13. పదమూడవ అధ్యాయము

(రాజసూయారంభ పర్వము)

యుధిష్ఠిరుడు రాజసూయమును సంకల్పించి సన్నిహితులతో చర్చించుట.

వైశంపాయన ఉవాచ
ఋషేస్తద్ వచనం శ్రుత్వా నిశస్వాస యుధిష్టిరః ।
చింతయన్ రాజసూయేష్టిం న లేభే శర్మ భారత ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు-
జనమేజయా! ధర్మరాజు నారదుని మాటను విని నిట్టూర్చాడు. రాజసూయయాగాన్ని గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా ఉండలేకపోయాడు. (1)
రాజర్షీణాం చ తుం శ్రుత్వా మహిమానం మహాత్మనామ్ ।
యజ్వనాం కర్మభిః పుణ్యైః లోకప్రాప్తిం సమీక్ష్య చ ॥ 2
హరిశ్చంద్రం చ రాజర్షిం రోచమానం విశేషతః ।
యజ్వానం యజ్ఞమాహర్తుం రాజసూయమియేష సః ॥ 3
రాజసూయయాగాన్ని చేసిన మహాత్ములైన రాజర్షుల గొప్పతనాన్ని విన్నాడు. పుణ్యకర్మల ద్వారా వారు ఉత్తమలోకాలు పొందిన వైనాన్ని ఆలోచించాడు. ప్రత్యేకించి రాజర్షి అయిన హరిశ్చంద్రుని వైభవాన్ని తెలిసికొని ధర్మరాజు రాజసూయయాగాన్ని చేయాలని భావించాడు. (2,3)
యుధిష్ఠిరస్తతః సర్వాన్ అర్చయిత్వా సభాసదః ।
ప్రత్యర్చితశ్చ తైః సర్వైః యజ్ఞాయైవ మనో దధే ॥ 4
ఆ తర్వాత యుధిష్ఠిరుడు సభాసదులను అందరనూ సత్కరించి, వారి సత్కారాలను గ్రహించి, రాజసూయయాగ నిర్వహణాన్ని సంకల్పించాడు. (4)
స రాజసూయం రాజేంద్ర కురూణామృషభస్తదా ।
ఆహర్తుం ప్రవణం చక్రే మనః సంచింత్య చాసకృత్ ॥ 5
రాజేంద్రా! కురుశ్రేష్ఠుడైన యుధిష్ఠిరుడు బాగా ఆలోచించి రాజసూయయాగానుష్ఠానంపై మనస్సు పెట్టాడు. (5)
భూయశ్చాద్భుతవీర్యౌజాః ధర్మమేవానుచింతయన్ ।
కిం హితం సర్వలోకానాం భవేదితి మనో దధే ॥ 6
అద్భుతబలపరాక్రమాలు గల ధర్మరాజు తన ధర్మాన్ని గురించి ఆలోచిస్తూ సర్వలోకహితం మీద కూడా మనస్సు పెట్టాడు. (6)
అనుగృహ్ణన్ ప్రజాః సర్వాః సర్వధర్మభృతాం వరః ।
అవిశేషెన సర్వేషాం హితం చక్రే యుధిష్ఠిరః ॥ 7
సమస్తధర్మాత్ములలో శ్రేష్ఠుడైన ధర్మరాజు సర్వప్రజలనూ అనుగ్రహిస్తూ అందరికీ సమానంగా హితాన్ని చేయసాగాడు. (7)
సర్వేషాం దీయతాం దేయం ముంచన్ కోపమదావుభౌ ।
సాధు ధర్మేతి ధర్మేతి నాన్యచ్ఛ్రూయేత భాషితమ్ ॥ 8
'కోపమదాలను పరిత్యజించి అందరికీ వారి వారికి ఇవ్వదగిన వాటినివ్వండి. రాజ్యంలో "ధర్మరాజా! చక్కగా నిర్వహించావు" అన్న మాట తప్ప మరొకటి వినిపించకూడదు' అని తన వారినాదేశించాడు. (8)
