు. లోకులు అతనిని అజాతశత్రువని పిలువసాగారు. అతని మనస్సులో ఎల్లప్పుడు ధర్మమే నిండి ఉంటుంది. మూర్తీభవించిన ధర్మమే అతడు. తండ్రి నుంచి రాజ్యాన్ని పొంది పరిపాలిస్తున్నాడు. గంగానది దక్షిణ తీరాన హస్తినాపురం అతని రాజధాని.
తద్ దత్త్వా ధృతరాష్ట్రాయ శక్రప్రస్థం యయౌ తతః ।
భ్రాతృభిః సహ రాజేంద్ర శక్రప్రస్థే ప్రమోదతే ।
విభీషణా! కొంతకాలానికి అతడు హస్తినాపురాన్ని ధృతరాష్ట్రునికి అప్పగించి స్వయంగా సోదరులతో ఇంద్రప్రస్థానికి చేరాడు. అక్కడ వారు ఆనందంలో మునిగిపోయారు.
గంగాయమునయోర్మధ్యే తావుభౌ నగరోత్తమౌ ।
నిత్యం ధర్మే స్థితో రాజా శక్రప్రస్థే ప్రశాసతి ॥
ఆ రెండు నగరాలు గంగాయమునా నదుల మధ్య ఉన్నాయి. ధర్మపరాయణుడైన యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థంలో ఉండి పరిపాలన సాగించసాగాడు.
తస్యానుజో మహాబాహుః భీమసేనో మహాబలః ।
మహాతేజా మహావీర్యః సింహతుల్యః స పాండవః ॥
ధర్మజుని సోదరుడు భీమసేనుడు. అతడు గొప్ప తేజస్వి, సింహసమాన పరాక్రమం కలవాడు. బహుబలశాలి, మహాబలవంతుడు.
దశనాగసహస్రాణాం బలే తుల్యః స పాండవః ।
తస్యానుజోఽర్జునో నామ మహావీర్యపరాక్రమః ॥
సుకుమారో మహాసత్త్వః లోకే వీర్యేణ విశ్రుతః ।
అతనికి వేయి ఏనుగుల బలం ఉంది. అతని తరువాతి సోదరుడు అర్జునుడు. గొప్ప బలపరాక్రమం కలవాడు. సుకుమారుడు, ధైర్యశాలి. అతని పరాక్రమం ప్రపంచంలో విఖ్యాతిమైంది.
కార్తవీర్యసమో వీర్యే సాగరప్రతిమో బలే ॥
జామదగ్న్యసమో హ్యస్త్రే సంఖ్యే రామసమోఽర్జునః ।
రూపే శక్రసమః పార్థః తేజసా భాస్కరోపమః ॥
అర్జునుడు పరాక్రమంలో కార్తవీర్యుడు, బలంలో సగరపుత్రులతో సాటి, అస్త్రవిద్యలో పరశురాముడు, యుద్ధంలో రాముడు, అందంలో ఇంద్రుడు, తేజస్సులో సూర్యసముడు.
దేవదానవగంధర్వైః పిశాచోరగరాక్షసైః ।
మానుషైశ్చ సమస్తైశ్చ అజేయః ఫాల్గునో రణే ॥
దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచాలు, సర్పాలు, రాక్షసులు, మనుజులు అందరూ ఏకమై యుద్ధం చేసినా అర్జునుని జయించలేరు.
తేన తత్ ఖాండవం దావమ్ తర్పితం జాతవేదసే ।
తరసా ధర్షయిత్వా తం శక్రం దేవగణైః సహ ॥
లబ్ధాన్యస్త్రాణి దివ్యాని తర్పయిత్వా హుతాశనమ్ ।
అతడు ఖాండవవనాన్ని మండించి అగ్నికి ఆహుతి చేశాడు. దేవతలతో సహా ఇంద్రుని ఓడించి అగ్నికి సంతుష్టి కలిగించి దివ్యాస్త్రాలను పొందాడు.
తేన లబ్ధ్వా మహారాజ దుర్లభా దేవతైరపి ॥
వాసుదేవస్య భగినీ సుభద్రా నామ విశ్రుతా ।
అతడు పూజ్యుడైన వాసుదేవుని సోదరిని భార్యాగా పొందాడు. ఆమె దేవతలకు కూడ పొందశక్యం కాలేదు.
