150. నూట ఏబదియవ అధ్యాయము

తల్లి కొఱకు భీమసేనుడు నీరు తెచ్చుట.

వైశంపాయన ఉవాచ
తేన విక్రమమాణేన ఊరువేగసమీరితమ్ ।
వనం సవృక్షవిటపం వ్యాఘార్ణితమివాభవత్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. భీమసేనుడు వేగంగా అరణ్యంలో ప్రయాణిస్తుంటే, చెట్లుకొమ్మలతో సహా వనమంతా కాళ్ళవేగానికి కదలిపోయి పెద్దరొద చేస్తున్నట్లు అయింది. (1)
జంఘావాతో వవౌ చాస్య శుచిశుక్రాగమే యథా ।
ఆవర్జితలతావృక్షం మార్గం చక్రే మహాబలః ॥ 2
జ్యేష్ఠ ఆషాఢమాసాల సంధికాలంలో పెనుగాలులు వీచినట్లు భీమసేనుని కాలిపిక్కల నుండి పెనుగాలులు వీచాయి. దానితో ఆ మహాబలుని ప్రయాణమార్గంలోని చెట్లు, లతలు నేలకొరిగాయి. (2)
స మృద్నన్ పుష్పితాంశ్చైవ ఫలితాంశ్చ వనస్పతీన్ ।
అవరుజ్య యయౌ గుల్మాన్ పథస్తస్య సమీపజాన్ ॥ 3
భీమసేనుడు నడుస్తున్న బాటకు దగ్గరగా పూలూ, పండ్లతో కూడిన చెట్లున్నాయి. వాటిని అణగద్రొక్కుతూ, పొదలను నాశనం చేస్తూ వేగంగా ప్రయాణించాడు భీముడు. (3)
స రోషిత ఇవ క్రుద్ధః వనే భంజన్ మహాద్రుమాన్ ।
త్రిప్రస్రుతమదః శుష్మీ షష్టివర్షీ మతంగరాట్ ॥ 4
మూడు శరీరావయవాల నుండీ మదాన్ని స్రవించే అరవై సంవత్సరాల కోపించిన మత్తగజంలా, భీమసేనుడు పెద్దపెద్ద చెట్లను కూడ కూలగొడుతూ ప్రయాణించాడు. (4)
గచ్ఛతస్తస్య వేగేన తార్ష్యమారుతరంహసః ।
భీమస్య పాండుపుత్రాణాం మూర్ఛేన సమజాయత ॥ 5
గరుడుని రెక్కల వాయువులతో సమాన వేగం కల్గిన, భీమసేనుని ప్రయాణ వేగం చేత మిగిలిన పాండవులకు ఇంద్రియజ్ఞానం నశించినట్లయింది. (5)
అసకృచ్చాపి సంతీర్య దూరపారం భుజప్లవైః ।
పథి ప్రచ్ఛన్నమాసేదుః ధార్తరాష్ట్రభయాత్ తదా ॥ 6
ఆ సమయంలో పాండవులు దుర్యోధనుని భయం వల్ల, తరచు మార్గంలో ఎదురయ్యే సుదీర్ఘమైన జలప్రవాహాలను చేతులతో ఈదుతూ రహస్యస్థలానికి చేరుకున్నారు. (6)
కృచ్ఛ్రేణ మాతరం చైవ సుకుమారీం యశస్వినీమ్ ।
అవహత్ స తు పృష్ఠేన రోధస్సు విషమేషు చ ॥ 7
భీమసేనుడు ప్రవాహాలు అడ్డువచ్చినప్పుడు, ఎత్తుపల్లాలుగా ఉన్న ప్రదేశాలలోను, కష్టం వచ్చినపుడు సుకుమారి, యశస్విని అయిన కన్న తల్లిని, తన వీపు మీద మోస్తూ ఉన్నాడు. (7)
అగమచ్చ వనోద్దేశం అల్పమూలఫలోదకమ్ ।
