209. రెండువందల తొమ్మిదవ అధ్యాయము
సుందోపసుందులు ముల్లోకాలను బాధించుట.
నారద ఉవాచ
ఉత్సవే వృత్తమాత్రే తు త్రైలోక్యాకాంక్షిణావుభౌ।
మంత్రయిత్వా తతః సేనాం తావాజ్ఞాపయతాం తదా॥ 1
నారదుడు అన్నాడు - యుధిష్ఠిరా! ఉత్సవానంతరం త్రిలోకవిజయాన్ని కాంక్షించి వారిరువురు దైత్యులు సేనలను సిద్ధం కమ్మని ఆజ్ఞాపించారు. (1)
సుహృద్భీరప్యనుజ్ఞాతయ్ దైత్యైర్వృద్ధైశ్చ మంత్రిభిః।
కృతా ప్రాస్థానికం రాత్రౌ మఘాసు యయతుస్తదా॥ 2
స్నేహితులు, వృద్ధులైన రాక్షసమంత్రుల ఆజ్ఞను గైకొని మఘా నక్షత్రాన రాత్రి యుద్ధయాత్రను ప్రారంభించారు. (2)
గదపట్టిశధారిణ్యా శూలముద్గరహస్తయా।
ప్రస్థితౌ సహ వర్మిణ్యా మహత్యా దైత్యసేనయా॥ 3
మంగళైస్తుతిభిశ్చాపి విజయప్రతిసంహితైః।
చారణైః స్తూయమానౌ తౌ జగ్మతుః పరయా ముదా॥ 4
గదలు, తోమరాలు, శూలాలు, ముద్గరాలు, కవచాలతో దైత్యసేన బయలుదేరింది. సేనతో వారిరువురు బయలుదేరారు. వందిమాగధులు, చారణులు స్తోత్రాలు, మంగళపాఠాలు పాడుతూ ఉంటే వారు మిక్కిలి సంతోషంతో యుద్ధయాత్రకు వెళ్లారు. (3,4)
తావంతరిక్షముత్ ప్లుత్య దైత్యౌ కామగమావుభౌ।
దేవానామేవ భవనం జగ్మతుర్యుద్ధదుర్మదౌ॥ 5
యుద్ధదుర్మదులైన వారిరువురు కామగమనంతో ఆకాశానికి ఎగిరి, దేవతాభవనాలపై దాడిచేశారు. (5)
తయోరాగమనం జ్ఞాత్వా వరదానం చ తత్ ప్రభోః।
హిత్వా త్రివిష్టపం జగ్ముః బ్రహ్మలోకం తతః సురాః॥ 6
వారి దండయాత్రను గురించి విని, వారి వరబలాన్ని తెలిసికొని, దేవతల స్వర్గం విడిచి బ్రహ్మలోకానిని చేరారు. (6)
తావింద్రలోకం నిర్జిత్య యక్షరక్షోగణాంస్తదా।
ఖేచరాణ్యపి భూతాని జఘ్నతుస్తీవ్రవిక్రమౌ॥ 7
వారు తీవ్ర పరాక్రమంతో స్వర్గాన్ని జయిమ్చి యక్షులను, రక్షోగణాలను, ఆకాశగాములైన వారిని చంపారు. (7)
అంతర్భూమిగతాన్ నాగాన్ జిత్వా తౌ చ మహారథౌ।
సముద్రవాసినః సర్వాః మ్లేచ్ఛజాతీర్విజిగ్యతుః॥ 8
మహారథులు వారిరువురు పాతాళంలో చరించే నాగులను జయించి సముద్రపు ఒడ్డున నివసించే మ్లేచ్ఛులను జయించారు. (8)
తతః సర్వాం మహీం జేతుమారబ్ధావుగ్రశాసనౌ।
సైనికాంశ్చ సమాహూయ సుతీక్ష్ణం వాక్యమూచతుః॥ 9
భయంకరంగా శాసించే వారు భూమినంతటిని జయించాలని నిశ్చయించి సైనికులను పిలిచి ఇలా అన్నారు. (9)
రాజర్షయో మహాయజ్ఞైఃహవ్యకవ్యైర్ద్విజాతయః।
తేజో బలం చ దేవానాం వర్ధయంతి శ్రియం తదా॥ 10
