8. ఎనిమిదవ అధ్యాయము

యమసభావర్ణనము.

నారద ఉవాచ
కథయిష్యే సభాం యామ్యాం యుధిష్ఠిర నిబోధ తామ్ ।
వైవస్వతస్య యాం పార్థ విశ్వకర్మా చకార హ ॥ 1
నారదుడిలా అన్నాడు.
యుధిష్ఠిరా! ఇప్పుడు సూర్యసుతుడైన యముని సభను గూర్చి చెపుతాను. విను. కౌంతేయా! దీనిని కూడా విశ్వకర్మయే నిర్మించాడు. (1)
తైజసీ సా సభా రాజన్ బభూవ శతయోజనా ।
విస్తారాయామసంపన్నా భూయసీ చాపి పాండవ ॥ 2
రాజా! తేజోవంతమయిన ఆ సభ నూరు యోజనాల పొడవు వెడల్పులు గలది. పాండునందనా! అంతకన్న ఎక్కువైనా ఉండవచ్చు. (2)
ఆర్కప్రకాశా భ్రాజిష్ణుః సర్వతః కామరూపిణీ ।
నాతిశీతా న చాత్యుష్ణా మనసశ్చ ప్రహర్షిణీ ॥ 3
ఈ యమసభ సూర్యతేజస్సు గలది. కోరిన రూపాన్ని ధరించగల దిది. అంతటా ప్రకాశవంతమైనది. శీతోష్ణాలను నియంత్రించగలది. మనోరంజకమయినది. (3)
న శోకో న జరా తస్యాం క్షుత్పిపాసే న చాప్రియమ్ ।
న చ దైన్యం క్లమో వాపి ప్రతికూలం న చాప్యుత ॥ 4
ఆ సభలో శోకానికీ, శైథిల్యానికీ అవకాశం లేదు. ఆకలి దప్పులుండవు. అప్రియాలు జరుగవు. దీనత్వం కానీ, అలసట కానీ, ప్రాతికూల్యం కానీ అక్కడ ఉండవు. (4)
సర్వే కామాః స్థితాస్తస్యాం యే దివ్యా యే చ మానుషాః ।
సారవచ్చ ప్రభూతం చ భక్ష్యం భోజ్యమరిందమ ॥ 5
అరిందమా! దివ్యమానుషకాంక్షలన్నీ అక్కడ తీరుతాయి. రుచికరాలయిన భక్ష్యభోజ్యాలు అక్కడ మిక్కిలిగా ఉంటాయి. (5)
లేహ్యం చోష్యం చ పేయం చ హృద్యం స్వాదు మనోహరమ్ ।
పుణ్యగంధాః స్రజస్తస్య నిత్యం కామఫలా ద్రుమాః ॥ 6
అక్కడ లేహ్య, చోష్య, పేయాలయిన ఆహారపదార్థాలు మనోహరాలు, రుచికరాలు అయి మనస్సుకు నచ్చుతాయి. ఆ సభలో పుణ్యపరిమళాలు గల పూలమాలలు, కోరిన పండ్ల నిచ్చే చెట్లు ఎప్పుడూ ఉంటాయి. (6)
రసవంతి చ తోయాని శీతాన్యుష్ణాని చైవ హి ।
తస్యాం రాజర్షయః పుణ్యాః తథా బ్రహ్మర్షయోఽమలాః ॥ 7
యమం వైవస్వతం తాత ప్రహృష్టాః పర్యుపాసతే ।
ఆ సభలో తియ్యని చన్నీళ్ళు, వేణ్ణీళ్ళు ఎప్పుడూ దొరుకుతాయి. పవిత్రులయిన రాజర్షులు, నిర్మలులైన బ్రహ్మర్షులు పరమానందంతో అక్కడ సూర్యసుతుడైన యముని సేవిస్తారు. (7 1/2)
యయాతిర్నహుషః పూరుఃమాంధాతా సోమకో నృగః ॥ 8
త్రసదస్యుశ్చ రాజర్షిః కృతవీర్యః శ్రుతశ్రవాః ।
అరిష్టనేమిః సిద్ధశ్చ కృతవేగః కృతిర్నిమిః ॥ 9
ప్రతర్దనః శిబిర్మత్స్యః పృథులాక్షో బృహధ్రథః ।
వార్తో మరుత్తః కుశికః సాంకాశ్యః సంకృతిర్ధ్రువః ॥ 10
చతురశ్వః సదశ్యోర్మిః కార్తవీర్యశ్చ పార్థివః ।
భరతః సురథశ్చైవ సునీథో నిశఠో నలః ॥ 11
దివోదాసశ్చ సుమనా అంబరీషో భగీరథః ।
వ్యశ్వః సదశ్వో వధ్యశ్వః పృథువేగః పృథుశ్రవాః ॥ 12
