25. ఇరువది అయిదవ అధ్యాయము

(దిగ్విజయ పర్వము)

సంక్షిప్త దిగ్విజయము.

వైశంపాయన ఉవాచ
పార్థః ప్రాప్య ధనుఃశ్రేష్టమ్ అక్షయ్యౌ చ మహేషుధీ ।
రథం ధ్వజం సభాం చైవ యుధిష్ఠిరమభాషత ॥ 1
వైశంపాయనుడు పలికాడు - అర్జునుడు శ్రేష్ఠమైన విల్లు, అక్షయతూణీరాలు, జెండా, రథం, సభాభవనం పొంది యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు. (1)
అర్జున ఉవాచ
ధనురస్త్రం శరా వీర్యం పక్షో భూమిర్యశో బలమ్ ।
ప్రాప్తమేతన్మయా రాజన్ దుష్ప్రాపం యదభీప్సితమ్ ॥ 2
అర్జునుడు పలికాడు - విల్లు, అస్త్రాలు, బాణాలు, పరాక్రమం, సహాయకులు, రాజ్యం , కీర్తి, సైన్యం లాంటి దుర్లభమైనవన్నీ మనోవాంఛానుసారం పొందాను. (2)
తత్ర కృత్యమహం మన్యే కోశస్య పరివర్ధనమ్ ।
కరమాహారయిష్యామి రాజ్ఞః సర్వాన్ నృపోత్తమ ॥ 3
ధన్యుడనయ్యాను. రాజా! కోశాన్ని పెంచుకోవటమే ప్రస్తుతకర్తవ్యం. రాజులను ఓడించి పన్నును తీసికొని వస్తాను. (3)
విజయాయ ప్రయాస్యామి దిశం ధనదపాలితామ్ ।
తిథావథ ముహూర్తే చ నక్షత్రే చాభిపూజితే ॥ 4
మీ ఆజ్ఞ అయితే ఉత్తరదిక్కును జయించటానికి బయలుదేరతాను. తిథి, ముహూర్తం, నక్షత్రం పవిత్రాలై ఉండాలి. (4)
(ఏతచ్ఛ్రుత్వా కురుశ్రేష్ఠః ధర్మరాజః సహానుజః ।
ప్రహృష్టో మంత్రిభిశ్చైవ వ్యాస ధౌమ్యాదిభిః సహ ॥
తతో వ్యాసో మహాబుద్ధిరువాచేదం వచోఽర్జునమ్ ।
(ఇది విని సోదరులతో కూడిన ధర్మజునికి మిక్కిలి ప్రసన్నత ఏర్పడింది. మంత్రులు, వ్యాసుడు, ధౌమ్యుడు కూడ ఆనందించారు. అపుడు పరమబుధ్ధిమంతుడు వేదవ్యాసభగవానుడు అర్జునునితో ఇలా అన్నాడు.
వ్యాస ఉవాచ
సాధు సాధ్వితి కౌంతేయ దిష్ట్యా తే బుద్ధిరీదృశీ ।
పృథివీమఖిలాం జేతుమ్ ఏకోఽధ్యవసితో భవాన్ ॥
వ్యాసుడు పలికాడు - అర్జునా! భాగ్యవశాన నీకు చక్కని బుధ్ధి కలిగింది. చాలాబాగుంది. భూమినంతటినీ నీవొక్కడివే జయించే ఉత్సాహం నీకు కలిగింది.
ధన్యః పాండుర్మహీపాలః యస్య పుత్రస్త్వమీదృశః ।
సర్వం ప్రాప్స్యతి రాజేంద్రః ధర్మపుత్రో యుధిష్ఠిరః ॥
త్వ ద్వీర్యేణ స ధర్మాత్మా సార్వభౌమత్వమేష్యతి ।
పాండురాజు నీవంటి పుత్రుని పొంది ధన్యుడు అయ్యాడు. నీ పరాక్రమంతో యుధిష్ఠిరుడు అన్నింటిని పొందుతాడు. సార్వభౌముడై ఆ ధర్మాత్ముడు వెలిగిపోతాడు.
త్వద్బాహుబల మాశ్రిత్య రాజసూయమవాప్స్యతి ॥
సునయాద్ వాసుదేవస్య భీమార్జునబలేన చ ।
యమయోశ్చైవ వీర్యేణ సర్వే ప్రాప్స్యతి ధర్మరాట్ ॥
నీ బాహుబలసహాయంతో రాజసూయాన్ని నిర్విఘ్నంగా చేస్తాడు. శ్రీకృష్ణుని రాజనీతి వల్ల, భీమార్జునుల, బలం వల్ల, నకులసహదేవుల పరాక్రమం వల్ల ధర్మరాజు అన్నింటినీ పొందుతాడు.
తస్మాద్ దిశం దేవగుప్తామ్ ఉదీచీం గచ్ఛఫాల్గున ।
శక్తో భవాన్ సురాన్ జిత్వా రత్నాన్యాహర్తుమోజసా ॥
అర్జునా! అందువలన దేవతలచే సంరక్షింపబడే ఉత్తరదిక్కునకు నీవు పొమ్ము. నీవు దేవతలను జయించి రత్నాలను తీసుకురాగలవు.
