14. పదునాలుగవ అధ్యాయము

శ్రీకృష్ణుడు రాజసూయమునకు సమ్మతించుట.

కృష్ణ ఉవాచ
సర్వైర్గుణైర్మహారాజ రాజసూయం త్వమర్హసి ।
జానతస్త్వేవ తే సర్వే కించిద్ వక్ష్యామి భారత ॥ 1
శ్రీకృష్ణుడిలా అన్నాడు.
మహారాజా! నీవు సర్వగుణవంతుడవు. రాజసూయం చేయదగినవాడవు. భారతా! నీకంతా తెలుసు. అయినా అడిగావు కాబట్టి నాకు తోచినది చెపుతాను. (1)
జామదగ్న్యేన రామేణ క్షత్రం యదవశేషితమ్ ।
తస్మాదవరజం లోకే యదిదం క్షత్రసంజ్ఞితమ్ ॥ 2
జమదగ్నికుమారుడయిన పరశురాముడు క్షత్రియుల నందరనూ సంహరించాడు. అప్పుడు మిగిలిపోయిన రాజులు పోయినవారికన్న తక్కువ వారు. కాబట్టి ఇప్పుడు లోకంలో క్షత్రసంజ్ఞ నామమాత్రమే. (2)
కృతోఽయం కులసంకల్పః క్షత్రియైర్వసుధాధిప ।
నిదేశవాగ్భిస్తత్ తే హ విదితం భరతర్షభ ॥ 3
రాజా! క్షత్రియులంతా కలిసి 'క్షత్రియుల నందరనూ జయించినవాడే సమ్రాట్టు కాదగినవాడ"ని ఒక కులనియమాన్ని ఏర్పాటు చేసికొన్నారు. ఆ విషయం నీకు కూడా తెలుసు. (3)
ఐలస్యేక్ష్వాకువంశస్య ప్రకృతిం పరిచక్షుతే ।
రాజానః శ్రేణిబద్ధాశ్చ తథాన్యే క్షతియా భువి ॥ 4
పెద్ద పెద్ద రాజులు, భూమండలంలోని ఇతర సామాన్యరాజులు కూడా తమను పురూరవునకు, ఇక్ష్వాకునకు వారసులుగా భావిస్తారు. (4)
వి॥సం॥ చంద్రవంశానికి పురూరవుని, సూర్యవంశానికి నాభాగాదులను ముఖ్యులుగా పరిగణించారు. (నీల)
ఐలవంశ్యాశ్చ యే రాజన్ తథైవేక్ష్యాకవో నృపాః ।
తాని చైకశతం విద్ధి కులాని భరతర్షభ ॥ 5
భరతశ్రేష్ఠా! ధర్మరాజా! పురూరవవంశీయులు, ఇక్ష్వాకువంశీయులై ఇప్పుడున్న రాజులలో వందవంశాలు ఉన్నాయని తెలుసుకో. (5)
వి॥సమ్॥ నూట ఒక్కవంశాలు (దేవ)
యయాతేస్త్వేవ భోజానాం విస్తరో గుణతో మహాన్ ।
భజతేఽద్య మహారాజ విస్తరం స చతుర్దిశమ్ ॥ 6
తేషాం తథైవ తాం లక్ష్మీం సర్వక్షత్రముపాసతే ।
మహారాజా! ఈనాడు యయాతి వారసులలో భోజవంశీయులే గుణదృష్టిలో బాగా విస్తరించి ఉన్నారు. ఆ వంశం నాలుగుదిక్కులా విస్తరించి ఉన్నది. నేటి క్షత్రియులంతా ఆ వంశసంపదనే ఆశ్రయిస్తున్నారు. (6 1/2)
ఇదానీమేవ వై రాజన్ జరాసంధో మహీపతిః ॥ 7
అభిభూయ శ్రియం తేషాం కులానామభిషేచితః ।
స్థితో మూర్ధ్ని నరేంద్రాణామ్ ఓజసాక్రమ్య సర్వశః ॥ 8
రాజా! ప్రస్తుతం జరాసంధ భూపాలుడు సమస్తక్షత్రియుల సంపదలను కొల్లగొట్టి సమ్రాట్టుగా అభిషిక్తుడయ్యాడు. తన బలపరాక్రమాలతో అందరినీ ఆక్రమించి ఆ జరాసంధుడు రాజులపై ఆధిపత్యం వహించాడు. (7,8)
సోఽవనిం మధ్యమాం భూక్త్వా మిథోభేదమమన్యత ।
