12. పండ్రెండవ అధ్యాయము

హరిశ్చంద్రమహాత్మ్యము - పాండురాజ సందేశము.

యుధిష్ఠిర ఉవాచ
ప్రాయశో రాజలోకస్తే కథితో వదతాం వర ।
వైవస్వతసభాయాం తు యథా వదసి మే ప్రభో ॥ 1
యుధిష్ఠిరుడు అన్నాడు.
వాగ్మిశ్రేష్ఠా! నీవు వర్ణించిన దానిని బట్టి సూర్యసుతుడైన యముని సభలోనే రాజసమూహమంతా ఉన్నది. (1)
వరుణస్య సభాయాం తు నాగాస్తే కథితా విభో ।
దైత్యేంద్రాశ్చాపి భూయిష్ఠాః సరితః సాగరాస్తథా ॥ 2
స్వామీ! వరుణుని సభలో నాగులు, దైత్యేంద్రులు, నదులు, సముద్రాలు ఎక్కువగా ఉన్నాయి. (2)
తథా ధనపతేర్యక్షాః గుహ్యకా రాక్షసాస్తథా ।
గంధర్వాప్సరసశ్చైవ భగవాంశ్చ వృషధ్వజః ॥ 3
అదేరీతిగా కుబేరసభలో యక్షులు, గుహ్యకులు, రాక్షసులు, గంధర్వులు, అచ్చరలు, శంకరభగవానుడు ఉన్నారు. (3)
పితామహసభాయాం తు కథితాస్తే మహర్షయః ।
సర్వే దేవనికాయాశ్చ సర్వశాస్త్రాణి చైవ హ ॥ 4
బ్రహ్మదేవుని సభలో మహర్షులు, సమస్త దేవతాసముహాలూ, సర్వశాస్త్రాలు ఉన్నాయన్నావు. (4)
శక్రస్య తు సభాయాం తు దేవాః సంకీర్తితా మునే ।
ఉద్దేశతశ్చ గంధర్వాః వివిధాశ్చ మహర్షయః ॥ 5
మహర్షీ! దేవేంద్రుని సభలో సకలదేవతలు ప్రధానంగా ఉన్నారు. స్వల్పంగా వివిధ గంధర్వులు, మహర్షులు ఉన్నారన్నావు. (5)
ఏక ఏవ తు రాజర్షిః హరిశ్చంద్రో మహామునే ।
కథితస్తే సభాయాం వై దేవేంద్రస్య మహాత్మనః ॥ 6
మహర్షీ! రాజర్షులలో హరిశ్చంద్రుడు మాత్రమే దేవేంద్రుని సభలో ఉన్నట్లు చెప్పావు. (6)
కిం కర్మ తేనాచరితం తపో వా నియతవ్రత ।
యేనాసౌ సహ శక్రేన స్పర్ధతే సుమహాయశాః ॥ 7
నియతవ్రతా! నారదా! ఆ హరిశ్చంద్రుడు ఏ పని చేశాడు? ఏ తపస్సు చేశాడు? మహాయశస్వియై ఇంద్రునితో ఎలా పోటీ పడగలిగాడు? (7)
పితృలోకగతశ్చైవ త్వయా విప్ర పితా మమ ।
దృష్టః పాండుర్మహాభాగః కథం వాపి సమాగతః ॥ 8
కిముక్తవాంశ్చ భగవన్ తన్మమాచక్ష్వ సువ్రత ।
త్వత్తః శ్రోతుం సర్వమిదం పరః కౌతూహలం హి మే ॥ 9
బ్రహ్మర్షీ! నీవు పితృలోకానికి పోయి మహానుభావుడైన మా తండ్రిని - పాండురాజును - కూడా చూశావు కదా! ఆయన నెలా కలిశావు? ఆయనేమన్నాడు? అది నాకు చెప్పు. అదంతా నీ ద్వారా వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది. (8,9)
నారద ఉవాచ
యన్మాం పృచ్ఛసి రాజేంద్ర హరిశ్చంద్రం ప్రతి ప్రభో ।
తత్ తేఽహం సంప్రవక్ష్యామి మహాత్మ్యం తస్య ధీమతః ॥ 10
నారదుడిలా అన్నాడు.
