197. నూట తొంబదియెడవ అధ్యాయము

పంచపాండవులతో ద్రౌపది వివాహము.

ద్రుపద ఉవాచ
అశ్రుత్వైవం వచనం తే మహర్షే
మయా పూర్వం యతితం సంవిధాతుమ్ ।
న వై శక్యం విహితస్యాపయానం
తదేవేదముపపన్నం విధానమ్ ॥ 1
ద్రుపదుడు చెప్పాడు - మహర్షీ! మీ మాటలు వినక పూర్వం ద్రౌపదికి ఒకనితోనే వివాహం చేయాలని సంకల్పం. విధాత విధానాన్ని ఎదిరించగల శక్తి ఎవరికీలేదు. అయిదుగురితో వివాహమే ఉచితం. (1)
దిష్టస్య గ్రంథిరనివర్తనీయః
స్వకర్మణా విహితం నేహ కించిత్ ।
కృతం నిమిత్తం హి వరైకహేతోః
తదేవేదముపపన్నం విధానమ్ ॥ 2
అదృష్టాన్ని ఎవ్వరూ తప్పించలేరు. స్వయంగా ప్రయాసపడి ఏమీ చేయలేరు. ఒకవరునికై చేసిన యత్నం అయిదుగురు వరులనిచ్చింది. కాబట్టి ముందు చేసిన నిర్ణయమే ఉచితం. (2)
యథైవ కృష్ణోక్తవతీ పురస్తాత్
నైకం పతిం మే భగవాన్ దదాతు ।
స చాప్యేనం వరమిత్యబ్రవీత్ తాం
దేవో హి వేత్తా పరమం యదత్ర ॥ 3
పూజ్యుడా! ఫూర్వజన్మలో ద్రౌపది శంకరునితో చాలాసార్లు పతిని కోరగా అతడట్లే వరమిచ్చాడు. ఇందు దాగిన రహస్యం పరమాత్మకే తెలుసు. (3)
యది చైవం విహితః శంకరేణ
ధర్మోఽధర్మో వా నాత్ర మమాపరాధః ।
గృహ్ణంత్విమే విధివత్ పాణిమస్యాః
యథోపజోషం విహితైషాం హి కృష్ణా ॥ 4
శంకరుని అనుశాసనమే అయితే ధర్మాధర్మప్రసక్తి, నా అపరాధమూ లేవు. ఈమె వీరిదే కావున విధివిధానంగా పాండవులు ఈమెను పరిగ్రహిస్తారు. (4)
వైశంపాయన ఉవాచ
తతోఽబ్రవీత్ భగవాన్ ధర్మరాజమ్
అద్వైవ పుణ్యాహముత వః పాండవేయ ।
అద్య పౌష్యం యోగముపైతి చంద్రమాః
పాణిం కృష్ణాయాస్త్వం గృహాణాద్య పూర్వమ్ ॥ 5
వైశంపాయనుడు అన్నాడు - పిమ్మట భగవంతుడైన వ్యాసుడు ధర్మజునితో పలికాడు. ధర్మరాజా! నేడు ద్రౌపదిని వివాహమాడు. ఇంద్రుడు పుష్యమీనక్షత్రంతో కలుస్తాడు. కావున నీవు ముందుగా ద్రౌపదిని వివాహమాడు. (5)
తతో రాజా యజ్ఞసేనః సపుత్రః
జన్యార్థముక్తం బహు తత్ తదగ్ర్యమ్ ।
సమానయామాస సుతాం చ కృష్ణాం
ఆప్లావ్య రత్నైర్బహుభిర్విభూష్య ॥ 6
వ్యాసాదేశానుసారం యజ్ఞసేనుడు పుత్రులతో కలిసి వధూవరులకవసరమైన ద్రవ్యాలను తెప్పించి స్నానాదులు చేయించి ద్రౌపదిని విలువైన రత్నమాణిక్యాలతో అలంకారం చేయించాడు. (6)
తతస్తు సర్వే సుహృదో నృపస్య
సమాజగ్ముః సహితా మంత్రిణశ్చ ।
ద్రష్టుం వివాహం పరమప్రతీతాః