ప్రభుర్యస్తు పరోరాజా యస్మిన్నేకవశే జగత్ ॥ 9
ఆ జరాసంధుడు భూమండలాన్ని అనుభవిస్తూ ఇతర రాజులతో మిత్రభేదాన్ని కల్పిస్తున్నాడు. ఇప్పుడు అందరిని మించిన రాజతడే. లోకమంతా ఆయన అదుపులో ఉన్నది. (9)
వి॥సం॥ ఇచట మధ్యమాం అనగా మధురదేశమని నీలకంఠుడు. (మధ్యమాం మధురాదేశరూపమ్ అస్మదీయాం అస్మాసు ద్వారవతీం గతేషు భుక్త్వా మిథః అస్మాభిః సహభేదం వైరం అమన్యత)
స సామ్రాజ్యం మహారాజ ప్రాప్తో భవతి యోగతః ।
తం స రాజా జరాసంధం సంశ్రిత్య కిల సర్వశః ॥ 10
రాజన్ సేనాపతిర్జాతః శిశుపాలః ప్రతాపవాన్ ।
మహారాజా! ఆ జరాసంధుడు తన యుక్తితో రాజనీతితో మహాసామ్రాజ్యాన్ని సాధించుకొన్నాడు. రాజా! పరాక్రమవంతుడయిన శిశుపాలనరపాలుడు అన్నివిధాలా ఆ జరాసంధుని ఆశ్రయించి ఆయన దగ్గర సేనాపతి అయ్యాడు. (10 1/2)
తమేవ చ మహారాజ శిష్యవత్ సముపస్థితః ॥ 11
వక్రః కరూషాధిపతిః మాయాయోధీ మహాబలః ।
మహారాజా! మాయాయుద్ధనిపుణుడూ, మహాబలుడూ కరూషాధిపతీ వక్రుడూ అయిన దంతవక్త్రుడు కూడా ఆ జరాసంధునే ఆశ్రయించి శిష్యునివలె ప్రవర్తిస్తున్నాడు. (11 1/2)
అపరౌ చ మహావీర్యౌ మహాత్మానౌ సమాశ్రితౌ ॥ 12
జరాసంధం మహావీర్యం తౌ హంసడింభకావుభౌ ।
అంతేకాక మహాపరాక్రమవంతులు, మహాత్ములు అయిన హంసడింభకులు కూడా పరాక్రమశాలి అయిన జరాసంధుని ఆశ్రయించి ఉన్నారు. (12 1/2)
దంతవక్ర్తః కరూషశ్చ కరభో మేఘవాహనః ।
మూర్ధ్నా దివ్యమణిం బిభ్రద్ యమద్భుతమణిం విదుః ॥ 13
కరూషదేశాధిపతి దంతవక్ర్తుడు, కరభుడు, మేఘవాహనుడు దివ్యమణిమయకిరీటాలను శిరసా ధరిస్తూ కూడా జరాసంధుని తమ శిరోమణిగా భావిస్తున్నారు. (13)
మురం చ నరకం చైవ శాస్తి యో యవనాధిపః ।
అపర్యంతబలో రాజా ప్రతీచ్యాం వరుణో యథా ॥ 14
భగదత్తో మహారాజ వృద్ధస్తవ పితుః సఖా ।
స వాచా ప్రణతస్తస్య కర్మణా చ విశేషతః ॥ 15
స్నేహబద్ధశ్చ మనసా పితృవద్ భక్తిమాంస్త్వయి ।
యవనాధిపుడైన భగదత్తుడు ముర, నరక దేశాలను పరిపాలించేవాడు. అంతులేని బలం కలవాడు. పడమట దిక్కున వరుణుని వలె బలసంపన్నుడు. నీ తండ్రికి మిత్రుడు. వయస్సు మళ్ళినవాడు. ఆ భగదత్తుడు కూడా వాచా, కర్మణా కూడా విశేషంగా జరాసంధునకు లోబడి ఉన్నాడు. అయినా మనస్సులో నీపై స్నేహబంధం గలవాడు. నీయందు తండ్రివలె వాత్సల్యం గలవాడు. (14,15 1/2)
ప్రతీచ్యాం దక్షిణం చాంతం పృథివ్యాః ప్రతి యో నృపః ॥ 16
మాతులో భవతః శూరః పురుజిత్ కుంతివర్ధనః ।
స తే సన్నతిమానేకః స్నేహతః శత్రుసూదనః ॥ 17
