135. నూట ముప్పది అయిదవ అధ్యాయము

కర్ణప్రవేశము - రాజ్యాభిషేకము.

వైశంపాయన ఉవాచ
దత్తేఽవకాశే పురుషైః విస్మయోత్ఫుల్లలోచనైః ।
వివేశ రంగం విస్తీర్ణం కర్ణః పరపురంజయః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. ఆశ్చర్యంతో వికసించిన కన్నులు గల ద్వారపాలకులు అవకాశమిచ్చిన తరువాత శత్రుపురవిజేత అయిన కర్ణుడు విశాలమైన ఆ రంగస్థలం మీదకు వచ్చాడు. (1)
సహజం కవచం బిభ్రత్ కుండలోద్ద్యోతితాననః ।
సధనుర్బద్ధనిస్త్రింశః పాదచారీన పర్వతః ॥ 2
ఆ కర్ణుడు శరీరంతో పాటే పుట్టిన కవచాన్ని ధరిమ్చి ఉన్నాడు. చెవులకున్న కుండలాలు ముఖాన్ని వికసింపజేస్తున్నాయి. చేత ధనస్సును పట్టి, నడుముకు కత్తిని కట్టుకొని వస్తున్న ఆ కర్ణుడు కదిలివస్తున్న కొండలా కనిపించాడు. (2)
కన్యాగర్భః పృథుయశాః పృథాయాః పృథులోచనః ।
తీక్ష్ణాంశోర్భాస్కరస్యాంశః కర్ణోఽరిగణసూదనః ॥ 3
ఆ కర్ణుని కుంతి కన్యావస్థయందే గర్భాన ధరించింది. విశాలమయిన కీర్తీ, పెద్దకన్నులూ కలవాడతడు. శత్రుసమూహనాశకుడైన ఆ కర్ణుడు వాడి కిరణాలు గల సూర్యుని అంశగా (ద్వారా) జన్మించాడు. (3)
సింహర్షభగజేంద్రాణాం బలవీర్యపరాక్రమః ।
దీప్తికాంతిద్యుతిగుణైః సూర్యేందుజ్వలనోపమః ॥ 4
అతడు సింహం, ఎద్దు, ఏనుగుల వలె బలవీర్యపరాక్రమాలు కలవాడు. దీప్తిలో సూర్యునితోనూ, కాంతిలో చంద్రునితోనూ, తేజస్సులో అగ్నితోనూ సమానమైన వాడు. (4)
ప్రాంశుః కనకతాలాభః సింహసంహననో యువా ।
అసంఖ్యేయగుణః శ్రీమాన్ భాస్కరస్యాత్మసంభవః ॥ 5
పొడగరి అయిన ఆ కర్ణుడు బంగారు తాటిచెట్టువలె కనిపిస్తున్నాడు. యువకుడైన అతని శరీరనిర్మాణం సింహాన్ని పోలి ఉంది. సూర్యభగవానుని కుమారుడు కాబట్టి దివ్యశోభతో వెలుగుతున్న అతడు లెక్కకందని మంచి లక్షణాలు గలవాడు. (5)
స నిరీక్ష్య మహాబాహుః సర్వతో రంగమండలమ్ ।
ప్రణామం ద్రోణకృపయోః నాత్యాదృతమివాకరోత్ ॥ 6
మహాబాహుడైన ఆ కర్ణుడు రంగమండపమంతా కలయజూచి ద్రోణుకృపులకు నమస్కరించాడు. అయితే ఆ నమస్కృతిలో పెద్దగా గౌరవభావం లేదు. (6)
స సమాజజనః సర్వః నిశ్చలః స్థిరలోచనః ।
కో-యమిత్యాగతక్షోభః కౌతూహలపరోఽభవత్ ॥ 7
అక్కడున్న ప్రేక్షక సముదాయమంతా రెప్పవాల్చకుండా నిశ్చలంగా చూస్తున్నారు. "ఇతనెవరు"? అన్న ఆలోచనతో ఆ ప్రేక్షకులలో కుతూహలమా, వ్యాకులపాటూ కూడా కలిగాయి. (7)
సోఽబ్రవీన్మేఘగంభీర స్వరేణ వదతాం వరః ।
భ్రాతా భ్రాతరమజ్ఞాతం సావిత్రః పాకశాసనిమ్ ॥ 8
అంతలోనే మాటకారులలో మేటి అయిన సూర్యసుతుడు-కర్ణుడు-మేఘగంభీరమైన కంఠంతో తానెరుగని సోదరుడైన అర్జునునితో ఇలా అన్నాడు. (8)
పార్థ యత్ తే కృతం కర్మ విశేషవదహం తతః ।