పృషదశ్వో వసుమనాః క్షుపశ్చ సుమహాబలః ।
రుదద్రుర్వృషసేనశ్చ పురుకుత్సో ధ్వజీ రథీ ॥ 13
ఆర్ష్టిషేణో దిలీపశ్చ మహాత్మా చాప్యుశీనరః ।
ఔశీనరిః పుండరీకః శర్యాతిః శరభః శుచిః ॥ 14
అంగోఽరిష్టశ్చ వేనశ్చ దుష్యంతః సృంజయో జయః ।
భాంగాసురిః సునీథశ్చ నిషధోఽథ వహీనరః ॥ 15
కరంధమో బాహ్లికశ్చ సుద్యుమ్నో బలవాన్ మధుః ।
ఐలో మరుత్తశ్చ తథా బలవాన్ పృథివీపతిః ॥ 16
కపోతరోమా తృణకః సహదేవార్జునౌ తథా ।
వ్యశ్వః సాశ్వః కృతాశ్వశ్చ శశబిందుశ్చ పార్థివః ॥ 17
రాజా దాశరథిశ్చైవ కకుత్దృఽథ ప్రవర్ధనః ।
అలర్కః కక్షసేనశ్చ గయో గౌరాశ్వ ఏవ చ ॥ 18
జామదగ్న్యశ్చ రామశ్చ నాభాగ సగరౌ తథా ।
భూరిద్యుమ్నో మహాశ్వశ్చ పృథాశ్వో జనకస్తథా ॥ 19
రాజా వైన్యో వారిసేనః పురుజిజ్జనమేజయః ।
బ్రహ్మదత్తస్త్రిగర్తశ్చ రాజోపరిచరస్తథా ॥ 20
ఇంద్రద్యుమ్నో భీమజానుః గౌరపృష్ఠోఽనఘో లయః ।
పద్మోఽథ ముచుకుందశ్చ భూరిద్యుమ్నః ప్రసేనజిత్ ॥ 21
అరిష్టనేమిః సుద్యుమ్నః పృథులాశ్వోఽష్టకస్తథా ।
శతం మత్స్యా నృపతయః శతం నీపాః శతం గయాః ॥ 22
ధృతరాష్ట్రాశ్చైకశతమ్ అశీతిర్జనమేజయాః ।
శతం చ బ్రహ్మదత్తానాం వీరిణామీరిణాంశతమ్ ॥ 23
భీష్మాణాం ద్వే శతేప్యత్ర భీమానాం తు తథా శతమ్ ।
శతం చ ప్రతివింధ్యానాం శతం నాగాః శతం హయాః ॥ 24
పలాశానాం శతం జ్ఞేయం శతం కాశీకుశాదయః ।
శాంతనుశ్చైవ రాజేంద్ర పాండుశ్చైవ పితా తవ ॥ 25
ఉశంగవః శతరథః దేవరాజో జయద్రథః ।
వృషదర్బశ్చ రాజర్షిః బుద్ధిమాన్ సహ మంత్రిభిః ॥ 26
అథాపరే సహస్రాణి యే గతాః శశబిందవః ।
ఇష్ట్వాశ్వమేథైర్బహుభిః మహద్భిర్భూరిదక్షిణైః ॥ 27
ఏతే రాజర్షయః పుణ్యాః కీర్తిమంతో బహుశ్రుతాః ।
తస్యాం సభాయాం రాజేంద్ర వైవస్వతముపాసతే ॥ 28
యయాతి, నహుషుడు, పూరుడు, మాంధాత, సోమకుడు, నృగువు, త్రసదస్యుడు, కృతవీర్యుడు, శ్రుతశ్రవుడు, అరిష్టనేమి, సిద్ధుడు, కృతవేగుడు, కృతి, నిమి, ప్రతర్దనుడు, శిబి, మత్స్యుడు, పృథులాక్షుడు, బృహద్రథుడు, వార్తుడు, మరుత్తుడు, కుశికుడు, సాంకాశ్యుడు, సాంకృతి, ధ్రువుడు, చతురశ్వుడు, సదశ్వోర్మి, కార్తవీర్యార్జునుడు, భరతుడు, సురథుడు, సునీథుడు, నిశఠుడు, నలుడు, దివోదాసుడు, సుమనుడు, అంబరీషుడు, భగీరథుడు, వ్యశ్వుడు, సదశ్వుడు, వధ్యశ్వుడు, పృథువేగుడు, పృథుశ్రవుడు, పృషదశ్వుడు, వసుమనుడు, క్షుపుడు, రుషద్రుడు, వృషసేనుడు, పురుకుత్సుడు, ఆర్ష్టిషేణుడు, దిలీపుడు, ఉశీనరుడు, ఔశీనరి, పుండరీకుడు, శర్యాతి, శరభుడు, శుచి, అంగుడు, అరిష్టుడు, వేనుడు, దుష్యంతుడు, సృంజయుడు, జయుడు, భాంగాసురి, సునీథుడు, నిషధేశ్వరుడు, వహీనరుడు, కరంధముడు, బాహ్లీకుడు, సుద్యుమ్నుడు, బలవంతుడైన