ఏవంగతే తతస్తస్మిన్ పితరీవాశ్వసంజనాః ।
న తస్య విద్యతే ద్వేష్టా తతోఽస్యాజాతశత్రుతా ॥ 9
ధర్మజుడు ఆ రీతిగా వ్యవహరించగా ప్రజలందరూ తండ్రిమీదవలె ధర్మజునిపై ఆసక్తులయ్యారు. ఆయనను ద్వేషించే వారే లేరు. అందుకే అజాతశత్రుడయ్యాడు. (9)
పరిగ్రహాన్నరేంద్రస్య భీమస్య పరిపాలనాత్ ।
శత్రూణాం క్షపణాశ్చైవ బీభత్సోః సవ్యసాచినః ॥ 10
ధీమతః సహదేవస్య ధర్మాణామనుశాసనాత్ ।
వైనత్యాత్ సర్వతశ్చైవ నకులస్య స్వభావతః ।
అవిగ్రహా వీతభయాః స్వధర్మనిరతాః సదా ॥ 11
ధర్మజుడు అందరినీ ఆదరించేవాడు. భీముడు అందరినీ రక్షించేవాడు. సవ్యసాచి అయిన అర్జునుడు శత్రువుల నణచివేసేవాడు. ధీమంతుడైన సహదేవుడు ధర్మబోధ చేసేవాడు. నకులుడు స్వాభావికంగానే అందరితో వినయంగా ఉండేవాడు. అందువలన రాజ్యంలోని జనపదాలన్నీ కలహాలు, భయాలు లేకుండా ధర్మాసక్తితో ఉన్నాయి. వారు కోరినప్పుడు విస్తారంగా వర్షాలు కురిసేవి. (10,11)
నికామవర్షాః స్ఫీతాశ్చ ఆసన్ జనపదాస్తథా ।
వార్ధుషీ యజ్ఞసత్త్వాని గోరక్షం కర్షణం వణిక్ ॥ 12
విశేషాత్ సర్వమేవైతత్ సంజజ్ఞే రాజకర్మణా ।
అనుకర్షం చ నిష్కర్షం వ్యాధిపావకమూర్ఛనమ్ ॥ 13
సర్వమేవ న తత్రాసీద్ ధర్మనిత్యే యుధిష్ఠిరే ।
ధర్మజుని కార్యనిర్వహణ వలన వడ్డీవ్యాపారులు, యాగసామగ్రి, గోరక్షణ, వ్యవసాయమ్, వ్యాపారం బాగా వృద్ధి చెందాయి. దరిద్రుల నుండి గడచిపోయిన సంవత్సరాల బాకీలు వసూలు చేసేవారు కాదు. వర్తమానకాలంలోని బాకీలకై ఎవ్వరినీ పీడించేవారు కాదు. ధర్మతత్పరుడైన ధర్మరాజు పాలన చేస్తుండగా రోగాలు, అగ్నిప్రమాదాలు సంభవించేవి కావు. (12, 13 1/2)
దస్యుభ్యో వంచకేభ్యశ్చ రాజ్ఞః ప్రతి పరస్పరమ్ ॥ 14
రాజవల్లభతశ్చైవ నాశ్రూయత మృషా కృతమ్ ।
దొంగల నుండీ కానీ, వంచకుల నుండీ కానీ, రాజు వలన కానీ, రాజబంధువుల వలన కానీ ప్రజలు మోసాలకు కానీ అత్యాచారాలకు కానీ గురికాలేదు. ప్రజలు కుడా పరస్పరం కపటత్వంతో ప్రవర్తించేవారు కాదు. (14)
ప్రియం కర్తుముపస్థాతుం బలికర్మ స్వకర్మజమ్ ॥ 15
అభిహర్తుం నృపాః షట్ సు పృథగ్ జాత్యైశ్చ నైగమైః ।
వవృధే విషయస్తత్ర ధర్మనిత్యే యుధిష్ఠిరే ॥ 16
కామతోఽప్యుపయుంజానైః రాజసైర్లోభజైర్జనైః ।
