11. పదునొకండవ అధ్యాయము
బ్రహ్మసభావర్ణనము.
నారద ఉవాచ
పితామహసభాం తాత కథ్యమానాం నిబోధ మే ।
శక్యతే యా న నిర్దేష్టుమ్ ఏవంరూపేతి భారత ॥ 1
నారదుడిలా అన్నాడు - నాయనా! భారతా! ఇప్పుడు బ్రహ్మసభను గురించి చెపుతాను విను. "ఇది ఇటువంటి" దని చెప్పటానికి వీలుకానిది ఆ బ్రహ్మసభ. (1)
పురా దేవయుగే రాజన్ ఆదిత్యో భగవాన్ దివః ।
ఆగచ్ఛన్మానుషం లోకం దిదృక్షుర్విగతక్లమః ॥ 2
చరన్ మానుషరూపేణ సభాం దృష్ట్వా స్వయంభువః ।
స తామకథయన్మహ్యం బ్రాహ్మీం తత్త్వేన పాండవ ॥ 3
ధర్మరాజా! పూర్వం సత్యయుగంలో సూర్యభగవానుడు బ్రహ్మసభను సందర్శించి, మరల మనుష్యలోకాన్ని చూడాలని అనాయాసంగా బ్రహ్మసభను గురించి ఉన్నదున్నట్టు నాకు వివరంగా చెప్పాడు. (2,3)
అప్రమేయాం సభాం దివ్యాం మానసీం భరతర్షభ ।
అనిర్దేశ్యాం ప్రభావేణ సర్వభూతమనోరమామ్ ॥ 4
భరతర్షభా! ఆ బ్రహ్మసభ కొలతలకందనిది. దివ్యమయినది. బ్రహ్మసంకల్పం నుండి పుట్టినది. సమస్తప్రాణుల మనస్సులను రంజింపజేయగల దాని ప్రభావం వర్ణింపనలవి కానిది. (4)
శ్రుత్వా గుణానహం తస్యాః సభాయాః పాండవర్షభ ।
దర్శనేప్సుస్తథా రాజన్ ఆదిత్యమిదమబ్రవమ్ ॥ 5
పాండవశ్రేష్ఠా! సూర్యభగవానుని నుండి ఆ బ్రహ్మసభ గొప్పతనాన్ని విని నేను దానిని చూడగోరి సూర్యునితో ఇలా అన్నాను. (5)
భగవాన్ ద్రష్టుమిచ్ఛామి పితామహసభాం శుభామ్ ।
యేన వా తపసా శక్యా కర్మణా వాపి గోపతే ॥ 6
ఔషధైర్వా తథా యుక్తైః ఉత్తమా పాపనాశనీ ।
తన్మమాచక్ష్య భగవన్ పశ్యేయం తాం సభాం యథా ॥ 7
స్వామీ! కిరణాధిపతీ! నేను ఆ బ్రహ్మసభను చూడగోరుతున్నాను. ఉత్తమమూ, పాపనాశనమూ అయిన ఆ సభను ఏ తపస్సుతో, ఏ పుణ్యకర్మలతో, ఏ ఓషధి ప్రభావంతో చూడగలనో చెప్పు. ఆ సభను సందర్శించగల ఉపాయాన్ని నాకు తెలుపు. (6,7)
స తన్మమ వచః శ్రుత్వాః సహస్రాంశుర్దివాకరః ।
ప్రోవాచ భరతశ్రేష్ఠ వ్రతం వర్షసహస్రికమ్ ॥ 8
బ్రహ్మవ్రతముపాస్స్వ త్వం ప్రయతేనాంతరాత్మనా ।
తతోఽహం హిమవత్పృష్ఠే సమారబ్ధో మహావ్రతమ్ ॥ 9
భరతశ్రేష్ఠా! సహస్రకిరణాలు గల ఆ సూర్యుడు నా మాట విని "నీవు ఏకాగ్రచిత్తుడవై వేయి సంవత్సరాలు ఆచరింపవలసిన బ్రహ్మవ్రతాన్ని చేయి" అని సూచించాడు. అప్పుడు నేను హిమాలయశిఖరాలపై ఆ మహావ్రతాన్ని ప్రారంభించాను. (8,9)
