201. రెండువందల ఒకటవ అధ్యాయము
పాండవులపై పరాక్రమమే ఉచితమని కర్ణుడు చెప్పుట.
కర్ణ ఉవాచ
దుర్యోధన తవ ప్రజ్ఞా న సమ్యగితి మే మతిః ।
న హ్యుపాయేన తే శక్యాః పాండవాః కురువర్ధన ॥ 1
కర్ణుడు ఇలా అన్నాడు - దుర్యోధనా! నా అభిప్రాయంలో నీ సలహా ఉచితమైంది కాదు. కురువర్ధనా! నీవు చెప్పిన ఉపాయాలలో దేనితోనూ పాండవులను వశపరచుకోలేము. (1)
పూర్వమేవ హి తే సూక్ష్మైః ఉపాయైర్యతితాస్త్వయా ।
నిగ్రహీతుం తదా వీర న చైవ శకితాస్త్వయా ॥ 2
ఇహైవ వర్తమానాస్తే సమీపే తవ పార్థివ ।
అజాతపక్షాః శిశవః శకితా నైవ బాధితుమ్ ॥ 3
వీరుడా! పాండవులను వశపరచుకొనటానికి నీవు గతంలోనే అనువైన ఉపాయాలన్నీ ప్రదర్శించావు. కాని వారు నీకు లొంగలేదు. ఇక్కడ ఉన్నపుడు వారు రెక్కలు రాని పక్షిపిల్లలు. అయినా నీవు వారిని బాధించలేకపోయావు. (2,3)
జాతపక్షా విదేశస్థాః వివృద్ధాః సర్వశోఽద్య తే ।
నోపాయసాధ్యాః కౌంతేయాః మమైషా మతి రచ్యుత ॥ 4
ఇప్పుడు వారు రెక్కలు వచ్చినవారు. విదేశీయులు. సహాయకులతో అభివృద్ధిని పొందారు. కౌంతేయులు ఏ ఉపాయానికీ లొంగరు. ఇది నా నిశ్చయం. (4)
న చ తే వ్య్సనైర్యోక్తుం శక్యా దిష్టకృతేన చ ।
శకితాశ్చేప్సవశ్చైవ పితృపైతామహం పదమ్ ॥ 5
వారినిప్పుడు ఆపదల్లో పడవేయలేం. అదృష్టం వారిని శక్తియుక్తులుగా చేసింది. వారిలొ తాతాతండ్రుల రాజ్యం పొందాలనే కాంక్ష పుట్టింది. (5)
పరస్పరేణ భేదశ్చ నాధాతుం తేషు శక్యతే ।
ఏకస్యాం యే రతాః పత్న్యాం న భిద్యంతే పరస్పరమ్ ॥ 6
వారిమధ్య భేదం పుట్టించటం సాధ్యం కాదు. వారు ఒకే భార్యను వివాహమాడినవారు. ఆ కారణమ్గా వారి మద్య కలహం రాదు. (6)
న చాపి కృష్ణా శక్యేత తేభ్యో భేదయితుం పరైః ।
పరిద్యూనాన్ వృతవతీ కిముతాద్య మృజావతః ॥ 7
ద్రౌపదిని పాండవుల నుమ్చి వేరు చేయటం పరులకు అసాధ్యం. భిక్షాటన చేస్తున్నపుడే పాండవులను వరించిన ఆమె సంపన్నులైనప్పుడు ఎలా విరక్తిని పొందుతుంది? (7)
ఈప్సితశ్చ గుణః స్త్రీణామ్ ఏకస్యా బహుభర్తృతా ।
తం చ ప్రాప్తవతీ కృష్ణా న సా భేదయితుం క్షమా ॥ 8
స్త్రీలకు అనేకులను భర్తలుగా పొందటం ఇష్టమైన గుణం. ఆమెకిది అప్రయత్నంగా లభించింది. కాబట్టి ఆమె వారిపట్ల విరక్తి పొందటం కష్టం. (8)