కరిష్యే పశ్యతాం నౄణాం మాఽఽత్మనా విస్మయం గమః ॥ 9
కౌంతేయా! నీవు ఈ రంగస్థలంపై ప్రదర్శించిన దానికన్న విశిష్టమైన విన్యాసాలను ఈ ప్రేక్షకుల సమక్షంలో ప్రదర్శించగలను. నీ గురించి నీవు గర్వపడవలదు. (9)
అసమాప్తే తతస్తస్య వచనే వదతాం వర ।
యంత్రోత్షిప్త ఇవోత్తస్థౌ క్షిప్రం వై సర్వతో జనః ॥ 10
ప్రవక్తృశ్రేష్ఠా! జనమేజయా! ఆ కర్ణుని మాటలు ముగియకుండానే అన్నివైపులా ఉన్న ప్రేక్షక జనులు వెంటనే యంత్రంతో పైకెత్తినట్టుగా లేచి నిలబడ్డారు. (10)
ప్రీతిశ్చ మనుజ్యవ్యాఘ్ర దుర్యోధనముపావిశత్ ।
హ్రీశ్చ క్రోధశ్చ బీభత్సుం క్షణేనాన్వావివేశ హ ॥ 11
నరశ్రేష్ఠా! దుర్యోధనునకు ఎంతో ఆనందం కలిగింది. క్షణకాలంలో సిగ్గూ, కోపమూ అర్జునుని ఆవేశించాయి. (11)
తతో ద్రోనాభ్యనుజ్ఞాతః కర్ణః ప్రియరణః సదా ।
యత్ కృతం తత్ర పార్థేన తచ్చకార మహాబలః ॥ 12
కర్ణుడు ఎప్పుడూ పోరాడటాన్ని ఇష్టపడేవాడు. ఆ మహాబలుడు ఆ సమయంలో ద్రోణుని అనుమతితో అర్జునుడు ప్రదర్శించిన అస్త్రవిద్యాకౌశలం అంతా తానూ ప్రదర్శించాడు. (12)
అథ దుర్యోధనస్తత్ర భ్రాతృభిః సహ భారత ।
కర్ణం పరిష్వజ్య ముదా తతో వచనమబ్రవీత్ ॥ 13
జనమేజయా! అప్పుడు దుర్యోధనుడు సోదరులతో సహా ఆనందంతో కర్ణుని కౌగిలించుకొని ఇలా అన్నాడు. (13)
దుర్యోధన ఉవాచ
స్వాగతం తే మహాబాహో దిష్ట్యా ప్రాప్తోఽసి మానద ।
అహం చ కురురాజ్యం చ యధేష్టముపభుజ్యతామ్ ॥ 14
దుర్యోధనుడిలా అన్నాడు. మహాబాహూ! నీకు స్వాగతం. మానదా! నా అదృష్టం కొద్దీ వచ్చావు. నేనూ, ఈ కురురాజ్యమూ అంతా నీదే-స్వేచ్ఛగా అనుభవించు. (14)
కర్ణ ఉవాచ
కృతం సర్వమహం మన్యే సఖిత్వం చ త్వయా వృణే ।
ద్వంద్వయుద్ధం చ పార్ధేన కర్తుమిచ్ఛామ్యహం ప్రభో ॥ 15
కర్ణుడిలా అన్నాడు. ప్రభూ! తమరు చెప్పినదంతా జరిగినట్లుగానే భావిస్తున్నాను. తమతో మైత్రిని కోరుతున్నాను. అర్జునునితో ద్వంద్వయుద్ధం చేయగోరుతున్నాను. (15)
దుర్యోధన ఉవాచ
భుంక్ష్వ భోగాన్ మయా సార్ధం బంధూనాం ప్రియకృద్ భవ ।
దుర్హృదాం కురు సర్వేషాం మూర్ధ్ని పాదమరిందమ ॥ 16
దుర్యోధనుడిలా అన్నాడు. అరిందమా! నాతోపాటు భోగాల ననుభవించు. నీ బంధువుల అభీష్టాలు తీర్చు. సమస్తశత్రువుల శిరస్సులపై పాదాలు నిలుపు. (16)
వైశంపాయన్ ఉవాచ
తతః క్షిప్తమి వాత్మానం మత్వా పార్థోఽభ్యభాషత ।
కర్ణం భ్రాతృసమూహస్య మధ్యేఽచలమివ స్థితమ్ ॥ 17
వైశంపాయనుడిలా అన్నాడు. అప్పుడు కర్ణుడు తననే తిరస్కరిస్తున్నట్లు భావించి అర్జునుడు దుర్యోధనాది సోదరసమూహంలో నిశ్చలంగా నిలిచి ఉన్న కర్ణునితో ఇలా అన్నాడు. (17)
అర్జున ఉవాచ
అనాహుతోపసృష్టానామ్ అనాహుతోపజల్పినామ్ ।