అర్జునస్యానుజో రాజన్ నకులశ్చేతి విశ్రుతః ॥
దర్శనీయతమో లోకే మూర్తిమానివ మన్మథః ।
అర్జునుని తమ్ముడు నకులుడు అని ప్రసిద్ధి వహించాడు. రూపు దాల్చిన మన్మథుడు.
తస్యానుజో మహాతేజాః సహదేవ ఇతి శ్రుతః ।
తేనాహం ప్రేషితో రాజన్ సహదేవేన మారిష ॥
అతని తమ్ముడు గొప్ప తేజస్వి, సహదేవుడని పేరు. సహదేవుడే నీవద్దకు నన్ను దూతగా పంపాడు.
అహం ఘటోత్కచో నామ భీమసేనసుతో బలీ ।
మమ మాతా మహాభాగా హిడింబా నామ రాక్షసీ ॥
నాపేరు ఘటోత్కచుడు. నేను బలశాలి భీముని కుమారుడను. నా తల్లి పూజనీయ అయిన హిడింబ అనే రాక్షసి.
పార్థానాముపకారార్థం చరామి పృథివీమిమామ్ ।
ఆసీత్ పృథివ్యాః సర్వస్యాః మహీపాలో యుధిష్ఠిరః ॥
పాండవుల ఉపకారానికై ఇక్కడ సంచరిస్తున్నాను, మహారాజు యుధిష్ఠిరుడు మొత్తం భూమండలానికి రాజు అయ్యాడు.
రాజసూయం క్రతుశ్రేష్ఠమ్ ఆహర్తుముపచక్రమే ।
సందిదేశ చ స భ్రాతౄన్ కరార్థం సర్వతోదిశమ్ ॥
క్రతుశ్రేష్ఠమయిన రాజసూయాన్ని ధర్మరాజు చేయనిశ్చయించాడు. అతడు తన సోదరులందరినీ కప్పం కోసం అన్ని దిక్కులకు పంపాడు.
వృష్టివీరేణ సహితః సందిదేశానుజాన్ నృపః ।
ఉదీచీమర్జునస్తూర్ణం కరార్థం సముపాయయౌ ॥
యాదవవీరుడు శ్రీకృష్ణునితో కూడి ధర్మరాజు తన సోదరులను దిగ్విజయానికి ఆదేశించాడు. ఉత్తర దిక్కుకు అర్జునుడు శీఘ్రంగా కప్పం కోసం వెళ్ళాడు.
గత్వా శతసహస్రాణి యోజనాని మహాబలః ।
జిత్వా సర్వాన్ నృపాన్ యుద్ధే హత్వా చ తరసా వశీ ॥
స్వర్గద్వారముపాగమ్య రత్నాన్యాదాయ వై భృశమ్ ।
మహాబలుడు జితేంద్రియుడైన అర్జునుడు లక్షయోజనాలు ప్రయాణించి రాజులందరినీ గెలిచి స్వర్గద్వారాన్ని చేరి రత్నాలను సంగ్రహించి వేగంగా మరలివచ్చాడు.
అశ్వాంశ్చ వివిధాన్ దివ్యాన్ సర్వానాదాయ ఫాల్గునః ॥
ధనం బహువిధం రాజన్ ధర్మపుత్రాయ వై దదౌ ।
నానావిధాలైన రంగురంగుల గుఱ్ఱాలను కానుకగా గ్రహించి రత్నరాశులను స్వీకరించి, అర్జునుడు ధర్మరాజునకు కానుకగా సమర్పించాడు.
భీమసేనో హి రాజేంద్ర జిత్వా ప్రాచీం దిశం బలాత్ ॥
వశే కృత్వా మహీపాలాన్ పాండవాయ ధనం దదౌ ।
భీమసేనుడు తనబలంతో తూర్పు దిక్కును వశపరచుకొని రాజులందరినీ అణచివేసి ధర్మరాజుకు ధనాన్ని అప్పగించాడు.
