210. రెండువందల పదియవ అధ్యాయము

తిలోత్తమ సుందోపసుందులను మోహింపజేయుట.

నారద ఉవాచ
తతో దేవర్షయః సర్వే సిద్ధాశ్చ పరమర్షయః ।
జగ్ముస్తదా పరామార్తిం దృష్ట్వా తత్ కదనం మహత్ ॥ 1
నారదుడు అన్నాడు - యుధిష్ఠిరా! దేవర్షులు, సిద్ధులు, మహర్షులు ఆ హత్యాకాండను చూచి మిక్కిలి దుఃఖించారు. (1)
తేఽభిజగ్ముర్జితక్రోధాః జితాత్మానో జితేంద్రియాః ।
పితామహస్య భవనం జగతః కృపయా తదా ॥ 2
జితేంద్రియులు, జితక్రోధులు, ఆత్మజయం సాధించినవారు అందరూ కలిసి లోకులపై దయతో బ్రహ్మ యొక్క సత్యలోకానికి వెళ్ళారు. (2)
తతో దదృశురాసీనం సహదేవైః పితామహమ్ ।
సిద్ధైర్బ్రహ్మర్షిభిశ్చైవ సమంతాత్ పరివారితమ్ ॥ 3
అక్కడకు చేరి దేవతాగణంతో, సిద్ధులతో, బ్రహ్మర్షి గణంతో పరివేష్టితుడైన బ్రహ్మను చూశారు. (3)
తత్ర దేవో మహాదేవః తత్రాగ్నిర్వాయునా సహ ।
చంద్రాదిత్యౌ చ శక్రశ్చ పారమేష్ఠ్యాస్తథర్షయః ॥ 4
వైఖానసా వాలఖిల్యాః వానప్రస్థా మరిచిపాః ।
అజాశ్చైవావిమూఢాశ్చ తేజోగర్భాస్తపస్వినః ॥ 5
ఋషయః సర్వ ఏవైతే పితామహముపాగమన్ ।
తతోఽభిగమ్య తే దీనాః సర్వ ఏవ మహర్షయః ॥ 6
సుందోపసుందయోః కర్మ సర్వమేవ శశంసిరే ।
యథా హృతం యథా చైవ కృతం యేన క్రమేణ చ ॥ 7
న్యవేదయంస్తతః సర్వమ్ అఖిలేన పితామహే ।
తతో దేవగణాః సర్వే తే చైవ పరమర్షయః ॥ 8
తమేవార్థం పురస్కృత్య పితామహమచోదయన్ ।
తతః పితామహః శ్రుత్వా సర్వేషాం తద్ వచస్తదా ॥ 9
ముహూర్తమివ సంచిత్య కర్తవ్యస్య చ నిశ్చయమ్ ।
తయోర్వధం సముద్దిశ్య విశ్వకర్మాణమహ్వయత్ ॥ 10
అక్కడ మహాదేవుడు, వాయుసహితుడైన అగ్ని, చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు, బ్రహ్మమానసపుత్రులు, వైకానసులు, వాలఖిల్యులు, మరీచిపులు, తేజోగర్భులు మొదలయిన వారు ఉన్నారు. మహర్షులందరు వారివద్దకు పోయి దైన్యంతో బ్రహ్మతో సుందోపసుందుల వృత్తాంతాన్ని చెప్పారు. వారు చేసిన అకృత్యాలన్నీ వివరించారు. దేవతలు, మహర్షులు బ్రహ్మను కర్తవ్యోపదేశాన్ని కోరారు. వారి ప్రార్థనను విని బ్రహ్మ కొద్దిసేపు ఆలోచించాడు. వారి మరణాన్ని నిశ్చయించి విశ్వకర్మను పిలిపించాడు. (4-10)
దృష్ట్వా చ విశ్వకర్మాణమ్ వ్యాదిదేవ పితామహః ।
సృజ్యతాం ప్రార్థనీయైకా ప్రమదేతి మహాతపాః ॥ 11
మహాతపస్వి బ్రహ్మ విశ్వకర్మ వచ్చిన పిదప " నీవు సుందరస్త్రీని వారి వధకొరకు తయారు చేయు" మని ఆజ్ఞాపించాడు. (11)
పితామహం నమస్కృత్య్ తద్వాక్యమభినంద్య చ ।
నిర్మమే యోషితం దివ్యాం చింతయిత్వా పునః పునః ॥ 12
పితామహునికి నమస్కరించి, ఆ మాటలను శిరసావహించి విశ్వకర్మ బాగా ఆలోచించి దివ్యమైన ఒక సుందరిని సృష్టించాడు. (12)
త్రిషు లోకేషు యత్ కించిత్ భూతం స్థావరజంగమమ్ ।