యే లోకాస్తాన్ హతః కర్ణ మయా త్వం ప్రతిపత్స్యసే ॥ 18
అర్జునుడిలా అన్నాడు. కర్ణా! పిలువని పేరంటానికి వచ్చినవారూ, అడగకుండా మాటాడేవారూ ఏ లోకాలకు పోతారో ఆలోకాలకే నా చేత చచ్చి నీవు కూడా పోతావు. (18)
కర్ణ ఉవాచ
రంగోఽయం సర్వసామాన్యః కిమత్ర తవ ఫాల్గున ।
వీర్యశ్రేష్ఠాశ్చ రాజానః బలం ధర్మోఽనువర్తతే ॥ 19
కర్ణుడిలా అన్నాడు. అర్జునా! ఈ రంగస్థలం అందరికీ చెందినదీ కానీ ణి ఒక్కడిదే కాదు. బలపరాక్రమసంపన్నులయిన వారే రాజులు. ధర్మం కుడా బలాన్నే అనుసరిస్తుంది. (19)
కిం క్షేపైర్దుర్బలాయాసైః శరైః కథయ భారత ।
గురోః సమక్షం యావత్ తే హరామ్యద్య శిరః శరైః ॥ 20
భారతా! నిష్ఠురంగా మాటాడటం బలహీనుల మార్గం. శక్తి ఉంటే బాణాలతో మాటాడు. ఇప్పుడు గురువు సమక్షంలోనే నా బాణాలతో నీ తలను అపహరిస్తాను. (20)
వైశంపాయన ఉవాచ
తతో ద్రోణాభ్యనుజ్ఞాతః పార్థః పరపురంజయః ।
భ్రాతృభిస్త్వరయాఽఽశ్లిష్టః రణాయోపజగామ తమ్ ॥ 21
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ తరువాత శత్రుపుర విజేత అయిన అర్జునుడు ద్రోణుని ఆదేశంతో వెంటనే తన సోదరులతో కూడి యుద్ధానికై కర్ణుని సమీపించాడు. (21)
తతో దుర్యోధనేనాపి సభ్రాత్రా సమరోద్యతః ।
పరిష్వక్తః స్థితః కర్ణః ప్రగృహ్య సశరం ధనుః ॥ 22
అప్పుడు సోదరులతో సహా దుర్యోధనుడు కూడా ధనుస్సు చేతబట్టి యుద్ధసన్నద్ధుడై నిలిచిన కర్ణుని కౌగిలించుకొన్నాడు. (22)
తతః సవిద్యుత్ స్తనితైః సేంద్రాయుధపురోగమైః ।
ఆవృతం గగనం మేఘైః బలాకాపంక్తిహాసిభిః ॥ 23
అప్పుడు ఆడుకొంగల వరుసలను పరిహసించే మేఘాలు మెరుపులతో , ఉరుములతో, ఇంద్రధనుస్సుతో సహా గగన తలమంతా కప్పివేశాయి. (23)
తతః స్నేహాద్ధరిహయం దృష్ట్వా రంగావలోకినమ్ ।
భాస్కరోఽప్యనయన్నాశం సమీపోపగతాన్ ఘనాన్ ॥ 24
ఆ తరువాత అర్జునుని మీది ప్రేమతో రంగస్థలంవైపు చూపు సారించిన ఇంద్రుని చూచి సూర్యుడు కూడా తన దగ్గరగా వచ్చిన మేఘాలను నశింపజేశాడు. (24)
మేఘచ్ఛాయోపగూఢస్తు తతోఽదృశ్యత ఫాల్గునః ।
సూర్యాతపపరిక్షిప్తః కర్ణోఽపి సమదృశ్యత ॥ 25
అప్పుడు అర్జునుడు మేఘాల నీడలో దాగి కనిపించాడు. కర్ణుడు సూర్యుని కాంతిచే ప్రకాశిస్తూ కనిపించాడు. (25)
ధార్తరాష్ట్రా యతః కర్ణః తస్మిన్ దేశే వ్యవస్థితాః ।
భారద్వాజః కృపో భీష్మః యతః పార్థస్తతోఽభవన్ ॥ 26
కర్ణుడున్న వైపు ధృతరాష్ట్రుని కొడుకులంతా నిలిచారు. ద్రోణుడు, కృపుడు, భీష్ముడూ అర్జునుడున్న వైపు నిలిచారు. (26)
ద్విధా రంగః సమభవత్ స్త్రీణాం ద్వైధమజాయత ।
కుంతిభోజసుతా మోహం విజ్ఞాతార్థా జగామ హ ॥ 27
