152. నూట ఏబది రెండవ అధ్యాయము
భీమ హిడింబుల యుద్ధము.
వైశంపాయన ఉవాచ
తాం విదిత్వా చిరగతాం హిడింబో రాక్షసేశ్వరః ।
అవతీర్య ద్రుమాద్ తస్మాద్ ఆజగామాశు పాండవాన్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! రాక్షసరాజు హిడింబుడు, తన సోదరి వెళ్ళి చాలా సేపు అయిందని భావించి ఆ చెట్టు నుండి క్రిందకు దిగి వేగంగా పాండవుల వైపు వచ్చాడు. (1)
లోహితాక్షో మహాబాహుః ఊర్ధ్వకేశో మహాననః ।
మేఘసంఘాతవర్ష్మా చ తీక్ష్ణదంష్ట్రో భయానకః ॥ 2
హిడింబుడు ఎర్రని కళ్ళు, పెద్ద పెద్ద భుజాలు, నిక్కబొడుచుకొన్న జుట్టు కలిగి మేఘసమూహంలా నల్లని శరీరంతో ఉన్నాడు. వాడికోరలవాడు. అతని ఆకారం మిక్కిలి భయంకరంగా ఉంది. (2)
తమాపతంతం దృష్ట్వైవ తథా వికృతదర్శనమ్ ।
హిడింబోవాచ విత్రస్తా భీమసేన మిదం వచః ॥ 3
ఆవిధంగా వికృతమైన రూపంతో వచ్చిపడుతున్న హిడింబుని చూచి, భయపడి, హిడింబ భీమసేనునితో ఇలా అంది. (3)
ఆపతత్యేష దుష్టాత్మా సంక్రుద్ధః పురుషాదకః ।
సాహం త్వాం భ్రాతృభిస్సార్ధం యద్ బ్రవీమి తథా కురు ॥ 4
ఈ దుర్మార్గుడు పురుష భక్షకుడు, చాళా కోపంతో వస్తున్నాడు. కనుక నీవు, నీ సోదరులు నేను చెప్పినట్లు చెయ్యండి. (4)
అహం కామగమా వీర రక్షోబలసమన్వితా ।
ఆరుహేమాం మమ శ్రోణిం నేష్యామి త్వాం విహాయసా ॥ 5
వీరా! నేను స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలను. నాకు రాక్షసబలమున్నది. మీరందరూ నా నడుం మీద అక్కండి. మిమ్మల్ని ఆకాశమార్గంలో తీసుకుపోతాను. (5)
ప్రబోధయైతాన్ సంసుప్తాన్ మాతరం చ పరంతప ।
సర్వానేవ గమిష్యామి గృహీత్వా వో విహాయసా ॥ 6
శత్రుమర్దనా! నిద్రిస్తున్న సోదరులను, తల్లిని మేల్కొలుపు. మీ అందరినీ తీసుకుని ఆకాశమార్గంలో వెళ్ళిపోతాను. (6)
భీమ ఉవాచ
మా భైస్త్వం పృథుసుశ్రోణి నైష కశ్చిన్మయి స్థితే ।
అహమేనం హనిష్యామి ప్రేక్షన్త్యాస్తే సుమధ్యమే ॥ 7
భీముడన్నాడు. విశాలమైన పిరుదులున్నదానా! నీవు భయపడకు. నా ఎదుట ఈ రాక్షసుడు నిలబడలేడు. అందమైన నడుమున్నదానా! నీవు చూస్తుండగానే వీడిని చంపేస్తాను. (7)
నాయం ప్రతిబలో భీరు రాక్షసాపసదో మమ ।
సోఢుం యుధి పరిస్పందమ్ అథవా సర్వరాక్షసాః ॥ 8
పిరికిదానా! ఈ నీచరాక్షసుడు నాకు సరిజోడు కాడు. యుద్ధంలో నాతాకిడిని వీడే కాదు రాక్షసులందరూ కలిసినా సహించలేరు. (8)
పశ్య బాహూ సువృత్తౌ మే హస్తిహస్తనిభావిమౌ ।