ఇతర రాజులు తమదేశాలలోని కులీనవైశ్యులతో కలిసి యుధిష్ఠిరునకు ప్రియాన్ని చేయటానికి, కప్పం చెల్లించటానికి, తాము సంపాదించిన ధనరత్నాదులను కానుక చేయాటానికి సంధివిగ్రహాదిషడ్గుణాలలో సహకరించటానికి ఆయన దగ్గరకు వచ్చేవారు. రాజసమనస్కులు, విషయాసక్తి గలవారు ఎంత విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చుచేస్తున్నా ధర్మజుని ధర్మపరిపాలనలో దేశమ్ అభివృద్ధినే సాధించింది. (15,16 1/2)
సర్వవ్యాపీ సర్వగుణీ సర్వసాహః స సర్వరాట్ ॥ 17
యుధిష్ఠిరుని కీర్తి అంతటా వ్యాపించింది. ఆయన సర్వగునపరిపూర్ణుడు. అన్నింటినీ సహించగలవాడు. అంతటా విరాజిల్లేవాడు. (17)
యస్మిన్నధికృతః సమ్రాడ్ భ్రాజమానో మహాయశాః ।
యత్ర రాజన్ దశదిశాః పితృతో మాతృతస్తథా ।
అనురక్తాః ప్రజా ఆసన్ ఆగోపాలా ద్విజాతయః ॥ 18
దశదిశలా వ్యాపించిన మహాకీర్తి గల యుధిష్ఠిరచక్రవర్తి పరిపాలిస్తున్న రాజ్యంలోని ప్రజలు బ్రాహ్మణుల నుండి గోపాలుర వరకు అందరు ధర్మరాజును తల్లితో, తండ్రితో సమానంగా అనురక్తులై చూసేవారు. (18)
వైశంపాయన ఉవాచ
స మంత్రిణః సమానాయ్య భ్రాతౄంశ్చ వదతాం వరః ।
రాజసూయం ప్రతి తదా పునః పునరపృచ్ఛత ॥ 19
వైశంపాయనుడిలా అన్నాడు.
వాగ్మి అయిన ఆ యుధిష్ఠిరుడు మంత్రులనూ, సోదరులనూ పిలిపించి రాజసూయయాగవిషయమై పదే పదే అడిగాడు. (19)
తే పృచ్ఛమానాః సహితా వచోఽర్థ్యం మంత్రిణస్తదా ।
యుధిష్ఠిరం మహాప్రాజ్ఞం యియక్షుమిదమబ్రువన్ ॥ 20
రాజసూయాన్ని నిర్వహించదలచి ధర్మరాజు తమను ప్రశ్నించగా ఆ మంత్రులంతా కలిసి మహాప్రాజ్ఞుడైన ధర్మరాజుతో ఇలా అన్నారు. (20)
యేనాభిషిక్తో నృపతిః వారుణం గుణమృచ్ఛతి ।
తేన రాజాపి తం కృత్స్నం సమ్రాడ్గుణమభీప్సతి ॥ 21
రాజసూయాన్ని నిర్వహించి అభిషిక్తుడైన రాజు వరుణుని గుణాలను పొందగలడు. అందువలన ఏరాజు అయినా రాజసూయం చేసి సమ్రాట్టు గుణాలను పొందాలనే కోరుతాడు. (21)
తస్య సమ్రాడ్ గుణార్హస్య భవతః కురునందన ।
రాజసూయస్య సమయం మాన్యంతే సుహృదస్తవ ॥ 22
కురునందనా! నీవు సమ్రాడ్గుణాలను పొందటానికి సర్వవిధాల యోగ్యుడవు. రాజసూయమ్ చేయటానికి నీకిదే సమయమని నీ మిత్రులంతా భావిస్తున్నారు. (22)
తస్య యజ్ఞస్య సమయః స్వాధీనః క్షత్రసంపదా ।
సామ్నా షడగ్నయో యస్మిన్ చీయంతే శాంసితవ్రతైః ॥ 23
