149. నూట నలువది తొమ్మిదవ అధ్యాయము

ధృతరాష్ట్రాదులు పాండవుల కొఱకు దుఃఖించుట - పాండవుల వనప్రవేశము.

వైశంపాయన ఉవాచ
అథ రాత్య్రాం వ్యతీతాయామ్ అశేషో నాగరో జనః ।
తత్రాజగామ త్వరితః దిదృక్షుః పాండునందనాన్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ రాత్రి గడిచాక, వారణావతంలోని పురజనులందరూ పాండవులను చూడటానికి హడావుడిగా లక్క యింటివద్దకు వచ్చారు. (1)
నిర్వాపయంతో జ్వలనం తే జనా దదృశుస్తతః ।
జాతుషం తద్గృహం దగ్ధమ్ అమాత్యం చ పురోచనమ్ ॥ 2
పిదప అచటి మంటలను ఆర్పుతూ జనులందరూ లక్కయిల్లు, మంత్రి పురోచనుడూ పూర్తిగా తగులబడినట్లు గ్రహించారు. (2)
నూనం దుర్యోధనేనేదం విహితం పాపకర్మణా ।
పాండవానాం వినాశాయేత్యేవం తే చుక్రుశుర్జనాః ॥ 3
పాపకర్ముడైన దుర్యోధనునిచే, పాండవుల నాశనానికి లక్క ఇల్లు తగులబెట్టబడింది. ఇది నిజం అంటూ అచట చేరిన పురజనులందరూ ఆక్రోశించారు. (3)
విదితే ధృతరాష్ట్రస్య ధార్తరాష్ట్రో న సంశయః ।
దగ్ధవాన్ పాండుదాయాదాన్ నహ్యేనం ప్రతిషిద్ధవాన్ ॥ 4
దుర్యోధనుడు, ధృతరాష్ట్రునికి తెలియచేసియే, దాయాదులైన పాండవులను తగులబెట్టాడు. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. ధృతరాష్ట్రుడు ఈ దుష్కర్మను నిషేధించలేదు. గదా! (4)
నూనం శాంతనవోఽపీహ న ధర్మమనువర్తతే ।
ద్రోణశ్చ విదురశ్చైవ కృపశ్చాన్యే చ కౌరవాః ॥ 5
ఈ విషయంలో శంతను పుత్రుడు భీష్ముడు కూడా ధర్మాన్ని పాటించలేదు. ద్రోణుడు, విదురుడు, కృపుడు ఇతర కౌరవులు కూడా ధర్మాన్ని పాటించలేదు. (5)
తే వయం ధృతరాష్ట్రస్య ప్రేషయామో దురాత్మనః ।
సంవృత్తస్తే పరః కామః పాండవాన్ దగ్ధవానసి ॥ 6
కనుక మనం దుర్మార్గుడైన ధృతరాష్ట్రునకు "నీవు కోరుకొన్నది జరిగింది. పాండవులను తగులబెట్టావు" అని సందేశాన్ని పంపుదాము. (6)
తతో వ్యపోహమానాస్తే పాండవార్థే హుతాశనమ్ ।
నిషాదీం దదృశుర్దగ్ధాం పంచపుత్రామనాగసమ్ ॥ 7
పిదప పాండవుల కోసం అగ్నిశేషాన్ని కదిలించి, పురజనులు తన ఐదుగురు కుమారులతో సహా కాలిపోయిన నిరపరాధను - బోయస్త్రీని - చూశారు. (7)
ఖనకేన తు తేనైవ వేశ్మ శోధయతా బిలమ్ ।
పాంసుభిః పిహితం తచ్చ పురుషైస్తైర్న లక్షితమ్ ॥ 8
ఆ గృహాన్ని శుభ్రపరిచే ఖనకుడు సురంగమార్గం ధూళితో పూడ్చివేశాడు. దానిని పురజనులు చూడలేదు. (8)
