199. నూట తొంబది తొమ్మిదవ అధ్యాయము.
(విదురాగమన రాజ్యలంభపర్వము)
దుర్యోధనుని చింత, దురాలోచన.
వైశంపాయన ఉవాచ
తతో రాజ్ఞాం చరైరాప్తైః ప్రవృత్తిరుపనీయత ।
పాండవైరుపసంపన్నా ద్రౌపదీ పతిభిః శుభా ॥ 1
వైశంపాయనుడు అన్నాడు - రాజా! రాజులందరకు విశ్వసనీయులైన దూతల ద్వారా ఈ సమాచారం తెలిసింది. "శుభలక్షణయైన ద్రౌపది వివాహం పంచపాండవులతో జరిగింది. (1)
యేవ తత్ ధనురాదాయ లక్ష్యం విద్ధం మహాత్మనా ।
ప్ఽర్జునో జయతాం శ్రేష్ఠః మహాబాణధనుర్ధరః ॥ 2
ధనుస్సుతో లక్ష్యభేదం చేసిన అతడే ధనుర్విద్యలో శ్రేష్ఠుడై, సవ్యసాచియైన అర్జునుడు. (2)
యః శల్యం ముద్రరాజమ్ వై ప్రోక్షిప్యాపాతయత్ బలీ ।
త్రాసయామాస సంక్రుద్ధః వృక్షేణ పురుషాన్ రణే ॥ 3
న చాప్య సంభ్రమః కశ్చిద్ ఆసీత్ తత్ర మహాత్మనః ।
స భీమో భీమసంస్పర్శః శత్రుసేనాంగపాతనః ॥ 4
మద్రరాజైన శల్యుని ఎత్తి పడవేసినవాడు, శత్రువులను కోపించి చెట్టుతో బెదిరించినవాడు, ఎంతమాత్రం తొట్రుపాటు లేకుండా శత్రుసేనను పడగొట్టిన భయంకర స్పర్శ గల అతడే భీముడు. (3,4)
బ్రహ్మరూపధరాంచ్ర్ఛుత్వా ప్రశాంతాన్ పాండునందనాన్ ।
కౌంతేయాన్ మనుజేంద్రాణాం విస్మయః సమజాయత ॥ 5
బ్రాహ్మణవేషధారులై ప్రశాంతంగా కూర్చున్నవారే పాండవులు" అని తెలిసిన రాజులందరకు ఆశ్చర్యం కల్గింది. (5)
సపుత్రా హి పురా కుంతీ దగ్ధా జతుగృహే శ్రుతా ।
పునర్జాతానివ చ తాన్ తేఽమన్యంత నరాధిపాః ॥ 6
పుత్రులతో కుడి కుంతి లక్కయింటిలో కాలిపోయిందని విన్న రాజులకు వారు తిరిగి బ్రతికివచ్చినట్లు తోచింది. (6)
ధిగకుర్వంస్తథా భీష్మం ధృతరాష్ట్రం చ కౌరవమ్ ।
కర్మణాతినృశంసేన పురోచనకృతేన వై ॥ 7
పురోచనునిచే చేయబడిన ఈ క్రూరకర్మను తెలుసుకున్న రాజులందరు భీష్ముని, కురురాజైన ధృతరాష్ట్రుని అధిక్షేపించారు. (7)
(ధార్మికాన్ వృత్తసంపన్నాన్ మాతుః ప్రియహితే రతాన్ ।
యదా తానీదృశాన్ పార్థాన్ ఉత్సాదయితుమిచ్ఛతి ॥
ధృతరాష్ట్రుడు ధార్మికులు, ధర్మాత్ములు, తల్లిమేలు కోరువారు అయిన పాండవులను చంపింపగోరాడు.