తతః స భగవాన్ సూర్యః మాముపాదాయ వీర్యవాన్ ।
ఆగచ్ఛత్ తాం సభాం బ్రాహ్మీం విపాప్మా విగతక్లమః ॥ 10
ఆ తపస్సు ముగిసిన తరువాత పాపరహితుడు, పరాక్రమశాలి అయిన సూర్యభగవానుడు అనాయాసంగా నన్ను బ్రహ్మసభకు కొనిపోయాడు. (10)
ఏవంరూపేతి సా శక్యా న నిర్దేష్టుం నరాధిప ।
క్షణేన హి బిభర్త్యన్యద్ అనిర్దేశ్యం వపుస్తథా ॥ 11
రాజా! ఆ సభ ఇటువంటిదని తేల్చి చెప్పటానికి వీలుకానిది. క్షణకాలంలోనే మాటలకందనంతగా రూపాన్ని మార్చుకొనగలది. (11)
న వేద పరిమాణం వా సంస్థానం చాపి భారత ।
న చ రూపం మయా తాదృగ్ దృష్టపూర్వం కదాచన ॥ 12
భారతా! దానికొలతలు కానీ, దాని స్వరూపం కానీ నేనెరుగను. ఇంతకు ముందెప్పుడూ నేను అటువంటి రూపాన్ని చూచి ఉండలేదు. (12)
సుసుఖా సా సదా రాజన్ న శీతా న చ ఘర్మదా ।
న క్షుత్పిపాసే న గ్లానిం ప్రాప్య తాం ప్రాప్నువంత్యుత ॥ 13
రాజా! ఆ సభ ఎప్పుడూ మంచిసుఖాన్ని ఇస్తుంది. మరీ చల్లగా ఉండదు. మరీ వెచ్చగాను ఉండదు. ఆ సభలోనికి చేరిన తర్వాత ఆకలి దప్పులుండవు. (13)
నానారూపైరివ కృతా మణిభిః సా సుభాస్వరైః ।
స్తంభైర్న చ ధృతా సా తు శాశ్వతీ న చ సాక్షరా ॥ 14
అత్యంతమూ ప్రకాశించే వివిధమణులతో ఆ సభ నిర్మింపబడింది. దానికి ఆధారస్తంభాలుండవు. అదెప్పుడూ పాతబడినట్టుండదు. నిత్యనూతన మది. (14)
దివ్యైర్నానావిధైర్భావైః భాసద్భిరమితప్రభైః ॥ 15
అతిచంద్రం చ సూర్యం చ శిఖనం చ స్వయంప్రభా ।
దీప్యతే నాకపృష్ఠస్థా భర్త్సయంతీవ భాస్కరమ్ ॥ 16
అనంతకాంతులతో వెలిగే నానావిధదివ్యపదార్థాలతో స్వయంగానే చంద్రుని, సూర్యునీ, అగ్నినీ మించి ప్రకాశిస్తుంది. స్వర్గాన్ని మించి ఉన్నతమై సూర్యుని తిరస్కరిస్తూ అది ప్రకాశిస్తుంది. (15,16)
తస్యాం స భగవానాస్తే విదధద్ దేవమాయయా ।
స్వయమేకోఽనిశం రాజన్ సర్వలోకపితామహః ॥ 17
రాజా! ఆ సభలో సర్వలోకపితామహుడు బ్రహ్మ దేవమాయతో సమస్తలోకాలనూ సృష్టిస్తూ తాను మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు. (17)
ఉపతిష్ఠంతి చాప్యేనం ప్రజానాం పతయః ప్రభుమ్ ।
దక్షః ప్రచేతాః పులహః మరీచిః కశ్యపః ప్రభుః ॥ 18
ప్రజాపతులందరూ ఆయనను సేవిస్తుంటారు. దక్షుడు, ప్రచేతుడు, పులహుడు, మరీచి, కశ్యపుడు (18)
