153. నూట ఏబది మూడవ అధ్యాయము

భీముడు హిడింబుని వధించుట.

వైశంపాయన ఉవాచ
ప్రబుద్దాస్తే హిడింబాయాః రూపం దృష్ట్వాతిమానుషమ్ ।
విస్మితాః పురుషవ్యాఘ్రాః బభూవుః పృథయా సహ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! పురుషశ్రేష్ఠులైన పాండవులు, కుంతి మేలుకొని, హిడింబ యొక్క మానవాతీతమైన రూపసంపదను చూచి ఆశ్చర్యపోయారు. (1)
తతః కుంతీ సమీక్ష్యైనాం విస్మితా రూపసంపదా ।
ఉవాచ మధురం వాక్యం సాంత్వపూర్వమిదం శనైః ॥ 2
కస్య త్వం సురగర్భాభే కా వాసి వరవర్ణిని ।
కేన కార్యేణ సంప్రాప్తా కుతశ్చాగమనం తవ ॥ 3
పిదప కుంతి హిడింబయొక్క అందచందాలను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి, మెల్లగా అనునయపూర్వకంగా తియ్యని మాటలతో ఆమెతో ఇలా అంది. 'దేవకన్యా! నీవెవరి పిల్లవు? సుందరీ! నీవు ఎవ్వతెవు? నీవు ఏ పనిమీద వచ్చావు? ఎక్కడ ఉండి వచ్చావు? (2,3)
యది వాస్యవనస్య త్వం దేవతా యది వాప్సరాః ।
ఆచక్ష్వ మమ తత్సర్వం కిమర్థం చేహ తిష్ఠసి ॥ 4
నీవు ఈ వనదేవతవా? అప్సరసవా? ఇక్కడ ఎందుకున్నావు? అంతా నాకు వివరించు.' (4)
హిడింబోవాచ
యదేతత్ పశ్యసి వనం నీలమేఘనిభం మహత్ ।
నివాసో రాక్షసస్యైష హిడింబస్య మమైవ చ ॥ 5
హిడింబ ఇలా అంది. ఎదురుగా నల్లని పెద్ద మేఘంలా కన్పిస్తున్న ఈ వనం, హిడింబుడనే రాక్షసునికీ, నాకూ నివాసస్థానం. (5)
తస్య మాం రాక్షసేంద్రస్య భగినీం విద్ధి భావిని ।
భ్రాత్రా సంప్రేషితామార్యే త్వాం సపుత్రాం జిఘాంసతా ॥ 6
అమ్మా! నేను ఆ హిడింబరాక్షసుని సోదరిని. పూజ్యురాలా! నిన్ను పుత్రసహితంగా చంపాలని భావించిన సోదరుని ఆజ్ఞతో నేను మీవద్దకు వచ్చాను. (6)
క్రూరబుద్ధే రహం తస్య వచనాదాగతా త్విహ ।
అద్రాక్షం నవహేమాభం తవ పుత్రం మహాబలమ్ ॥ 7
క్రూరబుద్ధియైన హిడింబుని మాటతో ఇచటకు వచ్చిన నేను, బంగారు కాంతితో వెలిగిపోతున్న నీకుమారుని మహాబలుని, చూశాను. (7)
తతోఽహం సర్వభూతానాం భావే విచరతా శుభే ।
చోదితా తవ పుత్రస్య మన్మథేన వశానుగా ॥ 8
శుభాంగీ! నేను, సమస్తప్రాణుల హృదయాంత రాళాల్లో తిరుగాడే మన్మథుని చేత ప్రేరేపింపబడి, నీ కుమారునికి వశమయ్యాను. (8)
తతో వృతో మయా భర్తా తవ పుత్రో మహాబలః ।
అపనేతుం చ యతితః న చైవ శకితో మయా ॥ 9
ఆ కారణంగా మహాబలుడైన నీకుమారుని భర్తగా వరించాను. ఇచట నుండి దూరంగా తీసుకుపోవటానికి (మిమ్మందరినీ) ప్రయత్నం చేశాను. కానీ నీపుత్రుడు అంగీకరించలేదు. (9)
చిరాయమాణాం మాం జ్ఞాత్వా తతః సపురుషాదకః ।
స్వయమేవాగతో హంతుమ్ ఇమాన్ సర్వాన్ తవాత్మజాన్ ॥ 10