పశ్చిమదిక్కునుండి దక్షిణదిగంతం వరకు భూమిని పాలిస్తున్న నీ మేనమామ కుంతిభోజకులవర్ధకుడైన పురుజిత్తు పరాక్రమశాలి, శత్రుసంహారకుడు. ఆయన నీపై అనన్యస్నేహభావం గలవాడు. (16,17)
జరాసంధం గతస్త్వేవ పురా యో న మయా హతః ।
పురుషోత్తమవిజ్ఞాతః యోఽసౌ చేదిషు దుర్మతిః ॥ 18
ఆత్మానం ప్రతిజానాతి లోకేఽస్మిన్ పురుషోత్తమమ్ ।
ఆదత్తే సతతం మోహాద్ యః చిహ్నమ్ చ మామకమ్ ॥ 19
వంగపుండ్రకిరాతేషు రాజా బలసమన్వితః ।
పౌండ్రకో వాసుదేవేతి యోఽసౌ లోకేఽభివిశ్రుతః ॥ 20
వంగ, పుండ్ర, కిరాతదేశాధిపతి అయిన పౌండ్రకుడు కూడా జరాసంధుని పక్షాన చేరాడు. గతంలో నేను ఉదాసీనత కారణంగా ఆ పౌండ్రకుని సంహరించలేదు. చేదిదేశంలో పురుషోత్తముడుగా భావింపబడతాడు. దుర్మతి అయిన ఆ పౌండ్రకుడు తనను తాను పురుషోత్తమునిగా భావించుకొని, ఉబలాటంతో ఎప్పుడూ నాలాగా శంఖచక్రాలు ధరించి ఉంటాడు. పౌండ్రక వాసుదేవుడని అతనికి లోకవిఖ్యాతి. (18-20)
చతుర్థభాగ్ మహారాజ భోజ ఇంద్రసఖో బలీ ।
విద్యాబలాద్ యో వ్యజయత్ సపాండ్యక్రథకైశికాన్ ॥ 21
భ్రాతా యస్యాకృతిః శూరో జామదగ్న్యసమోఽభవత్ ।
స భక్తో మాగధం రాజా భీష్మకః పరవీరహా ॥ 22
మహారాజా! ఈ భూమండలంలోని నాలుగవ భాగానికి రాజు, ఇంద్రుని మిత్రుడు, బలశాలి, తన అస్త్రవిద్యాబలంతో పాండ్య, క్రథ, కైశిక దేశాలను జయించినవాడు, పరశురాముని వంటి సోదరుడు గలవాడు, శూరుడు, శత్రుసంహర్త అయిన భీష్మకుడు కూడా జరాసంధుని భక్తుడే. (21,22)
ప్రియాణ్యాచరతః ప్రహ్వాన్ సదా సంబంధినస్తతః ।
భజతో న భజత్యస్మాన్ అప్రియేషు వ్యవస్థితః ॥ 23
బంధువులమైన మేము ఎల్లప్పుడూ వినయంగా ఎంత అనుకూలంగా ప్రవర్తించినా, మా శత్రువులతో చేయి కలిపిన ఆ భీష్మకుడు మమ్ము తన వారినిగా భావించడు. (23)
న కులం స బలం రాజన్ అభ్యజానాత్ తథాత్మనః ।
పశ్యమానో యశీదీప్తం జరాసంధముపస్థితః ॥ 24
రాజా! ఆయన తన బలాన్ని, తన వంశాన్ని కూడా పరిగణించక జరాసంధుని యశోదీప్తిని చూసి ఆయన పక్షాన చేరాడు. (24)
ఉదీచ్యాశ్చ తథా భోజాః కులాన్యష్టాదశ ప్రభో ।
జరాసంధభయాదేవ ప్రతీచీం దిశమాస్థితాః ॥ 25
రాజా! ఉత్తరదిక్కున నున్న పద్దెనిమిది భోజవంశలు కూడా జరాసంధుని చూచి భయపడి పడమటదిక్కును ఆశ్రయించాయి. (25)
శూరసేనా భద్రకారా బోధాః శాల్వాః పటచ్చరాః ।
సుస్థలాశ్చ సుకుట్టాశ్చ కులిందాః కుంతిభిః సహ ॥ 26
శాల్వాయనాశ్చ రాజానః సోదర్యానుచరైః సహ ।
దక్షిణా యే చ పంచాలాః పూర్వః కుంతిషు కోశలాః ॥ 27
తథోత్తరాం దిశం చాపి పరిత్యజ్య భయార్దితాః ।
మత్స్యాః సంన్యస్తపాదాశ్చ దక్షిణాం దిశమాశ్రితాః ॥ 28