తతః స్వయంవరే వృత్తే ధార్తరాష్ట్రాః స్మ భారత ।
మంత్రయంతః తతః సర్వే కర్ణసౌబలదూషితాః ॥
జనమేజయమహారాజా! స్వయంవరమైన పిమ్మట కర్ణ, శకునుల వశమైన ధార్తరాష్ట్రులు వారితో మంత్రాంగం సాగించారు.
శకునిరువాచ
కశ్చిచ్ఛత్రుః కర్శనీయః పిడనీయస్తథాపరః ।
ఉత్సాదనీయాః కౌంతేయాః సర్వే క్షత్రస్య మే మతాః ॥
శకుని చెప్పాడు. ఒక శత్రువు దుర్బలుడుగా చేయతగినవాడు, మరొకడు పీడింపతగినవాడు, పాండవులు మాత్రం సమస్త క్షత్రియులకు నాశనం చేయతగినవారని నామతం.
ఏవం పరాజితాః సర్వే యది యూయం గమిష్యథ ।
అకృత్వా సంవిదం కాంచిత్ తత్ వస్తప్యత్యసంశయమ్ ॥
ఇట్లు మీరు పరాజితులై పాండవ వినాశానికై ఏదయినా యుక్తి పన్నకపోతే మీరంతా నిస్సందేహంగా బాధపడవలసివస్తుంది.
అయం దేశశ్చ కాలశ్చ పాండవోద్ధరణాయ నః ।
న చేదేవం కరిష్యధ్వం లోకే హాస్యా భవిష్యథ ॥
సమూలంగా పాండవనాశాని కిదే సమయం, ఇదే తగిన ప్రదేశం. ఇప్పుడు ప్రతిక్రియ చేయకపోతే నలుగురిలో నవ్వులపాలవుతారు.
యమేతే సంశ్రితా వస్తుం కామయంతే చ భూమిపమ్ ।
సోఽల్పవీర్యబలో రాజా ద్రుపదో వై మతో మమ ॥
పాండవులు ఏ ద్రుపదుని ఆశ్రయం కోరుతున్నారో అతడు నా అభిప్రాయంలో బలపరాక్రమాలలో మిక్కిలి అల్పుడు.
యావదేతాన్ న జానంతి జీవతో వృష్టిపుంగవాః ।
చైదశ్చ పురుషవ్యాఘ్రః శిశుపాలః ప్రతాపవాన్ ॥
యదువీరులు, పురుషశ్రేష్ఠుడు, ప్రతాపవంతుడైన శిశుపాలుడు ఈ విషయాన్ని గ్రహింపక ముందు పాండవులను చంపాలి.
ఏకీభావం గతా రాజ్ఞా ద్రుపదేన మహాత్మనా ।
దురాధర్షతరా రాజన్ భవిష్యంతి న సంశయః ॥
రాజా! శ్రేష్ఠులైన రాజులందరు ద్రుపదునితో చేరితే వారు జయింపశక్యం కానివారవుతారు. సంశయం లేదు.
యావదత్వరతాం సర్వే ప్రాప్నువంతి నరాధిపాః ।
తావదేవ వ్యవస్యామః పాండవానాం వధం ప్రతి ॥
నరశ్రేష్ఠులు అంతా కలియక ముందే పాండవులను చంపటానికి ప్రయత్నం చెయ్యాలి.
ముక్తా జతుగృహాత్ భీమాత్ ఆశీవిషముఖాదివ ।
పునర్యదీహ ముచ్యంతే మహన్నో భయమావిశేత్ ॥
భయంకరమైన కాలసర్పం నుండి బయటపడినట్లు పాండవులు లక్కయింటి నుండి బయటపడ్డారు. మళ్లీ ఇపుడు మన నుండి చేజారిపోతే వారి వలన మనకు గొప్ప భయం కలుగుతుంది.
తేషామిహోపయాతానామ్ ఏషాం చ పురవాసినామ్ ।
అంతరే దుష్కరం స్థాతుం మేషయోర్మహతోరివ ॥
వృష్ణివంశీయులు, చేదివంశీయులు ఇక్కడకు వచ్చి, నాగరికులతో కలిస్తే వీరిమధ్య చేరిన మన పరిస్థితి పొట్టేళ్ళ మధ్య చేరినట్లు అవుతుంది.