ప్రాచీం భీమో బలశ్లాఘీ ప్రయాతు భరతర్షభః ।
యామ్యాం తత్ర దిశం యాతు సహదేవో మహారథః ॥
ప్రతీచీం నకులో గంతా వరుణేనాభిపాలితామ్ ।
ఏషా మే నైష్ఠికీ బుద్ధిః క్రియతాం భరతర్షభాః ॥
తూర్పుకు బలశాలి భీముడు, మహారథుడు సహదేవుడు దక్షిణానికి, నకులుడు వరుణపాలితం అయిన పడమర దిక్కుకు వెళ్ళాలి. ఇది నా బుద్ధిమేరకు చేసిన నిర్ణయం. దీన్ని మీరు పాలించండి.
వైశంపాయన ఉవాచ
శ్రుత్వా వ్యాసవచో హృష్టాః తమూచుః పాండునందనాః ।
వైశంపాయనుడు పలికాడు - వ్యాసుని మాటలను విని పాండుకుమారులందరు ఆనందించి ఆయనతో ఇలా అన్నారు.
పాండవా ఊచుః
ఏవమస్తు మునిశ్రేష్ఠ యథాఽఽజ్ఞాపయసి ప్రభో।)
పాండవులు పలికారు - మునిశ్రేష్ఠా! మీ ఆజ్ఞానుసారం మేం నడుస్తాం.
వైశంపాయన ఉవాచ
ధనంజయవచః శ్రుత్వా ధర్మరాజో యుధిష్ఠిరః ।
స్నిగ్ధగంభీరనాదిన్యా తం గిరా ప్రత్యభాషత ॥ 5
వైశంపాయనుడు అన్నాడు - అర్జునుని మాటలు విని ధర్మజుడు ప్రేమ, గాంభీర్యం ఉట్టుపడేటట్లు అతనితో అన్నాడు. (5)
స్వస్తివాచ్యార్హతో విప్రాన్ ప్రయాహి భరతర్షభ ।
దుర్హృదామప్రహర్షాయ సుహృదామ్ నందనాయ చ ॥ 6
పూజనీయులైన బ్రాహ్మణుల స్వస్తివాక్యాలు విని జైత్రయాత్రకు పొమ్ము. నీ యాత్ర స్నేహితులకు ఆనందమూ, శత్రువులకు శోకమూ కలిగిస్తుంది. (6)
విజయస్తే ధ్రువం పార్థ ప్రియం కామమవాప్స్యసి ।
ఇత్యుక్తః ప్రయయౌ పార్థః సైన్యేనమహతాఽఽవృతః ॥ 7
అగ్నిదత్తేన దివ్యేన రథేనాద్భుతకర్మణా ।
తథైవ భీమసేనోఽపి యమౌ చ పురుషర్షభౌ ॥ 8
సస్యైన్యాః ప్రయయుః సర్వే ధర్మరాజేన పూజితాః ।
అర్జునా! నీవిజయం తథ్యం. నీకోరిక తీరుతుంది.
ఈవిధంగా యుధిష్ఠిరుని ఆజ్ఞను పొంది అగ్ని ఇచ్చిన, అద్భుతాలను సాధింపగల రథంపై గొప్పసైన్యంతో అర్జునుడు ఉత్తరదిక్కుకు బయలుదేరాడు. భీమసేనుడు తూర్పుకు, కవలలు దక్షిణ పడమరలకు సైన్యాలతో బయలుదేరి అందరు యుధిష్ఠిరునిచే గౌరవింపబడ్డారు. (7,8 1/2)
దిశం ధనపతేరిష్టామజయత్ పాకశాసనిః ॥ 9
భీమసేనస్తథా ప్రాచీం సహదేవస్తు దక్షిణామ్ ।
ప్రతీచీం నకులో రాజన్ దిశం వ్యజయతాస్త్రవిత్ ॥ 10
ఇంద్రుని ప్రియపుత్రుడు అర్జునుడు ఉత్తరదిక్కున విజయాన్ని సాధించాడు. భీమసేనుడు తూర్పును, సహదేవుడు దక్షిణాన్ని, నకులుడు పడమరను జయించారు. (9,10)
ఖాండవప్రస్థమధ్యస్థః ధర్మరాజో యుధిష్ఠిరః ।
ఆసీత్ పరమయా లక్మ్యా సుహృద్గణవృతః ప్రభుః ॥ 11
ధర్మరాజొక్కడే తన మిత్రులందరితో కలిసి రాజ్యలక్ష్మిని అనుభవిస్తూ ఖాండవప్రస్థాన నివసించాడు. (11)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి దిగ్విజయసంక్షేపకథనే పంచవింశోఽధ్యాయః ॥ 25 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున దిగ్విజయపర్వమను ఉపపర్వమున దిగ్విజయసంక్షేపకథనము అను ఇరువది అయిదవ అధ్యాయము. (25)