మధువు, ఐలుడు, మరుత్తుడు, కపోతరోముడు, తృణకుడు, సహదేవుడు, అర్జునుడు, వ్యశ్వుడు, సాశ్వుడు, కృశాశ్వుడు, శశబిందుడు, దశరథుడు, కకుత్థ్సుడు, ప్రవర్ధనుడు, అలర్కుడు, కక్షసేనుడు, గయుడు, గౌరాశ్వుడు, పరశురాముడు, నాభాగుడు, సగరుడు, భూరిద్యుమ్నుడు, మహాశ్వుడు, పృథాశ్వుడు, జనకుడు, పృథువు, వారిసేనుడు, పురుజిత్తు, జనమేజయుడు, బ్రహ్మదత్తుడు, త్రిగర్తుడు, ఉపరిచరుడు, ఇంద్రద్యుమ్నుడు, భీమజానువు, గౌరపృష్ఠుడు, అనఘుడు, లయుడు, పద్ముడు, ముచుకుందుడు, భూరిద్యుమ్నుడు, ప్రసేనజిత్తు, అరిష్టనేమి, సుద్యుమ్నుడు, పృథులాశ్వుడు, అష్టకుడు, వందమంది మత్స్యరాజులు, నూర్గురు నీపరాజులు, వందమంది గయులు, వందమంది ధృతరాష్ట్రులు, వందమంది వీరులు, నూర్గురు ఈరులు, రెండువందలమంది భీష్ములు, వందమంది భీములు, వందమంది ప్రతివింధ్యులు, నూర్గురు నాగరాజులు, వందమంది హయరాజులు, వందమంది పలాశులు, నూర్గురు కాశీరాజులు, వందమంది కుశరాజులు, శాంతనువు, పాండురాజు, ఉశంగవుడు, శతరథుడు, దేవరాజు, జయద్రథుడు, వృషదర్భరాజర్షి, ఆయన మంత్రులూ, వేలకొలదిగ శశబిందురాజులు ఆ సభలో ఉంటారు. వారు అనేక మహా యాగాలను భూరిదక్షిణలతో నిర్వహించి ధర్మరాజలోకాన్ని పొందినవారు. రాజేంద్రా! పుణ్యాత్ములు, కీర్తిమంతులు, బహుశ్రుతులు అయిన ఈ రాజర్షులందరూ ఆ సభలో సూర్యసుతుడైన యముని సేవిస్తుంటారు. (8-28)
అగస్త్యోఽథ మతంగశ్చ కాలో మృత్యుస్తథైవ చ 7.
యజ్వానశ్చైవ సిద్ధాశ్వాః యే చ యోగశరీరిణః ॥ 29
అగ్నిష్వాత్తాశ్చ పితరః ఫేనపాశ్చోష్మపాశ్చ యే ।
స్వధావంతో బర్హిషదః మూర్తిమంతస్తథాపరే ॥ 30
కాలచక్రం చ సాక్షాచ్చ భగవాన్ హవ్యవాహనః ।
నరా దుష్కృత కర్మాణః దక్షిణాయనమృత్యవః ॥ 31
కాలస్య నయనే యుక్తాః యమస్య పురుషాశ్చ యే ।
తస్యాం శింశపపాలాశాఃతథా కాశకుశాదయః ।
ఉపాసతే ధర్మరాజం మూర్తిమంతో జనాధిప ॥ 32
అగస్త్యుడు, మతంగుడు, కాలుడు, మృత్యువు, యజ్ఞకర్త, సిద్ధులు, యోగశరీరధారులు, అగ్నిష్వాత్తపితరులు, ఫేనపులు, ఊష్మపులు, స్వధావంతులు, బర్హిషదులు మొదలుగా గల పితరులు, కాలచక్రమూ, పూజ్యుడైన హవ్యవాహనుడు, దక్షిణాయనంలో మరణించిన మనుషులు, దుష్కరకర్మలు చేసిన మనుష్యులు, కాలుని ఆజ్ఞకు లోబడిన యమదూతలు, శింశప, పలాశ, కాశ, కుశాదులను అభిమానిమ్చే దేవతలు మూర్తిమంతులై ఈ సభలో ధర్మరాజును సేవిస్తారు. (29-32)
ఏతే చాన్యే చ బహవః పితృరాజసభాసదః ।
న శక్యాః పరిసంఖ్యాతుం నామభిః కర్మభిస్తథా ॥ 33