ద్విజాశ్చ పౌరాశ్చ యథా ప్రధానాః ॥ 7
రాజు స్నేహితులు, మంత్రులు, బ్రాహ్మణులు, పౌరులు అందరు మిక్కిలి ప్రసన్నులై పెద్దలను ముందు ఉంచుకొని కూర్చున్నారు. (7)
తతోఽస్య వేశ్మాగ్ర్యజనోపశోభితం
విస్తీర్ణపద్మోత్పలభూషితాజిరమ్ ।
బలౌఘరక్షౌఘవిచిత్రమాబభౌ
నభో యథా నిర్మలతారకాన్వితమ్ ॥ 8
ద్రుపదరాజభవనం ఉత్తమపురుషులతో ప్రకాశిస్తోంది. అతని భవనప్రాంగణం కలువలతో, పద్మాలతో వెలిగిపోతోంది. అక్కడ చతురంగసేనలు చిత్రంగా అమరి ఉన్నాయి. ఆరాజభవనం నిర్మల నక్షత్రాలతో వెలిగే ఆకాశం వలె ఉంది. (8)
తతస్తు తే కౌరవరాజపుత్రాః
విభూషితాః కుండలినో యువానః ।
మహార్హవస్త్రాంబరచందనోక్షితాః
కృతాభిషేకాః కృతమంగళక్రియాః ॥ 9
అక్కడ యువకులు, అలంకృతులు, కుండలాలంకృతులు. స్నానాలు చేసి విలువైన పట్టుబట్టలు కట్టుకొని, చందనం పూసికొని, మంగళక్రియలు ఆచరిస్తూ పాండవులున్నారు. (9)
పురోహితేనాగ్నిసమాన వర్చసా
సహైవ ధౌమ్యేన యథావిధి ప్రభో ।
క్రమేణ సర్వే వివిశుస్తతః సదః
మహర్షభా గోష్ఠమివాభినందినః ॥ 10
క్రమంగా ప్రసన్నతతో పాండవులు గోశాలలోనికి వృషభాలు చేరినట్లు అగ్నివలె వెలిగే తమపురోహితుడు ధౌమ్యునితో కలిసి శాస్త్రప్రకారంగా సదస్సులో ప్రవేశించారు. (10)
తతః సమాధాయ స వేదపారగః
జుహావ మంత్రైర్జ్వలతీం హుతాశనమ్ ।
యుధిష్ఠిరం చాప్యుపనీయ మంత్రవిత్
నియోజయామాస సహైవ కృష్ణయా ॥ 11
పిమ్మట వేదపారంగతుడు, విద్వాంసుడు, మంత్రజ్ఞుడు, పురోహితుడు అయిన ధౌమ్యుడు అగ్నిని వెలిగించి మంత్రాహుతుల నిచ్చి యుధిష్ఠిరుని పిలిచి ద్రౌపదికి సూత్రం కట్టించాడు. (11)
ప్రదక్షిణం తా ప్రగృహీతపాణీ
సమానయామాస స వేదపారగః ।
తతోఽభ్యనుజ్ఞాయ తమాజిశోభినం
పురోహితో రాజగృహాత్ వినిర్యయౌ ॥ 12
వేదనిధి అయిన ధౌమ్యుడు వారిద్దరిచే పాణిగ్రహణం చేయించి అగ్నికి ప్రదక్షిణం చేయించాడు. ధర్మజుని ఆజ్ఞపై పురోహితుడు రాజభవనం వదలినాడు. (12)
క్రమేణ చానేన నరాధిపాత్మజాః
వరస్త్రియస్తే జగృహుస్తదా కరమ్ ।
అహన్యహన్యుత్తమరూపధారిణః
మహారథాః కౌరవవంశవర్ధనాః ॥ 13
కౌరవకులోన్నతికై మహారథులైన నలువురు పాండవులూ క్రమంగా ఒక్కొక్కరోజున ఒక్కొక్కరు ద్రౌపదిపాణిగ్రహణం చేశారు. (13)
ఇదం చ తత్రాద్భుతరూపముత్తయమ్
జగాద దేవర్షిరతీతమానుషమ్ ।