సమానయద్ దర్శనీయం తత్ తదత్ర స విశ్వవిత్ ॥ 13
ముల్లోకాల్లో చరాచరాల్లో ఏపదార్థం శ్రేష్ఠమైందో దానిని తీసి విశ్వకర్మ ఆ సుందరిశరీరంలో కూర్చాడు. (13)
కోటిశశ్చైవ రత్నాని తస్యా గాత్రే న్యవేశయత్ ।
తాం రత్నసంఘాతమయీమసృజద్ దేవరూపిణీమ్ ॥ 14
ఆ యువతి అవయవాల్లో రత్నాలనేకం చేర్చాడు. రత్నకిరణాలు వెదజల్లేటట్లు ఆ దేవరమణిని నిర్మించాడు. (14)
సా ప్రయత్నేన మహతా నిర్మితా విశ్వకర్మణా ।
త్రిషు లోకేషు నారీణాం రూపేణాప్రతిమాభవత్ ॥ 15
విశ్మకర్మచే విశ్వప్రయత్నంతో తయారు చేయబడిన ఆమె ముల్లోకాల్లోని నారీమణులలో సౌందర్యాల్లో సాటిలేనిదయింది. (15)
న తస్యాః సూక్ష్మమప్యస్తి యద్ గాత్రే రూపసంపదా ।
నియుక్తా యత్ర వా దృష్టిర్న సజ్జతి నిరీక్షతామ్ ॥ 16
ఆమె శారీరంలో చూసేవారి దృష్టిని ఆకర్షించని రూపసంపద నువ్వుగింజంత అయినా లేదు. (16)
సా విగ్రహవతీవ శ్రీః కామరూపా వపుష్మతీ ।
జహార సర్వభూతానాం చక్షూంషి చ మనాంసి చ ॥ 17
లక్ష్మి శరీరం దాల్చినట్లు ఆ కామరూపిణి సర్వప్రాణుల చూపులను, మనస్సులను ఆకర్షించింది. (17)
తిలం తిలం సమానీయ రత్నానాం యద్ వినిర్మితా ।
తిలోత్తమేతి తత్ తస్యా నామ చక్రే పితామహః ॥ 18
ఉత్తమరత్నాలను నువ్వుగింజ పరిమాణంలో తీసి నిర్మించటం చేత ఆమెకు బ్రహ్మ తిలోత్తమ అన్నపేరును నిశ్చయించాడు. (18)
బ్రహ్మాణం సా నమస్కృత్య ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ ।
కిం కార్యం మయి భూతేశ యేనాస్మ్యద్యేహ నిర్మితా ॥ 19
తిలోత్తమ బ్రహ్మకు నమస్కరించి దోసిలిఘటించి పలికింది. ప్రజాపతీ! నాపై ఏకార్యభారాన్ని మోపదలచి ఈ శరీర నిర్మాణం చేయించావు? (19)
పితామహ ఉవాచ
గచ్ఛ సుందోపసుందాభ్యామ్ అసురాభ్యాం తిలోత్తమే ।
ప్రార్థనీయేన రూపేన కురు భద్రే ప్రలోభనమ్ ॥ 20
బ్రహ్మ పలికాడు - కల్యాణీ! తిలోత్తమా! నీవు సుందోపసుందుల వద్దకు పోయి ఆకర్షణీయమైన రూపంతో వారిని ప్రలోభపెట్టు. (20)
త్వత్కృతే దర్శనాదేవ రూపసంపత్కృతేన వై ।
విరోధః స్యాద్ యథా తాభ్యామ్ అన్యోన్యేన తథా కురు ॥ 21
నిన్ను చూస్తుండగానే నీరూపసంపదను పొందాలి అనే కోరిక వారికి కలిగించు. వారికి పరస్పరం విరోధం ఏర్పడేట్లు చెయ్యి. (21)
నారద ఉవాచ
సా తథేతి ప్రతిజ్ఞాయ నమస్కృత్య పితామహమ్ ।
చకార మండలం తత్ర విబుధానాం ప్రదక్షిణమ్ ॥ 22
నారదుడు అన్నాడు - ఆమె అంగీకరించి బ్రహ్మకు నమస్కరించి ప్రతిజ్ఞ చేసింది. అక్కడనున్న దేవతలకు ప్రదక్షిణం చేసింది. (22)
ప్రాఙ్ముఖో భగవానాస్తే దక్షిణేన మహేశ్వరః ।
దేవాశ్చైవోత్తరేణాసన్ సర్వతస్త్వృషయోఽభవన్ ॥ 23