క్రూరపక్షిమృగం ఘోరం సాయాహ్నే భరతర్షభ ॥ 8
భరతశ్రేష్ఠా! జనమేజయా! వాఱు, ఆ సాయం కాలానికి దుంపలు పళ్ళు నీళ్ళు స్వల్పంగా ఉండి, భయంకరమైన పక్షులూ, మృగాలతో నిండిన అరణ్యానికి చేరుకున్నారు. (8)
ఘోరా సమభవత్ సంధ్యా దారుణా మృగపక్షిణః ।
అప్రకాశా దిశః సర్వాః వాతైరాసన్ననార్తవైః ॥ 9
సంధ్యాకాలం పరమ భయంకరంగా ఉంది. మృగాలు పక్షులు కూడా దారుణంగా ఉన్నాయి. కాలం కానప్పటికీ వీస్తున్న భయంకరమైన వాయువులతో దిక్కులన్నీ చీకట్లు క్రమ్ముకొన్నాయి. (9)
శీర్ణపర్ణఫలై రాజన్ బహుగుల్మక్షుపైర్ద్రుమైః ।
భగ్నావభగ్నభూయిష్ఠైః నానాద్రుమసమాకులైః ॥ 10
రాజా! అప్పుడు వీచిన గాలుల తాకిడికి ఆకులు పళ్ళు క్రిందపడిపోయాయి. చెట్లు పొదలు ఎగిరిపోయాయి. అనేక వృక్షాలు పూర్తిగాను, కొన్ని పాక్షికంగాను విరిగిపోయాయి. ఆ అరణ్యమంతా కకావికలయింది. (10)
తే శ్రమేణ చ కౌరవ్యాః తృష్ణయా చ ప్రపీడితాః ।
నాశక్నువంస్తదా గంతుం నిద్రయా చ ప్రవృద్ధయా ॥ 11
కురుశ్రేష్ఠులు ప్రయాణం వల్ల కల్గిన అలసట చేత, దాహం చేత, ముంచుకొస్తున్న నిద్ర చేత ఇంకా ప్రయాణించ లేకపోయారు. (11)
న్యవిశంత హితే సర్వే నిరాస్వాదే మహావనే ।
తతస్తృషాపరిక్లాంతా కుంతీ పుత్రానథాబ్రవీత్ ॥ 12
వారందరూ నీరసమైన మహారణ్యంలో ఒక చోట కూలబడ్డారు. పిదప దాహార్తితో కుంతి తన కుమారులతో ఇలా అంది. (12)
మాతా సతీ పాండవానామ్ పంచానాం మధ్యతః స్థితా ।
తృష్ణయా హి పరీతాస్మి పుత్రాన్ భృశమథాబ్రవీత్ ॥ 13
"నేను ఐదుగురు పాండవులకు తల్లిని. అందరి మధ్యలో ఉన్నాను. అయినా దాహంతో అలమటిస్తున్నాను" అన్నది కుంతి తన పుత్రులతో. (13)
తచ్ఛ్రుత్వా భీమసేనస్య మాతృస్నేహాత్ ప్రజల్పతమ్ ।
కారుణ్యేన మనస్తప్తం గమనాయోపచక్రమే ॥ 14
తల్లి అన్న ఆ మాటలు విన్న భీమసేనుని మనస్సు తల్లి పట్ల ప్రేమతోను, దురవస్థపట్ల జాలితోను పరితపించింది. వెంటనే భీమసేనుడు నీళ్ళు తేవటానికి బయలుదేరాడు. (14)
తతో భీమో వనం ఘోరం ప్రవిశ్య విజనం మహత్ ।
నగ్రోధం విపులచ్ఛాయం రమణీయం దదర్శ హ ॥ 15
భీముడు భయంకరమై నిర్జనమైన మహారణ్యంలోకి ప్రవేశించి, విశాలమైన నీడనిచ్చే అందమైన మర్రిచెట్టును చుశాడు (15)
తత్ర నిక్షిప్య తాన్ సర్వాన్ ఉవాచ భరతర్షభః ।