శూరసేనులు, భద్రకారులు, బోధులు, శాల్వులు, పటచ్చరులు, సుస్థలులు, సుకుట్టులు, కులిందులు, కుంతులు, శాల్వాయనులు కూడా తమ సోదరులతో సేవకులతో కలిసి దక్షిణదిక్కుకు పారిపోయారు. దక్షిణపంచాలదేశంలోనూ, కుంతిప్రదేశాలలోను ఉన్న క్షత్రియులు, కోశలులు; మత్స్య, సంన్యస్తపాదాది రాజులు కూడా జరాసంధునకు భయపడి ఉత్తరదిక్కును వీడి దక్షిణానికి పారిపోయారు. (26-28)
తథైవ సర్వపంచాలాః జరాసంధభయార్దితాః ।
స్వరాజ్యం సంపరిత్యజ్య విద్రుతాః సర్వతో దిశమ్ ॥ 29
అదేరీతిగా పంచాలరాజులందరూ జరాసంధునకు భయపడి తమ రాజ్యాలను విడిచి సర్వదిక్కులకు పరుగెత్తారు. (29)
కస్యచిత్ త్వథ కాలస్య కంసో నిర్మథ్య యాదవాన్ ।
బార్హద్రథసుతే దేవ్యౌ ఉపాగచ్ఛద్ వృథామతిః ॥ 30
కొంతకాలం క్రితం బుద్ధిహీనుడైన కంసుడు యాదవులను మథించి జరాసంధుని కుమార్తెల నిద్దరిని వివాహమాడాడు. (30)
అస్తిః ప్రాప్తిశ్చ నామ్నా తే సహదేవానుజేఽబలే ।
బలేన తేన స్వజ్ఞాతీన్ అభిభూయ వృథామతిః ॥ 31
శ్రైష్ఠ్యం ప్రాప్తః స తస్యాసీద్ అతీవాపనయోమహాన్ ।
వారిపేర్లు అస్తి, ప్రాప్తి. వారు సహదేవుని చెల్లెళ్ళు. వృథామతి అయిన కంసుడు జరాసంధుని బలంతో తనవారినందరినీ పరాభవించి అందరికన్న పైకి వెళ్ళాడు. కంసుడు చేసిన పెద్ద అత్యాచారమిది. (31 1/2)
భోజరాజన్యవృద్ధైశ్చ పీడ్యమానైర్దురాత్మనా ॥ 32
జ్ఞాతిత్రాణమభీప్సద్భిః అస్మత్సంభావనా కృతా ।
దుర్మార్గుడైన ఆ కంసుడు పీడించగా భోజరాజవంశీయులయిన పెద్దలు జ్ఞాతిసంరక్షణకై నన్ను అభ్యర్థించారు. (32 1/2)
దత్త్వా క్రూరాయ సుతనుం తామాహుకసుతామ్ తదా ॥ 33
సంరక్షణద్వితీయేన జ్ఞాతికార్యం మయా కృతమ్ ।
హతే కంససునామానౌ మయా రామేణ చాప్యుత ॥ 34
అప్పుడు నేను ఆహుకుని కుమార్తె అయిన సుతనువు వివాహాన్ని అక్రూరునితో జరిపించాను. బలరాముని సహకారంతో జ్ఞాతిరక్షణ కార్యాన్ని ముగించాను. నేనూ, బలరాముడూ కంసునీ, సునామునీ సంహరించాము. (33,34)
భయే తు సమతిక్రాంతే జరాసంధే సముద్యతే ।
మంత్రోఽయం మంత్రితో రాజన్ కులైరష్టాదశావరైః ॥ 35
రాజా! కంసునివలన భయమ్ పోయింది. అయితే జరాసంధుడు మాపై విజృంభించాడు. అప్పుడు భోజవంశానికి చెందిన పద్దెనిమిది కులాలకు చెందిన వారమూ కలిసి ఆలోచించాం. (35)
అనారభంతో నిఘ్నంతః మహాస్త్రైః శత్రుఘాతిభిః ।
న హన్యామో వయం తస్య త్రిభిర్వర్షశతైర్బలమ్ ॥ 36
మనం శత్రువులను సంహరించ గల మహాస్త్రాలను గైకొని నిరంతరమూ యుద్ధం చేసినా మూడువందల సంవత్సరాలలోపు జరాసంధుని బలాన్ని నాశనం చేయలేము. (36)