దిశం ప్రతీచీం నకులః కరార్థం ప్రయయౌ తథా ॥
సహదేవో దిశం యామ్యాం జిత్వా సర్వాన్ మహీక్షితః ।
పడమరదిక్కుకు నకులుడు కప్పానికై సాగిపోయాడు. సహదేవుడు దక్షిణదిక్కుకు పోయి అందరినీ జయించాడు.
మాం సందిదేశ రాజేంద్ర కరార్థమిహ సత్కృతః ॥
పార్థానాం చరితం తుభ్యం సంక్షేపాత్ సముదాహృతమ్ ।
రాజేంద్రా! అతడు గొప్ప సత్కారభావంతో నన్ను మీవద్దకు రాజసంబంధమైన కప్పానికి పంపాడు. పాండవుల చరితం మీకు సంక్షేపంగా తెలియజేశాను.
తమవేక్ష్య మహారాజ ధర్మరాజం యుధిష్ఠిరమ్ ॥
పావకం రాజసూయం చ భగవంతం హరిం ప్రభుమ్ ।
ఏతానవేక్ష్య ధర్మజ్ఞ కరం త్వం దాతుమర్హసి ॥
మహారాజా! యుధిష్ఠిరుడైన ధర్మరాజును, పవిత్రమైన రాజసూయాన్ని, నడిపిస్తున్న పూజ్య శ్రీకృష్ణభగవానుని దృష్టిలో నుంచుకొని ధర్మరాజుకు కప్పాన్ని కట్టవలసింది.
వైశంపాయన ఉవాచ
తేన తద్ భాషితం శ్రుత్వా రాక్షసేంద్రో విభీషణః ।
ప్రీతిమానభవద్ రాజన్ ధర్మాత్మా సచివైః సహ ॥)
వైశంపాయనుడు పలికాడు - ఘటోత్కచుని ఈ మాటలు విని రాక్షసరాజు విబీషణుడు మంత్రులతో సహా ప్రసన్నుడు అయ్యాడు.
స చాస్య ప్రతిజగ్రాహ శాసనం ప్రీతిపూర్వకమ్ ।
తచ్చ కాలకృతం ధీమాన్ అభ్యమన్యత స ప్రభుః ॥ 74
విబీషణుడు ప్రేమతో ఆ ఆజ్ఞను స్వీకరించాడు. శక్తిశాలి, బుద్ధిమంతుడు అయిన విభీషణుడు దానిని సమయవిధానమని గుర్తించాడు. (74)
(తతో దదౌ విచిత్రాణి కంబలాని కుథాని చ ।
దంతకాంచనపర్యంకాన్ మణిహేమవిచిత్రితాన్ ॥
అతడు సహదేవునికి ఏనుగు అంబారీకి వీలయిన కంబళీలు, పరుపులు, బొంతలు, ఏనుగు దంతాలతో, బంగారంతో చేసిన పాన్పులు, మణులు, స్వర్ణమయమయిన అనేక వస్తువులు ఇచ్చాడు.
భూషణాని విచిత్రాణి మహార్హాణి బహూని చ ।
ప్రవాళాని చ శుభ్రాణి మణీంశ్చ వివిధాన్ బహూన్ ॥
కాంచనాని చ భాండాని కలశాని ఘటాని చ ।
కటాహాన్యపి చిత్రాణి ద్రోణ్యశ్చైవ సహస్రశః ॥
అనేకవిచిత్రాభరణాలు, విలువైన వస్తువులు, మంచి పగడాలు, మణులు, రత్నాలు, బంగారు పాత్రలు, కలశలు, ఘటాలు, గుండిగలు, జలపాత్రలు కానుకలుగా సమర్పించాడు.
రాజతాని చ భాండాని చిత్రాణి చ బహూని చ ।
శస్త్రాణి రుక్మచిత్రాణి మణిముక్తైర్విచిత్రితాన్ ॥
చిత్రకళతో కూడిన ఎన్నో వెండిపాత్రలు, మణులు, ముత్యాలు, బంగారం పొదిగిన శస్త్రాలను ఇచ్చాడు.
యజ్ఞస్య తోరణే యుక్తాన్ దదౌ తాళాంశ్చతుర్దశ ।
రుక్మపంకజపుష్పాణి శిబికా మణిభూషితాః ॥
యజ్ఞతోరణాలకు వీలైన 14 తాళాలను, సువర్ణమయాలై మణులు అలంకరించిన పల్లకీలను సమర్పించాడు.
