200. రెండువందలవ అధ్యాయము
దుర్యోధన, ధృతరాష్ట్ర సంభాషణ.
ధృతరాష్ట్ర ఉవాచ
అహమప్యేవమేవైతత్ చికీర్షామి యథా యువామ్ ।
వివేక్తుం నాహమిచ్ఛామి త్వాకారం విదురం ప్రతి ॥ 1
ధృతరాష్ట్రుడు అన్నాడు - నేనూ మీ వలె ఈ విషయాన్నే చేయగోరుతాను. నా ఇంగితం విదురునికి తెలియకుండా జాగ్రత్తపడతాను. (1)
తతస్తేషాం గుణానేవ కీర్తయామి విశేషతః ।
నావబుధ్యేత విదురః మమాభిప్రాయమింగితైః ॥ 2
ప్రత్యేకించి విదురుని ఎదుట వారి గుణాలని కీర్తిస్తాను. నా అభిప్రాయాన్ని విదురుడు గ్రహింపకుండా నా చేష్టలను అదుపుచేస్తాను. (2)
యచ్చ త్వం మన్యసే ప్రాప్తం తత్ బ్రవీహి సుయోధన ।
రాధేయ మన్యసే యచ్చ ప్రాప్తకాలం వదాశు మే ॥ 3
దుర్యోధనా! నీ వనుకొన్నదేదో నాకు చెప్పు. కర్ణా! ఇపుడు నీవనుకొన్నదీ నాకు త్వరగా చెప్పు. (3)
దుర్యోధన ఉవాచ
అద్య తాన్ కుశలైర్విప్రైః సుగుప్తైరాప్తకారిభిః ।
కుంతీపుత్రాన్ భేదయాయః మాద్రీపుత్రౌ చ పాండవౌ ॥ 4
తండ్రీ! మనకు విశ్వాసపాత్రులను మన మీకార్యానికి నియోగించాలి. వారి ద్వారా కుంతీ పుత్రులను మాద్రీపుత్రుల నుంచి విడదీయాలి. (4)
అథవా ద్రుపదో రాజా మహద్భిర్విత్తసంచయైః ।
పుత్రాశ్చాస్య ప్రలోభ్యంతామ్ అమాత్యాశ్చైవ సర్వశః ॥ 5
పరిత్యజేత్ యథా రాజా కుంతీపుత్రం యుధిష్ఠిరమ్ ।
అథ తత్రైవ వా తేషాం నివాసం రోచయంతు తే ॥ 6
లేదా ధనరాశులలో ద్రుపదుని, అతని కుమారులను, మంత్రులను ప్రలోభపెట్టాలి. కుంతీపుత్రుడైన ధర్మజుజిజీ వారందరు వీడేటట్లు చేయాలి. వారిని ద్రుపదుడు తన నగరం నుంచి తరిమివేయాలి. లేదా బ్రాహ్మణుల ద్వారా పాండవులు అక్కడే ఉండటం మంచిదని చెప్పించాలి. (5,6)
ఇహైషాం దోషవద్వాసం వర్ణయంతు పృథక్ పృథక్ ।
తే భిద్యమానాస్తత్రైవ మనః కుర్వంతు పాండవాః ॥ 7
ఆ బ్రాహ్మణులు ఒక్కొక్కరితో విడివిడిగా హస్తినాపురనివాసం మీకు హానికరం అని చెప్పాలి. పాండవులు భయపడి పాంచాలదేశనివాసమే మంచిదని తలంచేటట్లు చేయాలి. (7)
అథవా కుశలాః కేచిత్ ఉపాయనిపుఆ నరాః ।
ఇతరేతరతః పార్థాన్ భేదయంత్వనురాగతః ॥ 8
ఉపాయనిపుణులు నేర్పరులైన, కొందరిని నియమించి వారు ప్రేమతో పాండవులను చేరి పాండవులలోనే భేధభావం కలిగించేలా చేయాలి. (8)
వ్యుత్థాపయంతు వా కృష్ణాం బహుత్వాత్ సుకరం హి తత్ ।
అథవా పాండవాంస్తస్యాం భేదయంతు తతశ్చ తామ్ ॥ 9
లేకపోతే ద్రౌపదియే పాండవులను మరచేలా చేయాలి. భర్తలెక్కువైనందువల్ల అది తేలిక. లేదా పాండవులకు ఆమెపై విరక్తి కల్గించాలి. అప్పుడు ఆమెకు వారిపై విరక్తి కలగాలి. (9)
భీమసేనస్య వా రాజన్ ఉపాయకుశలైర్నరైః ।
మృత్యుర్విధీయతాం ఛన్నైః స హి తేషాం బలాధికః ॥ 10
రాజా! సమర్థులైన యోధులు రహస్యంగా భీముని వధించాలి. వారందరిలో అతడే బలశాలి. (10)