భృగురత్రిర్వసిష్ఠశ్చ గౌతమోఽథ తథాంగిరాః ।
పులస్త్యశ్చ క్రతుశ్చైవ ప్రహ్లాదః కర్దమస్తథా ॥ 19
భృగువు, అత్రి, వసిష్ఠుడు, గౌతముడు, అంగిరుడు, పులస్త్యుడు, క్రతువు, ప్రహ్లాదుడు, కర్దముడు... (19)
అథర్వాంగిరసశ్చైవ వాలఖిల్యా మరీచిపాః ।
మనోఽంతరిక్షం విద్యాశ్చ వాయుస్తేజో జలం మహీ ॥ 20
శబ్దస్పర్శౌ తథా రూపం రసో గంధశ్చ భారత ।
ప్రకృతిశ్చ వికారశ్చ యచ్చాన్యత్ కారణం భువః ॥ 21
అథర్వాంగిరసుడు, సూర్యకిరణాలను త్రాగే వాలఖిల్యులు, మనస్సు, అంతరిక్షమ్, విద్య, వాయువు, తేజస్సు, జలం, పృథ్వి, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, ప్రకృతి, వికృతి, ఇతర సృష్టిహేతువులు - వీటి కన్నిటికి అదిష్ఠానమైన దేవతలు...... (20,21)
అగస్త్యశ్చ మహాతేజాః మార్కండేయశ్చ వీర్యవాన్ ।
జమదగ్నిర్భరద్వాజః సంవర్తశ్చ్యవనస్తథా ॥ 22
మహాతేజస్వి అగస్త్యుడు, శక్తిశాలి మార్కండేయుడు, జమదగ్ని, భరద్వాజుడు, సంవర్తనుడు, చ్యవనుడు... (22)
దుర్వాసాశ్చ మహాభాగ ఋష్యశృంగశ్చ ధార్మికః ।
సనత్కుమారో భగవాన్ యోగాచార్యో మహాతపాః ॥ 23
మహాత్ముడు దుర్వాసుడు, ధర్మాత్ముడు ఋష్యశృంగుడు, మహాతపస్వి యోగాచార్యుడు పూజనీయుడు అయిన సనత్కుమారుడు. (23)
అసితో దేవలశ్చైవ జైగీషవ్యశ్చ తత్త్వవిత్ ।
ఋషభో జితశత్రుశ్చ మహావీర్యస్తథా మణిః ॥ 24
అసితుడు, దేవలుడు, తత్త్వజ్ఞాని ఐన జైగీషవ్యుడు, శత్రుజేత అయిన ఋషభుడు, పరాక్రమశాలి అయిన మణి....... (24)
ఆయుర్వేదస్తథాష్టాంగః దేహవాంస్తత్ర భారత ।
ఆచంద్రమాః సహనక్షత్రైః ఆదిత్యశ్చ గభస్తిమాన్ ॥ 25
అష్టాంగసహితమై మూర్తిమంతమైన ఆయుర్వేదం, నక్షత్రగణాలతో కూడి చంద్రుడు, కిరణమాలి అయిన సూర్యుడు..... (25)
వాయవః క్రతవశ్చైవ సంకల్పః ప్రాణా ఏవ చ ।
మూర్తిమంతో మహాత్మానః మహావ్రతపరాయణాః ॥ 26
ఏతే చాన్యే చ బహవః బ్రహ్మాణం సముపస్థితాః ।
వాయువులు, క్రతువులు, సంకల్పం, ప్రాణమ్ - వీరేకాక మహావ్రతపరాయణులయి రూపధారులయిన మహాత్ములెందరో బ్రహ్మను సేవిస్తుంటారు. (26 1/2)
అర్థో ధర్మశ్చ కామశ్చ హర్షో ద్వేషస్తపో దమః ॥ 27
అర్థం, ధర్మమ్, కామం, హర్షం, ద్వేషం, తపస్సు, దమం - ఇవి కూడా రూపాన్ని ధరించి బ్రహ్మను సేవిస్తాయు. (27)