తస్య హ్యమరసంకాశౌ బలేన బలినాం వరౌ ।
నామభ్యాం హంసడింభకౌ అశస్త్రనిధనావుభౌ ॥ 37
శ్రేష్ఠబలవంతులయి దేవేంద్రసమానులైన హంసడింభకులు జరాసంధుని అనుచరులు. వారు ఏ శస్త్రాస్త్రాల వలన మరణించకుండునట్లు వరాలు పొందినవారు. (37)
తావుభౌ సహితౌ వీరౌ జరాసంధశ్చ వీర్యవాన్ ।
త్రయస్త్రయాణాం లోకానాం పర్యాప్తా ఇతి మే మతిః ॥ 38
ఆ హంసడింభకులిద్దరూ, పరాక్రమశాలి అయిన జరాసంధుడు - ఈ ముగ్గురూ కలిసి మూడులోకాల నెదిరించటానికయినా సమర్థులని నా విశ్వాసం. (38)
న హి కేవలమస్మాకం యావన్తోఽన్యే చ పార్థివాః ।
తథైవ తేషామాసీచ్చ బుద్ధిర్బుద్ధిమతాం వర ॥ 39
ధీమంతులలో శ్రేష్ఠుడవైన యుధిష్టిరా! ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు. ఇతరరాజులు అందరు కూడా ఈ రీతిగానే భావిస్తున్నారు. (39)
అథ హంస ఇతి ఖ్యాతః కశ్చితాసీన్మహాన్ నృపః ।
రామేణ స హతస్తత్ర సంగ్రామేఽష్టాదశావరే ॥ 40
జరాసంధునితో పదిహేడుసార్లు పోరాడినపుడు యుద్ధంలో బలరాముడు హంసుడని పేరుగల ఒకరాజును చంపాడు. (40)
హతో హంస ఇతి ప్రోక్తమ్ అథకేనాపి భారత ।
తచ్ర్ఛుత్వా డింభకో రాజన్ యమునాంభస్యమజ్జత ॥ 41
ధర్మజా! ఆ సమయంలో ఎవరో హంసుడు మరణించాడు అన్నారు. అది విని డింభకుడు యమునానదిలో మునిగాడు. (41)
వినా హంసేన లోకేఽస్మిన్ నాహం జీవితుముత్సహే ।
ఇత్యేతామ్ మతిమాస్థాయ డింభకో నిధనం గతః ॥ 42
హంసుడు లేనిజీవితం ఈ లోకంలో నాకు అవసరమ్ లేదంటూ డింభకుడు మరణించాడు. (42)
తథా తు డింభకం శ్రుత్వా హంసః పరపురంజయః ।
ప్రపేదే యమునామేవ సోఽపి తస్యాం న్యమజ్జత ॥ 43
డింభకుడు ఆ రీతిగా మరణించిన మాట విని శత్రుపురవిజేత అయిన హంసుడు తాను కూడా యమునలోనే మునిగి మరణించాడు. (43)
తౌ స రాజా జరాసంధః శ్రుత్వా చ నిధనం గతౌ ।
పరం శూన్యేన మనసా ప్రయయౌ భరతర్షభ ॥ 44
భరతశ్రేష్ఠా! హంసడింభకులు మరణించినట్లు విని జరాసంధమహారజు శూన్యమనస్కుడై నిర్గమించాడు. (44)
తతో వయమమిత్రఘ్న తస్మిన్ ప్రతిగతే నృపే ।
పునరానందినః సర్వే మథురాయాం వసామహే ॥ 45
శత్రుసంహారా! రాజా! ఆ విధంగా జరాసంధుడు మరలిపోగా మేమంతా మరల ఆనందంగా మథురలో నివసిస్తున్నాము. (45)
యదా త్వభ్యేత్య పితరం సా వై రాజీవలోచనా ।
కంసభార్యా జరాసంధం దుహితా మాగధం నృపమ్ ।
చోదయత్యేవ రాజేంద్ర పతివ్యసనదుఃఖితా ॥ 46
పతిఘ్నమ్ మే జహీత్యేవం పునః పునరరిందమ ।
భర్తృమరణంతో బాధపడుతూ కంసుని భార్య తండ్రి అయిన జరాసంధుని దగ్గరకు వచ్చి 'నా భర్తను చంపిన వానిని చంపు' అని పదేపదే ఒత్తిడి చేసింది. (46 1/2)
