151. నూట ఏబది ఒకటవ అధ్యాయము
(హిడింబ వధ పర్వము)
భీమ హిడింబల సంవాదము.
వైశంపాయన ఉవాచ
తత్ర తేషు శయానేషు హిడింబో నామ రాక్షసః ।
అవిదూరే వనాత్తస్మాత్ సాలవృక్షం సమాశ్రితః ॥ 1
ఆ రావిచెట్టుక్రింద పాండవులు నిద్రిస్తూ ఉన్నారు. వారున్న అరణ్యానికి దరిదాపుల్లో ఒక మద్ది చెట్టు మీద హిడింబుడు అనే రాక్షసుడు ఉన్నాడు, (1)
క్రూరో మానుషమాంసాదః మహావీర్యపరాక్రమః ।
ప్రావృట్ జలధరశ్యామః పింగాక్షో దారుణాకృతిః ॥ 2
అతడు క్రూరుడు, మనుష్యమాంసాన్ని తినేవాడు, గొప్పబలమూ, పరాక్రమమూ ఉన్నవాడు. ఆకారంలో నీలమేఘం వలె నల్లనివాడు. ఎర్రనినేత్రాలు, భయంకరమైన శరీరాకృతి కలవాడు. (2)
దంష్ట్రాకరాలవదనః పిశితేప్సుః క్షుధార్దితః ।
లంబస్ఫిక్ లంబజఠరః రక్తశ్మశ్రుశిరోరుహః ॥ 3
అతడు పెద్దకోరలతో భయంకరమైన ముఖం కలవాడు, మాంసానికి అర్రులు చాస్తున్నాడు. ఆఖలితో పీడింపబడుతున్నాడు. అతని పిరుదులు, పొట్ట వేలాడుతూ ఉన్నాయి. అతని మీసాలు, వెంట్రుకలు ఎర్రగా ఉన్నాయి. (3)
మహావృక్షగలస్కంధః శంకుకర్ణో విభీషణః ।
యదృచ్ఛయా తానపశ్యత్ పాండుపుత్రాన్ మహారథాన్ ॥ 4
అతని కంఠం, భుజాళు మహావృక్షాల్లాగా ఉన్నాయి. అతని చెవులు శంకువుల్లా ఉన్నాయి. భయంకరంగా ఉన్నాడు. అతడు అనుకోకుండా మహారథులైన ఆ పాండుపుత్రులను చూశాడు. (4)
విరూపరూపః పింగాక్షః కరాలో ఘోర దర్శనః ।
పిశితేప్సుః క్షుధార్తశ్చ తానపశ్యత్ యదృచ్ఛయా ॥ 5
వికృతమైన రూపం, ఎర్రనికళ్లు, భయంకరమైన చూపు, అన్నిటితో భయంకరంగా ఉన్నాడు. ఒకవైపు ఆకలిబాధ, మరొక వైపు మాంసం మీద కోరికతో ఉన్న ఆరాక్షసుడు అనుకోకుండా పాండవులను చూశాడు. (5)
ఊర్ధ్వాంగులిః స కండూయన్ ధున్వన్ రూక్షాన్ శిరోరుహాన్ ।
జృంభమాణో మహావక్త్రః పునః పునరవేక్ష్య చ ॥ 6
అతడు వేళ్ళుపైకైత్తి కరుకు వెంట్రుకలను విదిలిస్తూ, దురదతో గోక్కుంటూ, తన పెద్ద ముఖంతో ఆవలిస్తూ మళ్ళీ మళ్ళీ పరిశీలించి చూశాడు. (6)
హృష్టో మానుషమాంసస్య మహాకాయో మహాబలః ।
ఆఘ్రాయ మానుషం గంధం భగినీమిదమబ్రవీత్ ॥ 7