రంగస్థలంలోని ప్రేక్షకులు స్త్రీలతో సహా కర్ణార్జునుల వైపు మొగ్గుచూపుతూ రెండుగా చీలిపోయారు. కుంతి ఆ (ఇద్దరూ తన కుమారులే అన్న) వాస్తవాన్ని గుర్తించి మూర్ఛపోయింది. (27)
తాం తథా మోహమాపన్నాం విదురః సర్వధర్మవిత్ ।
కుంతీమాశ్వాసయామాస ప్రేష్యాభిశ్చందనోదకైః ॥ 28
అప్పుడు ఆ రీతిగా మోహానికి లోనైన కుంతిని సర్వధర్మవేత్త అయిన విదురుడు దాసీజనం ద్వారా చందనజలాన్ని చిలకరింపజేసి తెప్పరిల్లజేశాడు. (28)
తతః ప్రత్యాగతప్రాణా తావుభౌ పరిదంశితౌ ।
పుత్రౌ దృష్ట్వా సుసంభ్రాంతా నాన్వపద్యత కించన ॥ 29
స్పృహలోనికి వచ్చిన కుంతి కవచాలను ధరించి యుద్ధానికి సన్నద్ధులైన తన కుమారుల నిద్దరినీ చూచి కంగారుపడింది. కానీ వారిని వారించే ఉపాయమేమీ ఆంఎకు తోచలేదు. (29)
తావుద్యతమహాచాపౌ కృపః శారద్వతోఽబ్రవీత్ ।
ద్వంద్వయుద్ధసమాచారే కుశలః సర్వధర్మవిత్ ॥ 30
పెద్దపెద్ద ధనస్సులను ధరించిన ఆ ఇద్దరినీ చూచి ద్వంద్వయుద్ధనీతినెరిగినవాడూ, సర్వధర్మవేత్త అయిన శరద్వంతుని కొడుకు కృపుడు ఇలా అన్నాడు. (30)
అయం పృథాయాస్తనయః కనీయాన్ పాండునందనః ।
కౌరవో భవతా సార్ధం ద్వంద్వయుద్ధం కరిష్యతి ॥ 31
త్వమప్యేవం మహాబాహో మాతరం పితరం కులమ్ ।
కథయస్వ నరేంద్రాణాం యేషాం త్వం కులభూషణమ్ ॥ 32
(కర్ణా!) ఇతడు కుంతి చిన్నకొడుకు. పాండునందనుడు. కురువంశస్థుడు. నీతో ద్వంద్వయుద్ధం చేస్తాడు. మహాబాహూ! నీవు కూడా ఇలాగే నీ తల్లినీ, తండ్రినీ, కులాన్నీ ఈ రాజలోకానికి తెలియజేయి. నీవు ఏ వంశానికి భూషణమయ్యావు? (31,32)
తతో విదిత్వా పార్థస్త్వాం ప్రతియోత్స్యతి వా న వా ।
వృథాకులసమాచారై ర్న యుధ్యంతే నృపాత్మజాః ॥ 33
అది తెలిసిన తర్వాత అర్జునుడు నీతో యుద్ధం చేస్తాడో, లేదో నిర్ణయమవుతుంది. రాజకుమారులు కులం తక్కువ వారితోనూ, ఆచారంలో తక్కువయిన వారితోనూ యుద్ధం చేయరు. (33)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్య కర్ణస్య వ్రీడావనతమాననమ్ ।
బభౌ వర్షాంబువిక్లిన్నం పద్మమాగలితం యథా ॥ 34
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ మాటవిని కర్ణుని వదనం సిగ్గుతో వాలిపోయింది. వర్షపు నీటితో తడిసి వాలిపోయిన పద్మంలా కనిపించింది. (34)
దుర్యోధన ఉవాచ
ఆచార్య త్రివిధా యోనిః రాజ్ఞాం శాస్త్రవినిశ్చయే ।
సత్కులీనశ్చ శూరశ్చ యశ్చ సేనాం ప్రకర్షతి ॥ 35
దుర్యోధనుడిలా అన్నాడు. ఆచార్యా! శాస్త్రానుసారంగా రాజు అనటానికి మూడు కారణాలు ఉన్నాయి. ఉత్తమకులంలో పుట్టినవాడూ, శూరుడూ, సేనాధిపతి - ఈ ముగ్గురూ రాజులే. (35)
యద్యయం ఫాల్గునో యుద్ధే నారాజ్ఞా యోద్ధుమిచ్ఛతి ।
తస్మాదేషోఽంగవిషయే మయా రాజ్యేఽభిషిచ్యతే ॥ 36