పానీయం మృగయామీహ విశ్రమధ్వమితి ప్రభో ॥ 16
రాజా! పాండవులందరినీ చెట్టుక్రింద ఉంచి, భరతశ్రేష్ఠుడైన భీమసేనుడు - నేను నీళ్ళకోసం వెతుకుతాను. మీరందరూ విశ్రమించండి అన్నాడు పాండవులతో. (16)
ఏతే రువంతి మధురం సారసా జలచారిణః ।
ధృవమత్ర జలస్థానం మహచ్చేతి మతిర్మమ ॥ 17
ఇక్కడ కొంగలు నీటి పక్షులు మధురంగా ధ్వని చేస్తున్నాయి. కనుక తప్పకుండా ఇక్కడ పెద్ద జలాశయ ముందని నాకనిపిస్తోంది అన్నాడు పాండవులతో. (17)
అనుజ్ఞాతః స గచ్ఛేతి భ్రాతా జ్యేష్ఠేన భారత ।
జగామ తత్ర యత్ర స్మ సారసా జలచారిణః ॥ 18
జనమేజయా! జ్యేష్ఠ సోదరుడు యుధిష్ఠిరుడు వెళ్ళిరమ్మని అనుమతించిన తర్వాత భీమసేనుడు జలపక్షులైన కొంగలు సంచరిస్తున్న ప్రదేశానికి వెళ్ళాడు. (18)
స తత్ర పీత్వా పానీయం స్నాత్వా చ భరతర్షభ ।
తేషామర్థే చ జగ్రాహ భ్రాతౄణాం భ్రాతృవత్సలః ।
ఉత్తరీయేణ పానీయం ఆనయామాస భారత ॥ 19
జనమేజయా! భీముడక్కడ నీరు త్రాగి, స్నానం చేసి, సోదరప్రేమతో వారికోసం, తన ఉత్తరీయంతో నీటిని పట్టుకొని తీసుకువచ్చాడు. (19)
వి: తె: ఉత్తరీయంతో నీళ్లు ఎలా తెచ్చాడు? అని పాఠకులకు అనుమానం కలుగుతుంది. దానికి సమాధానం నన్నయ చెప్పాడు. కమలపత్ర పుటికలలో' అని. తామరాకులు ఉత్తరీయంలో వేసికొని నీటిని తెచ్చాడు. అవే కమలపత్ర పుటికలు
గవ్యూతి మాత్రాదాగత్య త్వరితో మాతరం ప్రతి ।
శోకదుఃఖపరీతాత్మా నిఃశశ్వాసోరగో యథా ॥ 20
రెండు క్రోసుల దూరాన్ని తల్లికోసం త్వరత్వరగా దాటివచ్చి, శోకం దుఃఖం కమ్ముకోగా భీమసేనుడు పాములాగా బుసకొట్టాడు. (20)
స సుప్తాం మాతరం దృష్ట్వా భ్రాతౄంశ్చ వసుధాతలే ।
భృశం శోకపరీతాత్మా విలలాప వృకోదరః ॥ 21
అలా వచ్చిన వృకోదరుడు, కటిక నేలపై నిద్రిస్తున్న కన్నతల్లిని, సోదరులను చూసి, మిక్కిలి శోకించాడు. (21)
అతః కష్టతరం కిం ను ద్రష్టవ్యం హి భవిష్యతి ।
యత్పశ్యామి మహీసుప్తాన్ భ్రాతౄనద్య సుమందభాక్ ॥ 22
నేను దురదృష్టవంతుడిని. ఇంతకంటె బాధను కల్గించే దృశ్యం ఏముంటుంది? నాసోదరులందరూ కటికనేలపై నిద్రిస్తూంటే చూడవలసి వచ్చింది అనుకొన్నాడు భీముడు. (22)
శయనేషు పరార్ఘ్యేషు యే పురా వారణావతే ।
నాధిజగ్ము స్తదా నిద్రాం తేఽద్య సుప్తా మహీతలే ॥ 23
