9. తొమ్మిదవ అధ్యాయము
వరుణ సభావర్ణనము
నారద ఉవాచ
యుధిష్ఠిర సభా దివ్యా వరుణస్యామితప్రభా ।
ప్రమాణేన యథా యామ్యా శుభప్రాకారతోరణా ॥ 1
నారదుడిలా అన్నాడు.
యుధిష్ఠిరా! వరుణుని దివ్యసబ అమితకాంతి గలది. యమసభ అంత పెద్దది. శుభకరాలయిన ప్రాకారాలు, తోరణాలు గలది. (1)
అంతః సలిలమాస్థాయ విహితా విశ్వకర్మణా ।
దివ్యై రత్నమయైర్వృక్షైః ఫలపుష్పప్రదైర్యుతా ॥ 2
విశ్వకర్మ దీనిని నీటిమధ్యలో నిర్మించాడు. పూలను, పండ్లను ఇవ్వగల రత్నమయ దివ్యవృక్షాలు దీనిలో ఉన్నాయి. (2)
నీలపీతసితశ్యామైః సితైర్లోహితకైరపి ।
అవతానైస్తథా గుల్మైః మంజరీజాలధారిభిః ॥ 3
దీనిలో పుష్పగుచ్ఛాలు గల లతలు పొదరిళ్ళు ఉన్నాయి. అవి నల్లగా, పచ్చగా, నీలంగా, తెల్లగా, ఎర్రగా శోభిస్తున్నాయి. (3)
తథా శకునయస్తస్యా విచిత్రా మధురస్వరాః ।
అనిర్దేశ్యా వపుష్మంతః శతశోఽథ సహస్రశః ॥ 4
అదే రీతిగా ఆ సభలో మధుర విచిత్ర కంఠధ్వనులు గల పక్షులు, వందలు, వేలు కనిపిస్తున్నాయి. వాటి రూపసౌందర్యం వర్ణనలకు అందనిది. (4)
సా సభా సుకసంస్పర్శా న శీతా న చ ఘర్మదా ।
వేశ్మాసనవతీ రమ్యా సితా వరుణపాలితా ॥ 5
ఆ సభ సుకస్పర్శ కలది. అంత చల్లనిదీ కాదు, అంత వెచ్చనిదీ కాదు. దానిలో ఎన్నో గదులూ, ఎన్నో ఆసనాలు ఉన్నాయి. వరుణరక్షిత అయిన ఆ సబ శ్వేతవర్ణంతో రమణీయమైనది. (5)
యస్యామాస్తే స వరుణః వారుణ్యా చ సమన్వితః ।
దివ్యరత్నాంబరధరః దివ్యాభరణభూషితః ॥ 6
ఆ సభలో దివ్యరతాంబరాలనూ, దివ్యాభరణాలనూ అలంకరించుకొని వరునదేవుడు వారుణీదేవితో కలిసి విరాజిల్లుతాడు. (6)
స్రగ్విణో దివ్యగంధాశ్చ దివ్యగంధానులేపనాః ।
ఆదిత్యాస్తత్ర వరుణం జలేశ్వరముపాసతే ॥ 7
దివ్యమాలలు, దివ్యగంధాలు, దివ్యానులేపనాలు ధరించిన ఆదిత్యగణం ఆ సభలో వరుణదేవుని ఉపాసిస్తుంది. (7)
వాసుకిస్తక్షకశ్చైవ నాగశ్చైరావతస్తథా ।
కృష్ణశ్చ లోహితశ్చైవ పద్మశ్చిత్రశ్చ వీర్యవాన్ ॥ 8
వాసుకి, తక్షకుడు, నాగుడు, ఐరావతుడు, కృష్ణుడు, లోహితుడు, పద్ముడు, చిత్రుడు... (8)
కంబలాశ్వతరౌ నాగౌ ధృతరాష్ట్రబలాహకౌ ।
(మనినాగశ్చ నాగశ్చ మణిః శంఖనఖస్తథా ।
కౌరవ్యః స్వస్తికశ్చైవ ఏలాపత్రశ్చ వామనః ॥
అపరాజితశ్చ దోషశ్చ నందకః పూరణస్తథా ।
అభీకః శిబికః శ్వేతః భద్రో భద్రేశ్వరస్తథా ॥)
మణిమాన్ కుండధారశ్చ కర్కోటకధనంజయౌ ॥ 9