తతస్తే జ్ఞాపయామాసుః ధృతరాష్ట్రస్య నాగరాః ।
పాండవానగ్నినా దగ్ధాన్ అమాత్యం చ పురోచనమ్ ॥ 9
పిదప ఆ పురజనులు పాండవులు మంత్రి పురోచనుడు అగ్ని ప్రమాదంలో కాలిపోయినట్లు ధృతరాష్ట్రునికి తెలియచేశారు. (9)
శ్రుత్వా తు ధృతరాష్ట్రస్తద్ రాజా సుమహదప్రియమ్ ।
వినాశం పాండుపుత్రాణాం విలలాప సుదుఃఖితః ॥ 10
ధృతరాష్ట్ర మహారాజు మిక్కిలి అప్రియమైన పాండుపుత్రుల మరణవార్తను విని, మిగుల దుఃఖితుడై ఆక్రోశించాడు. (10)
అద్య పాండుర్మృతో రాజా మమ భ్రాతా మహాయశాః ।
తేషు వీరేషు దగ్ధేషు మాత్రా సహ విశేషతః ॥ 11
అయ్యో! వీరులు పాండవులు తల్లితో సహా కాలిపోయారు. కీర్తిశాలి నా సోదరుడు పాండుమహారాజు నేడు మళ్ళీ చనిపోయినట్లు అనిపిస్తోంది. (11)
గచ్ఛంతు పురుషాః శీఘ్రం నగరం వారణావతమ్ ।
సత్కారయంతు తాన్ వీరాన్ కుంతి రాజసుతాం చ తామ్ ॥ 12
పురుషులారా! వేగంగా వారణావతనగరానికి వెళ్ళండి. ఆ వీరులను, కుంతిభోజుని కూతురిని గౌరవించండి. (12)
కారయంతు చ కుల్యాని శుభాని చ బృహంతి చ ।
యే చ తత్ర మృతాస్తేషాం సుహృదో యాంతు తానపి ॥ 13
వారందరికీ కులోచితాలూ, శుభప్రదాలూ అయిన పార లౌకికకర్మలను పెద్దపెట్టున జరిపించండి. అక్కడ వారితో పాటు చనిపోయిన వారి మిత్రులందరికీ, తగిన కర్మలు చేయించండి. (13)
ఏవం గతే మయా శక్యం యద్యత్ కారయితుం హితమ్ ।
పాండవానాం చ కుంత్యాశ్చ తత్సర్వం క్రియతాం ధనైః ॥ 14
ఏవముక్త్వా తతశ్చక్రే జ్ఞాతిభిః పరివారితః ।
ఉదకం పాండుపుత్రాణాం ధృతరాష్ట్రోఽంబికాసుతః ॥ 15
ఈ విధంగా జరిగినపుడు పాండవులకు కుంతికి మేలుకోసం ఏమేమికర్మలు చేయించటానికి వీలవుతుందో, వాటినన్నింటినీ ఎంత డబ్బు ఖర్చు అయినా సరే జరిపించండి. అంబికా తనయుడైన ధృతరాష్ట్రుడు ఇలా చెప్పి జ్ఞాతులతో కూడి పాండుపుత్రులందరికీ తిలోదకాలు ఇచ్చాడు. (14,15)
(సమేతాస్తు తతస్సర్వే భీష్మేణ సహ కౌరవాః ।
ధృతరాష్ట్రః సపుత్రశ్చ గంగామభిముఖా యయుః ॥
ఏకవస్త్రా నిరానందా నిరాభరణవేష్టనాః ।
ఉదకం కర్తుకామా వై పాండవానాం మహాత్మనామ్ ॥)
పిదప ధృతరాష్ట్రుడు, అతని పుత్రులు కౌరవులందరూ, భీష్మునితో కలసి గంగానది వద్దకు వెళ్ళారు. వారందరూ మహాత్ములైన పాండవులకు తిలోదకాలివ్వడానికి వెళ్ళారు. వారందరూ ఆభరణాలను కిరీటాదులను విసర్జించారు. ఏకవస్త్రులై దుఃఖంతో గంగ దగ్గరకు చేరారు.