ఆ రాజసూయనియమం క్షత్రసంపత్తికి అధీనమైనది. కాబట్టి వ్రతాచరణశీలురయిన బ్రాహ్మణులు అగ్నిప్రతిష్ఠాపనకై ఆరు అగ్నివేదికలను నిర్మిస్తారు. (23)
దర్వీహోమానుపాదాయ సర్వాన్ యః ప్రాప్నుతే క్రతూన్ ।
అభిషేకం చ యస్యాంతే సర్వజిత్ తేన చోచ్యతే ॥ 24
ఈ యాగాన్ని నిర్వహించినవాడు దర్వీహోమం మొదలుగా గల సమస్తయాగాల ఫలాన్ని పొందుతాడు. యజ్ఞావసానంలో అభిషేకాన్ని పొందినవాడు సర్వవిజేతయై సమ్రాట్టు అనబడతాడు. (24)
సమర్థోఽసి మహాబాహో సర్వే తే వశాగా వయమ్ ।
అచిరాత్ త్వం మహారాజ ఱాజసూయమవాప్స్యసి ॥ 25
మహాభాగా! నీవు సమర్థుడవు. మేము నీ అధీనంలో ఉన్నాం. మహారాజా! నీవు త్వరలోనే రాజసూయాన్ని పూర్తిచేయగలవు. (25)
అవిచార్య మహారాజ రాజసూయే మనః కురు ।
ఇత్యేవం సుహృదః సర్వే పృథక్ చ సహచాబ్రువన్ ॥ 26
మహారాజా! ఇక సంకోచించకుండా రాజసూయం మీద మనస్సు పెట్టు - ఈ రీతిగా మంత్రులందరూ కలిసి, విడివిడిగా కూడా ధర్మరాజుకు చెప్పారు. (26)
స ధర్మ్యం పాండవస్తేషామ్ వచః శ్రుత్వా విశాంపతే ।
ధృష్టమిష్టం వరిష్ఠం చ జగ్రాహ మనసారిహా ॥ 27
రాజా! శత్రుసంహర్త అయిన ధర్మరాజు ధర్మబద్ధం , సాహసపూర్ణం, అభీష్టం, శ్రేష్ఠం అయిన మంత్రుల మాటను విని దానిని మనసారా స్వీకరించాడు. (27)
శ్రుత్వా సుహృద్వచస్తచ్చ జానంశ్చాప్యాత్మనః క్షమమ్ ।
పునః పునర్మనో దధ్రే రాజసుయాయ భారత ॥ 28
భారతా! మిత్రులు పలికిన ఆ మాటలను విని, తన సామర్థ్యాన్ని కూడా ఆకళింపు చేసికొని ధర్మరాజు రాజసూయయాగం చేయాలని మాటిమాటికి మనసుపడ్డాడు. (28)
స భ్రాతృభిః పునర్ధీమాన్ ఋత్విగ్భిశ్చ మహాత్మభిః ।
మంత్రిభిశ్చాపి సహితో ధర్మరాజో యుధిష్ఠిరః ।
ధౌమ్యద్వైపాయనాద్యైశ్చ మంత్రయామాస మంత్రవిత్ ॥ 29
ధీమంతుడైన ఆ ధర్మరాజు మహాత్ములయిన ఋత్విక్కులతో, మంత్రులతో ధౌమ్య, వ్యాసాది మహర్షులతో రాజసూయాన్ని గూర్చి ఆలోచించాడు. (29)
యుధిష్ఠిర ఉవాచ
ఇయం యా రాజసూయస్య సమ్రాడర్హస్య సుక్రతోః ।
శ్రద్దధానస్య వదతః స్పృహా మే సా కథం భవేత్ ॥ 30
యుధిష్ఠిరుడిలా అన్నాడు -
రాజసూయమన్న ఈ ఉత్తమక్రతువు ఏ సమ్రాట్టులకో తగినది. నాకు దానిపై శ్రద్ధ కలుగుతోంది. నా ఈ కోరిక ఎలా ఉన్నది. చెప్పండి. (30)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తాస్తు తే తేన రాజ్ఞా రాజీవలోచన ।
