202. రెండు వందల రెండవ అధ్యాయము

పాండవులకు అర్ధరాజ్యమిమ్మని భీష్ముడు దుర్యోధనునకు చెప్పుట.

భీష్మ ఉవాచ
న రోచతే విగ్రహో మే పాండుపుత్రైః కథంచన ।
యథైవ ధృతరాష్ట్రో మే తథా పాండురసంశయమ్ ॥ 1
భీష్ముడు చెప్పాడు - పాండవులతో యుద్ధం చేయటం నాకు ఏవిధంగానూ ఇష్టంలేదు. నాకు ధృతరాష్ట్రుడెంతో పాండురాజా నిస్సంశయంగా అంతే. (1)
గాంధార్యాశ్చ యథా పుత్రాఃతథా కుంతీసుతా మమ ।
యథా చ మమ తే రక్ష్యాః ధృతరాష్ట్ర తథా తవ ॥ 2
ధృతరాష్ట్రా! గాంధారిపుత్రులు, కుంతీపుత్రులు నాకు, నీకు సమానమైనవారు. వారు నాకెట్లు రక్షింపతగినవారో నీకూ అట్లే. (2)
యథా చ మమ రాజ్ఞశ్చ తథా దుర్యోధనస్య తే ।
తథా కురూణాం సర్వేషామ్ అన్యేషామపి పార్థివ ॥ 3
రాజా! నీకు, నాకు పాండవుల రక్షణమ్ అవశ్యకర్తవ్యం. దుర్యోధనునికి మిగిలిన కురురాజులకు వారి రక్షణ ముఖ్యం. (3)
ఏవం గతే విగ్రహం తైర్నరోచే
సంధాయ వీరైర్దీయతామర్ధభూమిః ।
తేషామపీదం ప్రపితామహానాం
రాజ్యం పితుశ్చైవ కురూత్తమానామ్ ॥ 4
పాండవులతో యుద్ధం నాకిష్టం లేదు. వారికి అర్ధరాజ్యం ఇవ్వాలి. సంధి చేసుకోవాలి. ఈ రాజ్యం వారి తాతతండ్రులకు కూడ చెందిందే. (4)
దుర్యోధన యథా రాజ్యం త్వమిదం తాత పశ్యసి ।
మమ పైతృకమిత్యేవం తేఽపి పశ్యంతి పాండవాః ॥ 5
తండ్రీ! దుర్యోధనా ఈ రాజ్యాన్ని నీవు నీ తండ్రిదని, భావించావు. అట్లే వారు తమ తండ్రిదని తలంచారు. (5)
యది రాజ్యం న తే ప్రాప్తాః పాండవేయా యశస్వినః ।
కుత ఏవ తవాపీదం భారతస్యాపి కస్యచిత్ ॥ 6
కీర్తినొందిన పాండవులు ఈ రాజ్యాన్ని పొందలేనప్పుడు భరతసంతతికి చెందిన మీరైనా ఈ రాజ్యాన్ని పొందలేరు. (6)
అధర్మేణ చ రాజ్యం త్వం ప్రాప్తవాన్ భరతర్షభ ।
తే-పి రాజ్యమనుప్రాప్తాః పూర్వమేవేతి మే మతిః ॥ 7
భరతకుల శ్రేష్ఠా! అధర్మంగా ఈ రాజ్యాన్ని నీవు పొందావు. నీకంటె ముందు వారు ఈ రాజ్యం పొందారని నా అభిప్రాయం. (7)
మధురేణైవ రాజ్యస్య తేషామర్ధం ప్రదీయతామ్ ।
ఏతద్ధి పురుషవ్యాఘ్ర హితం సర్వజనస్య చ ॥ 8
పురుషశ్రేష్ఠా! ప్రేమతో వారికి అర్ధరాజ్యం ఇయ్యి. ఇది అందరికి శ్రేయస్కరం. (8)
అతోఽన్యథా చేత్ర్కియతే న హితం నో భవిష్యతి ।
తవాప్యకీర్తిః సకలా భవిష్యతి న సంశయః ॥ 9
దీనికి భిన్నంగా చేస్తే అది మనకు హితం కాదు. నీకు నిస్సందేహంగా అపకీర్తి కలుగుతుంది. (9)
కీర్తిరక్షనమాతిష్ఠ కీర్తిర్హి పరమం బలమ్ ।
నష్టకీర్తేర్మనుష్యస్య జీవితం హ్యఫలం స్మృతమ్ ॥ 10
నీకీర్తిని నీవే కాపాడుకో. కీర్తియే మానవులకు గొప్పబలం. కీర్తి నశించినవాని జీవితం నిష్ఫలం (10)
యావత్కీర్తిర్మనుష్యస్య న ప్రణశ్యతి కౌరవ ।