గొప్పబలం, పెద్దశరీరం కల ఆ హిడింబుడు మానవ మాంసం దొరికిందని చాలా సంతోషించాడు. మనుష్య వాసనను పీల్చి తన సోదరితో ఇలా అన్నాడు. (7)
ఉపపన్నశ్చిరస్యాద్య భక్షోఽయం మమ సుప్రియః ।
స్నేహస్రవాన్ ప్రస్రవతి జిహ్వా పర్వేతి మే సుఖమ్ ॥ 8
చాలా కాలానికి నాకు మిక్కిలి ఇష్టమైన భక్ష్యం మనుష్యమాంసం దొరికింది. నా నాలుక ప్రీతిసూచకంగా లాలాజలాన్ని స్రవిస్తోంది (నోరూరుతోంది). అంతే కాకుండా సుఖంగా ముఖంలో అటూ యిటూ కదులుతోంది. (8)
అష్టౌ దంష్ట్రాః సుతీక్ష్ణాగ్రాః చిరస్యాపాతదుస్సహాః ।
దేహేషు మజ్జయిష్యామి స్నిగ్ధేషు పిశితేషు చ ॥ 9
మిక్కిలి వాడియై, సహింపశక్యగాని నా ఎనిమిది కోరలను వారి శరీరాల్లో, నిగనిగలాడుతున్న మాంసంలో లోతుగా దింపుతాను. ఈ అదృష్టం ఎంతో కాలానికి కల్గింది. (9)
ఆక్రమ్య మానుషం కంఠం ఆచ్ఛిద్య ధమనీమపి ।
ఉష్ణం నవం ప్రపాస్యామి ఫేనిలం రుధిరం బహు ॥ 10
మనుష్యకంఠాన్ని ఆక్రమిమ్చుకొని రక్తనాళాలను తెంపి, నురగలు కక్కుతున్న కొత్త వేడి రక్తాన్ని అపారంగా త్రాగుతాను. (10)
గచ్ఛ జానీహి కే త్వేతే శేరతే వనమాశ్రితాః ।
మానుషో బలవాన్ గంధః ఘ్రాణం తర్పయతీవ మే ॥ 11
హిడింబా! వెళ్లు. ఈ అరణ్యంలో నిద్రించిన వాళ్ళు ఎవరో తెలుసుకో! దట్టంగా వీస్తున్న నరవాసన నా ముక్కుకు ఎంతో తృప్తి నిస్తున్నట్లుంది. (11)
హత్వైతాన్ మానుషాన్ సర్వాన్ ఆనయస్వ మమాంతికమ్ ।
అస్మద్విషయసుప్తేభ్యః నైతేభ్యో భయమస్తి తే ॥ 12
వీరు మనప్రదేశంలో నిద్రిస్తున్నారు. వీరివల్ల నీకు ఏ భయం ఉండదు. కనుక వీరందర్నీ చంపి నా దగ్గరకు తీసుకొనిరా. (12)
ఏషాముత్కృత్య మాంసాని మానుషాణాం యథేష్టతః ।
భక్షయిష్యావసహితౌ కురు తూర్ణం వచో మమ ॥ 13
ఈ మనుష్యుల యొక్క మాంసాన్ని బయటకు పెల్లగించి, స్వేచ్ఛగా మనమిద్దరం తిందాము. వెంటనే నేను చెప్పినట్లు చెయ్యి. (13)
భక్షయిత్వా చ మాంసాని మానుషాణాం ప్రకామతః ।
నృత్యావ సహితావావాం దత్తతాలావనేకశః ॥14
ఈ మనుష్యుల మాంసాన్ని కోరుకొన్నంత తిని, రకరకాలుగా తాళం వేస్తూ మన మిద్దరం నృత్యం చేద్దాము. (14)
ఏవముక్తా హిడింబా తు హిడింబేన తదా వనే ।
భ్రాతుర్వచన మాజ్ఞాయ త్వరమాణేవ రాక్షసీ ॥ 15
