7. ఏడవ అధ్యాయము
ఇంద్ర సభా వర్ణనము.
నారద ఉవాచ
శక్రస్య తు సభా దివ్యా భాస్వరా కర్మనిర్మితా ।
స్వయం శక్రేణ కౌరవ్య నిర్జితార్కసమప్రభా ॥ 1
నారదుడు ఇలా అన్నాడు.
"కురునందనా! ఇంద్రుని యొక్క తేజోవంతమైన దివ్యసభ సూర్యతేజంతో సమానంగా ప్రకాశిస్తున్నది. విశ్వకర్మయొక్క ప్రయత్నంతో ఆ సభ నిర్మింపబడింది. (1)
విస్తీర్ణం యోజనశతం శాతమధ్యర్ధమాయతా ।
వైహాయసీ కామగమా పంచయోజనముచ్ఛ్రితా ॥ 2
ఆసభ నూరుయోజనాల వెడల్పు, నూట ఏభైయోజనాల పొడవు, ఐదు యోజనాల ఎత్తు కలిగి ఆకాశంలో సంచరిస్తుంది. అది కామగమనశక్తి కలది. (2)
జరాశోకక్లమాపేతా నిరాంతకా శివా శుభా ।
వేశ్మాసనవతీ రమ్యా దివ్యపాదపశోభితా ॥ 3
ఆ సభలో ముసలితనంతో బాధపడేవారు, శోకంతో కష్టాలతో బాధపడేవారూ ఉండరు. అక్కడ భయం అనేది లేదు. అది మంగళకరం. శోభాసంపన్నమూను. అక్కడ ఉండటానికి అతి సుందరమైన మహళ్లున్నాయి. కూర్చుండటానికి ఉత్తమోత్తమసింహాసనాలు ఉన్నాయి. ఆ సభ దివ్యవృక్షాలతో శోభాయమానంగా ఉంది. (3)
తస్యాం దేవేశ్వరః పార్థ సభాయాం పరమాసనే ।
ఆస్తే శచ్యా మహేంద్రాణ్యా శ్రియా లక్ష్మ్యా చ భారత ॥ 4
ఆ సభలో దేవేంద్రుడు తన పట్టమహిషి అయిన శచీదేవితో కూడి సకలైశ్వర్యాలతో సింహాసనస్థుడై ఉంటాడు. ఆ శచీదేవి లక్ష్మివంటి శోభతో విరాజిల్లుతుంది. (4)
బిభ్రద్ వపురనిర్దేశ్యం కిరీటీ లోహితాంగదః ।
విరజోఽమంబరశ్చిత్రమాల్యః హ్రీకీర్తిద్యుతిభిః సహ ॥ 5
ఆ సమయంలో దేవేంద్రుడు కిరీటాన్ని, ఎర్రటి అంగదాలను ధరించి మటలకందని రూపంతో వెలుగుతుంటాడు. నిర్మల వస్త్రాలతో, విచిత్రమాలలతో ప్రకాశిస్తాడు. లజ్జ, కీర్తి, కాంతులతో నిండి ఉంటాడు. (5)
తస్యాముపాసతే నిత్యం మహాత్మానం శతక్రతుమ్ ।
మారుతః సర్వశో రాజన్ సర్వే చ గృహమేధినః ॥ 6
రాజా! మహనీయుడయిన ఆ దేవేంద్రుని చుట్టూ నిలిచి మరుద్గణాలు, గృహస్థులయిన దేవతలు నిత్యమూ సేవిస్తూ ఉంటారు. (6)
సిద్ధా దేవర్షయశ్చైవ సాధ్యా దేవగణాస్తథా ।
మరుత్వంతశ్చ సహితాః భాస్వంతో హేమమాలినః ॥ 7
ఏతే సానుచరాః సర్వే దివ్యరూపాః స్వలంకృతాః ।
ఉపాసతే మహాత్మానం దేవరాజమరిందమమ్ ॥ 8
సిద్ధులు, దేవమునులు, సాధ్యులు, దేవతాగణాలు, మరుత్వంతులు - వీరంతా సువర్ణమాలలను అలంకరించుకొని ఒక్కటై నిలిచి మహాత్ముడయిన ఆ దేవేంద్రుని ఈ సభలోనే సేవిస్తారు. వారంతా తమతమ అనుచరులతో కలిసి దివ్య-రూపాలను ధరించి చక్కగా అలంకరించుకొని ఉంటారు. (7,8)
తథా దేవర్షయః సర్వే పార్థ శక్రముపాసతే ।
