6. ఆరవ అధ్యాయము

దివ్యసభను గూర్చిన యుధిష్టిరుని జిజ్ఞాస.

వైశంపాయన ఉవాచ
ససంపూజ్యాథాభ్యనుజ్ఞాతః మహర్షేర్వచనాత్ పరమ్ ।
ప్రత్యువాచానుపూర్వ్యేణ ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 1
వైశంపాయనుడు జనమేజయునితో
"జనమేజయమహారాజా! దేవర్షి నారదుడు ఆవిధంగా ఉపదేశించాక ధర్మరాజు అతనికి పూజచేసి ఆ మహర్షి అనుమతితో ఆయనతో ఇలా అన్నాడు. (1)
యుధిష్ఠిర ఉవాచ
భగవన్ న్యాయ్యమాహైతం యథావద్ ధర్మనిశ్చయమ్ ।
యథాశక్తి యథాన్యాయం క్రియతేఽయం విధిర్మయా ॥ 2
యుధిష్ఠిరుడు నారదునితో అన్నాడు.
భగవాన్! మీరు ఉపదేశిమ్చిన రాజధర్మాలన్నీ యథార్థ సిద్ధాంతాలు. అవి అన్నీ న్యాయసహితాలు. మీరు న్యాయానుకూలంగా ఉపదేశించిన వీటిని యథాశక్తి ఆచరిస్తాను. (2)
రాజభిర్యద్ యథాకార్యం పురా వై తన్న సంశయః ।
యయా న్యాయోపనీతార్థం కృతం హేతుమదర్ధవత్ ॥ 3
ప్రాచీన మహారాజులు అందరూ ఆ విధంగా కార్యాలను ఆచరించి సంపన్నులయ్యారు. అవి న్యాయోచితాలు. సకారణాలు. విశేషప్రయోజనంతో కూడి ఉన్నాయి. ఇందు ఏమాత్రం సందేహం లేదు. (3)
వయం తు సత్పథం తేషాం యాతుమిచ్ఛామహే ప్రభో ।
న తు శక్యం తథా గంతుం యథా తైర్నియతాత్మభిః॥ 4
ప్రభూ! మేము గూడా ఆ ఉత్తమ మార్గంలోనే కొనసాగాలని కోరుతున్నాము. కానీ పూర్తిగా మేము ఆ నియతాత్ములవలె ఆచరింపలేమేమో అని సందేహపడుతున్నాము. (4)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా స ధర్మాత్మా వాక్యం తదభిపూజ్య చ ।
ముహూర్తాత్ ప్రాప్తకాలం చ దృష్ట్వా లోకచరం మునిమ్ ॥ 5
నారదం సుస్థమాసీనమ్ ఉపాసీనో యుధిష్ఠిరః ।
అపృచ్ఛత్ పాండవస్తత్ర రాజమధ్యే మహాద్యుతిః ॥ 6
వైశంపాయనుడు ఇలా అన్నాడు.
"మహారాజా! ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు నారదుని
ప్రశంసించాడు. మళ్ళీ త్రిలోకసంచారి అయిన నారదమహర్షి ప్రశాంతంగా కూర్చుండగా రెండు గడియల తరువాత దానిని తగిన సమయంగా భావించి తేజస్వి అయిన యుధిష్ఠిరుడు అక్కడ ఉన్న రాజులందరి సమక్షంలో నారదుని ఈ విధంగా అడుగుతున్నాడు. (5,6)
యుధిష్ఠిర ఉవాచ
భవాన్ సంచరతే లోకాన్ సదా నానావిధాన్ బహూన్ ।
బ్రహ్మణా నిర్మితాన్ పూర్వం ప్రేక్షమాణో మనోజవః ॥ 7
యుధిష్ఠిరుడు అన్నాడు. మునివరా! మీరు మనోవేగం కలవారు. ఎప్పుడూ అనేకలోకాల్లో సంచరిస్తూ ఉంటారు. బ్రహ్మ నిర్మించిన లోకాలనెన్నింటినో మిరు చూస్తూనే ఉంటారు. (7)
ఈదృశీ భవతా కాచిద్ దృష్టపూర్వా సభా క్వచిత్ ।
ఇతో వా శ్రేయసీ బ్రహ్మన్ తం మమాచక్ష్య పృచ్ఛతః ॥ 8
ఎక్కడైనా ఎపుడైనా ఈ విధమైన సభను కానీ దీనికన్న గొప్పసభను కానీ చూశారా? ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఉంది. నాకు ఈ విషయాన్ని చెప్పండి. (8)
వైశంపాయన ఉవాచ
తాన్ శ్రుత్వా నారదస్తస్య ధర్మరాజస్య భాషితమ్ ।
పాండవం ప్రత్యువచేదం స్మయన్ మధురాయా గిరా ॥ 9
వైశంపాయనుడు అన్నాడు. యుధిష్ఠిరుడు అడిగిన ఈ ప్రశ్నను విని నారదమహర్షి చిరునవ్వుతో చూసి ఆ పాండుకుమారునికి మధురమైన మాటల్లో ఈ విధంగా సమాధానం చెప్పాడు. (9)
నారద ఉవాచ
మానుషేషు న మే తాత దృష్టపూర్వా న చ శ్రుతా ।
సభా మణిమయీ రాజన్ యథేయం తవ భారత ॥ 10
నారదుడు (ధర్మజునితో) అన్నాడు.