జగామ తత్ర యత్ర స్మ పాండవా భరతర్షభ ।
దదర్శ తత్ర సాగత్వా పాండవాన్ పృథయా సహ ।
శయానాన్ భీమసేనం చ జాగ్రతం త్వపరాజితమ్ ॥ 16
జనమేజయా! అప్పుడు ఆ అరణ్యంలో హిడింబుని చేత ఆజ్ఞాపింపబడిన హిడింబ, త్వరగా పాండవులున్న ప్రదేశానికి వెళ్ళింది. హిడింబ కుంతిలో సహా నిదురించిన పాండవులను చూసింది. ఓటమి నెరుగని భీమసేనుడిని కూడా చూసింది. అతడు మేలుకొని ఉన్నాడు. (15,16)
దృష్ట్వైవ భీమసేనం సా శాలపోతమివోద్గతమ్ ।
రాక్షసీ కామయామాస రూపేణాప్రతిమం భువి ॥ 17
నిలుచున్న గున్నమద్ది చెట్టులా, సాటిలేని అందంతో విలసిల్లే భీమసేనుని చూడగానే రాక్షసి హిడింబ అతనిని కోరుకొంది. (17)
అయం శ్యామో మహాబాహుః సింహస్కంధో మహాద్యుతిః ।
కంబుగ్రీవః పుష్కరాక్షః భర్తా యుక్తో భవేన్మమ ॥ 18
ఇతడు శ్యామలవర్ణుడు, పెద్ద బాహువులున్నవాడు, ఇతని భుజాలు సింహభుజాల్లా ఉన్నాయి. శంఖం వంటి కంఠం, పద్మాల వంటి నేత్రాలు, గొప్ప తేజస్సు కల్గిన ఈతడు నాకు భర్త అయితే బాగుంటుంది. అనుకుంది హిడింబ. (18)
నాహం భ్రాతృవచో జాతు కుర్యాం క్రూరోపసంహితమ్ ।
పతిస్నేహోఽతిబలవాన్ న తథా భ్రాతృసౌహృదమ్ ॥ 19
ముహూర్తమేవ తృప్తిశ్చ భవేత్ భ్రాతుర్మమైవ చ ।
హతైరేతైరహత్వా తు మోదిష్యే శాస్వతీః సమాః ॥ 20
నేను సోదరుని క్రూరమైన మాటను ఎప్పటికీ వినను. భర్త మీద స్నేహం బలవత్తరమైనది. సోదరప్రేమ అంతటిది కాదు. వీళ్ళను చంపి తినటం వల్ల, నాకూ సోదరునికీ కొద్ది సేపు సుఖంగా ఉండవచ్చు. వీళ్ళను చంపకుండా, ఇతడిని పెళ్ళి చేసుకుంటే చిరకాలం సుఖాన్ని పొందగల్గుతాను. (19,20)
సా కామరూపిణీ రూపం కృత్వా మానుషముత్తమమ్ ।
ఉపతస్థే మహాబాహుం భీమసేనం శనైః శనైః ॥ 21
లజ్జమానేవ లలనా దివ్యాభరణభూషితా ।
స్మితపూర్వమిదం వాక్యం భీమసేనమథాబ్రవీత్ ॥ 22
కుతస్త్వమసి సంప్రాప్తః కశ్చాపి పురుషర్షభ ।
క ఇమే శేరతే చేహ పురుషా దేవరూపిణః ॥ 23