అమలా ధూతపాప్మానః దీప్యమానా ఇవాగ్నయః ॥ 9
కౌంతేయా! ఈ రీతిగా పాపరహితులై నిర్మలులై ప్రజ్వలిమ్చే అగ్నిలాగా దేవర్షులందరూ దేవేంద్రుని సేవిస్తారు. (9)
తేజస్వినః సోమసుతః విశోకా విగతజ్వరాః ।
ఆ దేవర్షులు తేజోవంతులు, సోమయాగకర్తలు, చింతాశోకాలు లేనివారు. (9 1/2)
పరాశరః పర్వతశ్చ తథా సావర్ణి గాలవౌ ॥ 10
శంఖశ్చ లిఖితశ్చైవ తథా గౌరశిరా మునిః ।
దుర్వాసాః క్రోధనః శ్యేనః తథా దీర్ఘతమా మునిః ॥ 11
పవిత్రపాణిః సావర్ణిః యాజ్ఞవల్క్యోఽథ భాలుకిః ।
ఉద్దాలకః శ్వేతకేతుః తాండ్యో భాండాయనిస్తథా ॥ 12
హవిష్మాంశ్చ గరిష్ఠశ్చ హరిశ్చంద్రశ్చ పార్థివః ।
హృద్యశ్చోదరశాండిల్యః పారాశర్యః కృషీవలః ॥ 13
వాతస్కంధో విశాఖశ్చ విధాతా కాల ఏవ చ ।
కరాలదంతస్త్వష్టా చ విశ్వకర్మా చ తుంబురుః ॥ 14
అయోనిజా యోనిజాశ్చ వాయుభక్షా హుతాశినః ।
ఈశానం సర్వలోకస్య వజ్రిణం సముపాసతే ॥ 15
పరాశరుడు, పర్వతుడు, సావర్ణి, గాలవుడు, శంఖుడు, లిఖితుడు, గౌరశిరుడు, దుర్వాసుడు, క్రోధనుడు, శ్యేనుడు, దీర్ఘతముడు, పవిత్రపాణి, సావర్ణి (ద్వితీయ) యాజ్ఞవల్కుడు, భాలుకి, ఉద్దాలకుడు, శ్వేతకేతువు, తాండ్యుడు, భాండాయని, హవిష్మంతుడు, గరిష్ఠుడు, హరిశ్చంద్రమహారాజు, హృద్యుడు, ఉదరశాండిల్యుడు, విశాఖుడు, విధాత, కాలుడు, కరాలదంతుడు, త్వష్ట, విశ్వకర్మ, తుంబురుడు - మొదలయిన ఎందరో మునులు, వాయుభక్షకులూ,హవిర్భోక్తలు అయిన మహర్షులు సర్వలోకాధిపతి అయిన వజ్రపాణిని సేవిస్తారు. (10-15)
సహదేవః సునీథశ్చ వాల్మీకిశ్చ మహాతపాః ।
శమీకః సత్యవాక్ చైవ ప్రచేతాః సత్యసంగరః ॥ 16
మేధాతిథిర్వామదేవః పులస్త్యః పులహః క్రతుః ।
మరుత్తశ్చ మరీచిశ్చ స్థాణుశ్చాత్ర మహాతపాః ॥ 17
కక్షీవాన్ గౌతమస్తార్ష్యః తథా వైశ్వానరో మునిః ।
(షడర్తుః కవషో ధూమ్రHఆఆ రైభ్యో నలపరావసూ ।
స్వస్త్యాత్రేయో జరత్కారుః కహోలః కాశ్యపస్తథా ।
విభాండకర్ష్యశృంగశ్చ ఉన్ముఖో విముఖస్తథా ॥)
మునిః కాలకవృక్షీయః ఆశ్రావ్యోఽథ హిరణ్మయః ॥ 18
సంవర్తో దేవహవ్యశ్చ విష్వక్సేనశ్చ వీర్యవాన్ ।
(కణ్వః కాత్యాయనో రాజన్ గార్గ్యః కౌశిక ఏవ చ ।)
దివ్యా ఆపస్తథౌషధ్యః శ్రద్ధా మేధా సరస్వతీ ॥ 19
అర్థో ధర్మశ్చ కామశ్చ విద్యుతశ్చైవ పాండవ ।
జలవాహస్తథా మేఘాః వాయవః స్తనయిత్నవః ॥ 20
ప్రాచీ దిగ్ యజ్ఞవాహాశ్చ పావకాః సప్తవింశతిః ।
అగ్నీషోమౌ తథేంద్రాగ్నీ మిత్రశ్చ సవితార్యమా ॥ 21
భగో విశ్వే చ సాధ్యాశ్చ గురుః శుక్రస్తథైవ చ 7.