అయాంతి తస్యాం సహితాః గంధర్వాప్సరసాం గణాః ।
వింశతిః సప్త చైవాన్యే లోకపాలాశ్చ సర్వశః ॥ 28
శుక్రో బృహస్పతిశ్చైవ బుధోఽంగారక ఏవ చ ।
శనైశ్చరశ్చ రాహుశ్చ గ్రహాః సర్వే తథైవ చ ॥ 29
గంధర్వాప్సరసల గణాలు ఇరవై కలిసి బ్రహ్మసభకు వస్తాయి. మరొక ఏడు గణాలకు చెందిన గంధర్వులు అక్కడ చేరుతారు. సమస్తలోకపాలకులు, శుక్రుడు, బృహస్పతి, బుధుడు, కుజుడు, శని, రాహువు, కేతువు-ఈ గ్రహాలు......... (28,29)
మంత్రో రథంతరం చైవ హరిమాన్ వసుమానపి ।
ఆదిత్యాః సాధిరాజానః నామ ద్వంద్వైరుదాహృతాః ॥ 30
సామగానమంత్రాలు, రథంతరసామ, హరిమంతుడు, వసుమంతుడు, ఇంద్రునితో సహా ద్వాదశాదిత్యులు, జంటలుగా వ్యవహరింపబడిన అగ్నిష్టోమాది దేవతలు. (30)
మరుతో విశ్వకర్మా చ వసవశ్చైవ భారత ।
తథా పితృగణాః సర్వే సర్వాని చ హవీంష్యథ ॥ 31
ధర్మరాజా! మరుత్తులు, విశ్వకర్మ, వసువులు, సమస్త పితృగణాలు, హవిస్సులు....... (31)
ఋగ్వేదః సామవేదశ్చ యజుర్వేదశ్చ పాండవ ।
అథర్వవేదశ్చ తథా సర్వశాస్త్రాణి చైవ హ ॥ 32
ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం, సర్వశాస్త్రాలు....... (32)
ఇతిహాసోపవేదాశ్చ వేదాంగాని చ సర్వశః ।
గ్రహా యజ్ఞాశ్చ సోమశ్చ దేవతాశ్చాపి సర్వశః ॥ 33
ఇతిహాసాలు, ఉపవేదాలు, వేదామ్గాలు అన్నీ-ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, అర్థశాస్త్రం. వేదాంగాలు, గ్రహాలు, యజ్ఞాలు, సోమం, సమస్తదేవతలు....... (33)
సావిత్రీ దుర్గతరణీ వాణీ సప్తవిధా తథా ।
మేధా ధృతిః శ్రుతిశ్చైవ ప్రజ్ఞా బుద్ధిర్యశః క్షమా ॥ 34
సావిత్రి, దుర్గ; అకార, ఉకార, మకార, అర్థమాత్రా, నాద బిందు, శక్తులు, (ప్రణవం యొక్క సప్తరూపాలు/ఏడురకాలయిన వాణి), మేధ, ధృతి, శ్రుతి, ప్రజ్ఞ, బుద్ధి, కీర్తి, క్షమ........ (34)
సామాని స్తుతిగీతాని గాధాశ్చ వివిదాస్తథా ।
భాష్యాణి తర్కయుక్తాని దేహవంతి విశాంపతే ॥ 35
నాటకా వివిధాః కావ్యాః కథాఖ్యాయికకారికాః ।
తత్ర తిష్ఠంతి తే పుణ్యాః యే చాన్యే గురుపూజకాః ॥ 36
రాజా! సామగానాలు, స్తుతిగీతాలు, వివిధగాథలు, తర్కంతో కూడిన భాష్యాలు, వివిధనాటకాలు, కావ్యాలు, కథలు, ఆఖ్యాయికలు, కారికలు ఇవన్నీ రూపాన్ని ధరించి అక్కడ ఉంటాయి.