ఇదమూచుర్వచః కాలే ధర్మరాజం యుధిష్ఠిరమ్ ॥ 31
రాజీవలోచనా! జనమేజయా! ధర్మరాజు అలా అడగగానే వారు ఆ సమయానికి తగినట్లు ధర్మజ్ఞుడైన యుధిష్ఠిరునితో ఇలా అన్నారు. (31)
అర్హస్త్వమసి ధర్మజ్ఞ రాజసూయమ్ మహాక్రతుమ్ ।
అథైవముక్తే నృపతౌ ఋత్విగ్భిః ఋషిభిస్తథా ॥ 32
మంత్రిణో భ్రాతరశ్చాన్యే తద్వచః ప్రత్యపూజయన్ ।
ధర్మజ్ఞా! రాజసూయయాగానికి నీవు తగినవాడవు. ఋత్విక్కులు, ఋషులు ధర్మజునితో ఆ రీతిగా పలకగానే ధర్మజుని మంత్రులు, సోదరులు ఆ మాటను అభినందించారు. (32 1/2)
స తు రాజా మహాప్రజ్ఞః పునరేవాత్మనాత్మవాన్ ॥ 33
భూయో విమమృశే పార్థః లోకానాం హితకామ్యయా ।
సామర్థ్యయోగం సంప్రేక్ష్య దేశకాలౌ వ్యయాగమౌ ॥ 34
విమృశ్య సమ్యక్ ధియా కుర్వన్ ప్రాజ్ఞో న సీదతి ।
న హి యజ్ఞసమారంభః కేవలాత్మవినిశ్చయాత్ ॥ 35
భవతీతి సమాజ్ఞాయ యత్నతః కార్యముద్వహన్ ।
స నిశ్చయార్థం కార్యస్య కృష్ణమేవ జనార్దనమ్ ॥ 36
సర్వలోకాత్ పరం మత్వా జగామ మనసా హరిమ్ ।
అప్రమేయం మహాబాహుం కామాజ్జాతమజం నృషు ॥ 37
ఆ తరువాత జితేంద్రియుడు, ధీమంతుడూ అయిన ధర్మరాజు లోకహితాన్ని కోరుతూ మరలా దానిని గురించి ఆలోచించాడు. తన శక్తి సాధనాలను గుర్తించి దేశకాలాలను, ఆదాయవ్యయాలను అవగాహన చేసికొని కార్యారంభం చేసిన బుద్ధిశాలి కడగండ్లపాలు కాడు. తానొక్కడే నిశ్చయించుకొని యజ్ఞకర్మ నారంభించరాదు అని భావించి సర్వయత్నాలతో కార్యాన్ని నిర్వహించాలని సంకల్పించిన యుధిష్ఠిరుడు, రాజసూయ కార్యనిర్ణయంలొ శ్రీకృష్ణుని అందరికన్న మిన్నగా తలచి మనసా శ్రీకృష్ణుని శరణువేడాడు. ఆ శ్రీకృష్ణుడు మహాబాహువు, అప్రమేయుడు, లోకరక్షణమన్న కోరికతో జన్మించినవాడు. (33-37)
పాండవస్తర్కయామాస కర్మభిర్దేవసమ్మతైః ।
నాస్య కించిదవిజ్ఞాతం నాస్య కించిదకర్మజమ్ ॥ 38
దేవతలు సయితం మెచ్చుకొనే శ్రీకృష్ణుని కర్మలను బట్టి ఆయనకు తెలియనిది ఎదీ లేదని, ఆయన చేయలేనిది ఏదీ లేదని భావించాడు యుధిష్ఠిరుడు. (38)
న స కించిన్న విషహేద్ ఇతి కృష్ణమమన్యత ।
స తు తాం నైష్ఠికీం బుద్ధిం కృత్వా పార్థో యుధిష్ఠిరః ॥ 39
గురువద్ భూతగురవే ప్రాహిణోద్ దూతమంజసా ।
శీఘ్రగేన రథేనాశు స దూతః ప్రాప్య యాదవాన్ ॥ 40