ఊరూ పరిఘసంకాశౌ సంహతం చాప్యురో మహత్ ॥ 9
కండలు తిరిగి గుండ్రంగా ఉన్న ఏనుగు తొండాల్లాంటి నా బాహువులు చూడు. కోటగడియల్లాంటి తొడలను చూడు. నా విశాలమైన వక్షఃస్థలాన్ని చూడు. (9)
విక్రమం మే యథేంద్రస్య సాద్య ద్రక్ష్యసి శోభనే ।
మావమంస్థాః పృథుశ్రోణి మత్వా మామిహ మానుషమ్ ॥ 10
సుందరీ! ఇంద్రుని పరాక్రమంలాంటి నాపరాక్రమాన్ని నేడు నీవు చూస్తావు. పెద్ద పిరుదులదానా! నన్ను కేవలం మనుష్యునిగా భావించి చిన్నచూపు చూడవద్దు. (10)
హిడింబోవాచ
నావమన్యే నరవ్యాఘ్ర త్వామహం దేవరూపిణమ్ ।
దృష్టప్రభావస్తు మయా మానుషేష్వేవ రాక్షసః ॥ 11
హిడింబ అన్నది. నరోత్తమా! దేవతారూపుడవు. నేను అవమానించను. కాని మనుష్యుల విషయంలో ఈ రాక్షసుడు హిడింబుడు ఎన్నోసార్లు తన ప్రతాపాన్ని చూపించాడు. (11)
వైశంపాయన ఉవాచ
తథా సంజల్పతస్తస్య భీమసేనస్య భారత ।
వాచః శుశ్రావ తాః క్రుద్ధః రాక్షసః పురుషాదకః ॥ 12
వైశంపాయనుడన్నాడు. జనమేజయా! భీమసేనుడీ విధంగా మాట్లాడుతుండగా, ఆ మాటల్ని క్రుద్ధుడై, నరమాంస భక్షకుడైన హిడింబుడు విన్నాడు. (12)
అవేక్షమాణస్తస్యాశ్చ హిడింబో మానుషం వపుః ।
స్రగ్దామపూరితశిఖం సమగ్రేందునిభాననమ్ ॥ 13
సుభ్రూనాసాక్షికేశాంతం సుకుమారనఖత్వచమ్ ।
సర్వాభరణ సంయుక్తం సుసూక్ష్మాంబర వాససమ్ ॥ 14
హిడింబుడు తన సోదరి యొక్క మనుష్యరూపాన్ని చూశాడు. ఆమె కొప్పుతో పూలమాలను తురుముకొంది. ముఖం పూర్ణచంద్రుని లా వెలిగిపోతోంది. కనుబొమలు, ముక్కు, వాలుజడ చూడముచ్చటగా ఉన్నాయి. గోళ్ళు చర్మం ఎంతో మృదువుగా ఉన్నాయి. ఆమె అన్ని అలంకారాలనూ ధరించింది. సన్నని జిలుగు చీర ధరించింది. (13,14)
తాం తథా మానుషం రూపం బిభ్రతీం సుమనోహరమ్ ।
పుంస్కామాం శంకమానశ్చ చుక్రోధ పురుషాదకః ॥ 15
ఆ నరమాంసభక్షకుడు మిక్కిలి చక్కని మనుష్యరూపం ధరించిన హిడింబను చూసి భీముడిని కామిస్తున్నదని భావించి, మిక్కిలి కోపించాడు. (15)
సంక్రుద్ధో రాక్షసస్తస్యాః భగిన్యాః కురుసత్తమ ।
ఉత్ఫాల్య విపులే నేత్రే తతస్తామిదమబ్రవీత్ ॥ 16
జనమేజయా! హిడింబుడు తన సోదరి విషయంలో మిక్కిలి కోపించాడు. తన విశాలమైన కళ్ళను పైకెగరేశాడు. తర్వాత ఆమెతో ఇలా అన్నాడు. (16)
కో హి మే భోక్తుకామస్య విఘ్నం చరతి దుర్మతిః ।
న బిభేషి హిడింబే కిం మత్కోపాత్ విప్రమోహితా ॥ 17
