136. నూట ముప్పదియారవ అధ్యాయము
భీమసేనుడు కర్ణుని తిరస్కరించుట - సుయోధనుడు సత్కరించుట.
వైశంపాయన ఉవాచ
తతః స్రస్తోత్తరపటః సప్రస్వేదః సవేపథుః ।
వివేశాధిరథో రంగం యష్టిప్రాణో హ్వయన్నివ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ తరువాత కొరడాయే తన ప్రాణమైన అధిరథుడు కర్ణుని పిలుస్తూ రంగస్థలం మీదకు ప్రవేశించాడు. ఆయన ఉత్తరీయం జారిపోతోంది. చెమటపట్టి శరీరం కంపిస్తోంది. (1)
తమాలోక్య ధనుస్త్యక్త్వా పితృగౌరవయంత్రితః ।
కర్ణోఽభిషేకార్ద్రశిరాః శిరసా సమవందత ॥ 2
తండ్రిని చూచి ఆయనమీదున్న గౌరవంతో కర్ణుడు వింటిని విడిచి పట్టాభిషేకంతో తడిసి ఉన్న తన తల ఆయన పాదాలపై ఉంచి నమస్కరించాడు. (2)
తతః పాదావవచ్ఛాద్య పటాంతేన ససంభ్రమః ।
పుత్రేతి పరిపూర్ణార్థమ్ అబ్రవీత్ రథసారథిః ॥ 3
ఆపై అధిరథుడు తన పాదాలను ఉత్తరీయపు అంచుతో కప్పుకొని "కుమారా" అని తడబాటుతో పిలుస్తూ తనను కృతార్థునిగా భావించాడు. (3)
పరిష్వజ్య చ తస్యాథ మూర్ధానం స్నేహవిక్లవః ।
అంగరాజ్యాభిషేకార్ద్రమ్ అశ్రుభిః సిషిచే పునః ॥ 4
ఆ అధిరథుడు వాత్సల్యంతో ఆ కర్ణుని గుండెలకు హత్తుకొని అంగరాజ్యాభిషేకంతో అప్పటికే తడిసిన అతనిని కన్నీటితో మరలా తడిపాడు. (4)
తం దృష్ట్వా సూతపుత్రోఽయమ్ ఇతి సంచింత్య పాండవః ।
భీమసేనస్తదా వాక్యమ్ అబ్రవీత్ ప్రహసన్నివ ॥ 5
ఆ అధిరథుని చూచి భీమసేనుడు కర్ణుని సూతపుత్రునిగా గ్రహించి నవ్వుతూ ఇలా అన్నాడు. (5)
న త్వమర్హసి పార్థేన సూతపుత్ర రణే వధమ్ ॥
కులస్య సదృశస్తూర్ణం ప్రతోదో గృహ్యతాం త్వయా ॥ 6
సూతపుత్రా! యుద్ధంలో అర్జునుని చేతిలో చావటానికి కూడా నీకు అర్హత లేదు. నీ కులానికి తగినట్టుగా వెంటనే కొరడాను చేత బట్టు. (6)
అంగరాజ్యం చ నార్హస్త్వమ్ ఉపభోక్తుం నరాధమ ।
శ్వా హుతాశసమీపస్థం పురోడాశమివాధ్వరే ॥ 7
నరాధమా! అంగరాజ్యాన్ని అనుభవించటానికి కూడా నీవు అర్హుడవు కావు. యాగంలో అగ్నిహోత్రునికి దగ్గరగా ఉన్న పురోడాశాన్ని కుక్క పొందలేదు గదా! (7)
ఏవముక్తస్తతః కర్ణః కించిత్ ప్రస్ఫురితాధరః ।
గగనస్థం వినిఃశ్వస్య దివాకరముదైక్షత ॥ 8
భీమసేనుని ఆ మాటలు విని కర్ణుడు పెదవి కొంచెం కంపించగా పెద్ద నిట్టూర్పు విడిచి గగనతలంపై నున్న సూర్యుని చూశాడు. (8)
తతో దుర్యోధనః కోపాత్ ఉత్పపాత మహాబలః ।
భ్రాతృపద్మవనాత్ తస్మాత్ మదోత్కట ఇవ ద్విపః ॥ 9
అప్పుడు బలశాలి అయిన దుర్యోధనుడు కోపంతో సోదరులు అనే పద్మాకరం నుండి మదపుటేనుగు బయటకు వచ్చినట్టు ముందుకురికాడు. (9)
సోఽబ్రవీద్ భీమకర్మాణం భీమసేనమవస్థితమ్ ।
