26. ఇరువది ఆరవ అధ్యాయము

అర్జునుడు భగదత్తుని ఓడించుట.

జనమేజయ ఉవాచ
దిశామభిజయం బ్రహ్మన్ విస్తరేణానుకీర్తయ ।
న హి తృప్యామి పూర్వేషాం శృణ్వానశ్చరిత మహత్ ॥ 1
జనమేజయుడు పలికాడు - దిగ్విజయాలను విస్తరంగా చెప్పండి. పూర్వీకుల వృత్తాంతం పూర్తిగా విననిచో సంతృప్తి పొందలేను. (1)
వైశంపాయన ఉవాచ
ధనంజయస్య వక్ష్యామి విజయం పూర్వమేవ చ ।
యౌగపద్యేన పార్థైర్హి నిర్జితేయం వసుంధరా ॥ 2
వైశంపాయనుడు పలికాడు - కుంతీపుత్రులందరు ఒక్కసారిగానే నాలుగు దిక్కులను జయించారు. అయినా ముందుగా అర్జునుని దిగ్విజయాన్ని వర్ణిస్తాను. (2)
పూర్వం కుళిందవిషమే వశే చక్రే మహీపతీన్ ।
ధనంజయో మహాబాహుః నాతితీవ్రేణ కర్మణా ॥ 3
మహాభుజుడయిన అర్జునుడు పరాక్రమాన్ని ప్రదర్శించకుండానే కుళిందదేశా రాజులందరినీ జయించాడు. (3)
ఆనర్తాన్ కాలకూటాంశ్చ కుళిందాంశ్చ విజిత్య సః ।
సుమండలం చ విజితం కృతవాన్ సహసైనికమ్ ॥ 4
కుళిందులతో సహా ఆనర్తీయులను, కాలకూటులను జయించి సేనలతో కలిసి రాజమండలాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. (4)
స తేన సహితో రాజన్ సవ్యసాచీ పరంతపః ।
విజిగ్యే శాకలం ద్వీపం ప్రతివింధ్యం చ పార్థివమ్ ॥ 5
శత్రుసంతాపశీలి అర్జునుడు సమండలదేశంతో స్నేహం చేసి శాకలద్వీపాన్నీ, రాజైన ప్రతివింధ్యుని జయించాడు. (5)
శాకలద్వీపవాసాశ్చ సప్తద్వీపేషు యే నృపాః ।
అర్జునస్య చ సైన్యైస్తైః విగ్రహస్తుములోఽభవత్ ॥ 6
శాకలద్వీపం, మిగిలిన ఏడు ద్వీపాల రాజులకు అర్జునుని సైన్యానికి దొమ్మియుద్ధం జరిగింది. (6)
స తానపి మహేష్వాసాన్ విజిగ్యే భరతర్షభ ।
తైరేవ సహితః సర్వైః ప్రాగ్జ్యోతిషముపాద్రవత్ ॥ 7
భరతకులభూషణా! అర్జునుడు ఆ మహాయోధులందర్నీ వశపరచుకున్నాడు. వారందరితో కూడి ప్రాగ్జ్యోతిషపురంపై దాడి చేశాడు. (7)
తత్ర రాజా మహానాసీద్ భగదత్తో విశాంపతే ।
తేనాసీత్ సుమహద్ యుద్ధం పాండవస్య మహాత్మనః ॥ 8
రాజా! ప్రాగ్జ్యోతిషపురానికి ఆ సమయాన భగదత్తుడు మహారాజు. మహాత్ముడైన అర్జునునికి అతనితో గొప్పయుద్ధం జరిగింది. (8)
స కిరాతైశ్చ చీనైశ్చ వృతః ప్రాగ్జ్యోతిషోఽభవత్ ।
అన్యైశ్చ బహుభిర్యోధైః సాగరానూపవాసిభిః ॥ 9
ప్రాగ్జ్యోతిషాధిపతి భగదత్తుడు కిరాతులు, చీనులు, సముద్రతీరవాసులు మొదలగునవి చాలామంది యోధులతో కూడినాడు. (9)