(ఆకలితో) భోజనం చెయ్యాలని కోరుకొంటున్న నాకు ఆటంకం కల్గిస్తున్న దుర్బుద్ధి ఎవరు? హిడింబా! కామంతో కళ్ళు మూసుకొన్న నీవు నా కోపానికి భయపడటం లేదా? (17)
ధిక్ త్వామసతి పుంస్కామే మమ విప్రియకారిణి ।
పూర్వేషాం రాక్షసేంద్రాణాం సర్వేషామయశస్కరి ॥ 18
దుర్మార్గులారా! మనుష్యుని కామించి, నాకు అపకారం చేస్తావా? మన పూర్వీకులైన రాక్షసశ్రేష్ఠులందరికీ నీ వల్ల అపకీర్తి వచ్చింది. నీవు పరమ నీచురాలివి. (18)
యానిమానాశ్రితాకార్షీః విప్రియం సుమహన్మమ ।
ఏష తానద్య వై సర్వాన్ హనిష్యామి త్వయా సహ ॥ 19
ఈ మానవనమాత్రుల్ని ఆశ్రయించుకుని, నాకు గొప్ప అపకారం తలపెట్టావు. హిడింబా! వారందరినీ నీతోపాటు ఇప్పుడే చపేస్తాను. (19)
ఏవముక్త్వా హిడింబాం స హిడింబో లోహితేక్షణః ।
వధాయాభిపపాతైనాన్ దంతైర్దంతానుపస్పృశన్ ॥ 20
హిడింబతో ఇలా చెప్పి, ఎర్రని చూపులతో హిడింబుడు పళ్ళు పటపట కొరుకుతూ హిడింబతో సహా అందరినీ చంపటానికి బయల్దేరాడు. (20)
త మాపతంతం సంప్రేక్ష్య భీమః ప్రహరతాం వరః ।
భర్త్సయామాస తేజస్వీ తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ ॥ 21
తనమీదకు వస్తున్న హిడింబుని చూసి, పరాక్రమశాలి భీముడు 'నిలబడరా నిలబడు' అంటూ హిడింబుని వారించాడు. (21)
వైశంపాయన ఉవాచ
భీమసేనస్తు తం దృష్ట్వా రాక్షసం ప్రహసన్నివ ।
భగినీమ్ ప్రతి సంక్రుద్ధమ్ ఇదం వచన మబ్రవీత్ ॥ 22
వైశంపాయనుడన్నాడు. సోదరిపట్ల మిక్కిలి కోపించిన రాక్షసుని చూసి, భీమసేనుడు పరిహాస మాడుతున్నట్లు ఇలా అన్నాడు. (22)
కిం తే హిడింబ ఏతైర్వా సుఖసుప్తైః ప్రబోధితైః ।
మామాసాదయ దుర్బుద్ధే తరసా త్వం నరాశన ॥ 23
దుర్మార్గుడా! నరభక్షక! హిడింబా! హాయిగా నిద్రపోతున్న వీరితో నీకేం పని? నా మీద నీ ప్రతాపం చూపించు. (23)
మయ్యేవ ప్రహరేహి త్వం న స్త్రియం హంతుమర్హసి ।
విశేషతోఽనపకృతే పరేణాపకృతే సతి ॥ 20
హిడింబా! నీ ప్రతాపం నా మీదే చూపించు. స్త్రీ ని చంపటం భావ్యం కాదు. అందునా ఈమె చేసిన అపకారం లేదు. ఈ అపకారం పరులు చేసింది. (24)
న హీయం స్వవశా బాలా కామయత్యద్య మామిహ ।
చోదితైషా హ్యనంగేన శరీరాంతరచారిణా ॥ 25
ఈ బాలిక హిడింబ తన వశంలో లేదు. నన్ను ఇప్పుడు కామిస్తోంది. ఈమె శరీరం లోపల సంచరించే అనంగుని చేత (మదనునిచే) ప్రేరేపింపబడింది. (25)
భగినీ తవ దుర్వృత్త రక్షసాం వై యశోహర ।
త్వన్నియోగేన చైవేయం రూపం మమ సమీక్ష్య చ ॥ 26