హలధృక్ ప్రగృహీతాని బలాని బలినాం స్వయమ్ ।
యావన్న కురుసేనాయాం పతంతి పతగా ఇవ ॥
తావత్ సర్వాబిసారేన పురమేతత్ వినాశ్యతామ్ ।
ఏతదత్ర పరం మన్యే ప్రాప్తకాలం నరర్షభాః ॥
వరిచేలో మిడుతలదండు పడినట్లు బలరామునిసేనలు తమయోధులతో మనలను చేరుతాయి. అంతలోనే ఈ నగరాన్ని ముట్టడిమ్చి నాశనం చేయాలి. ఇదే మనకు ముఖ్యకర్తవ్యం.
వైశంపాయన ఉవాచ
శకునేర్వచనం శ్రుత్వా భాషమాణస్య దుర్మతేః ।
సౌమదత్తిరిదం వాక్యం జగాద పరమం తతః ॥
వైశంపాయనుడు అన్నాడు -
దుర్బుద్ధియైన శకుని మాటలు విని భూరిశ్రవుడు తెలివిగా ఇలా అన్నాడు.
సౌమదత్తిరువాచ
ప్రకృతీం సప్త వై జ్ఞాత్వా ఆత్మనశ్చ పరస్య చ ।
తథా దేశం చ కాలం చ షడ్విధాంశ్చ నయేత్ గుణాన్ ॥
సౌమదత్తి చెప్పాడు. ఉభయపక్షాల్లోని సప్తప్రకృతులను తెలిసి; దేశమూ, కాలమూ తెలిసికొని ఆరు రకాల నీతిని శత్రువుపై ప్రయోగించాలి.
షడ్గుణములు - సంధి, విగ్రహమ్, యానం, ఆసనం, ద్వైధీభావం, సమాశ్రయం.
స్థానం వృద్ధిం క్షయం చైవ భూమిం మిత్రాణి విక్రమమ్ ।
సమీక్ష్యాథాభియుంజీత పరం వ్యసనపీడితమ్ ॥
స్థానం, వృద్ధి, క్షయం, భూమి, మిత్రులు, పరాక్రమమ్ వీనిపై దృష్టి నుంచి శత్రువు ఆపదలోనున్నప్పుడు దాడి చెయ్యాలి.
తతోఽహం పాండవాన్ మన్యే మిత్రకోశసమన్వితాన్ ।
బలస్థాన్ విక్రమస్థాంశ్చ స్వకృతైః ప్రకృతిప్రియాన్ ॥
పాండవులిప్పుడు మిత్రకోశాలతో కుడియున్నారు. వారు బలవంతులు, పరాక్రమవంతులు, తమ చేష్టలతో రాజులందరికి ఇష్టులైనారు.
వపుషా హి తు భూతానాం నేత్రాణి హృదయాని చ ।
శ్రోత్రం మధురయా వాచా రమయత్యర్జునో నృణామ్ ॥
సహజంగా అందమైన అర్జునుడు ఇతరుల నేత్ర, హృదయాలను దోచుకొన్నాడు. మదురమైన వాక్కులతో చెవులకు కూడ తృప్తినిచ్చాడు.
న తు కేవలదైవేన ప్రజా భావేన భేజిరే ।
యద్ బభూవ మనఃకాంతం కర్మణా చ చకార తత్ ॥
ప్రారబ్ధం చేత మాత్రమే ప్రజలు అర్జునుని సేవింపలేదు. అర్జునుడు వారి మనస్సులకు ఇష్టమైన పనులు చెసి వారిని వశపరచుకొన్నాడు.