అదేరీతిగా గురుపూజచేసిన పుణ్యపురుషులెందరో అక్కడుంటారు. (35,36)
క్షణా లవా ముహూర్తాశ్చ దివా రాత్రిస్తథైవ చ ।
అర్థమాసాశ్చ మాసాశ్చ ఋతవః షట్ చ భారత ॥ 37
భారతా! క్షణాలు, లవాలు, ముహూర్తాలు, దివారాత్రాలు, పక్షాలు, నెలలు, ఋతువులు........ (37)
సంవత్సరాః పంచ యుగమ్ అహోరాత్రశ్చతుర్విధః ।
కాలచక్రం చ తత్ దివ్యం నిత్యమక్షయమవ్యయమ్ ॥ 38
ధర్మచక్రం తథా చాపి నిత్యమాస్తే యుధిష్ఠిర ।
ధర్మజా! సంవత్సరాలు, పంచయుగాలు; నాలుగు విధాలయిన అహోరాత్రులు, మానవ, పితృ, దేవతా, బ్రహ్మప్రమాణాలు - అహోరాత్రులు నాఖుగు విధాలు నిత్య, దివ్య, అక్షయ, అవ్యయరూపమైన కాలచక్రం, ధర్మచక్రం రూపాన్ని ధరించి నిత్యమూ బ్రహ్మను ఉపాసిస్తాయి. (38 1/2)
అదితిర్దితిర్దనుశ్చైవ సురసా వినతా ఇరా ॥ 39
కాళికా సురభీ దేవీ సరమా చాథ గౌతమీ ॥ 40
ప్రభా కద్రూశ్చ వై దేవ్యౌ దేవతానాం చ మాతరః ।
రుద్రాణీ శ్రీశ్చ లక్ష్మీశ్చ భద్రా షష్ఠీ తథాపరా ॥ 41
పృథ్వీ గాం గతా దేవీ హ్రీః స్వాహా కీర్తిరేవ చ ।
సురా దేవీ శచీ చైవ తథా పుష్టిరరుంధతీ ॥ 42
సంవృత్తిరాశా నియతిః సృష్టిర్దేవీ రతిస్తథా ।
ఏతాశ్చాన్యాశ్చ వై దేవ్యః ఉపతస్ధుః ప్రజాపతిమ్ ॥ 43
అదితి, దితి, దనువు, సురస, వినత, ఇర, కాళిక, సురభి, సరమ, గౌతమి, ప్రభ, కద్రువ, దేవమాతలు, రుద్రాణి, శ్రీ, లక్ష్మి, భద్ర, అపర, షష్ఠి, పృథ్వి, గంగానది, లజ్జ, స్వాహ, కీర్తి, సురాదేవి, శచి, షష్టి, అరుంధతి, సంవృత్తి, ఆశ, నియతి, సృష్టిదేవి, రతి, ఇతరదేవతలు కూడా ప్రజాపతిని ఉపాసిస్తారు. (39-43)
ఆదిత్యా వసవో రుద్రా మరుతశ్చాశ్వినావపి ।
విశ్వేదేవాశ్చ సాధ్యాశ్చ పితరశ్చ మనోజవాః ॥ 44
ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, అశ్వినులు, విశ్వేదేవులు, సాధ్యులు, మనోవేగం గల పితరులు బ్రహ్మను సేవిస్తుంటారు. (44)
పితృణాం చ గణాన్ విద్ధి సప్తైవ పురుషర్షభ ।
మూర్తిమంతో హి చత్వారః త్రయశ్చాప్యశరీరిణః ॥ 45
పురుషశ్రేష్ఠా! పితృగణాలు ఏడుంటాయి. వాటిలో నాలుగు రూపం గలవి. మూడు రూపం లేనివి. (45)
వైరాజాశ్చ మహాభాగాః అగ్నిష్వాత్తాశ్చ భారత ।
గార్హపత్యా నాకచరాః పితరో లోకవిశ్రుతాః ॥ 46