వృకోదర న యుక్తం తే వచనం వక్తుమీదృశమ్ ॥ 10
ఆ దుర్యోధనుడు అక్కడ నిలిచి ఉన్న ఘోరకర్మాసక్తుడైన భీమసేనునితో ఇలా అన్నాడు- వృకోదరా! ఈ విధంగా మాటాడటం నీకు తగదు. (10)
క్షత్రియాణాం బలం జ్యేష్ఠం యోద్ధవ్యం క్షత్రబంధునా ।
శూరాణాం చ నదీనాం చ దుర్విదాః ప్రభవాః కిల ॥ 11
క్షత్రియులకు బలమే ప్రధానం. బలముంటే హీనక్షత్రియునితో నయినా పోరాడవలసినదే. శూరులపుట్టుక, ఏరులపుట్టుకలలోని వాస్తవాలను తెలిసికొనటం చాలా కష్టం. (11)
సలిలాదుత్థితో వహ్నిః యేన వ్యాప్తం చరాచరమ్ ।
దధీచస్యాస్థితో వజ్రం కృతం దానవసూదనమ్ ॥ 12
చరాచర ప్రపంచమంతా వ్యాపించి ఉన్న అగ్ని నీటినుండి పుట్టింది. రాక్షస సంహారం చేయగల వజ్రాయుధం దధీచి వెన్నెముక నుండి తయారయినది. (12)
ఆగ్నేయః కృత్తికాపుత్రః రౌద్రో గాంగేయ ఇత్యపి ।
శ్రూయతే భగవాన్ దేవః సర్వగుహ్యమయో గుహః ॥ 13
సమస్తగుహ్యస్వరూపుడైన స్కందభగవానుడు అగ్ని, కృత్తిక, రుద్రుడు, గంగ-వీరందరి కొడుకు అని అంటుంటారు. (13)
క్షత్రియేభ్యశ్చ యే జాతాః బ్రాహ్మణాస్తే చ తే శ్రుతాః ।
విశ్వామిత్రప్రభృతయః ప్రాప్తా బ్రహ్మత్వమవ్యయమ్ ॥ 14
ఎంతో మంది బ్రాహ్మణులు క్షత్రియులకు పుట్టిన వాళ్ళున్నారు. నీవు కూడా వినే ఉంటావు. విశ్వామిత్రుని వంటి క్షత్రియులు కూడా బ్రాహ్మణత్వాన్ని పొందారు. (14)
ఆచార్యః కలశాజ్జాతః ద్రోణః శస్త్రభృతాం వరః ।
గౌతమస్యాన్వవాయే చ శరస్తంబాచ్చ గౌతమః ॥ 15
శస్త్రధారులలో మేటి అయిన ద్రోణాచార్యుడు కలశం నుండి పుట్టినవాడు. గౌతమమహర్షివంశంలో కృపాచార్యుడు ఱెల్లుపొదనుండి పుట్టినవాడే. (15)
భవతాం చ యథా జన్మ తదప్యాగమితం మయా ।
సకుండలం సకవచం సర్వలక్షణలక్షితమ్ ।
కథమాదిత్యసదృశం మృగీ వ్యాఘ్రం జనిష్యతి ॥ 16
మీ సోదరులందరి పుట్టుక ఎటువంటిదో అది కూడా నాకు తెలుసు. సర్వశుభలక్షణాలతో కూడి కవచకుండలాలతో పుట్టిన ఈ సూర్యతేజస్కుడు కర్ణుడు సూతస్త్రీకి ఎలా పుట్టగలదు? జింక పులిని కనలేదు గదా! (16)
(కథమాదిత్య సంకాశం సూతోఽముం జనయిష్యతి ।
ఏవం క్షత్రగుణైర్యుక్తం శూరం సమితిశోభనమ్ ॥)
పృథివీరాజ్యమర్హోఽయం నాంగరాజ్యం నరేశ్వరః ।
అనేన బాహువీర్యేణ మయా చాజ్ఞానువర్తినా ॥ 17
సూర్యతేజస్కుడై, క్షత్రియగుణసంపన్నుడై, యుద్ధాలంకారుడై, శూరుడైన ఇటువంటి వానిని సూతుడెట్లు కనగలడు? తన బాహుబలం వలనా, ఆదేశాలను శిరసావహించ సిద్ధపడిన నా వంటి మిత్రుని తోడ్పాటువలనా ఈ అంగరాజు అంగదేశానికే కాదు, సమస్తభూమండలానికీ రాజు కాదగినవాడు. (17)
యస్య వా మనుజస్యేదం న క్షాంతం మద్విచేష్టితమ్ ।