తర్వాత నేను చాలా ఆలస్యం చేస్తుండటం చూచి, నరభక్షకుడైన హిడింబుడు ఈ నీ కుమారులందరినీ స్వయంగానే సంహరించాలని వచ్చాడు. (10)
స తేన మమ కాతేన తవ పుత్రేణ ధీమతా ।
బలాదితో వినిష్పిష్య వ్యపనీతో మహాత్మనా ॥ 11
ఆ హిడింబుని నా ప్రియుడూ, నీకుమారుడూ, బుద్ధిశాలీ, మహాత్ముడూ అయిన భీముడు బలాత్కారంగా దూరంగా తీసుకుని వెళ్లాడు. (11)
వికర్షంతౌ మహావేగౌ గర్జమానౌ పరస్పరమ్ ।
పశ్యైవం యుధి విక్రాంతౌ ఏతౌ చ నరరాక్షసౌ ॥ 12
యుద్ధంలో పరాక్రమిస్తున్న ఈ నర, రాక్షసులను చూడు. గర్జించుకొంటూ, మహావేగంతో ఒకరినొకరు దూరంగా విసిరేసుకుంటున్నారు. (12)
వైశంపాయన ఉవాచ
తస్యాః శ్రుత్వైవ వచనమ్ ఉత్పపాత యుధిష్ఠిరః ।
అర్జునో నకుల శ్చైవ సహదేవశ్చ వీర్యవాన్ ॥ 13
వైశంపాయనుడన్నాడు. రాజా! ఆమె మాటలు విన్నవెంటనే యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకుల సహదేవులు ఒక్క ఉదుటన పైకి లేచారు. (13)
తౌ తే దదృశురాసక్తౌ వికర్షంతౌ పరస్పరమ్ ।
కాంక్షమాణౌ జయం చైవ సింహావివ బలోత్కటౌ ॥ 14
ఒకరితో మరొకరు కలుస్తూ, పడద్రోసుకొంటూ, మహాబలుడైన సింహాల్లా పోరాడుతూ జయాన్ని కోరుకొంటున్న భీమ హిడింబులను మిగిలిన పాండవులు చూశారు. (14)
అథాన్యోన్యం సమాశ్లిష్య వికర్షంతౌ పునః పునః ।
దావాగ్నిధూమసదృశం చక్రతుః పార్థివం రజః ॥ 15
వారిద్దరూ ఒకరినొకరు గట్టిగా ఒడిసి పట్టుకొంటున్నారు. మళ్ళీ ఒకరినొకరు దూరంగా విసురుకొంటున్నారు. వారి యుద్ధవిన్యాసాల వల్ల లేచిన ధూళి, అరణ్యంలో దావాగ్నిలోని పొగలాగా వ్యాపించింది. (15)
వసుధారేణుసంవీతౌ వసుధాధరసన్నిభౌ ।
బభ్రాజతుర్యథా శైలౌ నీహారేణాభిసంవృతౌ ॥ 16
పర్వతాకారులు ధూళిధూసరితులు ఆ భీమహిడింబులు, మంచుతో కప్పబడిన పర్వతాల్లా ప్రకాశించారు. (16)
రాక్షసేన తదా భీమం క్లిశ్యమానం నిరీక్ష్య చ ।
ఉవాచేదం వచః పార్థః ప్రహసన్ శనకైరివ ॥ 17
రాక్షసునిచే బాధింపబడుతున్న భీమసేనుని చూచి, మెల్లగా నవ్వుతూ అర్జునుడిలా అన్నాడు. (17)
భీమ మా భైర్మహాబాహో న త్వాం బుద్ధ్యామహే వయమ్ ।
సమేతం భీమరూపేణ రక్షసా శ్రమకర్శితమ్ ॥ 18
మహాబాహూ! భీమసేనా! నీవు భయపడవద్దు. నీవు భయంకరుడైన రాక్షసునితో యుద్ధం చేస్తున్నావని, అలసట చెందావని, ఇంతవరకు తెలుసుకోలేకపోయాము. (18)
సాహాయ్యేఽస్మి స్థితః పార్థ పాతయిష్యామి రాక్షసమ్ ।
నకులః సహదేవశ్చ మాతరం గోపయిష్యతః ॥ 19
భీమా! నీకు నేను సహాయంగా వచ్చాను. ఈ రాక్షసుని నేను సంహరిస్తాను. నకులుడు, సహదేవుడు అమ్మను రక్షిస్తారు. (19)
భీమ ఉవాచ
ఉదాసీనో నిరీక్షస్వ న కార్యః సంభ్రమస్త్వయా ।
న జాత్వయం పునర్జీవేత్ మద్బాహ్వంతరమాగతః ॥ 20