ఆర్యవ్రతశ్చ పాంచాల్యః న స రాజా ధనప్రియః ।
న సంత్యక్ష్యతి కౌంతేయాన్ రాజ్యదానైరపి ధ్రువమ్ ॥ 9
పాంచాల రాజు ద్రుపదుడు నియమాలను ఆచరిస్తాడు. ధనమంటే ఇష్టంలేనివాడు. నీవు నీరాజ్యాన్ని పూర్తిగా ద్రుపదునకిచ్చినా అతడు పాండవులను విడువడు. (9)
యథాస్య పుత్రో గుణవాన్ అనురక్తశ్చ పాండవాన్ ।
తస్మాన్నోపాయసాధ్యాంస్తాన్ అహం మన్యే కథంచన ॥ 10
అట్లే ద్రుపదకుమారుడు ధృష్టద్యుమ్నుడు గుణవంతుడు. పాండవులపై ప్రేమ కలవాడు. క్షుద్రోపాయాలకు అతడు లొంగడు. (10)
ఇదం త్వద్య క్షమం కర్తుమ్ అస్మాకం పురుషర్షభ ।
యావన్న కృతమూలాస్తే పాండవేయా విశాంపతే ॥ 11
తావత్ ప్రహరణీయాస్తే తత్ తుభ్యం తాత రోచతామ్ ।
అస్మత్పక్షో మహాన్ యావత్ యావత్ పాంచాలకో లఘుః ।
తావత్ ప్రహరణం తేషాం క్రియతాం మా విచారయ ॥ 12
రాజా! మనకొక ఉపాయం ఉంది. పాండవుల బలం గట్టిపడకముందే వారిని నాశనం చెయ్యాలి. మనసైన్యం బలమైంది. ద్రుపదుడు చిన్నరాజు. ఆలోచింపక వెంటనే వారిని సమూలంగా పెకలించివేయాలి. (11,12)
వాహనాని ప్రభూతాని మిత్రాణి చ కులాని చ ।
యావన్న తేషాం గాంధారే తావత్ విక్రమ పార్థివ ॥ 13
రాజా! గాంధారీనందనా! పాండవులు వాహనాలు, మిత్రులు, బంధువులను పోగుచేసికొనటానికి ముందే మనం వారిపై దాడి జరపాలి. (13)
యావచ్చ రాజా పాంచాల్యః నోద్యమే కురుతే మనః ।
సహ పుత్రైర్మహావీర్యైః తావత్ విక్రమ పార్థివ ॥ 14
రాజా! మహావీరులైన తన పుత్రులతో కలిసి మనమీద దాడిచెయ్యాలి. అనే ఆలోచన ద్రుపదునకు కలిగేలోపు నీవు అతనిపై విక్రమించాలి. (14)
యావన్నాయాతి వార్ష్ణేయః కర్షన్ యాదవవాహినీమ్ ।
రాజ్యార్థే పాండవేయానాం పాంచాల్యసదనం ప్రతి ॥ 15
కృష్ణుడు యాదవసైన్యం తీసుకొని పాండవుల రాజ్యంకోసం ద్రుపదుని భవనానికి రాకపూర్వమే నీవు పరాక్రమించాలి. (15)
వసూని వివిధాన్ భోగాన్ రాజ్యమేవ చ కేవలమ్ ।
నాత్యాజ్యమస్తి కృష్ణస్య పాండవార్థే కథంచన ॥ 16
కృష్ణుడు పాండవులకై ధనం, భోగాలు, రాజ్యం యావత్తూ ఏ సంకోచం లేకుండా త్యాగం చేయటానికి వెనుకంజవేయడు. (16)
విక్రమేణ మహీ ప్రాప్తా భరతేన మహాత్మనా ।
విక్రమేణ చ లోకాంస్త్రీన్ జితవాన్ పాకశాసనః ॥ 17
పరాక్రమంతో భూమినంతటిని భరతుడు తన అధీనంలోకి తెచ్చుకొన్నాడు. ఇంద్రుడు కూడా పరాక్రమం చేతనే ముల్లోకాలనూ జయించాడు. (17)
