30. ముప్పదియవ అధ్యాయము
భీముడు పూర్వదిగ్విజయము చేసి ఇంద్రప్రస్థమునకు తిరిగివచ్చుట.
వైశంపాయన ఉవాచ
తతః కుమారవిషమే శ్రేణిమంత మథాజయత్ ।
కోసలాధిపతిం చైవ బృహద్బలమరిందమః ॥ 1
వైశంపాయనుడు పలికాడు - శత్రుపీడాకరుడు భీముడు కుమారదేశపురాజు శ్రేణిమంతుని, కోసలరాజు బృహద్బలుని జయించాడు. (1)
అయోధ్యాయాం తు ధర్మజ్ఞం దీర్ఘయజ్ఞం మహాబలమ్ ।
అజయత్ పాండవశ్రేష్ఠః నాతితీవ్రేణ కర్మణా ॥ 2
అయోధ్యానగరాన బలవంతుడు, ధర్మజ్ఞుడు అయిన దీర్ఘయజ్ఞుని మృదువుగా యుద్ధరహితంగా భీముడు లొంగదీశాడు. (2)
తతో గోపాలకక్షం చ సోత్తరానపి కోసలాన్ ।
మల్లనామధిపం చైవ పార్థివమ్ చాజయత్ ప్రభుః ॥ 3
శక్తిశాలి వృకోదరుడు పిదప గోపాలకక్షుని ఉత్తరకోసల దేశాలను జయించి మల్లరాజ్యాధిపతి అయిన పార్థివుని తన అధీనంలోకి తెచ్చాడు. (3)
తతో హిమవతః పార్శ్వే సమభ్యేత్య జలోద్భవమ్ ।
సర్వమల్పేన కాలేన దేశం చక్రే వశం బలీ ॥ 4
హిమాలయసమీపానికి చేరి బలశాలి పాండవమధ్యముడు జలోద్భవరాజ్యంపై దండెత్తి స్వల్పకాలంలోనే తన వశం చేసుకొన్నాడు. (4)
ఏవం బహువిధాన్ దేశాన్ విజిగ్యే భరతర్షభః ।
భల్లాటమభితో జిగ్వే శుక్తిమంతం చ పర్వతమ్ ॥ 5
ఇలా భీముడు అనేక దేశాలను జయించి భల్లాట సమీపంలోని దేశాలను, శుక్తిమంతం అనే పర్వతాన్ని జయించాడు. (5)
పాండవః సుమహావీర్యః బలేన బలినామ్ వరః ।
స కాశీరాజం సమరే సుబాహుమనివర్తినమ్ ॥ 6
వశే చక్రే మహాబాహుః భీమో భీమపరాక్రమః ।
బలవంతుడు, పరాక్రమవంతుడు, పురుషార్థసాధకుడు అయిన భీముడు యుద్ధంలో ఎన్నడూ వెనుకంజవేయని కాశీరాజు సుబాహుని తన బాహుబలంతో లొంగదీశాడు. (6 1/2)
తతః సుపార్శ్వమభితః తథా రాజపతిం క్రథమ్ ।
యుధ్యమానం బలాత్ సంఖ్యే విజిగ్యే పాండవర్షభః ॥ 7
సుపార్శ్వ దేశసమీపాన బలంతో పోరాడే రాజరాజేశ్వరుడైన క్రథుని, యుద్ధంలో ఓడించాడు. (7)
తతో మత్స్యాన్ మహాతేజాః మలదాంశ్చ మహాబలాన్ ॥ 8
అనఘానభయాంశ్చైవ పశుభూమిం చ సర్వశః ।
నివృత్య చ మహాబాహుః మదధారం మహీధరమ్ ॥ 9
సోమధేయాంశ్చ నిర్జిత్య ప్రయయావుత్తరాముఖః ।
వత్సభూమిం చ కౌంతేయో విజిగ్యే బలవాన్ బలాత్ ॥ 10
మత్స్యదేశాన్ని, మలదప్రదేశాలను, అనఘ, అభయ ప్రదేశాలను, పశుపతి నాథ సమీపాన ఉన్న ప్రదేశాన్నంతటినీ జయించాడు. అక్కడి నుమ్డి వెనుతిరిగి బలశాలి భీముడు మదధారమనే పర్వతాన్ని, సోమధేయనివాసులనూ వశంలోకి తెచ్చాడు. ఉత్తర దిక్కుగా బయలుదేరి వత్సభూమిని బలంతో అధీనం చేసుకొన్నాడు. (8-10)
