15. పదునైదవ అధ్యాయము
జరాసంధుని గూర్చి ధర్మజ భీమశ్రీకృష్ణులు చర్చించుట.
యుధిష్ఠిర ఉవాచ
ఉక్తం త్వయా బుద్ధిమతా యన్నాన్యో వక్తుమర్హతి ।
సంశయానాం హి నిర్మోక్తా త్వన్నాన్యో విద్యతే భువి ॥ 1
యుధిష్ఠిరుడిలా అన్నాడు -
నీవు బుద్ధిమంతుడవు కాబట్టి మరెవ్వరూ చెప్పజాలని విషయాన్ని చెప్పావు. లోకంలో నీవలె సందేహాలు తీర్చ గల్ వాడెవ్వడూ లేడు. (1)
గృహే గృహే హి రాజానః స్వస్య స్వస్య ప్రియంకరాః ।
న చ సామ్రాజ్యమాప్తాస్తే సమ్రాట్ఛబ్దో హి కృచ్ఛ్రభాక్ ॥ 2
ఇంటింటా రాజులున్నారు. తమకు తమకు ఇష్టమైన పనులు చేసుకొంటున్నారు. కానీ వారు సమ్రాట్టులు కాలేదు. సామ్రాజ్యపదవి కష్టసాధ్యం. (2)
కథం పరానుభావజ్ఞః స్వం ప్రశంసితుమర్హతి ।
పరేణ సమవేతస్తు యః ప్రశస్యః స పూజ్యతే ॥ 3
ఇతరుల గొప్పతనాన్ని తెలియగలిగిన వాడెవ్వడూ తనను తాను ప్రశంసించుకొనడు. ఇతరులతో కలిసి కూడా గొప్పవాడుగా మిగిలినవాడే పూజార్హుడు. (3)
విశాలా బహులా భూమిః బహురత్నసమాచితా ।
దూరం గత్వా విజానాతి శ్రేయో వృష్ణికులోద్వహ ॥ 4
కృష్ణా! పృథివి విశాలమయినది, అనంతమయినది. వివిధ రత్నాలతో నిండినది. బాగా దూరం ఆలోచించే నీవంటి వారి సహవాసంతోనే మనుష్యులు శ్రేయస్సును గ్రహింపగలరు. (4)
శమమేవ పరం మన్యే శమాత్ క్షేమం భవేన్మమ ।
ఆరంభే పారమేష్ఠ్యం తు న ప్రాప్యమితి మే మతిః ॥ 5
నేను మాత్రం ఇంద్రియనిగ్రహాన్ని గొప్పగా భావిస్తాను. దానివల్లనే నాకు క్షేమం కలుగుతుంది. రాజసూయాన్ని ప్రారంభించినంత మాత్రాన దాని ఫలితాన్ని పొందలేనని నా అభిప్రాయం. (5)
ఏవమతే హి జానంతి కులే జాతా మనస్వినః ।
కశ్చిత్ కదాచిదేతేషాం భవేచ్ఛ్రేష్ఠో జనార్దన ॥ 6
జనార్దనా! ఉత్తమవంశ సంజాతులై, అభిమాన వంతులయిన ఈ సభాసదులలో అన్నింటిని గెలువగలవారెవరైనా ఉండవచ్చు కూడా. (6)
వయం చైవ మహాభాగ జరాసంధభయాత్ తదా ।
శంకితాః స్మ మహాభాగ దౌరాత్మ్యాత్ తస్య చానఘ ॥ 7
అహం హి తవ దుర్ధర్ష భుజవీర్యాశ్రయః ప్రభో ।
వాత్మానం బలినం మన్యే త్వయి తస్మాద్ విశంకితే ॥ 8
మహానుభావా! జరాసంధుడంటే భయపడుతూ, ఆయన దుర్బుద్ధి కారణమ్గా మేమెప్పుడూ సంశయిస్తూనే ఉంటాము. నేను నీ భుజబలాన్నే నమ్ముతున్నాను. నీవు కూడా జరాసంధుని సంశయిస్తూ ఉంటే నన్ను నేను బలవంతునిగా భావించుకొనలేను. (7,8)
త్వత్సకాశాచ్చ రామాచ్చ భీమసేనాశ్చ మాధవ ।
అర్జునాద్ వా మహాబాహో హంతుం శక్యో వేతి వై ।
ఏవం జానన్ హి వార్ష్ణేయ విమృశామి పునః పునః ॥ 9
మహాబాహూ! మాధవా! నీవు, బలరాముడు, భీముడు, అర్జునుడు - మీలో ఎవ్వరూ జరాసంధుని చంపలేరా? వార్ష్ణేయా! నాకు తెలుసు. అయినా ఈ విషయాన్నే మాటిమాటికి ఆలోచిస్తున్నాను. (9)