అర్జునా! నీవు కంగారుపడవద్దు. ఉదాసీనంగా చూస్తూ ఉండు. నాబాహువుల మధ్యపడిన ఈ రాక్షసుడు ఎంతమాత్రం జీవించి బయటపడడు. (20)
అర్జున ఉవాచ
కిమసేన చిరం భీమ జీవితా పాపరక్షసా ।
గంతవ్యే న చిరం స్థాతుమ్ ఇహ శక్యమరిందమ ॥ 21
అర్జునుడిలా అన్నాడు. భీమసేనా! వీడు పాపాత్ముడు, రాక్షసుడు. వీడు చాలాసేపు బ్రతకరాదు. శత్రుమర్దనా! మనం ప్రయాణం కొనసాగించవలసి ఉంది. ఇక్కడే చాలాకాలం ఉండిపోవటం తగని పని. (21)
పురా సంరజ్యతే ప్రాచీ పురా సంధ్యా ప్రవర్తతే ।
రౌద్రే ముహూర్తే రక్షాంసి ప్రబలాని భవంత్యుత ॥ 22
భీమసేనా! తూర్పు దిక్కు ఎర్రబడుతోంది. పూర్వసంధ్యా కాలం ప్రారంభమవుతోంది. భయంకరమైన ముహూర్తంలో రాక్షసుల బలం పెరుగుతుందంటారు. కదా! (22)
త్వరస్వ భీమ మా క్రీడ జహి రక్షో విభీషణమ్ ।
పురా వికురుతే మాయాం భుజయోః సారమర్పయ ॥ 23
భీమా! తొందరపడు. వీడితో ఆడుకోకు. వెంటనే ఈ భయంకరమైన రాక్షసుని సంహరించు. ఇంకా ఆగితే వీడు మాయలు పన్నుతాడు. వెంటనే నీ భుజబలం చూపించు. (23)
వైశంపాయన ఉవాచ
అర్జునేనైవ ముక్తస్తు భీమో రోషాజ్జ్వలన్నివ ।
బలమాహారయామాస యద్వాయోర్జగతః క్షయే ॥ 24
వైశంపాయనుడన్నాడు. జనమేజయా! అర్జునుని హెచ్చరికతో భీముడు మండిపడుతూ ప్రళయకాలంలో వాయుదేవునకుండే అసాధారణమైన బలాన్ని కూడదీసుకొన్నాడు. (24)
తతస్తస్యాంబుదాభస్య భీమో రోషాత్ తు రక్షసః ।
ఉతిప్యాభ్రామయద్దేహం తూర్ణం శతగుణం తదా ॥ 25
వెంటనే భీముడు కోపంతో మేఘంలాంటి ఆ రాక్షసుని యొక్క శరీరాన్ని పైకెత్తి వందరెట్లు వేగంగా త్రిప్పటం ప్రారంభించాడు. (25)
భీమ ఉవాచ
వృథా మాంసైర్వృథా పుష్టః వృథా వృద్ధోవృథామతిః ।
వృథామరణమర్హస్త్వం వృథాద్య న భవిష్యసి ॥ 26
భీముడు హిడింబునితో ఇలా అన్నాడు. రాక్షసా! నీ మాంసం వ్యర్థం. నీవు వ్యర్థంగానే వృద్ధిని పొందావు. నీబుద్ధి నిరుపయోగమైనది. నీవు నిష్ప్రయోజనంగా చావడానికి తగినవాడవు. నీబ్రతుకే వ్యర్థం. నేటితో నీకథ ముగుస్తుంది. (26)
క్షేమమద్య కరిష్యామి యథా వనమకంటకమ్ ।
న పునర్మానుషాన్ హత్వా భక్షయిష్యసి రాక్షస ॥ 27
రాక్షసుడా! ఈ అరణ్యానికి క్షేమం కల్గిస్తాను. ఈ వనం నిష్కంటకం అవుతుంది. జీవితంలో ఇంకెప్పుడూ మనుష్యులను చంపి తినే అవకాశం నీకు ఉండదు. (27)
అర్జున ఉవాచ
యది వా మన్యసే భారం త్వమిమం రాక్షసం యుధి ।
కరోమి తవ సాహాయ్యం శీఘ్రమేష నిపాత్యతామ్ ॥ 28
అర్జునుడిలా అన్నాడు. భీమసేనా! ఈ రాక్షసుని యుద్ధంలో చంపటం నీకు కష్టమనిపిస్తే చెప్పు. నీకు నేను సహాయం చేస్తాను. వీడిని మాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే చంపు. (28)
