233. రెండువందల ముప్పది మూడవ అధ్యాయము

ఇంద్రుడు శ్రీకృష్ణార్జునులకు వరమిచ్చుట, మయాసురుని యమునాతటమునకు చేర్చుట.

మందపాల ఉవాచ
యుష్మాకమపవర్గార్థం విజ్ఞప్తో జ్వలనో మయా ।
అగ్నినా చ తథేత్యేవం ప్రతిజ్ఞాతం మహాత్మనా ॥ 1
మందపాలుడు పలికాడు - నేను అగ్నిని ఖాండవవనదహన సమయంలో నా పిల్లలను విడువమనికోరాను. అతడట్లే అని ప్రతిజ్ఞచేసి ఆ ప్రతిజ్ఞను పాటించాడు. (1)
అగ్నేర్వచనమాజ్ఞాయ మాతుర్ధర్మజ్ఞతాం చ వః ।
భవతాం చ పరం వీర్యం పూర్వం నాహమిహాగతః ॥ 2
అగ్నివచనాలను స్మరించి, మీతల్లి ధర్మజ్ఞతను తెలిసికొని, మీ మీ శక్తియుక్తులను గుర్తించి పూర్వమే నేనిక్కడికి రాలేదు. (2)
స సంతాపో హి వః కార్యః పుత్రకా హృది మాం ప్రతి ।
ఋషీన్ వేద హుతాశోఽపి బ్రహ్మ తద్ విదితం చ వః ॥ 3
పుత్రులారా! మీరు నన్నుగూర్చి మీ హృదయంలో బాధ పడవద్దు. మీరు ఋషులని అగ్నికి తెలియును. మీకు బ్రహ్మతత్త్వం పూర్తిగా తెలిసింది. (3)
వైశంపాయన ఉవాచ
ఏవమాశ్వసితాన్ పుత్రాన్ భార్యామాదాయ స ద్విజః ।
మందపాలస్తతో దేశాద్ అన్యం దేశం జగామ హ ॥ 4
వైశంపాయనుడు అన్నాడు - ఈ విధంగా భార్యాపుత్రులను ఊరడించిన మందపాలుడు ఆ ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి చేరాడు. (4)
భగవానపి తిగ్మాంశుః సమిద్ధః ఖాండవం తతః ।
దదాహ సహ కృష్ణాభ్యాం జనయన్ జగతో హితమ్ ॥ 5
అక్కడ తీవ్రంగా ప్రజ్వలించే అగ్ని తన ప్రచండ జ్వాలలతో లోకహితాన్ని కోరి శ్రీ కృష్ణార్జునుల సహాయంతో ఖాండవవనాన్ని పూర్తిగా దహించాడు. (5)
వసామేదోవహాః కుల్యాః తత్ర పీత్వా చ పావకః ।
జగామ పరమాం తృప్తిం దర్శయామాస చార్జునమ్ ॥ 6
మజ్జ, కొవ్వు, కాలువలుగా ప్రవహిస్తుండగా వాటినన్నింటిని త్రాగి అగ్ని తృప్తిని పొంది అర్జునుని ముందు ప్రత్యక్షం అయ్యాడు. (6)
తతోఽంతరిక్షాద్ భగవాన్ అవతీర్య పురందరః ।
మరుద్గణైర్వృతః పార్థం కేశవమ్ చేదమబ్రవీత్ ॥ 7
పూజ్యుడైన ఇంద్రుడు మరుద్గణాలతో ఆకాశం నుంచి దిగి వచ్చి శ్రీకృష్ణార్జునుల నుద్దేశించి ఇలా పలికాడు. (7)
కృతం యువాభ్యాం కర్మేదమమరైరపి దుష్కరమ్ ।
వరం వృణీతం తుష్ణోఽస్మి దుర్లభం పురుషేష్విహ ॥ 8
మీ ఇరువురిచే దేవతలకు అసాధ్యమైన కర్మ ఆచరింపబడింది. ప్రసన్నుడను అయ్యాను. ఈ లోకంలో మనుష్యులకు దుర్లభమ్ అయిన వరాన్ని కోరుకోండి. (8)
పార్థస్తు వరయామాస శక్రాదస్త్రాని సర్వశః ।
ప్రదాతుం తచ్చ శక్రస్తు కాలం చక్రే మహాద్యుతిః ॥ 9
అర్జునుడు ఇంద్రుని మంచి శస్త్రాస్త్రాల నన్నింటిని కోరాడు. తేజస్వి అయిన ఇంద్రుడు ఆ అస్త్రాలను ఇవ్వటానికి సమయం నిశ్చయించాడు. (9)
యదా ప్రసన్నో భగవాన్ మహాదేవో భవిష్యతి ।