న హ్యయుక్తమ్ న చాసక్తం నానృతం న చ విప్రియమ్ ।
భాషితం చారుభాషస్య జజ్ఞే పార్థస్య భారతీ ॥
సుందరంగా మాట్లాడే అర్జునుని మాటలు వారిపట్ల ఎన్నడూ ఆయుక్తంగా ఉండేవి కావు. ఆసక్తిరహితంగా, అసత్యంగా, అప్రియంగా ఎన్నడూ లేవు.
తానేవం గుణసంపన్నాన్ సంపన్నాన్ రాజలక్షణైః ।
న తాన్ పశ్యామి యే శక్తాః సముచ్ఛేత్తుం యథా బలమ్ ॥
ఇట్లు గుణవంతులైన, రాజలక్షణాలతో కూడిన పాండవులను నాశనం చేయగల వారిని నేనింత వరకు చూడలేదు.
ప్రభావశక్తిర్విపులా మంత్రశక్తిశ్చ పుష్కలా ।
తథైవోత్సాహశక్తిశ్చ పార్థేష్వభ్యదికా సదా ॥
వారిలో ప్రభుశక్తి విస్తరించి ఉంది. మంత్రశక్తి పుష్కలం, ఉత్సాహాశక్తి సదా అధికం.
మౌలమిత్రబలానాం చ కాలజ్ఞో వై యుధిష్ఠిరః ।
సామ్నా దానేన భేదేన దండేనేతి యుధిష్ఠిరః ।
అమిత్రం యతతే జేతుం న రోషేణేతి మే మతిః ॥
యుధిష్ఠిరుడు సామ, దాన, భేద, దండ ప్రయోగాలలో నిపుణుడు. సమయోచితంగా స్వాభావిక బలాన్ని, మిత్రులను ప్రయోగిస్తాడు. రోషాన్ని విడచి శత్రువును జయిస్తాడు అని నా నమ్మకం.
పరిక్రీయ ధనైః శత్రూన్ మిత్రాణి చ బలాని చ ।
మూలం చ సుదృఢం కృత్వా హంత్యరీన్ పాండవస్తదా ॥
ధనంతో శత్రువులను, మిత్రులను, బలాన్ని కొని తన ఉనికిని దృఢపరచి శత్రుసంహారం చేయడంలో దిట్ట ధర్మరాజు.
అశక్యాన్ పాండవాన్ మన్యే దేవైరపి సవాసవైః ।
యేషామర్థే సదా యుక్తౌ కృష్ణసంకర్షణావుభౌ ॥
ఇంద్రాది దేవతలందరు కలిసినా పాండవులను ఏమీ చేయలేరు. శ్రీకృష్ణబలరాములిద్దరూ వారి పక్షాన్నే అనుసరిస్తారు అని నేను భావిస్తాను.
శ్రేయశ్చ యది మన్యధ్వం మన్మతం యది వో మతమ్ ।
సంవిదం పాండవైః సార్ధం కృత్వా యామ యథాగతమ్ ॥
మీరందరు నాహితవచనాలను అంగీకరించి ఆమోదిస్తే పాండవులతో సందిచేసుకొని ఎలా వచ్చామో అలాగే వెనుదిరిగిపోదాం.
గోపురాట్టాలకైరుచ్చైః ఉపతల్పశతైరపి ।
గుప్తం పురవరశ్రేష్ఠమ్ ఏతదద్భిశ్చ సంవృతమ్ ॥
తృణధాన్యేంధనరసైః తథా యంత్రాయుధౌషధైః ।
యుక్తం బహుకపాటైశ్చ ద్రవ్యాగారతుషాదికైః ॥
ఈ శ్రేష్ఠనగరం గోపురాలతో, అట్టాలకాలతో, చుట్టూ నీటితో సంరక్షింపబడింది. నాలుగు వైపుల గడ్డి, ధాన్యం, ఇంధనాలు, రసాలు, యంత్రాలు, ఆయుధాలు, ఔషదాలు, తలుపులు, ద్రవ్యాగారాలు, ఊక మొదలగు వాటితో నింపబడి ఉంది.