రురుదుః సహితాః సర్వే భృశం శోకపరాయణాః ।
హా యుధిష్ఠిర కౌరవ్య హా భీమ ఇతి చాపరే ॥ 16
వారందరూ పరమదుఃఖితులై పరిపరివిధాల ఆక్రోశించారు. అయ్యో! కురుశ్రేష్ఠా యుధిష్ఠిరా! అని కొందరు, అయ్యో! భీమా! అంటూ కొందరూ శోకించారు. (16)
హా ఫల్గునేతి చాప్యన్యే హా యమావితి చాపరే ।
కుంతీమార్తాశ్చ శోచంతః ఉదకం చక్రిరే జనాః ॥ 17
మరికొందరు అయ్యో! అర్జునా! అన్నారు. మరికొందరు నకులసహదేవులను గూర్చి శోకించారు. కొందరు దుఃఖితులై కుంతి మరణానికి విలపించారు. అచట చేరిన జనులందరూ పాండవులకు తిలోదకాలిచ్చారు. (17)
అన్యే పౌరజనాశ్చైవమ్ అన్వశోచంత పాండవాన్ ।
విదురస్త్వల్పశ్చక్రే శోకం వేద పరం హి సః ॥ 18
పురజనులందరూ పాండవులను గూర్చి రకరకాలుగా దుఃఖించారు. పూర్వాపరాలు తెలిసిన విదురుడు మాత్రం కొంచెంగా శోకించాడు. (18)
(తతః ప్రవ్యథితో భీష్మః పాండురాజసుతాన్ మృతాన్ ।
సహ మాత్రేతి తచ్ఛ్రుత్వా విలలాప రురోద చ ॥
భీష్మ ఉవాచ
న హి తే నోత్సహేయాతాం భీమసేన ధనంజయౌ ।
తరసా వేగితాత్మానౌ నిర్భేత్తుమపి మందిరమ్ ।
పరాసుత్వం న పశ్యామి పృథాయాః సహ పాండవైః ॥
సర్వథా వికృతం నీతం యది తే నిధనం గతాః ।
ధర్మరాజః స నిర్దిష్టః నను పిప్రైర్యుధిష్ఠిరః ॥
సత్యవ్రతో ధర్మదత్తః సత్యవాక్ శుభలక్షణః ।
కథం కాలవశం ప్రాప్తః పాండవేయో యుధిష్ఠిరః ॥
ఆత్మానముపమాం కృత్వా పరేషాం వర్తతే తు యః ।
సహ మాత్రా తు కౌరవ్యః కథం కాలవశం గతః ॥
యౌవరాజ్యేభిషిక్తేన పితుర్యేనాహృతం యశః ।
ఆత్మనశ్చ పితుశ్చైవ సత్యధర్మస్య వృత్తిభిః ॥
కాలేన స హి సంభగ్నః ధిక్కృతాంత మనర్థకమ్ ॥
యచ్చ సా వనవాసేన క్లేశితా దుఃఖభాగినీ ।
పుత్రగృధ్నుతయా కుంతీ న భర్తారం మృతా త్వను ॥
అల్పకాలం కులే జాతా భర్తుః ప్రీతి మవాప యా ।
దగ్ధాద్య సహ పుత్రైస్సా అసంపూర్టమనోరథా ॥
పీనస్కంధ శ్చారుబాహుః మేరుకూటసమో యువా ।
మృతో భీమ ఇతి శ్రుత్వా మనో న శ్రద్ధధాతి మే ॥
అనింద్యాన్ చ యో గచ్చన్ క్షిప్రహస్తో దృఢాయుధః ।
ప్రపత్తిమాన్ లబ్ధలక్ష్యః రథయానవిశారదః ॥
దూరపాతీ త్వసంభ్రాంతః మహావీర్యో మహాస్త్రవిత్ ।
అదీనాత్మా నరవ్యాఘ్రః శ్రేష్ఠః సర్వధనుష్మతామ్ ॥
యేన ప్రాచ్యా స్ససౌవీరాః దాక్షిణాత్యాశ్చ నిర్జితాః ।
ఖ్యాపితం యేన శూరేణ త్రిషు లోకేషు పౌరుషమ్ ॥
యస్మిన్ జాతే విశోకాభూత్ కుంతీ పాండుశ్చ వీర్యవాన్ ।
పురందరసమో జిష్ణుః కథం కాలవశం గతః ॥
కథం తావృషభస్కంధౌ సింహవిక్రాంతగామినౌ ।
మర్త్యధర్మమనుప్రాప్తౌ యమావరినిబర్హణౌ ॥
పిదప పాండుసుతులు కుంతితో సహా మరణించారని వార్తను విన్న భీష్ముడు మిక్కిలి శోకించాడు. పలువిధాలుగా వారికోసం ఆక్రోశించాడు. అలమటించాడు. భీష్ముడిలా అన్నాడు - భీమసేన ధనంజయులు శీఘ్రంగా తప్పించుకోవాలనుకొంటే, ఆ నివాసాన్ని బద్దలుకొట్టడానికైనా సమర్ఠులే. వారు అలాంటి ఉత్సాహాన్ని చూపించలేదు. పాండవులూ, కుంతి మరణించారని నాకు తోచటం లేదు. అదే జరిగితే ఇంతకంటె చెడ్డవార్త