వారణావతనగరంలో, పూర్వం మిక్కిలి విలువైన గొప్ప పడకలపై శయనించినా నిద్రరాని పాండవులు నేడు నేల మీద నిద్రిస్తున్నారు. (23)
స్వసారం వసుదేవస్య శత్రుసంఘావమర్దినః ।
కుంతిరాజసుతాం కుంతీం సర్వలక్షణపూజితామ్ ॥ 24
స్నుషాం విచిత్రావీర్యస్య భార్యాం పాండోర్మహాత్మనః ।
తథైవ చాస్మజ్జననీం పుండరీకోదరప్రభామ్ ॥ 25
సుకుమారతరా మేనాం మహార్హశయనోచితామ్ ।
శయానాం పశ్యతాద్యేహ పృథివ్యామతథోచితామ్ ॥ 26
శత్రుసమూహనాశకుడైన వసుదేవుని సోదరి, కుంతి భోజమహారాజపుత్రి, శుభలక్షణాలచే పూజార్హురాలు, విచిత్రవీర్యుని కోడలు, మహాత్ముడు పాండురాజు భార్య, పాండవులమైన మాకు తల్లి, కమలోదరవర్ణ, పరమసుకుమారి, అమూల్యమైన గొప్ప శయనం మీద నిద్రింపతగినది, అయిన కుంతి అనుచితమైన భూమిపై నిద్రించవలసివచ్చినది. చూడండి. ఎంత దురదృష్టం. (24-26)
ధర్మాదింద్రాచ్చ వాతాచ్చ సుషువే యా సుతానిమాన్ ।
సేయం భూమౌ పరిశ్రాంతా శేతే ప్రాసాదశాయినీ ॥ 27
యమధర్మరాజు, ఇంద్రుడు, వాయుదేవుల వల్ల సుతులను కన్నకుంతి, మేడల మీద పరుండదగినది నేడు మిక్కిలి అలసి భూమి మీద నిద్రిస్తోంది. (27)
కింనుదుఃఖతరం శక్యం మయా ద్రష్టుమతఃపరమ్ ।
యోఽహమద్య నరవ్యాఘ్రాన్ సుప్తాన్ పశ్యామి భూతలే ॥ 28
ఇంతకంటె గొప్ప దుఃఖకరమైన దృశ్యం ఏముంటుంది? పురుషశ్రేష్ఠులు పాండవులు భూమిమీద పరుండి ఉండగా నేడు చూడవలసి వచ్చింది. (28)
త్రిషు లోకేషు యో రాజ్యం ధర్మనిత్యోఽర్హతే నృపః ।
సోఽయం భూమౌ పరిశ్రాంతః శేతే ప్రాకృతవత్ కథమ్ ॥ 29
ధర్మవ్రతుడు, ముల్లోకాలను పరిపాలించే అర్హత కల యుధిష్ఠిరుడు సామాన్యునివలె అలసిపోయి కటికనేలమీద ఎలా నిద్రిస్తున్నాడో కదా! (29)
అయం నీలాంబుదశ్యామః నరేష్వప్రతిమోఽర్జునః ।
శేతే ప్రాకృతవత్ భూమౌ తతో దుఃఖతరం ను కిమ్ ॥ 30
నీలమేఘశ్యాముడు, మానవుల్లో సరిజోడు లేనివాడు ఈ అర్జునుడు అతిసామాన్యునివలె భూమి మీద నిద్రిస్తున్నాడు. ఇంతకంటె దుఃఖాన్ని కలిగించేది ఏముంటుంది? (30)
అశ్వినావివ దేవానాం యావిమౌ రూపసంపదా ।
తౌ ప్రాకృతవదద్యేమౌ ప్రసుప్తౌ ధరణీటహ్లే ॥ 31
దేవతల్లో అశ్వినీదేవతలవలె, అందమైన రూపసంపదకల కవలలు నకుల సహదేవులు సామాన్యుల్లాగా భూమి మీద నిద్రిస్తున్నారు. (31)