భీమోచ్ర్ఛితమహాచక్రం బృహదట్టాలసంవృతమ్ ।
దృఢప్రాకారనిర్యూహం శతఘ్నీజాలసంవృతమ్ ॥
భయంకరాలై విశాలాలైన చక్రాలతో, పెద్దపెద్ద అట్టాలకాలతో, దృఢమైన చీలలు, ఘడియలు, శతఘ్నలతో కూడి ఉంది.
ఐష్టకో దరవో వప్రః మానుషశ్చేతి యః స్మృతః ।
ప్రాకారకర్తృభిర్వీరైః నృగర్భస్తత్ర పూజితః ॥
ఆ పురానికి ఐష్టకం, దారవం, మానుషం అని ముడు ప్రాకారాలు ఉన్నాయి. మానుషాన్నే నృ(నర)గర్భం అంటారు. ఇది లోపల ఉంటుంది. ప్రాకార కర్తలు దీన్ని శ్రేష్ఠమయిన ప్రాకారంగా భావిస్తారు.
తదేతన్నరగర్భేణ పాండరేణ విరాజతే ।
సాలేనానేకతాలేన సర్వతః సంవృతం పురమ్ ॥
అనురక్తాః ప్రకృతయః ద్రుపదస్య మహాత్మనః ।
దానమానార్చితాః సర్వే బాహ్యాశ్చాభ్యంతరాశ్చ యే ॥
ఈ విధంగా ఈ నగరం తెల్లని నరగర్భంతో ప్రకాశిస్తోంది. ఎన్నో తాటి చెట్ల ప్రమాణం గల సాలవృక్షాలతో సంరక్షింపబడుతోంది. ప్రజలు, ప్రకృతులు ద్రుపదుని పట్ల అనురక్తులయ్యారు. బయటి, లోపలి కర్మచారులు అందరు దానమానాలచే పూజింపబడ్డారు.
ప్రతిరుద్ధానిమాన్ జ్ఞాత్వా రాజభిర్భీమవిక్రమైః ।
ఉపస్థాస్యంతి దాశార్హాః సముదగ్రోచ్ర్ఛితాయుధాః ॥
పాండవులు ముట్టడింపబడినారని విని యాద్వశ్రేష్ఠులందరు ప్రచండ శస్త్రాస్త్రాలతో మన మీద పడతారు.
తస్మాత్ సంధిం వయం కృత్వా ధార్తరాష్ట్రస్య పాండవైః ।
స్వరాష్ట్రమేవ గచ్ఛామః యద్యాప్తవచనం మమ ॥
ఏతన్మమ మతం సర్వైః క్రియతాం యది రోచతే ।
ఏతద్ధి సుకృతం మన్యే క్షేమం చాపి మహీక్షితామ్ ॥)
ఈ మాటలు మీకిష్టమైతే దుర్యోధనునికి పాండవులతో సంధిచేసి మన దేశానికి పోదాం. ఈ నా అభిప్రాయం అందరూ ఆదరించాలి. రాజుల కందరకు క్షేమమని భావించి ఈ ఉత్తమకర్తవ్యాన్ని ప్రబోధించాను.