ఈ భూమిపై రాజర్షులు, బ్రాహ్మణులు హవ్యకవ్య నివేదనలతో దేవతల తేజస్సు, బలం, సంపదలూ పెంచారు. (10)
తేషామేవంప్రవృత్తానాం సర్వేషామసురద్విషామ్।
సంభూయ సర్వైరస్మాభిః కార్యః సర్వాత్మనా వధః॥ 11
యజ్ఞాదులు చేసేవారు మనకు శత్రువులు. మనమందరం ఏకమై వారందరిని అన్నివిధాల చంపివేయాలి. (11)
ఏవం సర్వాన్ సమాదిశ్య పూర్వతీరే మహోదధేః।
క్రూరం మతిం సమాఖ్యాయ జగ్మతుః సర్వతోముఖౌ॥ 12
తూర్పు సముద్రతీరాన సైనికులను ఇలా ఆదేశించి కఠినమైన సంకల్పంతో వారిని పంపి అన్నివైపులకు ఆక్రమణకు బయలుదేరారు. (12)
యజ్ఞైర్యజంతి యే కేచిత్ యాజయంతి చ యే ద్విజాః।
తాన్ సర్వాన్ ప్రసభం హత్వా బలినౌ జగ్మతుస్తతః॥ 13
యజ్ఞాలు చేసే, చేయించే బ్రాహ్మణులను బలవంతంగా చంపి బలిష్ఠులై ముందుకు సాగారు. (13)
ఆశ్రమేష్వగ్నిహోత్రాణి మునీనాం భావితాత్మనామ్।
గృహీత్వా ప్రక్షిపంత్యప్సు విశ్రబ్ధం సైనికాస్తయోః॥ 14
శుద్ధాత్ములైన మునుల ఆశ్రమాలలోని అగ్నిహోత్రాలను, సామగ్రిని స్వేచ్ఛగా ఆ సైనికులు నీటిలోకి విసిరేశారు. (14)
తపోధనైశ్చ యే క్రుద్ధైః శాపా ఉక్తా మహాత్మభిః।
నాక్రామంత తయోస్తేఽపి వరదాననిరాకృతాః॥ 15
మహాత్ములు, తాపసులు కోపించి పలికిన శాపాలు వారి వరబలం వలన వారిని ఏమీ బాధించలేదు. (15)
నాక్రామంత యదా శాపాః బాణా ముక్తాః శిలాస్వివ ।
నియమాన్ సంపరిత్యజ్య వ్యద్రవంత ద్విజాతయః ॥ 16
రాళ్ల మీదికి వదిలిన బాణాలు వ్యర్థమైనట్లు శాపాలు వ్యర్థమైపోయాయి. బ్రాహ్మాణులందరు భయంతో పారిపోయారు. (16)
పృథివ్యాం యే తపస్సిద్ధా దాంతాః శమపరాయణాః ।
తయోర్భయాత్ దుద్రువుస్తే వైనతేయాదివోరగాః ॥ 17
గరుత్మంతునికి పాములు భయపడినట్లు జితేంద్రియులు, శాంతి పరాయణులు, తపస్సిద్ధులైన బ్రాహ్మణులందరు భయపడి పరుగుతీశారు. (17)
మథితైరాశ్రమైర్భగ్నైః వికీర్ణకలశస్రువైః ।
శూన్యమాసీజ్జగత్సర్వం కాలేనేవ హతం తదా ॥ 18
ఆశ్రమాలు భగ్నం చేశారు. కలశాలు, స్రువాలు విసిరి వేశారు. లోకమంతా కాలమహిమచే నాశానమైనట్లు జగమంతా శూన్యం చేశారు. (18)
తతో రాజన్నదృశద్భిరృషిభిశ్చ మహాసురౌ ।
ఉభౌ వినిశ్చయం కృత్వా వికుర్వాతే వధైషిణౌ ॥ 19
రాజా! అదృశ్యరూపం దాల్చి ఆ రాక్షసులిరువురూ ఋషులను చంపనిశ్చయించి భయంకర జంతువుల రూపాలను స్వీకరించారు. (19)
ప్రభిన్నకరటౌ మత్తౌ భూత్వా కుంజరరూపిణౌ ।
సంలీనమపి దుర్గేషు నిన్యతుర్యమసాదనమ్ ॥ 20
