2. రెండవ అధ్యాయము

శ్రీకృష్ణుడు ద్వారకకు వెడలుట.

ఉషిత్వా ఖాండవప్రస్థే సుఖవాసం జనార్దనః ।
పార్థైః ప్రతిసమాయిక్తైః పూజనార్హోఽభిపూజితః ॥ 1
వైశంపాయనుడు ఇలా చెపుతున్నాడు.
జనమేజయమహారాజా! పరమపూజనీయుడైన భగవానుడు శ్రీకృష్ణుడు ఖాండవప్రస్థంలో - ఉంటూ ప్రేమాస్పదులైన పాండవుల ద్వారా నిత్యపూజలు అందుకొంటూ సుఖంగా ఉంటున్నాడు. (1)
గమనాయ మతిం చక్రే పితుర్దర్శనలాలసః ।
ధర్మరాజమథామంత్ర్య పృథామ్ చ పృథులోచనః ॥ 2
కొన్నిరోజుల తరువాత తన తండ్రిని దర్శించాలనే కుతూహలం కలిగి, విశాలలోచనుడైన పరమాత్మ ధర్మరాజు దగ్గర, కుంతి దగ్గర అనుమతి తీసుకొని ద్వారకానగరానికి వెళ్లదలచాడు. (2)
వవందే చరణౌ ముర్ధ్నా జగద్వంద్యః పితృష్వసుః ।
స తయా మూర్థ్న్యుపాఘ్రాతః పరిష్వక్తశ్చ కేశవః ॥ 3
జగద్వంద్యుడైన శ్రీకృష్ణపరమాత్మ మేనత్తయిన కుంతీదేవి పాదాల దగ్గర శిరస్సు ఉంచి నమస్కరించాడు. అతని శిరస్సును ఆఘ్రాణించి ఆమె అక్కున చేర్చుకొన్నది. (3)
దదర్శానంతరం కృష్ణః భగినీం స్వామ్ మహాయశాః ।
తాముపేత్య హృషీకేశః ప్రీత్యా బాష్పసమన్వితః ॥ 4
తరువాత మహాయశోవిరాజితుడైన హృషీకేశుడు తన చెల్లెలయిన సుభద్రను కలుసుకొన్నాడు. ఆమె దగ్గరకు వెళ్లాక శ్రీకృష్ణుడికి ప్రీతితో ఆనందబాష్పాలు వచ్చాయి. (4)
అర్థ్యం తథ్యం హితం వాక్యమ్ లఘుయుక్తమనుత్తరమ్ ॥
ఉవాచ భగవాన్ భద్రాం సుభద్రామ్ భద్రభాషిణీమ్ ॥ 5
భద్రభాషిణి, ఇష్టురాలు అయిన సుభద్రతో భగవంతుడు ప్రయోజనకారి హితకరం అయిన పొందిక మాటలతో తన ద్వారకనగర ప్రయాణాన్ని గురించి చెప్పాడు. (5)
తయా స్వజనగామీని శ్రావితో వచనాని సః ।
సంపూజితశ్చాప్యసకృత్ శిరసా చాభివాదితః ॥ 6
సుభద్ర కూడా తనసోదరుని సగౌరవంగా పూజించి శిరస్సుతో నమస్కరించి తన తల్లిదండ్రులు, బంధువులు మొదలగు వారికి తెలియజేయడానికి సందేశం ఇచ్చింది. (6)
తామనుజ్ఞాయ వార్ష్ణేయః ప్రతినంద్య చ భామినీమ్ ।
దరర్శానంతరం కృష్ణాం ధౌమ్యం చాపి జనార్దనః ॥ 7
సోదరి సుభద్రను సంతోషపరచి, తన ప్రయాణానికి సమ్మతిని పొంది వృష్టివంశకులభూషణుడైన జనార్దనుడు ఆ తరువాత ద్రౌపదిని, ధౌమ్యమహర్షిని కలుసుకొన్నాడు. (7)
వవందే చ యథాన్యాయమ్ ధౌమ్యం పురుషసత్తమః ।
ద్రౌపదీమ్ సాంత్వయిత్వా చ ఆమంత్ర్య చ జనార్దనః ॥ 8
భ్రాతౄనభ్యగమద్ విద్వాన్ పార్థేన సహితో బలీ ।
భ్రాతృభిః పంచభిః కృష్ణః వృతః శక్ర ఇవామరైః ॥ 9
పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు యథోచితంగా ధౌమ్యమహర్షికి నమస్కారం చేశాడు. ద్రౌపదికి సాంత్వనవాక్యాలు చెప్పి, ఆమె దగ్గర నుండి తన గమనానికి సమ్మతిని పొందాడు. ఆ తరువాత అర్జునుడి దగ్గరకు, మిగిలిన పాండవుల దగ్గరకు వెళ్లాడు. పాండవులు అయిదుగురితో కూడిన శ్రీకృష్ణుడు దేవతలతో కూడిన ఇంద్రుడిలాగ ప్రకాశించాడు. (8,9)
యాత్రాకాలస్య యోగ్యాని కర్మాణి గరుడధ్వజః ।
కర్తుకామః శుచిర్బూత్వా స్నాతవాన్ సమలంకృతః ॥ 10
గరుడధ్వజుడైన పరమాత్మ యాత్రాకాలానికి తగిన సముచిత కార్యాలు చేయదలచి పవిత్రస్నానం చేశాడు. తన ఆభరణాలను ధరించాడు. (10)
అర్చయామాస దేవాంశ్చ ద్విజాంశ్చ యదుపుంగవః ।
మాల్యజాప్యనమస్కారైః గంధైరుచ్చావచైరపి ॥ 11
యదుశ్రేష్ఠుడైన పరమాత్మ పుష్పహారాలతోను, చందనతాంబూలాలతోను, జపనమస్కారాలతోను దేవబ్రాహ్మణులకు అర్చనలు చేశాడు. (11)
స కృత్వా సర్వకార్యాణి ప్రతస్థే తస్థుషాం వరః ।
ఉపేత్య స యదుశ్రేష్ఠః బాహ్యకక్షాద్ వినిర్గతః ॥ 12
పురుషోత్తముడైన అ యదుపుంగవుడు ప్రయాణసందర్భంగా చేయవలసిన అన్నిపనులను పుర్తిచేసుకొని రాజభవనం వెలుపలికి వచ్చాడు. (12)
స్వస్తివాచ్యార్హతో విప్రాన్ దధిపాత్రఫలాక్షతైః ।
వసుప్రదాయ చ తతః ప్రదక్షిణమథాకరోత్ ॥ 13
ఆ సమయంలో బ్రాహ్మణులు స్వస్తివచనాలు పలికారు. పరమాత్ముడు ఆ బ్రాహ్మణులకు పెరుగుతో ఉన్న పాత్రను, అక్షతలను, ఫలాలను, వాటితోపాటు కొంతధనాన్ని కూడా ఇచ్చి, ప్రదక్షిణం చేశాడు. (13)
కాంచనం రథమాస్థాయ తార్ష్యకేతనమాశుగమ్ ।
గదాచక్రాసిశార్ ఙ్గాద్యైః ఆయుధైరావృతం శుభమ్ ॥ 14
తిథావప్యథ నక్షత్రే ముహూర్తే చ గుణాన్వితే ।
ప్రయయౌ పుండరీకాక్షః శైబ్యసుగ్రీవవాహనః ॥ 15
పిదప గరుడధ్వజంతో కూడి గద చక్రం ఖడ్గం విల్లు మొదలైన ఆయుధాలతో అమర్చబడి, శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలు అనే గుఱ్ఱాలతో కూర్చబడిన బంగారు రథాన్ని ఎక్కి, శుభనక్షత్రంలో శుభతిథిలో శుభముహూర్తంలో ప్రయాణాన్ని ప్రారంభించాడు. (14,15)
అన్వారురోహ చాప్యేనం ప్రేమ్ణా రాజా యుధిష్ఠిరః ।
అపాస్య చాస్య యంతారం దారుకం యంతృసత్తమమ్ ॥ 16
ఆ సమయంలో సారథులలో ఉత్తముడు అయిన దారుకుని స్థానంలో ధర్మరాజు కూర్చుండి ప్రేమపూర్వకంగా భగవానునితో కొంతదూరం వెళ్లాడు. (16)
అభీషూన్ సంప్రజగ్రాహ స్వయం కురుపతిస్తదా ।
ఉపారుహ్యార్జునశ్చాపి చామరవ్యజనం సితమ్ ॥ 17