కంబలుడు, అశ్వతరుడు, ధృతరాష్ట్రుడు, బలాహకుడు, మణినాగుడు, నాగుడు, మణి, శంఖనఖుడు, కౌరవ్యుడు, స్వస్తికుడు, ఏలాపత్రుడు, వామనుడు, అపరాజితుడు, దోషుడు, నందకుడు, పూరణుడు, అభీకుడు, శిబికుడు, శ్వేతుడు, భద్రుడు, భద్రేశ్వరుడు, మణిమంతుడు, కుండధారుడు, కర్కోటకుడు, ధనుంజయుడు,... (9)
పాణిమాన్ కుండధారశ్చ బలవాన్ పృథివీపతే ।
ప్రహ్లాదో మూషికాదశ్చ తథైవ జనమేజయః ॥ 10
పతాకినో మండలినః ఫణావంతశ్చ సర్వశః ।
(అనంతశ్చ మహానాగః యమ్ స దృష్ట్వా జలేశ్వరః ।
అభ్యర్చయతి సత్కారైః ఆసనేన చ తం విభుమ్ ॥
వాసుకిప్రముఖాశ్చైవ సర్వే ప్రాంజలయః స్థితాః ।
అనుజ్ఞాతాశ్చ శేషేణ యథార్హముపవిశ్య చ ॥)
ఏతే చాన్యే చ బహవః సర్పాస్తస్యాం యుధిష్ఠిర ।
ఉపాసతే మహాత్మానం వరుణం విగతక్లమాః ॥ 11
పాణిమంతుడు, కుండధారుడు, ప్రహ్లాదుడు, మూషికాదుడు, జనమేజయుడు మొదలగా గల నాగులు వరుణుని చుట్టూ చేరి పతాకాలు దాల్చి ఉంటారు. వరుణుడు అనంతునికి ఆసనమిచ్చి సత్కరిస్తాడు. వాసుకి మొదలయినవారు శేషుని అనుమతితో ఆసనాలపై కూర్చుంటారు. యుధిష్ఠిరా! వీరూ, ఇంకా చాలామంది నాగులు ఆ సభలో సేద దీరి వరుణుని సేవిస్తారు. (10,11)
బలిర్వైరోచనో రాజా నరకః పృథివీంజయః ।
ప్రహ్లాదో విప్రచిత్తిశ్చ కాలఖంజాశ్చ దానవాః ॥ 12
సుహనుర్దుర్ముఖః శంఖః సుమనాః సుమతిస్తతః ।
ఘటోదరో మహాపార్శ్వః క్రథనః పిఠరస్తథా ॥ 13
విశ్వరూపః స్వరూపశ్చ విరూపోఽథ మహాశిరాః ।
దశగ్రీవశ్చ వాలీ చ మేఘవాసా దశావరః ॥ 14
టిట్టిభో విటభూతశ్చ సంహ్లాదశ్చేంద్రతాపనః ।
దైత్యదానవసంఘాశ్చ సర్వే రుచిరకుండలాః ॥ 15
స్రగ్విణో మేళినశ్చైవ తథా దివ్యపరిచ్ఛదాః ।
సర్వే లబ్ధవరాః శూరాః సర్వే విగతమృత్యవః ॥ 16
తే తస్యాం వరుణం దేవం ధర్మపాశధరం సదా ।
ఉపాసతే మహాత్మానం సర్వే సుచరితవ్రతాః ॥ 17
విరోచనసుతుడు బలిచక్రవర్తి, పృథివీ విజేత నరకాసురుడు, ప్రహ్లాదుడు, విప్రచిత్తి, కాలఖంజుడు, సుహనుడు, దుర్ముఖుడు, శంఖుడు, సుమనుడు, సుమతి, ఘటోదరుడు, మహాపార్శ్వుడు, క్రథనుడు, పిఠరుడు, విశ్వరూపుడు, స్వరూపుడు, విరూపుడు, మహాశిరుడు, రావణుడు,
వాలి మేఘవాసుడు, దశావరుడు, టిట్టిభుడు, విటభూతుడు, సంహ్లాదుడు, ఇంద్రతాపసుడు, మొదలయిన దైత్యదానవగుణం మనోహరకుండలాలను, సుందరహారకిరీటాలను, దివ్యవస్త్రాభరణాలను ధరిమ్చి నిత్యమూ ధర్మపాశధారి అయిన వరుణదేవుని ఉపాసిస్తూ ఉంటారు.
