32. ముప్పది రెండవ అధ్యాయము

నకులుడు పడమర దిక్కును జయించుట.

వైశంపాయన ఉవాచ
నకులస్య తు వక్ష్యామి కర్మాణి విజయం తథా ।
వాసుదేవజితామాశాం యథాసావజయత్ ప్రభుః ॥ 1
వైశంపాయనుడు పలికాడు - నకులుని పరాక్రమాన్ని, విజయాన్ని వివరిస్తాను. శక్తిశాలి అయిన నకులుడు భగవానుడైన వాసుదేవుని అధీనంలో ఉన్న పశ్చిమదిక్కును ఎలా జయించాడో విను. (1)
నిర్యాయ ఖాండవప్రస్థాత్ ప్రతీచీమభితోదిశమ్ ।
ఉద్దిశ్య మతిమాన్ ప్రాయాన్మహత్యా సేనయా సహ ॥ 2
బుద్ధిమంతుడు నకులుడు పెద్దసేనతో ఖాండవప్రస్థం నుండి పశ్చిమదిక్కుకు బయలుదేరాడు. (2)
సింహనాదేన మహతా యోధానాం గర్జితేన చ ।
రథనేమినినాదైశ్చ కంపయన్ వసుధామిమామ్ ॥ 3
అతడు సైనికుల సింహనాదాలు, యోధుల గర్జనలు, రథచక్రఘోషలతో భూమిని కంపింపచేస్తూ బయలుదేరాడు. (3)
తతో బహుధనమ్ రమ్యం గవాఢ్యం ధనధాన్యవత్ ।
కార్తికేయస్య దయితం రోహితకముపాద్రవత్ ॥ 4
వెడుతూ వెడుతూ చాల ధనధాన్యాలతో సుందరమూ, గోసంపన్నమూ, కుమారస్వామి కిష్టమూ అయిన రోహితకమనే పర్వతప్రాంతాన్ని నకులుడు చేరాడు. (4)
తత్ర యుద్ధం మహచ్చాసీత్ శూరైర్మత్తమయూరకైః ।
మరుభూమిం స కార్త్స్న్యేన తథైవ బహుధాన్యకమ్ ॥ 5
శైరీషకం మహోత్థం చ వశే చక్రే మహాద్యుతిః ।
ఆక్రోశం చైవ రాజర్షిం తేన యుద్ధమభూన్మహత్ ॥ 6
అక్కడ మత్తమయూరకులనే పేరు కల రాజులతో ఘోరసంగ్రామం జరిగింది. వారిని జయించి సమగ్రమయిన మరుభూమిని, ధాన్యంతో తులతూగే శైరీషకాన్ని, మహోత్థదేశాన్ని సాధించాడు. తేజస్వి, మరుభూమి శాసకుడు అయిన ఆక్రోశుని జయించాడు. ఆక్రోశునితో అతనికి గొప్పయుద్ధం జరిగింది. (5,6)
తాన్ దశార్ణాన్ స జిత్వా చ ప్రతస్థే పాండునందనః ।
శిబీంస్త్రిగర్తానంబష్ఠాన్ మాళవాన్ పంచకర్పటాన్ ॥ 7
తథా మాధ్యమికాంశ్చైవ వాటధానాన్ ద్విజానథ ।
పిమ్మట దశార్ణదేశాన్ని ఓడించి నకులుడు శిబి, త్రిగర్త, అంబష్ఠ, మాళవ, పంచకర్పట మాధ్యమిక దేశాలను అన్నింటినీ జయించి వాటధానదేశీయులను వశపరచుకున్నాడు. (7 1/2)
పునశ్చ పరివృత్యాథ పుష్కరారణ్యవాసినః ॥ 8
గణానుత్సవసంకేతాన్ వ్యజయత్ పురుషర్షభః ।
మళ్ళీ అక్కడి నుండి చుట్టివచ్చి నకులుడు పుష్కరారణ్యనివాసులు ఉత్సవసంకేతులనే పేరున్న గణాలను అదుపులోకి తెచ్చాడు. (8 1/2)
సింధుకూలాశ్రితా యే చ గ్రామణీయా మహాబలాః ॥ 9
శూద్రాభీరగణాశ్చైవ యే చాశ్రిత్య సరస్వతీమ్ ।
వర్తయంతి చ యే మత్స్యైః యే చ పర్వతవాసినః ॥ 10
సముద్రతీరంలో నివసిమ్చే మహాబలవంతులు గ్రామణీయులు అనే పేరు గల క్షత్రియులను, సరస్వతీనదీ తీరాన ఉన్న శూద్రాభీరగణాలను, మత్స్యసంపదచే జీవించే పల్లెవారిని ఇతరప్రాంతీయ వాసులను ఓడించి వశంలోకి తెచ్చాడు. (9,10)
