208. రెండువందల ఎనిమిదవ అధ్యాయము
సుందోపసుందుల తపస్సు, వరప్రాప్తి.
నారద ఉవాచ
శృణు మే విస్తరేణేమమ్ ఇతిహాసం పురాతనమ్ ।
భ్రాతృభిః సహితః పార్థ యథావృత్తం యుధిష్ఠిర ॥ 1
నారదుడు అన్నాడు - యుధిష్ఠిరా! ఈ వృత్తాంతం ఎలా జరిగిందో విస్తరంగా వినిపిస్తాను. సోదర సహితుడవై విను. (1)
మహాసురస్యాన్వవాయే హిరణ్యకశిపోః పురా ।
నికుంభో నామ దైత్యేంద్రః తేజస్వీ బలవానభూత్ ॥ 2
ప్రాచీనకాలాన హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడు అనే పేరు గల మహారాక్షసుడు పుట్టాడు. అతడు మిక్కిలి బలవంతుడు. తేజస్వి. (2)
తస్య పుత్రౌ మహావీర్యౌ జాతౌ భీమపరాక్రమౌ ।
సుందోపసుందౌ దైత్యేంద్రౌ దారుణౌ క్రూరమానసౌ ॥ 3
అతనికి మహాపరాక్రమం, బలం గల ఇద్దరు కొడుకులు పుట్టారు. సుందోపసుందులను పేర్లు గల వారిరువురు క్రూరమనస్కులు, భయంకరమైనవారు. (3)
తావేకనిశ్చయౌ దైత్యౌ ఏకకార్యార్థసమ్మతౌ ।
నిరంతరమవర్తేతాం సమదుఃఖసుఖావుభౌ ॥ 4
వారిరువురు ఒకే నిశ్చయంతో, ఒకే పనిని ఆచరిస్తారు. వారికి సుఖం, దుఃఖం వేరుగా లేవు. ఎల్లప్పుడు కలిసే ఉంటారు. (4)
వినాన్యోన్యం న భుంజాతే వినాన్యోన్యం న జల్పతః ।
అన్యోన్యస్య ప్రియకరౌ అన్యోన్యస్య ప్రియంవదౌ ॥ 5
ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఒకరు లేకుండా వేరొకరితో మాట్లాడరు. ఒకరికొరకు ఒకరు ప్రియం ఆచరిస్తారు. తీయనిమాటలు మాట్లాడుతారు కూడ. (5)
ఏకశీలసమాచారౌ ద్విధైవేకోఽభవత్ కృతః ।
తౌ వివృద్ధౌ మహావీర్యౌ కార్యేష్వప్యేకనిశ్చయౌ ॥ 6
ఒకే శీలం, ఆచరణ కల వారి జీవాత్మ రెండుగా విడిపోయి ఇద్దరైనారు. వారు మహాపరాక్రమవంతులుగా ఎదిగారు. ఒకే నిశ్చయంతో కార్యాలను ఆచరించారు. (6)
త్రైలోక్యవిజయార్థాయ సమాధాయైకనిశ్చయమ్ ।
దీక్షాం కృత్వా గతౌ వింధ్యం తావుగ్రం తేపతుస్తపః ॥ 7
ముల్లోకాలు జయించాలని సంకల్పించి, దీక్ష వహించి, వింధ్యపర్వతం చేరి, వారిద్దరు తపస్సు ఆచరించారు. (7)
తౌ తు దీర్ఘేణ కాలేన తపోయుక్తౌ బభూవతుః ।
క్షుత్పిపాసా పరిశ్రాంతౌ జటావల్కలధారిణౌ ॥ 8
క్షుత్పిపాసలతో అలసి, శిరసుపై జటలు, శరీరంపై నారబట్టలు ధరించి వారిద్దరు తపస్సు చేశారు. (8)
మలోపచితసర్వాంగౌ వాయుభక్షౌ బభువతుః ।
ఆత్మమాంసాని జుహ్వంతౌ పాదాంగుష్ఠాగ్రవిష్ఠితౌ ॥ 9
ఊర్ధ్వబాహూ చానిమిషౌ దీర్ఘకాలం ధృతవ్రతౌ ॥
మాలిన్యంతో నిండిన అవయవాలతో వారు వాయుభక్షకులయ్యారు. తమ శరీరమాంసాన్ని అగ్నికి ఆహుతి చేసి బొటనవ్రేలిపై నిలబడి, చేతులుపైకెత్తి కనురెప్ప వేయక చాలాకాలం నియమంతో తపస్సు చేశారు. (9)
తయోస్తపఃప్రభావేణ దీర్ఘకాలం ప్రతాపితః ।
ధూమం ప్రముముచే వింధ్యః తదద్భుతమివాభవత్ ॥ 10
వారి తపస్సుకి చాలాకాలం వేడెక్కి వింధ్యపర్వతం పొగలు చిమ్మింది. అది చాల అద్భుతమైన విషయం. (10)
తతో దేవా భయం జగ్ముః ఉగ్రం దృష్ట్వా తయోస్తవః ।
తపోవిఘాతార్థమథో దేవా విఘ్నాని చక్రిరే ॥ 11