వృత్తే స్వయంవరే చైవ రాజానః సర్వ ఏవ తే ।
యథాగతం విప్రజగ్ముః విదిత్వా పాండవాన్ వృతాన్ ॥ 8
స్వయంవరం పూర్తికాగా రాజులందరు ద్రౌపది పాండవులను వరించింది అని తెలిసి వచ్చినవారు వచ్చినట్లే వెనుకకు తిరుగసాగారు. (8)
అథ దుర్యోధనో రాజా విమనా భ్రాతృభిః సహ ।
అశ్వత్థామ్నా మాతులేన కర్ణేన చ కృపేణ చ ॥ 9
వినివృత్తో వృతం దృష్వా ద్రౌపద్యా శ్వేతవాహనమ్ ।
తం తు దుఃశాసనో వ్రీడన్ మందం మందమివాబ్రవీత్ ॥ 10
అర్జునుని ద్రౌపది వరించటం చూచి దుర్యోధనుని మనస్సు వికలమై అశ్వత్థామ, శకుని, కర్ణుడు, కృపులతో రాజధానికి తిరిగివచ్చాడు. అక్కడ దుశ్శాసనుడు అతనిని చూచి సిగ్గుపడి మెల్లమెల్లగా ఇలా పలికాడు. (9, 10)
యద్యసౌ బ్రాహ్మణో న స్యాత్ విందేత ద్రౌపదీం న సః ।
న హి తం తత్త్వతో రాజన్ వేద కశ్చిత్ ధనంజయమ్ ॥ 11
సోదరా! అర్జునుడు బ్రాహ్మణవేషం ధరించినందున ద్రౌపదిని పొందగలిగాడు. రాజా! అతనిని ధనంజయుడని ఎవ్వరూ గుర్తింపలేదు. (11)
దైవం చ పరమం మన్యే పౌరుషం చాప్యనర్థకమ్ ।
ధిగిస్తు పౌరుషం తాత ధ్రియంతే యత్ర పాండవాః ॥ 12
నేను అదృష్టమే గొప్పదని భావిస్తాను. పౌరుషం దైవం యెడల నిరర్థకం. ఇంతవరకు పాండవులు బ్రతికినందున మన పౌరుషాన్ని నిందించాలి. (12)
ఏవం సంభాషమాణాస్తే నిందంతశ్చ పురోచనమ్ ।
వివిశుర్హాస్తినపురం దీనా విగతచేతసః ॥ 13
ఇలా మాట్లాడుతూ, పురోచనుని నిందిస్తూ దీనులై దుఃఖంతో హస్తినకు చేరారు. (13)
త్రస్తా విగతసంకల్పాః దృష్ట్వా పార్థాన్ మహౌజసః ।
ముక్తాన్ హవ్యభుజశ్చైవ సంయుక్తాన్ ద్రుపదేన చ ॥ 14
ధృష్టద్యుమ్నం తు సంచింత్య తథైవ చ శిఖండినమ్ ।
ద్రుపదశ్చాత్మజాంశ్చాన్యాన్ సర్వయుద్ధవిశారదాన్ ॥ 15
లాక్షాగృహాగ్ని నుండి బయటపడిన పాండవులకు ద్రుపదునితో సంబంధం ఏర్పడిందని తెలిసి; ధృష్టద్యుమ్నుని, శిఖండిని, ఇతర ద్రుపద కుమారులను తలచుకొని కౌరవులు ఎంతో భయపడ్డారు. (14,15)
విదురస్త్వథ తాం శ్రుత్వా ద్రౌపదీ పాండవైర్వృతాన్ ।
వ్రీడితాన్ ధార్తరాష్ట్రాంశ్చ భగ్నదర్పానుపాగతాన్ ॥ 16
తతః ప్రీతమనాః క్షత్తా ధృతరాష్ట్రం విశాంపతే ।
ఉవాచ దిష్ట్వా కురవః వర్ధంత ఇతి విస్మితః ॥ 17
పాండవులు ద్రౌపదిని వివాహమాడారు అని విని, సిగ్గుపడుతూ గర్వభంగం పొందిన ధార్తరాష్ట్రులను చూచి ప్రీతితో విదురుడు ధృతరాష్ట్రుని చేరి ఇలా అన్నాడు. మహారాజా! మనభాగ్యవశాన కౌరవవంశం వృద్ధి పొందుతోంది. (16,17)