రుక్మదండమ్ బృహద్బాహుః విదుధావ ప్రదక్షిణమ్ ।
కురురాజైన యుధిష్ఠిరుడు సారథిగా ఉండి, పగ్గాలు తనచేతిలోకి తీసుకున్నాడు. మహాబాహుడైన అర్జునుడు కూడా రథంపైన కూర్చున్నాడు. బంగారుదండంతో ప్రకాశిస్తున్న తెల్లనివింజామరతో అతనికి విసురుతున్నాడు. (17 1/2)
తథైవ భీమసేనోఽపి యమాభ్యాం సహితో బలీ ॥ 18
పృష్ఠతోఽనుయయౌ కృష్ణమ్ ఋత్విక్పౌరజనైః సహ ।
(ఛత్రం శతశలాకం చ దివ్యమాల్యోపశోభితమ్ ।
వైడూర్యమణిదండం చ చామీకరవిభూషితమ్ ॥
దధార తరసా భీమః ఛత్రం తచ్ఛార్ ఙ్గధన్వనే ।
ఉపారుహ్య రథం శీఘ్రం చామరవ్యజనే సితే ॥
నకులః సహదేవశ్చ ధూయమానౌ జనార్దనమ్ ।)
స తథా భ్రాతృభిః సర్వైః కేశవః పరవీరహా ॥ 19
అన్వీయమానః శుశుభే శిష్యైరివ గురుః ప్రియైః ।
అదేవిధంగా నకులసహదేవులతో కూడిన బలాఢ్యుడయిన భీముడు, ఋత్విక్కులూ, పురజనులు అందరూ ఆ రథం వెనుక నడచివస్తున్నారు.
వేగంగా వెళ్తున్న ఆ రథంలో శార్ ఙ్గధనుస్సును ధరించిన శ్రీకృష్ణునిపై దివ్యపుష్పహారాలతో మెఱుపుతో సమానమ్గా బంగారు ఛాయతో ప్రకాశిస్తున్న ఛత్రం ఉన్నది. ఆ ఛత్రదండం వజ్రవైడూర్యాలతో ప్రకాశిస్తున్నది. నకులసహదేవులు ఇద్దరూ రథంమీద కూర్చుండి వింజామరలతో విసురుతూ ఆ పరమాత్ముని సేవిస్తున్నారు. ప్రియశిష్యులతో కూడిన గురువులాగ పరమాత్ముడు వారి మధ్య ప్రకాశిస్తున్నాడు. (18, 19 1/2)
పార్థమామంత్ర్య గోవిందః పరిష్వజ్య సుపీడితమ్ ॥ 20
యుధిష్ఠిరం పూజయిత్వా భీమసేనమ్ యమౌ తథా ।
పరిష్వక్తో భృశాం తైస్తు యమాభ్యామభివాదితః ॥ 21
శ్రీకృష్ణుడు అర్జునుని ప్రేమతో గట్టిగా ఆలింగనమ్ చేశాడు. అతడు హృదయపూర్వకంగా వీడ్కోలుకు అనుమతించాడు. భగవానుడు యుధిష్ఠిరుని చరణస్పర్శచేశాడు. భీముని, కవలలను తనకౌగిలిలోకి తీసుకున్నాడు. నకులసహదేవులు ఇద్దరు ఆయనకు పాదాభివందనం చేశారు. (20,21)
యోజనార్థమథో గత్వా కృష్ణః పరపురంజయః ।
యుధిష్ఠిరం సమామంత్ర్య నివర్తస్వేతి భారత ॥ 22
జనమేజయమహారాజా! శత్రుంజయుడైన శ్రీకృష్ణుడు రెండు క్రోసుల దూరమ్ వెళ్లాక యుధిష్ఠిరుడి అనుమతిని తీసుకొని వారిని వెనుకకు మరలింపజేశాడు. (22)
తతోఽభివాద్య గోవిందః పాదౌ జగ్రాహ ధర్మవిత్ ।
ఉత్థాప్య ధర్మరాజస్తు మూర్ధ్న్యుపాఘ్రాయ కేశవమ్ ॥ 23
పాండవో యాదవశ్రేష్ఠమ్ కృష్ణం కమలలోచనమ్ ।
గమ్యతామిత్యనుజ్ఞాప్య ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 24
ధర్మజుని పాదాలను ధర్మవిదుడు అయిన కృష్ణుడు పట్టుకున్నాడు.