తతో వయం మహారాజ తమ్ మంత్రం పూర్వమంత్రితమ్ ॥ 47
సంస్మరంతో విమనసః వ్యపయాతో నరాధిప ।
మహారాజా! అప్పుడు మేము గతంలో చేసిన ఆలోచననే మనస్సులో నుంచుకొని ఉదాసీనంగా మధురను వీడి దూరంగా వెళ్ళాము. (47 1/2)
పృథక్త్వేన మహారాజ సంక్షిప్య మహతీం శ్రియమ్ ॥ 48
పలాయామో భయాత్ తస్య ససుతజ్ఞాతిబాంధవాః ।
ఇతి సంచింత్య సర్వే స్మ ప్రతీచీం దిశమాశ్రితాః ॥ 49
మహారాజా! అప్పుడు మేమంతా శత్రుభయంతో అక్కడున్న విస్తారసంపదను విడివిడిగా కొంచెం కొంచెంగా తీసుకొని జ్ఞాతిబాంధవులతో కలిసి పారిపోవాలని నిర్ణయించుకొని పశ్చిమదిక్కును ఆశ్రయించినాం. (48,49)
కుశస్థలీం పురీం రమ్యాం రైవతేనోపశోభితామ్ ।
తతో నివేశం తస్యాం చ కృతవంతో వయం నృప ॥ 50
ధర్మరాజా! రైవతకాద్రిచే రమణీయమైన కుశస్థలిపురంలో మేము నివసించసాగాం. (50)
తథైవ దుర్గసంస్కారం దేవైరపి దురాసదమ్ ।
స్త్రియోఽపి యస్యాం యుధ్యేయుః కిము వృష్ణిమహారథాః ॥ 51
దేవతలు కూడా చొరరానితీరున అక్కడ కోటను బాగుచేసికొన్నాం. ఆ దుర్గంలో నిలిచి ఆడవారు కూడా యుద్ధం చేయగలరు. ఇక వృష్ణియోధులను గురించి చెప్పవలసినదేముంది? (51)
తస్యాం వయమమిత్రఘ్న నివసామోఽకుతోభయాః ।
ఆలోచ్య గిరిముఖ్యం తం మగధం తీర్ణమేవ చ ॥ 52
మాధవాః కురుశార్దూల పరాం ముదపవాప్నువన్ ।
శత్రుసంహారా! మేమక్కడ నిర్భయంగా నివసిస్తున్నాం. కురువంశశ్రేష్ఠా! రైవతకపర్వతం దుర్గమమన్న భావనతో జరాసంధుని వలన ఇబ్బంది తొలగిపోయిందన్న నిశ్చయంతో మధువంశస్థులంతా సుఖంఘా ఉన్నారు. (52 1/2)
ఏవం వయం జరాసంధాద్ అభితః కృతకిల్బిషాః ॥ 53
సామర్థ్యవంతః సంబంధాద్ గోమంతం సముపాశ్రితాః ।
రాజా! మేము జరాసంధినిదృష్టిలో తప్పుచేసినవారం. అందువలననే మా స్వస్థలాన్ని విడిచి రైవతకపర్వతాన్ని ఆశ్రయించవలసివచ్చింది. (53 1/2)
త్రియోజనాయతం సద్మ త్రిస్కందం యోజనావధి ॥ 54
యోజనాంతే శతద్వారం వీరవిక్రమతోరణమ్ ।
అష్టాదశావరైర్నద్ధం క్షత్రియైర్యుద్ధదుర్మదైః ॥ 55
రైవతకాద్రిలోని కోట మూడు యోజనాల పొడవు గలది. ఒక్కొక్క యోజనం దగ్గరా మూడుదళాలసేన ఉంటుంది. వీరుల పరాక్రమమే దాని తోరణం. ఉన్మత్తులై యుద్ధం చేయగల పద్దెనిమిది యాదవవంశాల ఆవరణాలచే అది రక్షింపబడుతోంది. (5,55)
అవరైః = ఆవరణైః (దేవ)
అష్టాదశ సహస్రాణి భ్రాతృణాం సంతి నః కులే ।
ఆహుకస్య శతం పుత్రా ఏకైకస్త్రిదశావరః ॥ 56