కామయత్యద్య మాం భీరుః తవ నైషాపరాధ్యతి।
అనంగేన కృతే దోషే నేమాం గర్హితుమర్హసి ॥ 27
దుర్మార్గుడా! రాక్షసులకు అపకీర్తిని తెచ్చేవాడా! ఈమె నీసోదరి. నీవు పంపబట్టే ఈమె నావద్దకు వచ్చింది. ఈపిరికిది నారూపాన్ని చూసి నన్ను కామిస్తోంది. ఈమె నీకేమీ అపకారం చెయ్యలేదు. మన్మథుడు అపకారం చేస్తే ఈమెను నిందించటం తగదు. (26,27)
మయి తిష్ఠతి దుష్టాత్మన్ న స్త్రియం హంతుమర్హసి ।
సంగచ్ఛస్వ మయా సార్ధమ్ ఏకేనైకో నరాశన ॥ 28
దురాత్మా! నేను ఎట్టఎదుట నిలిచి ఉండగా, స్త్రీని చంపటం తగదు. నరభక్షకా! నాఒక్కడితో నీవొక్కడివే తలపడు. ద్వంద్వయుద్ధం చేద్దాం (28)
అహమేకో నయిష్యామి త్వామద్య యమసాదనమ్ ।
అద్య మద్బలనిష్పిష్టం శిరో రాక్షస దీర్యతామ్ ।
కుంజరస్యేవ పాదేన వినిష్పిష్టం బలీయసః ॥ 29
నేడు నేనొక్కడనే నిన్ను యమలోకానికి పంపిస్తాను. బలమైన ఏనుగుపాదంతో తొక్కబడినట్లు నాబలంచే పిండి చేయబడిన నీశిరస్సు ముక్కముక్కలైపోతుంది. (29)
అద్య గాత్రాణి తే కంకాః శ్యేనా గోమాయవస్తథా ।
కుర్వంతు భువి సంహృష్టాః నిహతస్య మయా మృధే ॥ 30
ఈ రోజు యుద్ధరంగంలో నాచే చంపబడిన నీశరీరావయవాలను గద్దలు, డేగలు, నక్కలు పరమానందంతో స్వీకరిస్తాయి. (30)
క్షణేనాద్య కరిష్యేహమ్ ఇదం వనమరాక్షసమ్ ।
పురాయద్ దూషితం నిత్యం త్వయా భక్షయతా నరాన్ ॥ 31
పూర్వం మానవులను నిత్యం భుజిస్తూ ఉండే నీవు అపవిత్రం చేసిన ఈ అరణ్యాన్ని, క్షణకాలంలో రాక్షసరహితం చేస్తాను. (31)
అద్య త్వాం భగినీ రక్షః కృష్యమాణం మయాసకృత్ ।
ద్రక్ష్యత్యద్రిప్రతీకాశం సింహేనేవ మహాద్విపమ్ ॥ 32
రాక్షసుడా! పర్వతంలాంటి గొప్ప ఏనుగును సింహం చీల్చి చెండాడినట్లు, నా చేత ఎన్నోసార్లు పొర్లించబడే నీశరీరాన్ని నీ సోదరి చూస్తుంది. (32)
నిరాబాధాస్త్వయి హతే మయా రాక్షసపాంసన ।
వనమేతచ్చరిష్యంతి పురుషా వనచారిణః ॥ 33
దుష్టరాక్షసా! నేను నిన్ను చంపగానే ఏమాత్రం భయాందోళనలు లేకుండా ఆటవికులందరూ ఈ వనంలో సుఖంగా సంచరిస్తారు. (33)
హిడింబ ఉవాచ
గర్జితేన వృథా కిం తే కత్థితేన చ మానుష ।
కృత్వైతత్ కర్మణా సర్వమ్ కత్థేథా మా చిరం కృథాః ॥ 34
హిడింబుడన్నాడు. ఓరిమానవా! అనవసరంగా అరుస్తా వెందుకు? నీవు చెప్పిందంతా చేసి చూపించు, అప్పుడు పొగడుకుందువుగాని, ఆలస్యం చెయ్యకు. (34)
బలినం మన్యసే యచ్చా ప్యాత్మానం సపరాక్రమమ్ ।
జ్ఞాస్యస్యద్య సమాగమ్య మయాఽఽత్మానం బలాధికమ్ ॥ 35