యుధిష్ఠిరుడు ఆ పరమాత్ముని లేవదీసి, శిరసు మూర్కొని రెండుచేతులు పట్టుకొని శిరస్సువంచి "వెళ్లిరండి" అని అనుమతించాడు. (23,24)
తతస్తైః సంవిదం కృత్వా యథావన్మధుసూదనః ।
నివర్త్య చ తథా కృచ్ఛ్రాత్ పాండవాన్ సుపదానుగాన్ ॥ 25
స్వాం పురీం ప్రయయౌ హృష్టః యథా శక్రోఽమరావతీమ్ ।
లోచనైరనుజగ్ముస్తే తమాదృష్టిపథాత్ తదా ॥ 26
పిమ్మట పరమాత్మ వారితొ "మరల వస్తానని" చెప్పి పాదచారులుగా వస్తున్న నగరవాసులను పాండవులను ప్రేమానురాగాలతో నివారించి ఇంద్రుడు అమరావతికి వెళ్లినట్లుగా ద్వారకానగరాన్ని చేరాడు. పాండవులందరు తమ దృష్టికి కనపడేవరకు అతని రథం వైపే చూస్తూ వెనుదిరిగి వెళ్లారు. (25,26)
మనోభిరనుజగ్ముస్తే కృష్ణమ్ ప్రీతిసమన్వయాత్ ।
అతృప్తమనసామేవ తేషాం కేశవదర్శనే ॥ 27
క్షిప్తమంతర్ధధే శౌరిశ్చక్షుషాం ప్రియదర్శనః ।
అకామా ఏవ పార్థాస్తే గోవిందగతమానసాః ॥ 28
కృష్ణభగవానునిపై గల అత్యంత ప్రేమకారణంగా వారి అందరి మనస్సులు శ్రీకృష్ణునితోపాటే వెళ్లాయి.
ఇంతవరకు కేశవుని దర్శించినా వారికి సంతృప్తి కలుగలేదు. నయనాభిరాముడైన భగవంతుడు కృష్ణపరమాత్ముని ఎంత చూసినా తనివి తీరలేదు. రథం అదృశ్యం అయ్యేంత వరకు దర్శనం చేసుకొన్నారు పాండవులు. వారు మరలిపోయారు కాని వారి మనస్సులు మాత్రం పరమాత్మవెంటే ఉన్నాయి. (27,28)
నివృత్యోపయయుస్తూర్ణమ్ స్వం పురం పురుషర్షభాః ।
స్యందనేనాథ కృష్ణోఽపి త్వరితం ద్వారకామగాత్ ॥ 29
పురుషశ్రేష్ఠుడయిన ధర్మరాజు తమనగరానికి సోదరులతో చేరుకొన్నాడు. అక్కడ భగవానుడు కూడా త్వరితగతిని ద్వారకను చేరుకొన్నాడు. (29)
సాత్వతేన చ వీరేణ పృష్ఠతో యాయినా తదా ।
దారుకేణ చ సూతేన సహితో దేవకీసుతః ।
స గతో ద్వారకాం విష్ణుః గరుత్మానివ వేగవాన్ ॥ 30
సాత్వత వంశీయుడు, వీరుడు అయిన సాత్యకి రథంపై శ్రీకృష్ణుని వెనుక వస్తూ ఉండగా దారుకుడు సారథిగా రథాన్ని నడుపుతుంటే వీరిద్దరి మధ్య దేవకీనందనుడు గరుత్మంతుడు లాగా ప్రకాశిస్తూ ద్వారకానగరాన్ని చేరాడు. (30)
వైశంపాయన ఉవాచ
నివృత్య ధర్మరాజస్తు సహ భ్రాతృభిరచ్యుతః ।
సుహృత్పరివృతో రాజా ప్రవివేశ పురోత్తమామ్ ॥ 31
వైశంపాయనుడు అన్నాడు.