అథ వాప్యహమేవైనం హనిష్యామి వృకోదర ।
కృతకర్మా పరిశ్రాంతః సాధు తావదుపారమ ॥ 29
వృకోదరా! లేదా! సహాయమెందుకు, నేను వాడిని సంహరిస్తాను. ఇంతవరకు చాలా శ్రమించావు. నివు విశ్రాంతిని పొందు. (29)
వైశంపాయన ఉవాచ
తస్య తద్వచనం శ్రుత్వా భీమసేనోఽత్యమర్షణః ।
నిష్పిష్యైనం బలాద్ భూమౌ పశుమారమమారయత్ ॥ 30
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! అర్జునుని మాటలు విన్న భీమసేనుడు మిక్కిలి కోపించి, హిడింబుని బలంగా భూమి మీద విసిరికొట్టి పిండి పిండి చేసి, పశువును చంపినట్లు చంపాడు. (30)
స మార్యమాణో భీమేన ననాద విపులం స్వనమ్ ।
పూరయంస్తద్వనం సర్వం జలార్ద్ర ఇవ దుందుభిః ॥ 31
భీమునిచే చంపబడుతున్న హిడింబుడు పొలికేక పెట్టాడు. నీటితో తడిసిన దుందుభి మ్రోగినట్లు ఆ కేక వనమంతా వ్యాపించింది. (31)
బాహుభ్యాం యోక్త్రయిత్వా తం బలవాన్ పాండునందనః ।
మధ్యే భంక్త్వా మహాబాహుః హర్షయామాస పాండవాన్ ॥ 32
మహాబాహుడు భీమసేనుడు, హిడింబుని రెండు బాహువులతో బంధించి, మధ్యకు విరిచి, పాండవుల కానందాన్ని కల్గించాడు. (32)
హిడింబం నిహతం దృష్ట్వా సంహృష్టాస్తే తరస్వినః ।
అపూజయన్ నరవ్యాఘ్రం భీమసేనమరిందమమ్ ॥ 33
హిడింబుడు చనిపోవటం చూచి, చురుకైన పాండవులు శత్రునాశకుడూ, పురుషశ్రేష్ఠుడూ అయిన భీమసేనుని పరిపరివిధాల ప్రశంసించారు. (33)
అభిపూజ్య మహాత్మానం భీమం భీమపరాక్రమమ్ ।
పునరేవార్జునో వాక్యమ్ ఉవాచేదం వృకోదరమ్ ॥ 34
మహాత్ముడూ భయంకరపరాక్రముడూ ఐన భీమసేనుని పూజించి, అర్జునుడు భీమసేనునితో మళ్లీ ఇలా అన్నాడు. (34)
న దూరం నగరం మన్యే వనాదస్మాదహం విభో ।
శీఘ్రం గచ్ఛామ భద్రం తే న నో విద్యాత్ సుయోధనః ॥ 35
భీమా! ఈ అరణ్యానికి చాలా దగ్గరగా నగరం ఏదో ఉందని భావిస్తున్నాను. నీకు శుభం జరగాలి. మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. సుయోధనుడికి మనజాడ తెలియరాదు. (35)
తతస్సర్వే తథేత్యుక్త్వా సహ మాత్రా మహారథాః ।
ప్రయయుః పురుషవ్యాఘ్రాః హిడింబా చైవ రాక్షసీ ॥ 36
మహారథులు పాండవులందరూ, అలాగే చేద్దామన్నారు. పురుషశ్రేష్ఠులైన పాండవులు తల్లితో బయలుదేరారు - వెంట హిడింబ వచ్చింది. (36)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి హిడింబవధ పర్వణి హిడింబవధే త్రిపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 153 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున హిడింబవధ పర్వమను ఉపపర్వమున హిడింబవధ అను నూట ఏబది మూడవ అధ్యాయము. (153)