3. మూడవ అధ్యాయము
మయుడు భీమార్జునులకు గదాశంఖము లిచ్చి సభను నిర్మించుట.
వైశంపాయన ఉవాచ
అథాబ్రవీన్మయః పార్థమ్ అర్జునం జయతాం వరమ్ ।
ఆపృచ్ఛే త్వాం గమిష్యామి పునరేష్యామి చాప్యహమ్ ॥ 1
వైశాంపాయనుడు చెపుతున్నాడు.
రాజా! తరువాత మయాసురుడు విజయుడు, వీరవరుడు అయిన అర్జునుడితో ఇట్లా చెప్పాడు.
"భారతా! నేను ఒక ప్రదేశానికి వెళ్లి తిరిగివస్తాను. అందుకు నీ అనుమతిని కోరుతున్నాను. (1)
(విశ్రుతాం త్రిషు లోకేషు పార్థ దివ్యామ్ సభాం తవ ।
ప్రాణినాం విస్మయకరీం తవ ప్రీతివివర్ధినీమ్ ।
పాండవానాం చ సర్వేషాం కరిష్యామి ధనంజయ ॥)
కుంతీకుమారా! ధనంజయా! నేను మీకోసం మూడులోకాల్లో ప్రసిద్ధికెక్కేటట్లుగా సభను నిర్మిస్తాను. అది సర్వప్రాణికోటికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పాండవులందరికీ మిక్కిలిగా సంతోషం కలుగుతుంది.
ఉత్తరేణ తు కైలాసమ్ మైనాకం పర్వతం ప్రతి ।
యియక్షమాణేషు పురా దానవేషు మయా కృతమ్ ॥ 2
చిత్రం మనిమయం భాండం రమ్యం బిందుసరః ప్రతి ।
సభాయాం సత్యసంధస్య యదాసీద్ వృషపర్వణః ॥ 3
పూర్వకాలంలో రాక్షసులు కైలాసపర్వతానికి ఉత్తరదిశలో ఉన్న మైనాకపర్వతం పైన యజ్ఞాన్ని చేయాలని అనుకొన్నారు. ఆ సమయంలో నేను విచిత్రమయిన, అందమైన మణిమయ భాండాన్ని తయారుచేశాను. దాన్ని బిందుసరస్సు సమీపంలో సత్యసంధుడైన వృషపర్వమహారాజు యొక్క సభలో ఉంచాను. (2,3)
ఆగమిష్యామి తద్ గృహ్య యది తిష్ఠతి భారత ।
తతః సభాం కరిష్యామి పాండవస్య యశస్వినీమ్ ॥ 4
భారతా! ఆ భాండం ఇప్పటివరకు అక్కడ ఉన్నట్లయితే దానిని తీసుకొని వస్తాను. దానితో పాండునందనుడైన ధర్మరాజుకు కీర్తిని కలిగించేవిధంగా సభను నిర్మిస్తాను. (4)
మనః ప్రహ్లాదినీం చిత్రాం సర్వరత్నవిభూషితామ్ ।
అస్తి బిందుసరస్యుగ్రా గదా చ కురునందన ॥ 5
సకలరత్నాలతో అలంకరింపబడి, విచిత్రమై మనస్సుకు ఆనందం కలిగించే భయంకరమైన గద కూడా ఒకటి బిందుసరోవరంలో ఉంది. (5)
నిహితా భావయామ్యేవం రాజ్ఞా హత్వా రణే రిపూన్ ।
సువర్ణబిందుభిశ్చిత్రా గుర్వీం భారసహీ దృఢా ॥ 6
వృషపర్వమహారాజు యుద్ధంలో శత్రుసంహారం చేసిన పిదప ఆ గదను ఆ బిందుసరోవరంలో ఉంచాడు. అది చాలా బరువైనదీ దృఢమైనదీ కూడా. (6)
సా వై శతసహస్రస్య సమ్మితా శత్రుఘాతినీ ।
అనురూపా చ భీమస్య గాండీవం భవతో యథా ॥ 7