ముకుటాని మహార్హాణి హేమవర్ణాంశ్చ కుండలాన్ ।
హేమపుష్పాణ్యనేకాని రుక్మమాల్యాని చాపరాన్ ॥
శంఖాంశ్చ చంద్రసంకాశాన్ శతావర్తాన్ విచిత్రిణః ।
చాలావిలువైన కిరీటాలు, బంగారురంగు కుండలాలు, బంగారుపుష్పాలు, మాలలు, చంద్రుని రంగు గల శతావర్త శంఖాలను ఆనందంతో కానుకగా ఇచ్చాడు.
చందనాని చ ముఖ్యాని రుక్మరత్నాన్యనేకశః ॥
వాసాంసి చ మహార్హాణి కంబలాని బహూన్యపి ।
అన్యాంశ్చ వివిధాన్ రాజన్ రత్నాని చ బహూని చ ॥
స దదౌ సహదేవాయ తదా రాజా విభీషణః ।)
పరిమళ భరితమయిన చందనం, రత్నాలు, బంగారం, వస్త్రాలు, కంబళ్లు, ఇంకా వివిధవస్తు సామగ్రిని సహదేవునికి కానుకగా విభీషణుడు అర్పించాడు.
తతః సంప్రేషయామాస రత్నాని వివిధాని చ ।
చందనాగురుకాష్ఠాని దివ్యాన్యాభరణాని చ ॥ 75
వాసాంసి చ మహార్హాణి మణీంశ్చైవ మహాధనాన్ ।
చందనం, అగరు కొయ్యలు, దివ్యాభరణాలు, చాల విలువైన వస్త్రాలు, పట్టుబట్టలు, ఘటోత్కచునితో సహదేవునికి పంపించాడు. (75 1/2)
(విభీషణం చ రాజానమ్ అభివాద్య కృతాంజలిః ॥
ప్రదక్షినం పరీత్వైవ నిర్జగామ ఘటోత్కచః ।
ఘటోత్కచుడు విభీషణునికి నమస్కరించి దోసిలి ఘటించి ప్రదక్షిణం చేసి లంక నుంచి నయలుదేరాడు.
తాని సర్వాణి రత్నాని అష్టాశీతిర్నిశాచరాః ॥
ఆజహ్రుః సముదా రాజన్ హైడింబేన తదా సహ ।
ఘటోత్కచునితో కలిసి ఎనభై ఎనిమిది మంది రాక్షసులు ఆ రత్నాల నన్నింటిని సంతోషంతో తీసుకొనివచ్చారు.
రత్నాన్యాదాయ సర్వాణి ప్రతస్థే స ఘటీత్కచః ॥
తతీ రత్నాన్యుపాదాయ హైడింబో రాక్షసైః సహ ।
జగామ తూర్ణం లంకాయాః సహదేవపదం ప్రతి ॥
ఆసేదుః పాండవం సర్వే లంఘయిత్వా మహోదధిమ్ ॥
ఈ విధంగా అన్ని రత్నాలను గ్రహించి ఘటోత్కచుడు రాక్షసులతో సహా సహదేవుని విడిది వైపు ప్రయాణం సాగించాడు. సముద్రాన్ని దాటి వారందరు సహదేవుని సమీపానికి చేరారు.
సహదేవో దదర్శాథ రత్నాహారాన్ నిశాచరన్ ।
ఆగతాన్ భీమసంకాశాన్ హిడింబం చ తథా నృప ॥
సహదేవుడు రత్నహారాలు గైకొని వచ్చే భయంకర రాక్షసులందరినీ, ఘటోత్కచునీ చూశాడు.
ద్రమిలా నైరృతాన్ దృష్ట్వా దుద్రువుస్తే భయార్దితాః ।
భైమసేనిస్తతో గత్వా మాద్రేయం ప్రాంజలిః స్థితః ॥
ద్రవిడ సైనికులు భయంకరులైన రాక్షసులను చూచి భయభీతులై అన్నివైపులకు పారిపోయారు. ఘటోత్కచుడు సహదేవునికి అంజలి ఘటించి నమస్కరించాడు.