వీరే కాక మరెందరో పితృరాజైన యముని సభలో సభ్యులు. వారిపేర్లను, కర్మలను పరిగణించటం అసాధ్యమ్. (33)
అసంబాధా హి సా పార్థ రమ్యా కామగమా సభా ।
దీర్ఘకాలం తపస్తప్త్వా నిర్మితా విశ్వకర్మణా ॥ 34
కుంతీనందనా! ఆ యమసభ బాధారహితమైనది. అందమైనదీ, స్వేచ్ఛగా సంచరించునదీ. ఎంతోకాలం తపిమ్చి విశ్వకర్మ దానిని నిర్మించాడు. (34)
జ్వలంతీ భాసమానా చ తేజసా స్వేన భారత ।
తాముగ్రతపసో యాంతి సువ్రతాః సత్యవాదినః ॥ 35
శాంతాః సంన్యాసినః శుద్ధాః పూతాః పుణ్యేన కర్మణా ।
సర్వే భాస్వరదేహాశ్చ సర్వే చ విరజోఽంబరాః ॥ 36
భారతా! ఆ సభ తన తేజస్సుతో ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఉగ్రతపస్వులు, సత్యవాదులు, సువ్రతులు, శాంతులు, సన్యాసులు, పరిశుద్ధులు, పుణ్యకర్మలవలన పవిత్రులు అక్కడ ప్రవేశించగలరు. వారంతా తేజోవంతమైన శరీరం, నిర్మలవస్త్రాలు ధరించి ఉంటారు. (35,36)
చిత్రాంగదాశ్చిత్రమాల్యాః సర్వే జ్వలితకుండలాః ।
సుకృతైః కర్మభిః పుణ్యైః పారిబర్హైశ్చ భూషితాః ॥ 37
వారు అందరూ చిత్రమైన భుజాలంకారాలూ, చిత్రమైన హారాలూ, ప్రకాశిమ్చే కుండలాలు ధరించి ఉంటారు. తమ తమ పుణ్యకర్మలు, వస్త్రాభరణాలు వారికి విభూషణాలు. (37)
గంధర్వాశ్చ మహాత్మానః సంగశశ్చాప్సరోగణాః ।
వాదిత్రం నృత్యగీతం చ హాస్యం లాస్యం చ సర్వశః ॥ 38
మహాత్ములయిన గంధర్వులు, గుంపులు గుంపులుగా అచ్చరలు ఆ సభలో నుండి సర్వవిధాలయిన వాద్యాలతో, నృత్యగీతాలతో, హాస్యలాస్యాలతో ఆనందింపజేస్తారు. (38)
పుణ్యాశ్చ గంధాః శబ్దాశ్చ తస్యామ్ పార్థ సమంతతః ।
దివ్యాని చైవ మాల్యాని ఉపతిష్ఠంతి నిత్యశః ॥ 39
కౌంతేయా! ఆ సభలో నిత్యమూ అన్నివైపులా దివ్యపరిమళాలు, పవిత్రశబ్దాలు, దివ్యమాలలూ సన్నిహితాలై ఉంటాయి. (39)
శతం శతసహస్రాణి ధర్మిణాం తం ప్రజేశ్వరమ్ ।
ఉపాసతే మహాత్మానమ్ రూపయుక్తా మనస్వినః ॥ 40
సుందరరూపధారులయిన కోటిమంది ధర్మాత్ములూ, మానధనులు మహనీయుడయిన యముని ఉపాసిస్తుంటారు. (40)
ఈదృశీ సా సభా రాజన్ పితృరాజ్ఞో మహాత్మనః ।
వరుణస్యాపి వక్ష్యామి సభాం పుష్కరమాలినీమ్ ॥ 41
రాజా! పరేతరాజు, మహానుభావుడూ అయిన యముని సభ ఇటువంటిది. ఇక పుష్కరాదితీర్థాలతో ప్రకాశించే వరుణసభను గురించి చెపుతాను. (41)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యానపర్వణి యమసభానవర్ణనం నామాష్టమోఽధ్యాయః ॥ 8 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున లోకపాల సభాఖ్యానపర్వమను ఉపపర్వమున యమసభావర్ణనమను ఎనిమిదవ అధ్యాయము. (8)