రాజశ్రేష్ఠా! నీవు హరిశ్చంద్రుని గూర్చి అడిగావు. ఆ ధీమంతుని గొప్పతనాన్ని వివరంగా నీకు చెపుతాను. (10)
(ఇక్ష్వాకూణాం కులే జాతః త్రిశంకుర్నామ పార్థివః ।
అయోధ్యాధిపతిర్వీరః విశ్రామిత్రేణ సంస్థితః ॥
తస్య సత్యవతీ నామ పత్నీ కేకయవంశజా ।
తస్యాం గర్భః సమభవద్ ధర్మేణ కురునందన ॥
సా చ కాలే మహాభాగా జన్మమాసం ప్రవిశ్య వై ।
కుమారం జనయామాస హరిశ్చంద్రమకల్మషమ్ ॥
స వై రాజా హరిశ్చంద్రః త్రైశంకవ ఇతి స్మృతః ।)
ఇక్ష్వాకు వంశంలో త్రిశంకుడను రాజుండేవాడు. ఆయన అయోధ్యకు రాజు. విశ్వామిత్రునితో పాటు ఉండేవాడు. కేకయవంశస్థురాలయిన సత్యవతి ఆయన భార్య. ధర్మరాజా! ఆ సత్యవతి ధర్మబద్ధంగా గర్భాన్ని ధరించింది. కాలక్రమంలో పదవనెల వచ్చి ఆమె నిష్కల్మషుడైన హరిశ్చంద్రుని కన్నది. ఆ త్రిశంకుసుతుడే లోకప్రసిద్ధి కెక్కిన హరిశ్చంద్రుడు.
స రాజా బలవానాసీత్ సమ్రాట్ సర్వమహీక్షితామ్ ।
తస్య సర్వే మహీపాలాః శాసనావనతాః స్థితాః ॥ 11
ఆ రాజు మిక్కిలి బలవంతుడు. సర్వరాజులకు సమ్రాట్టు. రాజులందరూ ఆయన ఆదేశాన్ని శిరసావహించటానికి సిద్ధంగా ఉండేవారు. (11)
తేనైకం రథమాస్థాయ జైత్రం హేమవిభూషితమ్ ।
శస్త్రప్రతాపేన జితాః ద్వీపాః సప్త జనేశ్వర ॥ 12
రాజా! స్వర్ణమయమై, జయశీలమైన ఒక రథాన్ని అధిరోహించి శస్త్రప్రతాపంతో ఆ హరిశ్చంద్రుడు సప్తద్వీపాలనూ జయించాడు. (12)
వి॥సం॥ ద్వీపములు ఏడు.
1. జంబూద్వీపః 2. కుశద్వీపః 3. శాకః 4. క్రౌంచశ్చ 5. శాల్మలిః ।
6. గోమేధః 7. పుష్కరశ్చైవ సప్తద్వీపాః ప్రకీర్తితాః ॥ (దేవ)
స నిర్జిత్య మహీం కృత్స్నాం సశైలవనకాననామ్ ।
ఆజహార మహారాజ రాజసూయం మహాక్రతుమ్ ॥ 13
మహారాజా! ఆ హరిశ్చంద్రుడు పర్వతారణ్యాలతో సహ సమస్తభూమండలాన్ని జయించి రాజసూయమహాయాగాన్ని నిర్వహించాడు. (13)
తస్య సర్వే మహీపాలాః ధనాన్యాజహ్రురాజ్ఞయా ।
ద్విజానాం పరివేష్టారః తస్మిన్ యజ్ఞే చ తేఽభవన్ ॥ 14
హరిశ్చంద్రుని ఆదేశాన్ని అనుసరించి రాజులందరూ ధనాన్ని కానుకగా తెచ్చి, ఆ యాగవేళలో బ్రాహ్మణులకు భోజనం వడ్డించారు. (14)
ప్రాదాశ్చ ద్రవిణం ప్రీత్యా యాచకానాం నరేశ్వరః ।
యథోక్తవంతస్తే తస్మిన్ తతః పంచగుణాధికమ్ ॥ 15
హరిశ్చంద్రమహారాజు సాదరంగా యాచకులు అడిగిన దానికన్నా అయిదురెట్లు ఎక్కువగా దానాలు చేశాడు. (15)
అతర్పయచ్చ వివిధైః వసుభిర్బ్రాహ్మణాంస్తదా ।
ప్రసర్పకాలే సంప్రాప్తే నానాదిగ్భ్యః సమాగతాన్ ॥ 16
యాగం ముగుస్తున్న దశలో నానాదిక్కుల నుండి వచ్చిన బ్రాహ్మణులను వివిధధనాలతో సంతృప్తిపరచాడు. (16)
భక్ష్యభోజ్యైశ్చ వివిధైః యథాకామపురస్కృతైః ।