విశ్వావసుశ్చిత్రసేనః సుమనస్తరుణస్తథా ॥ 22
యజ్ఞాశ్చ దక్షిణాశ్చైవం గ్రహాస్తారాశ్చ భారత ।
యజ్ఞవాహాశ్చ యే మంత్రాః సర్వే తత్ర సమాసతే ॥ 23
పాండుకుమారా! సహదేవుడు, సునీథుడు, మహాతపస్వి అయిన వాల్మీకి, సత్యవాది అయిన శమీకుడు, సత్యప్రతిజ్ఞుడైన ప్రచేతుడు, మేధాతిథి, వామదేవుడు, పులస్త్యుడు, వులహుడు, క్రతువు, మరుత్తుడు, మరీచి, మహాతపస్వి అయిన స్థాణువు, కక్షీవంతుడు, గౌతముడు, తార్ష్యుడు, వైశ్వానరముని, షడర్తుడు, కవషుడు, ధూమ్రుడు, రైభ్యుడు, వలుడు, పరావసుడు, స్వస్త్యాత్రేయుడు, జరత్కారువు, కహాలుడు, కాశ్యపుడు, విభాండకుడు, ఋష్యశృంగుడు, ఉన్ముఖుడు, విముఖుడు, కాలక వృక్షీయుడు, ఆశ్రావ్యుడు, హిరణ్మయుడు, సంవర్తుడు, దేవహవ్యుడు, విష్వక్సేనుడు, కణ్వుడు, కాత్యాయనుడు, గార్గ్యుడు, కౌశికుడు, ఆ సభలో ఉంటారు. దివ్యజలాలు, ఓషధులు, శ్రద్ధ, మేధ, సరస్వతి, అర్థధర్మకామాలు, విద్యుత్తు, మేఘాలు, వాయువు, గర్జించే మబ్బులు, తూర్పుదిక్కు, హవిర్వాహకులయిన సప్తవింశతి వహ్నులు, అగ్నీషోములు, ఇంద్రాగ్నులు, మిత్రుడు, సవిత, అర్యముడు, భగుడు, విశ్వేదేవులు, సాధ్యులు, బృహస్పతి, శుక్రుడు, విశ్వావసువు, చిత్రసేనుడు, సుమనుడు, తరుణుడు, యజ్ఞాలు, దక్షిణలు, గ్రహాలు, తారలు, యజ్ఞనిర్వాహక మంత్రాలు - ఇంద్రసభలో అలంకారాలు. (16-23)
తథైవాప్సరసో రాజన్ గంధర్వాశ్చ మనోరమాః ।
నృత్యవాదిత్రగీతైశ్చ హాస్యైశ్చ వివిధైరపి ॥ 24
రాజా! అదేవిధంగా అందమయిన అప్సరసలు, మనోహరులయిన గంధర్వులు నృత్య, గీత, వాద్యాలతో
వివిధ హాస్యవిన్యాసాలతో దేవరాజయిన ఇంద్రుని మనస్సును రంజింపజేస్తారు. (24)
రమయంతి స్మ నృపతే దేవరాజం శతక్రతుమ్ ।
స్తుతిభిర్మంగళైశ్చైవ స్తువంతః కర్మభిస్తథా ॥ 25
అంతేకాక స్తుతులతో, మంగళగీతాలతో, వీరగాథలతో బలుని, వృత్రుని సంహరించిన దేవేంద్రుని స్తుతిస్తూ ఉంటారు. (25)
విక్రమైశ్చ మహాత్మానం బలవృత్రనిఘాదనమ్ ।
బ్రహ్మరాజర్షయశ్చైవ సర్వే దేవర్షయస్తథా ॥ 26
విమానైర్వివిధైర్దివ్యైః దీప్యమానా ఇవాగ్నయః ।
స్రగ్విణో భూషితాః సర్వే యాంతి చాయాంతి చాపరే ॥ 27
మరెందరో బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు పూలమాలలు ధరించి, వస్త్రాభరణాల నలంకరించుకొని, అగ్నుల వలె ప్రకాశిస్తూ దివ్య విమానాలలో దేవేంద్రుని సన్నిధికి వస్తూ పోతూ ఉంటారు. (26,27)
బృహస్పతిశ్చ శుక్రశ్చ నిత్యమాస్తాం హి తత్ర వై ।
ఏతే చాన్యే చ బహవః మహాత్మానో యతవ్రతాః ॥ 28
విమానైశ్చంద్రసంకాశైః సోమవ్రత్పియదర్శనాః ।
బ్రహ్మణః సదృశా రాజన్ భృగుః సప్తర్షయస్తథా ॥ 29
రాజా! బృహస్పతి, శుక్రుడు ఎప్పుడూ అక్కడే ఉంటారు. వీరూ మరెందరో మహాత్ములు, సంయములు, చంద్రునివలె దర్శనీయులై చంద్రునివలె ప్రకాశిమ్చే విమానాలలో అక్కడకు వస్తారు. బ్రహ్మసమానులైన భృగువు, సప్తర్షులు కూడా అక్కడ ప్రకాశిస్తుంటారు. (28,29)
ఏషా సభా మయా రాజన్ దృష్టా పుష్కరమాలినీ ।
శతక్రతోర్మహాబాహో యామ్యామపి సభాం శృణు ॥ 30
రాజా! కమలశోభితమయిన ఈ ఇంద్రసభను నేను చూశాను. మహాబాహూ! ఇక యమసభను గురించి విను. (30)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి లోకపాల ఇంద్రసభావర్ణనం నామ సప్తమోఽధ్యాయః ॥ 7 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున లోకపాల సభాఖ్యానపర్వమను ఉపపర్వమున ఇంద్రసభావర్ణనమను ఏడవ అధ్యాయము. (7)
(దాక్షిణాత్య అధికపాఠం 2 శ్లోకాలు కలిపి మొత్తం 32 శ్లోకాలు)