జ్ఞాతయో యస్య నైవ స్యుః విషమాః కులపాంసనాః ।
స జీవేత సుఖం లోకే గ్రామద్రుమ ఇవైకజః ॥ 32
ఎవరికి కులనాశకులైన జ్ఞాతులుండరో, ఒంటరిగా రచ్చబండదగ్గరుండే చెట్టులా ఎవరుంటారో, వాఱే సుఖంగా ఈ లోకంలో జీవించగల్గుతున్నారు. (32)
ఏకో వృక్షో హి యో గ్రామే భవేత్ పర్ణఫలాన్వితః ।
చైత్యో భవతి నిర్ఞాతిః అర్చనీయః సుపూజితః ॥ 33
గ్రామంలో ఆకులు పూలతో నిండిన ఒకే ఒక్క చెట్టుంటే, అది దేవతా వృక్షంలా అందరిచే పూజింపబడుతుంది. ఆరాధింపబడుతుంది. అలాగే జ్ఞాతులు లేనివాడు మాత్రమే గౌరవం పొందగల్గుతాడు. (33)
యేషాం చ బహవః శూరాః జ్ఞాతయో ధర్మమాశ్రితాః ।
తే జీవంతి సుఖం లోకే భవంతి చ నిరామయాః ॥ 34
ఎవరికి ధర్మమార్గంలో ప్రయాణించే శూరులైన జ్ఞాతులు చాలా మంది ఉంటారో, వారు కూడా ఏ మనోవ్యథలు లేకుండా సుఖంగా జీవిస్తున్నారు. (34)
బలవంతః సమృద్ధార్థాః మిత్రబాంధవనందనాః ।
జీవంత్యన్యోన్యమాశ్రిత్య ద్రుమాః కాననజా ఇవ ॥ 35
బలవంతులు, వస్తుసంపదలున్నవారు, మిత్రులకు బంధువులకు ఆనందం కల్గించేవారు, ఒకరినొకరు ఆశ్రయించుకొని అరణ్యంలోని చెట్లలాగా ఆనందంగా జీవిస్తారు. (35)
వి: తె: దీనికి నన్నయ్య చక్కని కందమును వ్రాసినాడు
పరహిత ఫలవంతులు సు
స్థిరమూలాన్వితు లపాపధీరతులు పర
స్పరసంశ్రయమున జీవిం
తురు మనుజులు వనములోని ద్రుమముల పోలెన్. (1-6-183)
వయం తు ధృతరాష్ట్రేణ సపుత్రేణ దురాత్మనా ।
వివాసితా న దగ్ధాశ్చ కథంచిత దైవసంశ్రయాత్ ॥ 36
మేము మాత్రం పుత్రునితో కుట్రజరిపిన దుర్మార్గుడు ధృతరాష్ట్రునిచే బహిష్కరింపబడ్డాము. దైవానుగ్రహం వల్ల అతికష్టం మీద తగలబడకుండా బయటపడ్డాము. (36)
తస్మాన్ముక్తా వయం దాహాత్ ఇమం వృక్షముపాశ్రితాః ।
కాం దిశం ప్రతిపత్స్యామః ప్రాప్తాః క్లేశమనుత్తమమ్ ॥ 37
ఆ గృహాగ్ని నుండి బయటపడ్డ మేము ఈ చెట్టును ఆశ్రయించాము. ఇంత గొప్ప ఆపదను పొందిన మేము చివరకు ఏదిక్కుకు పోవలసివస్తుందో అర్థం కావటం లేదు. (37)
సకామో భవ దుర్భుద్ధే ధార్తరాష్ట్రాల్పదర్శన ।
నూనం దేవాః ప్రసన్నాస్తే నానుజ్ఞాం మే యుధిష్ఠిరః ॥ 38
ప్రయచ్ఛతి వధే తుభ్యం తేన జీవసి దుర్మతే ।
నన్వద్య త్వాం సహామాత్యం సకర్ణానుజసౌబలమ్ ॥ 39
గత్వా క్రోధసమావిష్టః ప్రేషయిష్యే యమక్షయమ్ ।