బ్రహ్మ దక్షిణానికి, శివుడు తూర్పుకు అభిముఖంగా ఆసీనులైనారు. దేవతలు ఉత్తరంగా కూర్చున్నారు. ఋషులు అన్నివైపులా ఆసీనులైనారు. (23)
కుర్వత్యా తు తత్ర మండలం తత్ ప్రదక్షిణమ్ ।
ఇంద్రః స్థాణుశ్చ భగవాన్ ధైర్యేణ ప్రత్యవస్థితౌ ॥ 24
తిలోత్తమ దెవసముదాయానికి ప్రదక్షిణం చేసేటప్పుడు ఇంద్రుడు, ఈశ్వరుడు తమతమ స్థానాలలో ధైర్యంగా ఆసీనులై ఉన్నారు. (24)
ద్రష్టుకామస్య చాత్యర్థం గతయా పార్శ్వతస్తయా ।
అన్యదంచితపద్మాక్షం దక్షిణం నిఃసృతం ముఖమ్ ॥ 25
ఆమె శంకరుని దక్షినపార్శ్వానికి పోగా శంకరునికి ఆమెను చూడాలనిపించింది. ఆయనకు పద్మం వలె ప్రకాశించే వేరొక ముఖం ఏర్పడింది. (25)
పృష్ఠతః పరివర్తంత్యా పశ్చిమం నిఃసృతం ముఖమ్ ।
గతయా చోత్తరం పార్శ్వముత్తరం నిఃసృతం ముఖమ్ ॥ 26
వెనుక తిరిగేటప్పుడు పశ్చిమముఖం, ఉత్తరానికి పోయినప్పుడు ఉత్తరముఖం ఏర్పడినాయి. (26)
మహేంద్రస్యాపి నేత్రాణాం పృష్ఠతః పార్శ్వతోఽగ్రతః ।
రక్తాంతానాం విశాలానాం సహస్రం సర్వతోఽభవత్ ॥ 27
మహేంద్రునికి కూడ ముందు, వెనుక, ప్రక్కన అన్నివైపుల విశాలాలు, ఎర్రని కాంతులు గల వేయికన్నులు బహిర్గతం అయ్యాయి. (27)
ఏవం చతుర్ముఖః స్థాణుః మహాదేవోఽభవత్ పురా ।
తథా సహస్రనేత్రశ్చ బభూవ బలసూదనః ॥ 28
పూర్వం స్థాణువైన శంకరుడు చతుర్ముఖుడు అయ్యాడు. బలుని చంపిన ఇంద్ర్రుడు సహస్రనేత్రు డయ్యాడు. (28)
తథా దేవనికాయానాం మహర్షీణాం చ సర్వశః ।
ముఖాని చాభ్యవర్తంత యేన యాతి తిలోత్తమా ॥ 29
అలా మహర్షులకు, దేవసంఘాలకు ఏవైపుకు తిలోత్తమ వెళ్ళుతున్నదో ఆ వైపునకు వారి వారి ముఖాలు తిరుగసాగాయి. (29)
తస్యా గాత్రే నిపతితా దృష్టిస్తేషామ్ మహాత్మనామ్ ।
సర్వేషామేవ భూయిష్ఠమృతే దేవం పితామహమ్ ॥ 30
అప్పుడు దేవాధిదేవుడైన బ్రహ్మను విడచి మహాత్ములైన దేవతలందరి చూపులు ఆమెశరీరంపై మరల మరల లగ్నం అయ్యాయి. (30)
గచ్ఛన్త్యా తు తయా సర్వే దేవాశ్చ పరమర్షయః ।
కృతమిత్యేవ తత్ కార్యం మేనిరే రూపసంపదా ॥ 31
ఆమె బయలుదేరగా రూపసంపదచే సుందోపసుందుల నాశనం జరిగిపోయినట్లు దేవతలు, ఋషులు భావించారు. (31)
తిలోత్తమాయాం తస్యాం తు గతాయాం లోకభావనః ।
సర్వాన్ విసర్జయామాస దేవానృషిగణాంశ్చ తాన్ ॥ 32
లోకాల్ని సృజించే శీలం గల బ్రహ్మ ఆమె వెళ్ళిన పిదప దేవతలు, ఋషులు, మొదలైన వారిని వారి వారి ప్రదేశాలకు పంపాడు. (32)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంభపర్వణి సుందోపసుందోపాఖ్యానే తిలోత్తమాప్రస్థాపనే దాశధికద్వితతమోఽధ్యాయః ॥ 210 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున విదురాగమన రాజ్యలంభపర్వమను
ఉపపర్వమున సుందోపసుందోపాఖ్యానమున తిలోత్తమాప్రస్థాపనమను రెండువందల పదియవ అధ్యాయము. (210)