"మహారాజా! మర్యాదను అతిక్రమించని ధర్మరాజు తన సోదరులతోను, స్నేహితులతోను కూడి ఉత్తమ నగరమైన ఇంద్రప్రస్థాన్ని చేరాడు. (31)
విసృజ్య సుహృదః సర్వాన్ భ్రాతౄన్ పుత్రాంశ్చ ధర్మరాట్ ।
ముమోద పురుషవ్యాఘ్రాః ద్రౌపద్యా సహితో నృప ॥ 32
రాజా! ధర్మనందనుడు తన హితులను తమ్ములను, పుత్రులను స్నేహితులను అందరిని వీడ్కొలిపి రాజభవనంలో ద్రౌపదితో కూర్చుండి ఆనందంగా గడిపాడు. (32)
కేశవోఽపి ముదా యుక్తః ప్రవివేశ పురోత్తమమ్ ।
పూజ్యమానో యదుశ్రేష్ఠైః ఉగ్రసేనముఖైస్తథా ॥ 33
ఇక్కడ కేశవుడు కూడా సంతోషంతో ద్వారకాపురాన్ని ప్రవేశించాడు. ఉగ్రసేనుడు మొదలగు యాదవశ్రేష్ఠులందరు శ్రీకృష్ణుని సమ్మానించారు. (33)
ఆహుకం పితరం వృద్ధం మాతరం చ యశస్వినీమ్ ।
అబివాద్య బలం చైవ స్థితః కమలలోచనః ॥ 34
కమలనయనుడైన శ్రీకృష్ణుడు ఉగ్రసేనమహారాజుకూ, ముదుసలి - తండ్రి అయిన వసుదేవుడికీ, కీర్తిమంతురాలైన తల్లికీ, నమస్కరించాడు. (34)
ప్రద్యుమ్నసాంబనిశఠాన్ చారుదేష్ణం గదం తథా ।
అనిరుద్ధం చ భానుం చ పరిష్వజ్య జనార్దనః ॥ 35
స వృష్ధైరభ్యనుజ్ఞాతః రుక్మిణ్యా భవనం యయౌ ।
పిమ్మట జనార్దనుడు ప్రద్యుమ్నుని, సాంబుని, నిశఠుని, చారుదేష్ణుని, గదుని, అనిరుద్ధుని, భానుడు మొదలగు కుమారులందరిని స్నేహపూర్వకంగా ఆలింగనమ్ చేసుకొని, తరువాత తన పెద్దల అనుమతిని పొంది రుక్మిణీభవనానికి వెళ్లాడు. (35 1/2)
మయోఽపి స మహాభాగః సర్వరత్నవిభూషితామ్ ।
విధివత్ కల్పయామాస సభాం ధర్మసుతాయ వై ॥ 36
అక్కడ మహానుభావుడైన మయుడు కూడా ధర్మరాజు కోసం శాస్త్రోక్తంగా సకలరత్నాలతో ప్రకాశించే సభాభవనాన్ని తయారుచేశాడు. (36)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి సభాక్రియాపర్వణి భగవద్యానే ద్వితీయోఽధ్యాయః ॥ 2 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున సభాక్రియాపర్వము అను ఉపపర్వమున భగవద్యానము అను రెండవ అధ్యాయము. (2)