విక్రమం చ ప్రశంసంతి క్షత్రియస్య విశాంపతే ।
స్వకో హి ధర్మః శూరూణాం విక్రమః పార్థివర్షభ ॥ 18
రాజా! క్షత్రియులకు పరాక్రమమే అలంకారం. శూరులకు విక్రమం స్వకీయధర్మం. (18)
తే బలేన వయం రాజన్ మహతా చతురంగిణా ।
ప్రమథ్య ద్రుపదం శీఘ్రమ్ ఆనయామేహ పాండవాన్ ॥ 19
రాజా! చతురంగబలాలతో పాంచాలదేశానికి పోయి ద్రుపదుని ఓడించి పాండవులను బందీలుగా తీసికొనిరావాలి. (19)
న హి సామ్నా న దానేన న భేదేన చ పాండవాః ।
శక్యాః సాధయితుం తస్మాత్ విక్రమేణైవ తాన్జహి ॥ 20
సామదానభేదోపాయాలు పాండవులను బాధించలేవు. దండోపాయాన్ని ఆశ్రయించి పరాక్రమంతో వారిని లొంగదీయాలి. (20)
తాన్ విక్రమేణ జిత్వేమామ్ అఖిలాం భుంక్ష్వ మేదినీమ్ ।
అతో నాన్యం ప్రపశ్యామి కార్యోపాయం జనాధిప ॥ 21
పరాక్రమంతో శత్రువులను జయించి భూమినంతటిని అనుభవించు. రాజా! కార్యసిద్ధికి వేరొక ఉపాయం లేదు. (21)
వైశంపాయన ఉవాచ
శ్రుత్వా తు రాధేయవచః ధృతరాష్ట్రః ప్రతాపవాన్ ।
అభిపూజ్య తతః పశ్చాత్ ఇదం వచనమబ్రవీత్ ॥ 22
వైశంపాయనుడు ఇలా అన్నాడు - జనమేజయా! కర్ణుని మాటలు విని ధృతరాష్ట్రుడు అతనిని అభినందించి ఇలా అన్నాడు. (22)
ఉపపన్నం మహాప్రాజ్ఞే కృతాస్త్రే సూతనందనే ।
త్వయి విక్రమసంపన్నమ్ ఇదం వచనమీదృశమ్ ॥ 23
కర్ణా! నీవు బుద్ధిమంతుడవు. శస్త్రాస్త్రవిశారదుడవు. సూతకులానందకారకుడవు. నీకీ ఈ పౌరుషయుక్తాలైన మాటలు తగినవే. (23)
భూయ ఏవ తు భీష్మశ్చ ద్రోణో విదుర ఏవ చ ।
యువాం చ కురుతం బుద్ధిం భవేద్ యా నః సుఖోదయా ॥ 24
మీరిద్దరు భీష్మ, ద్రోణ, విదురులతో కలిసి ఆలోచించి మనకు సుఖ మే విధంగా కలుగుతుందో నిర్ణయించాలి. (24)
తత ఆనాయ్య తాన్ సర్వాన్ మంత్రిణః సుమహాయశాః ।
ధృతరాష్ట్రో మహారాజ మంత్రయామాస వై తదా ॥ 25
తరువాత మంత్రులు, భీష్ముడు, ద్రోణుడు మొదలైనవారిని రప్పించి ధృతరాష్ట్రుడు వారితో మంత్రాంగం చేశాడు. (25)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంభపర్వణి ధృతరాష్ట్రమంత్రణే ఏకాధికద్విశతతమోఽధ్యాయః ॥ 201 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున విదురాగమనరాజ్యలంభమను
ఉపపర్వమున ధృతరాష్ట్రమంత్రణ మను రెండువందల ఒకటవ అధ్యాయము. (201)