తదా తుభ్యం ప్రదాస్యామి పాండవాస్త్రాణి సర్వశః ॥ 10
పాండుకుమారా! నీకు శంకరుడు ప్రసన్నం అయినప్పుడు అన్ని అస్త్రాలను అందచేస్తాను. (10)
అహమేవ చ తం కాలం వేత్స్యామి కురునందన ।
తపసా మహితా చాపి దాస్యామి భవతోఽప్యహమ్ ॥ 11
ఆగ్నేయాని చ సర్వాని వాయవ్యాని చ సర్వశః ।
మదీయాని చ సర్వాణి గ్రహీష్యసి ధనంజయ ॥ 12
ఆ సమయం ఎప్పుడు ఆసన్నమవుతుందో అదీ నాకు తెలుసు. నీ తపస్సుకు ప్రసన్నుడనై సంపూర్ణాలైన ఆగ్నేయ, వాయవ్య, ఐంద్రాస్త్రములను అనుగ్రహిస్తాను. (11,12)
వాసుదేవోఽపి జగ్రాహ ప్రీతిం పార్థేన శాశ్వతీమ్ ।
దదౌ సురపతిశ్చైవ వరం కృష్ణాయ ధీమతే ॥ 13
వాసుదేవుడు 'అర్జునునిపై నా ప్రేమ నిరంతరం పెరుగుగాక' అని వరం కోరాడు. బుద్ధిమంతుడైన శ్రీకృష్ణునికి ఆ వరాన్ని ఇంద్రుడు ఇచ్చాడు. (13)
ఏవం దత్త్వా వరం తాభ్యాం సహ దేవైర్మరుత్పతిః ।
హుతాశనమనుజ్ఞాప్య జగామ త్రిదివం ప్రభుః ॥ 14
ఇలా వారిరువురికి వరాలు ఇచ్చి మరుత్తులతో కూడి ఇంద్రుడు అగ్నిదేవుని ఆజ్ఞగైకొని స్వర్గానికి చేరాడు. (14)
పావకశ్చ తదా దావం దగ్ధ్వా సమృగపక్షిణమ్ ।
అహాని పంచ చైకం చ విరరామ సుతర్పితః ॥ 15
అగ్నిదేవుడు కూడ మృగాలు, పక్షులతో కూడిన ఆ వనాన్ని పూర్తిగా జ్వలించి, తృప్తిని పొంది ఆరురోజులు విశ్రాంతి తీసుకొన్నాడు. (15)
జగ్ధ్వా మాంసాని పీత్వా చ మేదాంసి రుధిరాణి చ 7.
యుక్తః పరమయా ప్రీత్యా తావువాచాచ్యుతార్జునౌ ॥ 16
జీవజంతువుల మాంసాన్ని తిని, క్రొవ్వును, రక్తాన్ని త్రాగి ఆనందించిన అగ్ని వారిరువురితో ఇలా అన్నాడు. (16)
యువాభ్యాం పురుషాగ్ర్యాభ్యాం తర్పితోఽస్మి యథాసుఖమ్ ।
అనుజానామి వాం వీరౌ చరతం యత్ర వాంఛితమ్ ॥ 17
పురుషశ్రేష్ఠులైన మీచే సుఖం కలిగేటట్లు తృప్తి పొందాను. మీకు ఇష్టమైన చోటికి వెళ్లటానికి అనుమతిని ఇస్తున్నాను. (17)
ఏవం తౌ సమనుజ్ఞాతౌ పావకేన మహాత్మనా ।
అర్జునో వాసుదేవశ్చ దానవశ్చ మయస్తథా ॥ 18
పరిక్రమ్య తతః సర్వే త్రయోఽపి భరతర్షభ ।
రమణీయే నదీకూలే సహితాః సముపావిశన్ ॥ 19
అగ్నిదేవునిచే అనుమతిని పొంది అర్జునుడు, శ్రీకృష్ణుడు, మయుడు ఆయనకు ప్రదక్షిణం కావించారు. యమునా నది సుందరతటంపై ముగ్గురూ ఒకచోట ఆసీనులు అయ్యారు. (18,19)
ఇతి శ్రీమహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యామాదిపర్వణి మయదర్శనపర్వణి
వరప్రదానే త్రయస్త్రింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 233 ॥
ఇది శ్రీమహాభారతమున శతసాహస్రీసంహితయను వైయాసిక్యమున ఆదిపర్వమున మయదర్శనపర్వమను
ఉపపర్వమున వరప్రదానమను రెండువందల ముప్పది మూడవ అధ్యాయము. (233)
ఇది ఆదిపర్వము.
॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