నాయనా! యుధిష్ఠిరా! మణిమయమైన ఇటువంటి సభను మానవలోకంలో నేనింతకు ముందు చూడలేదు, వినలేదు కూడా. (10)
సభాం తు పితృరాజస్య వరుణస్య చ ధీమతః ।
కథయిష్యే తథేంద్రస్య కైలాసనిలయస్య చ ॥ 11
బ్రహ్మణశ్చ సభాం దివ్యాం కథయిష్యే గతక్లమామ్ ।
దివ్యాదివ్యై రభిప్రాయైః ఉపేతాం విశ్వరూపిణీమ్ ॥ 12
దేవైః పితృగణైః సాధైః యజ్వభిర్నియతాత్మభిః ।
జుష్టాం మునిగణైః శాంతైః వేదయజ్ఞైః సదక్షిణైః ।
యది తే శ్రవణే బుద్ధిః వర్తతే భరతర్షభ ॥ 13
భరతశ్రేష్ఠా! నీ మనస్సు లోకాలలోని దివ్యసభలను గూర్చి దేవతలు, పితృదేవతలు, సాధ్యులు, నియతాత్ములయిన యజ్వలు, శాంతులయిన మునులు, సదక్షిణాకములయిన యజ్ఞాలు.... వీటిని గురించి నీకు వినాలని ఉంటే... నీ పితృదేవుడైన యమునిసభను, బుద్ధిమంతుడైన వరుణుని సభను, స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సభను, కైలాసనివాసియయిన కుబేరుని సభను, బ్రహ్మదేవుని దివ్యసభను గూర్చి చెపుతాను విను. (11-13)
నారదేనైవముక్తస్తు ధర్మరాజో యుధిష్ఠిరః ।
ప్రాంజలిర్ర్భాతృభిః సార్ధం తైశ్చ సర్వైర్ద్విజోత్తమైః ॥ 14
నారదం ప్రత్యువాచేదం ధర్మరాజో మహామనాః ।
సభాః కథయతాః సర్వాః శ్రోతుమిచ్ఛామహే వయమ్ ॥ 15
నారదుడు ఆ విధంగా చెప్పగానే ధర్మరాజు సోదరులతోను, బ్రాహ్మణులందరితోను కలిసి మహర్షికి నమస్కరించి, ఈ ప్రకారంగా అర్థిస్తున్నాడు.
"తాపసోత్తమా! మేము అందరమ్ ఆ దివ్యసభల్ని గురించి
వినడానికి కుతూహలపడుతున్నాం. మీరు వాటిని గూర్చి పూర్తిగా వివరించి చెప్పండి. (14,15)
కిం ద్రవ్యాస్తాః సభా బ్రహ్మన్ కిం విస్తారాః కిమాయతాః ।
పితామహమ్ చ కే తస్యాం సభాయాం పర్యుపాసతే ॥ 16
మహానుభావా! ఆ సభానిర్మాణం ఏ ద్రవ్యంతో జరిగింది? దాని పొడవు-వెడల్పులు ఎంతెంత? బ్రహ్మదేవుని సభలో ఏ ఏ సభాసదులు ఆయనను సేవిస్తూ ఉంటారు? (16)
వాసవం దేవరాజం చ యమం వైవస్వత చ కే ।
వరుణమ్ చ కుబేరం చ సభాయాం పర్యుపాసతే ॥ 17
అదే విధంగా దేవరాజయిన ఇంద్రసభలోగానీ, వైవస్వతుడయిన యముని సభలో గానీ, వరుణదేవుని సభలో కానీ, కుబేరుని సభలో గాని ఎవరెవరు వారిని సేవిస్తారు? (17)
ఏతత్ సర్వం యథాన్యాయం బ్రహ్మర్షే వదతస్తవ ।
శ్రోతుమిచ్ఛమ సహితాః పరం కౌతూహలం హి నః ॥ 18
బ్రహ్మర్షీ! మేమందరం మీ ముఖతః ఈ విషయాల్ని యథోచిత రీతిలో వినవలెనని కుతూహలంతో ఉన్నాం. (18)
ఏవముక్తః పాండవేన నారదః ప్రత్యభాషత ।
క్రమేణ రాజన్ దివ్యాస్తాః శ్రూయంతామిహ నః సభాః ॥ 19
పాండుకుమారుడైన యుధిష్ఠిరుడు ఆవిధంగా అడిగిన తరువాత నారదమహర్షి ఈ విధంగా సమాధానం చెపుతున్నాడు.
"ధర్మరాజా! ఆ దివ్యసభలను గూర్చి వర్ణిస్తాను విను." (19)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యానపర్వణి యుధిష్ఠిరసభాజిజ్ఞాసాయాం షష్ఠోఽధ్యాయః ॥ 6 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున, లోకపాల సభాఖ్యానపర్వమను ఉపపర్వమున యుధిష్ఠిరసభాజిజ్ఞాస అను ఆరవ అధ్యాయము. (6)