ఈ అర్జునుడు రాజు కాని వానితో యుద్ధం చేయటానికి ఇష్టపడకపోతే ఇప్పుడే ఈ కర్ణుని అంగరాజ్యాధిపతిగా అభిషేకిస్తున్నాను. (36)
వైశంపాయన ఉవాచ
(తతో రాజానమామంత్య్ర గాంగేయం చ పితామహమ్ ।
అభిషేకస్య సంభారాన్ సమానీయ ద్విజాతిభిః ॥)
తతస్తస్మిన్ క్షణేకర్ణః సలాజకుసుమైర్ఘటైః ।
కాంచనైః కాంచనే పీఠే మంత్రవిద్భిర్మహారథః ॥ 37
అభిషిక్తోంగజరాజ్యే సః శ్రియా యుక్తో మహాబలః ।
(సమౌలిహారకేయూరైః సహస్తాభరణాంగదైః ।
రాజలింగైస్తథాన్యైశ్చ భూషితో భూషణైః శుభైః ॥)
సచ్ఛత్రవాలవ్యజనః జయశబ్దోత్తరేణ చ ॥ 38
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ తరువాత దుర్యోధనుడు ధృతరాష్ట్రునితోనూ, భీష్మునితోనూ సంప్రదించి బ్రాహ్మణుల ద్వారా పట్టాభిషేకానికి అవసరమైన సామగ్రిని తెప్పించాడు. ఆ క్షణంలోనే మహాబలుడూ, మహారథుడు అయిన కర్ణుని స్వర్ణసింహాసనంపై అధివసింపజేసి మంత్రవేత్తలయిన బ్రాహ్మణుల ద్వారా పేలాలు, పూలూ కలిపి స్వర్ణకలశాలతో నింపిన నీటితో అభిషిక్తుని చేశాడు. అప్పుడు కిరీటం, హారాలు, కేయురాలూ, కంకణాలూ, అంగదాలు-మొదలయిన సమస్తరాజోచిత చిహ్నాలను, శుభకరమైన ఆభరణాలను కర్ణునకు అలంకరింపజేశాడు. గొడుగును, వింజామరలనూ ఏర్పాటు చేశాడు. అవి ధరించిన కర్ణుని జయజయరావాలతో శోభిల్లజేశారు. (37,38)
(సభాజ్యమానో విప్రైశ్చ ప్రదత్త్వా హ్యమితం వసు ।)
ఉవాచ కౌరవం రాజన్ వచనం స వృషస్తదా ।
అస్య రాజ్యప్రదానస్య సదృశం కిం దదాని తే ॥ 39
ప్రబ్రూహి రాజశార్దూల కర్తా హ్యస్మి తథా నృప ।
అత్యంతం సఖ్యమిచ్ఛామీత్యాహ తం స సుయోధనః ॥ 40
రాజా! బ్రాహ్మణులచే ఆదరింపబడిన కర్ణుడు వారికి అంతులేని ధనాన్ని ఇచ్చి దుర్యోధనునితో ఇలా అన్నాడు. రాజశ్రేష్ఠుడా! నాకు రాజ్యప్రదానం చేశావు. దీనికి సాటిగా నేను నీకేమివ్వగలను? ఆదేశించు. చేయటానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు సుయోధనుడు "నీతో ఎడతెగని మైత్రిని కోరుతున్నాను" అని కర్ణునితో అన్నాడు. (39,40)
ఏవముక్తస్తతః కర్ణః తథేతి ప్రత్యువాచ తమ్ ।
హర్షాచ్చోబౌ సమాశ్లిష్య పరాం ముదమవాపతుః ॥ 41
దుర్యోధనుడు అలా అనగానే కర్ణుడు 'అలాగే' అని సమాధానమిచ్చాడు. సంతోషంగా ఒకరినొకరు కౌగిలించుకొని పరమానందాన్ని పొందారు. (41)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి కర్ణాభిషేకే పంచత్రింశదధిక శతతమోఽధ్యాయః ॥ 135 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున కర్ణాభిషేకమను నూట ముప్పది అయిదవ అధ్యాయము. (135)
(దాక్షిణాత్య అధికపాఠం 2 1/2 శ్లోకాలతో కలిపి మొత్తం 43 1/2 శ్లోకాలు)