సోమపా ఏకశృంగాశ్చ చతుర్వేదాం కలాస్తథా ।
ఏతే చతుర్షు వర్ణేషు పూజ్యంతే పితరో నృప ॥ 47
ఏతైరాప్యాయితైః పూర్వం సోమశ్చాప్యాయ్యతే పునః ।
త ఏతే పితరః సర్వే ప్రజాపతిముపస్థితాః ॥ 48
భారతా! లోకవిఖ్యాతులై, స్వర్గలోకసంచారం గల వైరాజులు, అగ్నిష్వాత్తులు, సోమపులు, గార్హపత్యులు ఈ నాలుగు పితృగణాలు రూపం గలవి. ఏకశృంగులు, చతుర్వేదులు, కళలు ఈ మూడు పితృగణాలు రూపం లేనివి. ఈ పితృగణాలు ఏడు నాల్గువర్ణాలలో పూజింపబడతాయి. రాజా! ముందు ఈ పితృగణాలు తృప్తిపడితే సోమదేవత తృప్తి పొందుతుంది. ఈ సప్తగణాలకు చెందిన పితరులు బ్రహ్మసన్నిధిలో నిలిచి తేజోమూర్తి అయిన బ్రహ్మను పరమానందంగా ఉపాసిస్తారు. (46-48)
ఉపాసతే చ సంహృష్టాః బ్రహ్మాణమమితౌజసమ్ ।
రాక్షసాశ్చ పిశాచాశ్చ దానవా గుహ్యకాస్తథా ॥ 49
నాగాః సుపర్ణాః పశవః పితామహముపాసతే ।
స్థావరా జంగమాశ్చైవ మహాభూతాస్తథాపరే ॥ 50
పురందరశ్చ దేవేంద్రః వరుణో ధనదో యమః ।
మహాదేవః సహోమోఽత్ర సదా గచ్ఛతి సర్వశః ॥ 51
రాక్షసులు, పిశాచులు, దానవులు, గుహ్యకులు, నాగులు, సుపర్ణలు, పశువులు బ్రహ్మను ఉపాసిస్తారు. స్థావరజంగమాత్మకాలైన మహాభూతాలు, దేవేంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు, పార్వతితో సహా శివుడు ఎప్పుడూ బ్రహ్మ దగ్గరకు వెళ్తుంటారు. (49-51)
మహాసేనశ్చ రాజేంద్ర సదోపాస్తే పితామహమ్ ।
దేవో నారాయణస్తస్యాం తథా దేవర్షయశ్చ యే ॥ 52
ఋషయో వాలఖిల్యాశ్చ యోనిజాయోనిజాస్తథా ।
రాజేంద్రా! కార్తికేయుడు కూడా సదా బ్రహ్మను సేవిస్తాడు. నారాయణదేవుడు, దేవర్షులు, వాలఖిల్యమునులు, యోనిజులు, అయోనిజులు అయిన ఇతరమహర్షులు ఆ సభలో బ్రహ్మనారాధిస్తారు. (52 1/2)
యచ్చ కించిత్ త్రిలోకేఽస్మిన్ దృశ్యతే స్థాణు జంగమమ్ ॥ 53
సర్వే తస్యాం మయా దృష్టమ్ ఇతి విద్ధి నరాధిప ।
రాజా! త్రిలోకాలలో స్థావరజంగమాత్మాకమైన సమస్తాన్ని నేను ఆ బ్రహ్మసభలో చూశానని తెలుసుకో. (53 1/2)
అష్టాశీతిసహస్రాణి ఋషీణామూర్ధ్వరేతసామ్ ।
ప్రజావతాం చ పంచాశద్ ఋషీణామపి పాండవ ॥ 54
ధర్మజా! ఊర్ధ్వరేతస్కులయిన పద్దెనిమిది వేలమంది మునులు ఆ సభలో ఉంటారు. (54)
తే స్మ తత్ర యథాకామం దృష్ట్వా సర్వే దివౌకసః ।