నీ గాండీవం లాగ ఆ గద ఒక్కటే ఒక లక్షగదలతో సమానంగా ఉండి శత్రుసంహారం చేయగలదు. ఆ గద భీమసేనునికి తగినది సుమా! (7)
వారుణశ్చ మహాశంఖః దేవదత్తః సుఘోషవాన్ ।
సర్వమేతత్ ప్రదాస్యామి భవతే నాత్ర సంశయః ॥ 8
ఆ గదతో పాటు ఆ సరస్సులో దేవదత్తం అనే పేరుగల శంఖం కూడా ఉంది. అది వరుణునిది. చక్కని ధ్వని కలది. నిస్సందేహంగా ఆ శంఖాన్ని నీకు తెచ్చి ఇస్తాను." (8)
ఇత్యుక్త్వా సోఽసురః పార్థం ప్రాగుదీచీం దిశంగతః ।
అథోత్తరేణ కైలాసాత్ మైనాకం పర్వతం ప్రతి ॥ 9
ఆ విధంగా అర్జునుడితో చెప్పి మయుడు ఈశాన్యదిశలో కైలాసపర్వతానికి ఉత్తరంగా ఉన్న మైనాకపర్వతం దగ్గరకు వెళ్లాడు. (9)
హిరణ్యశృంగః సుమహాన్ మహామణిమయొ గిరిః ।
రమ్యం బిందుసరో నామ యత్ర రాజా భగీరథః ॥ 10
ద్రష్టుం భాగీరథీం గంగామ్ ఉవాస బహులాః సమాః ।
అక్కడ గొప్పగొప్పమణులతో కూడిన హిరణ్యశృంగం అనే పర్వతం ఒకటి ఉంది. బిందు సరస్సు అనే అందమైన సరస్సు ఉంది. భగీరథుడు గంగను దర్శించుకోవాలని అనేక సంవత్సరాలు తపస్సుచేస్తూ అక్కడ నివసించాడు. (10 1/2)
యత్రేష్టం సర్వభూతానామ్ ఈశ్వరేణ మహాత్మనా ॥ 11
ఆహృతాః క్రతవో ముఖ్యాః శతమ్ భరతసత్తమ ।
యత్ర యూపా మణిమయాః చైత్యాశ్చాపి హిరణ్మయాః ॥ 12
భరతశ్రేష్ఠా! అక్కడ సర్వప్రాణికోటికి అధిపతి, మహాత్ముడూ అయిన ప్రజాపతి ముఖ్యములైన నూరుయజ్ఞాలను చేశాడు. అక్కడ మణిమయాలైన యూపస్తంభాలు, విశాలమైన యజ్ఞశాలలు ఉన్నాయి. (11,12)
శోభార్థం విహితాస్తత్ర న తు దృష్టాంతతః కృతాః ।
అత్రేష్ట్వా స గతః సిద్ధిం సహస్రాక్షః శచీపతిః ॥ 13
అవన్నీ అందంగా చేయబడ్డాయి కాని శాస్త్రప్రకారం కాని, సిద్ధాంతాన్ని అనుసరించి కాని చేయలేదు. అయినా సహస్రలోచనుడైన అనుసరించికాని చేయలేదు. అయినా సహస్రలోచనుడైన శచీపతి అక్కడ యజ్ఞమ్ చేసి సిద్ధిని పొందాడు. (13)
యత్ర భూతపతిః సృష్ట్వా సర్వాన్ లోకాన్ సనాతనః ।
ఉపాస్యతే తిగ్మతేజాః స్థితో భూతైః సహస్రశః ॥ 14
సమస్తలోకాలను సృష్టించినవాడూ, సమస్తప్రాణికోటికి అధిపతీ, భయంకరతేజోవంతుడూ, సనాతన దైవమూ అయిన బ్రహ్మదేవుడు ఆ బిందుసరోవరంలొ ఉండి అందరిచేత సేవింపబడ్డాడు. (14)
నరనారాయణౌ బ్రహ్మా యమః స్థాణుశ్చ పంచమః ।
ఉపాసతే యత్ర సత్రం సహస్రయుగపర్యయే ॥ 15
వేయియుగాల పర్యంతం అక్కడ నరనారాయణులు, బ్రహ్మదేవుడు, యమధర్మరాజు, మహాదేవుడు ఈ అయిదుగురూ యజ్ఞాలు చేశారు. (15)