ప్రీతిమానభవద్ దృష్ట్వా రత్నౌఘం తం చ పాండవః ।
తం పరిష్వజ్య పాణిభ్యాం దృష్ట్వా తాన్ ప్రీతిమానభూత్ ॥
విసృజ్య ద్రమిలాన్ సర్వాన్ గమనాయోపచక్రమే ।)
పాండుకుమారుడు సహదేవుడు ఆ రత్నరాశుల్ని చూచి చాల ప్రసన్నుడయ్యాడు. అతడు ఘటీత్కచుని రెండు చేతులతో పట్టుకుని కౌగిలించుకున్నాడు. మిగిలిన రాక్షసుల వైపు ప్రసన్నత చూపాడు. ద్రావిడ సైనికులను వీడి తిరిగివచ్చుటకు ఉద్యుక్తుడు అయ్యాడు.
న్యవర్తత తతో ధీమాన్ సహదేవః ప్రతాపవాన్ ॥ 76
అందరూ సిద్ధంగాకా సహదేవుడు ఇంద్రప్రస్థం దిశగా బయలుదేరాడు. (76)
ఏవం నిర్జిత్య తరసా సాంత్వేన విజయేన చ ।
కరదాన్ పార్థివాన్ కృత్వా ప్రత్యాగచ్ఛదరిందమః ॥ 77
ఈ విధంగా వేగంగా జయించి, సామనీతితో నచ్చజెప్పి, రాజులందరినీ కప్పంకట్టే వారిగా చేసి శత్రుదమనుడైన సహదేవుడు ఇంద్రప్రస్థానికి తిరిగివచ్చాడు. (77)
(రత్నభారముపాదాయ యయౌ సహ నిశాచరైః ।
ఇంద్రప్రస్థం వివేశాథ కంపయన్నివ మేదినీమ్ ॥
రత్నాల రాశులను గ్రహించి రాక్షసులతో కూడ సహదేవుడు ఇంద్రప్రస్థంలో ప్రవేశించాడు. ఆ సమయాన కోలాహలంతో భూమి కంపించినట్లు ఉంది.
దృష్ట్వా యుధిష్ఠిరం రాజన్ సహదేవః కృతాంజలిః ।
ప్రహ్వోఽభివాద్య తస్థౌ సః పూజితశ్చైవ తేన వై ॥
సహదేవుడు ధర్మరాజును చూచి అంజలి ఘటించి వినమ్రభావంతో నమస్కరించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అతనిని ఎంతగానో గౌరవించాడు.
లంకా ప్రాప్తాన్ ధనౌఘాంశ్చ దృష్ట్వా తాన్ దుర్లభాన్ బహూన్ ।
ప్రీతిమానభవద్ రాజా విస్మయం చ యయౌ తదా ॥
లంక నుంచి తెచ్చిన అత్యంతదుర్లభమైన ధనరాశులను చూచి ధర్మరాజు మిక్కిలి ఆనందించాడు, ఆశ్చర్యపోయాడు.
కోటీసహస్రమధికం హిరణ్యస్య మహాత్మనే ।
విచిత్రాంస్తు మణీంశ్చైవ గోఽజావిమహిషాంస్తథా ॥)
ధర్మరాజాయ తత్ సర్వం నివేద్య భరతర్షభ ।
కృతకర్మా సుఖం రాజన్నువాస జనమేజయ ॥ 78
ఆ ధనరాశుల్లో వేయికోట్లవిలువైన బంగారం ఉంది. విచిత్రమణులు, రత్నాలు ఉన్నాయి. గోవులు, మేకలు, దున్నలు కూడ అధికసంఖ్యలో ఉన్నాయి. వీటి నన్నింటిని ధర్మరాజుకు సమర్పించి కృతకృత్యుడై సహదేవుడు ఆనందంతో రాజధానీ నగరంలో నివసించసాగాడు. (78)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి సహదేవ దక్షిణదిగ్విజయే ఏకత్రింశోఽధ్యాయః ॥ 31 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున దిగ్విజయపర్వమను ఉపపర్వమున సహదేవ దక్షిణ దిగ్విజయము అను ముప్పది ఒకటవ అధ్యాయము. (31)
(దాక్షిణాత్య అధికపాఠము 100 శ్లోకములు కలిపి మొత్తం 178 శ్లోకాలు)