సభాపర్వము
1. ప్రథమాధ్యాయము
(సభాక్రియా పర్వము)
సభ నిర్మించి ఇత్తునని మయుడు అర్జునునితో చెప్పుట.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ ।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ॥ 1
అంతర్యామిగా ఉండే నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికీ, అతడి స్నేహితుడూ, మానవులలో శ్రేష్ఠుడూ అయిన అర్జునుడికీ, సరస్వతీ దేవికీ,వేదవ్యాసమహర్షికీ నమస్కరిస్తూ జయం అనే పేరుతో ఉన్న మహాభారత కథను చెప్పాలి. (1)
వైశంపాయన ఉవాచ
తతోఽబ్రవీన్మయః పార్థం వాసుదేవస్య సంనిధౌ ।
ప్రాంజలిః శ్లక్ష్ణయా వాచా పూజయిత్వా పునః పునః ॥ 2
వైశంపాయనుడు ఇలా చెపుతున్నాడు.
జనమేజయా! ఖాండవవనదహన సమయంలో రక్షింపబడిన మయదానవుడు శ్రీకృష్ణపరమాత్మ దగ్గరకు వచ్చి, నమస్కరించి, అర్జునుని పరాక్రమాన్ని ప్రశంసిస్తూ, మధురమయిన మాటలతో ఇలా చెప్తున్నాడు. (2)
మయ ఉవాచ
అస్మాత్ కృష్ణాత్ సుసంరబ్ధాత్ పావకాచ్చ దిధక్షతః ।
త్వయా త్రాతోఽస్మి కౌంతేయ బ్రూహి కిం కరవాణి తే ॥ 3
మయుడు (అర్జునుడితో) అన్నాడు.
"కుంతీ కుమారా! ఈ వాసుదేవుడు, అగ్నిదేవుడు, నా విషయంలో ఎంతోకోపంగా ఉన్నప్పటికీ నీకు నా మీద అపారమైన దయ ఉండటం వల్ల నన్ను ఆనాడు రక్షించావు. కాబట్టి నీకు ప్రత్యుపకారం చేయాలని ఉంది. నీకు ఏవిధంగా ఏమి చేయాలో చెప్పు" అని కోరాడు. (3)
అర్జున ఉవాచ
కృతమేవ త్వయా సర్వం స్వస్తి గచ్ఛ మహాసుర ।
ప్రీతిమాన్ భవ మే నిత్యం ప్రీతిమంతో వయం చ తే ॥ 4
అర్జునుడు ఇలా అన్నాడు.
మయాసురా! నీవు ఈవిధంగా కృతజ్ఞత వెల్లడించడమే నాకు మహోపకారం. నీకు శుభం కలుగుగాక! నీవు వెళ్లవచ్చు. నా విషయంలో ఎప్పుడూ ప్రీతితో ఉండు. మేము కూడా నీయందు ప్రీతితో ఉంటాము. (4)
మయ ఉవాచ
యుక్తమేతత్ త్వయి విభో యథాఽఽత్థ పురుషర్షభ ।
ప్రీతిపూర్వమహం కించిత్ కర్తుమిచ్ఛామి భారత ॥ 5
మయుడు అన్నాడు.
"నరోత్తమా! అర్జునుడు చెప్పిన ఈ మాట మహాపురుషులకు తగినమాటయే. అయినా మీయందు ప్రీతితో ఏదో ఒకటి చేయాలని కుతూహలంగా ఉన్నాను. (5)
అహం హి విశ్వకర్మా వై దానవానాం మహాకవిః ।
సోఽహం వై త్వత్కృతే కర్తుం కించిదిచ్ఛామి పాండవ ॥ 6
అర్జునా! నేను దానవులకు శిల్పాచార్యుడిని. శిల్పవిద్యలో నేర్పరిని. అందుచేత ఏదో ఒకటి నిర్మించి మీకు ఇవ్వాలని అనుకొంటున్నాను. (6)
(దానవానాం పురా పార్థ ప్రాసాదా హి మయా కృతాః ।
రమ్యాణి సుఖగర్భాణి భోగాఢ్యాని సహస్రశః ॥
ఉద్యానాని చ రమ్యాణి సరాంసి వివిధాని చ ।
విచిత్రాణి చ శాస్త్రాణి రథాః కామగమాస్తథా ॥
నగరాణి విశాలాని సాట్టప్రాకారతోరణైః ।
వాహనాని చ ముఖ్యాని విచిత్రాణి సహస్రశః ॥
బిలాని రమణీయాని సుఖయుక్తాని వై భృశమ్ ।
ఏతత్ కృతం మయా సర్వం తస్మాదిచ్ఛామి ఫాల్గున ॥)
అర్జునా! పూర్వం నేను రాక్షసుల కోసం భవనాలు నిర్మించాను. అవి చాలా రమణీయమైనవి. సుఖభోగాలకు అవి ఆటపట్టులు. అనేక ఉద్యానవనాలు, అందమైన చెరువులు,
విచిత్రమైన అస్త్రాలు, శస్త్రాలు, ఇచ్చవచ్చిన రీతిలో నడిచే రథాలు, విశాలమైన నగరాలు, అట్టహాసంగా ఉండే ప్రాకారాలు, వాహనాలు, అనేకమైన కాలువలు, మొదలైనవి విచిత్రంగా ఉండేటట్లు నేను నిర్మించాను.