వారి తీవ్రమైన తపస్సు చూచి దేవతలు మిక్కిలి భయపడ్డారు. వారి తపస్సును భగ్నం చేయటానికి ఎన్నో విఘ్నాలను కల్పించారు. (11)
రత్నైః ప్రలోభయామాసుః స్త్రీభిశ్చోభౌ పునః పునః ।
న చ తౌ చక్రతుర్భంగం వ్రతస్య సుమహావ్రతౌ ॥ 12
దేవతలందరు వారిరువురిని స్త్రీలతో, రత్నాలతో మాటిమాటికీ ప్రలోభపెట్టారు. కాని వారు తమతపస్సు విడువలేదు. (12)
అథ మాయాం పునర్దేవాః తయోశ్చక్రుర్మహాత్మనోః ।
భగిన్యో మాతరో భార్యాః తయోశ్చాత్మజనస్తథా ॥ 13
ప్రపాత్యమానా విత్రస్తాః శూలహస్తేన రక్షసా ।
భ్రష్టాభరణకేశాంతాః భ్రష్టాభరణవాససః ॥ 14
అభివాద్య తతః సర్వాః తౌ త్రాహీతి విచుక్రుశుః ।
న చ తౌ చక్రతుర్బంగం వ్రతస్య సుమహావ్రతౌ ॥ 15
వారిపై దేవతలు మాయను ప్రయోగించారు. మాయచే కల్పింపబడిన సోదరీగణం, తల్లులు, భార్యలు, ఆత్మీయులు భయంతో పరుగులిడుతూ వచ్చారు. వారిని శూలధారి అయిన రాక్షసుడొకడు తరుముతూ భూమిపై దొర్లింపసాగాడు. వారి ఆభరణాలు, వస్త్రాలు జారిపోయాయి. వారందరు కలిసి వారిరువురికి నమస్కరించి రక్షించమని వేడుకున్నారు. వారు, ఈ రోదనలు విన్నా వ్రతధారులైన కారణంగా తపమును విడలేదు. వ్రత భంగం చేయలేదు. (13-15)
యదా క్షోభమ్ నోపయాతి నార్తిమన్యతరస్తయోః ।
తతః స్త్రియస్తా భూతం చ సర్వమంతరధీయత ॥ 16
ఇద్దరిలో ఒక్కరైనా కలతచెందకపొవటం వలన, బాధపడకపోవటం వలన, అందరూ అక్కడికక్కడే మాయం అయ్యారు. (16)
తతః పితామహః సాక్షాద్ అభిగమ్య మహాసురౌ ।
వరేణ చ్ఛందయామాస సర్వలోకహితః ప్రభుః ॥ 17
లోకహితాన్ని కోరే బ్రహ్మ ప్రత్యక్షమై వారిని వరాలు కోరుకోమన్నారు. (17)
తతః సుందోపసుందౌ తౌ భ్రాతరౌ దృఢవిక్రమౌ ।
దృష్ట్వా పితామహం దేవం తస్థతుః ప్రాంజలీ తదా ॥ 18
ఊచతుశ్చ ప్రభుం దేవం తతస్తౌ సహితౌ తదా ।
ఆవయోస్తపసానేన యది ప్రీతః పితామహః ॥ 19
మాయావిదావస్త్రవిదౌ బలినౌ కామరూపిణౌ ।
ఉభావప్యమరౌ స్యావః ప్రసన్నో యది నౌ ప్రభుః ॥ 20
దృఢవిక్రములయిన ఆ సోదరులిరువురు తమ ఎదుట నిలిచిన బ్రహ్మను చూచి చేతులు జోడించి ఒక్కసారిగా "భగవానుడా! మీరు మా తపస్సుకు ప్రసన్నులైతే మమ్ములను మాయావేత్తలనుగా అస్త్రశస్త్రవిశారదులు, బలవంతులనుగా, కామరూపులనుగా అమరులనుగా చేయండి" అన్నారు. (18-20)
బ్రహ్మోవాచ
ఋతేఽమరత్వం యువయోః సర్వముక్తం భవిష్యతి ।
అన్యద్ వృణీతం మృత్యోశ్చ విధానమమరైః సమమ్ ॥ 21
బ్రహ్మ అన్నాడు - అమరత్వం తప్ప మిగిలిన మీ కోరికలన్నీ తీరుతాయి. మీరు దేవతలతో సమానంగా మృత్యువిధానం వేరొకలా కోరండి. (21)
ప్రభవిష్యావ ఇతి యన్మహదభ్యుద్యతం తపః ।
యువయోర్హేతునానేన నామరత్వం విధీయతే ॥ 22
ముల్లోకాలకు ప్రభువులు కావాలని మీరు తపస్సు చేశారు. మీ సంకల్పం అమరత్వం కాదు. కావున మీరు అమరులు కాలేరు. (22)
త్రైలోక్యవిజయార్థాయ భవద్భ్యామాస్థితం తపః ।
హేతునానేన దైత్యేంద్రౌ న వా కామం కరోమ్యహమ్ ॥ 23
దైత్యశ్రేష్ఠులారా! త్రైలోక్యవిజయమ్ కొరకు మీరు తపస్సు ఆచరించారు. మీ అమరత్వసిద్ధిని నేను ఈయలేను. (23)