ప్రణమ్య శిరసా తస్మై సర్వే యాంతి యథాఽఽగతమ్ ॥ 55
ఆ మహర్షులు, దేవతలందరూ అక్కడ స్వేచ్ఛగా బ్రహ్మను సందర్శించి తలవాల్చి నమస్కరించి వచ్చిన దారినే తిరిగి వెళతారు. (55)
అతిథీనాగతాన్ దేవాన్ దైత్యాన్ నాగాంస్తథా ద్విజాన్ ।
యజ్ఞాన్ సుపర్ణాన్ కాలేయాన్ గంధర్వాప్సరసస్తథా ॥ 56
మహాభాగానమితధీః బ్రహ్మా లోకపితామహః ।
దయావాన్ సర్వభూతేషు యథార్హం ప్రతిపద్యతే ॥ 57
సర్వప్రాణుల యందు దయగలవాడు, ధీమంతుడు అయిన సర్వలోకపితామహుడు తన దగ్గరకు అతిథులుగా వచ్చిన దేవతలను, దానవులను, నాగులను, ద్విజులను, యజ్ఞస్వరూపులను, సుపర్ణులను, కాలేయులను, గంధర్వులను, అచ్చరలను తగినరీతిగా అనుగ్రహిస్తాడు. (56,57)
ప్రతిగృహ్య తు విశ్వాత్మా స్వయంభూరమితద్యుతిః ।
సాంత్వమానార్థసంభోగైః యునక్తి మనుజాధిప ॥ 58
రాజా! విశ్వరూపుడు, అమితకాంతివంతుడు అయిన బ్రహ్మ వారిని అనుగ్రహించి, అనునయించి, గౌరవించి, కోరికను తీర్చి భోగవిశేషాలను అందిస్తాడు. (58)
తథా తైరుపయాతైశ్చ ప్రతియద్భిశ్చ భారత ।
ఆకులా సా సభా తాత భవతి స్మ సుఖప్రదా ॥ 59
భారతా! ఆవిధంగా ఆ బ్రహ్మసభ వచ్చేపోయే వారితో కోలాహలంగా కనిపిస్తూ సుఖప్రదమై ఉంటుంది. (59)
సర్వతేజోమయీ దివ్యా బ్రహ్మర్షిగణసేవితా ।
బ్రాహ్మా శ్రియా దీప్యమానా శుశుభే విగతక్లమా ॥ 60
సా సభా తాదృశీ దృష్టా మయా లోకేషు దుర్లభా ।
సభేయం రాజశార్దూల మనుష్యేషు యథా తవ ॥ 61
రాజోత్తమా! ఆ బ్రహ్మసభ సమస్తతేజస్సులూ గలది, దివ్యమైనది, బ్రహ్మర్షిగణసేవితమైనది. పాపరహితమై శమసంపత్తితో విరాజిల్లుతుంది. అటువంటి సభను నేను చూశాను. మానవలోకంలో నీ ఈ సభ దుర్లభమైనట్లు సమస్తలోకంలోనూ బ్రహ్మసభ దుర్లభమైనది. (60,61)
ఏతా మయా దృష్టపూర్వాః సభా దేవేషు భారత ।
సభేయం మానుషే లొకే సర్వశ్రేష్ఠతమా తవ ॥ 62
భారతా! ఈ సభలనన్నింటినీ నేను గతంలో దేవలోకంలో చుశాను. మానవలోకంలో నీ ఈ సభయే సర్వశ్రేష్ఠమయినది. (62)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యానపర్వణి బ్రహ్మసభావర్ణనం నామైకాదశోఽధ్యాయః ॥ 11 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున లోకపాల సభాఖ్యానపర్వమను ఉపపర్వమున బ్రహ్మసభావర్ణనమను పదకొండవ అధ్యాయము. (11)