న తావదేతాన్ హింసిష్యే స్వపంత్వేతే యథాసుఖమ్ ।
ఏష త్వామేవ దుర్బుద్ధే నిహన్మ్యద్యాప్రియంవదమ్ ॥ 36
పీత్వా తవాసృగ్ గాత్రేభ్యః తతః పశ్చాదిమానపి ।
హనిష్యామి తతః పశ్చాద్ ఇమాం విప్రయకారిణీమ్ ॥ 37
దుర్మతీ! నీవు బలవంతుడ ననుకొంటున్నావు. పరాక్రమవంతుడి ననుకొంటున్నావు. నాతో యుద్ధం చేసి ఎవరు బలాధికులో తెలుసుకొంటావు. వీరెవ్వరినీ నేను ముందుగా చంపను. వీళ్ళు హాయిగా నిద్రపోవచ్చు. పరుషంగా మాట్లాడే నిన్నే ముందుగా నేడు చంపుతాను. నీ శరీరాన్నుండి రక్తాన్ని త్రాగి, ఆపై వీళ్ళందర్నీ చంపుతాను. ఆ తర్వాత నాకు అపకారం చేసిన ఈ హిడింబను సంహరిస్తాను. (35-37)
మయి తిష్ఠతి దుష్టాత్మన్ న స్త్రియం హంతుమర్హసి ।
సంగచ్ఛస్వ మయా సార్ధమ్ ఏకేనైకో నరాశన ॥ 28
దురాత్మా! నేను ఎట్టఎదుట నిలిచి ఉండగా, స్త్రీని చంపటం తగదు. నరభక్షకా! నాఒక్కడితో నీవొక్కడివే తలపడు. ద్వంద్వయుద్ధం చేద్దాం (28)
అహమేకో నయిష్యామి త్వామద్య యమసాదనమ్ ।
అద్య మద్బలనిష్పిష్టం శిరో రాక్షస దీర్యతామ్ ।
కుంజరస్యేవ పాదేన వినిష్పిష్టం బలీయసః ॥ 29
నేడు నేనొక్కడనే నిన్ను యమలోకానికి పంపిస్తాను. బలమైన ఏనుగుపాదంతో తొక్కబడినట్లు నాబలంచే పిండి చేయబడిన నీశిరస్సు ముక్కముక్కలైపోతుంది. (29)
అద్య గాత్రాణి తే కంకాః శ్యేనా గోమాయవస్తథా ।
కుర్వంతు భువి సంహృష్టాః నిహతస్య మయా మృధే ॥ 30
ఈ రోజు యుద్ధరంగంలో నాచే చంపబడిన నీశరీరావయవాలను గద్దలు, డేగలు, నక్కలు పరమానందంతో స్వీకరిస్తాయి. (30)
క్షణేనాద్య కరిష్యేహమ్ ఇదం వనమరాక్షసమ్ ।
పురాయద్ దూషితం నిత్యం త్వయా భక్షయతా నరాన్ ॥ 31
పూర్వం మానవులను నిత్యం భుజిస్తూ ఉండే నీవు అపవిత్రం చేసిన ఈ అరణ్యాన్ని, క్షణకాలంలో రాక్షసరహితం చేస్తాను. (31)
అద్య త్వాం భగినీ రక్షః కృష్యమాణం మయాసకృత్ ।
ద్రక్ష్యత్యద్రిప్రతీకాశం సింహేనేవ మహాద్విపమ్ ॥ 32
రాక్షసుడా! పర్వతంలాంటి గొప్ప ఏనుగును సింహం చీల్చి చెండాడినట్లు, నా చేత ఎన్నోసార్లు పొర్లించబడే నీశరీరాన్ని నీ సోదరి చూస్తుంది. (32)
నిరాబాధాస్త్వయి హతే మయా రాక్షసపాంసన ।
వనమేతచ్చరిష్యంతి పురుషా వనచారిణః ॥ 33
దుష్టరాక్షసా! నేను నిన్ను చంపగానే ఏమాత్రం భయాందోళనలు లేకుండా ఆటవికులందరూ ఈ వనంలో సుఖంగా సంచరిస్తారు. (33)
హిడింబ ఉవాచ
గర్జితేన వృథా కిం తే కత్థితేన చ మానుష ।