సుందీపసుందావూచతుః
త్రిషు లోకేషు యద్ భూతం కించిత్ స్థావరజంగమమ్ ।
సర్వస్మాన్నో భయం న స్యాదృతేఽన్యోన్యం పితామహ ॥ 24
సుందోపసుందులు పలికారు - పితామహా! మాలో మేము తప్ప ఇతరులు ముల్లోకాల్లో ఎవరూ మమ్ము చంపలేనట్లు వరాన్ని ఇమ్ము. (24)
పితామహ ఉవాచ
యత్ ప్రార్థితం యథోక్తం చ కామమేతత్ దదాని వామ్ ।
మృత్యోర్విధానమేతచ్చ యథావత్ వా భవిష్యతి ॥ 25
బ్రహ్మ అన్నాడు - మి ప్రార్థననకు అనుగుణంగా మీలో పరస్పరం కలహం ఏర్పడగా మరణమ్ కలిగేటట్లు వరమిస్తున్నాను. ఏదో ఒక రూపంలో మృత్యువు కలుగుతుంది. (25)
నారద ఉవాచ
తతః పితామహో దత్త్వా వరమేతత్ తదా తయోః ।
నివర్త్య తపసస్తౌ చ బ్రహ్మలోకం జగామ హ ॥ 26
నారదుడు అన్నాడు - యుధిష్ఠిరా! అప్పుడు వారిద్దరికి ఇలా వరాన్ని ఇచ్చి, తపస్సు నుంచి మరల్చి, పితామహుడు తనలోకానికి చేరాడు. (26)
లబ్ధ్వా వరాణి దైత్యేంద్రౌ అథ తౌ భ్రాతరావుభౌ ।
అవధ్యౌ సర్వలోకస్య స్వమేవ భవనం గతౌ ॥ 27
ఆ సోదరులిద్దరూ బ్రహ్మనుంచి వరాన్ని పొంది ముల్లోకాలకు అవధ్యులై తమ భవనాలకు సంతోషంగా వెళ్ళారు. (27)
తౌ తు లబ్ధవరౌ దృష్ట్వా కృతకామౌ మనస్వినౌ ।
సర్వః సుహృజ్జనస్తాభ్యాం ప్రహర్షముపజగ్మివాన్ ॥ 28
వరాలు పొంది కృతకృత్యులై తిరిగి వచ్చిన అభిమానవంతులైన వారిరువురుని చూచి స్నేహితులు మిక్కిలి సంతోషించారు. (28)
తతస్తౌ జటా భిత్త్వా మౌలినౌ సంబభూవతుః ।
మహార్హాభరణోపేతౌ విరజోఽంబరధారిణౌ ॥ 29
అకాలకౌముదీం చైవ చక్రతుః సార్వకాలికీమ్ ।
నిత్యప్రముదితః సర్వస్తయోశైవ సుహృజ్జనః ॥ 30
వారిరువురు జడలను తొలగించి కిరీటాలు ధరించారు. విలువ గల ఆభరణాలు, వస్త్రాలు ధరించి కాలంకాని కాలంలో వచ్చిన వెన్నెల శోభలను స్థిరం చేశారు. వారి స్నేహితులందరు సంతోషంలో మునిగిపోయారు. (29,30)
భక్ష్యతామ్ భుజ్యతాం నిత్యం దీయతాం రమ్యతామితి ।
గీయతాం పీయతాం చేతి శబ్దశ్చాసీత్ గృహే గృహే ॥ 31
ప్రతిగృహంలోను తినండి, అనుభవించండి, క్రీడించండి, పాడండి, త్రాగండి, కొల్లగొట్టండి అనే మాటలే వినిపింపచేశారు. (31)
తత్ర తత్ర మహానాదైః ఉత్కృష్టతలనాదితైః ।
హృష్టం ప్రముదితం సర్వం దైత్యానామభవత్ పురమ్ ॥ 32
అక్కడక్కడ తాళధ్వనులు మ్రోగిస్తూ ఆ దైత్యుల నగరం హర్షంలో, ఆనందంలో మునిగిపోయింది. (32)
తైస్తైర్విహారైర్బహుభిః దైత్యానామ్ కామరుపిణామ్ ।
సమాః సంక్రీడతామ్ తేషాం అహరేకమివాభవత్ ॥ 33
కామరూపాలు దాల్చి రాక్షసులిరువురు క్రీడిస్తూ చాలా సంవత్సరాలు గడిచినా వారికి తెలియకుండా పోయింది. ఒక్కరోజే గడిచినట్లు వారు భావించారు. (33)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి విదురాగమన రాజ్యలంభపర్వణి సుందోపసుందోపాఖ్యానేఽష్టాధికద్విశతతమోఽధ్యాయః ॥ 208 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున విదురాగమన రాజ్యలంభపర్వమను ఉపపర్వమున సుందోపసుందోపాఖ్యానము అను రెండు వందల ఎనిమిదవ అధ్యాయము. (208)