రత్నౌఘతర్పితైస్తుష్టైః ద్విజైశ్చ సముదాహృతమ్ ।
తేజస్వీ చ యశస్వీ చ నృపేభ్యోఽభ్యధికోఽభవత్ ॥ 17
వివిధ భక్ష్యాలతో, భోజ్యాలతో, కోరుకొన్న వస్తువులు అందుకోవటంతో, రత్నరాసుల దానాలతో సంతృప్తి పడిన బ్రాహ్మణుల ఆశీస్సుల నందుకొని హరిశ్చంద్రుడు ఇతరరాజులను మించి తేజస్వి, యశస్వి అయ్యాడు. (17)
ఏతస్మాత్ కారణాద్ ఱాజన్ హరిశ్చంద్రో విరాజతే ।
తేభ్యో రాజసహస్రేభ్యః తద్ విద్ధి భరతర్షభ ॥ 18
భరతర్షభా! ధర్మరాజా! ఈ కారణం వలననే వేలమంది రాజులలో కూడా హరిశ్చంద్రుడు మిన్నగా ప్రకాశిస్తున్నాడు. (18)
సమాప్య చ హరిశ్చంద్రః మహాయజ్ఞం ప్రతాపవాన్ ।
అభిషిక్తశ్చ శుశుభే సామ్రాజ్యేన నరాధిప ॥ 19
రాజా! ప్రతాపశాలి అయిన హరిశ్చంద్రుడు రాజసూయయాగాన్ని ముగించి, సామ్రాజ్యాభిషేకాన్ని చేసికొని విరాజిల్లాడు. (19)
యే చాన్యే చ మహీపాలాః రాజసూయం మహాక్రతుమ్ ।
యజంతే తే సహేంద్రేణ మోదంతే భరతర్షభ ॥ 20
భరతశ్రేష్ఠా! రాజసూయమహాయాగాన్ని నిర్వహించిన రాజులందరూ ఇంద్రునితో కలిసి ఆనందంగా ఉంటారు. (20)
యే చాపి నిధనం ప్రాప్తాః సంగ్రామేష్వపలాయినః ।
తే తత్ సదనమాసాద్య మోదంతే భరతర్షభ ॥ 21
భరతర్షభా! యుద్ధరంగంలో వెన్ను చూపక నిలిచి మరణించిన వారు కూడా స్వర్గలోకాన్ని చేరి ఆనందంగా ఉంటారు. (21)
తపసా యే చ తీవ్రేణ త్యజంతీహ కలేబరమ్ ।
తే తత్ స్థానం సమాసాద్య శ్రీమంతో భాంతి నిత్యశః ॥ 22
తీవ్రమైన తపస్సు చేసి శరీరాన్ని పరిత్యజించిన వారు కూడా ఇంద్రలోకాన్ని పొంది శ్రీమంతులై సదా ప్రకాశిస్తారు. (22)
పితా చ త్వాహ కౌంతేయ పాండుః కౌరవనందన ।
హరిశ్చంద్రే శ్రియం దృష్ట్వా నృపతౌ జాతవిస్మయః ॥ 23
కౌరవనందనా! కౌంతేయా! నీ తండ్రి పాండురాజు హరిశ్చంద్రుని వైభవాన్ని చూచి ఆశ్చర్యపడి నీకొక సందేశాన్ని పంపాడు. (23)
విజ్ఞాయ మానుషం లోకమ్ ఆయాంతం మాం నరాధిప ।
ప్రోవాచ ప్రణతో భూత్వా వదేథాస్త్వం యుధిష్ఠిరమ్ ॥ 24
రాజా! నేను మానవలోకానికి వస్తున్నానని తెలిసి, నాకు నమస్కరించి ధర్మరాజుతో చెప్పవలసినదంటూ నాతో ఇలా అన్నాడు. (24)
సమర్థోఽసి మహీం జేతుం భ్రాతరస్తే స్థితా వశే ।
రాజసూయం క్రతుశ్రేష్ఠమ్ ఆహరస్వేతి భారత ॥ 25
భారతా! నీవు భూమినంతా జయించగలవాడవు. సోదరులు నీ అదుపులో ఉన్నారు. కాబట్టి శ్రేష్టయాగమయిన రాజసూయాన్ని ఆచరించు. (25)
త్వయీష్టవతి పుత్రేఽహం హరిశ్చంద్రవదాశు వై ।
మోదిష్యే బహుళాః శశ్వత్ సమాః శక్రస్య సంసది ॥ 26
నాకుమారుడవయిన నీవు రాజసూయయాగాన్ని నిర్వహిస్తే వెంటనే నేను కూడా హరిశ్చంద్రునివలె ఎన్నో సంవత్సరాలు ఇంద్రసన్నిధిలో ఆనందాన్ని అనుభవించగలను. (26)