త్వం మే ప్రమాణభూతోఽసి సర్వకార్యేషు కేశవ ।
తచ్ఛ్రుత్వా చాబ్రవీద్ భీమో వాక్యం వాక్యవిశారదః ॥ 10
కేశవా! అన్ని పనులలోనూ నీవే నాకు ప్రమాణమ్ - ఆ మాట విని వాక్యవిశారదుడైన భీముడిలా అన్నాడు. (10)
భీమ ఉవాచ
అనారంభపరో రాజా వల్మీక ఇవ సీదతి ।
దుర్బలశ్చానుపాయేన బలినం యోఽధితిష్ఠతి ॥ 11
భీముడిలా అంటున్నాడు - ప్రయత్నశీలుడు కాని రాజు, తాను దుర్బలుడయినా ఏదో ఒక ఉపాయంతో పనిచేయక బలవంతునిచూచి భయపడిన రాజు - ఈ ఇద్దరూ చెదపట్టిన పుట్టవలె నశించి పోతారు. (11)
అతంద్రితశ్చ ప్రాయేణ దుర్బలో బలినం రిపుమ్ ।
జయేత్ సమ్యక్ ప్రయోగేణ నీత్యార్థానాత్మనో హితాన్ ॥ 12
అలసత్వాన్ని వీడి రాజనీతిని చక్కగా ప్రయోగించి పనిచేసిన రాజు దుర్బలుడైనా బలిష్ఠుడైన శత్రువును ఓడించగలడు. (12)
కృష్ణే నయో మయి బలం జయః పార్థే ధనంజయే ।
మగధం సాధయిష్యామః ఇష్టిం త్రయ ఇవాగ్నయః ॥ 13
శ్రీకృష్ణునితో నీతి ఉంది. నాలో బలం, అర్జునునిలో విజయం ఉన్నాయి. మూడు అగ్నుల ద్వారా యజ్ఞసిద్ధిని పొందినట్లు ఈ మూడింటి కలయికతో జరాసంధుని జయిస్తాం. (13)
(త్వద్బుద్ధిబలమాశ్రిత్య సర్వం ప్రాప్స్యతి ధర్మరాట్ ।
జయోఽస్మాకం హి గోవింద యేషాం నాథో భవాన్ సదా ॥)
గోవిందా! నీ బుద్ధిబలాన్ని ఆశ్రయించి ధర్మరాజు దేన్నైనా పొందగలడు! నీవు మమ్ము ఎల్లప్పుడూ కాపాడుతుంటావు కాబట్టి గెలుపు మాదే.
కృష్ణ ఉవాచ
అర్థానారభతే బాలః నానుబంధమవేక్షతే ।
తస్మాదరిం న మృష్యంతి బాలమర్థపరాయణమ్ ॥ 14
జిత్వా జయ్యాన్ యౌవనాశ్విః పాలనాచ్చ భగీరథః ।
కార్తవీర్యస్తపోవీర్యాద్ బలాత్తు భరతో విభుః ॥ 15
కృష్ణుడిలా అన్నాడు. అజ్ఞాని కార్యారంభమ్ చేస్తాడు కానీ పరిణామాలను గ్రహించలేడు. కాబట్టి స్వప్రయోజనపరాయణుడైన మూఢశత్రువును వీరులు సహించరు. యువనాశ్వకుమారుడు మాంధాత శత్రువులను గెలిచి, భగీరథుడు ప్రజాపాలన చక్కగా చేసి, కార్తవీర్యుడు తపోబలాన్ని బట్టి, భరతమహారాజు బలాన్ని బట్టి సమ్రాట్టులయ్యారు. (14,15)
ఋద్ధ్యా మరుత్తస్తాన్ పంచ సమ్రాజస్త్వనుశుశ్రమ ।
సామ్రాజ్యమిచ్ఛతస్తే తు సర్వాకారం యుధిష్ఠిర ॥ 16
నిగ్రాహ్య లక్షణం ప్రాప్తిః ధర్మార్థనయలక్షణైః ॥ 17
సమృద్ధిబలంతో మరుత్తుడు సమ్రాట్టు అయ్యాడు. ఇంతవరకు ఈ అయిదుగురు మాత్రమే సమ్రాట్టులుగా వింటున్నాము. యుధిష్ఠిరా! వీరంతా ఒక్కొక్కగుణంతో సమ్రాట్టు లయ్యారు. నీవు సర్వగుణాలతో సమ్రాట్టువు కాగోరుతున్నావు. సామ్రాజ్యపదవికి అవసరమయిన శత్రుజయం, ప్రజాపాలనం, తపశ్శక్తి, ధనసమృద్ధి, రాజనీతి నీదగ్గరున్నాయి. (16,17)
బార్హద్రథో జరాసంధః తద్ విద్ధి భరతర్షభ ।
న చైనమనురుద్ధ్యంతే కులాన్యేకశతం నృపాః ।