అందుచేత అర్జునా! నీకు కూడా అలాంటివి నిర్మించి ఇవ్వాలని అనుకొంటున్నాను.
అర్జున ఉవాచ
ప్రాణకృచ్ఛ్రాద్ విముక్తం త్వమ్ ఆత్మానం మన్యసే మయా ।
ఏవం గతే న శక్ష్యామి కించిత్ కారయితుం త్వయా ॥ 7
అర్జునుడు ఇలా అన్నాడు.
శిల్పీ! నీకు ప్రాణసంకటపరిస్థితిలో నేను రక్షించానని అనుకొంటూ నాకోసం ఏదో ఒకపని చేయాలని అనుకొంటున్నావు. ఇట్లాంటి సమయంలో నాకోసం నీవు ఏమీ చేయవద్దు. (7)
న చాపి తవ సంకల్పం మోఘమిచ్ఛమి దానవ ।
కృష్ణస్య క్రియతాం కించిత్ తథా ప్రతికృతం మయి ॥ 8
మయాసురా! కానీ ఈ సంకల్పం వ్యర్థం కారాదు సుమా! నీవు ఏదన్నా చేయాలని అనుకొంటే అది శ్రీకృష్ణపరమాత్మ కోసం చేయి. అపుడు నా విషయంలో నీ కర్తవ్యం పూర్తిఅయినట్లుగా భావించు. (8)
చోదితో వాసుదేవస్తు మయేన భరతర్షభ ।
ముహూర్తమివ సందధ్యౌ కిమయమ్ చోద్యతామితి ॥ 9
జనమేజయమహారాజా! అపుడు మయుడు శ్రీకృష్ణపరమాత్మను వేడుకొన్నాడు. శ్రీకృష్ణభగవానుడు రెండు నిమిషాలు మౌనంగా "ఇతనికి ఏం చేయమని చెప్పాలి" అని ఆలోచించాడు. (9)
తతో విచింత్య మనసా లోకనాథః ప్రజాపతిః ।
చోదయామాస తం కృష్ణః సభా వై క్రియతామితి ॥ 10
యది త్వం కర్తుకామోఽసి ప్రియం శిల్పవతాం వర ।
ధర్మరాజస్య దైతేయ యాదృశీమిహ మన్యసే ॥ 11
మనస్సులో బాగా ఆలోచించి పరమాత్మ "శిల్పవిద్యా ప్రవీణుడవైన మయాసురా! నీవు ఏదో చేయాలని అనుకొన్నావు కదా! ధర్మరాజు కోసం ఒక మంచి సభాభవనాన్ని నిర్మించు. (10,11)
యాం కృతాం నానుకుర్వంతి మానవాః ప్రేక్ష్య విస్మితాః ।
మనుష్యలోకే సకలే తాదృశీం కురు వై సభామ్ ॥ 12
మానవులందరూ ఆ సభాభవనాన్ని చూసి ఆశ్చర్యపడేటట్లు నిర్మించు. దానితో సమానమైంది ఇంకొకటి ఉండకూడదు. అలాంటి సభాభవనాన్ని నిర్మించు. (12)
యత్ర దివ్యానభిప్రాయాన్ పశ్యేమ హి కృతాంస్త్వయా ।
ఆసురాన్ మానుషాంశ్చైవ సభాం తాం కురు వై మయ ॥ 13
మయాసురా! అటువంటి సభాభవనాన్ని తయారుచేయి. ఆ నిర్మాణంలో మానవులయొక్క రాక్షసుల యొక్క దేవతల యొక్క మనోవృత్తులూ, శిల్పనైపుణ్యమూ నీద్వారా వ్యక్తం కావాలి." (13)
వైశంపాయన ఉవాచ
ప్రతిగృహ్య తు తద్వాక్యం సంప్రహృష్టో మయస్తదా ।
విమానప్రతిమాం చక్రే పాండవస్య శుభాం సభామ్ ॥ 14
వైశంపాయనుడు ఇలా అన్నాడు.