కామరూపిణి హిడింబ శ్రేష్ఠమైన మానుషరూపాన్ని ధరించింది. మెల్లమెల్లగా మహాబాహుడయిన భీమసేనుని సమీపించింది దివ్యమయిన అలంకారాలు ధరించి, సిగ్గుపడుతున్నట్లు కన్పిస్తూ, చిరునవ్వుతో ఆ యువతి భీమసేనునితో ఇలా అంది. పురుషశ్రేష్ఠా! నీవెవ్వరవు? ఎక్కడ నుండి ఇచటకు వచ్చావు? ఇచట నిద్రించిన దేవతారూపులు ఈ పురుషులెవ్వరు? (21-23)
కేయం వై బృహతీ శ్యామా సుకుమారీ తవానఘ ।
శేతే వనమిదం ప్రాప్య విశ్వస్తా స్వగృహే యథా ॥ 24
అనఘా! వయస్సులో పెద్దదై, బంగారు రంగుతో ఉన్న యీ సుకుమారి ఎవ్వతె? ఈ మహారణ్యంలో కూడా సొంత ఇంటిలో ఉన్నట్లు నమ్మకంగా నిద్రిస్తోంది. (24)
నేదం జానాతి గహనం వనం రాక్షససేవితమ్ ।
వసతి హ్యత్ర పాపాత్మ హిడింబో నామ రాక్షసః ॥ 25
ఈ మహారణ్యం రాక్షసులకు నిలయమని ఈమెకు తెలియదనుకొంటాను. ఇక్కడ పాపాత్ముడు హిడింబుడనే రాక్షసుడు నివసిస్తున్నాడు కదా! (25)
తేనాహం ప్రేషితా భ్రాత్రా దుష్టభావేన రక్షసా ।
బిభక్షయిషతా మాంసం యుష్మాకమమరోపమ ॥ 26
దేవసమానా! మీ మాంసాన్ని తినాలనుకొనే పాపభావనలున్న రాక్షసుడైన నా సోదరునిచే, నేను మీ వద్దకు పంపబడ్డాను (26)
సాహం త్వమభిసం ప్రేక్ష్య దేవగర్భసమప్రభమ్ ।
నాన్యం భర్తారమిచ్ఛామి సత్యమేతత్ బ్రవీమి తే ॥ 27
అలా పంపబడ్డ నేను, దేవుని వలె వెలిగిపోతున్న నిన్ను మనసార చూసి, మరొకని భర్తగా భావించలేకపోతున్నాను. నా మాట నిజం. (27)
ఏతద్ విజ్ఞాయ ధర్మజ్ఞ యుక్తం మయి సమాచర ।
కామోపహతచిత్తాంగీం భజమానాం భజస్వ మామ్ ॥ 28
ధర్మమెరిగినవాడా! దీన్ని బాగా యోచించి, నా విషయంలో తగినట్లు వ్యవహరించు. నీమీద కోరికతో నామనశ్శరీరాలు వివశమయ్యాయి. నిన్నే సేవించాలనుకొంటున్నాను. నన్ను స్వీకరించు. (28)
త్రాస్యామి త్వాం మహాబాహో రాక్షసాత్ పురుషాదకాత్ ।
వత్స్యావో గిరిదుర్గేషు భర్తా భవ మమానఘ ॥ 29
మహాబాహూ! మనుషుల్ని తినే ఈ రాక్షసుని నుండి నిన్ను రక్షిస్తాను. పుణ్యాత్ముడా! పర్వతాల్లో, గుహల్లో మనమిద్దరం హాయిగా విహరిద్దాము. నాకు భర్తవై ఉండు. (29)
(ఇచ్ఛామి వీర భద్రం తే మా మా ప్రాంఆ విహాసిషుః ।
త్వయాహ్యహం పరిత్యక్తా న జీవేయ మరిందమ ॥)
నీకు శుభం కలుగుగాక - ప్రాణాలు గాలిలో కలసిపోకుండా చూడు. శత్రునాశన! నీవు నన్ను పరిత్యజిస్తే నేను జీవించలేను.