కృత్స్నం పంచనదం చైవ తథైవామరపర్వతమ్ ।
ఉత్తరజ్యోతిషం చైవ తథా దివ్యకటం పురమ్ ॥ 11
ద్వారపాలం చ తరసా వశే చక్రే మహాద్యుతిః ।
సమస్త పంచనదదేశాలను (పంజాబ్), అమరపర్వతం, ఉత్తరజ్యోతిషం, దివ్యకటం ద్వారపాలనగరాలను తేజస్వి అయన నకులుడు కొద్ది సమయంలో గెలిచాడు. (11 1/2)
రామఠాన్ హారహూణాంశ్చ ప్రతీచ్యాశ్చైవ యే నృపాః ॥ 12
తాన్ సర్వాన్ స వశే చక్రే శాసనాదేవ పాండవః ।
తత్రస్థః ప్రేషయామాస వాసుదేవాయ భారత ॥ 13
రామఠ, హార, హూణ, పశ్చుమనరాధీశులనందరినీ నకులుడు ఆజ్ఞామాత్రంచేతనే జయించి అధీనంలోకి తెచ్చాడు. అక్కడే ఉండి వసుదేవనందనుడైన శ్రీకృష్ణుని సమీపానికి దూతను పంపాడు. (12,13)
స చాస్య గతభీ రాజన్ ప్రతిజగ్రాహ శాసనమ్ ।
తతః శాకలమభ్యేత్య మద్రాణాం పుటభేదనమ్ ॥ 14
మాతులం ప్రీతిపూర్వేణ శల్యం చక్రే వశే బలీ ।
శ్రీకృష్ణుడు ప్రేమతో నకులుని శాసనాన్ని అంగీకరించాడు. తర్వాత శాకలదేశాన్ని గెలిచి నకులుడు మద్రరాజధానిలో ప్రవేశించి అక్కడి పరిపాలకుడు, మేనమాన అయిన శల్యుని ప్రేమతో జయించాడు. (14 1/2)
స తేన సత్కృతో రాజ్ఞా సత్కారార్హో విశాంపతే ॥ 15
రత్నాని భూరీణ్యాదాయ సంప్రతస్థే యుధాంపతిః ।
శల్యుని సమ్మానానికి అర్హుడైన నకులుడు ఉచిత సత్కారాన్ని పొంది కానుకగా రత్మరాశులను గ్రహించి బయలుదేరాడు. (15 1/2)
తతః సాగర కుక్షిస్థాన్ మ్లేచ్ఛాన్ పరమదారుణాన్ ॥ 16
పహ్లవాన్ బర్బరాంశ్చైవ కిరాతాన్ యవనాన్ శకాన్ ।
న్యవర్తత కురుశ్రేష్ఠః నకులశ్చిత్రమార్గవిత్ ॥ 17
చిత్రమార్గాలు తెలిసిన సముద్రమధ్యవాసులు, భయంకరులు, మ్లేచ్ఛులు, బర్బరులు, కిరాతులు, యవనులు, శకులను క్రమంగా జయించి నకులుడు ఇంద్రప్రస్థం వైపు సాగాడు. (16,17)
కరభాణాం సహస్రాణి కోశం తస్య మహాత్మనః ।
ఊహుర్దశ మహారాజ కృచ్ఛ్రాదివ మహాధనమ్ ॥ 18
నకులుడు గ్రహించిన రత్నరాశులను, వేలకొద్దీ గున్నఏనుగులు అతికష్టం మీద మోసితెచ్చాయి. (18)
ఇంద్రప్రస్థగతం వీరమ్ అభ్యేత్య స యుధిష్ఠిరమ్ ।
తతో మాద్రీసుతః శ్రీమాన్ ధనం తస్మై న్యవేదయత్ ॥ 19
ఇంద్రప్రస్థాన ప్రకాశించే యుధిష్ఠిరుని సమీపానికి శ్రీమంతుడు నకులుడు వచ్చి మొత్తం ధనాన్ని అప్పగించాడు.
ఏవం విజిత్య నకులో దిశం వరుణపాలితామ్ ।
ప్రతీచీం వాసుదేవేన నిర్జితామ్ భరతర్షభ ॥ 20
వాసుదేవుడు ఇదివరకే జయించిన పడమర దిక్కును జయించి నకులుడు ఇంద్రప్రస్థానికి తిరిగివచ్చాడు. (20)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి నకులప్రతీచీవిజయే ద్వాత్రింశోఽధ్యాయః ॥ 32 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున దిగ్విజయపర్వమను ఉపపర్వమున నకులప్రతీచీవిజయము అను ముప్పది రెండవ అధ్యాయము. (32)