మదం స్రవించే మత్తేభాల రూపాన్ని దాల్చి చొరశక్యం కాని చోటనున్న ఋషులను కూడ యమపురికి పంపారు. (20)
సింహౌ భూత్వా పునర్వ్యాఘ్రౌ పునశ్చాంతర్హితావుభౌ ।
తైస్తైరూపాయైస్తౌ క్రూరావృషీన్ దృష్ట్వా నిజఘ్నతుః ॥ 21
సింహాలు, పులుల రూపాలు ఎత్తి అదృశ్యంగా ఉండి క్రూరులై ఋషులను ఆయా జంతువుల మాదిరిగా వధించారు. (21)
నివృత్తయజ్ఞస్వాధ్యాయా ప్రనష్టనృపతిద్విజా ।
ఉత్సన్నోత్సవయజ్ఞా చ బభూవ వసుధా తదా ॥ 22
వారెప్పుడేరూపాన్ని దాలుస్తారో ఋషులకు తెలియలేదు. భూమిపై యజ్ఞాలు, స్వాధ్యాయాలు తగ్గిపోయాయి. రాజర్షులు, బ్రాహ్మణులు నశించారు. యాత్రలు, వివాహాలు చాల వరకు కనిపించకుండా పోయాయి. (22)
హాహాభూతా భయార్తా చ నివృత్తవిపణాపణా ।
నివృత్తదేవకార్యా చ పుణ్యోద్వాహవివర్జితా ॥ 23
అన్నిచోట్ల హాహాకారాలు వ్యాపించాయి. ప్రజలు భయవిహ్వలులు అయ్యారు. అంగళ్లలో, క్రయవిక్రయాలు లేవు. దేవకార్యాలు నశించాయి. పవిత్ర, వివాహాది కర్మలు లోపించాయి. (23)
నివృత్తకృషిగోరక్షా విధ్వస్తనగరాశ్రమా ।
అస్థికంకాలసంకీర్ణా భూర్బభూవోగ్రదర్శనా ॥ 24
వ్యవసాయం, పశురక్షణం లేనే లేదు. నగరాలు, ఆశ్రమాలు ధ్వంసం చేశారు. ఎముకలు, అస్థిపంజరాలతో భూమి భయంకరంగా తయారయింది. (24)
నివృత్తపితృకార్యం చ నిర్వషట్కారమంగళమ్ ।
జగత్ ప్రతిభయాకారం దుష్ర్పేక్ష్యమభవత్ తదా ॥ 25
పితృకార్యాలు లోపించాయి. వషట్కారమంగళాలు అదృశ్యమాయ్యాయి. లోకమంతా భయంతో విహ్వలం అయ్యింది. భూమివైపు చూడలేకపోతున్నారు. (25)
చంద్రాదిత్యౌ గ్రహాస్తారాః నక్షత్రాణి దివౌసకః ।
జగ్ముర్విషాదం తత్ కర్మ దృష్ట్వా సుందోపసుందయోః ॥ 26
సుందోపసుందుల భయానకాలైన కర్మలను చూచి చంద్రుడు, సూర్యుడు, మిగిలిన గ్రహాలు, తారలు, నక్షత్రాలు, దేవతలు అందరు దుఃఖాన్ని పొందారు. (26)
ఏవం సర్వా దిశో దైత్యౌ జిత్వా క్రూరేణ కర్మణా ।
నిఃసపత్నౌ కురుక్షేత్రే నివేశమభిచక్రతుః ॥ 27
ఈ విధంగా సుందోపసుందులు తమ క్రూరకర్మలచే అన్ని దిక్కులు జయించి శత్రురహితం చేసుకొని కురుక్షేత్రంలోని తమభవనంలోనికి ప్రవేశించారు. (27)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంభపర్వణి సుందోపసుందోపాఖ్యానే నవాధికద్విశతతమోఽధ్యాయః ॥ 209 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున విదురాగమన రాజ్యలంభపర్వము అను
ఉపపర్వమున సుందోపసుందోపాఖ్యానమున రెండువందల తొమ్మిదవ అధ్యాయము. (209)