రాజా! ఈవిధంగా శ్రీకృష్ణుడిచ్చిన ఆజ్ఞను మయుడు స్వీకరించి చాలా సంతోషించాడు. విమానంతో సమానమైన సభను యుధిష్ఠిరునికోసం తయారుచేయడానికి నిశ్చయించుకొన్నాడు. (14)
తతః కృష్ణశ్చ పార్థశ్చ ధర్మరాజే యుధిష్ఠిరే ।
సర్వమేతత్ సమావేద్య దర్శయామాసతుర్మయమ్ ॥ 15
ఆ తరువాత కృష్ణార్జునులు ఇద్దరూ ధర్మరాజు దగ్గరకు మయునితో వెళ్లి ఈ విషయాన్ని చెప్పారు. (15)
తస్మై యుధిష్ఠిరః పూజాం యథార్హమకరోత్ తదా ।
స తు తాం ప్రతిజగ్రాహ మయః సత్కృత్య భారత ॥ 16
భారతా! ధర్మరాజు ఆ మయాసురుడికి తగిన సత్కారం చేశాడు. మయుడు కూడా ఆ సత్కారాన్ని ఆదరంతో స్వీకరించాడు. (16)
స పూర్వదేవచరితం తదా తత్ర విశాంపతే ।
కథయామాస దైతేయః పాండుపుత్రేషు భారత ॥ 17
రాజా! అపుడు మయాసురుడు పాండవులకు దైత్యుల యొక్క రాజయిన వృషపర్వుని చరిత్రాన్ని చెప్పాడు. (17)
స కాలం కంచిదాశ్వస్య విశ్వకర్మా విచింత్య తు ।
సభామ్ ప్రచక్రమే కర్తుం పాండవానాం మహాత్మనామ్ ॥ 18
మయుడు అక్కడ కొన్నిరోజులు విశ్రాంతిగా గడిపి, చక్కగా ఆలోచించి, మహాత్ములైన పాండవులకోసమ్ సభను తయారు చేయనారంభించాడు. (18)
అభిప్రాయేణ పార్థానాం కృష్ణస్య చ మహాత్మనః ।
పుణ్యేఽహని మహాతేజాః కృతకౌతుకమంగలః ॥ 19
తర్పయిత్వా ద్విజశ్రేష్ఠాన్ పాయసేన సహస్రశః ।
ధనం బహువిధం దత్వా తేభ్య ఏవ చ వీర్యవాన్ ॥ 20
సర్వర్తుగుణసంపన్నాః దివ్యరూపాం మనోరమామ్ ।
దశాకిష్కుసహస్రాం తాం మాపయామాస సర్వతః ॥ 21
మహాత్ముడైన శ్రీకృష్ణుని అభిమతానికీ, కుంతీపుత్రుని కోరికకూ అనుగుణంగా ఒక శుభముహూర్తంలో మంగళానుష్ఠానం చేసి, వేలాది బ్రాహ్మణులకు క్షీరాన్నంతో సంతృప్తి కలిగించి, అనేకవిధాలుగా ధనాన్ని దానం చేశాడు. తరువాత ఆ సభను తయారుచేయడానికి నాల్గుప్రక్కల పదివేల జానలు పొడవు, పదివేల జానలు వెడల్పు కలుగునట్లుగా ఒక ప్రదేశాన్ని నిర్ణయించుకొని సభానిర్మాణ కార్యక్రమానికి సిద్ధపడ్డాడు. (19-21)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి సభాక్రియాపర్వణి సభాస్థాననిర్ణయే ప్రథమోఽధ్యాయః ॥ 1 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున సభాక్రియాపర్వము అను ఉపపర్వమున ప్రథమాధ్యాయము. (1)
(దాక్షిణాత్య అధికపాఠము 4 శ్లోకాలు కలిపి మొత్తం 25 శ్లోకాలు)