అంతరిక్షచరీహ్యస్మి కామతో విచరామి చ ।
అతులామాప్నుహి ప్రీతిం తత్ర తత్ర మయా సహ ॥ 30
నేను ఆకాశంలో విహరించేదాన్ని. స్వేచ్ఛగా ఎక్కడికైనా సంచరిస్తుంటాను. ఆయా ప్రదేశాల్లో నాతో పాటు విహరిస్తూ సాటిలేని ఆనందాన్ని పొందు. (30)
భీమసేన ఉవాచ
(ఏష జ్యేష్ఠో మమ భ్రాతా మాన్యః పరమకో గురుః ।
అనివిష్టశ్చ తన్మాహం పరివిద్యాం కథంచన ॥)
మాతరం భ్రాతరం జ్యేష్ఠం సుఖసుప్తాన్ కథం త్విమాన్ ।
పరిత్యజేత కోన్వద్య ప్రభవన్నిహ రాక్షసి॥ 31
భీమసేనుడిలా అన్నాడు. రాక్షసీ! ఇతడు నా జ్యేష్ఠ సోదరుడు. నాకు గౌరవించతగినవాడు, గొప్ప గురువు, ఇతనికింకా వివాహం కాలేదు పెద్దవాడి వివాహం కాకుండా చిన్నవాడు పెళ్ళి చేసుకోవటం అధర్మం. అలా చేసుకున్నవానిని పరివేత్త అంటారు. నేను ధర్మాన్ని విడిచిపెట్టలేను. తల్లిని, అన్నను, సుఖంగా నిద్రించిన మిగిలిన సోదరులను, సమర్థుడై ఉండి కూడా ఎవడు విడిచిపెడతాడు? (31)
కోహి సుప్తానిమాన్ భ్రాతౄన్ దత్త్వా రాక్షసభోజనమ్ ।
మాతరం చ నరో గచ్ఛేత్ కామార్త ఇవ మద్విధః ॥ 32
నామీద నమ్మకంతో హాయిగా నిద్రించిన సహోదరులను, తల్లిని రాక్షసునికి ఆహారంగా వదలి, నావంటివాడు కామార్తునివలె ఎలా వెళ్ళిపోతాడు? (32)
రాక్షస్యువాచ
యత్ తే ప్రియం తత్ కరిష్యే సర్వానేతాన్ ప్రబోధయ ।
మోక్షయిష్యామ్యహం కామం రాక్షసాత్ పురుషాదకాత్ ॥ 33
రాక్షసి ఇలా అంది. నీకు ఇష్టమైన విధంగా నేను చేస్తాను. వీరందరినీ నిద్రనుండి మేలుకొలుపు. ఈ పురుషభక్షక రాక్షసుని నుండి నేను అందరినీ విడిపిస్తాను. (33)
భీమసేన ఉవాచ
సుఖసుప్తాన్ వనే భ్రాతౄన్ మాతరం చైవ రాక్షసి ।
న భయాద్ బోధయిష్యామి భ్రాతుస్తవ దురాత్మనః ॥ 34
భీమసేనుడిలా అన్నాడు రాక్షసీ! అరణ్యంలో హాయిగా నిద్రిస్తున్న సోదరులను, కన్నతల్లినీ దుర్మార్గుడైన నీ సోదరుని భయం వల్ల నిద్రలేపను. (34)
న హి మే రాక్షసా భీరు సోఢుం శక్తాః పరాక్రమమ్ ।
న మనుష్యా న గంధర్వా న యక్షా శ్చారులోచనే ॥ 35
పిరికిదానా! నాపరాక్రమాన్ని రాక్షసులు తట్టుకొని నిలబడలేరు. సోగకన్నులదానా! మనుష్యులు, గంధర్వులు, యక్షులు కూడా నాకు సరిరారు. (35)
గచ్ఛ వా తిష్ఠ వా భద్రే యద్వాపీచ్ఛసి తత్కురు ।
తం వా ప్రేషయ తన్వంగి భ్రాతరం పురుషాదకమ్ ॥ 36
శుభాంగీ! నీవు వెళ్ళినాసరే, ఉన్నాసరే. నీవు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి. పురుషుల్ని తినే నీ సోదరుని పంపించినా సరే. (36)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి హిడింబవధ పర్వణి భీమ హిడింబాసంవాదే ఏకపంచాశదధికశతతమోఽధ్యాయః ॥151॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున హిడింబవధ పర్వమను ఉపపర్వమున భీమ హిడింబా సంవాదమను నూట ఏబదియొకటవ అధ్యాయము. (151)
(దాక్షిణాత్య అధికపాఠము 2 శ్లోకాలు కలిపి మొత్తం 38 శ్లోకాలు)