ద్వారకావాసినం కృష్ణం ద్వారవత్యాం సమాసదత్ ।
శ్రీకృష్ణునకు భరింపరానిది ఏదీ లేదని కూడా భావించాడు యుధిష్ఠిరుడు. ఆ విధంగా స్థిరనిర్ణయానికి వచ్చిన ధర్మరాజు గురుజనులకు తెలియజేసే పద్ధతిలో సర్వప్రాణులకు గురువయిన శ్రీకృష్ణుని దగ్గరకు దూతను పంపాడు. వేగంగా ప్రయాణించే రథంలో ఆ దూత శీఘ్రంగా యాదవుల దగ్గరకు పోయి ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని కలిశాడు. (39, 40 1/2)
(స్ర ప్రహ్వః ప్రాంజలిర్భూత్వా వ్యజ్ఞాపయత మాధవమ్ ॥
ఆ దూత వినయంగా నమస్కరించి శ్రీకృష్ణునకు ఇలా నివేదించాడు.
దూత ఉవాచ
ధర్మరాజో హృషీకేశ ధౌమ్యవ్యాసాదిభిః సహ ।
పాంచాల మాత్స్యసహితైః భ్రాతృభిశ్చైవ సర్వశః ॥
త్వద్దర్శనం మహాబాహో కాంక్షతే స యుధిష్ఠిరః ।
దూత ఇలా అన్నాడు. శ్రీకృష్ణా! ధౌమ్యవ్యాసాదులతోడనూ, పాంచాలమత్స్యరాజులతోనూ, సోదరులతోనూ కలిసి యుధిష్ఠిరుడు తమ దర్శనాన్ని కోరుతున్నాడు.
వైశంపాయన ఉవాచ
ఇంద్రసేనవచః శ్రుత్వా యాదవప్రవరో బలీ।)
దర్శనాకాంక్షిణం పార్థం దర్శనాకాంక్షయాచ్యుతః ॥ 41
ఇంద్రసేనేన సహితః ఇంద్రప్రస్థమగాత్ తదా ।
వైశంపాయనుడిలా అన్నాడు. దూతగా వచ్చిన ఇంద్రసేనుని మాట విని యాదవశ్రేష్ఠుడు, బలవంతుడు అయిన శ్రీకృష్ణుడు తనను చూడగోరిన యుధిష్ఠిరుని చూడాలని తలచి ఇంద్రసేనునితో కలిసి ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. (41 1/2)
వ్యతీత్య వివిధాన్ దేశాన్ త్వరావాన్ క్షిప్రవాహనః ॥ 42
వేగంగా పయనించే వాహనంలో శ్రీకృష్ణుడు వేగిరంగా వివిధదేశాలను దాటిపోయాడు. (42)
ఇంద్రప్రస్థాగతం పార్థమ్ అభ్యగచ్ఛజ్జనార్దనః ।
స గృహే పితృవద్ భ్రాత్రా ధర్మరాజేన పూజితః ।
భీమేన చ తతోఽపశ్యత్ స్వసారం ప్రీతిమాన్ పితుః ॥ 43
శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలో ఉన్న యుధిష్ఠిరుని కలిశాడు. అక్కడ మేనత్త కొడుకులయిన ధర్మరాజభీమసేనులచే తండ్రివలె పూజల నంది ఆపై ప్రేమ-పూర్వకంగా మేనత్తను దర్శించాడు. (43)
ప్రీతః ప్రీతేన సుహృదా రేమే స సహితస్తాతా ।
అర్జునేన యమాభ్యాం చ గురువత్ పర్యుపాసితః ॥ 44
ఆపై తనకు ప్రీతిపాత్రుడయిన అర్జునునితో సమావేశమై ఆనందించాడు. అర్జునునిచే, నకులసహదేవులచే తండ్రి వలె పూజింపబడ్డాడు. (44)