మరొకటి ఉండదు. యుధిష్ఠిరుడు-ధర్మరాజు-విప్రులచే అనేకవిధాలుగా ప్రశంసింపబడ్డాడు. అతడు సత్యవ్రతుడు. ఎప్పుడూ సత్యాన్నే పలికేవాడు. అతడు తనను తాను ధర్మానికి అర్పించుకొన్నాడు. అతనిలో అన్నీ మంచిలక్షణాలే ఉన్నాయి. అటువంటి పాండునందనుడు-యుధిష్ఠిరుడు-ఎలా చనిపోయాడు. తన పట్ల తాను ఏ విధంగా ప్రవర్తిస్తాడో, ఇతరుల విషయంలో కూడా అంత ప్రేమగాను యుధిష్ఠిరుడు ప్రవర్తించేవాడు. అతడు తల్లితో సహా ఎలా చనిపోయాడు. యువరాజుగా అభిషిక్తుడైన యుధిష్ఠిరుడు, సత్య ధర్మాలను పాటిస్తూ తనకీర్తిని, తండ్రికీర్తిని పెంచిపోషించాడు. అటువంటివాడు కాలునిచే చంపబడ్డాడు. యముడెంత చెడ్డవాడు! పాపం! కుంతి బహుకాలం అరణ్యవాసం అనుభవించింది. దుఃఖాలను పొందింది. కేవలం కొడుకుల మీద ప్రేమతో, ఆమె భర్తతో పాటు మరణించకుండా ప్రాణాలను కాపాడుకొన్నది. గొప్ప వంశంలో పుట్టిన కుంతి కొద్దికాలం మాత్రమే భర్తతో సుఖించింది. అటువంటి కుంతి ఏ కోరికలు తీరకుండానే పుత్రులతోపాటు కాలిపోయింది. బలిసిన భుజాలతో అందమైన చేతులతో మేరు పర్వతంలా కన్పించే భీమసేనుడు మరణించాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. అర్జునుడు సత్ప్రవర్తన కలవాడు. చురుకుగా చేతుల్ని కదిలించేవాడు. అతడు గొప్ప ఆయుధాల నుపయోగించేవాడు. వినయశీలి రథం నడపడంలో ప్రవీణుడు. ఎంతదూరమైనా ప్రయాణించేవాడు. అతనికి తొట్రుపాటులేదు. గొప్ప అస్త్రాలు తెలిసినవాడు. మహా బలశాలి. ఆ శూరుడు తూర్పుదేశాలవారిని, సౌవీరులను, దక్షిణదేశాల రాజులను జయించి ముల్లోకాల్లో తన పౌరుషాన్ని ప్రకటించాడు. అర్జునుని పుట్టుకతో పాండురాజు, కుంతి పరమానందపడ్డారు. ఆ ఇంద్రసముడైన విజేత అర్జునుడు ఎలా మరణించాడు? ఎద్దుమూపురం వంటి భుజాలతో సింహంలాంటి గంభీరమైన నడవడికతో, శోభించే కవలలు నకులసహదేవులు శత్రుసంహారకులు. అటువంటి వారు ఎలా మరణించారు?
వైశంపాయన ఉవాచ
తస్య విక్రందితం శ్రుత్వా ఉదకం చ ప్రసించతః ।
దేశకాలం సమాజ్ఞాయ విదురః ప్రత్యభాషత ॥
మా శౌచీస్త్వం నరవ్యాఘ్ర జహి శోకం మహావ్రత ।
న తేషాం విష్యతే పాపం ప్రాప్తకాలం కృతం మయా ।
ఏతచ్చ తేభ్య ఉదకం విప్రసించ న భారత ॥
సోఽబ్రవీత్ కించిదుత్సార్య కౌరవణామశృణ్వతామ్ ।
క్షత్తారముపసంగృహ్య బాష్పోత్పీడకలస్వరః ॥
వైశంపాయనుడిలా అన్నాడు. తిలోదకాలిస్తూ, భీష్ముడు చేస్తున్న విలాపాలను విని, విదురుడు దేశకాలాలను గమనించి ఇలా అన్నాడు. బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడా! పురుష శ్రేష్ఠ! నీవు దుఃఖించరాదు. శోకాన్ని విడిచిపెట్టు. పాండవులకు ఏకీడూ రాదు. సమయానికి తగ్గట్టు నేను చేయవలసింది చేశాను. వారి కోసం నీవు తిలోదకాలు ఇవ్వనవసరం లేదు అన్నాడు విదురుడు భీష్మునితో. అప్పుడు భీష్ముడు కొద్దిగా పక్కకు తొలగి, విదురుని పట్టుకొని, ఆనందబాష్పం కారణంగా అస్పష్టమైన తియ్యనిస్వరంతో,కౌరవులు వినకుండా, విదురునితో ఇలా అన్నాడు.