రథమారుహ్య పద్భ్యాం సః వినామయతు కార్ముకమ్ ॥ 18
ఎవరికైనా నేను చేసిన ఈ పని నచ్చకపోతే రథాన్ని అధిరోహించి కానీ పాదచారులై కాని వింటిని ఎక్కు పెట్టవచ్చు. (18)
తతః సర్వస్య రంగస్య హాహాకారో మహానభూత్ ।
సాధువాదానుసంబద్ధః సూర్యశ్చాస్తముపాగమత్ ॥ 19
అప్పుడు రంగస్థలమంతా సుయోధనునకు అభినందనలతో పాటు యుద్ధం జరుగుతుందన్న భయంతో హాహాకారాలు చెలరేగాయి. అంతలో సూర్యుడు అస్తమించాడు. (19)
తతో దుర్యోధనః కర్ణమ్ ఆలంబ్యాగ్రకరే నృపః ।
దీపికాగ్నికృతాలోకః తస్మాద్ రంగాద్ వినిర్యయౌ ॥ 20
అప్పుడు దుర్యోధననరపాలుడు కర్ణుని చేతివ్రేళ్ళను పట్టుకొని దీపాలకాంతిలో ఆ రంగస్థలం నుండి నిష్క్రమించాడు. (20)
పాండవాశ్చ సహద్రోణాః సకృపాశ్చ విశాంపతే ।
భీష్మేణ సహితాః సర్వే యయుః స్వం స్వం నివేశనమ్ ॥ 21
రాజా! పాండవులు కూడా ద్రోణునితో, కృపునితో, భీష్మునితో కలిసి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. (21)
అర్జునేతి జనః కశ్చిత్ కశ్చిత్ కర్ణేతి భారత ।
కశ్చిద్ దుర్యోధనేత్యేవం బ్రువంతః ప్రస్థితాస్తదా ॥ 22
భారతా! ప్రేక్షకులు కొందరు అర్జునుని గురించి, కొందరు కర్ణుని గురించీ, మరికొందరు దుర్యోధనుని గురించి మాటాడుకొంటూ అప్పుడు బయలుదేరారు. (22)
కుంత్యాశ్చ ప్రత్యభిజ్ఞాయ దివ్యలక్షణసూచితమ్ ।
పుత్రమంగేశ్వరం స్నేహాత్ ఛన్నా ప్రీతిరజాయత్ ॥ 23
కుంతి దివ్యలక్షణాలతో కనిపిస్తున్న అంగరాజు కర్ణుని తన కుమారునిగా గుర్తించింది. దానితో ఆమె ఇతరులు తెలిసికొనలేని రీతిలో ఆనందించింది. (23)
దుర్యోధనస్యాపి తదా కర్ణమాసాద్య పార్థివ ।
భయమర్జునసంజాతం క్షిప్రమంతరధీయత ॥ 24
రాజా! కర్ణుని చేరిక తరువాత దుర్యోధనునికి కూడా అర్జునుని కారణంగా కలిగిన భయం వెంటనే అంతరించి పోయింది. (24)
స చాపి వీరః కృతశస్త్రనిశ్రమః
పరేణ సామ్నాభ్యవదత్ సుయోధనమ్ ।
యుధిష్ఠిరస్యాప్యభవత్ తదా మతిః
న కర్ణతుల్యోఽస్తి ధనుర్ధరః క్షితౌ ॥ 25
అస్త్ర విద్యలో భూరిపరిశ్రమచేసిన ఆ వీరుడు-కర్ణుడు కూడా సుయోధనునితో ప్రేమగా వ్యవహరించసాగాడు. కర్ణునితో సమానుడయిన విలుకాడు భూమిపై లేడని ధర్మరాజు కూడా భావించాడు. (25)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి అస్త్రదర్శనే షట్ త్రింశదధిక శతతమోఽధ్యాయః ॥ 136 ॥
ఇధి శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున అస్త్రదర్శనమను నూట ముప్పది యారవ అధ్యాయము. (136)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి మొత్తం 26 శ్లోకాలు)