ఏవం భవతు వక్ష్యేఽహం తవ పుత్రం నరాధిపమ్ ।
భూలోకం యది గచ్ఛేయమ్ ఇతి పాండుమథాబ్రవమ్ ॥ 27
అప్పుడు నేను "అలాగే నేను భూలోకానికి వెళితే మహారాజయిన నీకుమారునకు నీ మాటను చెప్పగలను" అని పాండురాజుతో అన్నాను. (27)
తస్య త్వం పురుషవ్యాఘ్ర సంకల్పం కురు పాండవ ।
గంతాసి త్వం మహేంద్రస్య పూర్వైః సహ సలోకతామ్ ॥ 28
పురుషశ్రేష్ఠా! ధర్మజా! మీ తండ్రి సంకల్పాన్ని నీవు పాటించు. తత్ఫలంగా నీవు నీ పూర్వీకులతో సహా ఇంద్రలోకాన్ని పొందగలవు. (28)
బహువిఘ్నశ్చ నృపతే క్రతురేష స్మృతో మహాన్ ।
ఛిద్రాణ్యస్య తు వాంఛంతి యజ్ఞఘ్నా బ్రహ్మరాక్షసాః ॥ 29
రాజా! ఈ రాజసూయమహాయాగానికి ఎన్నో ఆటంకాలు వచ్చే అవకాశమున్నది. యాగవినాశకులయిన బ్రహ్మరాక్షసులు ఎన్నో విఘ్నాలను కల్పిస్తారు. (29)
యుద్ధం చ క్షత్రశమనం పృథివీక్షయకారణమ్ ।
కించిదేవ నిమిత్తం చ భవత్యత్ర క్షయావహమ్ ॥ 30
ఈ యాగాన్ని అనుష్ఠించటం వలన ఈ భూమండలంపై సర్వక్షత్రవినాశకమైన యుద్ధం సంభవించేందుకు కారణమైన సంఘటన జరిగే అవకాశం కూడా ఉన్నది. (30)
ఏతత్ సంచింత్య రాజేంద్ర యత్ క్షేమం తత్ సమాచర ।
అప్రమత్తోత్థితో నిత్యం చాతుర్వర్ణ్యస్య రక్షణే ॥ 31
రాజేంద్రా! ఇదంతా ఆలోచించి నీకు క్షేమమనిపించినది ఆచరించు. నాల్గువర్ణాలను రక్షించటంలో నిత్యమూ అప్రమత్తుడవై సంసిద్ధుడవై ఉండు. (31)
భవ ఏధస్వ మోదస్వ ధనైస్తర్పయ చ ద్విజాన్ ।
ఏతత్ తే విస్తరేణోక్తం యన్మాం త్వం పరిపృచ్ఛసి ॥ 32
అపృచ్ఛే త్వాం గమిష్యామి దాశార్హ నగరీం ప్రతి ।
లోకంలో అభ్యుదయాన్ని పొందు. ఆనందంగా ఉండు. ధనంతో బ్రాహ్మణులను తృప్తులను చేయి. నీవు నన్ను అడిగిన విషయాన్ని వివరంగా చెప్పాను. నీవు అనుమతిస్తే ఇక్కడ నుండి ద్వారకకు వెళ్తాను. (32 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవమాఖ్యాయ పార్థేభ్యః నారదో జనమేజయ ।
జగామ తైర్వృతో రాజన్ ఋషిభిర్యైః సమాగతః ॥ 33
వైశంపాయనుడిలా అన్నాడు.
జనమేజయా! నారదుడు పాండవులతో ఇలా పలికి తనవెంట వచ్చిన మునులతో కలిసి నిష్క్రమించాడు. (33)
గతే తు నారదే పార్థః భ్రాతృభిః సహ కౌరవః ।
రాజసూయం క్రతుశ్రేష్ఠం చింతయామాస పార్థివః ॥ 34
నారదుడు వెళ్ళిపోగానే కురువంశస్థుడైన ధర్మరాజు తన సోదరులతో రాజసూయ మహాయాగాన్ని గూర్చి ఆలోచించాడు. (34)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యానపర్వణి పాండుసందేశకథనే ద్వాదశోఽధ్యాయః ॥ 12 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున లోకపాల సభాఖ్యానపర్వమను ఉపపర్వమున పాండుసందేశకథనమను పంన్నెండవ అధ్యాయము. (12)