తావజ్జీవతి గాంధారే నష్టకీర్తిస్తు నశ్యతి ॥ 11
గాంధారీనందనా! మనుజులకీర్తి నశించనంతవరకు వారు జీవించినట్లు భావించాలి. కీర్తి నశించిన వారు చచ్చిన వారితో సమానం. (11)
తమిమం సముపాతిష్ట ధర్మమ్ కురుకులోచితమ్ ।
అనురూపం మహాబాహో పూర్వేషామాత్మనః కురు ॥ 12
కురుకులానికి తగిన ధర్మం ఆచరించు. నీ పూర్వులకు తగిన పనులు చెయ్యి. (12)
దిష్ట్యా ధ్రియంతే పార్థా హి దిష్ట్యా జీవసి సా పృథా ।
దిష్ట్యా పురోచనః పాపః న సకామోఽత్యయం గతః ॥ 13
అదృష్టవశాత్తు పాండవులు, కుంతి బ్రతికి బయటపడ్డారు. వారి అదృష్టం వల్లనే పురోచనుడు కోరిక తీరకుండా నశించాడు. (13)
యదా ప్రభృతి దగ్ధాస్తే కుంతిబ్జసుతాసుతాః ।
తదా ప్రభృతి గాంధారే న శక్నోమ్యభివీక్షితుమ్ ॥ 14
లోకే ప్రాణభృతాం కంచిత్ శ్రుత్వా కుంతీం తథాగతామ్ ।
న చాపి దోషేన తథా లోకో మన్యేత్ పురోచనమ్ ।
యథా త్వాం పురుషవ్యాఘ్ర లోకో దోషేణ గచ్ఛతి ॥ 15
గాంధారనందనా! కుంతి, పాండవులు లక్కయింటిలో దగ్ధమైనారని విన్న తర్వాత నేను ఏ ప్రాణిని ఈ లోకంలో కన్నెత్తి చూడలేదు. నరశ్రేష్ఠ! జనులు ఈ పనిలో నిన్ను నిందించినంతగా పురోచనుని నిందించటం లేదు. (14,15)
తదిదం జీవితం తేషాం తవ కిల్బిషనాశనమ్ ।
సమ్మంతవ్యం మహారాజ పాండవానాం చ దర్శనమ్ ॥ 16
కావున మహారాజా! పాండవులు జీవించి ఉండటమూ, వారి దర్శనమీ నీ పాపం తొలగిస్తుందని భావించు. (16)
న చాపి తేషాం వీరాణాం జీవతాం కురునందన ।
పిత్రోఽంశః శక్య ఆదాతుమ్ అపి వజ్రభృతా స్వయమ్ ॥ 17
కురునందనా! పాండవులు బ్రతికి ఉండగా వారి రాజ్యాన్ని స్వయంగా ఇంద్రుడైనా అపహరింప శక్యం కాదు. (17)
తే సర్వేఽవస్థితా ధర్మే సర్వే చైవైకచేతసః ।
అధర్మేణ నిరస్తాశ్చ తుల్యే రాజ్యే విశేషతః ॥ 18
వారు ధర్మపరులు. వారిది ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఈ రాజ్యంపై మీఇద్దరికి సమానభాగం ఉంది. కాని అధర్మపరుడైన నీచే పాండవులు తరిమివేయబడ్డారు. (18)
యది ధర్మస్త్వయా కార్యః యది కార్యం ప్రియం చ మే ।
క్షేమం చ యది కర్తవ్యం తేషామర్ధం ప్రదీయతామ్ ॥ 19
నీకు ధర్మంగా నడవాలని ఉన్నా, నాకు ప్రియం చేయాలని ఉన్నా, జనులు క్షేమంగా ఉండాలన్నా, వారి అర్ధరాజ్యం వారికి ఇయ్యి. (19)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంభపర్వణి భీష్మవాక్యే ద్వ్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 202 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున విదురాగమన రాజ్యలంభపర్వమను
ఉపపర్వమున భీష్మవాక్యమున రెండువందల రెండవ అధ్యాయము. (202)