కృత్వైతత్ కర్మణా సర్వమ్ కత్థేథా మా చిరం కృథాః ॥ 34
హిడింబుడన్నాడు. ఓరిమానవా! అనవసరంగా అరుస్తా వెందుకు? నీవు చెప్పిందంతా చేసి చూపించు, అప్పుడు పొగడుకుందువుగాని, ఆలస్యం చెయ్యకు. (34)
బలినం మన్యసే యచ్చా ప్యాత్మానం సపరాక్రమమ్ ।
జ్ఞాస్యస్యద్య సమాగమ్య మయాఽఽత్మానం బలాధికమ్ ॥ 35
న తావదేతాన్ హింసిష్యే స్వపంత్వేతే యథాసుఖమ్ ।
ఏష త్వామేవ దుర్బుద్ధే నిహన్మ్యద్యాప్రియంవదమ్ ॥ 36
పీత్వా తవాసృగ్ గాత్రేభ్యః తతః పశ్చాదిమానపి ।
హనిష్యామి తతః పశ్చాద్ ఇమాం విప్రయకారిణీమ్ ॥ 37
దుర్మతీ! నీవు బలవంతుడ ననుకొంటున్నావు. పరాక్రమవంతుడి ననుకొంటున్నావు. నాతో యుద్ధం చేసి ఎవరు బలాధికులో తెలుసుకొంటావు. వీరెవ్వరినీ నేను ముందుగా చంపను. వీళ్ళు హాయిగా నిద్రపోవచ్చు. పరుషంగా మాట్లాడే నిన్నే ముందుగా నేడు చంపుతాను. నీ శరీరాన్నుండి రక్తాన్ని త్రాగి, ఆపై వీళ్ళందర్నీ చంపుతాను. ఆ తర్వాత నాకు అపకారం చేసిన ఈ హిడింబను సంహరిస్తాను. (35-37)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా తతో బాహుం ప్రగృహ్య పురుషాదకః ।
అభ్యద్రవత సంక్రుద్ధః భీమసేనమరిందమమ్ ॥ 38
వైశంపాయనుడన్నాడు. రాజా! ఇలా అంటూనే ఆ మనుష్యభక్షకుడు హిడింబుడు తన చేయి పైకెత్తి, కోపంతో శత్రుమర్దనుడైన భీమసేనుని మీదకు దూసుకొని వచ్చాడు. (38)
తస్యాభిద్రవతస్తూర్ణం భీమో భీమపరాక్రమః ।
వేగేన ప్రహితం బాహుం నిజగ్రాహ హసన్నివ ॥ 39
అలా వేగంగా మీదకు వస్తున్న హిడింబుని చేతిని, భయంకరమైన పరాక్రమం కల భీమసేనుడు నవ్వుతూ హేలగా పట్టుకొన్నాడు. (39)
నిగృహ్య తం బలాద్భీమః విస్ఫురంతం చకర్ష హ ।
తస్మాద్ దేశాద్ధనూంష్యష్టౌ సింహః క్షుద్రమృగం యథా ॥ 40
భీముడు గుంజుకొంటున్న ఆరాక్షసుని బలంగా లాగాడు. సింహం చిన్న జింకను లాగుకొని వెళ్లినట్లు హిడింబుని ఎనిమిది ధనుస్సుల దూరానికి (20 హస్తాలు) ఈడ్చుకొనిపోయాడు. (40)
తతః సరాక్షసః క్రుద్ధః పాండవేన బలార్దితః ।
భీమసేనం సమాలింగ్య వ్యనదద్ భైరవం రవమ్ ॥ 41
భీముని చేత బలంగా బాధింపబడిన ఆరాక్షసుడు కోపించాడు. వెంటనే భీమసేనుని పట్టుకుని భయంకరంగా గర్జించాడు. (41)
పునర్భీమో బలాదేనం విచకర్ష మహాబలః ।
మా శబ్దః సుఖసుప్తానాం భ్రాతౄణాం మే భవేదితి ॥ 42
సుఖంగా నిద్రించిన సోదరులకు, శబ్దం చేస్తే నిద్రాభంగం కలుగుతుందని భావించి, మహాబలుడైన భీమసేనుడు మళ్ళీ హిడింబుని దూరంగా విసిరికొట్టాడు. (42)