భీష్మ ఉవాచ
కథం తే తాత జీవంతి పాండోః పుత్రాః మహారథాః ।
కథమస్మత్కృతే పక్షః పాండోర్నహి నిపాతితః ॥
కథం మత్ప్రముఖాః సర్వే ప్రముక్తా మహతో భయాత్ ।
జననీ గరుడేనేవ కుమారాస్తే సముద్ధృతాః ।
భీష్ముడన్నాడు. నాయనా! మహారథులు పాండుపుత్రులు ఎలా జీవించగల్గారు? పాండవులు మన అదృష్టం కొద్దీ ఎలా పతనాన్నుండి తప్పుకొన్నారు? నాలాంటి వారందరూ మహాపాపభయం నుండి ఎలా తప్పుకోగలిగారు? గరుడుని కారణంగా అతని తల్లి వినత దాస్యాన్నుండి తప్పుకొన్నట్లు నీవల్ల పాండవులు పతనాన్నుండి తప్పుకొన్నారు కదా!
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు కౌరవ్య కౌరవాణామశృణ్వతామ్ ।
ఆచచక్షే స ధర్మాత్మా భీష్మాయాద్భుత కర్మణే ॥
వైశంపాయనుడన్నాడు. కురుశ్రేష్ఠ! జనమేజయా! ఇలా భీష్ముడు అడిగితే ధర్మాత్ముడు, విదురుడు కౌరవులు వినకుండా (ఆశ్చర్యాన్ని కల్గించే పనులు చేసే) భీష్మునితో ఇలా చెప్పాడు.
విదుర ఉవాచ
ధృతరాష్ట్రస్య శకునేః రాజ్ఞో దుర్యోధనస్య చ ।
వినాశే పాండుపుత్రాణాం కృతో మతివినిశ్చయః ॥
తతో జతుగృహం గత్వా దహనేఽస్మిన్ నియోజితే ।
పృథాయాశ్చ సపుత్రాయాః ధార్తరాష్ట్రస్య శాసనాత్ ॥
తతః ఖనక మాహూయ సురంగాం వై బిలే తదా ।
స గుహాం కారయిత్వా తే కుంత్యా పాండుసుతాస్తదా ॥
నిష్క్రామితా మయా పూర్వం మా స్మ శోకే మనః కృథాః ।
నిర్గతాః పాండవా రాజన్ మాత్రా సహ పరంతపాః ॥
అగ్నిదాహాన్మహాఘోరాత్ మయా తస్మాదుపాయతః ।
మా స్మ శోక మిమం కార్షీః జీవంత్యేవ చ పాండవాః ॥
ప్రచ్ఛన్నా విచరిష్యంతి యావత్ కాలస్య పర్యయః ।
తస్మిన్ యుధిష్ఠిరం కాలే ద్రక్ష్యంతి భువి భూమిపాః ॥)
విదురుడన్నాడు. రాజు ధృతరాష్ట్రుడు, శకుని, దుర్యోధనుడు కలసి పాండవులను నాశనం చెయ్యాలని నిశ్చయించుకొన్నారు. దుర్యోధనుని ఆజ్ఞమేరకు కుమారులతో సహా కుంతిని చంపడానికి లక్కయింటికి నిప్పుపెట్టడానికి పురోచనుడు నియమింపబడ్డాడు. పిదప నేను ఒక ఖనకుని పిలిచి, లక్క ఇంటిలో ఒక సురంగాన్ని తవ్వించి గుహను నిర్మింపచేశాను. దాని ద్వారా పాండవులు, కుంతి బయటకు దాటింపబడ్డారు. వారి విషయంలో శోకింపనవసరం లేదు. శత్రువిమర్దనులైన పాండవులు మహాభయంకరమైన గృహాగ్ని నుండి ఈ ఉపాయంతో రక్షింపబడ్డారు. నీవు శోకించవద్దు. పాండవులు బ్రతికే ఉన్నారు. కాలం పరిపక్వమయ్యే వరకు పాండవులు రహస్యంగా తిరుగుతూ ఉంటారు. సరియైన సమయంలో రాజులందరూ యుధిష్ఠిరుని చూస్తారు.