యత్రేష్టం వాసుదేవేన సత్రైర్వర్షగణాన్ బహూన్ ।
శ్రద్ధధానేన సతతం ధర్మసంప్రతిపత్తయే ॥ 16
ధర్మాన్ని రక్షించడం కోసమ్ భగవంతుడైన వాసుదేవుడు అక్కడ అనేక సంవత్సరాలు నిరంతరమ్ శ్రద్ధతో యజ్ఞమ్ చేశాడు. (16)
సువర్ణమాలినో యూపాః చైత్యాశ్చాప్యతిభాస్వరాః ।
దదౌ యత్ర సహస్రాణి ప్రయుతాని చ కేశవః ॥ 17
ఆ యజ్ఞంలో సువర్ణమాలలతో అలంకరింపబడిన స్తంభాలు, మిక్కిలిగా ప్రకాశించే యజ్ఞవేదికలు వేలూ, లక్షలూ దానం చేశాడు. (17)
తత్ర గత్వా స జగ్రాహ గదాం శంఖం చ భారత ।
స్ఫాటికం చ సభాద్రవ్యం యదాసీద్ వృషపర్వణః ॥ 18
మహారాజా! మయాసురుడు బిందు సరోవరానికి వెళ్లి గదను, శంఖాన్ని, సభానిర్మాణానికి కావలసిన స్ఫటికాలని, మణిమయద్రవ్యాల్ని తీసుకొన్నాడు. అవన్నీ పూర్వం వృషపర్వుని అధీనంలో ఉన్నవి. (18)
కింకరైః సహ రక్షోభిః యదరక్షన్మహద్ ధనమ్ ।
తదగృహ్ణాన్మయస్తత్ర గత్వా సర్వం మహాసురః ॥ 19
ఎంతోమంది రాక్షసులు, సేవకులు మహానిధిని కాపాడుతున్నారు. మయుడు అక్కడికి వెళ్లి ఆ నిధిని అంతటినీ తీసుకొన్నాడు. (19)
తదాహృత్య చ తామ్ చక్రే సోఽసురోఽప్రతిమాం సభామ్ ।
విశ్రుతాం త్రిషు లోకేషు దివ్యాం మణిమయీం శుభామ్ ॥ 20
అక్కడి వస్తువులను అన్నిటినీ తీసుకొని వచ్చి మయుడు సాటిలేని భవనాన్ని తయారుచేశాడు. అది ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కే దివ్యభవనం. మణులతో ప్రకాశిస్తూ సుందరంగా ఉన్న భవనం. (20)
గదాం చ భీమసేనాయ ప్రవరామ్ ప్రదదౌ తదా ।
దేవదత్తం చార్జునాయ శంఖం ప్రవరముత్తమమ్ ॥ 21
ఆ సమయంలో మయుడు శ్రేష్ఠమైన గదను భీముడికి, ఉత్తమమయిన శంఖాన్ని అర్జునుడికి ఇచ్చాడు. (21)
యస్య శంఖస్య నాదేన భూతాని ప్రచకంపిరే ।
సభా చ సా మహారాజ శాతకుంభమయద్రుమా ॥ 22
ఆ శంఖం యొక్క నాదాన్ని వింటే సమస్తప్రాణికోటి కంపిస్తుంది. మహారాజా! ఆ సభలో బంగారుమయమైన చెట్లశోభ విరాజిల్లుతుంది. (22)
దశకిష్కుసహస్రాణి సమంతాదాయతాభవత్ ।
యథా వహ్నేర్యథార్కస్య సోమస్య చ యథా సభా ॥ 23
భ్రాజమానా తథాత్యర్థం దధార పరమం వపుః ।
ఆ సభ పదివేల జానలపొడవు, అంతే వెడల్పు గలిగి ఉంటుంది. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ప్రకాశించినట్లుగా అత్యంత ప్రకాశపూర్ణమై మనోహరంగా ఉంటుంది. (23 1/2)
అభిఘ్నతీవ ప్రభయా ప్రభామర్కస్య భాస్వరమ్ ॥ 24
ఆ సభయొక్క తేజస్సు సూర్యతేజాన్ని కూడా తిరస్కరిస్తుంది. (24)