మా వంశంలో పద్దెనిమిది వేలమంది సోదరులున్నారు. ఆహుకునకు వందమంది కొడుకులు, ఒక్కొక్కడూ దేవతల వంటి పరాక్రమం గలవాడు. (56)
చారుదేష్ణః సహభ్రాతా చక్రదేవోఽథ సాత్యకిః ।
అహం చ రౌహిణేయశ్చ సాంబః ప్రద్నుమ్న ఏవ చ ॥ 57
ఏవమతిరథాః సప్త రాజన్నన్యాన్ నిబోధ మే ।
కృతవర్మా హ్యనాధృష్టిః సమీకః సమితింజయః ॥ 58
కంకః శంకుశ్చ కుంతిశ్చ సప్తైతే వై మహారథాః ।
పుత్రౌ చాంధకభోజస్య వృద్ధో రాజా చ తే దశ ॥ 59
రాజా! చారుదేష్ణుడు, ఆయన సోదరుడు, చక్రదేవుడు, సాత్యకి, నేను, బలరాముడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు - మేము ఏడుగురం అతిరథులం. ఇతరులను గురించి కూడా విను. కృతవర్మ, అనాధృష్టి, సమీకుడు, సమితింజయుడు, కంసుడు, శంకుడు, కుంతి - ఈ ఏడుగురు మహారథులు. అంధకభోజుని పుత్రులనిద్దరినీ, వృద్ధుడైన ఉగ్రసేనుని కూడా పరిగణిస్తే మహారథుల సంఖ్య పది అవుతుంది. (57-59)
వజ్రసంహననా వీరాః వీర్యవంతో మహారథాః ।
స్మరంతో మధ్యమం దేశం వృష్ణిమధ్యే వ్యవస్థితాః ॥ 60
ఈ వీరులందరూ వజ్రం వలె దృఢమైన శరీరంగలవారు, పరాక్రమవంతులు, మహారథులు, మధ్యమదేశాన్ని తలచుకొంటూ వృష్ణికులంలో నివసిస్తున్నారు. (60)
(వితద్రుర్ఘల్లిబభ్రూచ ఉద్ధవోఽథ విదూరథః ।
వసుదేవోగ్రసేనౌ చ సప్తైతే మంత్రిపుంగవాః ।
ప్రసేనజిచ్చ యమలః రాజరాజగుణాన్వితః ।
స్యమంతకో మణిర్యస్య రుక్మం నిస్స్రవతే బహు ॥)
వితద్రువు, ఝల్లి, బభ్రువు, ఉద్ధవుడు, విదూరథుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు - ఈ ఏడుగురు ముఖ్యమంత్రులు. ప్రసేనజిత్తు, సత్రాజిత్తు ఈ ఇద్దరూ కుబేరుని వలె సద్గుణ సంపన్నులు. వారి దగ్గరున్న స్యమంతకమణి పెద్ద ఎత్తున బంగారాన్ని ఇవ్వగలది.
స త్వం సమ్రాడ్ గుణైర్యుక్తః సదా భరతసత్తమ ।
క్షత్రే సమ్రాజమాత్మానం కర్తుమర్హసి భారత ॥ 61
భారతా! నీవెప్పుడూ సమ్రాట్టుకు తగిన గుణాలు గలవాడవు. కాబట్టి నీవు క్షత్రియులలో సమ్రాట్టువు కాగలగాలి. (61)
(దుర్యోధనమ్ శాంతనవనం ద్రోణమ్ ద్రోణాయనిం కృపమ్ ।
కర్ణం చ శిశుపాలం చ రుక్మిణం చ ధనుర్ధరమ్ ॥
ఏకలవ్యం ద్రుమం శ్వేతం శైబ్యం శకునిమేవ చ ।
ఏతానజిత్వా సంగ్రామే కథం శక్నోషి తం క్రతుమ్ ॥
అథైతే గౌరవేణైవ న యోత్స్యంతి నరాధిపాః ।)
దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, శిశుపాలుడు, రుక్మి, ఏకలవ్యుడు, ద్రుముడు, శ్వేతుడు, శైబ్యుడు, శకుని - ఈ వీరులనందరినీ యుద్ధంలో గెలవకుండా రాజసూయాన్ని ఎలా చేస్తావు? అయితే నీ మీది గౌరవంతో వారంతా నీతో యుద్ధం చేయకపోవచ్చు.