పాండవాశ్చాపి నిర్గత్య నగరాద్ వారణావతాత్ ।
నదీం గంగా మనుప్రాప్తాః మాతృషష్ఠాః మహాబలాః ॥ 19
తల్లితో కూడి ఆర్గురు మహాబలులు పాండవులు, వారణావత నగరం నుండి బయటకు వచ్చి, గంగా నదిని చేరుకొన్నారు. (19)
దాశానాం భుజవేగేన నద్యాః స్రోతోజవేన చ ।
వాయునా చానుకూలేన తూర్ణం పారమవాప్నువన్ ॥ 20
పాండవులందరూ నావికుల బాహువేగం వల్ల, నదీ ప్రవాహంలోని వేగం వల్ల, గాలి ప్రయాణానికి అనుకూలంగా వీస్తుండటం వల్ల శీఘ్రంగా గంగ ఆవలి గట్టును చేరుకొన్నారు. (20)
తతో నావం పరిత్యజ్య ప్రయయుర్దక్షిణాం దిశమ్ ।
విజ్ఞాయ నిశి పంథానం నక్షత్రగణసూచితమ్ ॥ 21
తర్వాత వారు పడవను విడిచి పెట్టి, రాత్రి సమయమందే నక్షత్ర సమూహాల వల్ల దిక్కులను తెలుసుకొంటూ దక్షిణ దిక్కునకు ప్రయాణం సాగించారు. (21)
యతమానా వనం రాజన్ గహనం ప్రతిపేదిరే ।
తతః శ్రాంతాః పిపాసార్తాః నిద్రాంధాః పాండునందనాః ॥ 22
పునరూచుర్మహావీర్యం భీమసేనమిదం వచః ।
ఇతః కష్టతరం కిం ను యద్ వయం గహనే వనే ।
దిశశ్చ న విజానీమః గంతుం చైవ న శక్నుమః ॥ 23
రాజా! పాండవులు ఎంతో శ్రమించి, ఒక దట్టమైన అడవిని సమీపించారు. పిదప వారు మిక్కిలి శ్రమచెంది, దాహంతో నిద్రతో బాధపడుతూ, భీమసేనునితో తిరిగి ఇలా అన్నారు. "ఇంతకన్న కష్టమేముంటుంది? ఈ అరణ్యం చాలా దట్టంగా ఉంది. దిక్కులు కూడ తెలియటం లేదు. ముందుకు ప్రయాణించటానికి సామర్థ్యం సన్నగిల్లింది. (22,23)
తం చ పాపం న జానీమః యది దగ్ధః పురోచనః ।
కథం తు విప్రముచ్యేమ భయాదస్మాదలక్షితాః ॥ 24
దుర్మార్గుడు పురోచనుడు కాలిపోయాడో లేదో తెలియదు. మనం ఎవ్వరికీ తెలియకుండా ఈ శత్రుభయం నుండి ఎలా బయటపడతామో తెలియటం లేదు అన్నారు. (24)
పునరస్మానుపాదాయ తథైవ వ్రజ భారత ।
త్వం హి నో బలవానేకః యథా సతతగస్తథా ॥ 25
అపుడు ధర్మజుడు భీమసేనా! మాలో నీవే బలవంతుడవు. వాయువు వలె బలశాలివి. నీవు పూర్వం మమ్ములను మోసుకొని పోయినట్లు, ఇప్పుడు కూడా మమ్మల్ని మోసుకొని తీసుకుపోవలసింది" అన్నాడు ధర్మరాజు. (25)
ఇత్యుక్తో ధర్మరాజేన భీమసేనో మహాబలః ।
ఆదాయ కుంతీం భ్రాతౄంశ్చ జగామాశు మహాబలః ॥ 26
ధర్మరాజు చెప్పిన మాటవిని, మహాబలుడు భీమసేనుడు కుంతిని, ఇతర సోదరులను ఎత్తుకొని మోసుకుంటూ శీఘ్రంగా అరణ్యంలోకి ప్రయాణించాడు. (26)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి పాండవ వనప్రవేశే ఏకోన పంచాశదధిక శతతమోఽధ్యాయః ॥149॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున జతుగృహపర్వమను ఉపపర్వమున పాండవ వనప్రవేశమను నూట నలువది తొమ్మిదవ అధ్యాయము. (149)
(దాక్షిణాత్య అధికపాఠం 29 శ్లోకాలు కలుపుకొని 55 శ్లోకాలు)