భర్గాణామధిపం చైవ నిషాదాధిపతిం తథా ।
విజిగ్యే భూమిపాలాంశ్చ మణిమత్ర్పముఖాన్ బహూన్ ॥ 11
తతో దక్షిణమల్లాంశ్చ భోగవంతం చ పర్వతమ్ ।
తరసైవాజయద్ భీమః నాతితీవ్రేణ కర్మణా ॥ 12
క్రమంగా భర్గదేశాల రాజును, నిషాదాధిపతిని, మణిమంతుడు మొదలైన రాజులను తన అధికారంలో ఉంచాడు. దక్షిణమల్లదేశాలను, భోగవంతం అనే పర్వతప్రాంతాన్ని ఎక్కువ ప్రయాసలేకుండానే భీముడు వశంలోకి తెచ్చుకొన్నాడు. (11,12)
శర్మకాన్ వర్మకాంశ్చైవ వ్యజయత్ సాంత్వపూర్వకమ్ ।
వైదేహకం చ రాజానం జనకం జగతీపతిమ్ ॥ 13
విజిగ్యే పురుషవ్యాఘ్రః నాతితీవ్రేణ కర్మణా ।
శకాంశ్చ బర్బరాంశ్చైవ అజయచ్ఛద్మపూర్వకమ్ ॥ 14
శర్మక వర్మకులను అనునయించి జయించాడు. విదేహరాజు జనకుని ఎక్కువ శ్రమలేకనే తనవాడిగా చేసుకొన్నాడు. శకులు, బర్బరులపై ఛలం ప్రయోగించి జయం సాధించాడు. (13,14)
వైదేహస్థస్తు కౌంతేయ ఇంద్రపర్వతమంతికాత్ ।
కిరాతానామధిపతీన్ అజయత్ సప్త పాండవః ॥ 15
తతః సుహ్మాన్ ప్రసుహ్మాంశ్చ సపక్షానతివీర్యవాన్ ।
విజిత్య యుధి కౌంతేయః మాగధానభ్యధాద్ బలీ ॥ 16
విదేహదేశంలో ఆగి కుంతీకుమారుడు భీముడు ఇంద్రపర్వతసమీపాన ఉన్న ఏడుగురు కిరాతరాజులను జయించాడు. తర్వాత సుహ్మ, ప్రసుహ్మదేశరాజులను, వారి పక్షంలోని సేనలను, యుద్ధంలో ఓడించి మగధదేశంవైపు సాగిపోయాడు. (15,16)
దండం చ దండధారం చ విజిత్య పృథివీపతీన్ ।
తైరేవ సహితైః సర్వైః గిరివ్రజముపాద్రవత్ ॥ 17
మార్గంలోని దండుని, దండధారుని, ఇతరరాజులను జయించి వారందరితో కలిసి గిరివ్రజపురం చేరాడు. (17)
జారాసంధిం సాంత్వయిత్వా కరే చ వినివేశ్య హ ।
తైరేవ సహితైః సర్వైః కర్ణమభ్యద్రవద్ బలీ ॥ 18
స కంపయన్నివ మహీం బలేన చతురంగిణా ।
యుయుధే పాండవశ్రేష్ఠః కర్ణేనామిత్రఘాతినా ॥ 19
స కర్ణం యుధి నిర్జిత్య వశే కృత్వా చ భారత ।
తతో విజిగ్యే బలవాన్ రాజ్ఞః పర్వతవాసినః ॥ 20
అథ మోదాగిరౌ చైవ రాజానం బలవత్తరమ్ ।
పాండవో బాహువీర్యేణ నిజఘాన మహామృథే ॥ 21
జరాసంధుని కుమారుని సహదేవుని అనునయించి అతను కప్పం కట్టేటట్లు రాజ్యంలో నెలకొలిపి, అందరితో కలిసి కర్ణునిపై దండెత్తాడు. భూమిని కంపింప చేసే చతురంగబలాలతో శత్రుఘాతియగు కర్ణునితో యుద్ధం ప్రకటించాడు. ఆ సమరంలో కర్ణుని జయించి తన వశంలోకి తెచ్చుకుని కప్పం కట్టించాడు. ఆపైన పర్వతప్రాంతరాజులపైకి యుద్ధానికి వెళ్ళి విజయాన్ని పొందాడు. మోదాగిరి రాజును బాహుబలంతో ఎదుర్కొని తన భుజబలంతో అతనిని చంపివేశాడు. (18-21)