కింను శక్యం మయా కర్తుం యత్ తే నక్రుధ్యతే నృపః ॥ 40
ధర్మాత్మా పాండవశ్రేష్ఠః పాపాచార యుధిష్ఠిరః ।
ఏవముక్త్వా మహాబాహుః క్రోధసందీప్తమానసః ॥ 41
కరం కరేణ నిష్పిష్య నిఃశ్వసన్ దీనమానసః ।
పునర్దీనమనా భూత్వా శాంతార్చిరివ పావకః ॥ 42
భ్రాతౄన్ మహీతలే సుప్తాన్ అవైక్షత వృకోదరః ।
విశ్వస్తానివ సంవిష్టాన్ పృథగ్జనసమానివ ॥ 43
దుర్బుద్ధి, హ్రస్వదృష్టి కల్గిన దుర్యోధనా! నీ విషయంలో దేవతలు అనుగ్రహం చూపిస్తున్నారు. కనుకనే యుధిష్ఠిరుడు నిన్ను చంపడానికి నాకు అనుమతి నివ్వలేదు. దుర్మతీ! అందుకే నీవు ఇంకా బ్రతికి ఉన్నావు. ఈ రోజే నిన్ను నీ మంత్రులనూ కర్ణుని, సోదరులను, శకునితో సహా యమలోకానికి పంపించగలను. నా కోపం అంతటిది. పాపాత్ముడా! ధర్మాత్ముడు పాండవశ్రేష్ఠుడు యుధిష్ఠిరుడు నీ మీద కోపం తెచ్చుకోవటం లేదు. కనుకనే నిన్ను ఏమి చెయ్యలేకపోతున్నాను. అంటూ మహాబాహువు, క్రోధంతో కాలిపోతున్న మనస్సు గలవాడూ అయిన భీముడు ఒక చేతితో మరొకచేతిని నలుపుతూ పెద్దగా నిట్టూర్చాడు. మళ్ళీ వృకోదరుని మనస్సు దైన్యంతో నిండిపోయింది. జ్వాలలు లేని అగ్నిలా ప్రశాంతుడయ్యాడు. సామాన్యుల్లా బూమి మీద ఎంతో ఆదమరిచి నిద్రిస్తున్న తన సోదరులను చూశాడు. భీముని మనస్సు విచారంతో నిండిపోయింది. (38-43)
నాతిదూరేణ నగరం వనాదస్మాద్ధి లక్షయే ।
జాగర్తవ్యే స్వపంతీమే హంత జాగర్మ్యహం స్వయమ్ ॥ 44
పాస్యంతీమే జలం పశ్చాత్ ప్రతిబుద్దాః జితక్లమాః ।
ఇతి భీమో వ్యవస్యైవ జజాగార స్వయం తదా ॥ 45
ఇక్కడికి చాలా దగ్గరలోనే ఒక నగరం ఉన్నట్లు అన్పిస్తోంది. వీరందరూ అప్రమత్తంగా మెలకువగా ఉండవలసిన సమయంలో ఆదమరచి నిద్రిస్తున్నారు. కనుక నేనే రక్షణ కోసం మెలకువతో ఉంటాను. వారు నీటిని నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత అలసట తీరిన తర్వాత తాగుతారు. ఈ విధంగా నిశ్చయించుకొని భీముడు అప్పుడు స్వయంగా జాగరణ చేశాడు. (44,45)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి భీమజలాహరణే పంచాశదధిక శతతమోఽధ్యాయః ॥150॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున జతుగృహపర్వమను ఉపపర్వమున భీమ జలాహరణమను నూటఏబదియవ అధ్యాయము. (150)