తతః స దివసానష్టౌ యోధయిత్వా ధనంజయమ్ ।
ప్రహసన్నబ్రవీద్ రాజా సంగ్రామవిగతక్లమమ్ ॥ 10
భగదత్తుడు అర్జునునితో ఎనిమిదిరోజులు యుద్ధం చేసినా సంగ్రామమందు అలసిపోని అర్జునునితో నవ్వుతూ పలికాడు. (10)
ఉపపన్నం మహాబాహో త్వయి కౌరవనందన ।
పాకశాసన దాయాదే వీర్యమాహవశోభిని ॥ 11
నీవు ఇంద్రునిపుత్రుడవు. సంగ్రామంలో శోభతో కూడిన పరాక్రమశాలివి. నీ యందు ఈ బలం, పరాక్రమం తగినవే. (11)
అహం సఖా మహేంద్రస్య శక్రాదనవరో రణే ।
న శక్ష్యామి చ తే తాత స్థాతుం ప్రముఖతో యుధి ॥ 12
నేను దేవతల రాజు ఇంద్రుని స్నేహితుణ్ణి. యుద్ధంలో అతనితో కొంచెమ్ కూడ తక్కువవాణ్ణి కాదు. అయినా సంగ్రామంలో నీ ఎదుట నిలువలేని వాణ్ణి అయ్యాను. (12)
త్వమీప్సితం పాండవేయ బ్రూహి కిం కరవాణి తే ।
యద్ వక్ష్యసి మహాబాహో తత్ కరిష్యామి పుత్రక ॥ 13
అర్జునా! నీకోరికను తెలుపు. నేను తప్పక తీరుస్తాను. వత్సా! నీవు చెప్పినదాన్ని తప్పక ఆచరిస్తాను. (13)
అర్జున ఉవాచ
కురుణామృషభో రాజా ధర్మపుత్రో యుధిష్ఠిరః ।
ధర్మజ్ఞః సత్యసంధశ్చ యజ్వా విపులదక్షిణః ॥ 14
తస్య పార్థివతామీప్సే కరస్తస్మై ప్రదీయతామ్ ।
భవాన్ పితృసఖా చైవ ప్రీయమాణొ మయాపి చ ।
తతో నాజ్ఞాపయామి త్వం ప్రీతిపూర్వం ప్రదీయతామ్ ॥ 15
అర్జునుడు అన్నాడు - ధర్మజ్ఞుడు, సత్యవాక్పాలకుడు, కురుకులశ్రేష్ఠుడు, యజ్ఞాల్లో గొప్ప దక్షిణలు ఇచ్చేవాడు అయిన యుధిష్ఠిరుడు రాజసూయం చేయనిశ్చయించాడు. అతణ్ణి చక్రవర్తిని చేయాలని అనుకొంటున్నాను. మీరు అతనికి కప్పాలు కట్టండి. మీరు నా తండ్రికి స్నేహితులు, నాపై ప్రేమకలవారు. కావున మిమ్ములను ఆజ్ఞాపించలేను. ప్రేమభావంతో పన్ను కట్టండి. (14,15)
భగదత్త ఉవాచ
కుంతీమాతర్యథా మే త్వం తథా రాజా యుధిష్ఠిరః ।
సర్వమేతత్ కరిష్యామి కిం చాన్యత్ కరవాణి తే ॥ 16
భగదత్తుడు పలికాడు - అర్జునా! నాకు నీవు ఎలాంటి వాడివో యుధిష్ఠిరుడు కూడ అలాంటివాడు. నేను దాని నంతటినీ చేస్తాను. నీకొరకు ఇంకా ఏమి చేయమంటావు? (16)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి అర్జునదిగ్విజయే భగదత్తపరాజయే షడ్వింశోఽధ్యాయః ॥ 26 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున దిగ్విజయపర్వమను ఉపపర్వమున దిగ్విజయము, భగదత్తపరాజయము అను ఇరువది ఆరవ అధ్యాయము. (26)