ప్రబభౌ జ్వలమానేవ దివ్యా దివ్యేన వర్చసా ।
నవమేఘప్రతీకాశా దివమావృత్య విష్ఠితా ।
ఆయతా విపులా రమ్యా విపాప్మా విగతక్లమా ॥ 25
ఆ సభ దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. నూతన మేఘంలా ఆకాశాన్ని ఆవరించి విశాలంగా, రమణీయంగా, దోష రహితంగా ఉంది. (25)
ఉత్తమద్రవ్య సంపన్నా రత్నప్రాకారతోరణా ।
బహుచిత్రా బహుధనా సుకృతా విశ్వకర్మణా ॥ 26
ఉత్తమద్రవ్యాలతో ఆ సభ నిర్మింపబడ్డది. రత్నప్రాకార తోరణాలతో అలరారుతోంది. చిత్రవిచిత్రాలైన వస్తువులు, ప్రదేశాలు ఉన్నాయి. అధిక ధనసంపన్నమయింది ఆ భవనం. దానవవిశ్వకర్మ అయిన మయాసురుడు ఆ సభను అతి సుందరంగా నిర్మించాడు. (26)
న దాశార్హిసుధర్మా వా బ్రహ్మణో వాథ తాదృశీ ।
సభా రూపేణ సంపన్నా యాం చక్రే మతిమాన్ మయః ॥ 27
(మయుడు నిర్మించిన ఆ సభతో) యాదవుల యొక్క సుధర్మ అనే సభ గాని, బ్రహ్మ యొక్క సభ గాని సాటిరావు. (27)
తాం స్మ తత్ర మయేనోక్తా రక్షంతి చ వహంతి చ ।
సభామష్టౌసహస్రాణి కింకరా నామ రాక్షసాః ॥ 28
మయాసురుని ఆజ్ఞను అనుసరించి ఎనిమిదివేల మంది కింకరులు అనే రాక్షసులు ఆ సభకు రక్షకులుగా ఉన్నారు. వారు ఆ సభను ఒక స్థానం నుండి మరొక ప్రదేశానికి తరలింపగలరు. (28)
అంతరిక్షచరా ఘోరా మహాకాయా మహాబలాః ।
రక్తాక్షాః పింగళాక్షాశ్చ శుక్తికర్ణాః ప్రహారిణః ॥ 29
ఆ రాక్షసులు భయంకరమైన ఆకారం కలవారు. ఆకాశంలో సంచరింపగలరు. పెద్దశరీరంతో మహాబలవంతులై ఉన్నారు. కళ్లు ఎర్రగాను, పింగళవర్ణంతోను ఉన్నాయి. చెవులు ముత్యపు చిప్పలతో సమానంగా ఉన్నాయి. ప్రహారం చేయడంలో నేర్పరులు వారు. (29)
తస్యాం సభాయాం నళినీం చకారాప్రతిమాం మయః ।
వైడూర్యపత్రవితతాం మణినాళమయాంబుజామ్ ॥ 30
మయాసురుడు ఆ సభలో సాటిలేని సుందరమైన పుష్కరిణిని నిర్మించాడు. దానికి ఏదీ సాటిరాదు. ఆ పుష్కరిణిలో ఇంద్రనీల మణులచే నిర్మింపబడిన నల్లకలువలు ఉన్నాయి. ఆ పద్మాలకాడలు మణులతో చేయబడ్డాయి. (30)
పద్మసౌగంధికవతీం నానాద్విజగణాయుతామ్ ।
పుష్పితైః పంకజైశ్చిత్రాం కూర్మైర్మత్స్యైశ్చ కాంచనైః ।
చిత్రస్ఫటికసోపానాం నిష్పంకసలిలాం శుభామ్ ॥ 31