తస్మాదిహ బలాదేవ సామ్రాజ్యం కురుతే హి సః ॥ 18
అయితే భరతర్షభా! నీ దారికడ్డంగా బృహద్రథసుతుడు జరాసంధు డున్నాడు. అది గ్రహించు. క్షత్రియులలోని నూరువంశాల వారు ఆ జరాసంధుని అనుసరించరు. అయినా ఆయన తన బలంతోనే సామ్రాజ్యస్థాపన చేయగలిగాడు. (18)
రత్నభాజో హి రాజానః జరాసంధముపాసతే ।
న చ తుష్యతి తేనాపి బాల్యాదనయమాస్థితః ॥ 19
రత్నరాసులు గల రాజులు జరాసంధుని సేవిస్తూనే ఉన్నారు. అయినా దానితో ఆనందించని జరాసంధుడు వివేకశూన్యుడై దుర్మార్గాన్నే స్వీకరిస్తాడు. (19)
మూర్థాభిషి క్తం నృపతిం ప్రధానపురుషో బలాత్ ।
ఆదత్తేం న చ నో దృష్టోఽభాగః పురుషతః క్వచిత్ ॥ 20
ఇప్పట్లో జరాసంధుడే ప్రధానపురుషుడై అభిషిక్తులయిన రాజులనందరినీ బలపూర్వకంగా బందీలను చేస్తున్నాడు. ఆయన బంధించని రాజును నేనింతవరకు చూడలేదు. (20)
ఏవం సర్వాన్ వశే చక్రే జరాసంధః శతావరాన్ ।
తం దుర్బలతరో రాజా కథం పార్థ ఉపైష్యతి ॥ 21
ఈ రీతిగా జరాసంధుడు నూరురాజవంశాలలోని ఎవరో ఒకరిద్దరిని తప్ప అందరినీ లొంగదీసుకొన్నాడు. కౌంతేయా! బలహీనుడయిన ఏ రాజు ఆయన నెదిరించే సాహసం చేయగలడు? (21)
ప్రోక్షితానాం ప్రమృష్టానాం రాజ్ఞాం పశుపతేర్గృహే ।
పశూనామివ కా ప్రీతిః జీవితే భరతర్షభ ॥ 22
భరతశ్రేష్ఠా! పరమేశ్వరునకు బలి ఇవ్వటానికై రాజులను తన రుద్రమందిరంలో బంధించి జరాసంధుడు వారికి సంప్రోక్షణ మార్జనాలను జరిపి జంతువులను వలె సిద్ధంగా ఉంచాడు. వారు జీవితం మీద ప్రేమను కోల్పోయారు. (22)
క్షత్రియః శస్త్రమరణః యదా భవతి సత్కృతః ।
తతః స్మ మగధం సంఖ్యే ప్రతిబాధేమ యద్ వయమ్ ॥ 23
క్షత్రియులకు యుద్ధంలో ఆయుధం ద్వారా మరణమే సత్కారం. కాబట్టి మనం జరాసంధుని ద్వంద్వయుద్ధంలోనే చంపుదాం. (23)
షడశీతిః సమానీతాః శేషా రాజంశ్చతుర్దశ ।
జరాసంధేన రాజానస్తతః క్రూరం ప్రవర్త్స్యతే ॥ 24
జరాసంధుడు ఎనభైఆరుమంది రాజులను బంధించాడు. మిగిలినవారు పదునలుగురు మాత్రమే. వారిని కూడా బంధించిన తర్వాత మరీక్రూరంగా ప్రవర్తిస్తాడు. (24)
ప్రాప్నుయాత్ స యశో దీప్తమ్ తత్ర యో విఘ్నమాచరేత్ ।
జయేద్ యశ్చ జరాసంధం స సమ్రాణ్నియతం భవేత్ ॥ 25
జరాసంధుని ఈ ప్రయత్నాన్ని అరికట్టగలవాడు ఉజ్జ్వలకీర్తిని పొందగలడు. జరాసంధుని జయించినవాడు తప్పక సమ్రాట్టు కాగలడు. (25)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి రాజసూయారంభపర్వణి కృష్ణవాక్యే పంచదశోఽధ్యాయః ॥ 15 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున రాజసూయారంభపర్వమను ఉపపర్వమున కృష్ణవాక్యమను పదునైదవ అధ్యాయము. (15)
(దాక్షిణాత్య అధికపాఠము 1 శ్లోకముతో కలిపి మొత్తము 26 శ్లోకాలు)