తం విశ్రాంతం శుభే దేశే క్షణినం కల్పమచ్యుతమ్ ।
ధర్మరాజః సమాగమ్యాజ్ఞాపయత్ స్వప్రయోజనమ్ ॥ 45
ఆపై శ్రీకృష్ణుడు అనువయిన తావున విశ్రమించాడు. కొంతసేపటి తర్వాత సన్నద్ధుడై సందర్శనకు అవకాశం కల్పించినప్పుడు యుధిష్ఠిరుడు ఆయనను కలిసి తాను ఆశిస్తున్న ప్రయోజనాన్ని తెలియజేశాడు. (45)
యుధిష్ఠిర ఉవాచ
ప్రార్థితో రాజసూయో మే న చాసౌ కేవలేప్సయా ।
ప్రాప్యతే యేన తత్ తే హి విదితమ్ కృష్ణ సర్వశః ॥ 46
యుధిష్ఠిరుడిలా అన్నాడు. శ్రీకృష్ణా! నేను రాజసూయాన్ని చేయసంకల్పించాను. కానీ అది సంకల్పమాత్రంతో సాధ్యమయ్యేది కాదు. దానిని నిర్వహించగల మార్గాలన్నీ నీకే తెలుసు. (46)
యస్మిన్ సర్వం సంభవతి యశ్చ సర్వత్ర పూజ్యతే ।
యాశ్చ సర్వేశ్వరో రాజా రాజసూయం స విందతి ॥ 47
అన్నింటిని సాధించగలవాడు, అంతటా పూజింపబడేవాడు, సర్వరాజులను శాసించగలవాడు, అయిన రాజు మాత్రమే రాజసూయాన్ని సుసంపన్నం చేయగలడు. (47)
తం రాజసూయం సుహృదః కార్యమాహుః సమేత్య మే ।
తత్ర మే నిశ్చితతమం తవ కృష్ణ గిరా భవేత్ ॥ 48
నామిత్రులంతా కలిసి నన్ను ఆ రాజసూయయాగాన్ని చేయమంటున్నారు. కానీ కృష్ణా! నీ మాటను బట్టి మాత్రమే అంతిమనిర్ణయ ముంటుంది. (48)
కేచిద్ధి సౌహృదాదేవ న దోషం పరిచక్షతే ।
స్వార్థహేతోస్తథైవాన్యే ప్రియమేవ వదంత్యుత ॥ 49
కొందరు నామీది ప్రేమతో నాలోని దోషాల్ను చెప్పరు. కొందరు స్వప్రయోజనం కోసం ప్రియంగానే మాట్లాడుతారు. (49)
ప్రియమేవ పరీప్సంతే కేచిదాత్మని యద్ధితమ్ ।
ఏవం ప్రాయశ్చ దృశ్యంతే జనవాదాః ప్రయోజనే ॥ 50
కొందరు తమకు హితమయినదే నాకూ ప్రియమయినదని భావిస్తారు. మనుషులు ఈ రీతిగా స్వప్రయోజనంలో భిన్నభిన్నంగా కనిపిస్తారు. (50)
త్వం తు హేతూనతీత్యైతాన్ కామక్రోధౌ వ్యుదస్య చ ।
పరమం యత్ క్షమం లోకే యథావద్ వక్తుమర్హసి ॥ 51
నీవు ఆ కారణాల నన్నింటినీ అతిక్రమించి, కామక్రోధాలను ప్రక్కకు నెట్టి, ఈ లోకంలో నాకు సరిగా సరిపోయినదానినే చెప్పవలసినది. (51)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి రాజసూయారంభ పర్వణి వాసుదేవాగమనే త్రయోదశోఽధ్యాయః ॥ 13 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున రాజసూయారంభపర్వమను ఉపపర్వమున వాసుదేవాగమనమను పదమూడవ అధ్యాయము. (13)