అందులో పద్మరాగమణులతో చేయబడిన కమలాలు మనోహరంగా సుగంధాన్ని వ్యాపింప చేస్తున్నాయి. అనేక రకాలయిన పక్షులు ఉన్నాయి. పుష్పించిన పద్మాలతోను, బంగారంతో చేసిన తాబేళ్లు, చేపల చేతను ఆ సభ విచిత్ర శోభతో ప్రకాశిస్తోంది. విచిత్రమైన స్ఫటికాలతో కూడిన మెట్లతోను, బురదలేని స్వచ్ఛమైన నీటితోను నిండి ఉన్న ఆ కొలను చూడటానికి చాలా అందంగా ఉంది. (31)
మందానిల సముద్ధూతామ్ ముక్తాబిందుభిరాచితామ్ ।
మహామణిశిలాపట్ట బద్ధపర్యంతవేదికామ్ ॥ 32
పిల్లవాయువుచే నీటిబిందువులు తామరపూల రేకులపై చింది, ఆ పుష్కరిణి అంతా ముత్యాల బిందువులు పొదిగినట్లు ముచ్చట గొల్పుతున్నది. ఆ పుష్కరిణి నాల్గువైపుల మణిమయమైన వేదికలు అందంగా నిర్మింపబడ్డాయి. (32)
మణిరత్నచితాం తాం తు కేచిదభ్యేత్య పార్థివాః ।
దృష్ట్వాపి నాభ్యజానంత తేఽజ్ఞానాత్ ప్రపతంత్యుత ॥ 33
మణులతోను, రత్నాలతోను నిర్మించబడిన ఆ పుష్కరిణి దగ్గరకు రాజులెవరయినా వచ్చి చూచినప్పుడు వారికి అది పుష్కరిణిగా తోచదు. అది మామూలు ప్రదేశం అనుకొని భ్రమపడి అందులో పడిపోతారు కూడా. (33)
తాం సభామభితో నిత్యం పుష్పవంతో మహాద్రుమాః ।
ఆసన్ నానావిదా లోలాః శీతచ్ఛాయా మనోరమాః ॥ 34
ఆ సభాభవనంలో పుష్పఫలాలతో ఉన్న ఎన్నో పెద్దపెద్ద చెట్లు చల్లని నీడను ఇస్తూ ఆహ్లాదం కలిగిస్తున్నాయి. అందమైన ఆ చెట్లు గాలికి ఎప్పుడూ ఊగుతున్నట్లే ఉన్నాయి. (34)
కాననాని సుగంధీని పుష్కరిణ్యాశ్చ సర్వశః ।
హంసకారండవోపేతాః చక్రవాకోపశోభితాః ॥ 35
కేవలం వృక్షాలే కాదు. ఆ భవనంలో నాల్గువైపుల సుగంధాన్ని వెదజల్లే వనాలు, ఉపవనాలు ఉన్నాయి. అందులో హంసలు, కారండవపక్షులు, చక్రవాకపక్షులు ఉండడం చేత అది చాలా శోభాయమానంగా ఉంది. (35)
జలజానాం చ పద్మానాం స్థలాజానాం చ సర్వశః ।
మారుతో గంధమాదాయ పాండవాన్ స్మ నిషేవతే ॥ 36
అక్కడ ఉన్న పద్మాలతో, ఒడ్డునున్న పుష్పాలతో వాయువు సుగంధాన్ని వ్యాపింపచేస్తూ పాండవులకు సేవచేస్తున్నాడు. (36)
ఈదృశీం తాం సభాం కృత్వా మాసైః పరిచతుర్దశైః ।
నిష్ఠితాం ధర్మరాజాయ మయో రాజన్ న్యవేదయత్ ॥ 37
ఇటువంటి అందమైన సభను నిండుగా పదునాలుగు నెలలలో మయాసురుడు నిర్మించి ధర్మరాజుకు తెలియజేశాడు. (37)
ఇతి శ్రీమాహాభారతే సభాపర్వణి సభాక్రియాపర్వణి సభానిర్మానే తృతీయోఽధ్యాయః ॥ 3 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున సభాక్రియాపర్వమను
ఉపపర్వమున సభానిర్మాణమను మూడవ అధ్యాయము. (3)
(దాక్షిణాత్య అధికపాఠము 1 1/2 శ్లోకములు కలిపి మొత్తం 8 1/2 శ్లోకములు.)