వైచిత్రవీర్యస్తు వచో నిశమ్య విదురస్య తత్ ।
అబ్రవీత్ పరమప్రీతో దిష్ట్యాదిష్ట్యేతి భారత ॥ 18
భారతా! ధృతరాష్ట్రుడు విదురుని మాటలు విని ప్రసన్నుడై అదృష్టం, భాగ్యం అన్నాడు. (18)
మన్యతే స వృతం పుత్రం జ్యేష్ఠం ద్రుపదకన్యయా ।
దుర్యోధనమవిజ్ఞానాత్ ప్రజ్ఞాచక్షుర్నరేశ్వరః ॥ 19
గుడ్డివాడైన ధ్ఱ్రుతరాష్ట్రుడు అజ్ఞానవశుడై ద్రుపదకన్యచే తన పుత్రుడు దుర్యోధనుడు వరింపబడినాడని భావించాడు. (19)
అథ త్వాజ్ఞాపయామాస ద్రౌపద్యా భూషణం బహు ।
ఆనీయతాం వై కృష్ణేతి పుత్రం దుర్యోధనం తదా ॥ 20
వెంటనే "ద్రౌపదికి ఆభరణాలను తెమ్ము" అని ఆజ్ఞాపించాడు, ద్రౌపదిని తీసుకొనిరమ్మని దుర్యోధనునితో పలికాడు. (20)
అథాస్య పశ్చాత్ విదురః ఆచఖ్యౌ పాండవాన్ వృతాన్ ।
సర్వాన్ కుశలినో వీరాన్ పూజితాన్ ద్రుపదేన హ ॥ 21
వెనుకనుంచి విదురుడు ద్రౌపది పాండవులను వరించింది అనీ అందరు క్షేమమనీ, ద్రుపదునిచే గౌరవింపబడ్డారనీ తెలిపాడు. (21)
తేషాం సంబంధినశ్చాన్యాన్ బహూన్ బలసమన్వితాన్ ।
సమాగతాన్ పాండవేయైః తస్మిన్నేవ స్వయంవరే ॥ 22
ఆ స్వయంవరంలో వారి బంధువులను, సైనికశక్తిని, కలుసుకొనుటకు వచ్చిన వారిని గూర్చి ధృతరాష్ట్రునికి విదురుడు తెలిపాడు. (22)
(ఏతచ్ర్ఛుత్వా తు వచనం విదురస్య నారాధిపః ।
ఆకారచ్ఛాదనార్థం తు దిష్ట్యా దిష్ట్యేతి చాబ్రవీత్ ॥
విదురుని మాటలు విని ధృతరాష్ట్రుడు తన ఇంగితాన్ని కప్పిపుచ్చటానికి అదృష్టం, అదృష్టం అన్నాడు.
ధృతరాష్ట్ర ఉవాచ
ఏవం విదుర భద్రం తే యది జీవంతి పాండవాః ।
సాధ్వాచారా తథా కుంతీ సంబంధో ద్రుపదేన చ ॥
అన్వవాయే వసోర్జాతః ప్రకృష్టే మాన్యకే కులే ।
వ్రతవిద్యాతపోవృద్ధః పార్థివానాం ధురంధరః ॥
పుత్రాశ్చాస్య తథా పౌత్రా సర్వే సుచరితవ్రతాః ।
తేషాం సంబంధినశ్చాన్యే బహవః సుమహాబలాః ॥)
ధృతరాష్ట్రుడు అన్నాడు - పాండవులు జీవించి ఉన్నారన్న వార్త విన్పించిన నీకు శుభం కలుగుగాక. కుంతి పరమసాధ్వి. ద్రుపదునితో సంబంధం మనం కోరతగినదే. అతడు మాననీయమైన వసువు వంశంలో జన్మించాడు. వ్రతం, విద్య, తపస్సులలో వృద్ధుడు, రాజులలో అగ్రగణ్యుడు. అతని పుత్ర పౌత్రులందరు నియమపాలనం చేసేవారు. అతని బంధువులందరు మహాబలులు.