మహానుభావా కిల సా సుమధ్యమా
బభూవ కన్యైవ గతే గతేఽహని ॥ 14
దేవర్షి అచటి అద్భుతమూ, ఉత్తమమూ, అతిమానుషమూ అయిన సంఘటనను తెలిపాడు. మహానుభావురాలు, సన్ననినడుముగల ద్రౌపది ప్రతిదినమూ వివాహానంతరం కన్యగానే ఉందట. (14)
కృతే వివాహే ద్రుపదో ధనం దదౌ
మహారథేభ్యో బహురూపముత్తమమ్ ।
శతం రథానాం వరహేమమాలినాం
చతుర్యుజాం హేమఖలీనమాలినామ్ ॥ 15
వివాహానంతరం ద్రుపదుడు మహారథులైన పాండవులకు వివిధవస్తుసామగ్రిని, సువర్నమాలలు కల నూరు రథాలను కానుకలుగా ఇచ్చాడు. (15)
శతం గజానామపి పద్మినాం తథా
శతం గిరీణామివ హేమశృంగిణామ్ ।
తథైవ దాసీశతమగ్ర్యయౌవనం
మహార్హవేషాభరణాంబరస్రజమ్ ॥ 16
పద్మమూ, శంఖమూ గల నూరు ఉత్తమ గజాలను, బంగారు తొడిగిన కొమ్ములు గల వంద ఏనుగులను, యౌవనవతులైన వందమంది దాసీజనాన్ని, విలువైన వస్త్రాలను, ఆభరణాలనూ కానుక చేశాడు. (16)
పృథక్ పృథక్ దివ్యదృశాం పునర్దదౌ
తదా ధనం సౌమకిరగ్నిసాక్షికమ్ ।
తథైవ వస్త్రాణి విభూషణాని
ప్రభావయుక్తాని మహానుభావః ॥ 17
చంద్రవంశజుడు, మహానుభావుడైన ద్రుపదుడు దివ్యమైన చూపులు గల పాండవులందరికి వేరువేరుగా అగ్నిసాక్షికంగా ధనాన్ని, వస్త్రాలనూ, అధికారసూచకాలయిన ఆభరణాలనూ అర్పించాడు. (17)
కృతే వివాహే చ తతస్తు పాండవాః
ప్రభూతరత్నాముపలభ్య తాం శ్రియమ్ ।
విజహ్రురింద్రప్రతిమా మహాబలాః
పురే తు పాంచాలనృపస్య తస్య హి ॥ 18
వివాహానతరం మహాబలశాలులూ, ఇంద్రసమానులూ అయిన పాండవులు అనంతరత్నరాశులతో పాటు లక్ష్మివంటి ద్రౌపదిని పొంది ఆ పాంచాలరాజునగరంలో విహరించసాగారు. (18)
(సర్వేఽప్యతుష్యన్ నృప పాండవేయాః
తస్యా శుభైః శీల సమాధివృత్తైః ।
సా చాప్యేషా యాజ్ఞసేనీ తదానీం
వివర్ధయామాస ముదం స్వసువ్రతైః ॥)
రాజా! పాండవులందరూ ద్రౌపది ఏకాగ్రత, సచ్ఛీలం, సదాచారాలతో సంతుష్టులయ్యారు. ఈ విధంగా ద్రౌపది తన సద్ర్వతాలతో పాండవుల ఆనందాన్ని పెంచసాగింది.
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి వైవాహికపర్వణి ద్రౌపదీవిఽఆహే సప్తనవత్యధిక శతతమోఽధ్యాయః ॥ 197 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున వైవాహికపర్వమను
ఉపపర్వమున ద్రౌపదీవివాహమను నూటతొంబది ఏడవ అధ్యాయము. (197)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి 19 శ్లోకాలు)