ఈ దైత్యులంతా వరాలను పొంది శౌర్యసంపన్నులై చిరంజీవులయినారు. వీరి దీక్షాచారిత్రాలు సర్వోత్తమమయినవి. (12-17)
తథా సముద్రాశ్చత్వారః నదీ భాగీరథీ చ సా ।
కాళిందీ విదిశా వేణా నర్మదా వేగవాహినీ ॥ 18
అదే తీరున నాలుగు సముద్రాలూ, గంగా, కాళిందీ, విదిశా, వేణా, నర్మదా, వేగవాహినీ నదులు... (18)
విపాశా చ శతద్రుశ్చ చంద్రభాగా సరస్వతీ ।
ఇరావతీ వితస్తా చ సింధుర్దేవనదీ తథ్ ॥ 19
విపాశ, శతద్రువు, చంద్రభాగ, సరస్వతి, ఇరావతి, వితస్త, సింధువు, దేవనది... (19)
గోదావరీ కృష్ణవేణా కావేరీ చ సరిద్వరా ।
కింపునా చ విశల్యా చ తథా వైతరణీ నదీ ॥ 20
గోదావరి, కృష్ణవేణి, కావేరి, కింపున, విశల్య, వైతరణి (20)
తృతీయా జ్యేష్ఠిలా చైవ శోణశ్చాపి మహానదః ।
చర్మణ్వతీ తథా చైవ పర్ణాశా చ మహానదీ ॥ 21
తృతీయ, జ్యేష్ఠిల, మహానదమైన శోణ, చర్మణ్వతి, పర్ణాశ, మహానది... (21)
సరయు, వారవతి, లాంగలి, కరతోయ, ఆత్రేయి, లౌహిత్య (నదం)... (22)
లంఘతీ గోమతీ చైవ సంధ్యా త్రిఃస్రోతసీ తథా ।
ఏతాశ్చాన్యాశ్చ రాజేంద్ర సుతీర్థా లోకవిశ్రుతాః ॥ 23
ధర్మజా! లంఘతి, గోమతి, సంధ్య, త్రిస్రోతసి మొదలయిన లోకవిఖ్యాత తీర్థాలన్నీ వరుణుని సేవిస్తుంటాయి. (23)
సరితః సర్వతశ్చాన్యాః తీర్థాని చ సరాంసి చ ।
కూపాశ్చ సప్రస్రవణాః దేహవంతో యుధిష్ఠిర ॥ 24
పల్వలాని తడాగాని దేహవంత్యథ భారత ।
దిశస్తథా మహీ చైవ తథా సర్వే మహీధరాః ॥ 25
ఉపాసతే మహాత్మానం సర్వే జలచరాస్తథా ।
యుధిష్ఠిరా! సమస్తనదులు, జలాశయాలు, సరస్సులు, బావులు, వాగులు, చెరువులు, మడుగులు, సర్వదిక్కులు, భూమి, పర్వతాలు సమస్తజలచరప్రాణులు రూపాలు ధరించి మహాత్ముడైన వరుణదేవుని ఉపాసిస్తుంటాయి. (24,25 1/2)
గీతవాదిత్రవంతశ్చ గంధర్వాప్సరసాం గణాః ॥ 26
స్తువంతో వరుణం తస్యాం సర్వ ఏవ సమాగతే ।
గంధర్వులు, అప్సరోగణాలు అందరూ గీత వాద్యాలతో వరుణుని ప్రస్తుతిస్తూ ఉపాసిస్తుంటారు. (26 1/2)
మహీధరా రత్నవంతో రసా యే చ ప్రతిష్టితాః ॥ 27
కథయంతః సుమధురాః కథాస్తత్ర సమాసతే ।
రత్నమయపర్వతాలు, రూపాలను ధరించిన రసాలు అక్కడ మధురకథలను వినిపిస్తూ నివసిస్తుంటాయి. (27 1/2)
వారుణశ్చ తథా మంత్రః సునాభః పర్యుపాసతే ॥ 28
పుత్రపౌత్రైః పరివృతః గోనామ్నా పుష్కరేణ చ ।
వరుణుని మంత్రి సునాభుడు పుత్రపౌత్రులతో సహా గో, పుష్కరనామాలు గల తీర్థాలతో పాటు వరుణుని సేవిస్తుంటాడు. (28 1/2)
సర్వే విగ్రహవంతస్తే తమీశ్వరముపాసతే ॥ 29
వీరంతా దేహధారులై లోకపాలకుడైన వరుణుని ఉపాసిస్తారు. (29)
ఏషా మయా సంపతతా వారుణీ భరతర్షభ ।
దృష్టపూర్వా సభా రమ్యా కుబేరస్య సభాం శృణు ॥ 30
భరతర్షభా! నేను రమ్యా గతంలోనే అంతటా సంచరిస్తూ రమణీయమయిన ఈ వరుణసభను చూచాను. ఇక కుబేర సభను గురించి విను. (30)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యానపర్వణి సభావర్ణనే నవమోఽధ్యాయః ॥ 9 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున లోకపాల సభాఖ్యానపర్వమను ఉపపర్వమున వరుణసభావర్ణనమను తొమ్మిదవ అధ్యాయము. (9)
(దాక్షిణాత్య అధికపాఠం శ్లోకాలు కలిపి మొత్తం 34 శ్లోకాలు)