తమాశ్రిత్య హి కౌంతేయః పురా చాస్మాన్ న మన్యతే ।
స హి తీక్ష్ణశ్చ శూరశ్చ తేషాం చైవ పరాయణమ్ ॥ 11
ఆ భీమసేనుని అండతోనే ధర్మజుడు మనలను పూర్వం నుంచి లెక్కపెట్టలేదు. భీముడు వీరుడు, శూరుడు. పాండవుల కతడే దిక్కు. (11)
తస్మింస్త్వభిహతే రాజన్ హతోత్సాహా హతౌజసః ।
యతిష్యంతే న రాజ్యాయ స హి తేషాం వ్యపాశ్రయః ॥ 12
రాజా! భీముని చంపితే పాండవులు ఉత్సాహపరాక్రమాలు లేనివారు అవుతారు. అప్పుడు రాజ్యానికై ప్రయత్నించరు. అతడే గదా వారికి సహాయకారి. (12)
అజేయా హ్యర్జునః సంఖ్యే పృష్ఠగోపే వృకోదరే ।
తమృతే ఫాల్గునో యుద్ధే రాధేయస్య న పాదభాక్ ॥ 13
భీముని సహాయం ఉంటే యుద్ధంలో అర్జునుడు తిరుగులేనివాడు. భీముడు మరణిస్తే అర్జునుడు కర్ణునకు నాల్గవవంతుకు కూడా సాటిరాడు. (13)
తే జానానాస్తు దౌర్బల్యం భీమసేనమృతే మహత్ ।
అస్మాన్ బలవతో జ్ఞాత్వా న యతిష్యంతి దుర్బలాః ॥ 14
బిమసేనుడు లేనప్పుడు వారి బలహీనతను వారు తెలిసికొని, మనలను బలవంతులనుగా గుర్తించి యుద్ధానికి సిద్ధం కారు. (14)
ఇహాగతేషు వా తేషు నిదేశవశవర్తిషు ।
ప్రవర్తిష్యామహే రాజన్ యథాశాస్త్రం నిబర్హణమ్ ॥ 15
రాజా! వారు హస్తినకే చేరి మన ఆజ్ఞావశులై ఉంటే వారిని నీతి శాస్త్రానుసారం నాశనమయ్యేట్లు చేద్దాం. (15)
అథవా దర్శనీయాభిః ప్రమదాభిర్విలోభ్యతామ్ ।
ఏకైకస్తత్ర కౌంతేయః తతః కృష్ణా విరజ్యతామ్ ॥ 16
అందమైన స్త్రీలను ప్రయోగించి వారిని ప్రలోభపరచాలి. అప్పుడు ఒక్కొకరిపట్ల ద్రౌపది విరక్తి చెందాలి. (16)
ప్రేష్యతాం చైవ రాధేయః తేషామాగమనాయ వై ।
తైస్తైః ప్రకారైః సంనీయ పాత్యంతామాప్తకారిభిః ॥ 17
పాండవులను తీసుకొనిరావటానికి రాధేయుని పంపాలి. వచ్చిన తర్వాత సన్నిహితుల చేతనే పాండవులను చంపించాలి. (17)
ఏతేషామప్యుపాయానాం యస్తే నిర్దోషవాన్ మతః ।
తస్య ప్రయోగమాతిష్ఠ పురా కాలోఽతివర్తతే ॥ 18
యావద్ధ్యకృతవిశ్వాసాః ద్రుపదే పార్థివర్షభే ।
తావదేవ హి తే శక్యాః న శక్యాస్తు తతః పరమ్ ॥ 19
ఈ ఉపాయాల్లో నిర్దోషమైన దాన్ని ప్రయోగిస్తే మీరు నిర్దోషులవుతారు. సమయం మించిపోతోంది. ద్రుపదునిపై మిగిలిన రాజులందరికీ విశ్వాసం కలుగక పూర్వమే ఈ పని ఆచరించాలి. లేకపోతే వారిని చంపడం కష్టసాధ్యం. (18,19)
ఏషా మమ మతిస్తాత నిగ్రహాయ ప్రవర్తతే ।
సాధ్వీ హి యది వాసాధ్వీ కిం వా రాధేయ మన్యసే ॥ 20
శత్రువుల నాశానికి ఈ ఉపాయం నాబుద్ధికి తోచింది. గుణదోషవిచారం మీరు చేయాలి. కర్ణా! ఈ పనిలో నీ అభిప్రాయం కావాలి. (20)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంభపర్వణి
దుర్యోధనవాక్యే ద్విశతతమోఽధ్యాయః ॥ 200 ॥
ఇది శ్రీమాహాభారతమున ఆదిపర్వమున విదురాగమన రాజ్యలంభపర్వమను
ఉపపర్వమున దుర్యోధనవాక్యమను రెండువందలవ అధ్యాయము. (200)