తత్రః పుండ్రాధిపం వీరం వాసుదేవం మహాబలమ్ ।
కౌశికీ కచ్ఛనిలయం రాజానం చ మహౌజసమ్ ॥ 22
ఉభౌ బలభృతౌ వీరౌ ఉభౌ తీవ్రపరాక్రమౌ ।
నిర్జిత్యాజే మహారాజ వంగరాజముపాద్రవత్ ॥ 23
పిమ్మట పుండ్రాధిపతి వాసుదేవుని, కౌశికీనదీతీరంలోని మహౌజసుని జయించాడు. వారిరువురు బలవంతులు, ఎదిరింప శక్యంకాని పరాక్రమవంతులు, భీమసేనుడు పౌండ్రకవాసుదేవుని యుద్ధంలో ఓడించి వంగదేశాన్ని ఆక్రమించాడు. (22,23)
సముద్రసేనమ్ నిర్జిత్య చంద్రసేనం చ పార్థివమ్ ।
తామ్రలిప్తం చ రాజానం కర్వటాధిపతిం తథా ॥ 24
మహాత్మనామధిపం చైవ యే చ సాగరవాసినః ।
సర్వాన్ మ్లేచ్ఛగణాంశ్చైవ విజిగ్యే భరతర్షభః ॥ 25
భరతకులభూషణుడైన భీమసేనుడు సముద్రసేనుని, చంద్రసేనుని, తామ్రలిప్తదేశారాజును, కర్వటాధిపతిని, సుహ్మదేశాపురాజును, సముద్రతీరవాసులైన మ్లేచ్ఛరాజులను తన పరాక్రమంతో లొంగదీశాడు. (24,25)
ఏవం బహువిధాన్ దేశాన్ విజిత్య పవనాత్మజః ।
వసు తేభ్య ఉపాదాయ లౌహిత్యమగమద్ బలీ ॥ 26
ఈ ప్రకారంగా చాలా దేశాలను, రాజులను జయించి వాయుపుత్రుడు భీముడు వారి నుండి ధనాన్ని కానుకగా పొంది లౌహిత్యదేశంపై దండెత్తాడు. (26)
స సర్వాన్ మ్లేచ్ఛనృపతీన్ సాగరానూపవాసినః ।
కరమాహారయామాస రత్నాని వివిధాని చ ॥ 27
సముద్రతీరవాసులైన మ్లేచ్ఛరాజులను జయించి, వారి నుండి పన్నురూపంలో రత్నాలను, ఆభరణాలను గ్రహించాడు. (27)
చందనాగురువస్త్రాణి మణిమౌక్తిక కంబలమ్ ।
కాంచనం రజతం చైవ విద్రుమం చ మహాధనమ్ ॥ 28
తే కోటిశతసంఖ్యేన కౌంతేయం మహతా తదా ।
అభ్యవర్షన్ మహాత్మానం ధనవర్షేణ పాండవమ్ ॥ 29
ఇంతేకాదు ఆ రాజులందరు చందనం, అగరు, మణులు, వెండి, బంగారం, పగడాలు, వస్త్రాలు, ముత్యాలు, పట్టుబట్టలు, కంబళ్ళు, విలువైన ఆభరణాలు కానుకలుగా సమర్పించారు. కప్పంరూపంలో భీమసేనుని పై కోట్లకొలది ధనాన్ని, రత్నాలను వెదజల్లారు. (28,29)
ఇంద్రప్రస్థముపాగమ్య భీమో భీమపరాక్రమః ।
నివేదయామాస తదా ధర్మరాజాయ తద్ ధనమ్ ॥ 30
పరాక్రమవంతుడైన భీముడు ఇంద్రప్రస్థానికి తిరిగివచ్చి ధర్మరాజుకు ఆ ధనాన్నంతటినీ సమర్పించాడు. (30)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి భీమప్రాచీదిగ్విజయే త్రింశోఽధ్యాయః ॥ 30 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున దిగ్విజయపర్వమను ఉపపర్వమున భీమప్రాచీదిగ్విజయమను ముప్పదియవ అధ్యాయము. (30)