29. ఇరువది తొమ్మిదవ అధ్యాయము

భీమసేనుడు తూర్పు దిక్కును జయించుట.

వైశంపాయన ఉవాచ
ఏతస్మిన్నేవ కాలే తు భీమసేనోఽపి వీర్యవాన్ ।
ధర్మరాజమనుప్రాప్య యయౌ ప్రాచీం దిశమ్ ప్రతి ॥ 1
మహతా బలచక్రేణ పరరాష్ట్రావమర్దినా ।
హస్త్వశ్వరథపూర్ణేన దంశితేన ప్రతాపవాన్ ॥ 2
వృతో భరతశార్దూలః ద్విషచ్చోకవివర్ధనః ।
వైశంపాయనుడు పలికాడు - శత్రుశోకకారకుడై భరతవంశోన్నతి చేయగల భీముడు ఇదే సమయంలో ధర్మరాజు ఆజ్ఞ తీసుకొన్నాడు. శత్రురాజ్యాలను అణచివేయగల గొప్పసైన్యమూ, ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు కవచాలతొ తూర్పుదిక్కుకు బయలుదేరాడు. (1, 2 1/2)
స గత్వా నరశార్దూలః పంచాలానాం పురం మహత్ ॥ 3
పంచాలాన్ వివిధోపాయైః సాంత్వయామాస పాండవః ।
పురుషశ్రేష్ఠుడైన భీముడు పాంచాలమహానగరం అహిచ్ఛత్రానికి చేరి ఎన్నో విధాల ఉపాయాలతో వారిని అనునయించి వశం చేసుకొన్నాడు. (3 1/2)
తతః స గండకాంచ్ఛూరః విదేహాన్ భరతర్షభః ॥ 4
విజిత్యాల్పేన కాలేన దశార్ణానజయత్ ప్రభుః ।
తత్ర దశార్ణకో రాజా సుధర్మా లోమహర్షణమ్ ।
కృతవాన్ భీమసేనేన మహద్ యుద్ధం నిరాయుధమ్ ॥ 5
అక్కడి నుండి ముందుకు పోయి శూరుడు, వీరుడు అయిన భీముడు గండకీనదీ తీరంలోని విదేహదేశాలను కొద్దికాలంలోనే జయించి దశార్ణదేశంపై అధికారం చేజిక్కుంచుకొన్నాడు. దశార్ణదేశరాజు సుధర్ముడు భీమునితో శస్త్రాస్త్రాలు లేకుండా యుద్ధం చేశాడు. వారి మల్లయుద్ధం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. (4,5)
భీమసేనస్తు తద్ దృష్ట్వా తస్య కర్మ మహాత్మనః ।
అధిసేనాపతిం చక్రే సుధర్మాణం మహాబలమ్ ॥ 6
భీమసేనుడు అతని అద్భుతపరాక్రమాన్ని గమనించి ఆ సుధర్ముని తన ప్రధానసేనాపతిగా నియమించాడు. (6)
తతః ప్రాచీం దిశం భీమః యయౌ భీమపరాక్రమః ।
సైన్యేన మహతా రాజన్ కంపయన్నివ మేదినీమ్ ॥ 7
పిమ్మట భీముడు పెద్దసైన్యంతో భూమిని కంపింపచేస్తూ తూర్పుదిక్కుకు బయలుదేరాడు. (7)
సోఽశ్వమేధేశ్వరం రాజన్ రోచమానం సహానుగమ్ ।
జిగాయ సమరే వీరః బలేన బలినాం వరః ॥ 8
బలశాలి వృకోదరుడు అశ్వమేధాధిపతి అయిన రోచమానుని యుద్ధంలో తమ్ములతో సహా వశం చేసుకొన్నాడు. (8)
స తం నిర్జిత్య కౌంతేయః నాతితీవ్రేణ కర్మణా ।
పూర్వదేశం మహావీర్యః విజిగ్యే కురునందనః ॥ 9
మహావీరుడు భీముడు మృదువుగా రోచమానునితో యుద్ధం లేకుండానే పూర్వదేశంపై విజయం సాధించాడు. (9)
తతో దక్షిణమాగమ్య పుళిందనగరం మహత్ ।
సుకుమారం వశే చక్రే సుమిత్రం చ నరాధిపమ్ ॥ 10
అక్కడి నుండి దక్షిణమ్గా వచ్చి పులిందనగరం అయిన సుకుమారాన్ని, అక్కడిరాజు సుమిత్రుని తన అధీనంలోకి తెచ్చుకొన్నాడు. (10)
తతస్తు ధర్మరాజస్య శాసనాద్ భరతర్షభః ।
శిశుపాలం మహావీర్యమ్ అభ్యగాజ్జనమేజయ ॥ 11
జనమేజయా! ధర్మజుని ఆజ్ఞానుసారం పరాక్రమవంతుడైన శిశుపాలుడు ఉన్నచోటుకి వెళ్లాడు. (11)
చేదిరాజోఽపి తచ్ఛ్రుత్వా పాండవస్య చికీర్షితమ్ ।
ఉపనిష్క్రమ్య నగరాత్ ప్రత్యగృహ్ణాత్ పరంతప ॥ 12
చేదిరాజు కూడ ధర్మరాజు ఆభిప్రాయం తెలిసికొని నగరం వెలుపలికి వచ్చి స్వాగతసత్కారాలతో భీముని తనవాడిగా చేసుకొన్నాడు. (12)
తౌ సమ్యేత మహారాజ కురుచేదివృషౌ తదా ।
ఉభయోరాత్మకులయోః కౌశల్యం పర్యపృచ్ఛతామ్ ॥ 13
కురు, చేదివంశశ్రేష్ఠులు ఇరువురూ పరస్పరం కలిసి వారి వారి వంశాల గురించి కుశలప్రశ్నలు వేసుకున్నారు. (13)
తతో నివేద్య తద్ రాష్ట్రం చేదిరాజో విశాంపతే ।
ఉవాచ భీమం ప్రహసన్ కిమిదం కురుషేఽనఘ ॥ 14
తరువాత చేదిరాజు శిశిపాలుడు తన రాజ్యాన్ని భీమసేనునికి అప్పగించి నవ్వుతూ 'పాపరహితుడా! ఇలా ఎందుకు ఆచరిస్తున్నావు?' అని అడిగాడు. (14)
టహ్స్య భీమస్తదా ఽ ఽ చఖ్యౌ ధర్మరాజచికీర్షతమ్ ।
స చ తం ప్రతిగృహ్యైవ తథా చక్రే నరాధిపః ॥ 15
భీముడు శిశుపాలుడు ధర్మరాజు చేయదలచిన సర్వకార్యాలనూ వివరించాడు. అతని మాటలను శిశుపాలుడు అంగీకరిమ్చి కప్పం కట్టటానికి అంగీకరించాడు. (15)
తతో భీమస్తత్ర రాజన్ ఉషిత్వా త్రిదశక్షపాః ।
సత్కృతః శిశుపాలేన యయౌ సబలవాహనః ॥ 16
శిశుపాలునిచే సమ్మానితుడై భీముడు తన సేనావాహనాలతో పదమూడు రోజులు అక్కడ గడిపాడు. తరువాత అక్కడి నుండి బయలుదేరాడు. (16)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి భీమదిగ్విజయే ఏకోనత్రింశోఽధ్యాయః ॥ 29 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున దిగ్విజయపర్వమను ఉపపర్వమున భీమదిగ్విజయము అను ఇరువది తొమ్మిదవ అధ్యాయము. (29)