న తు శక్యం జరాసంధే జీవమానే మహాబలే ।
రాజసూయస్త్వయావాప్తుమ్ ఏషా రాజన్ మతిర్మమ ॥ 62
అయితే ధర్మరాజా! మహాబలుడైన జరాసంధుడు బ్రతికి ఉండగా నీవు రాజసూయాన్ని చేయటం కుదరదని నా అభిప్రాయం. (62)
తేన రుద్ధా హి రాజానః సర్వే జిత్వా గిరివ్రజే ।
కందరే పర్వతేంద్రస్య సింహేనేవ మహాద్విపాః ॥ 63
సింహం మహాపర్వతగుహలలో ఏనుగును బంధించినట్లు జరాసంధుడు రాజులందరినీ గెలిచి గిరివ్రజపురంలో బంధించాడు. (63)
స హి రాజా జరాసంధః యియక్షుర్వసుధాధిపైః ।
మహాదేవం మహాత్మానమ్ ఉపాపతిమరిందమ ॥ 64
ఆరాధ్య తపసోగ్రేణ నిర్జితాస్తేవ పార్థివాః ।
ప్రతిజ్ఞాయాశ్చ పారం సః గతః పార్థివసత్తమ ॥ 65
అరిందమా! రాజశ్రేష్ఠా! జరాసంధమహారాజు మహాత్ముడు, ఉమాపతి అయిన పరమశివుని గూర్చి తీవ్రతపస్సు చేసి విశేషశక్తిని పొంది రాజులనందరినీ గెలిచాడు. రాజులందరినీ బలి ఇచ్చి యాగం చేయాలనే ఆయన సంకల్పం దాదాపు నెరవేరినట్లే (64,65)
స హి నిర్జిత్య నిర్జిత్య పార్థివాన్ పృతనాగతాన్ ।
పురమానీయ బద్ధ్వా చ చకార పురుషవ్రజమ్ ॥ 66
ఆ జరాసంధుడు యుద్ధానికి వచ్చిన రాజులనందరినీ ఓడించి, ఓడించి గిరివ్రజపురానికి బంధించి తెచ్చి ఆ గిరివ్రజపురాన్ని పురుషవ్రజంగా చేశాడు. (66)
వయం చైవ మహారాజ జరాసంధభయాత్ తదా ।
మథురాం సంపరిత్యజ్య గతా ద్వారవతీం పురీమ్ ॥ 67
మహారాజా! ఆ సమయంలో మేము కూడా జరాసంధునకు భయపడి మథురను వీడి ద్వారకకు వెళ్ళాము. (67)
యది త్వేనం మహారాజ యజ్ఞం ప్రాప్తుమభీప్ససి ।
యతస్వ తేషాం మోక్షాయ జరాసంధవధాయ చ ॥ 68
మహారాజా! నీవు ఈ రాజసూయయాగాన్ని పూర్తిచేయాలంటే జరాసంధవధకోసం, ఆయన అదుపులో నున్న రాజుల విమోచనం కోసం ప్రయత్నించు. (68)
సమారంభో న శక్యోఽయమ్ అన్యథా కురునందన ।
రాజసూయశ్చ కార్త్స్న్యేన కర్తుం మతిమతాం వర ॥ 69
ధీమంతులలో శ్రేష్ఠుడా! కురుకుమారా! ఇలా చేస్తే తప్ప రాజసూయయాగప్రయత్నం పూర్తిగా సఫలం కాదు. (69)
(జరాసంధవధోపాయః చింత్యతాం భరతర్షభ ।
తస్మిన్ జితే జితం సర్వే సకలం పార్థివం బలమ్ ॥)
భరతర్షభా! జరాసంధుని వధించే ఉపాయాన్ని ఆలోచించు. ఆయనను ఓడిస్తే సకలరాజన్యబలాలను జయించినట్లే.
ఇత్యేషా మే మతీ రాజన్ యథా వా మన్యసేఽనఘ ।
ఏవం గతే మమాచక్ష్య స్వయం నిశ్చిత్య హేతుభిః ॥ 70
రాజా! ఇది నా అభిప్రాయం. నిష్కలంకా! నీవే మనుకొంటున్నావు? ఈ దశలో హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయించుకొని నాకు తెలియజేయి. (70)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి రాజసూయారంభపర్వణి కృష్ణవాక్యే చతుర్దశోఽధ్యాయః ॥ 14 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున రాజసూయారంభపర్వమను ఉపపర్వమున కృష్ణవాక్యమను పదునాలుగవ అధ్యాయము. (14)