అన్యోన్యం తౌ సమాసాద్య విచకర్షతు రోజసా ।
హిడింబో భీమసేనశ్చ విక్రమం చక్రతుః పరమ్ ॥ 43
హిడింబుడు, భీమసేనుడు ఒకరినొకరు బలంగా విసురుకొన్నారు. పరస్పరం కలియబడ్డారు. గొప్ప పరాక్రమం ప్రదర్శించారు. (43)
బభంజతు స్తదా వృక్షాన్ లతాశ్చాకర్షతుస్తదా ।
మత్తావివ చ సంరబ్ధౌ వారణౌ షష్టిహాయనౌ ॥ 44
అరవై ఏళ్ళ వయస్సున్న మతగజాల్లా వారిద్దరూ ఒకరితో ఒకరు తలబడ్డారు. చెట్లను విరగ్గొట్టారు. తీగలను లాగి పారేశారు (44)
(పాదపానుద్వహంతే తౌ ఉరువేగేన వేగితౌ ।
స్ఫోటయంతౌ లతాజాలాన్యూరుభ్యాం ప్రాప్య సర్వతః ॥
విత్రాసయంతౌ శబ్దేన సర్వతో మృగపక్షిణః ।
బలేన బలినౌ మత్తా వన్యోన్య వధకాంక్షిణౌ ॥
భీమరాక్షసయోర్యుద్ధం తదావర్తత దారుణమ్ ॥
ఊరుబాహుపరిక్లేశాద్ కర్షంతావితరేతరమ్ ।
తతః శబ్దేన మహతా గర్జంతౌ తౌ పరస్పరమ్ ।
పాషాణసంగట్టనిభైః ప్రహారైరభిజఘ్నతుః ।
అన్యోన్యం తౌ సమాలింగ్య వికర్షంతౌ పరస్పరమ్ ॥)
భీమసేన హిడింబులకు ఘోరమైన యుద్ధం జరిగింది. చెట్లను పెకలించి వేగంగా ఒకరి మీద ఒకరు విసురుకొన్నారు. అంతటా ఉన్న లతా సమూహాలను తమ పాదాలతో, తొడలతో అణగద్రొక్కారు. ఆ సమయంలో వచ్చిన పెద్ద పెద్ద శబ్దాలతో మృగాలను పక్షులను భయపెట్టారు. వారిద్దరూ బలవంతులే. ఇద్దరూ మదించినవారే! ఇద్దరూ పరస్పరం చంపుకోవాలనుకొంటున్నవారే. ఒకసారి చేతులను మరొకసారి తొడలను పరస్పరం పీడించుకొన్నారు. ఒకరినొకరు పడదోసుకొన్నారు. ఇద్దరూ సింహనాదాలు చేస్తూ, రాళ్ళతో కొట్టుకొన్నట్లు నొప్పించే ప్రహారాలతో ఒకరినొకరు హింసించుకొన్నారు. పరస్పరం కలియబడ్డారు. మళ్ళీ దూరంగా విసురుకొంటున్నారు. ఆ యుద్ధం చాలా భయంకరంగా ఉంది.
తయోః శబ్దేన మహతా విబుద్ధాస్తే నరర్షభాః ।
సహ మాత్రా చ దదృశుః హిడింబామగ్రతః స్థితామ్ ॥ 45
వారిద్దరి పెద్దగర్జనలతో పాండవులు, కుంతి మేలుకొన్నారు. ఎదురుగా నిలబడి ఉన్న హిడింబను చూశారు. (45)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి హిడింబవధపర్వణి హిడింబయుద్ధే ద్విపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 152 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున హిడింబవధ పర్వమను ఉపపర్వమున హిడింబయుద్ధమను నూట ఏబది రెండవ అధ్యాయము. (152)
(దాక్షిణాత్య అధికపాఠం 5 శ్లోకాలు కలుపుకొని 50 శ్లోకాలు)