యథైవ పాండోః పుత్రాస్తు తథైవాభ్యధికా మమ ।
యథా చాభ్యధికా బుద్ధిః మమ తాన్ ప్రతి తచ్ఛృణు ॥ 23
పాండురాజునకున్న పుత్రప్రేమకంటె పాండవులపై నాకు ప్రీతి ఉంది. వారి పట్ల నా మనస్సులోని మొగ్గును పూర్తిగా విను. (23)
కీ హి ద్రుపదమాసాద్య మిత్రం క్షత్రః సబాంధవమ్ ।
వ బుభూషేత్ భవేనార్థీ గతశ్రీరపి పార్థివః ॥ 24
వైశంపాయన ఉవాచ
తం తథా భాషమాణం తు విదురః ప్రత్యభాషత ।
నిత్యం భవతు తే బుద్ధిః ఏషా రాజన్ శతం సమాః ।
ఇత్యుక్త్వా ప్రయయౌ రాజన్ విదురః స్వ నివేశనమ్ ॥ 26
వైశంపాయనుడు చెప్పాడు - జనమేజయా! అలా మాటలాడే ధృతరాష్ట్రునితో విదురుడు 'రాజా! నీకు పెక్కేండ్లు ఇట్టి బుద్ధి నిలుచుగాక!' అని పలికి తన భవనానికి వెళ్లిపోయాడు. (26)
తతో దుర్యోధనాశ్చాపి రాధేయశ్చ విశాం పతే ।
ధృతరాష్ట్రముపగమ్య వచోఽబ్రూతామిదం తదా ॥ 27
తరువాత దుర్యోధనుడు, కర్ణుడు కూడ ధృతరాష్ట్రుని చేరి ఇలా మాట్లాడారు. (27)
సంనిధౌ విదురస్య త్వాం దోషం వక్తుం న శక్నువః ।
వివిక్తమితి వక్ష్యావః తవేదం చికీర్షితమ్ ॥ 28
సపత్నవృద్ధిం యత్ తాత మన్యసే వృద్ధిమాత్మనః ।
అభిష్టౌషి చ యత్ క్షత్తుః సమీపే ద్విషతాం వర ॥ 29
విదురుని ఎదుట మీతో మేము దోషాలను చెప్పలేము. ఇది ఏకాంతం. మిమ్ములను చేరాం. మీ అభీష్టం తెల్పండి. తండ్రీ! మీరు మా శత్రువులవృద్ధిని మన అభివృద్ధిగా భావిస్తున్నారు. పైగా విదురుని ఎదుట వారిని ప్రశంసిస్తున్నారు. (28,29)
అన్యస్మిన్ నృప కర్తవ్యే త్వమన్యత్ కురుషేఽనఘ ।
తేషాం బలవిఘాతో హి కర్తవ్యస్తాత నిత్యశః ॥ 30
పుణ్యాత్ముడా! మనం చేయతగినది వేరు. మీరు ఆచరించేది వేరు. పాండవుల శక్తిని తగ్గించటమే మనం ఎల్లప్పుడూ చేయదగినది. (30)
తే వయం ప్రాప్తకాలస్య చికీర్షాం మంత్రయామహే ।
యథా నో న గ్రసేయుస్తే సపుత్ర బలబాంధవాన్ ॥ 31
సమయానికి తగిన కర్తవ్యం మనం ఆచరించాలి. ఆ విషయమే మాట్లాడాలి. వారు మనలను బంధు, పుత్ర, బలసహితంగా నాశనం కావించకుండా చేయాలి. (31)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి విదురాగమన రాజ్యలంభపర్వణి దుర్యోధనవాక్యే నవనవత్యధిక శతతమోఽధ్యాయః ॥ 199 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున విదురాగమన రాజ్యలంభపర్వమను
ఉపపర్వమున దుర్యోధనవాక్యము అను నూటతొంబది తొమ్మిదవ అధ్యాయము. (199)
(దాక్షిణాత్య అధికపాఠము 39 1/2 శ్లోకాలు కలిపి మొత్తం 70 1/2 శ్లోకాలు)